ఈశ్వరునిలో అన్నియూ లీనము
41
లీనవిహవీశనలి సత్యగళు మిథ్యెగళు |
మానగళు మేయగళు ప్రకృతి మాయెగళు ||
భానగళభానగళు పూజ్యగళపూజ్యగళు |
సూనృతగళఘబీజ – మరుళ మునియ ||లీనమీశ్వరునిలో సత్యములు మిథ్యలును
మానములు మేయములు ప్రకృతి మాయలును
భానము లభానములు పూజ్యము లపూజ్యములు
సూనృత ములఘయోని – మంకుతిమ్మ
సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. అన్నియూ ఈశ్వరస్వరూపంలో ఆవిర్భవించి, అందులోనే నిలిచి, అక్కడే లీనమవుతాయి. ఈ సమస్త జగత్తులోని భూతాలు (ప్రాణులు, పదార్థాలు) దేని నుండి పుట్టాయో, పుట్టినవి ఏ శక్తి వల్ల నిలిచి జీవిస్తున్నాయో, చివరికి ఈ సర్వమూ దేనిలో కలిసిపోతుందో అదే బ్రహ్మము — “యతో వా ఇమాని భూతాని జాయంతే…” (తైత్తిరీయం). ఇది బ్రహ్మవస్తువుయొక్క నిర్వచనం. అది నిర్ద్వంద్వం. కనుక అందులో పైకి కనబడే అన్ని ద్వంద్వాలూ కరిగిపోతాయి. స్వప్నంలో పాప–పుణ్యాలు, భయ–సంతోషాలు మొదలైన భావాలను అనుభవిస్తాము. మేల్కొన్న తరువాత అవన్నీ మనసులోనే ఉద్భవించి అక్కడే లీనమయ్యాయని గ్రహిస్తాము. అదే విధంగా బ్రహ్మజ్ఞానియొక్క దృష్టిలో జగత్తు కేవలము బ్రహ్మస్వరూప ప్రతిభాసం మాత్రమే. సమస్తమూ ఈశ్వర మయము అనేది అభేదదృష్టి. సత్య–మిథ్య, జ్ఞాన–అజ్ఞాన, పుణ్య–పాపాలనే ద్వంద్వాలకు అభేదదృష్టిలో స్వతంత్ర సత్తా లేదు. అవన్నీ ఈశ్వర స్వరూపంలోనే స్ఫురించి చివరికి అక్కడే లీనమై నశిస్తాయి.
“సత్” అనగా “ఉన్నది” అని అర్థం. ఈ ప్రపంచము సృష్టికి పూర్వం సద్రూపంగానే ఉన్నదని — “సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్” అని ఛాందోగ్యోపనిషత్తు ప్రకటిస్తుంది. అక్కడ సత్య–మిథ్యాదులవంటి ద్వంద్వాలు లేవు. అదేమిటి? సత్–అసత్ పరస్పర విరుద్ధములు కావా? “అసత్” అంటే అసలే లేనిదని కాదు. తరంగము వేరుగా కనబడినా దాని అధిష్ఠానం సముద్రమే. దాని ఉనికి అధిష్ఠానముకన్నా భిన్నంగా లేదు. ఉన్న సముద్రమునే “తరంగము” అని వేరుగా చూస్తే అది మిథ్య. తరంగమనేది సముద్రాంశమే అని గ్రహించినపుడు అది సత్యము. తరంగమూ–సముద్రమూ రెండూ జలమే.
అలాగే ఉన్న సత్యమూ, కనబడే నామరూపముల మిథ్య — రెండింటికీ అధిష్ఠానము బ్రహ్మమే. వెలుగు–చీకటి, జ్ఞానం–అజ్ఞానం వంటి విభజనలు బ్రహ్మస్వరూపంలో లేవు. పరతత్త్వము తెలిసిన తరువాత, బ్రహ్మ మొదలుకొని సకల చరాచర జగత్తు — ప్రమాత (తెలుసుకునేవాడు), మానం (ప్రమాణము), మేయము (తెలుసుకోదగ్గది) మొదలైన సమస్తమూ హృదయకమలమునందు లీనమైపోవును: “దృష్టే తస్మిన్ పరే తత్త్వే ఆబ్రహ్మ సచరాచరం | ప్రమాతృమానమేయంచ ధ్యానహృత్పద్మకంపనం” (అద్వైత సంప్రదాయంలోని ప్రసిద్ధోక్తి)
విషయప్రపంచాన్ని కొలవడం “మానం”; కొలవబడేది “మేయం”. కొలవడం జ్ఞానేంద్రియాల కార్యం. ఇంద్రియాలకు ఆధారమైన చైతన్యం బ్రహ్మమే. కొలవబడే మిథ్యాపదార్థాలకు అధిష్ఠానమూ బ్రహ్మమే. భానం (వెలుగు)–అభానం (చీకటి) వాస్తవానికి రెండూ భిన్నములు కావు. అవి (చీకటి–వెలుగు) అజ్ఞానము–జ్ఞానముల సంకేతాలు మాత్రమే. జ్ఞానోదయం తరువాత అజ్ఞానం నశిస్తుంది అంటారు. “నాశం” అంటే అక్కడికక్కడే లయించుట. త్రాడులో కనిపించిన పాము, స్పష్టంగా పరిశీలించగా, అక్కడ ఉన్నది తాడే గాని పాము కాదని తెలుస్తుంది. కనిపించిన పాము ఏమైంది? అది త్రాడులోకి మళ్లీ వెళ్లిపోయిందా? కాదు. పాము అనేది ఎప్పుడూ ఉండలేదు. లేనిది ఉన్నట్టు కనబడుటే అధ్యాస. ఉన్నది ఒక్కటే. వెలుగు ఉన్న చోట చీకటి లేదు. భాన–అభానముల మాట కూడా అంతే. బ్రహ్మస్వరూపమందు వెలుగు–నీడల విభాగం లేదు. పూజ్య–అపూజ్యములు లేవు; శుభ–పుణ్యములు, అశుభ–పాపముల ద్వంద్వమూ లేదు. మనకు కనిపిస్తున్న చరాచర ప్రపంచము, ప్రకృతి, మన శరీరేంద్రియాలతో సహా అన్నీ ఒకే పరమసత్యమైన బ్రహ్మయొక్క విషయీకరణమాత్రమే. జగత్తులో ఉన్నదంతా యథార్థంగా బ్రహ్మమే — అంటున్నది ఛాందోగ్య మహావాక్యం — “సర్వం ఖల్విదం బ్రహ్మ”.
మంచి–చెడు అనే పేర్లు మన అనుకూలతకై పెట్టుకున్న వ్యవహారసత్యములు మాత్రమే; అది పారమార్థిక సత్యం కాదు. ఈ కాలంలో పూజామందిరమూ, శౌచగృహమూ ఒకే ఇంటిలో, మన అవసరార్థం విభజించి కట్టుకొంటాము. ఒకటి పవిత్రమని, మరొకటి అపవిత్రమని వ్యవహరించినా, రెండింటికీ అధిష్ఠానం ఒక్క ఇల్లే కదా! పవిత్ర ప్రసాదాన్ని భుజించినా అది జీర్ణమయ్యేది అన్నకోశంలోనే; దాని అధోభాగంలో మలకోశం ఉంటుంది. రెండూ సక్రమంగా పనిచేసినప్పుడే మంచి ఆరోగ్యస్థితిని అనుభవిస్తాము. శుద్ధ–మలిన వాయువు, రక్తసంచలనం, పదార్థాదులతో లోన జరిగే జీర్ణక్రియ — ఇవన్నీ జరిగేది ఒక్క శరీరంలోనే. అక్కడ ద్వంద్వభేదాలు లేవు. అలాగే మంచి–చెడులను వెలిగించేది ఒక్క చైతన్యమే. అదే సత్యం–మిథ్య, మానం–మేయం, జ్ఞానం–అజ్ఞానం, పూజ్యం–అపూజ్యం, పుణ్య–పాపములన్నీ లయమైన అవికార స్థితి.
శంకరులు రెండు సత్యస్థాయులను పేర్కొంటారు. ఒకటి వ్యావహారిక సత్యం. మరొకటి పారమార్థిక సత్యం. మంచి–చెడు, పవిత్రత–అపవిత్రత, పుణ్యం–పాపం ఇటువంటి భేదాలు వ్యవహారంలో అవసరం. లౌకికదృష్టికి అదే సత్యం. పారమార్థిక సత్యం ‘బ్రహ్మమొక్కటే’. మరి ద్వంద్వాలు? అవన్నీ కేవలం మాయాకల్పితాలు. ఉన్నదంతా ఒక్కటే. సర్వమూ ఆత్మయే అయినప్పుడు, అక్కడ ఎవరిని ఎవరు చూస్తారు? ఎవరిని ఎవరు తెలుసుకొంటారు? — “యత్ర త్వస్య సర్వమాత్మైవాభూత్ తత్ కేన కం పశ్యేత్, తత్ కేన కం విజానీయాత్” (బృహదారణ్యక ఉపనిషత్ 4.5.15).
అది “సత్యం–మిథ్య, మానం–మేయం, జ్ఞానం–అజ్ఞానం ఇవన్నీ లయమైన అవికార స్థితి”, నిర్గుణబ్రహ్మము. అది “నాన్తఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞమ్। అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచింత్యమ్ అవ్యపదేశ్యమ్ ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమ్ అద్వైతం — చతుర్థం మన్యంతే, స ఆత్మా స విజ్ఞేయః” — అనేది శ్రుతిఘోష (మాండూక్యోపనిషత్ 7).
(‘మిణుకు’ మొదటి భాగం రచన 1943లో జరిగింది. అప్పటికి డి.వి.జి. గారి వయస్సు 56 సంవత్సరాలు. ‘మిణుకు’ రెండవ భాగానికి మూలమైన ‘మరుళమునియన కగ్గ’ గ్రంథం ప్రచురితమైనది ఆయన పరమపదించిన తొమ్మిది సంవత్సరాల తరువాత. అంటే ఈ రెండవ భాగాన్ని డి.వి.జి. గారు తమ 72–88 సంవత్సరాల మధ్య రచించారు; మొదటి భాగాన్ని రచించిన ముప్పై సంవత్సరాల తరువాత. ఇంతటి ఘనీభూతమైన వేదాంతసారం ఈ గ్రంథంలో ఎందుకు నిండియున్నదో విజ్ఞులు గ్రహించగలరు.)
42
ఉదధియలి నదినదగళుదక భేదగళైక్య |
బదుకినలి మత(రీతి)భేదంగళైక్య ||
సదమలాత్మదొళెల్ల లోకభేదగళైక్య |
ఇదిరి గిహుదేకాత్మ – మరుళ మునియ ||ఉదధిలో నది నదోదక భేద మైక్యమగు
బ్రదిమిలో మతరీతి భేదమ్ము లైక్యం
సదమలాత్మునియందు లోకభేదములైక్య-
మెదురున్న దేకాత్మ – మంకుతిమ్మ
పూర్వాభిముఖంగా ప్రవహిస్తే అది నది; పశ్చిమాభిముఖంగా ప్రవహించే వాహినులు నదములు. నదులు, నదములు రెండూ కడలిలోనే (ఉదధి) కలిసిపోతాయి. నది–నదముల భేదం కడలి జలంలో ఉండదు. ఎన్నో నదీప్రవాహ జలములు చేరి ఒకే సాగరంగా నిలుస్తాయి. అదేవిధంగా, మతముల భేదములు, ఆచరణల వ్యత్యాసాలు, పరస్పర భిన్నమైన రీతినీతులు—ఇవన్నిటిని పక్కనబెట్టి మనుజుడు జీవితవ్యవహారాన్ని సాగిస్తున్నాడు. ఆ రీతిగా నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్తమైన ఆత్మలో ఈ లోకభేదములు అసలే ఉండవు. ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇది సర్వాత్మభావంతో ఆత్మదర్శనాన్ని అనుభవించిన కవివాక్కు.
నది, నదము అనే పేర్లతో, వాటి పథాలు, తీరాలు, ప్రవాహ–వేగ–భిన్నత్వం మొదలైన భేదాలు కనిపించినా, వాటన్నిటిలో ప్రవహించేది ఒకే జలం. గంగా, గోదావరి, కృష్ణా, కావేరి అనే పేర్లు వేరైనా, అవి సముద్రంలో కలిసిన తరువాత వాటి “జలభేదం” అనే మాట అర్థశూన్యం అవుతుంది. ఇదే ఉపమానాన్ని ఆధారంగా తీసుకొని “జీవితంలో మతభేదాలు ఐక్యం, పరమాత్మలో లోకభేదాలు ఐక్యం” అనే భావం అద్వైత వేదాంత సారాన్ని సుస్పష్టం చేస్తుంది. భేదం అనుభవంలో ఉన్నప్పటికీ, పరమార్థంలో అభేదమే సత్యం. జీవభేదాలు ఆత్మతత్త్వంలో లీనమవుతాయి.
భేదం మన ఇంద్రియమనోబుద్ధుల నిర్మితి; అది నామరూపాధారితం. నామరూపాలు ఉపాధులు; ఉపాధులు తొలగితే అవశేషంగా నిలిచేది చైతన్యమే. “వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం” అంటున్నది ఛాందోగ్యోపనిషత్తు. కుండ, ప్రమిద, కడవ, మూకుడు అనే ‘రూపం’ కేవలం మాటలకు, పేరుకు పరిమితం. వాటి అసలైన సత్యం మట్టి. పేరులన్నీ ఆ మట్టికి పెట్టినవే. మట్టి కుండకు ఎలా కారణమో, ఈ సృష్టికి కారణం ’బ్రహ్మము’. ఇదే విధంగా జగత్తు అనే నామరూపప్రపంచం బ్రహ్మతత్త్వంలో ఆధారపడిన వికారం మాత్రమే.
లోకంలోని మతభేదాలు కూడా ఇలాంటివే. మతాలు మనసుకు మార్గదర్శకాలు; అవి వివిధ సంస్కృతుల, భాషల, చారిత్రక పరిస్థితుల ప్రతిబింబాలు. కానీ వాటి అంతరంగ సారము ధర్మము, దయ, సత్యము, పరమసత్యాన్వేషణ. నదుల ప్రవాహాలు వేర్వేరైనా లక్ష్యం సముద్రమే అయినట్లు, మతాల మార్గాలు వేర్వేరైనా, వాటి లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమే. తర్కపరంగా పరిశీలించినా, అనేకత్వం ఒక ఆధారసత్యంపై నిలవాలి. ప్రతి వస్తువు “ఉంది” అనే భావాన్ని కలిగిస్తుంది. ఆ “ఉనికి” (సత్) అన్నది సమానంగా అన్నింటిలోనూ ఉన్నది. అది ’ఉన్నది’ అని గోచరించేది చైతన్యానికి. చైతన్యము లేకుండా ఏ అనుభవమూ సాధ్యం కాదు. అందువల్ల సత్–చిత్–ఆనందస్వరూపమైన ఆత్మనే సమస్తానికి ఆధారంగా అంగీకరించక తప్పదు. శాస్త్రాలు ఈ విషయాన్నే బోధిస్తాయి. తర్కం దీనిని సమర్థిస్తుంది; అనుభవము కూడా ఈ విషయాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. దీర్ఘనిద్రలో మనం నామరూపాలను అనుభవించకపోయినా “సుఖమహమస్వాప్సం – నేను సుఖంగా నిద్రపోయాను” అని మేల్కొన్న తరువాత అనుభవాన్ని గుర్తు చేసుకుంటాం. ఇది ఆత్మస్వరూపమైన ఆనందానికి సూచన.
ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు కూడా విశ్వంలోని పదార్థం మూలస్థాయిలో శక్తి–క్షేత్రాల ఏకత్వమని సూచిస్తున్నాయి. క్వాంటం స్థాయిలో కణాలు పరస్పరానుసంధానమై ఉన్నట్లు దర్శనమవుతుంది. ఇది వేదాంతంలోని “ఏకమేవాద్వితీయం” భావానికి అనుకూలంగా ఉన్నదని భావించవచ్చు. శాస్త్రం బాహ్యప్రపంచాన్ని పరిశీలిస్తే, వేదాంతం అంతఃచైతన్యాన్ని పరిశీలిస్తుంది. రెండూ సత్యాన్వేషణలే కాని, దృష్టికోణం భిన్నమైనది.
“లోకభేదాలు పరమాత్మలో ఐక్యం” అనే వాక్యంలో మన జీవనదృష్టిని మార్చే సందేశమున్నది. భేదబుద్ధి ద్వేషానికి మూలం; ఐక్యదర్శనం సమత్వానికి ఆధారం. జీవితరంగంలో మతభేదాలనూ, పద్ధతులనూ పొందికచేసుకొని మానవులు వ్యవహరించడానికి ఆస్కారమున్నది. నిత్యపరిశుద్ధమైన ఆత్మలో బాహ్యలోకభేదాలు ఉండవు. ఎదుటనున్నదంతా ఒక ఆత్మమాత్రమే.
43
ఎరడు పక్కగళు నిన్న జీవనద పాంథక్కె |
పరతత్త్వవొందు లోకద మాయెయొందు ||
తొరెయలాగదు నీనదావుదను నిచ్చముం |
మరెయ బేడొందనుం – మరుళ మునియ ||ఇరు ప్రక్కలుండు నీ జీవన పథమ్మునకు
పరతత్త్వమొకటి లోకపు మాయయొకటి
నిరసించలేవు నిశ్చయముగా రెంటినీ
మరువకేయొక్కటిని – మంకుతిమ్మ
మన జీవనపథానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి పరతత్త్వము మరియు మాయ. ఒకటి మార్పులు లేని పారమార్థిక సత్యం; మరొకటి నిత్యపరివర్తనశీలమైన వ్యావహారిక ప్రపంచమనే మాయ. నిశ్చలతత్త్వాన్ని మరచితే మాయలో పడి, అహంకార–మమకారాలు, రాగ–ద్వేషాలతో, వ్యావహారికమే పరమసత్యమనే భ్రమతో జీవితం నరకసదృశమవుతుంది. పరతత్త్వాన్ని విస్మరించని వ్యావహారిక దృష్టితో గడిచిన జీవితం ఒక క్రీడవలె సుఖంగా సాగుతుంది.
లోకమాయను తెలుసుకోక ఆ పరతత్త్వాన్ని గ్రహించలేము. ఈ జగత్తు, జీవము మిథ్యయని పరమార్థం చెప్పినా, ఆ జ్ఞానాన్ని గ్రహించి మాయను ఛేదించడానికి సాధన అత్యవవసరం. ఆ సాధన చేసేది ఎవరు? జీవుడే. దేనితో సాధన? శరీరంతోనే. జాగృతావస్థలోనే సాధన సాధ్యం; స్వప్న, సుషుప్తి స్థితులలో కాదు. దేనినైననూ గ్రహించాలంటే శరీరమనే మాధ్యమం అవసరం. అందువల్ల పారమార్థిక వస్తుతంత్రమైన బ్రహ్మవస్తువునూ, మాయాతంత్రమైన వ్యావహారికమునూ—ఈ రెండింటిలో ఏ ఒక్కటినీ విస్మరించరాదు.
ఉపనిషత్తులలోని మహావాక్యాలు జీవాత్మ–పరమాత్మ ఐక్యాన్ని ప్రతిపాదిస్తాయి. “జీవో బ్రహ్మైవ నాపరః” — జీవుడే బ్రహ్మ అని చెప్పేది పారమార్థిక సత్యం. అనుభవపరంగా అజ్ఞానవశాత్ ఏర్పడిన ద్వైతభ్రాంతిని నివారించడమే మోక్షమని ఉపదేశిస్తాయి. సృష్టిలో ప్రతి అంశమూ పరబ్రహ్మప్రకాశమే. పరతత్త్వాన్వేషణ అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదు; ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా దర్శించడం. అయితే ప్రపంచప్రీతి లేకుండా పరతత్త్వజ్ఞానం అసంపూర్ణం. జగత్తును మాయగా మాత్రమే చూసి దానిని విస్మరించడం శంకరాచార్యుల ఉద్దేశం కాదు. ఆయన గీతాభాష్యంలో లోకసంగ్రహభావాన్ని స్పష్టంగా వివరించారు. “లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి” అనే గీతావాక్యంపై ఆయన చేసిన వ్యాఖ్యానంలో, జ్ఞాని కూడా లోకక్షేమార్థం కర్మను ఆచరించాలి అని పేర్కొన్నారు. “ఈశావాస్యం ఇదం సర్వం… తేన త్యక్తేన భుంజీథా…” అనే వాక్యం పరతత్త్వజ్ఞానం మరియు ప్రపంచప్రీతి సమన్వయానికి మూలసూత్రం. “త్యాగంతో అనుభవించు” అని చెప్పడం ద్వారా, లాలసత్వంలేక ప్రపంచంలో జీవించమని ఉపదేశం. ఇది ప్రపంచనిరాకరణ కాదు; ప్రపంచాసక్తి నిరాకరణ. జగత్తును వ్యావహారిక సత్యంగా అంగీకరించిన శంకరులు సూత్రభాష్యంలో “అజ్ఞాననివృత్తి ద్వారానే మోక్షం; కర్మలచే కాదు” అన్నారు.
పరమార్థదృష్టిలో జగత్తు మిథ్య అయినా, వ్యావహారికదృష్టిలో అది సత్యస్వరూపమే. అందువల్ల ప్రపంచప్రీతి వ్యావహారిక స్థాయిలో ధర్మబద్ధమైన జీవనానికి మూలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన కర్మయోగం పరతత్త్వజ్ఞానం మరియు ప్రపంచప్రీతి సమన్వయానికి ఉదాహరణ. నైష్కర్మ్యసిద్ధి గ్రంథంలో సురేశ్వరాచార్యులు జ్ఞానం కర్మకు విరుద్ధం కాదని, శుద్ధబుద్ధితో చేసిన కర్మ జ్ఞానసిద్ధికి సహాయకమని పేర్కొన్నారు. ఇది జీవన ద్విపార్శ్వసూత్రాన్ని బలపరుస్తుంది. ఒక వైపు అంతర్ముఖత—ఆత్మవిచారం; మరొక వైపు బాహ్యముఖత—సేవ, ప్రేమ, కర్తవ్యనిర్వహణ. ఈ రెండింటి సమతుల్యతే సమగ్ర జీవితం. అద్వైతం చివరికి విభిన్నత్వంలో ఐక్యతను దర్శించడమే. పరతత్త్వాన్వేషణ మనకు ఆధ్యాత్మిక ఆధారాన్ని ఇస్తుంది; ప్రపంచప్రీతి మన జీవనానికి నైతిక దిశను ఇస్తుంది. ఒకటి లేకపోతే మరొకటి అసంపూర్ణం. పరతత్త్వం మాత్రమే ఉంటే జీవితం నిర్జీవమైన తపస్సుగా మారుతుంది; ప్రపంచప్రీతి మాత్రమే ఉంటే జీవితం అస్థిరమైన ఆసక్తుల వలయంలో చిక్కుకుంటుంది. రెండూ సమన్వయమైతే జీవితం సార్థకమైన సాధనగా వికసిస్తుంది.
తర్కపరంగా చూస్తే మనిషి రెండు స్థాయిల్లో జీవిస్తాడు: అంతఃస్వరూపం—చైతన్యరూపమైన సాక్షి; బాహ్యవ్యవహారమంటే శరీర–మనస్సుల ద్వారా ప్రపంచంతో సంబంధం. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని నిరాకరించడం అసంపూర్ణతకు దారి తీస్తుంది. కేవలం పరతత్త్వాన్వేషణలో మునిగితే కరుణాహీనత్వ ప్రమాదం; కేవలం ప్రపంచప్రీతిలో మునిగితే అస్థిరత్వం, దుఃఖం తప్పదు. అనుభవపరంగా ధ్యానసాధన చేసినవారిలో సహానుభూతి, సమత్వం పెరుగుతాయని ఆధునిక మనోవిజ్ఞాన పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతర్ముఖతే బాహ్యప్రేమకు పునాది. మనిషి అంతర్గతంగా బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ, బాహ్యంగా ప్రపంచంతో ప్రేమపూర్వకంగా, ధర్మబద్ధంగా జీవించాలి. ఇదే శాస్త్రసమ్మతం, తర్కసమ్మతం, అనుభవసిద్ధం. పరతత్త్వం మన అసలు స్వరూపమైతె, ప్రపంచప్రీతి మన స్వరూపప్రకాశం. ఈ రెండు పార్శ్వాలను మరువకుండా జీవనయాత్ర సాగాలి అంటున్నాడు కవి.
44
లోక జీవనదొళేకీభవిసుతం ప్ర-|
త్యేక తానెంబెణికెగెడెగొడదె మనది ||
సాకల్య లోకదలి తన్నతాం మరెతిర్ప |
నాకాశదిం మేలె – మరుళ మునియ ||లోకజీవనమునం దేకీభవించి ప్ర-
త్యేకుడేనను భావమును వీడి మదిని
సాకల్య లోకాన తనను మరచినవాడు
ఆకసమ్మును మీరు – మంకుతిమ్మ
లోకజీవనంలో ఏకీభవించి, తాను ప్రపంచానికన్నా వేరు అనే భావానికి మనస్సులో తావునీయక, సకల లోకాలలో తననే తాను మరచినవాడు ఆకాశానికంటే ఉన్నతుడు. సామాన్యంగా పారమార్థిక చింతనలో మాత్రమే మునిగినవాడు లోకజీవనాన్ని విస్మరించి అపూర్ణుడు కాగలడు. లోకజీవన వ్యవహారప్రపంచపు మాయలో పడినవాడు పారమార్థికతను మరచి భ్రమలోనే జీవిస్తాడు. నిజమైన జ్ఞాని లోకజీవనాన్ని తృణీకరించడు; ఇవన్నీ మాయ అంటూ కర్మలను మానడు.
జ్ఞాని, మాయాప్రపంచంలో తన వంతు కూడా ఉన్నదని గ్రహించి, దానితో ఏకీభవించి, తాను వేరు, ప్రపంచము వేరు అనే ప్రత్యేకతాభావాన్ని మనస్సులోనుండి తొలగించి, అందరితో ఏకమై, తాను భిన్నుడనే భావన లేకుండా జీవించును. లోకజీవనంలో ఆత్మతత్త్వాన్ని, ఆత్మతత్త్వంలో భాసించే లోకమాయను ఒకటిగానే దర్శించి, సకలమూ తానేనని అనుక్షణమూ ఆనందిస్తాడు. లోకక్రీడలలో మమేకమై, అంతరంగ–బహిరంగ భిన్నత్వం లేకుండా అఖండతత్త్వంలో నిలిచి, తనను తానే మరచిన జ్ఞాని ఆకాశముకంటే ఉన్నతుడు.
ఈ పద్యంలోని “లోకజీవనములో ఏకీభవించి” అన్న భావం గీతాతత్త్వానుసారమూ, శంకరభాష్యానుసారమూ జ్ఞానియొక్క జీవనశైలిని తెలియజేస్తుంది. శంకరాచార్యులు గీతాభాష్యములో జ్ఞానిని “లోకవత్ వ్యవరతి” అని పేర్కొన్నారు. అతడు లోకంలో ఇతరులవలెనే నడుచును; కాని అతని అంతరంగములో భేదబుద్ధి ఉండదు. ఆకాశం ఘటాకాశ, మఠాకాశ రూపములలో కనిపించినా, తత్త్వతః అది విభిన్నం కాదు. అలాగే జీవుడు, జగత్, ఈశ్వరుడు అనే త్రయం అవిద్యావస్థలో వేరుగా అనిపించినా, స్వరూపదృష్ట్యా ఒకటే.
“ప్రత్యేకుడేనను భావమును వీడి” – తాను ప్రపంచానికన్నా వేరే అనే భావానికి మనస్సులో తావునీయక” అనే పద్యభాగం, అద్వైతసిద్ధాంతం పేర్కొనే అహంకారనివృత్తిని సూచిస్తుంది. మనస్సే ద్వైతానికి ఆధారం. మాండూక్యకారికలో గౌడపాదాచార్యులు “మనోదృశ్యం ఇదం ద్వైతం” అన్నారు. మనస్సు ప్రక్షేపించినదే ఈ ద్వైతప్రపంచం. మనస్సు శాంతించినపుడు ద్వైతం అంతరించిపోతుంది. యోగవాసిష్ఠంలో కూడా “మనః కల్పితం జగత్” అని స్పష్టముగా చెప్పబడింది. “సాకల్య లోకాన తనను మరచినవాడు” – ఇది అహంకారస్వరూపమైన ‘నేను’ భావం లయించిన స్థితిని సూచిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో “యత్ర హి ద్వైతమివ భవతి, తదితర ఇతరం పశ్యతి… యత్ర త్వస్య సర్వమాత్మైవాభూత్ తత్ కేన కం పశ్యేత్” అని చెప్పబడినది. ద్వైతభావం ఉన్నంతవరకు పరస్పరదర్శనం, భయం, రాగద్వేషాలు ఉంటాయి. కానీ సర్వం ఆత్మరూపమై అనుభూతమైనపుడు, భేదమనే భావం లేనప్పుడు, ఎవరు ఎవరిని చూడగలరు? పోతన ఈ భావాన్ని భక్తిగా మార్చి అద్భుతంగా వ్యక్తపరచాడు:
లోకస్థులు తెగినతుది నలోకంబౌ పెం–
జీకటి కవ్వల నెవ్వం డే–
కాకృతి వెలుగు నతనినే సేవింతున్!
(సృష్టిలోని లోకాలు, లోకపాలకులైన దేవతలు, లోకంలోని జీవులు, సర్వమూ ప్రళయకాలలో లయమైనప్పుడు (తెగిన అనే పదం-మహాప్రళయ సంకేతం), దట్టమైన చీకటిలాంటి స్థితికి (మాయ) అవతల, ఏ నిర్గుణ పరమాత్మ ఆత్మస్వరూపం వెలుగుతుంటాడో ఆ హరిని భజిస్తాను.)
“ఆకాశానికంటే ఉన్నతమైనవాడు” అనే ఉపమానం అత్యంత గంభీరమైనది. ఆకాశం సర్వవ్యాపకము, నిర్మలము, నిర్లేపము. అయినప్పటికీ అది దృశ్యజగత్తులో భాగమే. కానీ ఆకాశమునకు సాక్షిగా నిలిచే చైతన్యము/ఆత్మ దానికంటే ఉన్నతమైనది. తైత్తిరీయోపనిషత్తు ఆనందమీమాంసా ప్రకరణంలో బ్రహ్మానందమును అనిర్వచనీయం అన్నది. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అని బ్రహ్మస్వరూపాన్ని నిర్వచించింది. అనంతత్వమే ఆకాశానికంటే ఉన్నతమైనదని భావం.
శాస్త్రానికి, తర్కానికి, అనుభవానికి ఈ సిద్ధాంతం అన్వయించుట గమనార్హం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు విశ్వమంతటా ఉన్న ’పదార్థం – శక్తి’ (matter and energy) పరస్పర సంబంధముతోనే ఉన్నాయని తెలియజేస్తున్నాయి. క్వాంటం భౌతికశాస్త్రంలో పరిశీలకుని పాత్ర ప్రధానమని చెప్పబడుతుంది. పరిశీలకుడు లేకుండా పరిశీలన అసంభవం. అద్వైతం కూడా సాక్షిచైతన్యాన్నే పరమసత్యంగా స్థాపిస్తుంది. అనుభవపరంగా చూసినచో, సుఖదుఃఖాదులు మనస్సులోనే ఉద్భవించి లయిస్తాయి; కానీ వాటికి సాక్షిగా నిలిచే చైతన్యము మార్పులేనిది. కాబట్టి, లోకజీవనములో ఏకత్వభావంతో, ద్వైతరహితచిత్తంతో, సాక్షి దృష్టితో జీవించువాడే నిజమైన మహాత్ముడు; అతడు ఆకాశానికంటే ఉన్నతుడు
45
క్షణ వమూర్తానంత కాలదుపకృతి మూర్తి |
కణ వమేయాది వస్తువిన మేయముఖ ||
క్షణికవనుపేక్షిపెయ? గమకవదనంతక్కె |
అణు మహత్ప్రతినిధియొ – మరుళ మునియ ||క్షణ మమూర్తానంత కాలోపకృతి మూర్తి
కణ మమేయాది వస్తువుకు మేయముఖం
క్షణికమును త్రోసెదవ? గమకమది పరమునకు
అణు మహత్ప్రతినిధిర- మంకుతిమ్మ
“క్షణము కనిపించని నిరాకారం; అయితే క్షణమే కాలానికి ఉపకారం చేయునట్టిది” అనే పద్యసారం కాలతత్త్వంపై అత్యంత సూక్ష్మమైన దర్శనాన్ని సూచిస్తుంది. క్షణం మన ఇంద్రియాలకు ప్రత్యక్షంగా కనిపించదు; దానికి రూపం లేదు, వర్ణం లేదు, పరిమాణం లేదు. అయినప్పటికీ మనం ‘కాలం’గా అనుభవిస్తున్న మహత్తర ప్రవాహం ఈ కనరాని క్షణాల సమాహారమే. అణువుల సమూహమే స్థూల పదార్థమైతే, క్షణాల సమన్వయమే కాలప్రవాహం. కనుక క్షణం స్వల్పమని భావించి, దానిని ఉపేక్షించడం తత్త్వదృష్టికి విరుద్ధం.
అద్వైత వేదాంతం ప్రకారం కాలం కూడా మాయోపాధిగా బ్రహ్మనిష్ఠ చైతన్యంలో ఆవిర్భవించిన ఒక అవస్థ. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అనే బ్రహ్మస్వరూప నిర్వచనంలో “అనంతం” అనే పదం కాలపరిమితిని అధిగమించిన సత్యాన్ని సూచిస్తుంది. బ్రహ్మము కాలానికి లోబడదు; కాలమే బ్రహ్మచైతన్యం ఆధారంగా మన అనుభవానికి వస్తుంది. శంకరులు తమభాష్యంలో కాలాన్ని ఉపాధిగా పేర్కొని, అది స్వతంత్ర సత్త్వం కాదు, అవిద్యావశాత్తు అనుభూతమవుతున్నదని వివరిస్తారు. కాలం భూత, భవిష్యత్, వర్తమాన విభాగాలను కల్పిస్తుంది; కాని ఆ విభాగం చైతన్యానికి స్వాభావికం కాదు.
కణము మేయము–అమేయము అనే గమ్యానికి మమ్మల్ని కొనిపోతుంది. మేయము అంటే ప్రమాణాలకు లోబడిన, తెలిసే పదార్థం. అమేయము అంటే ప్రమాణాతీతమైన, ఇంద్రియాలకు అతీతమైన సత్యం. కనబడే ప్రతి కణమూ (మేయము) కనిపించని సద్వస్తువుయొక్క (అమేయము) సాకారము. మనం మేయపదార్థాలతో వ్యవహరిస్తూనే ఉంటాం; కాని మన దృష్టిని అంతర్ముఖం చేస్తే అమేయమైన ఆత్మస్వరూపాన్ని దర్శించగలము. గ్రహతారలను మనం గణించవచ్చు; జీవరాశులను లెక్కపెట్టవచ్చు. ఇవన్నీ మేయములు, అనగా ప్రమాణంతో కొలవబడేవి. కొలతకు అందనిది అమేయం; అప్రమేయమన్నా అదే. కణమే అమేయ వస్తువైన బ్రహ్మమునకు మేయముఖం; కొలతకు చిక్కని బ్రహ్మముయొక్క బింబమే మేయప్రపంచం. విశ్వసృష్టిలోని కణాన్ని ఆలోచిస్తూ అమేయమైన సత్యాన్ని అన్వేషించాలి. ఈ జగత్తు క్షణికమని ఉపేక్షించరాదు; ఈ క్షణికత్వమే అనంతతత్త్వాన్ని నిరూపించే గమకం (నిరూపణజేయునది). శరీరం క్షణికమైనా, జగత్తు మిథ్యయైనా సాధన ఇక్కడినుండే ప్రారంభం కావాలి. జీవజగత్తులను విస్మరిస్తే పరమార్థం అర్థంకాదు. మాండూక్యోపనిషత్తులో “అయమాత్మా బ్రహ్మ” అనే మహావాక్యం ప్రతి క్షణాన్నీ ఆత్మసాక్షాత్కారానికి ద్వారంగా నిలుపుతుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు నిత్యమూ మారుతున్నా, వాటిని సాక్షిగా దర్శించే తురీయ చైతన్యం స్థిరమైనది. ఆ సాక్షి దృష్టిలో ప్రతి క్షణమూ బ్రహ్మసన్నిధానమే.
ఆధునిక భౌతికశాస్త్రం ప్రకారం పదార్థమంటే నిరంతర మార్పులో ఉన్న శక్తి. పరమాణువులోని కణాలు క్షణక్షణమూ చలనం చెందుతున్నాయి. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ‘ప్లాంక్ టైమ్’ అనే అతి సూక్ష్మ కాలఘట్టం ఉంది; దానికన్నా చిన్న విభాగంలో భౌతిక నియమాలే వర్తించవు. ఇది కాలం నిరంతర స్రవంతి కాదని, క్షణిక విభాగాల సమాహారమని సూచిస్తుంది. ఆ క్షణాన్ని మనం ఉపేక్షించరాదు. మనం తరచూ భూతకాల స్మృతుల్లో లేదా భవిష్యత్ ఆలోచనల్లో నిమగ్నులై వర్తమాన క్షణాన్ని కోల్పోతుంటాం. కానీ అనుభవానికి అందుబాటులో ఉన్నది ఒక్క వర్తమానమే. “ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత” — మేల్కొని జ్ఞానాన్ని గ్రహించుమని కఠోపనిషత్ ఉపదేశిస్తుంది. ఈ మేల్కొలుపు భవిష్యత్తులో కాదు; ఇదే క్షణంలో ఏర్పడాలి.
క్షణం యుక్తముగా ఉపయోగించబడినప్పుడు అది అనంతానుభూతికి వేదిక కాగలదు. ధ్యానంలో మనస్సు విరమించిన ఒక్క క్షణమే ఆత్మసాక్షాత్కారానికి కారణమవుతుంది. జ్ఞానం ఉద్భవించేది కూడా ఒకే క్షణంలో — అవిద్యా నాశనక్షణంలో. ఆ క్షణం అనంతానికి ద్వారం.
మహాభారతంలో యుధిష్ఠిరుని ప్రశ్నిస్తూ యక్షుడు “కిమాశ్చర్యమ్?” అని అడిగినప్పుడు, యుధిష్ఠిరుడు ఇలా సమాధానమిచ్చాడు: “అహన్యహని భూతాని గచ్ఛంతి యమమందిరం; శేషాః స్థిరత్వమిచ్ఛంతి” — ప్రతి రోజూ ప్రాణులు యమలోకానికి వెళ్తూనే ఉన్నా, మిగిలినవారు తాము శాశ్వతులని భావిస్తారు, ఇదే ఆశ్చర్యకరమైనది అంటాడు. ఈ వాక్యం ప్రతి క్షణపు విలువను గుర్తుచేస్తుంది. క్షణాన్ని సద్వినియోగం చేసేవారే జీవనార్థాన్ని గ్రహిస్తారు. కనుక మన జీవనసాధనలో ప్రతి క్షణాన్ని జాగరూకతతో, ధ్యానస్ఫూర్తితో, ఆత్మవిచారణతో నింపుకోవాలి. ఎందుకంటే క్షణమే కాలానికి ఉపకారం; క్షణమే అనంతానికి ద్వారం; క్షణమే బ్రహ్మకు మహత్తర ప్రతినిధి.
పోల్ వాల్ట్ క్రీడలో కర్రను నేలపై ఉంచి, పైకెగిరి, పట్టుకున్న ఆ కర్రను విడిచే క్షణంలోనే అటుప్రక్కకు దూకగలుగుతాం. కర్రలేనిదే అంత ఎత్తుకు ఎగరలేము; కర్రను పట్టుకునే ఉంటే దాటలేము. ఆ లంఘనానికి పట్టువిడుపుల కర్ర అవసరం. జీవజగత్తులూ అట్లే పరమార్థానికి సాధకాలు. అందువల్ల అణువైనా అది బృహత్తుకు ప్రతినిధి. కణమును, క్షణమును విస్మరించరాదు.
46
ఈశనిచ్ఛె సముద్ర నీనదరొళొందు కణ |
లేశదొళగరసువెయ రాశియమితవను ? ||
రాశియెల్లవ కాణ్బొడదరొళగె కరగి బెరె |
నాశవక్కె పృథక్త్వ – మరుళ మునియ ||ఈశునిచ్ఛ సముద్రమందు నీవొక కణము
లేశమున వెదకెదవ రాశి యమితమును?
రాశినంతయు చూడ దిగి కరగి దానిలో
నాశిత పృథక్త్వుడగు- మంకుతిమ్మ
ఈశ్వరుని ఇచ్ఛ సాగరమువంటిది. ఆ కడలిలోని ఒక్క కణమే నీవు. లేశమైన కణములో అమితమైన జలరాశిని వెదికెదవా? “లహరీ ఢూంఢే లహర్ కో, కపడా ఢూంఢే సూత్, జీవా ఢూంఢే బ్రహ్మ కో, తీనోం ఊత్ కే ఊత్” (కబీర్) – ’కడలి తరంగాన్ని వెదుకుతుంది, వస్త్రము దారాన్ని వెదుకుతున్నది, జీవుడు బ్రహ్మాన్ని వెదుకుతున్నాడు. ముగ్గురూ మూర్ఖులే’ అంటాడు కబీర్దాస్. వెదికే తరంగము కడలిలోనే ఉన్నది. వస్త్రం వెదికే పోగు దానియందే ఉన్నది. జీవుడు వెదికే దైవము వానిలోనే ఉన్నాడు. కడలికి తరంగమూ, వస్త్రానికి దారమూ, జీవునికి బ్రహ్మమూ భిన్నంకాదు. కడలిలోని జలరాశినంతా చూడవలెనన్న, ఆ కణము ఆ జలరాశిలో కరగి ఒక్కటికావలె. అసలుకది వేరుగా లేనేలేదు. తాను ప్రత్యేకము అనే పృథక్త్వము నశించాలి. అప్పుడు అపూర్ణత మాయమై స్వరూపమైన పూర్ణత గుర్తుకు వస్తుంది.
వ్యక్తి–ఈశ్వర సంబంధాన్ని సూచించడానికే ఈ సాగర–తరంగ ఉపమానం వేదాంతసారాన్ని అతి సులభంగా, కానీ అత్యంత గంభీరంగా వ్యక్తపరుస్తుంది. ఇది భక్తికి మాత్రమే సంబంధించిన భావుకవాక్యం కాదు; ఇది తత్త్వశాస్త్రానికి, తర్కానికి, అంతర్గత పరిశీలనకు నిలువెత్తు ఆధారమైనది. ఇందులో వ్యక్తమైన ప్రధానాంశం — వ్యక్తి అనే భావన స్వతంత్ర వాస్తవం కాదు; అది పరబ్రహ్మస్వరూపమైన పూర్ణచైతన్యంలోని ఉపాధిజన్య ప్రతిభాసం మాత్రమే. తాను ప్రత్యేకము అనే పృథక్త్వభావమే బంధనానికి మూలం; ఐక్యస్వరూపజ్ఞానమే విముక్తి.
సాగరంలో ఉద్భవించిన తరంగం, నురుగు, బుడగ — ఇవన్నీ జలమే. తరంగం “నేను వేరే, సాగరం వేరే” అని భావించినంతకాలం అది పరిమితిలో పడి, భయం, అస్థిరతలకు లోబడుతుంది. కానీ తన స్వరూపం జలమేనని గ్రహించిన క్షణంలో, అది సాగరంతో భిన్నం కాదని తెలుస్తుంది. వ్యక్తికి తన పరమస్వరూపాన్ని గుర్తుచేసే ఛాందోగ్యోపనిషత్తులోని “తత్త్వమసి, శ్వేతకేతో..”, అలాగే వ్యక్తి–బ్రహ్మ ఐక్యాన్ని ప్రత్యక్షంగా ప్రతిపాదించే బృహదారణ్యకోపనిషత్తులోని “అహం బ్రహ్మాస్మి” — ఇవన్నీ లక్ష్యార్థంలో గ్రహించవలసినవే. ఉపాధి–భేదాన్ని తొలగించి స్వరూపాన్ని అవగాహన చేయడమే వీటి ఉద్దేశ్యం.
పృథక్త్వభావం అవిద్య యొక్క ప్రతిభాసం. వ్యక్తి తనను శరీరము, మనస్సు, ఇంద్రియాల సమూహంగా భావించటం అవిద్య. శంకరులు సూత్రభాష్యంలో — “అధ్యాసో నామ స్మృతిరూపః పరత్ర పూర్వదృష్టావభాసః” అన్నారు. అంటే, ఒకదాని లక్షణాలను మరొకదానిపై ఆరోపించడం అధ్యాస. ఆత్మ నిర్గుణం, నిరవయవం, నిత్యం; కానీ మనం దానికి దేహధర్మాలను ఆరోపించి “నేను క్షీణించాను, నేను బాధపడుతున్నాను” అంటాము. కఠోపనిషత్తు “నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామేకో బహూనాం యో విదధాతి కామాన్” (మనం — జీవాత్మలు — నిత్యులమే, కానీ పరమాత్ముడు ‘నిత్యులలో నిత్యుడు’ — అత్యంత శాశ్వతుడు. మనం చైతన్యం కలిగినవారమే, కానీ ఆయన ‘చైతన్యాలన్నింటిలో చైతన్యం’ — పూర్ణ జ్ఞానస్వరూపుడు) — అని పరమాత్మ స్వరూపాన్ని ప్రకటిస్తుంది. ఈ చైతన్యం వ్యక్తికి వేరుగా లేదని గ్రహించడమే జ్ఞానం.
“కణము ఆ జలరాశిలో కరిగి ఒక్కటిగా కావలె” అని ఉపమానంలో చెప్పబడినది రూపనాశనం కాదు; పృథక్త్వభావనాశనం. జ్ఞానం అంటే కరిగిపోవడం కాదు — గుర్తించుకోవడం. తరంగం కరిగిపోతే జలం మిగులుతుంది; కానీ నిజానికి తరంగం ఎప్పుడూ జలమే. అదేవిధంగా జీవుడు బ్రహ్మతో కలవడు; అతడు ఎప్పుడూ బ్రహ్మస్వరూపుడే. అవిద్యానివృత్తి వల్ల అది ప్రత్యక్షమవుతుంది. ముండకోపనిషత్తు “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” అని చెప్పినప్పుడు, జ్ఞాని కొత్తగా బ్రహ్మ అవుతాడని కాదు; తన అసలైన స్వరూపాన్ని గ్రహిస్తాడని అర్థం. శంకరులు దీన్ని ఇలా స్పష్టపరిచారు — జ్ఞానం ఉత్పత్తి కాదు; ఆవరణనివృత్తి జరుగుతుంది. “యథా తరంగో నామ్నా భిన్నో జలాదపి” — పేరుతో భిన్నంగా అనిపించినా స్వరూపంగా జలమే (యోగవాసిష్ఠము).
అనుభవంతో పరిశీలిస్తే — స్వప్నంలో అనేక వస్తువులు కనిపిస్తాయి; మేల్కొన్నప్పుడు అవన్నీ మానససృష్టి అని తెలుస్తుంది. అదేవిధంగా జాగ్రత్-ప్రపంచం కూడా చైతన్యప్రతిబింబమే. అయినా వ్యక్తి తనను వేరుగా, అపూర్ణుడిగా భావిస్తాడు. అపూర్ణత అనేది మానసిక మాయ. వ్యక్తి తనను పరిమితంగా భావించినంతకాలం అపూర్ణత అనుభవంలో ఉంటుంది. కోరికలు, భయాలు, అసూయలు — ఈ పరిమితిభావం నుంచే ఉద్భవిస్తాయి. కానీ ఉపనిషత్తులు పూర్ణత్వాన్నే ప్రకటిస్తాయి. పూర్ణం నుంచి పూర్ణం ఉద్భవించినా పూర్ణమే మిగులుతుంది. ఈ వాక్యం తర్కాతీతమైనా, తత్త్వార్థంగా లోతైనది: పూర్ణమైన చైతన్యమే ప్రతి వ్యక్తిగా ప్రతిఫలిస్తుంది.
వ్యక్తి నుండి విశ్వం — విశ్వం నుండి స్వరూపం — ఇదే సాధనక్రమం. సాగరంలోని కణం సాగరాన్ని వెదకదు; ఎందుకంటే అది సాగరమే. తరంగం ఎక్కడికి వెళ్లినా జలమే. అదేవిధంగా జీవుడు ఎంత శోధించినా, తుదకు తెలుసుకోవలసింది తన అంతఃస్వరూపాన్నే. “యత్ సాక్షాదపరోక్షాద్బ్రహ్మ” — ప్రత్యక్షానుభవసిద్ధమైన చైతన్యము వేరుగా పొందవలసిన పదార్థం కాదు. శ్రవణ–మనన–నిదిధ్యాసనల ద్వారా అధ్యాసనివృత్తి సంభవిస్తుంది. ఆత్మస్వరూపం స్వయంసిద్ధం. అది అనుభవించాల్సిన కొత్త వస్తువు కాదు – అవిద్య తొలగితే ప్రత్యక్షమయ్యే సత్యం.
తానొక వ్యక్తి అనే భావన పరిమిత ఉపాధిజన్యం. ఈ అపూర్ణతానుభవమే అవిద్య; అసలు స్వరూపం పూర్ణచైతన్యసముద్రమే. పూర్ణత్వానుభవమే జ్ఞానం. పృథక్త్వమనే మాయ నశించినప్పుడు అపూర్ణత అంతరించి, స్వరూపమైన పూర్ణత స్ఫురిస్తుంది. తరంగం సాగరమే; కణం జలమే; జీవుడు బ్రహ్మస్వరూపుడే. తెలుసుకోవలసిన కొత్తదేమీ లేదు — గుర్తించవలసింది తన అసలైన పూర్ణత్వాన్ని. ఆ జ్ఞానం కలిగినప్పుడు, వెదికిన తరంగమే వెదుకబోయిన సాగరమని తెలియబడుటయే స్వస్వరూపానుసంధానం.
47
ఏకదిననేకగళు సాకారనామగళు |
లోకవిదు నోడె నీం (కృత్స్న దర్శనదిం) ||
ఏకదొళ్ నీను సాకల్యవన్ననుభవిసె |
సాకల్యయోగవదు – మరుళ మునియ ||ఏకము ననేకములు సాకార నామములు
లోకమిది కృత్స్నదర్శనముతో చూడన్
ఏకమున నీవు సాకల్యానుభవికాగ
సాకల్యయోగమదె – మంకుతిమ్మ
మృత్తిక తన స్వరూపానికి నష్టంలేక కుండగా ఒక రూపంలో కనబడుతుంది. ఉన్న ఒక పదార్థమే మరోలా భాసించడాన్ని వివర్తమంటారు. సృష్టి ఎలా సంభవించింది? మొదట్లో ఏమీ లేక, తరువాత ఇదంతా సృష్టించబడింది అంటారు ఆరంభవాదులు. లేదు, ఉన్నదే ఇలా మారిపోయింది అన్నారు పరిణామవాదులు. ఆరంభమూ లేదు, పరిణామమూ కాదు, ఉన్నదే మారకుండా మరోరూపంలో భాసిస్తున్నది అంటే అది అద్వైతుల వివర్తవాదం. ఏకమైన బంగారం సామాన్యం. దానిచే అనేకములైన హారకటకాది వివిధ నామరూపాలతో సొమ్ములు అవతరించినపుడు అవి విశేషములు. ఏకమైన బ్రహ్మవస్తువే నామరూపక్రియా విశేషాలుగా విశ్వంలో భాసించును. అనేక విశేషాలలో ఏకమైన సామాన్యాన్ని చూడగలిగితే అది కృత్స్నదర్శనము (పరమార్థదర్శనము). కృత్స్నమనగా పూర్ణము, బ్రహ్మము (కృతం సంపూర్ణతయా సర్వమ్). సకలాన్నీ ఏకంలో అనుభవించేదే సాకల్య దర్శనము. సకలమూ చేరియున్నదే సాకల్యము. మనలో ఉన్నదానినే, విస్మరించినదానినే జ్ఞప్తికి తెచ్చుకొని అనుభవించేదే సాకల్యయోగము.
భారతీయ తత్త్వశాస్త్రంలో “జగత్తు ఎలా ఉద్భవించింది?” అనే ప్రశ్నకు వివిధ దర్శనాలు భిన్న సమాధానాలు ప్రతిపాదించాయి. కారణ–కార్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మూడు ముఖ్య సిద్ధాంతాలు ప్రసిద్ధి పొందాయి — ఆరంభవాదం, పరిణామవాదం మరియు వివర్తవాదం. ఈ మూడు వాదాలు; సృష్టి స్వరూపం, కారణ-స్వభావం, కార్య- స్థితి వంటి విషయాల్లో భిన్న దృక్కోణాలను అందిస్తాయి. ప్రపంచంలోని ప్రతి వస్తువు ఒక కారణం నుండి ఉద్భవిస్తుంది. ఈ సంబంధాన్ని వివరించడంలో రెండు భేదాలున్నాయి. కార్యం కారణంలో ముందుగా ఉండదు; అది కొత్తగా ఉత్పన్నమవుతుంది అనేది అసత్-కార్యవాదం. కార్యం కారణంలో ముందే సూక్ష్మంగా ఉంటుంది; తరువాత వ్యక్తమవుతుంది అనేది సత్-కార్యవాదం. ఈ రెండు పునాదుల మీదే ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదాలు నిర్మితమయ్యాయి.
ఆరంభవాదం ప్రకారం కార్యం కారణంలో ముందుగా ఉండదు; అది పూర్తిగా కొత్తగా ఉద్భవిస్తుంది. భాగాల సమన్వయం వల్ల ఒక కొత్త వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు, మట్టి, చక్రం మొదలైన ఉపకరణాల సహాయంతో కుండ తయారవుతుంది. కుండ ముందుగా మట్టిలో లేదు; అది ఒక కొత్త సృష్టి. ఈ సిద్ధాంతాన్ని న్యాయ–వైశేషిక దర్శనాలు అంగీకరిస్తాయి. వాటి ప్రకారం జగత్తు అనేక అణువుల కలయికతో నిర్మితమైన కార్యం. ప్రతి కార్యం ఒక కొత్త ఆరంభం. అయితే ఈ వాదానికి ఒక ప్రధాన సమస్య ఉంది: “లేనిదానిలోనుండి ఉన్నది ఎలా ఉద్భవిస్తుంది?” అనే ప్రశ్నకు ఇది తగిన సమాధానం ఇవ్వలేకపోతుంది. ‘పూర్తిగా శూన్యం నుండి సృష్టి సాధ్యమా?’ అన్న సందేహం తలెత్తుతుంది.
అప్పుడు పరిణామవాదులు, అలాకాదు, కార్యం కారణంలో ముందే ఉంటుంది, కానీ అది నిజంగా మార్పు చెంది వ్యక్తమవుతుంది. కారణం తన స్వరూపాన్ని మార్చుకొని కార్యంగా అవతరిస్తుంది అంటారు. ఉదాహరణగా పాలు పెరుగుగా మారడం. అలాగే బంగారం ఆభరణాలుగా మారడం. అంటే, కారణం తన స్వరూపాన్ని మార్పుకు లోబడి కార్యంగా అవతరిస్తుంది. ‘పరిణామవాదానికి’ ఆధారం సత్కార్యవాదం. ఈ సిద్ధాంతాన్ని సాంఖ్య దర్శనం ప్రధానంగా ప్రతిపాదిస్తుంది. కానీ అద్వైత దృష్టిలో ఇది కూడ ఒక సమస్యను సృష్టిస్తుంది. బ్రహ్మం పరిపూర్ణం, నిత్యం, నిర్వికారం అని అంగీకరిస్తే, అది ఎలా మార్పుకు లోనవుతుంది? మార్పు అంటే అసంపూర్ణత సూచన. కాబట్టి బ్రహ్మము పరిణమిస్తుందని అంగీకరించడం అద్వైతానికి విరుద్ధం. కారణం ఎప్పుడూ మారదు. కార్యం కేవలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కానీ వాస్తవికమైన మార్పు కాదు. ఇది “ఆభాసం” లేదా “అధ్యాస” (superimposition) మాత్రమే. ఇది వివర్తవాదం.
వివర్తవాదం అద్వైత వేదాంతానికి ప్రముఖమైన సిద్ధాంతం. దీని ప్రకారం కారణం ఎప్పుడూ మారదు; తాడును పాము అని భావిస్తామేకాని తాడు అసలు మారలేదు; అవిద్యచేత పాము కనిపించింది. ఇదే విధంగా జగత్తు కూడా బ్రహ్మం యొక్క నిజమైన పరిణామం కాదు; అది కేవలం మాయ వల్ల కనిపించేది. బ్రహ్మము నిర్వికారం; మార్పు చెందదు. “బ్రహ్మసత్యం జగన్మిథ్యా” అనేది ఈ సిద్ధాంతానికి మూలం. ఆరంభవాదం అనేకత్వాన్ని అంగీకరించి, సృష్టి ఒక కొత్త ఆరంభం అంటే, పరిణామవాదం కారణం-కార్య ఏకత్వాన్ని అంగీకరించినా మార్పు నిజమంటుంది. వివర్తవాదం ఏకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తూ అనేకత్వాన్ని మిథ్య అంటున్నది. ఉన్నదంతా ఒక్కటే. ఆ ఏకంలోనే సకలమూ గోచరిస్తున్నది. గోచరించేది మిథ్య, దేనికి గోచరింపబడుతుందో ఆ సాక్షి సత్యం. ఈ సాకల్యయోగాన్ని అనుభవించు అంటున్నాడు కవి.
48
సర్వోఽహమిందె నిర్మూలమప్పుదహంతె|
నిర్వికారద శాంతి నిరహంతెయిందె ||
నిర్వాంఛె శాంతియిందదు సర్వసమదృష్టి|
సర్వాత్మ్యవానంద – మరుళ మునియ ||సర్వోఽహమనిన నిర్మూలమగునీ యహం
నిర్వికారపు శాంతి నిరహమ్ము తోనే
నిర్వాంఛ శాంతి దానిన్ సర్వసమదృష్టి
సర్వాత్మ్యమే తుష్టి – మంకుతిమ్మ
సర్వం-అహం-అనిన; సర్వమూ తన ఆత్మయే అన్న భావనతో అహంకారము నిర్మూలము కాగలదు. అహం నశిస్తే, ‘సర్వము తానెయైన వాడు’ కాగలడు. అప్పుడు శాంతి సమకూరుతుంది. ఆ శాంతిస్వరూపంలో వాంఛలే లేని స్థితి అనుభవానికి వస్తుంది. ఆ సర్వాత్మభావమే ఆనందము. ఈ చిన్న సూత్రంలో వేదాంతసారాన్నే డి.వి.జి. పొందుపరిచారు.
అందరికి కావలసి ఉంది ఆనందం. వచ్చి పోయే పరిమితమైన సంతోషం కాదు. పరిమితానందాలు – అంటే సుఖం అనేది, దుఃఖాన్ని తన వెంటబెట్టుకునే వస్తుంది. సంపాదన సంతోషకరమైనా, సంపాదించినదానిని రక్షించుకోవడం అంతో ఇంతో కష్టపడక సాధ్యంకాదు. వచ్చిన సంతోషం కొంత సేపు ఉంటుంది. అది వెళ్లిపోయిన తర్వాత ఆ నష్టము దుఃఖకరమే. అంతేగాక ఎంతటి సంతోషమైనా అతృప్తికరమే. ఇంకా ఏదో కొరత అనిపిస్తూనే ఉంటుంది. కొన్ని సంతోషాలకు మనం బానిసలైపోతాము. ఈ సంతోషాలు వేరు, ఇక్కడ చెప్పే సర్వాత్మభావం అనే ఆనందం వేరు. ఈ ఆనందం దుఃఖమిశ్రితం కాదు, అతృప్తికరం కాదు, అందులో బంధకత్వం లేదు. అలాంటి ఆనందం కలిగేది సర్వసమతా దృష్టితోనే. ఆ దృష్టి, శాంతి ఒసగిన ఫలం. శాంతి ఎప్పుడు కలుగుతుంది? మన బుద్ధి, వ్యామోహ-కల్మషాలను వర్జించినప్పుడు. మనసులోని కోరికలను వివేక వైరాగ్యాలతో త్యజించి, తనలో తాను తృప్తుడైనప్పుడు కలిగేది నిర్వాంఛ, నిర్వికారపు శాంతి – “ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ – ఆత్మన్యేవాత్మనా తుష్టః” (గీత-2-15). మొదట అహమును వీడుటయే పెద్ద సాధన. ’అహం బ్రహ్మాస్మి’ అనేది ’అహం పండితః, అహం ధనవాన్, అహం కీర్తిమాన్’ అన్నట్టు కాదు. సర్వమూ తనే అయిన ’అహం’ వేరు, తాను మహగొప్ప అనే ’అహం’ వేరు. ’సర్వము తానెయైనవాడు’ అనే పోతన వాక్యమే ’సర్వోఽహం’ స్థితిని ప్రస్ఫుటంగా వర్ణిస్తుంది.
సర్వం-అహం అనేది అహంకారానికి విరుద్ధమైన ’ఈ విశ్వమంతా నేనే’ అనే భావం. నేను శరీరం, నా మనస్సు, ఇది నాది, అది నాదికాదు అనేది అవిద్యచే ఏర్పడే అహంకారం. ఉన్నదంతా ఆత్మే. అన్ని జీవుల్లో ఉన్న చైతన్యం ఒకటే. ఆ బ్రహ్మమే నా స్వరూపము అనేది సర్వాత్మభావం. పరిమితమైన ’నేను’ అనే అహంకారం సముద్రపు అలలాంటిది. అల అనే భావం పోవాలంటే, తను ’అల’ కాదు – సముద్రమని తెలియాలి. అహంకారం నశించడం అంటే అల లేకపోవడం కాదు. పరిమితమైన నేను అనే భావన వదిలి సర్వమూ తనే అనే అనుభవం కలగడం.
అహంకారం ఉన్నంతవరకు కోరికలు, భయం ఉంటాయి. ఎందుకంటే తాను అపూర్ణుడని తలచి, ‘దానిని’ పొందితే, అది నాదైతే నాకు పూర్ణత్వం వస్తుందని భ్రాంతిచెందుతాము. సర్వమూ తనే అయినప్పుడు ఎవరు ఎవరితో పోటీ పడాలి? కాబట్టి అప్పుడు సహజమైన శాంతి చేకూరుతుంది. సర్వాత్మభావం అనేది, పరిమితమైన ’నేను’ లయమై, అపరిమిత ’ఆత్మ’గా అవతరించిన స్థితి. ఆ నిష్కామస్థితియే ఆనందస్వరూపం.
49
సంతాన సావిరగళొందె బీజదొళడక |
స్వాంతవొందరొళె భావ సహస్రవడక ||
సాంత నరదేహదొళనంత చేతనవడక |
చింతిసీ సూక్షవను – మరుళ మునియ ||సంతాన శతశతములొక్క బీజమునడగు
స్వాంత మొక్కటిలోనె వెయ్యిభావనలు
సాంత నరదేహ ముననంత చేతనమిముడు
చింతనకు సూక్ష్మమిది- మంకుతిమ్మ
వృక్షాలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పండ్లు ఇవన్నీ వేర్వేరుగా ఉన్నాయని అనిపిస్తాయి. కాని వీటికి మూలం ఒక్క బీజమే. ఈ విస్తార-సంతానం స్వతంత్ర సత్తా కాదు. అది మూలమైన బీజమనే సత్యంపై ఆధారపడింది. తాను స్వతంత్రంగా లేక మరొక్కటి దానిపై ఆధారపడియున్నది మిథ్య. మారే దృశ్యం మారుతుంది – చూసే దృష్టి స్థిరంగా ఉంటుంది. మనం ప్రపంచాన్ని చూసినట్టే మనలోని ఆలోచనలనూ గమనిస్తాం. గోచరించేవన్నీ దృశ్యాలు. గమనిస్తున్నది సాక్షి. గోచరించే అనేకత్వమే భ్రమ – ఎవరికి గోచరిస్తుందో అదే సాక్షి, ఆ ఏకత్వమే సత్యం. బీజం లేకుండా సంతానం లేదు – బ్రహ్మ లేనిదే జగత్తూ లేదు. సంతానం లేకున్నా బీజమున్నట్లు, జగత్తు లేకున్నా బ్రహ్మము ఉంటుంది. సంతాన సహస్రమంతయూ ఒక్క బీజంలోనే దాగియున్నది అంటే, అనేకం ఒకటిలోనే ఉంది. జగత్తు అవ్యక్తంగా ఉండి, వ్యక్తమవుతుంది, మళ్ళీ లీనమవుతుంది. కానీ దీనికి ఆధారమైన బ్రహ్మము మారదు. అసలు కనిపించే విభిన్నాలకు మూలం ఏకత్వమే. నానాత్వదర్శనం అవిద్య; ఏకత్వదర్శనమే జ్ఞానం.
విత్తనంలో వృక్షం కనిపించదు. అది శక్తిరూపంగా దాగుంటుంది. బీజంలో దాగిన వృక్షానిది, నామరూపాలు లేని అవ్యాకృత స్థితి. వ్యక్తమైన వెంటనే అది నామరూపాలతో ఉన్న ప్రపంచభాగం అవుతుంది. వృక్షం విత్తనంలో ఉన్నట్లే జగత్తు బ్రహ్మంలో ఉంది. నిర్గుణ నిర్వికారమైన బ్రహ్మము మాయతో ఈశ్వరుడై సృష్టికి కారణమని అనిపించుకొంటుంది. వృక్షం ముందుగా విత్తనంలో అవ్యక్తంగా ఉన్నట్టే, సృష్టికి ముందు ఉన్నది బ్రహ్మమే. జగత్తు అనేది కనిపించే మార్పేగాని బ్రహ్మము నిజంగా మారలేదు, మారదు. తాడు పాముగా మారిపోలేదు. మారినట్టు భ్రామికంగా కనిపిస్తుంది. కార్యకారణాలలో కారణం మాత్రమే సత్యం. కార్యము కేవలము నామరూపాలే కాని ప్రత్యేక పదార్థం కాదు అంటుంది అద్వైతం.
ఒక చిన్న విత్తనంలో మహారణ్యమే ఉంటుంది! విత్తనము వెయ్యి వృక్షముల అవ్యాకృతరూపము. అవ్యాకృత స్థితిలో నామరూపాలు లేక, వ్యక్తమైన వెంటనే వచ్చి తీరుతాయి. అట్లే ఈ విశ్వము అవ్యాకృతమై విత్తనంలా ఉండేదట! “..వ్యాకృత నామరూప విభిన్నం జగత్ ప్రాగవస్థాయాం పరిత్యక్తవ్యాకృత నామరూప బీజశక్త్యవస్థమ్…” (ఆనుమానికాధికరణంలో ‘సూక్ష్మంతు తదర్హత్వాత్’ అనే బ్రహ్మసూత్రానికి శంకరుల భాష్యభాగం). విత్తనంలో వెయ్యి వృక్షాలు అన్నది బాహ్యమైన దృష్టాంతము. దానికి ప్రత్యామ్నాయమైనది మనలో కలిగే వెయ్యి భావనలు. ఒక విత్తనంలో వెయ్యి సస్యాలను రూపొందించే చైతన్యమున్నట్లు, అందరి అంతరంగంలోనూ వందలాది భావనలను కలిగించే చైతన్యమున్నది. బీజము, దేహము సాంతమైననూ వాటిలోని శక్తి అనంతము. విత్తనంలోనే ఉన్నది అంకురోత్పాదక శక్తి – ’బీజస్యాంతరివాంకురో…’ (దక్షిణామూర్తి స్తోత్రం) – మొలకతో మొదలుబెట్టి పండువరకూ ఉన్న ’కార్యాల’లో అది ఉంది, ఇది ఉంది అనే ఉనికి, ఆ అస్తిత్వం ఉండనే ఉన్నది. విత్తనములోని పరమాణువులు ఎక్కడనుండి వచ్చాయి? పరమాణువులకు ప్రపంచాన్ని సృష్టించాలన్న తెలివి, సృష్టిని సల్పే క్రియ ఎలా ఉంటుంది? ఇలా వైశేషిక సిద్ధాంతాన్ని విమర్శించిన సురేశ్వరులు, తమ మానసోల్లాసంలో (శంకరుల దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం) ఇలా సెలవిస్తారు. జగత్తులో ఎన్ని తత్త్వాలున్నా, ఒక మొలక విత్తనంలో ఎలా దాగియుంటుందో అలా విశ్వానికి విత్తనం ఈశ్వరుడు. ఆ భావమే ’బీజస్యాంతరివాంకురో’ అనే విశేషణంగా చెప్పబడింది. ’జీవులు ఏ కార్యాన్ని చేపట్టినా వారి ప్రవృత్తులు – ఇచ్ఛా-జ్ఞాన-క్రియాపూర్వకంగానే సంభవిస్తున్నాయి’ – “సర్వే వికల్పాః ప్రాగాసన్ బీజాంకుర ఇవాత్మని | ఇచ్ఛాజ్ఞానక్రియారూప మాయయా తే విజృంభితాః” (మానసోల్లాసము 43).
ఆ శక్తి, విత్తనంలో అవినాభావంగా, నిరాకారంగా ఉంటుంది. ఆ శక్తే విత్తనాన్ని అంకురంగా మార్చి, అంకురం పెద్ద వృక్షమై, అందులో వేలకొలది విత్తనాలు పుట్టి, అది అరణ్యానికే హేతువు కాగలదు. ఆ విధంగా సాంతమైన మన దేహంలో అనంతమైన చైతన్యము ఇమిడియున్నది. వెలుపల, లోపల, అంతటా వ్యాపించియున్నది ఆ ఒక్క చైతన్యమే. ఈ సూక్ష్మాన్ని చింతనతోనే గ్రహించగలము. వెనుకటి పద్యంలో నిర్వచించిన ‘సర్వోహము’ను చేపట్టాలంటే ఈ పద్యంలోని బాహ్యాంతర విభిన్న చైతన్యతత్త్వాన్ని పరిభావించాలి.
50
పురుష ప్రకృతియర పరస్పరాన్వేషణెయె
నిరవధిక విశ్వ జీవ విలాస జలధి ||
తెరెయొందు నానా సముద్రదొళగెందిర్ప |
సరసతెయె సద్గతియొ – మరుళ మునియ ||పురుష ప్రకృతుల పారస్పరాన్వేషణమె
నిరవధిక విశ్వ జీవ విలాస జలధి
తెర యొకటె నానా సముద్రములోనన్న
సరసతయె సద్గతిర- మంకుతిమ్మ
పురుషుడు ప్రకృతిని – ప్రకృతి పురుషుణ్ణి, ఒకటి మరొకటిని అన్వేషిస్తే ఎలా ఉంటుంది? ఒక సముద్రం మరొక సముద్రాన్ని వెదకి తనూ అదే, సప్తసముద్రాల స్వారస్యమంతా ఒకటే అని తెలుస్తుంది. ఒక సముద్రంలోని తరంగమే (జీవుడిలా) సముద్రమంతటా పయనించి, మరొక సముద్రాన్ని చేరి, అచటనూ సాగి, ఎంత తిరిగినా, అలలకు నామరూపాలు తప్ప వేరే భేదం ఏముంది? ఉన్నదంతా ఒక్క ఉదకమే కదా! అలాగే అలల సంకేతమైన జీవుడు, ఉన్నదంతా పరబ్రహ్మమే అని తెలుసుకునే ఉన్నత స్థితే సద్గతి. అది సరసత-అనగా స-రసత్వం, అంతా రసమే, నీరే, ఒక్కటేనన్న స-రస భావం.
పురుషుడనగా ఉపనిషత్తుల నిర్వచనమేమి? మనిషి – (కఠోపనిషత్తు); ప్రాణబుద్ధ్యాత్ముడైన హిరణ్యగర్భుడు -(ఈశోపనిషత్తు); హృదయకుహరంలో తెలియవచ్చే పరమాత్మ -(ముండకోపనిషత్తు); ఈశ్వరుని ఉత్తమ ప్రకృతియైన జీవుడే పురుషుడు- (గీత) . ఆ పురుషుని (ఈశ్వరుని) శక్తే ప్రకృతి. త్రిగుణాత్మక మాయ అన్నా అదే. పురుష-ప్రకృతుల పరస్పరాన్వేషణమే ఈ విశ్వ-జీవ-విలాస జలధి. ఈ అన్వేషణకు అవధులు లేవు. అందులో మనకు భాసించే వ్యక్తులు, సంసారము, మొదలైనవే జీవ విలాసము.
ఒక కడలిలోనే అనంత తరంగాలు లేచి లయిస్తూ ఉంటాయి. అన్ని సముద్రాల్లోనూ ఈ తరంగ నర్తనములే. ఎన్నో సముద్రాలుగా విభజించుకొన్నా ఉన్నది ఒకటే జలధి. చిన్నవి, పెద్దవి, మహాకారమైనవి అంటూ ఎన్నెన్ని తరంగాలని మనం లెక్కపెట్టినా అవన్నీ జలమే. రసతత్వమే. స-రసమే. అన్నీ రసమనే సరసత్వమే అంతిమమైన బ్రహ్మభావము. అదే విధంగా ప్రపంచకార్యమంతయూ ప్రకృతి-పురుష సంయోగజన్యమే. ఆ సంయోగప్రకారాలు అమితమైనందున, జగద్వస్తువులలోనూ జీవభూతములలోనూ మనకు గోచరించే ప్రత్యేకతలూ అమితమైనవే. పరబ్రహ్మమే ప్రకృతి-జీవుడు-ఈశ్వరుడు అనే త్రిరూపాలలో విశ్వవ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. పురుషుడు అనగా సాక్షిచైతన్యం. ప్రకృతియనేది త్రిగుణాత్మకమైన సృజనశక్తి. పురుషుడనే శుద్ధ చైతన్యమే బ్రహ్మము. అది మార్పులేని నిశ్చలమైన సాక్షితత్త్వం. ప్రకృతి- త్రిగుణాలతో నిత్యపరివర్తనశీలి. దీని చేతలన్నీ పురుషుడి సన్నిధిలోనే. అది లేక ఇది జడం. జీవుడు తన నిజస్వరూపాన్ని (పురుష) మరచి శరీరేంద్రియాదులలో (ప్రకృతి) చిక్కుకోవడమే మాయ. ఈ అజ్ఞానమే జీవుడి దుఃఖకారణం. జీవుడెందుకు ఇలా ప్రకృతికి వశమైపోతున్నాడు? మనం బలవంతంగా ఇంద్రియాలను అణచిపెట్టి నిగ్రహిస్తే? ప్రయోజనం లేదు. సమస్త ప్రాణులు తమ గుణాల ప్రభావాన్ని అనుసరిస్తాయి అంటున్నది భగవద్గీత – ’ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి’. ప్రకృతి బలవత్తరమైనది. ఒక్కొక్క జీవిలో పూర్వసంస్కారరీత్యా ఒక్కొక్క విధంగా ఉంటుంది. బలవంతంగా ప్రవృత్తులను అణచివేయడంకంటే, వాటిని నిష్కామకర్మ ద్వారా భగవచ్చింతనలో పెట్టి, చిత్తశుద్ధి చేసుకొని, జ్ఞానంవైపు మళ్లిస్తే, తానొక జీవుడనే తరంగత్వం కరిగిపోయి, స్వరూపమైన సమగ్ర సముద్రజలమే తాననే ఆ ’స-రసత’ అనుభవగమ్యమవుతుంది. అల తనను అలగా అన్వేషిస్తే భేదం; తనను నీరుగా అనుభవిస్తే ఏకత్వం. జీవుడు తనను శరీరంగా చూసుకుంటే సంసారం; తనను బ్రహ్మంగా తెలుసుకుంటే సద్గతి. ఇది జ్ఞానం కాదు — జ్ఞానంగా మారిన అనుభవమే.
