కాగితాన్ని ముందు పరచుకుని కుంచెని అలా వ్రేళ్ళకు ఆనించుకుని చిన్న చిరునవ్వు బుగ్గకు తొడిగి అలా దాన్ని తడుతూ కూచుని ఊహకు రెక్కలు కడితే, అది రెపరెపలాడుకుంటూ అలా ఎగుర్తో ఎగుర్తో గోరింట కొమ్మనడిగి ఎరుపుని, పసిరిక బయలుపైనుండి పచ్చదనాన్ని, ఆకాశం నుండి కత్తిరించి తెచ్చిన నీలి వెల్వెట్‌ని, ఇంకా గాలి పాటల్ని, గోరొంక ముక్కు మెరుపు ముక్కెరని, అందమైన అమ్మాయిల ఘల్లుఘల్లు గజ్జెల చప్పుడుని తెచ్చి నిదురిస్తున్న నా కలల తోటలోకి ఒక కమ్మని కల తెస్తుంది. ఇంకా అది అలా ఆకు రాలిన అడవిలోకి నడిచి నడిచి వెళ్ళి ఆమని తెచ్చానని చేతిలో పెడుతుంది, కొమ్మల్లో నిదురించిన కుసుమ సమూహాల పరిమళ నిశ్వాసాల్ని నిశ్శబ్దంగా దొంగిలించి తెచ్చా నీకోసమే అని ముసిగా నవ్వుతుంది. ఆ నీరజాక్షి బొమ్మకోసం పూర్ణ సముద్రపు ఎగిసిన అల నిండైన వక్షాన్ని అలా పైనుంచే కాజేసి తెచ్చానని గుప్పెటలో పరిచి కొంటెగా గిల్లుతుంది. మరి కనులేవీ? అంటే ఇదిగో ఇంద్రనీలాల గనులు అని జేబులో పెడుతుంది. బొమ్మలు వేయడం ఒక మహత్తరానందం. బొమ్మలు వేయడం వాన నీటి పాయల్లో కాగితపు పడవ వెంట పోయే నలుపు తెలుపు వెలుగు నీడల మిలమిల మెరుపు. బొమ్మలు వేయడం అంటే పూలచాపపై పవ్వళించడం. బొమ్మలు వేయడం అంటే పిల్ల చినుకులు వంటిపై గిలిగింతలు పెట్టడం. బొమ్మలు వేయడం అంటే కాగితంపై ఒకేసారి సూర్యచంద్రులని, ఇంద్రచాపాన్ని విత్ దిస్ ఓన్ హేండ్స్‌తో పొదగడం. బొమ్మలు వేయడం అంటే ప్రకృతి ప్యాలెట్‌ని కుంచెతో అద్దుకుంటూ జింక కొమ్మలపై స్వారీ చెయ్యడం… … … ఇంకా అలా అలా అలా అలా కదా అనుకుంటున్నారా? లేత వెదురు బొంగేం కాదూ! పొద్దున్నే పెరుగులో జిలేబీ తినే జాతిగాళ్ళు మాత్రమే అబ్బా! ఆహా! అని ఇటువంటి డయాబెటిక్ కలలు కంటారు. నిజానికి బొమ్మ వేయడం ఒక చావు, నిత్య హింస, పాపపు కడుపు ఆడే థిక్ అండ్ థిన్ సాము. పెన్సిల్ పట్టిన ఇంక్ దిద్దిన వ్రేళ్ళతోపాటు జీవితం కాగితంలా మాసిపోవడం.
థింక్ థింక్ థింక్ దెన్ డ్రా అన్నాడు ఒక గొప్ప చిత్రకారుడు. పేరు దూసాన్ పెట్రీచిచ్ (Dušan Petričić). మరీ అంత కాకపోయినా ప్రతి బొమ్మకు ముందు ఇలా థింక్ థింక్ జరుగుతూనే ఉంటుంది. ఈట్ విత్ థింక్, వాక్ విత్ థింక్, స్లీప్ విత్ థింక్, డ్రయివ్ విత్ థింక్… అన్నిటికన్నా ఈ చివరిది మరీ డేంజర్. ఒక కథో కవితో చేతికి వస్తుంది. దానికి బొమ్మ కట్టాలి. ఒక ఆలోచన కావాలి. ఇది అది అనుకున్న తరువాత ఎట్లా గీయడం? పెన్నా? బ్రష్షా? బొగ్గా? గీతల తరువాత అద్దాల్సిన రంగు? ఒక శాపం తగిలిన వాడి జీవితంలోని చివరి సీతాకోకచిలుక వాడినుంచి దూరంగా ఎగిరివెళ్ళే సమయంలో దాని రెక్క చివరి నీలం ఇతగాడి సూదిముక్కు చివరపై మెరుపు చిందాల్సిన రంగు ఏ మేరకు అద్దాలి… అని ఆలోచిస్తూ నేను చటుక్కున ఏ కారు క్రిందో, లారీ క్రిందో దూరబోయే సందర్భాల్ని తప్పించుకుంటూ ఉంటాను. ఇది డ్రయివ్ విత్ థింక్. అలవాటైన సాము నాకిది. ప్రతి రోజూ డ్రైవింగ్‌లో ‘నేనూ బొమ్మా కలిసి నువ్వా? నేనా? అని’ అనే ఓ లెక్క తేల్చేసుకుంటుంటాం. ఇదంతా ఊహ తాలుకు గీయవలసిన ఒక నిత్య చావు.
మామూలుగా బొమ్మలకోసం గీతలు, వాటిపై రంగులు రోజూ సాధన చేసినట్లుగానే ఒక గమనికని కూడా సాధన చేస్తూ ఉండాలి. చూడ్డానికి మామూలు చూపులే కానీ ఒక తేడా వచ్చేస్తుంది మన చూపులో. రోజువారీలో మామూలుగా కనబడే మామూలు విషయాలు అనేకం కొత్తకొత్త ఐడియాలు ఇవ్వడానికి సిద్దమవుతాయి. అయితే దీనికి కూడా ముందు చెప్పినట్లు అదోరకం సాధన కావాలి. మనముందున్న బోల్డంతమంది చిత్రకారులు వారి వారి తరహాలో ఎలా రచనల్ని చదువుతున్నారు, చదివినదాన్ని కళ్ళు చిన్నవిగా చేసుకుని తీక్షణంగా చూస్తూ ఖాళీ కాగితంపై పెన్సిల్ ములుకుతో ఊహని అద్దుకుంటూ ఊహకి నిజంగా ఎలా రెక్కలు కట్టి ఎగురవేశారో చూసి, ఒకవేళ అది అబ్బురంగా చేసిన పని అయితే దానికి అంతే అబ్బురంగా నమస్కరించుకోవాలి. డుమువులు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి ద్వితీయా విభక్తి… వ్యాకరణమ్ అనేది ‘అ ఆ ఇ ఈ’ లోనే కాకుండా పొడుగు పొట్టి అడ్డదిడ్డ గీతల్లో, ఆ పై అవి కూర్చే బొమ్మల్లో, వాటిని కుదిర్చే ఊహల్లో వుండే వుంటుంది. చిత్రకారులకే అలివిగాని చిత్రకారుడు రాబర్ట్ ఫాసెట్ (Robert Fawcett), ‘నాన్సెన్స్’ అంటూ ఇలా అంటాడు: “బార్న్ ఇంజనీర్, బార్న్ డాక్టర్, బార్న్ సైంటిస్ట్ అని ఎలా కుదరదో, బార్న్ ఆర్టిస్ట్ అనేవాడు అలాగే కుదరడు. అఫ్‌కోర్స్, పుట్టుకతో నీకు చిన్న విశేషం ఏదో తగులుకుని వుండవచ్చు. అది మాత్రమే సరిపోదు. వేళ్ళు పెన్సిళ్ళు అరిగేదాకా బుర్ర పదును తీరేదాక మోటరు నడుస్తూనే వుండాలి. ఆ పరిగెత్తడంలో ఏదో ఒకరోజు నువ్వు సిసలైన చిత్రకారుడివి అవుతావు అనేది నీతి.””
కాబట్టి చిత్రకళ అనేది కేవలం సాధన చేయడం అనేదాని వల్లనే అని ఊరుకోక, గురువుల వంటి చిత్రకారుల పనితనం చూడాలి, గమనించుకోవాలి, మదిన నింపుకోవాలి. ఉదాహరణకు ప్రపంచంలో చాలామంది వేసిన సముద్రపు అలల బొమ్మల వెనుక, గ్రాఫిక్ డిజైన్ వెనుక ఆనిమేషన్ సినిమాల్లో ఎగిసిన ఆ నీటి నురుగు వెనుక హోకుసాయ్ అనే ఒక మహా గురువు చిత్రించిన గొప్ప ‘కనగవ అనే ఒక అల బొమ్మ వుంది. అదొక్క అల శతాబ్దాల తరబడి మరో అల చిత్రకళా రంగంలో ఎగసనివ్వకుండా గొప్ప ప్రేరణయై నిలిచింది. ఈ విధంగా గొప్పవారి పని గమనిస్తూ ఆ పై చిత్రకళా పుస్తకాలు చూపించిన తోడన్, తోన్ తోడ కూడనే కాకుండా వీలయినంత మంచి రచనలు చదువుకుంటూ తృతీయా విభక్తి కూడా తెలుసుకోవాలి. ఇంకా మన ఊహలకు బలం రావాలంటే గొప్ప గొప్ప రచనలను చదవాలి. ఆ చదువు ఏం చేస్తుందంటే, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా గొప్ప ఊహాశక్తిని మన మనసుకు ఊదుతుంది. ఆ ఊహల్లో తళతళలాడే తెల్లని ఎండ కనపడుతుంది, తల్లిలాంటి చల్లని మబ్బు తోస్తుంది, పూచిన లేమామిడి మొక్క వెనుకనుంచి ఎండలో పల్లె పిల్ల బరువు నడక కనబడుతుంది. ఇంకా ఆ పై సరస్సులో స్నానమాడిన ఒక తామరపువ్వును చూసి మూర్ఛపోయి, చంద్రుడు అందులో పడి కరిగిపోయిన దృశ్యం కలగంటాం. ఆ కలలో, ఆ మత్తులో ‘సరస్సు రాత్రంతా నక్షత్రాల కలలు కంటూ ఉండిపోయిన…’ అనే అద్భుతమైన కవిత్వం ఒక భావనగా బొమ్మగా మనసునిండా నిండిపోయి చెత్త కవిత్వాన్ని కూడా ప్రేమించి మంచి బొమ్మలు వేసేలా మన ఊహల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
బొమ్మ వేయాల్సిన రచన చేతికి అందుతుంది. బొమ్మ వేయడం అంటే అమీ తుమీ తేల్చేసుకోవాల్సిన విషయం అన్నమాట. నిజానికి అమీ తుమీ అంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా నా బొమ్మే బావుండాలి అనేదే లెఖ్ఖ. చాలా తక్కువసార్లు మాత్రమే రచన బావుంటుంది. విజువల్లీ వెర్బల్లీ అని చెప్పాలి బొమ్మల భాష్యాన్ని. రచనలో ఉన్నది ఉన్నట్టు వేయడం ఒక పద్దతి. ఒక పిల్లకు తీవ్రంగా జబ్బుచేస్తుంది. వైద్యం చేస్తే బ్రతుకుతుంది కానీ డాక్టర్‌గారు డబ్బు మొత్తం చేతిలో పెడితే తప్ప పిల్లను ముట్టుకోనంటున్నాడే! ఒక చిన్న సీన్. తండ్రి చేతుల్లో మెలికలు తిరుగుతున్న చిన్నతల్లి, గెటవుట్ అని బయటికి చేయి చూపిస్తూ డాక్టర్. అంతే బొమ్మ. డ్రాయింగ్, కాంపోజిషన్, లైన్ చాలు బొమ్మ పడిపోతుంది. అలా కాదు. ఇంకా ఏదో చెప్పాలి. కాస్త బిగ్గరగా ‘ఇది ఇలా కాదు’ అనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ మందుల చీటి మీద, సైన్ బోర్డ్ మీద ప్లస్ మార్క్ ఉంటుందిగా. దాన్ని కొద్దిగా మెజర్మెంట్ అటూ ఇటూ చేస్తే ప్రభువు ఎక్కిన సిలువలా అవుతుంది. ఆ సిలువపై ఈ అమ్మాయీ ఎక్కించబడుతుంది. దేవుడువంటి డాక్టర్ దయ్యంలా నోటికిరుపక్కల చిన్నచిన్న కోరలతో బ్లడ్ సక్కర్లా. వాడి మెడలోని స్టెతస్కోప్ పొడుగ్గా సాగి పాములా మారి ఆ పిల్లని మింగుతుంటుంది. ఇది ఇంకొంచెం అడ్వాన్స్‌గా ఊహించడం.
బొమ్మలకోసం ఇమాజినేషన్ అని నేను నాకై నా కొరకు వ్రాసుకున్న గ్రామర్ ఒకటుంది. నా ఉద్దేశంలో బొమ్మ చూడగానే పాఠకుడు కథ అల్లేయరాదు. రచయిత కష్టపడి వ్రాసిన విషయాన్ని అంతటిని దుర్మార్గంగా బయటపెట్టేయరాదు. బొమ్మ చూడగానే పాఠకుడు ‘అరే! ఇందులో ఏదో వుంది. అదేదో భలేగా ఉన్నట్టు ఉందే! దాన్ని చదివి తెలుసుకోవాలి…’ అని అక్షరాల వెంట నడిపించే ప్రయత్నం నా బొమ్మ చేయాలి అనుకుంటా. ఇక్కడ ఈ బొమ్మలో ఈ అమ్మాయేంటి? ఆ పై రక్తం కక్కుతున్న పిల్లి ఎందుకు? కాళ్ళ క్రింద కళ్ళు మూసుకు పడివున్నవాడు మరి ఉన్నట్టా? లేకపోయినట్టా? మధ్యలో ఆ చిత్రకారుడి ఆరాధన ఏమిటీ? వంట రుచి సరే! ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. అది కాదు ముఖ్యం. వంట తాలూకు వాసన అత్యంత ప్రధానం అన్నట్టు. నేను వ్రాసుకున్న గ్రామరూ అదే. నువ్వు వ్రాసిన కథ కాదు, నేను వేసిన బొమ్మతో పాఠకుణ్ణి గేలమేస్తా అని.
ఈ కథకు వేసిన బొమ్మ చూడండి. ఇందులో పాడెతో సహా మొత్తం బొమ్మ, మొత్తం జనాలు రంగుల్లో వుంది చూడండి, ఒక్క మధ్యలో వున్న టోపీ పెట్టుకున్న సాయబుల కుర్రవాడిని తప్పనిస్తే. కథలో ప్రకారం చనిపోయినవాడు ఈ ముసల్మాను పిల్లవాడి ప్రాణ నేస్తుడు. అయినా చనిపొయినవాడి మతం ఆచార వ్యవహారాల ప్రకారం అన్య మతస్తులు వాడి శవాన్ని మ్రోయరాదుట. అందుకే ఆ రోజు ఆ సాయబుల కుర్రవాడి జీవితంలో రంగు లేదు, ఖాళీ అయిపోయాడు. వొట్టి కాగితంలా తెలుపు దిగేసి జనం మధ్యలో నడుస్తున్నాడు. ఇక్కడ సీన్ అంతా ఉంది, ఐడియా ఉంది. విషాదం కూడా నేను చెప్పకపోతే ఇది ఎవరికీ తెలిసే అవకాశం, ఆలోచించే ఆ మాత్రం బుర్ర వుండే అవకాశం కూడా లేదు. ఈ కథకు బొమ్మ అనంతర కొంతకాలం తరువాత ఒక సినిమా చూశా, బెంగాలి సినిమా. పేరు ‘గాండూ’. తీసినవాడు కౌశిక్ ముఖర్జీ. టైటిల్ రోల్ అనుబ్రత బసు నటించాడు. సినిమా అంతా అల్లకల్లోలంగా వుంటాడు వీడు. స్తిమితం లేదు, శాంతి లేదు. ఆరాటం, పరుగు, పోరాటం… సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్. మధ్యలో కాసేపు ఫిల్మ్ రంగుల్లోకి మారుతుంది. అది ఒక మేకింగ్ ఆఫ్ లవ్ సన్నివేశం. ఈ గాండు జీవితంలో వాడికి రంగులు కనిపించింది ఆ కాసేపు సంభోగంలో అన్నమాట. నాకు, కౌశిక్‌కు పరిచయం ఏమీ లేదు కానీ ఆలోచనలు కలవడం, కదిలే బొమ్మ కదలని బొమ్మ దగ్గర కలవడం బావుంది.
ఈ కథలో బండి ముందు కూచున్నవాడు డ్రయివ్ చేస్తున్నవాడి గమ్యం అర్జంట్‌గా ఆ అడవుల్లో కొండల్లో ఉన్న ఒక నిర్భాగ్యురాలితో పడుకోవాలి. అది ఆ రోజు వాడి గమ్యం. అది ఆవిడకు ఇష్టమా కాదా అనేది కాదు సమస్య. వీడికి అర్జంట్. ఆవిడక్కూడ ఇష్టమే అయితే అలా అడ్డంగా తల వాల్చుకుని ఎందుకుంటుంది? వేస్తే ఇలానే వేయాలి అనుకున్నా. ఇక మరోలా అంటే ఈ ఇద్దరి ప్రయాణం. లేదా ఆ అమ్మాయితో సరసాలాడుతూ ఈ మగాడు.
ఇది ఇంకో కథకు వేసిన బొమ్మ. మామూలుగానే రచయితకు అర్థంకాలా బొమ్మ. అడగటానికి అహం అడ్డు వచ్చింది అతగాడికి. అప్పుడు రచయిత బొమ్మని పోస్ట్‌మార్టమ్ చేసి వట్టి కారుని వాడుకున్నాడు, నేను పడ్డ శ్రమ మొత్తాన్ని ఒక వెక్కిరింతలా నా మొహం మీదే ఊసేసి. నాకు ఈ మొత్తం కథ గుర్తు లేదు కానీ కథలో జనం ఆకలితో ఉన్నారు. మామూలు ఆకలి కాదు చచ్చిపోయే ఆకలి. కారు చక్కర్లు కొడుతోనే ఉంది. రెస్టారెంట్ పేర్లు కడుపులో పేగులు కారు చక్రంలా తిరిగేస్తున్నాయ్.
ఎచ్‌సియు స్టూడెంట్ రోహిత్ ఆత్మహత్య మీద ఒక కథ వచ్చింది. నాకు చాలా విషయాలు అర్థంచేసుకునే పెద్ద తెలివితేటలు లేవు. కొన్ని చర్యల పట్ల ఒక నిరసన ఇది. ఈ మనిషి వెధవల లోకం ఇక బాగు పడదనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత బయటో లోపలో ఒక చావు అవసరం అవుతుంది. అది ఒక నిశ్శబ్ద నిరసన. పెద్ద పెడబొబ్బ వేయనక్కరలేదు. వేసినా ఏం ప్రయోజనం లేదు. ఆత్మహత్యలు అవమానాలు దుర్మార్గం– ఏదీ కొత్త కాదు. తలవంచుకుని వెళ్ళబోయేముందు ఒక జాలి చూపు చాలు. ‘నే వెళ్ళిపోతున్నా. మీరింకా ఇక్కడ బ్రతికి చాలా కాలం చావాలి కదరా’ అని జాలి. అంతే. దీంతో ఏది ముగిసింది ఏది మొదలయ్యింది కాదు. ఇక్కడ ఆ రెండు చేతులు మైఖెలాంజిలో ది క్రియేషన్ నుండి నన్ను హంట్ చేస్తున్నవి. అవి కలిసిన ప్రతిసారి రోహిత్‌లు పుట్టుకువస్తూనే ఉంటారు; ఒక నిరసనతో ఛీత్కారంతో మళ్ళీ మళ్ళీ తలవంచుకుని వెళ్ళిపోతూనే ఉంటారు.
ఇది ఒక కవి కథ. కవిత్వాన్ని వెదుక్కుంటూ కవిగా బ్రతికిపోదామనుకుని బయలుదేరిన ప్రయాణంలో ఒక ప్రమాదం. కుడి చేతిలోని తూలిక వాడి విద్యకు రాలిపడుతున్న స్వప్నానికి ప్రతీక. తలనుంచి చివరి తలపోతలు. కాలు జారింది. లోయలో కూలుతున్న బస్సు. ఒకవేళ ఇలా వేయకపోతే బస్సు కిటికీ లోంచి గడ్డం క్రిందుగా చేయి ఆనించి చూస్తున్న ఒక మొహం వేయాలి. అప్పుడు ఆ కథ నీ మొహంలా, బొమ్మ కూడా నీ మొహంలానే ఉంటుంది!
‘ఈ కథ ఎవరిది?’ అనే బొమ్మలో కథ అంతా ఉత్తమ పురుషలో సాగుతుంది. కథ చెబుతున్నవాడు చేతులు ఊపుతూ కథ చెబుతాడు కదా. మిగతా చమత్కారం అంతా వాడి చిటికెన వేలుకు వేలాడుతున్న ఉరి వేసిన మనిషి. ఈ బొమ్మలోది మహా గొప్ప ఊహేమీ కాదు కానీ బొమ్మ చూస్తే కనీసం కథ పట్ల ఒక ఆసక్తి పుట్టుకుతెచ్చే ఒక ప్రయత్నం.
‘అడగని వరం’ కథలో భర్త ఆ ఎర్రచీర అమ్మాయిని వదిలి వెల్లిపోయాడు. పసుపు కుంకుమ మినహా ఇతగాడితో ఆవిడకు అంతకు మించి ప్రయోజనం కూడా లేదు. కానీ లోకులు ఊర్కోరుగా, కాకులుగా పొడుస్తూ ఉంటారు. లోకులు, వారిలోని కాకితనం. కథ టైటిల్లో పసుపు కుంకుమ. ఇదంతా ఊహ అల్లిన అల్లికే.
షాపింగ్ అనేది విషయం. ప్రలోభాలు కోరికలు ఎలా మనుషుల్ని దాటిపోయి తమపై చూపు తిప్పుకోనివ్వకుండా ఎలా చుట్టుముడతాయో చూపించడం ఇలా. ఇక్కడ చూపించిందల్లా ఒక బొమ్మని పరిమాణం పెంచి మరో బొమ్మ పరిమాణం తగ్గించడం. బొమ్మలోని రెండు విషయాలు మామూలుగా ఒకే సైజ్‌లో ఉంటే చెప్పాల్సింది ఏం ఉండేది కాదు. గొప్ప ఆలోచన కాకపోవచ్చు. కానీ అలా ఆలోచించాలి కదా?
ముగ్గురు సెక్స్ వర్కర్లు. మార్కెట్ దృష్టిలో ఏదైనా మాంసమే. నక్షత్రాల వెలుగులోని ఆడమాంసం అమ్మకానికి సిద్దం ఈ బొమ్మ.
ఈ గాడిదల బొమ్మ ఇలా ఎందుకుందో నిజంగా నాకు గుర్తుకులేదు కానీ ఆ గాడిదల మీద అంకెలు చూస్తుంటే కథ చదవాలని ఆసక్తి పుట్టదా? దాన్నే మసాలా అంటారు.
చిత్రకల అనే కథకు వేసిన బొమ్మ. నలుపు తెలుపుల భావుకత. ఇలలో కలలో అనునిత్యం భావుకతలో ఉండే ఒక రచయిత పాత్రగా మారి చెప్పుకునే కథ. ఆ డ్రాయింగ్ ఫామ్, వెనుక అల్లుకున్న అల్లిక. వ్రాసేవాడిది పేరు, గీసే వాడిది చావు అనేదానికి చక్కని ఉదాహరణ.
ఊహ ఎలాగోలా తగలడుతుంది. సరే. వాస్తవానికి వచ్చి ఈ కథలో జిల్లేడు ఆకుల పాత్ర ప్రధానం. ఏదో ఒక ఆకులు వేసేసి ఇవి జిల్లేడు అనుకోమంటే కుదురుతుందా? హైద్రాబాద్ నగరంలో నేను జిల్లేడు ఆకులుని ఎక్కడని పట్టేది? అసలు కథకు బొమ్మ ఉందా లేదా అని కూడా పట్టించుకోని ఈ థేంక్‌లెస్ పాతకుల ప్రపంచంలో అదేపనిగా రాజేంద్రనగర్ రోడ్డు దారి పట్టి జిల్లేడు కొమ్మని తెంచుకుని వచ్చి మరీ గీసిన బొమ్మ ఇది.
పూజకు వేళాయెరా అనే ఈ కథలో యానాం, ఆ నది ఆ గట్టు అలా అలా వర్ణన ఉంటుంది. కథ చివరి వరకు పూజ గురించే వుంటుంది, పవిత్రంగా అనిపిస్తుంది. కథ చివరికి వచ్చేసరికి అసలు పూజ అంటే మందు కొట్టడం అని తెలుస్తుంది. కథలో ఆ సంగతి బయటపెట్టకుండా టైటిల్‌లో మాత్రం గంట లోపల ఉండవలసిన ఇనుపముక్క స్థానంలో లిక్కర్ బాటిల్ అంత ఈజీగా బయటపడకుండా వేయడమయినది అన్నమాట.
ఈ ఎర్రచీర బొమ్మకు వేసిన కథ కూడా గుర్తులేదు. కానీ కురులు చెదిరి అలా పడివున్న ఆ అమ్మాయి కట్టుకున్న ఎర్రచీర పొడుగ్గా సాగి ఒక మనిషిలా సాగిపోతుంది. చూస్తుంటే వీడు ఆ అమ్మాయిని మోసం చేసి పోతున్నాడేమో అనిపించిది నాకు. కాని, గమనిస్తే వాడి నీడ వాడి వెంట లేదు; ఆ అమ్మాయి వేపే ఆవిడ్ని చేరుకోడానికి వెనక్కి వస్తుంది. ఆసక్తి అనిపించట్లా? నాకైతే అదే అనిపిస్తుంది మరి!
చాలా ఉన్నది ఇలా చెప్పుకుంటూ పోతే. వినేవాడి పట్ల చెప్పేవాడికి ఇక ఏం గౌరవం మిగులుతుంది? ఇంకా ఇటువంటి లోకజ్ఞానం వొలకబోయడానికి మరో నాలుగయిదు నెలల సమయం ఉందిగా. ఆ లోపు మన పరస్పర గౌరవాలు పూర్తిగా పోగొట్టుకుందామని నాది హామీ. అంతవరకు… ఇంకా ఉంది.