బువ్వమ్మవ్వ

నన్నీతమట్టలెక్క బర్ర బర్ర లాక్కపోతా ఉంది మాదేవి.

యప్పో! ఏందిరా ఈయమ్మకి ఇంత బలమెట్లొచ్చే అని నేను యాసిరికి పడ్తి. “రా ఇజ్జి, సిన్మా చాల్వైంటాది… రా” అని మల్ల ఈతమట్ట లాగినట్ల లాగె. “మాదేవి! ఇంగా మాటలు పడ్తాయుంటాయ్లే! నాకి గసొస్తావుంది” అంటే గూడ ఇనకుండా లాక్క పాయ. సిన్మాలో అందరూ నాలెక్క పిల్లలే ఉండారు. ఏందబ్బ ఈళ్ళందర్కి మీసాలు ఇట్ల మొల్చినాయ్ అనుకుంటి. ఇంట్రబెల్లో యాభై పైసలు పెట్టి మాదేవి వగ్గాణి కొనిచ్చే. ఏమప్పో ఈయమ్మకేమయ్య ఇయ్యాల ఐదు పైసలు పెట్టదు గాని యాభై పైసలు పెట్టె అనుకుంటి. ఇంగ లాస్టుల ఎన్టీఆర్ సచ్చిపోతా ఉండాడు. నేను లబ్బొ లబ్బొ అని మొత్తుకుంటా ఉంటి ఈయమ్మతో – వద్దు మాదేవి ఎన్టీఆర్ సచ్చిపోతే నేను దట్కోలెను – అని. ఇంగేం చేయల్ల ఓ అని ఏడ్సపడ్తి. ఎన్టీఆర్ ఏమో సచ్చిపోయేతట్ల ఉండాడు. నాకి కండ్లల్లో ఒగటె నీల్లు. కింద గొట్టుకుని గొట్టుకుని ఏడ్సపడ్తి.

అమ్మ “ఒరేయ్ ఇజ్జి లెయ్రా స్కూల్ బోవల్ల” అని లేప్తే, అప్పుడు హమ్మయ్య ఎన్టీఆర్ సచ్చిపోల్యదులే అని లేసి రప్ప రప్ప స్కూలుకి రెడీ ఐ ఉర్కితి.

స్కూల్లో గ్రేసమ్మ టీచర్ క్వార్టర్లీ పేపర్లిచ్చ. నాకు ఫస్ట్, మాదేవికి సెకండ్ వచ్చ. నన్ని మాదేవిని నిలబెట్టిచ్చి అందర్తో చప్పట్లు కొట్టిచ్చ.

ఇంటర్బెల్ కొడ్తే స్కూల్ల నుండి పిల్లలు చీమలురికినట్ల ఉర్కిరి గ్రౌండులోకి. కొంత మంది ఒంటికి పోనీకి కొంత మంది డివెండల్ ఆడుకోనీకి పోయ్రి.

నేను మాదేవి ఇద్దరం గల్సి బువ్వమ్మవ్వ దగ్గర్కి పోతిమి. చల్ల కాలం కదా, స్కూల్ గోడ నీడ బలే సల్లగుంటది. గోడానాంకుని బువ్వమ్మవ్వ సిన్న చక్క పెట్టెలో వక్కో అరలో బటానీలు, రేక్కాయిలు, బుడ్డలు, పత్తి పండ్లు పెట్టుకుని అమ్ముకుంటా ఉంటాది. బువ్వమ్మవ్వ ఏం వయ్సో తెల్దు గాని బాగ ముసిలిగుంటది. నేనైదు పైసలు పెట్టి రేక్కాయలు కొనుక్కుంటి. మాదేవి బుడ్డలు కొనుక్కునె.

మాయమ్మ అదే స్కూల్లోనే టీచర్గా చేస్తాది. పతి రోజు పొద్దున ఐదు పైసలిస్తాది. మా నాయ్న ఎప్పుడన్న స్కూలికి మాయమ్మతో ఏందన్న మాట్లాన్నీకి వచ్చినప్డు నేను ఉరుక్కుంటా పోయి మా నాయ్న చెయి పట్టుకుని గుండ్రంగా తిర్గుతా. అప్పుడైతే మా నాయ్న నాకి పది పైసలిస్తాడు. ల్యాపోతే రోజు ఐదు పైస్లొస్తాయ్ నాకి.

మా స్కూలు పిల్లలందరం బువ్వమ్మవ్వ తావే కొనుక్కుంటం. బువ్వమ్మవ్వకి ఇంట్రబెల్లో ఫుల్లు గిరాకీ.

బువ్వమ్మవ్వోల్లు దూదేకులోల్లు. బువ్వమ్మవ్వ తాత మా ఊర్ల అందరికి దిండ్లు బెడ్లు చేసిపెడ్తడు. అదేందో బుజానికేసుకుని ఊరంతా తిర్గతా ఉంటడు. ఇంక వరండాలో దూది కుప్పేసుకుని, బెడ్లు, దిండ్లు కుడ్తా ఉంటాడు.

నేను రేక్కాయలు కొనుక్కుంటా బువ్వమ్మవ్వని అడిగితి “బువ్వమ్మవ్వా! అమ్మ బెడ్డు కుట్టిచ్చాలంటా వుంది. తాతను పిల్సు. అమ్మకి చెప్తా” అంటి.

“యప్పో! ఎంత పెద్దోనివైపోతివప్పా విజ్జప్పా నీవు” అని దిష్టి తీసినట్ల మెటికలిరిసె.

“ఔ బువ్వమ్మ నిజంగా” అంటి తల మీద చెయ్ పెట్టుకుని.

“సర్లెప్ప… మీ తాతకి చెప్తా” అనె.

“బువ్వమ్మవ్వ, నీకి గిరాకి ఇచ్చినందికి, నాకి పావల రేక్కాయలియ్యాల సూడి” అంటి.

బువ్వమ్మవ్వ పక్క పక్క నవ్య. బెల్లు కొట్టేసర్కి ఇంగ మాదేవి నన్ని ఈతమట్ట లాక్కపోయినట్ట లాక్కపాయ.

స్కూలిడ్సినంక మాయమ్మ కొంగు పట్టుకుని ఇంటికి పోతా ఉంటి. సంత మార్కెట్ దగ్గర గుర్తుకొచ్చి చెప్తి “అమ్మ! బువ్వమ్మవ్వకి చెప్తిని మనకి బెడ్డు కావల్ల. బువ్వమ్మవ్వ తాతని పిల్సమని.”

“అట్లనా” అని అమ్మ అన్య గాని ఏం అడగల్య.

మల్ల రేపైనంక బువ్వమ్మవ్వని అడిగితి “బువ్వమ్మవ్వ తాతని ఇంటికెప్పుడూ పంపుతావ్” అని.

“ల్య… ఇజ్జి. మీ తాత ఆదోని పోయినాడు. వచ్చినంక చెప్తాలె” అని అన్య.

అట్ల వారం రోజులడిగితే ఆరం రోజులట్లనె చెప్పె బువ్వమ్మవ్వ. ఇదేందప్ప బువ్వమ్మవ్వ తాత ఇన్రోజులు ఆదోని పొయ్నాడు అనుకుంటి. కొంచెం యాసిరికి గూడ వచ్చె.

స్కూల్ నుండి ఇంటికి పోతా అమ్మకి చెప్తి “అమ్మ! బువ్వమ్మవ్వ తాత ఆదోని పొయ్నాడంట. వచ్చినంక పంపుతాదంట. మరేందో వారం నుండి అట్లనే చెప్తా ఉంది” అంటి.

“వద్దురా… ఇంగడగొద్దు బువ్వమ్మవ్వని” అన్య అమ్మ.

“ఎందుకమ్మ?”

మాయమ్మ అప్పుడు చెప్పె “నాయ్నా బువ్వమ్మవ్వ తాత సచ్చిపోయి ఆర్నెల్లు అయ్యిందిరా. అందర్కి తాత ఇప్పుడె సంతకు పోయ్నాడని, ఆదోని పొయ్నాడని చెప్తా ఉంటాది… ఇంగొద్దు అడగొద్దులె” అనె.

నాకి తిక్క లేసినట్లయ్య. “ఎందుకమ్మ బువ్వమ్మవ్వ అట్ల సెప్తాది అందర్కి మల్ల బువ్వమ్మవ్వకి తిక్క పట్టింద్యా… మల్ల తిక్క పడ్తె, పొర్క తీస్కొని బండకు కొడ్తా ఉండల్ల కదా” అని అడిగితి. మా గేరిలో ఒకాయమ్మకు తిక్క పట్టినప్డట్లనే పొర్క తీస్కొని గొణుక్కుంట బండని ఊర్కె కొడ్తా ఉండె.

అప్పుడు మాయమ్మ ఏం జెప్పెనంటే “నాయ్నా… నీకి ఎన్టీఆర్ సినిమాలో సచ్చిపోతే ఇష్టమా? లేదు గదా? అట్లనే. తాత సచ్చిపోయినాడు అని అనుకుంటే ఆమెకిష్టం ల్యా. అట్లనే చెప్పుకుంట బత్కుతాది… అంతే! చిన్నపిల్లోడివి నీవు. నీకు తెల్యదులె” అనె.

నాకి కంపం బట్టినట్ల ఆయ ఏందప్ప బువ్వమ్మవ్వకిట్ల అయ్యెనా అని. అయ్యో బువ్వమ్మవ్వ కింత కష్టమొచ్చె కదప్పా అని లోపల్లోపలే చానా బాద అయ్య.

మల్ల రేపు అయినాక స్కూలికి బోయే ముందు మా నాయ్న బుజం చెట్టెక్కినట్ల ఎక్కి జేబులో చెయ్ బెట్టి అర్ద్రుపాయ తీసుకుంటి. మానాయ్న “నాయ్న అన్నోటు డబ్బుల్తో ఏం కొంటావ్రా” అని నవ్వుతా ఉండె.

స్కూలికి పోయ్ ఇంట్రబెల్ టైం లో బువ్వమ్మవ్వ దగ్గర్కి పోతి.

“బువ్వమ్మవ్వ ! ఇద… నాకి అర్ద్రుపాయ రేక్కాయలియ్యి” అంటి.

ఎందుకంటే ఆ రోజు స్కూల్లో పెద్ద గిరాకీ నాదే కావల్ల!