ది అన్‌సీన్

రాత్రి నగరాన్ని కప్పదు. వివస్త్రను చేస్తుంది. పగలు ధరించిన అబద్ధాల్ని ఒక్కొక్కటిగా విప్పి, అసలు ముఖాన్ని బయటపెడుతుంది. ట్రాఫిక్ గర్జన నెమ్మదిగా దూరమవుతుంది. ఆకాశం నీలంనుంచి ఊదారంగులోకి జారుతుంది. వీధి దీపాలు ఆలోచించి వెలుగుతాయి, అచ్చం సాక్షుల్లా!

ట్యాంక్‌బండ్ మీద గాలి నీటిని తాకి తిరిగి వస్తుంది. జూబ్లీ హిల్స్ రోడ్లపై కార్ల లైట్లు మరీ పొడవాటి గీతల్లా జారిపోతాయి. చార్మినార్ వైపు టీ కప్పులనుంచి ఆవిరి ఎగిరొస్తోంది. ఎక్కడో ఒక అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఇంకా లైట్ వెలుగుతోంది — ఎవరో నిద్రపోలేక కూర్చున్నారని చెబుతున్నట్లు…


రాత్రి పదకొండు దాటిన తర్వాత నగరం పాత్రలు మార్చుకుంటుంది. పగలు అధికారంతో మాట్లాడిన మనుషులు, రాత్రి ఒంటరిగా నడుస్తారు. పగలు నవ్విన ముఖాలు, రాత్రి ఆలోచనలతో నిండిపోతాయి. మౌనం గట్టిగా వినిపిస్తుంది. అడుగుల శబ్దం పెద్దదవుతుంది. నీడలు పొడవెక్కి మనుషులకంటే ముందుగా నడుస్తాయి.

రాత్రి రెండు దాటితే నగరం నిజాయితీగా మారుతుంది. అలంకారం కరుగుతుంది. నటన తగ్గుతుంది. మిగిలేది కేవలం ఉనికి. ఎక్కడైనా చిన్న గొడవ మొదలైతే, అది కేవలం మాటల గొడవ కాదు – ఎవరో తమ గౌరవాన్ని కాపాడుకునే యుద్ధం. ఎవరో తమ భయాన్ని దాచుకునే ప్రయత్నం.

అలాంటి క్షణాల్లో నగరం ఒక్క మాట చెబుతుంది. నిశ్శబ్దంగా. గుసగుసగా. కానీ ధైర్యంగా! ఆ మాటలో ఓదార్పు ఉంది. అదే సమయంలో ఒక రహస్యామోదం కూడా ఉంది.


నిజానికి నిన్న రాత్రి నా స్నేహితుడు, జర్నలిస్టు రవితో ఆ తెలియని మనిషి గురించి సంభాషణ నడిచింది…
అది పుకారు కాదు. నగరం అంతా గుసగుసలాడే ఒక పేరు, అదే పేరులేని/తెలియని వ్యక్తిది, ఆ రాత్రి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడనే సానుభూతి. చాలామంది చాలాసార్లు చెప్పుకున్న ఆ వ్యక్తి – లేడని నిరూపించలేరు. ఉన్నాడని కూడా ఎవరూ చెప్పలేరు. అయినా, నగరపు రాత్రుల్లో ఏ కలకలం వచ్చినా ముందుగా అతడే కనిపిస్తాడని మటుకు అందరూ చెబుతారు.

కొంచెం తగ్గిన స్వరంలో చెప్పాడు రవి – “అతనొస్తే క్రౌడ్ మరింత కదులుతుంది. అతను మాట్లాడితే పోలీసుల ముఖాల్లో మార్పు కనిపిస్తుంది. అతను నడిచే రోడ్డు ఒక క్షణం తళుక్కుమంటుంది. అతడు కనిపించకపోయినా, వచ్చినట్టు అనిపించేలా ఉండే మనిషి… మేము కూర్చున్న కాఫీ షాప్‌లో బాయ్‌ను అడిగితే అతను నవ్వుతూ అన్నాడు— “అతను కూర్చున్న టేబుల్‌లో, ఏదో జరిగిపోతుంది సార్! ఏ మనిషైనా చిన్నగా తలెత్తి చూస్తాడు. అతడు విచిత్రంగా, మాయలాంటి వాడు. అతడు ఎక్కడ కనిపిస్తాడో అక్కడ ఒక వైబ్ సృష్టిస్తాడట, అసలు అతడు రాత్రికే ఒక వాతావరణం తీసుకువస్తాడట.”

ఈ ‘ట’ లని వింటుంటే చాలా కుతూహలంగా అనిపించింది.



నగరంలో పగలు మనం పాత్రలు పోషిస్తాం. ఉద్యోగాలు, పదవులు, పేర్లు, పరిచయాలు. అయితే రాత్రి అవి కరగడం మొదలవుతాయి. మిగిలేది మన ఉనికి. ఆ ఉనికి ఖాళీగా అనిపించినప్పుడు మనం ఒక కథను సృష్టిస్తాం. మనిషి ముందుగా ఉనికిని పొందుతాడు. అర్థం తర్వాత వెతుక్కుంటాడు. అర్థం దొరకకపోతే, ఒక రూపాన్ని సృష్టిస్తాడు.
ఈ నగరం సృష్టించిన రూపమే అతను కావచ్చా? ఏమో ? తెలియదు.

ఆ రాత్రే నేను ఈ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాను. రోడ్డుమీద నడక మొదలుపెట్టగానే గాలి మృదువైన మత్తుతో వీచింది. నియాన్ లైట్లు మెరుస్తూ రోడ్డుపై పడి, నగరాన్ని ఒక సుందరస్వప్నంలా మార్చాయి.

ఆ సమయంలో ఒక చిన్న గుంపు మధ్య, ఏదో వాదన మొదలైంది. దూరంగా నిలబడి గమనిస్తున్నాను. ఒక్కసారిగా గుంపు నిశ్శబ్దమైంది. ఎవరో మాట్లాడుతున్నారు. నేను దగ్గరికి వెళ్లేలోపే – ఎవరూ కనిపించలేదు. కానీ వాదన ఆగిపోయింది. వాళ్లు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అంతవరకూ అక్కడున్న ఆ వ్యక్తి తాలూకు వాసన మటుకు ఉంది.

రాత్రి మూడున్నర దాటింది.

నగరం అలసటతో ఊపిరి తీసుకుంటోంది. రోడ్డు పక్కన పసుపు లైటు కింద ఒక ఆడమనిషి నిలబడి ఉంది. చల్లని గాలి ఆమె చీర అంచుని కదిలిస్తోంది. ఆమె ముఖంలో మేకప్ ఉంది. కానీ కళ్లలో అలసట దాచలేక పోతోంది… ఆమెను చాలామంది ఒక పేరుతో పిలుస్తారు.

ఆమె మాత్రం తనను ఇంకో పేరుతో గుర్తుంచుకుంటుంది.

ఈ నగరానికి ఆమె ఒక నీడ. కానీ తన పిల్లలకు ఆమె ఒక తల్లి.

ఆమె అక్కడ నిలబడింది. ఎందుకంటే ఆమెకు మరో దారి లేదు. చివరకు రాత్రే ఆమెను స్వీకరించింది. రాత్రుళ్లు నగరం నిజాయితీగా మారుతుందని అనుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు అర్థమైంది, అది దయ చూపదు. కేవలం అవకాశాలు ఇస్తుంది.

అప్పటికే అలసిన ఆమె ఇంటిదారి పట్టింది. ఇంతలో కారు ఒకటి ఆమె ముందు నెమ్మదిగా ఆగింది. లోపలనుంచి ఒక మగమనిషి, ఆమెను తలనుంచి కాళ్ల వరకూ చూసాడు. చేతిలో నోటుతో ఆహ్వానించాడు. రాలేనని తల అడ్డంగా ఊపింది. ఆ అవమానాన్ని తట్టుకోలేని అహంకారం ఆమె మీదకి కారుని దూకించింది.

భయంతో ఆమె కింద పడింది. ఆ సమయంలో అవతలివైపు నడుస్తూ ఉన్న వ్యక్తి ఆ దృశ్యాన్ని గమనించాడు.
అతడు గొడవ చేయలేదు. హీరోలా మారలేదు. కానీ ఆ కారువైపు వెళ్లి అడ్డంగా నిలబడి మెత్తగా అన్నాడు – “ఆమె కూడా నీలాంటి మనిషే.”

అది పెద్ద వాక్యం కాదు. కానీ అందులో పదునుకి, తెగువకి బెదిరింది కారు తాలూకు మనిషి గుండె.

అంతే. కొన్ని క్షణాల తరువాత కారు నెమ్మదిగా వెళ్లిపోయింది.

కిందపడిన డబ్బుని ఆమె చేతికిస్తున్న ఆ వ్యక్తిని చూసింది. ఆమె కళ్లలో ఆశ్చర్యం లేదు. కృతజ్ఞత కూడా లేదు. ‘నన్ను గుర్తించావు’ అన్న అభిమానం, అతనికి కనిపించింది. అతడు వెనక్కి తిరిగి నడిచిపోయాడు.



ఇదంతా నేను దూరంగా నిలబడి చూసాను. ఆ రాత్రి నాకు అర్థమైంది – ‘అతను’ అనేది వట్టి గొడవ ఆపేవాడు మాత్రమే కాదు. ఎవరో ఒకరి అవమానాన్ని ఒక్క క్షణం ఆపేవాడు కూడా.

సార్త్రే వాక్యం గుర్తొచ్చింది, “మనం చేసిన చర్యలే మనం”.

రాత్రి మళ్లీ ముందుకు సాగింది!

సమాధానం దొరికిందనుకున్న సమయంలో నాకు ప్రమాదం జరిగింది. ఒక రేసర్ బైక్ వేగంగా వచ్చి నా మీదుగా దూసుకెళ్లింది. వెనక్కి తప్పుకునేలోపే జారి పడిపోయాను. ప్రపంచం తలకిందులైంది. లైట్లు కనిపించటం లేదు. శబ్దం వినబడటం లేదు.



కళ్లుతెరిచేసరికి హాస్పిటల్ మంచంమీద ఉన్నాను.

పక్కన రవి. అతని కళ్లలో ఆశ్చర్యం. “న్యూస్ చదివావా?” అని అడిగాడు. పేపర్ చివరి లైన్‌లో ఇలా ఉంది. ‘గొడవను చల్లార్చిన యువకుడు తర్వాత ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు అతడిని నగరపు రాత్రుల్లో తరచూ కనిపించే అదృశ్య వ్యక్తిగా పేర్కొన్నారు.’

నేను రవిని చూసి నవ్వాను. “నేనా?” అన్నాను.

అతను భుజాలు ఎత్తాడు. “మేము చూసింది నిన్నే మరి. నువ్వు ముందుకు వెళ్లి మాట్లాడావు. వాళ్లు ఆగిపోయారు. తర్వాత నువ్వు మళ్లీ మా దగ్గరే ఉన్నావు.”

“అవునా! నాకు ఏం గుర్తులేదు.”

అక్కడే కథ ముగిసిందనుకుంటే — అబ్బే! అది ఒక మనిషి అస్తిత్వానికి సంబంధించిన గందరగోళం మాత్రమే!

అయితే, అసలు విషయం చెప్పాలి, కథలో ఇక్కడే ఆసక్తికరమయిన మలుపు తిరిగింది. రెండు రోజుల తర్వాత మళ్లీ అదే చోటుకి వెళ్లాను. మరో గుంపు. మరో వాదన.

ఎవరో ముందుకు వెళ్లి మధ్యలో నిలబడ్డారు. కొన్ని క్షణాల తరువాత, ఆ వ్యక్తి వెనక్కి తిరిగాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించింది. అది నేను మాత్రం కాదు. కానీ నాలాంటి మామూలు మనిషే. అతను నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఎవరూ ఆపలేదు. ఎవరూ అడగలేదు. అక్కడ గుంపు చెదిరిపోయింది.

అప్పుడు నాకు అర్థమైంది. అది ఒక బాధ్యత.

నగరం మొత్తం మౌనంగా ఉండే క్షణంలో ఎవరో ఒకరు ముందుకు రావడం. ఆ ఒక్క అడుగు. ఆ ఒక్క మాట. ఆ ఒక్క జోక్యం. మిగతావాళ్లు అది చూసి, తర్వాత కథగా చెప్పుకోవడం. ఎందుకంటే అందరూ వెనక్కి తగ్గిన క్షణంలో, ఎవరో ఒకరు ఉన్నారని ఈ నగరం నమ్ముతుంది.

మనమందరం మన జీవితాల్లో ఒకసారి అయినా ఆ పాత్రలో ఉంటాం. కానీ తర్వాత మనమే మర్చిపోతాం. మనమే దాన్ని ఒక మాయమనిషికి అప్పగిస్తాం. కాపాడేవాడు బయట ఉండడు. మనలో ఎవరో ఒకరు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నగరం ఊపిరి తీసుకుంటుంది.

అందుకే ఈ కథకు చివర్లో పెద్ద రహస్యమే లేదు. ఎలాంటి ముసుగు కూడా లేదు. ఆ ఒకడు ఎక్కడో తిరుగుతున్న అదృశ్యవీరుడు కాదు. ఈ రాత్రి గొడవ మధ్యలో నిలబడేవాడు. రేపు కాఫీ షాప్‌లో ఒక మాటతో విడిపోవడం ఆపేవాడు. ఎల్లుండి హాస్పిటల్ గదిలో ఒక చేతిని పట్టేవాడు.

కాబట్టి ఈ రాత్రి మీరు బయటికి వెళ్తే, ఎక్కడైనా గొడవ వినిపిస్తే, ఒక క్షణం ఆగి చూడండి. మీరు ముందుకు వెళ్లకపోతే – ఈ నగరం మళ్లీ చెబుతుంది: అదే మీరు వెళ్లి మాట్లాడితే – రేపటి పేపర్‌లో, టీవీలో, సోషల్ మీడియాలో అతడిగా, మీ గురించి రాస్తారు.

అది మీరు చదువుతారు.

అతడు ఈ నగరపు రాత్రుల్లో ఎప్పుడో, ఎక్కడో మాయలా కనబడే అదృశ్య ప్రయాణికుడు అని మాత్రమే చెప్తారు. ఆ రాత్రి నేను తెలుసుకున్న ఒక నిజం – ఈ నగరంలో కథలు చాలానే ఉంటాయి. ‘ఒకడుంటాడు’ అన్న మాట మరింతగా వ్యాపిస్తుంది. అతడు హీరో కాదు. పోస్టర్ల మీద కనిపించడు. పోలీసుల రికార్డుల్లో పేరు ఉండదు.

ఆ ఒకడెవరో – నగరమే తెలియనివ్వదు.