ఉపోద్ఘాతం
భాష ఒక ఇంద్రధనుస్సులాంటిది. అందులో రకరకాల రంగులూ, రంగుల మధ్య ఛాయలూ అతిసూక్ష్మంగా విస్తరించుకొని ఉంటాయి. మనం మనసుబెట్టి గమనించం కాని, జాగ్రత్తగా పరిశీలిస్తే రోజువారీ వాడుకలోనే ఎన్నెన్నో విశేషాలూ వింతలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించండి.
‘రావణున్ని రాముడు చంపాడు’; ‘సింహం జింక వేటాడింది’; ‘మా ఇంటి ముందు చెట్టు కొట్టేశారు’; ‘నేనొక అరటిపండును తిన్నాను’; ‘విద్య కీర్తి ఇస్తుంది’; ‘అతను పువ్వులు కొన్నాడు’; ‘పువ్వులతో పూజ చేశాడు’; ‘రాజు ఎదురింట్లో పూజ చూశాడు’.
పై వాక్యాలలో ఏవి సరైనవి, ఏవి కావు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే భాష స్వభావాన్ని కొంత లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు వ్యాకరణం కొంత తోడుపడుతుంది. పై వాక్యాలకు సంబంధించిన ఒక వ్యాకరణ సూత్రం చిన్నయ్యసూరి రచించిన బాలవ్యాకరణంలో ఉంది. జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు–అన్నది ఆ సూత్రం.
సంస్కృతంలో ఉన్న వ్యాకరణాలు, వాటిని అనుసరించి తెలుగులో తెలుగు భాషకు వచ్చిన వ్యాకరణాలు కూడా, ఆ భాష రాని కొత్తవాళ్ళకు భాష నేర్పడానికి రచించిన learner’s grammar పుస్తకాలు కావు, అవి భాషాశాస్త్రజ్ఞులకు ఉద్దేశించబడిన గ్రంథాలు. అంటే, భాష స్వరూపాన్ని శాస్త్రీయంగా పరిశీలించడానికి, అవగాహన చేసుకోడానికీ అవి ఉపయోగపడతాయి. క్లుప్తమైన నిర్దిష్టమైన సూత్రాలు వ్యాకరణానికి శాస్త్ర ప్రతిపత్తినిస్తాయి. భాష కీలక లక్షణాలనూ మౌలిక స్వభావాన్నీ అర్థం చేసుకొనేందుకు వ్యాకరణం ఉపయోగపడుతుంది. తద్వారా భాషను లోతుగా అన్వేషించడానికి అది బాటలు వేస్తుంది. అయితే, సహజంగా ఏర్పడిన ఏ మానవభాష కూడా ఏ కొద్ది సూత్రాలలోనో పరిపూర్ణంగా ఒదిగిపోదు. అది దేశకాలాలతో నిరంతరంగా మారుతూ ఉంటుంది. అంచేత వ్యాకరణ సూత్రాలకు లొంగని ప్రయోగాలు నిత్యవ్యవహారంలోనే కాక సాహిత్యంలో కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
ఈ నేపథ్యంలో, బాలవ్యాకరణంలోని ఆ సూత్రం ఆధారంగా పైన ఉదాహరించిన వాక్యాలను కొంత లోతుగా పరిశీలిస్తే, తెలుగు భాషకున్న ఒక ప్రత్యేక లక్షణం బయటపడుతుంది. తెలుగు భాషలోనే కాక ఇతర భారతీయ భాషలలోనూ, అంతే కాక ప్రపంచంలో ఉన్న చాలా భాషలలోనూ కనిపించే ఒక మౌలిక లక్షణం బోధపడుతుంది. అయితే ఆ ఒక్క సూత్రమూ భాషా స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరించలేదు. అందుకే దానికి అందని ప్రయోగాలు కూడా మనకు వ్యవహారంలో కనిపిస్తాయి. సూత్రం సూచిస్తున్న భాషా లక్షణం ఏమిటో, దానికి లొంగని ప్రయోగాలు ఏమిటో, వాటి వెనకనున్న కారణాలు ఏమిటో, ఈ వ్యాసంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
సూత్ర వివరణ: జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు
ఒక్క వాక్యంలో వివరించాలంటే, ఈ సూత్రం చెపుతున్నది–కర్మ జడమైనప్పుడు దానికి ద్వితీయా విభక్తి బదులుగా కొన్ని సార్లు ప్రథమ వస్తుంది అని. ఈ సూత్రం భాషాశాస్త్రజ్ఞులకు, వ్యాకరణవేత్తలకూ పరిచితమయ్యే ఉంటుంది. వారీ భాగాన్ని వదిలి నేరుగా తర్వాతి సెక్షనుకు వెళ్ళవచ్చు. మిగిలిన వారికి స్పష్టత కోసం ఈ వివరణ.
వాక్యంలో ఒక పదానికి (నామవాచకానికి) క్రియతో ఉండే సంబంధాన్ని వ్యాకరణంలో కారకం అంటారు. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం అనే ఆరు కారకాలను పాణిని చెప్పాడు. ఈ సంబంధాన్ని వాక్యంలో నామవాచకానికి చివర వచ్చే విభక్తి ప్రత్యయం సూచిస్తుంది. ప్రథమా విభక్తి కర్తని, ద్వితీయ కర్మను, తృతీయ కరణాన్ని, చతుర్థి సంప్రదానాన్ని, పంచమి అపాదానాన్ని, సప్తమి అధికరణాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు ‘రాముడు రావణుని చంపాడు’ అనే వాక్యంలో ‘చంపడం’ అనేది క్రియ. ‘రాముడు’, ‘రావణుడు’ అనేవి నామవాచకాలు. ప్రథమా విభక్తిలో ఉన్న రాముడు కర్త, ద్వితీయా విభక్తిలో ఉన్న రావణుడు (రావణుని) కర్మ. అంటే క్రియను చేసింది రాముడు. ఆ క్రియ ఫలితాన్ని అనుభవించింది రావణుడు. చాలా వరకూ భారతీయ భాషలన్నీ విభక్తి ప్రత్యయాలు కలిగిన భాషలే. అందుకే మనకి పదాల క్రమంతో అంత పట్టింపు ఉండదు. ‘రావణుని రాముడు చంపాడు’ అన్నా అర్థం మారదు. ఇంగ్లీషులో ఇలా పదాలతో కలిసిపోయే విభక్తి ప్రత్యయాలు ఉండవు కాబట్టి అక్కడ పద క్రమం ప్రధానం అవుతుంది. అలాగే ‘రాముడు రావణుని బాణంతో చంపాడు’ అన్న వాక్యంలో ‘బాణం’ అన్న పదం తృతీయా విభక్తిలో ఉంది. అంచేత అది కరణం. అంటే కర్మ చేసేందుకు ఉపయోగపడే సాధనం. ఇలాగే మిగిలిన విభక్తి ప్రత్యయాలు ఆయా కారకాలను సూచిస్తాయి. షష్ఠీ విభక్తి మాత్రం కారకాన్ని సూచించదు, అది రెండు నామవాచకాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఒక్కో విభక్తి ఒకో కారకాన్ని సూచిస్తుంది అనడం స్థూలంగా చెప్పుకొనే విషయం మాత్రమే. కొన్నిసార్లు ఒక విభక్తి రెండు మూడు కారకాలను సూచించవచ్చు, ఒకే కారకాన్ని రెండు విభక్తులు సూచించనూవచ్చు. ఏ విభక్తి సాధారణంగా ఏ కారకాన్ని సూచిస్తుందో ముందు సూత్రీకరించి, ఆ తర్వాత ప్రత్యేక సందర్భాలకు విడివిడిగా ప్రత్యేక సూత్రాలను వైయాకరణులు రచిస్తారు. అలా రచించిన ప్రత్యేక సూత్రాలలో ఒక సూత్రమే– జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.
కర్మ కారకానికి సాధారణంగా ద్వితీయా విభక్తి వస్తుందని పైన చెప్పుకున్నాం కదా. దీనిని చిన్నయ్యసూరి కర్మంబున ద్వితీయయగు అనే సూత్రంలో చెప్పాడు. ‘నేను సింహాన్ని చూశాను’ అనే వాక్యంలో నేను కర్త, సింహం కర్మ. అలాగే ‘సింహం జింకను వేటాడింది’ అనే వాక్యంలో సింహం కర్త, జింక కర్మ. ‘మనం చెట్లను రక్షించాలి’ అన్న వాక్యంలో మనం కర్త, చెట్లు కర్మ. ఈ వాక్యాలన్నింటిలో కర్మ పదానికి ద్వితీయా విభక్తి ఉండడం గమనించవచ్చు. అలాగే, ‘కరీమ్ నిన్ను పిలిచాడు’ అనే వాక్యంలో ‘నిన్ను’ అనే పదం ద్వితీయా విభక్తిలో ఉన్న సర్వనామం. ‘నువ్వు’ అనే వ్యక్తి అక్కడ కర్మ. ‘అల్లా నన్ను రక్షించు గాక’ అనే వాక్యంలో కర్మ పదమైన ‘నేను’ ద్వితీయా విభక్తిలో ‘నన్ను’ అవుతుంది. ఈ ఉదాహరణలన్నింటిలోనూ కర్మంబున ద్వితీయయగు అనే సూత్రం వర్తిస్తోంది. వ్యాకరణ భాషలో సూత్రంలో ఉండే ‘అగు’ అనే పదం నిత్యంగా, అంటే ఎప్పుడూ జరిగే కార్యాన్ని సూచిస్తుంది. అంటే, ఎప్పుడూ కర్మకి ద్వితీయా విభక్తి వస్తుంది అని అర్థం. అయితే, ‘నేను రోజుకొక అరటిపండు తింటాను’; ‘మా ఇంటి ముందరి చెట్టు కొట్టేశారు’; ‘ఆమె చీర కట్టుకుంది’– మొదలైన వాక్యాల సంగతి ఏమిటి? ఇందులో ‘అరటిపండు’, ‘చెట్టు’, ‘చీర’ అనేవి ఆయా వాక్యాలలో కర్మ కారకాలే. అయినా వాటికి ద్వితీయా విభక్తి ప్రత్యయం ‘ను’/’ని’ రాలేదు. అవన్నీ ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. ఇలాంటి వాక్యాలు నిత్యవ్యవహారంలో చాలానే కనిపిస్తాయి. వాడుకలోనే కాదు సాహిత్యంలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు ముక్కు తిమ్మన రచించిన యీ ప్రసిద్ధ పద్యం చూడండి:
జలజాతాసనవాసవాదిసురపూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిర మచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి యట్లయగు, నాథుల్ నేరముల్ సేయ, బే
రలుకం జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే?
ఇందులో, ‘వామపాదంబున లతాంగి లతాంతాయుధు గన్నతండ్రి శిరము తొలగద్రోచెను’ అనే వాక్యంలో తొలగద్రోచడం అనే క్రియకు కర్త ‘లతాంగి’, కర్మ ‘శిరము’. ఆ పదం ప్రథమా విభక్తిలోనే ఉంది. అలానే ‘కాంతలు ఉచితవ్యాపారముల్ నేర్తురే’ అనే వాక్యంలో ‘నేర్వడం’ అనే క్రియకు కర్త ‘కాంతలు’, కర్మ ‘ఉచితవ్యాపారములు’. ఇక్కడ కూడా కర్మ ప్రథమా విభక్తిలోనే ఉంది.
అయితే ఒక్క విషయం. పై ఉదాహరణలన్నిటిలోనూ ద్వితీయా విభక్తి కూడా రావచ్చును. ‘నేను రోజుకొక అరటిపండును తింటాను’, ‘మా ఇంటి ముందరి చెట్టును కొట్టేశారు’, ‘ఆమె చీరను కట్టుకుంది’– ఇలా ద్వితీయా విభక్తి సహితంగా కూడా కర్మ పదం ఉండవచ్చు. అంటే ఇలాంటి చోట్ల కర్మ కారకానికి ద్వితీయ కాని, ప్రథమ కాని రావచ్చునని తేలింది కదా. అయితే, అన్ని చోట్లా ఇలా కుదురుతుందా? కుదరదు. ఉదాహరణకు, ‘రాముడు రావణుడు చంపెను’, ‘సింహం జింక వేటాడింది’, మొదలైన వాక్యాలు తప్పు. ఆ వాక్యాలలో కర్మకు ద్వితీయా విభక్తి కచ్చితంగా వచ్చి తీరాలి. దీని బట్టి తేలిన విషయం, కర్మంబున ద్వితీయ అగు అని కర్మకు నిత్యంగా ద్వితీయ వస్తుందని చెప్పే సూత్రం కొన్ని సందర్భాలకే పరిమితం. కొన్ని సందర్భాలలో అది వికల్పం (అంటే వస్తే రావచ్చు లేదంటే లేదు). అందుకే ఈ సూత్రానికి ఎక్సెప్షన్లు చెప్పే మరొక సూత్రం అవసరం అయింది. అదే, జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు, అనే సూత్రం.
వాక్యంలోని కర్మ పదం ‘జడం’ అయిన సందర్భాలలో, ద్వితీయా విభక్తి బదులు ప్రథమా విభక్తి బహుళంగా వస్తుందని దీని అర్థం. బహుళంగా అంటే కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు అని ప్రస్తుతానికి అర్థం చేసుకుంటే చాలు. పశుపక్ష్యాదులైన ప్రాణులన్నీ, మనిషితో సహా, చైతన్యాలు. ఇంగ్లీషులో వీటినే ఆనిమేట్స్ అంటారు. మిగిలినవి జడ పదార్థాలు, వాటిని ఇనానిమేట్స్ అంటారు. చెట్లని కూడా జడ పదార్థంగానే పరిగణిస్తాం. ‘నేను రోజుకొక అరటిపండు తింటాను’ మొదలైన పై ఉదాహరణల్లో కర్మ పదం జడమే కావడం గమనించవచ్చు. అవి జడ పదార్థాలు కావడం వల్ల ద్వితీయకు బదులు ప్రథమా విభక్తి వచ్చిందన్నమాట. ‘రాముడు రావణుని చంపెను’ మొదలైన వాక్యాలలో కర్మ జడం కాదు కాబట్టి అక్కడ కచ్చితంగా ద్వితీయ వచ్చితీరాలి, అదే కర్మ జడం అయినప్పుడు ద్వితీయ బదులు ప్రథమ వస్తే రావచ్చు, లేదంటే ద్వితీయే ఉండవచ్చునని పైన చూశాం కదా. ‘నేను రోజుకొక అరటిపండు తింటాను’; ‘నేను రోజుకొక అరటిపండును తింటాను’–ఈ రెండు వాక్యాలూ సరైనవే. అందువల్ల ఇక్కడ ద్వితీయకు ప్రథమ వికల్పంగా వస్తోంది.
సూత్రానికి అపవాదాలు
ఇప్పటి వరకూ, జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు అన్న సూత్రాన్ని సోదాహరణంగా తెలుసుకొన్నాం కదా. కర్మ జడమయినప్పుడు ద్వితీయా విభక్తి ప్రత్యయం లేకపోయినా ఇబ్బంది లేదని ఈ వివరణ స్పష్టం చేసింది. అయితే, కర్మ జడమైనా ద్వితీయా ప్రత్యయం కచ్చితంగా వచ్చి తీరాల్సిన సందర్భాలు మనకు వ్యవహారంలో కొన్ని కనిపిస్తాయి. వాటిని ఈ సూత్రంలో చిన్నయ్యసూరి పేర్కొనలేదు. బాలవ్యాకరణానికి పూరకంగా వచ్చిన ప్రౌఢవ్యాకరణం కూడా వీటి గురించి చెప్పలేదు. అలాంటి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం.
-గుడిలో శిలను పూజించడం ఎందుకు?
-బొమ్మను ప్రశ్నిస్తే అది బదులు చెపుతుందా?
-రాయిని ఆడది చేసిన రాముడివా!
-నువ్వు దేశాన్ని రక్షించు.
-కొండను మబ్బు గుద్దుకొంది.
-విద్య కీర్తిని ఇస్తుంది.
పై వాక్యాలలో కర్మవాచక పదాలన్నీ జడాలే; శిల, బొమ్మ, రాయి, కొండ. అందువల్ల పై సూత్రం ప్రకారం ఇక్కడ ద్వితీయా విభక్తికి బదులుగా ప్రథమ వచ్చే అవశాశం ఉంది. అలా ద్వితీయ స్థానంలో ప్రథమ వస్తే ఆ వాక్యాలు ఎలా ఉంటాయో చూడండి:
-గుడిలో శిల పూజించడం ఎందుకు?
-బొమ్మ ప్రశ్నిస్తే అది బదులు చెపుతుందా?
-రాయి ఆడది చేసిన రాముడివా!
-నువ్వు దేశం రక్షించు.
-కొండ మబ్బు గుద్దుకొంది.
-విద్య కీర్తి ఇస్తుంది.
కొద్దిగా పరిశీలిస్తే యివి సరైన వాక్యాలు కావని స్పష్టంగానే తెలుస్తోంది. చివరి వాక్యం మాత్రం పెద్ద తప్పుగా అనిపించడం లేదు.
బాలవ్యాకరణం ప్రకారం ఇవన్నీ సరైన వాక్యాలే కావచ్చును కానీ, యీ వాక్యాలలో అర్థబోధ సరిగా లేదు. ఎందుకు? దీనికి సమాధానం తెలియాలంటే మన జడంబు ద్వితీయకు ప్రథమ అన్న సూత్రాన్ని భాషాశాస్త్ర దృష్టితో కొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
సూత్రం వెనకనున్న భాషాలక్షణం
క్రియలను సకర్మక (transitive), అకర్మక (intransitive) క్రియలుగా విభజించవచ్చు. కర్మ కలిగినది సకర్మక క్రియ. కర్మ ఉండనిది అకర్మక క్రియ. ‘గోపి రొట్టెను తిన్నాడు’; ‘సింహం జింకను చంపింది’; ‘జోసెఫ్ రాధను పిలిచాడు’–మొదలైన వాక్యాలలో క్రియలు (‘తినడం’ మొదలైనవి) సకర్మకాలు. అందుకే ఆయా వాక్యాలలో కర్మ పదాలు ఉన్నాయి. ‘బంతి దొర్లిపోయింది’; ‘నేను నడుస్తున్నాను’; ‘చెట్టు కూలిపోయింది’–మొదలైన వాక్యాలలో క్రియలు (‘దొర్లిపోవడం’ మొదలైనవి) అకర్మక క్రియలు. వీటికి కర్మ అనేది ఉండదు. పై ఉదాహరణలలో కర్తలను గమనించండి. సకర్మక వాక్యాలలో కర్త పదాలన్నీ–గోపి మొదలైనవి–చైతన్యాలు (ప్రాణి వాచకాలు). అకర్మక వాక్యాలలో కర్త కొన్నిసార్లు చైతన్యం (నేను), కొన్నిసార్లు జడం (బంతి, చెట్టు) అవుతున్నాయి. ఈ లక్షణం ఈ ఉదాహరణలకే పరిమితం కాదు. ఏ సకర్మక వాక్యంలోనయినా కర్త చైతన్యమే అవుతుంది. ఇది తెలుగు భాషకు మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. ఏ భాషలోనైనా సాధారణ వ్యవహారంలోని వాక్యాలకు ఇది వర్తిస్తుంది. అంటే ఇది భాష ఉపరితల నిర్మాణానికి కాక, అంతర్నిర్మాణానికి సంబంధించినది. అర్థానికి సంబంధించిన (semantic) అంశమిది. కర్త అంటే ఒక పనికి (క్రియకు) కారణభూతమైన పదార్థం. ‘దొర్లిపోవడం’, ‘పడిపోవడం’, ‘కూలిపోవడం’, ‘నడవడం’ మొదలైన అకర్మక క్రియలు, దేని ద్వారా ఏర్పడతాయో వాటి మీదనే అవి పని చేస్తాయి (ఫలితాన్ని పొందుతాయి లేదా ఆ పనిలో ప్రధానపాత్ర నిర్వహిస్తాయి). నడవడం అనే క్రియను చేసే మనిషే ఆ నడక ద్వారా స్థానచలనాన్ని పొందడం జరుగుతుంది. ఏ వస్తువు పడడం మొదలుపెట్టిందో అదే వస్తువు ఆ పతనావస్థను పొందుతుంది. అందుకే వాటికి విడిగా కర్మలు ఉండవు.
సకర్మక క్రియలు అలా కాదు. క్రియను చేసే పదార్థం ఒకటైతే, దాని ఫలితం మరొక పదార్థంపైన ప్రతిఫలిస్తుంది, లేదా మరొక పదార్థం అందులో ప్రధానంగా పాల్గొంటుంది. ‘సింహం జింకను చంపింది’ అనే వాక్యంలో ‘చంపడం’ అనే క్రియను చేసినది సింహమైతే దాని ఫలితాన్ని అనుభవించింది జింక. అలాగే ‘గోపి అన్నం తిన్నాడు’ అనే వాక్యంలో తినడం అనే పని చేసింది గోపి అయితే అందులో ప్రధాన పాత్ర వహించింది అన్నం. తిన్నది ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం అన్నం. ఇలా మరొక పదార్థంపై ప్రభావాన్ని చూపే పనులు చేయగలిగినవి చైతన్యం ఉన్న వస్తువులే. దీన్నే ఇంగ్లీషులో ఏజెన్సీ అంటారు. సకర్మక క్రియలు ‘చేయబడతాయి’. అకర్మక క్రియలు ‘చేయబడతాయి’ లేదా ‘జరుగుతాయి’ కూడా. అదీ తేడా. అయితే కొన్నిసార్లు వ్యంగ్యంగా (లేదా కవితాత్మకంగా) జడ పదార్థాలకు కూడా మనం చైతన్యాన్ని ఆపాదిస్తాం. అలాంటి సందర్భాలలో జడ పదార్థాలు కూడా సకర్మక వాక్యాలలో కర్తలుగా మారతాయి. ఉదాహరణకు, ‘నా బండి బాగా పెట్రోలు తాగేస్తోంది’ అనే వాక్యంలో ‘బండి’ అనేది జడమైనా దానికి ‘తాగడం’ అనే సకర్మక క్రియ ఆపాదించబడింది. ఇలాంటి సందర్భాలలో ఆ జడాన్ని కూడా నిజానికి చైతన్యంగానే భావించాలి. కొన్ని ప్రత్యేకమైన చోట్ల మామూలు వ్యవహారంలో కూడా జడం సకర్మక క్రియకు కర్త అవుతూ ఉంటుంది. ఉదాహరణకు, ‘నా కంప్యూటర్ చాలా మెల్లిగా ఫైల్స్ డౌన్లోడ్ చేస్తోంది’ అనే వాక్యంలో డౌన్లోడ్ చెయ్యడం అనే సకర్మక క్రియకు కర్త కంప్యూటర్ అయింది. ఇక్కడ కూడా కంప్యూటర్ను చైతన్యంగానే భావించాలి. సకర్మక క్రియకి కచ్చితంగా చైతన్యమైన కర్త ఉండాలని స్పష్టమయ్యింది కదా. అకర్మక క్రియకు చైతన్యమైనా జడమైనా కర్త కావచ్చు అని కూడా చూశాం. అయితే ప్రతి అకర్మక క్రియకూ కర్త ఏదైనా కావచ్చునని చెప్పలేం. ఉదాహరణకి ‘నడవడం’, ‘నిద్రపోవడం’, ‘రావడం’, మొదలైన క్రియలు అకర్మకాలే అయినా అవి ‘చేయబడే’ క్రియలు. అంచేత వాటి కర్త జడం కాలేదు. పైన ఉదాహరించినట్టు, ఒకవేళ ఈ క్రియలకు జడ పదార్థాన్ని కర్తగా ప్రయోగించినా దాన్ని చైతన్యంగానే గుర్తించాలి. ఉదాహరణకి ‘ఈ వీధి నిద్రపోతోంది’ అన్నప్పుడు వీధి చైతన్యమే కాని జడం కాదు!
ఈ చర్చ ద్వారా తేలిన విషయం ఏమిటంటే, ఒక పదార్థం సహజంగా చైతన్యమో జడమో అయినప్పటికీ దాన్ని వాక్యంలో ప్రయోగించిన సందర్భాన్ని బట్టి, ముఖ్యంగా ఆ వాక్యంలో క్రియను బట్టి, అది చైతన్యమో జడమో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు సకర్మక వాక్యాల నిర్మాణాన్ని మరికొంత వివరంగా పరిశీలిద్దాం. ‘సింహం జింకను చంపింది’ అనే వాక్యంలో ఏది ఎవరిని చంపిందో స్పష్టపరుస్తున్న వాక్య భాగం ఏమిటి? ‘జింక’ పదానికి చేరిన ‘ను’ అనే ద్వితీయా విభక్తి ప్రత్యయం. అదే ప్రత్యయాన్ని తీసుకుపోయి సింహానికి తగిలిస్తే ‘సింహమును జింక చంపింది’ అని, చంపబడ్డది సింహం అవుతుంది. ద్వితీయా విభక్తిని తీసేస్తే ఆ వాక్యం ‘సింహం జింక చంపింది’ అవుతుంది. అప్పుడు ఎవరు ఎవరిని చంపారన్నది అర్థం కాకుండా పోతుంది. అలాగే ‘జోసెఫ్ రాధను పిలిచాడు’ అన్న వాక్యం కూడా. ఇక్కడ ‘పిలిచాడు’ అనే క్రియ పురుషవాచకాన్ని సూచిస్తోంది కాబట్టి పిలిచింది జోసెఫ్ అని తెలుస్తుంది అని వాదించవచ్చు. కానీ అది జోసెఫ్ పురుషుడు అనే భావం మీద ఆధారపడుతోంది. పేరుబట్టి మగో ఆడో తెలియనప్పుడు ఇది కుదరదు. అలాగే ‘జోసెఫ్ రాధ పిలిచెను’ అనే గ్రాంథిక ప్రయోగంలో కూడా క్రియా ప్రత్యయం ద్వారా కర్త ఎవరు, కర్మ ఎవరు అనేది స్పష్టం కాదు. ఇక్కడ గందరగోళానికి కారణం ఆ క్రియను చేసే స్వభావం జోసెఫ్, రాధలు ఇద్దరికీ ఉండడం. ఎందుకంటే ఇద్దరూ చైతన్యవంతులే. అందుకే కర్త కర్మ రెండూ చైతన్యపదార్థాలే అయినప్పుడు వాటి మధ్య భేదం తెలియడానికి ద్వితీయా విభక్తి తప్పనిసరి అవుతుంది. ‘గోపి రొట్టెను తిన్నాడు’ అనే వాక్యంలో కర్మ పదం రొట్టె. అది జడం. జడ పదార్థం తినడం అనే క్రియను చేయలేదు. అంచేత అక్కడ ద్వితీయా విభక్తి ప్రత్యయం లేకపోయినా ‘గోపి రొట్టె తిన్నాడు’ అనడంలో అర్థబోధకు ఎలాంటి ఇబ్బందీ లేదు. జడం కర్త కాలేదు కాబట్టి రొట్టె కర్మ, గోపి కర్త. జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు అన్న సూత్రం వెనుకనున్న అసలు కారణం ఇది. వాడుక భాష ఎప్పుడూ భాషలో అనవసరమైన వాటిని పరిహరిస్తూ ఉంటుంది. అందుకే వ్యవహారంలో జడానికి ద్వితీయా విభక్తి ప్రత్యయం లేకుండానే ఎక్కువగా వాడుక కనిపిస్తుంది.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM
ఇలా జడ కర్మలకు ద్వితీయా విభక్తి ప్రత్యయం అవసరం లేకపోవడం అనే లక్షణం ఒక్క తెలుగు భాషకి మాత్రమే పరిమితం కాదు. కన్నడం, తమిళం వంటి ఇతర ద్రావిడ భాషలలోనూ ఇది కనిపిస్తుంది. ద్రావిడ భాషలలోనే కాదు, విభక్తి ప్రత్యయాలు కలిగిన అనేక ఇతర భాషలలో కూడా ద్వితీయా విభక్తి విషయంలో కొన్ని చోట్ల ప్రత్యయం ఉండడం కొన్ని చోట్ల లేకపోవడం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. హిందీ, మరాఠీ, బెంగాలీ, అసామీ లాంటి ఇతర భారతీయ భాషల్లోనూ ఈ లక్షణం ఉంది. సంస్కృతంలో ఇది మరొక రూపంలో ప్రతిఫలించింది. సంస్కృతంలో నపుంసకలింగ పదానికి ప్రథమ, ద్వితీయా విభక్తి రూపాలు ఒకటే. నపుంసకలింగ పదాలు చాలా వరకూ జడాలే కావడం దీనికి కారణం అయ్యుండవచ్చు. భారతీయభాషలే కాక, స్పానిష్, పర్షియన్, రష్యన్ లాంటి చాలా ప్రపంచ భాషలలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీషులో Differential Object Marking (DOM) అంటారు. అంటే, కర్మను (Object) స్పష్టంగా గుర్తించడానికి కొన్ని సందర్భాలలో ఒక మార్కింగ్, ఒక ప్రత్యయం అవసరం అవుతుంది. కొన్ని సందర్భాలలో అవసరం పడదు. ప్రపంచ భాషలన్నిటా వ్యాప్తిలో ఉన్న ఈ లక్షణాన్ని మొట్టమొదట గుర్తించినది జార్జ్ బొస్సొంగ్ (Georg Bossong). మొత్తం మూడువందలు పైచిలుకు భాషల్లో ఈ లక్షణాన్ని బొస్సొంగ్ గుర్తించాడు. ఆ తర్వాత మరి కొందరు భాషాశాస్త్రవేత్తలు ఈ DOM అనే భాషాలక్షణం వెనకనున్న కారణాలు ఏమిటి, ఏయే అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి అనే విషయాల గురించి పరిశోధన చేశారు. కచ్చితమైన సిద్దాంతం అంటూ ఏదీ లేదు కాని, ఈ పరిశోధనలలో రెండు ముఖ్యమైన మార్గాలు గుర్తించవచ్చు. ఒకటి ఆంబిగ్విటీ సిద్ధాంతం (Ambiguity thesis), ఇంకొకటి ట్రాన్సిటివిటీ సిద్ధాంతం (Transitivity thesis).
కర్త కర్మల మధ్య సందిగ్ధత ఏర్పడే సందర్భాలలో, వాటిని ప్రత్యేకంగా గుర్తించడానికి కర్మ పదంలో ప్రత్యయాలు వచ్చి చేరతాయన్నది ఆంబిగ్విటీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పరిశీలన ప్రధానంగా కర్మ పదాల లక్షణాలను ఆధారం చేసుకొని సాగుతుంది. కర్మ పదం చైతన్యమా, జడమా, నిశ్చిత వాచకమా, అనిశ్చిత వాచకమా, ఒక పదార్థాన్ని ఎంత స్పెసిఫిక్గా ఆ పదం సూచిస్తుంది–మొదలైన అంశాలను బట్టి, ఆ కర్మ పదానికి చేరే ప్రత్యయాలను పరిశీలించడం ఈ పద్ధతి. ట్రాన్సిటివిటీ సిద్ధాంతంలో కర్మ కన్నా క్రియా పదం ప్రధానం. ఒక క్రియ ఎలాంటిదో, అది ఎలాంటి కర్త కర్మ పదాలను ఆశిస్తుందో పరిశీలించి, వాటిని బట్టి ప్రత్యయాలలో తేడాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. జడ ద్వితీయకు ప్రథమ వస్తుందన్న బాలవ్యాకరణ సూత్రం మొదటి సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఈ రెండు సిద్ధాంతాలలో ఏ ఒక్కటీ సంపూర్ణం కాదు. అందుకే ఈ సూత్రానికి కూడా, చిన్నయ్యసూరి చెప్పని అపవాదాలు (ఎక్సెప్షన్లు) కొన్ని కనిపిస్తున్నాయి. వాటికి కొన్ని ఉదాహరణలు పైన చూసి ఉన్నాం. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగా ఆ ఉదాహరణలను ఒక్కొక్కదాన్ని యిప్పుడు పరిశీలిద్దాం.
అపవాదాల వెనకనున్న కారణాలు
-గుడిలో శిలను పూజించడం ఎందుకు?
ఈ వాక్యంలో కర్మ పదం ‘శిల’ జడమైనా, ఇక్కడ ద్వితీయ బదులు ప్రథమా విభక్తి రాదు. దీనికి కారణం ఈ వాక్యంలో క్రియను చూస్తే బోధపడుతుంది. ‘పూజించడం’ అనే క్రియ ఎప్పుడూ చైతన్యమైన కర్మ పదాన్నే ఆశిస్తుంది. జడమైన పదార్థాన్ని పూజించడం ఉండదు కదా. అంచేత ఇక్కడ శిల అనే పదం విడిగా జడమే అయినా, ఈ వాక్యంలో అది చేతనత్వం పొందింది. అందువల్ల జడ ద్వితీయకు ప్రథమ వస్తుందన్న సూత్రం ఇక్కడ వర్తించదు. ఈ క్రింది రెండు ఉదాహరణలు కూడా ఇలాంటివే.
-బొమ్మను ప్రశ్నిస్తే అది బదులు చెపుతుందా?
-నువ్వు దేశాన్ని రక్షించు.
ఈ వాక్యాలలో కూడా ఉన్న క్రియా పదాలు (ప్రశ్నించడం, రక్షించడం) ఎప్పుడూ చైతన్యమైన కర్మలనే ఆశిస్తాయి. అందుకే అందులో కర్మ పదాలు విడిగా జడాలైనా ఆ వాక్యాల మేరకు చైతన్యాలే. అందుకే వాటికి ద్వితీయా విభక్తి తప్పనిసరి. ఇప్పుడు ఈ రెండు ఉదాహరణలను చూద్దాం:
-కొండను మబ్బు గుద్దుకొంది.
-విద్య కీర్తిని ఇస్తుంది.
మొదటి వాక్యంలో ‘గుద్దుకొనడం’ అనే క్రియకు కర్మ పదం చైతన్యం కావాలన్న నియమం లేదు. జడం కావచ్చు. ‘కిశోరు గోడ(ను) గుద్దుకున్నాడు’ అనేది సరైన వాక్యమే. నిజానికి కర్మ జడమే అవ్వాలి కూడా! రెండు చైతన్యాలు ఒకదానికొకటి గుద్దుకుంటాయి. అప్పుడు రెండూ కర్తలే అవుతాయి. ఉదాహరణకు, ‘ఆసిఫ్, కిశోరు గుద్దుకున్నారు’ అనాలి. లేదా క్రియ ‘గుద్దడం’ కావచ్చు. అప్పుడు, ‘కిరణ్ కిశోరుని గుద్దాడు’ అవుతుంది. కర్త కిరణ్, కర్మ కిశోరు. ‘గుద్దుకొనడం’ అనే క్రియకు మాత్రం కర్త ఛైతన్యం, కర్మ జడం. మరి పై ఉదాహరణలో కర్మ పదం (కొండ) జడమే అయినా, ద్వితీయా విభక్తి ప్రత్యయం ఎందుకు తప్పనిసరి? దానికి కారణం ఆ వాక్యంలోని కర్త. కర్తగా ఉన్న పదం ‘మబ్బు’. అది కూడా జడమే! జడమే అయినా కర్త రూపంలో చైతన్యంగా మారింది. కర్తగా అది ప్రథమా విభక్తిలో ఉంటుంది కాబట్టి ఆ పదానికి ప్రత్యేకమైన ప్రత్యయం ఏదీ లేదు. కర్మ అయిన ‘కొండ’ పదానికి కూడా ద్వితీయా విభక్తి ప్రత్యయం రాకపోతే అప్పుడు కర్త ఏదో, కర్మ ఏదో తెలియకుండా పోతుంది. ‘కొండ మబ్బు గుద్దుకుంది’ అన్న వాక్యంలో కర్త, కర్మల మధ్య సందిగ్ధత (ఆంబిగ్విటీ) ఏర్పడింది. అందువల్ల కర్మ పదానికి ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి అయింది. ‘కొండను మబ్బు గుద్దుకొంది’ అని అంటే, కర్త మబ్బు, కర్మ కొండ. అదే ‘కొండ మబ్బును గుద్దుకొంది’ అని అంటే, కర్త కొండ, కర్మ మబ్బు. రెండవ ఉదాహరణలో కూడా జరిగింది ఇదే. ‘ఇవ్వడం’ అనే క్రియకు కూడా సాధారణంగా కర్మ పదం జడమే అవుతుంది. అయితే ఇక్కడ కర్త, కర్మ పదాలు రెండూ (విద్య, కీర్తి) జడాలే. అంచేత కర్త, కర్మల మధ్య స్పష్టత కోసం ద్వితీయా విభక్తి ప్రత్యయం అవసరం అయింది. అయితే వాడుకలో ‘విద్య కీర్తి ఇస్తుంది’ అనేది కూడా సరిగానే అనిపిస్తుంది. దానికి కారణం తెలుగు వాక్యానికి సహజమైన కర్త-కర్మ-క్రియ అనే పద క్రమం. దాని వల్ల ఆ వాక్యంలో కర్త ‘విద్య’ అని, ‘కీర్తి’ కర్మ అనీ మనం అర్థం చేసుకుంటాం. అదే, ‘కీర్తి విద్య ఇస్తుంది’ అని క్రమం మారిస్తే కీర్తి విద్యను ఇస్తుందన్న అర్థం వస్తుంది. పద క్రమంపై ఆధారపడకుండా అర్థం రావాలంటే ద్వితీయా విభక్తి ప్రత్యయం అవసరమే. ఇక ఆఖరు ఉదాహరణను చూద్దాం:
-రాయిని ఆడది చేసిన రాముడివా!
ఇది మరికాస్త లోతుగా పరిశీలించాల్సిన ఉదాహరణ. సినిమా పాటగా ఈ వాక్యం ప్రసిద్ధమైనా, నిజానికి ఇందులో కొంత తిరకాసుంది. అదేమిటో పదాలను కాస్త అటూయిటూ చేస్తే తెలుస్తుంది. ఈ వాక్యం చూడండి: ‘ఆడది రాయిని చేసిన రాముడివా!’ దీని అర్థం ఏమిటి? ఒక ఆడదాని చేత రాయిగా మారిన రాముడివా అని అర్థం వస్తుంది. ఇలా పదక్రమం మార్చడం వల్ల అర్థం మారిపోయిందంటే అది సరైన తెలుగు వాక్యం కాదని లెక్క. ఏదో అవసరమైన ప్రత్యయం లోపించిందన్నమాట. ఈ వాక్యంలో అసలు క్రియ లేదు. ‘చేసిన’ అన్నది ధాతుజ విశేషణం, అంటే ధాతువు (క్రియామూలం) నుండి పుట్టిన విశేషణం. దీన్ని క్రియతో కూడిన వాక్యంగా మార్చి చూస్తే ‘రాముడు రాయిని ఆడది చేసెను’ అవుతుంది. ఇందులో పదక్రమాన్ని బట్టి రాముడు కర్త అని గుర్తించవచ్చు. క్రమం మార్చి ‘ఆడది రాయిని రాముడు చేసెను’ అంటే పొసగదు. పదక్రమం మారినా అర్థం చెడకుండా ఉండేందుకు ‘ఆడది’ అనే పదానికి ప్రత్యేకమైన ప్రత్యయం వచ్చి చేరాలి. అది ‘ఆడదిగా’ లేదా ‘ఆడదానిగా’ అనేది. ‘రాముడు రాయిని ఆడదిగా/ఆడదానిగా చేసెను’ అంటే స్పష్టమైన వాక్యం అవుతుంది. ఇప్పుడు, క్రియను తిరిగి ధాతుజ విశేషణంగా మారిస్తే వచ్చే వాక్యం ‘రాయిని ఆడదానిగా చేసిన రాముడివా’. ఇది సరైన వాక్యం.
ఇంతకూ ఈ వాక్యంలో కర్మ జడమైన ‘రాయి’. దానికి ద్వితీయా ప్రత్యయం చేరకపోతే ‘రాయి ఆడది చేసిన రాముడివా’ అవుతుంది. ఇది ఎలానూ తప్పే. ‘ఆడది’ పదానికి ప్రత్యయం చేరిస్తే వచ్చే వాక్యం ‘రాయి ఆడదిగా చేసిన రాముడివా’. ఇందులో కూడా కొంత అస్పష్టత ఉంది. ‘రాయి’ కర్త అని భ్రమించే అవకాశం కనిపిస్తోంది. ‘రాయి పగలుగొట్టిన రాముడివా’; ‘రాయి ముక్కలు చేసిన రాముడివా’ వంటి వాక్యాలలో ఈ అస్పష్టత అంతగా లేదు. ఎందుకు? కచ్చితంగా ఎందుకో చెప్పలేను కాని, నేను ఊహిస్తున్న కారణం ఇది: ‘ఆడది’ అనే పదం చైతన్యం. రాయి ఆడదానిగా మారింది. ఆ కారణం చేత రాతికి కూడా చేతనత్వం ఆపాదింపబడి, ఈ వాక్యం మేరకు జడం కాకుండా పోయింది. అంచేత దానికి ద్వితీయా విభక్తి ప్రత్యయం అవసరం అయింది.
ద్వితీయా ప్రత్యయం: ఇతర ప్రయోజనాలు
కొన్ని యితర భాషల్లో ద్వితీయా ప్రత్యయం కర్త కర్మల మధ్య సందిగ్ధ నివారణకే కాకుండా కర్మ పదాన్ని నిశ్చితంగా లేదా నిర్దిష్టంగా (definite or specific) సూచించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు హిందీలో ‘అను కితాబ్ నహీ పడేగి’ (अनु किताब नहीं पड़ेगी), ‘అను కితాబ్ కో నహీ పడేగి’ (अनु किताब को नहीं पड़ेगी) అనే వాక్యాల మధ్య అర్థస్ఫూర్తిలో కొద్దిగా తేడా వస్తుంది. మొదటి వాక్యం (‘కొ’ అనే ప్రత్యయం లేని వాక్యం) సామాన్యంగా పుస్తకాలన్నిటికీ వర్తిస్తే (అంటే పుస్తకాలు చదివే అలవాటు లేదు అన్న అర్థంలో), రెండో వాక్యం ప్రత్యేకమైన ఒక పుస్తకాన్ని చదవదు అని అర్థం ఇస్తుంది. అయితే ఇది కచ్చితమైన తేడా ఏమీ కాదు. సందర్భాన్ని బట్టీ అలవాటు బట్టీ ఉంటుంది. కానీ ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని స్పష్టంగా చెప్పేందుకు మాత్రం ‘కొ’ ప్రత్యయం తప్పనిసరి. ఉదాహరణకు ‘అను ఈ పుస్తకం చదవదు’ అనడానికి ‘అను ఇస్ కితాబ్ కొ నహీ పడేగి’ (अनु इस किताब को नहीं पड़ेगी) అనడం తప్పనిసరి. ‘అను ఇస్ కితాబ్ నహీ పడేగి’ అనే వాక్యం సరి కాదు. కన్నడంలాంటి ఇతర భారతీయ భాషలలో కూడా ఇది కనిపిస్తుంది. తెలుగులో మాదిరిగా కన్నడంలో కూడా చైతన్యాలకు తప్పనిసరిగా ద్వితీయా విభక్తి వస్తుంది, జడాలకు వైకల్పికం. అయితే జడాలకు ద్వితీయా ప్రత్యయం వాడితే సాధారణంగా ఆ కర్మ పదం ఒక నిర్దిష్ట వస్తువును సూచిస్తుంది. లేనప్పుడు నిర్దిష్ట వస్తువును కానీ సాధారణ వస్తువును కానీ సూచించవచ్చు. ‘నాను పుస్తక హుడుకుత్తిద్దేనె’ (నేను పుస్తకం వెతుకుతున్నాను) అంటే ఏదైనా పుస్తకం గురించి వెతుకుతున్నానని, ‘నాను పుస్తకవన్ను హుడుకుత్తిద్దేనె’ (నేను పుస్తకాన్ని వెతుకుతున్నాను) అన్నప్పుడు నిర్దిష్టమైన ఒక పుస్తకం గురించి వెతుకుతున్నానని అర్థస్ఫూర్తి వస్తుంది. పర్షియన్, టర్కిష్ వంటి ఇతర భాషల్లో జడ-చైతన్య విభాగం కన్నా, నిశ్చితమైన వస్తువులను సూచించడానికే ద్వితీయా ప్రత్యయం ఉపయోగింపబడుతుంది.
తెలుగులో ద్వితీయా ప్రత్యయం నిశ్చితమైన లేదా నిర్దిష్టమైన వస్తువును సూచిస్తుందని కచ్చితంగా చెప్పలేము. ‘ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకోండి’–‘ఒక గిన్నెలో కొన్ని పాలను తీసుకోండి’ అన్న వాక్యాల మధ్యన కానీ; ‘గిన్నెలో ఉన్న పాలను మరిగించండి’–‘గిన్నెలో ఉన్న పాలు మరిగించండి’ అన్న వాక్యాల మధ్యన కానీ అర్థభేదం లేదు. వీటి మధ్య ఏమైనా తేడా ఉందా?;’నేను పండు తిన్నాను’–‘నేను పండును తిన్నాను’. బహుశా, మొదటిది ఒక స్టేట్మెంట్, రెండోది ఒక జవాబు అని అనిపించే అవకాశం ఉంది. కానీ అంత కచ్చితంగా చెప్పలేం. పైకి స్పష్టంగా తెలియకపోయినా, అంతర్గతంగా ఏదయినా భేదం ఉన్నదేమో తెలీదు. జడాలకు ఏయే సందర్భాలలో ద్వితీయా ప్రత్యయం ఎక్కువగా ఉపయోగించబడిందో, ఏ సందర్భాలలో ఉపయోగించబడలేదో, కథలు వ్యాసాలవంటి వాటినుండి డేటా సేకరించి పరిశోధిస్తే ఏమైనా బయటపడవచ్చు. ప్రాంతాన్ని బట్టి కూడా ఈ విషయంలో భేదాలుండే అవకాశం ఉంది.
సారాంశం
ఈ విశ్లేషణ ద్వారా, ప్రపంచ భాషలన్నిటా కనిపించే DOM అనే లక్షణం తెలుగులో ఎలా పనిచేస్తుందో కొంత వివరంగా తెలుసుకున్నాం. ఈ చర్చ సారాంశం ఇది:
- ఒక వాక్యంలో కర్మను గుర్తించడానికి కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన ప్రత్యయం అవసరం అవుతుంది. కొన్ని సందర్భాలలో అవసరం కాదు.
- కర్త సాధారణంగా ఎప్పుడూ చైతన్యమే అవుతుంది. అంచేత కర్మ పదం కూడా చైతన్యమే అయినప్పుడు ఆ రెండిటి మధ్య స్పష్టత కోసం కర్మ పదానికి ఒక మార్కింగ్ అవసరం అవుతుంది. తెలుగులో అది ద్వితీయా విభక్తి ప్రత్యయ రూపంలో వచ్చి చేరుతుంది.
- కర్మ జడం అయినప్పుడు, సాధారణంగా కర్త కర్మల మధ్య అసందిగ్ధత ఉండదు. అందువల్ల జడమైన కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం లేకపోయినా ఇబ్బంది లేదు. ‘జడంబు ద్వితీయకు ప్రథమ’ రావచ్చుననే సూత్రం వెనక కారణం ఇదే.
- కొన్ని సందర్భాలలో క్రియను బట్టి జడమైన కర్మను కూడా చైతన్యంగానే భావించాలి. అలాంటి చోట్ల పై సూత్రం వర్తించదు. ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి అవుతుంది.
- కొన్ని సందర్భాలలో కర్త, కర్మ పదాలు రెండూ జడ పదాలే అయినప్పుడు వాటి మధ్య అసందిగ్ధత ఏర్పడుతుంది. అలాంటి చోట్ల కూడా పై సూత్రం వర్తించదు. అక్కడ కూడా ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి అవుతుంది.
- స్థూల వ్యవహారాన్ని బట్టి చూస్తే, తెలుగులో ద్వితీయా విభక్తి ప్రత్యయం నిర్దిష్టతను సూచిస్తుందనడానికి దాఖలాలు లేవు. సూక్ష్మంగా ఏమైనా ఉన్నదేమో పరిశోధించి తేల్చాల్సిన అంశం.
కొసమెరుపు
ఇప్పుడు, ఇంతటి దీర్ఘ విశ్లేషణను ప్రేరేపించిన అసలు కారణం చెప్తాను! ఈ డొంకంతా కదలడానికి కారణమైన తీగ, ‘వెలుంగర్చింతు’ అనే ఒక ప్రయోగం. అది విశ్వనాథవారి కల్పవృక్షంలో ఈ పద్యంలో కనిపిస్తుంది:
కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త
త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం
బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే
హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా
ఈ పద్యం విశ్వనాథ రచించిన విశ్వేశ్వర శతకంలో కూడా ఉంటుంది. ‘కైలాసాచల సానువాసము’ అని మొదలుపెట్టిన దగ్గరనుంచీ ‘దేహాలంకారిత లేలిహానము’ వరకూ అన్నీ శివుని సూచించే పదాలే. చివరకు, ‘వెలుంగర్చింతు విశ్వేశ్వరా’ అన్న దగ్గర క్రియ వచ్చింది. ‘అర్చింతు’ అనేది క్రియ. ‘వెలుగు’ కర్మ. కానీ దీనికి ద్వితీయా విభక్తి ప్రత్యయం లేదు, ఉంటే అది ‘వెలుంగునర్చింతు’ అవ్వాలి. ‘వెలుంగర్చింతు’ అనేదాన్ని యిప్పటి వాడుక రూపంలోకి మార్చుకుంటే ‘వెలుగు అర్చిస్తాను’ అని అవుతుంది. ఇది ‘రాయి పూజిస్తాను’ అనడం వంటిదే. బాలవ్యాకరణ సూత్రం ప్రకారం ఈ ప్రయోగం సరైనదే కావచ్చుగాక. కానీ నిజానికి అది సరికాదు, అన్వయంలో ఇబ్బంది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భాషాస్వరూపం దృష్ట్యా అది ఎందుకు సరైన ప్రయోగం కాదో ఈ వ్యాసంలో తెలుసుకున్నాం కదా! కల్పవృక్షంలో ‘నాది వ్యవహార’ భాష అని చెప్పుకున్నారు విశ్వనాథ. దానికి కారణం వ్యాకరణ సమ్మతం కాని ప్రయోగాలు కూడా చేయడమే. అయితే ఈ పద్యంలోని ప్రయోగం వ్యాకరణ సమ్మతమే అయినా భాష స్వభావానికి విరుద్ధం కావడం విశేషం!