[ఓడిస్సీ కథకు వేమూరి వేంకటేశ్వరరావుగారి ముందుమాటను, ఏడు భాగాల అనువాదాన్ని చదివేందుకు ఈ లింకులను అనుసరించండి: ముందుమాట, 1, 2, 3, 4, 5, 6, 7 — సం.]
పురాణ కథలు ఎందుకు చదవాలి? అవి మనకు ఏమిటి బోధిస్తాయి? అవి చదవడంవల్ల మనం మన ప్రస్తుత జీవితాలను ఎలా మలుచుకోగలం? పురాణకథలలో ఉన్న నీతులు, బోధలు అర్థం చేసుకుని మనం ఈ కాలంలో ఏ విధంగా లబ్ధి పొందగలం? కాలం మారింది. విలువలు మారేయి కదా. ఎప్పుడో శతాబ్దాల క్రితం హోమర్ రాసిన ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు ఇప్పుడు చదవడంవల్ల లాభం ఏమిటి?
ఇలియాడ్ ఆరంభంలోనే ఇతివృత్తం ఏమిటో రచయిత హోమర్ వివరించి చెబుతాడు. అకిల్లీస్ స్వాతిశయం, స్వాభిమానం, క్రోధం ఎలా దుష్పరిణామాలకు దారి తీస్తాయో నిరూపించడమే ఈ గ్రంథం యొక్క ఆశయం. కోపదూషితమైన బుద్ధికి కర్తవ్యాకర్తవ్యాలు తోచవు. స్వాతిశయం, కోపం మానవుల పతనానికి ప్రథమ హేతువులు, ప్రధాన హేతువులు కూడా. హోమర్ అక్కడితో ఆగడు. తప్పు చేసినవాడు ఒక్కడే నాశనం అవ్వడు; అతనితోపాటు నిరపరాధులైన అతని సహచర బృందం కూడా నాశనం అయిపోతుంది. ఇలియాడ్ కథారంభంలోనే హోమర్ మరికొంచెం లోతుకు వెళ్లి తన ఇతివృత్తంలో దాగున్న మరొక ముఖ్యాంశం కూడా చెబుతాడు. అకిల్లీస్ యొక్క కోపదూషితమైన ఉద్రేకం దేవతల రాజైన జూస్ సంకల్పం నెరవేరడానికి కారణం అవుతుంది. అనగా, చిట్టచివరికి ఈర్ష్య, అసూయలవంటి మానవ బలహీనతల మీద విధి విలాసానిదే పైచెయ్యి. మరైతే ఏ పాపం ఎరగని అమాయకపు ప్రాణులు ట్రోయ్లో జరిగిన ఘోరసంగ్రామంలో సమిధలై ఆహుతి అయిపోయిన వైనానికి సంజాయిషీ ఏమిటి?
ఈ ప్రశ్నకు సమాధానం హోమర్ రాసిన రెండవ గ్రంథం ఓడిస్సీలో దొరుకుతుంది. ఓడిస్సీ ఆరంభంలోనే దేవతల రాజైన జూస్ నిర్ద్వంద్వంగా చెబుతాడు. ప్రజలు తమ కష్టాలకూ, తమ దుఃఖపూరిత జీవితాలకూ దైవానుగ్రహం లేకపోవడమే కారణమని నమ్ముతూ ఉంటారు. “నిజానికి జీవితంలో ఎవరి దుఃఖానికి వారే కారకులు. ప్రజలు పిచ్చి సాహసాలతో, వెర్రి ధైర్యంతో, నిర్లక్ష్యంతో కర్మలు చేసి ఫలితం అనుభవిస్తారు. ఎవరి కర్మకు వారే బాధ్యులు,” అంటాడు దేవతల రాజు జూస్. జీవితంలో ఎదురయ్యే కష్టం, దుఃఖం అనే వాటిని వరాలుగా స్వీకరించి ఇష్టపూర్వకంగా, అణకువతో అనుభవిస్తాడు ఓడిస్సీ కథానాయకుడు ఒడిస్సియస్.
దరిదాపు 2500 ఏళ్ల క్రితం ప్రచారంలోకి వచ్చాయి ఈ కథలు. ఈ రెండింటిలోనూ ముఖ్యమైన అంశం పోరాటం. ఇలియాడ్లో పోరాటం ప్రతిష్ఠకోసం; ఇందులో ముఖ్యమైన పాత్రలు పురుషులు. ఓడిస్సీలో పోరాటం ప్రకృతి శక్తులతోటీ, దుష్టశక్తులతోటీ; ఇందులో ముఖ్యమైన పాత్రలు స్త్రీలు.
ఓడిస్సీలో ఆరు ఇతివృత్తాలు పదే పదే కనిపిస్తూ ఉంటాయి: (1) పట్టుదల, నిరంతర శ్రమ, (2) దెబ్బ తిని పడిన తరువాత పైకి లేవడం, ప్రాణాలతో బయటపడటం, (3) బలం, కుశాగ్రబుద్ధి, (4) అతిథి సత్కారం, పరామరిక, (5) ఇంటిమీద ధ్యాస, మాతృదేశానికి తిరిగి రావాలనే తీవ్రమైన వాంఛ, (6) అహంకారం యొక్క పర్యవసానం.
ఇప్పుడు ఓడిస్సీలో కథను మరొకసారి పరిశీలిద్దాం. కథ ప్రారంభం అయ్యేనాటికి కథానాయకుడు ఒడిస్సియస్/యులిసిస్ యువకుడు. ట్రోయ్ యుద్ధంలో విజయానికి ప్రధానకారకుడు. ఆ కాలంలో వినుతికెక్కిన మహావీరుడు. పన్నెండు పడవల నిండా నావికులు, ట్రోయ్ నగరాన్ని కొల్లగొట్టగా వచ్చిన ధనరాశులు, పట్టుబడ్డ బానిసలతో అతను కొద్ది రోజుల ప్రయాణంతో భార్యనూ కొడుకునూ కలుసుకుని, నిశ్చింతగా జీవితం గడపడానికి స్వాతిశయంతో ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఈ సందర్భంలో కథ మొదలవుతుంది.
ఒడిస్సియస్ బృందం చేసిన ఒక తప్పిదానికి దేవుళ్ళకు కోపం వస్తుంది. తత్ఫలితంగా ఆ దేవతలు, ఒడిస్సియస్ అహంకారాన్ని అంచెల మీద ఒలిచివేస్తారు. అతని ధైర్యం, స్థైర్యం, అంతస్తు, హోదా, పరువు, ప్రతిష్ఠ, ఆత్మాభిమానం, గౌరవం, పొగరు అన్నిటినీ అణచివేస్తారు. ఉపాఖ్యానం తర్వాత ఉపాఖ్యానం, సంఘటన తర్వాత సంఘటనలలో పూర్వం పనిచేసిన పద్ధతులు, యుక్తులు, కుయుక్తులు పనిచెయ్యడం మానివేస్తాయి. ఇప్పుడతను ఎదుర్కొంటున్నది ప్రతీదీ సరికొత్త అనుభవమే.
సైక్లాప్స్ పాలీఫీమస్ “నీ పేరేమిటి?” అని అడిగినప్పుడు సగర్వంగా తన పేరు చెప్పడానికి బదులు అనామకుడిలా ‘ఎవరో’ అని చెప్పినవాడు, అహం అడ్డొచ్చి అపాయానికి అందుబాటులో లేని దూరానికి పారిపోయిన తరువాత, పాలీఫీమస్ని వెనక్కి పిలచి “నేను నిజంగా ఎవరినో తెలుసా? నేను ఒడిస్సియస్ని, ఇథకా రాజును!” అని ప్రజ్ఞలు పలుకుతాడు. చింత చచ్చినా పులుపు చావలేదు.
తన జబ్బశక్తితోటీ, యుక్తితోటీ సమఉజ్జీలు, ప్రత్యర్థులు అయిన పురుషులను గెలుచుకొచ్చిన వ్యక్తి, అందరికీ సలహాలు ఇచ్చిన వ్యక్తి, చివరికి, తన మనుగడ కోసం అబలలు అయిన స్త్రీల – సర్సీ, నౌసికయా, కలిప్సో, అథీనా – సలహాల మీద, సహాయం మీద ఆధారపడవలసి వస్తుంది.
ఇంటికి తిరిగి వెళ్ళడానికి సరైన మార్గం ఏదో తెలుసుకోడానికి మృతుల లోకానికి వెళతాడు – సర్సీ సలహా మీద. అక్కడ యుద్ధంలో చచ్చిపోయిన వారి ప్రేతాత్మలను కలుసుకుంటాడు. వారిలో అకిల్లీస్ ఒకడు. బ్రతికున్న రోజులలో “శౌర్య పరాక్రమాలతో అల్పకాలం బ్రతికిన తరువాత, వీరస్వర్గం కావాలా లేక సాధారణమైన జీవితంతో పూర్ణాయుర్దాయం కావాలా?” అని అడిగితే యుద్ధంలో మరణాన్ని ఎదుర్కొని వీరస్వర్గాన్నే కోరుకున్నాడు. కానీ అతని ప్రేతాత్మతో జరిగిన సంభాషణలో “సకల సుఖాలతో వీరస్వర్గంలో బ్రతికేకంటే బిచ్చగాడిలా భూమి మీద బ్రతకడమే మేలు” అని అర్థం స్ఫురించే మాటలు అంటాడు అకిల్లీస్. ఎంత నిజం! “స్వర్గంలో, అందమైన దేవతా స్త్రీలతో సంగమిస్తూ కలకాలం గడపొచ్చు,” అనే అందుకోలేని పేరాశతో ఈ భూలోకంలో దుశ్చర్యలు చేస్తూన్న తీవ్రవాదుల ప్రచారంతో, అకిల్లీస్ చెప్పిన మాటలు పోల్చి ఒక పాఠం నేర్చుకోవచ్చు.
ఒక కోణంనుండి చూస్తే ఈ కథ, యుద్ధంనుండి తిరిగి వచ్చిన ఒక సైనికుడు తన నిత్యజీవితంలో తిరిగి స్థిరపడే (rehabilitation) తాలూకు కథ. ఇటీవల, మనమూ చూస్తూనే ఉన్నాము కదా. కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఇరాక్ యుద్ధాలలో పోరాడి తిరిగి వచ్చిన అమెరికా సైనికులు సులభంగా సమాజంలో ఇమడలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు యుద్ధంలో చేసిన వీరోచిత సాహసకృత్యాలకు ఉన్న విలువ సమాజంలో ఇమడడానికి పనికిరాలేదు. ట్రోయ్ యుద్ధం తరువాత ఒడిస్సియస్ తిన్నగా ఇథకా వెళ్ళిపోయి ఉంటే ఇమడలేకపోయి ఉండేవాడు. తిరుగు ప్రయాణంలో అన్ని విధాలా ‘గర్వభంగం’ అయి చివరికి అహంభావం అనే వలువలు ఒలిచేసిన దిగంబరుడిగా, నిస్సహాయుడిగా, సముద్రతీరంలో నౌసికియాకి కనిపించినప్పుడే పునర్జన్మ ఎత్తి కొత్త ఒడిస్సియస్ అవుతాడు.
ఇంత మహావీరుడూ, ఇంతకాలం పోయిన తరువాత ఇంటికి వస్తే, ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం ఎవ్వరూ ఇవ్వలేదు. ముసలి బిచ్చగాడి వేషంలో అనామకుడుగా వచ్చిన అయన రాకను, ఉనికిని గుర్తుపట్టిన సాక్షులు ఇద్దరే. ఒకరు కొనఊపిరితో పెంటకుప్ప మీద పడి ఉన్న, నోరులేని, అతని చిన్ననాటి పెంపుడు కుక్క. రెండవది, అతనిని పెంచి, పెద్ద చేసిన చిన్ననాటి దాది యూరిక్లేయా (మళ్ళా, ఒక స్త్రీ). ఈమె దృష్టిలో ఒడిస్సియస్ ఎల్లప్పుడూ పసివాడే. ఈ ఇద్దరూ ఒడిస్సియస్లోని ‘మహావీరుడిని’ గుర్తుపట్టలేదు; తమకు చిరకాలంనుండీ పరిచయమైన బాలుడిని గుర్తుపట్టేరు.
ఈ కథనానికి సమాంతరంగా మరొక కథ నడుస్తుంది. ఒడిస్సియస్ యుద్ధాల్లోనూ, సముద్రాల్లోనూ తిరుగుతూ ఉంటే, అతన్ని ఇంటివైపు లాగుతూన్న అతని సంసారపు కథ రెండవది. ఏకాంతంగా ఇంటిదగ్గర ఉన్న పెనలొపీ మీద ఆ చుట్టుపట్ల ఉన్న భూస్వాముల కళ్ళు పడతాయి. పరాయివాడిని కన్నెత్తయినా చూడనంటూ, తాను పరిణయమాడిన భర్తకోసం ఇరవై ఏళ్ళు ఎదురు చూసిన అరుదైన వ్యక్తి ఆమె. ఒక పక్క భూస్వాముల దాడినుండి తల్లిని ఎలా రక్షించడమో తెలియక ఇబ్బంది పడుతోన్న టెలెమాకస్కి దైవసహాయం లభిస్తుంది. తద్వారా మెనలెయస్ పరిచయం లభిస్తుంది. ఒకప్పుడు ట్రోయ్లో బందీగా ఉన్న హెలెన్ని ఒడిస్సియస్ విడిపించి, ఆమె భర్తయైన మెనలెయస్కి అప్పగించేడు. ఇప్పుడు ఒడిస్సియస్ ఎక్కడున్నాడో టెలెమాకస్కి ఆచూకీ ఇచ్చి మెనలెయస్, ఆ బాకీ తీర్చుకున్నాడు. ఈ సమాచారం అంతా సేకరించి టెలెమాకస్ ఇంటికి వచ్చేసరికి ఒడిస్సియస్ ఇంటికి వచ్చేసేడు. అప్పుడా తండ్రీకొడుకులు ఇద్దరూ, వయసు మీరిన పశువులకాపరుల సహాయంతో 108 మంది భూస్వాములతో యుద్ధం చేసి ఓడిస్తారు. ఇక్కడ అథీనా దేవత సహాయం లేకపోతే సుఖాంతమైన కథ నమ్మదగ్గదిగా ఉండేది కాదు.
ఇలియాడ్లో ట్రోయ్ రాకుమారుడు మెనలెయస్ భార్య హెలెన్ని అపహరించడం కారణంగా జరిగిన యుద్ధంలో మన కథానాయకుడిది ప్రధానపాత్ర. ఓడిస్సీలో తన భార్య పెనలొపీని అపహరించడానికి ప్రయత్నాలు చేసిన భూస్వాములనుండి రక్షించడానికి జరిగిన యుద్ధంలోనూ అతడిదే ప్రధానపాత్ర.
ఏతావతా, ఈ ఉత్కృష్టమైన కావ్యంలో హోమర్ సాధించింది ఏమిటి? ఒక సాంప్రదాయిక మహాకావ్యంలో పరాక్రమవంతుడైన కథానాయకుడు ఎలా ఉండాలో పునర్నిర్వచించేడు. సుదీర్ఘమూ, దుస్సాధ్యమూ అయిన ఇరవై ఏళ్ళ ఉత్కంఠభరితమైన సాహసయాత్రలో ఒడిస్సియస్ తన యుక్తి, గ్రహణశక్తి, కుశాగ్రబుద్ధి, ఉద్విగ్న సంయమం ఉపయోగించి అస్వాభావికమైన, అతి ప్రాకృతికమైన శక్తులని ఎదుర్కొని, తన రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకోగలిగేడు. అతని పరాక్రమం ఖండించడానికి వీలు లేనిదన్నది జగద్విదితమే కానీ, అతన్ని పదే పదే ఆదుకున్నవి, కష్టాల్లోంచి గట్టెక్కించినవి నిస్సందేహంగా అతని యుక్తి, కుశాగ్రబుద్ధి మాత్రమేనని, అతడు సైక్లాప్స్తో తలపడడంలోనూ, సైరన్లని ఎదుర్కోవడంలోనూ, చిట్టచివరకు తన రాజ్యంలో తిష్టవేసిన రాకుమారులని ఎదిరించి కడతేర్చడంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత ప్రతిభావంతుడైనప్పటికీ ఒడిస్సియస్ ప్రతి దశలోనూ స్త్రీల సహకారం లేకుండా ముందుకి అడుగు వెయ్యలేకపోయాడు. పరాక్రమం అంటే కేవలం కండబలం ఒక్కటే కాదనిన్నీ, నిజమైన పరాక్రమానికి భుజబలంతోపాటు పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోగలిగే వివేకం, వివేచనా కూడా ఉండాలనీ ఈ కావ్యం బోధిస్తోంది.
స్వస్తి!
