ఏప్రిల్ 2018

ఇటాలియన్ ఆపెరా రచయిత ద పోన్తె (Da Ponte), సంగీత స్వరకర్త మొజార్ట్ (Mozart) కలయికలో వచ్చిన మూడు రూపకాలు — లె నోట్జె ది ఫిగారొ, దాన్ జియోవాన్ని, కొసీ ఫాన్ తుత్తె– 18వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా బహుళ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉన్నాయి. వీటిలో మూడవదైన కొసీ ఫాన్ తుత్తె (Così fan tutte) రెండు జంటల మధ్య జరిగిన కథ. తమ ప్రియురాళ్ళ ప్రేమకు ఇద్దరు యువకులు పెట్టిన పరీక్ష. ఒక హాస్య నాటికగా ఉద్దేశించబడిన ఈ ఆపెరా మొదట మొదట అంతగా ఆకట్టుకోకపోయినా రాను రాను మొజార్ట్ ముఖ్యమైన ఆపెరాలలో ఒకటిగా నిలిచింది. ఎన్నో ఆధునిక రూపాంతరాలలో కూడా ఇప్పటికీ ప్రదర్శించబడుతున్న ఈ ఆపెరా, అత్యంత ఉదాత్తమైన స్థాయినుంచి, అధమస్థాయి వరకు ప్రేమలోని ఎన్నో రంగులను స్పృశిస్తుంది. మానవ స్వభావంలోని చీకటి కోణాలనూ చూపెడుతుంది. ఈ ఆపెరాను ఒక యక్షగాన పద్ధతిలో ఇంతులందఱు నింతయే అనే సంగీత రూపకంగా అనుసృజించారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. ఇటువంటి ప్రయోగం తెలుగులో బహుశా ఇదే మొదటిసారి; తెలుగు భాషలో ఒక పదంతో క్రియకు ఉండే సంబంధాన్ని విభక్తి ఎలా సూచిస్తుందో, దానికి చిన్నయసూరి ప్రతిపాదించిన సూత్రం ఏమిటో, ఆ సూత్రం సూచిస్తున్న భాషా లక్షణం ఏమిటో, దానికి లొంగని ప్రయోగాలు ఏమిటో, వాటి వెనకనున్న కారణాలు ఏమిటో, జడ ద్వితీయకు ప్రథమ అనే వ్యాసంలో ఆసక్తితో వివరిస్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు; వీటితోబాటుగా ఆర్టిస్ట్ అన్వర్ ఇస్తున్న సిలబస్ పాఠాలు; పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న అలనాటి లలితగీతాలు; ఇంకా, కథలు, కవితలు, వ్యాసాలు…

గమనిక: ఎంతోమంది పాఠకులు అడుగుతున్నందువల్ల, శ్రీశ్రీ పదబంధ ప్రహేళికల సమాధానాలు ఇప్పటిదాకా ప్రచురించిన గడులకు ఆయా గడుల ఆధారాల కిందన జతచేశాం. ఇకనుంచీ ప్రచురించబోయే గడులకూ ఈ సదుపాయం కలగచేస్తాం.

ఈ సంచికలో

  • కథలు: బువ్వమ్మవ్వ – పి. విక్టర్ విజయ్ కుమార్; అద్దెకిచ్చి చూడు – కృష్ణ వేణి; అది నాది – కన్నెగంటి చంద్ర; ఇదిగిదిగిదిగో నేను – అన్వర్; పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); అందం – పూడూరి రాజిరెడ్డి (స్వగతం).
  • కవితలు: జ్వరగీతం – బండ్లమూడి స్వాతికుమారి; కొన్నిసార్లిలా… – విజయ్ కోగంటి; ఆత్మావై పుత్రనామాసి – ఆర్. శర్మ దంతుర్తి; మంచు – సాంఘిక; ఇంతులందఱు నింతయే – తిరుమల కృష్ణదేశికాచార్యులు (యక్షగానం).
  • వ్యాసాలు: జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM – భైరవభట్ల కామేశ్వరరావు; విమర్శ: ప్రచురణకు ముందు, తర్వాత – మద్దిపాటి కృష్ణారావు; స్మృతిలో – దాసరి అమరేంద్ర.
  • శీర్షికలు: సిలబస్ 3: ఊహ అనే ఇమాజినేషన్ – అన్వర్; నాకు నచ్చిన పద్యం: కవితాపానశాల మద్యం – చీమలమర్రి బృందావనరావు; గడి-నుడి 18 – కొల్లూరు కోటేశ్వరరావు. లలితగీతాలు (శబ్దతరంగాలు) – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.