ఏమిటిది?
ఎక్కడున్నాను?
ఈ అపరిచిత స్థలంలో
ఈ నిర్జన ఏకాంతంలో
ఈ పరీత ప్రశాంతతలో
ఈ మౌన సుమావరణంలో
కాలమాగినట్లు
అచలదీపమై మనసు నిలచినట్లు
ఇది స్వప్నమా, సత్యమా?
ఇదేమిటి, ఈ ఏదీ కాని స్థితి?
ఇది వాస్తవమా?
ఎద నిక్షిప్తమైన జ్ఞాపకమా?
ఊహాతిశయమా?
మనో నిర్మిత శాంతకాసారమా?
ఏది ఏమైనా
ఈ అనిదంపూర్వస్థితిని వదలలేను
ఈ చిత్తశాంతిని కాదనలేను
ఈ నిశ్చలానుభూతిని వీడలేను
ఈ ఏకత్వంలో ఉండిపోతాను
ఈ తనుహృత్సఖ్యతను
ఒడిసి పట్టుకు పదిలపరుస్తాను
లోలోనే, ప్రత్యణువులో!
ఇదే నా సాధన
నా జీవన సార్థక మహాశోధన
ప్రభంజనం మధ్యను ప్రశాంతత
మహారవాల నడుమ మౌనవల్మీకం
దూసే కటారుల కెదురుగ ధైర్యకవచం
పోటెత్తే వైషమ్యాల మధ్య సామరస్యగళం
హోరెత్తే ఎదురు గాలులలో నిశ్చలరమణీయం
రణగొణల జనారణ్య గర్భాన ఓ ఆంతరోపాసనం
స్వార్థపు, కుంచితాత్మల నడుమ ఓ సౌమనస్య ప్రసూనం!