దూతవాక్యం – సమూలానువాదం

పూర్వరంగం

కథాసంగ్రహం

ఆసన్నమైయున్న మహాయుద్ధం నిమిత్తమై మంత్రాలోచన చేసేందుకు సభను ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. భీష్ముడిని తమ సర్వసైన్యాధిపతిగా ఎన్నుకున్న కాస్సేపట్లో పాండవదూతగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు, సంధి పొసగదన్న నిశ్చయంతోనే.

దూతను అమర్యాద చేద్దామనుకున్న దుర్యోధనుడి పథకం కృష్ణమాయ ముందు చతికిలపడుతుంది. కుశలప్రశ్నలతో మొదలవుతుంది సంభాషణ. కృష్ణుడి నయోక్తుల, భయోక్తుల వానను దులిపేసుకున్న దుర్యోధనుడు (మూల)కథాప్రకారం కృష్ణుణ్ణి బంధించబోతాడు; భంగపడతాడు. క్రుద్ధుడైన కృష్ణుడు దుర్యోధనుడిని సంహరించడానికి సుదర్శనచక్రాన్ని ఆహ్వానిస్తాడు. సుదర్శనం సమయానికి తగు మాటలాడి ఆయన్ని శాంతింపజేస్తుంది. ఆ చక్రమూ, తనను అనుసరించి వచ్చి నాటకాన్ని కొంచెం సాగదీసిన గదాఖడ్గాదులు తిరిగి వెళ్ళిపోయాక, కృష్ణుకు కూడా బయల్దేరబోతుండగా ధృతరాష్ట్రుడు వచ్చి క్షమాపణ వేడుకుంటాడు. అతణ్ణి మన్నించేసి కృష్ణుడు భరతవాక్యం చదవడంతో నాటకం పూర్తవుతుంది.

కొన్ని విశేషాలు

  1. ఇదీ వ్యాయోగమే: ఏకాంకిక; వీరరసప్రధానం; ఐతిహాసికేతివృత్తం; ప్రఖ్యాతుడూ, దివ్యుడూ అయిన నాయకుడు; కథాకాలం ఒకే ఒక్క రోజు.
  2. నాటకారంభంలో వచ్చే మంగళశ్లోకంలో “నముచి అనే రాక్షసుణ్ణి కొనగోటితో ఆకాశంలోకి చిమ్మివేసిన ఉపేంద్రుడి (వామనుడి) పాదం మనను కాపాడుగాక” అని ఉంటుంది. ఋగ్వేదంలోనూ, మహాభారతంలోనూ, భాగవతంలోనూ కనబడే కథల్లో నముచిని ఇంద్రుడు హతమారుస్తాడు, ఉపేంద్రుడు కాదు. మరి భాసుడు నముచివధను ఉపేంద్రుడి ఖాతాలో ఎందుకు వేసాడు?

    “ఋగ్వేదంలో వచ్చే నముచి మొదలైన రాక్షసులు మేఘాలలో నివసిస్తూ వర్షజలం భూమికి చేరకుండా అడ్డుపడుతుంటారు. ఇంద్రుడు ఆ రాక్షసులను సంహరించి వర్షధారలను ప్రవహింపజేస్తాడు. ఆకాశాన్ని ఆక్రమించిన వామనపాదపు కొనగోరు ఆ నముచిని చిమ్మే ఉండాలి,” అని వ్యాఖ్యానించారు “ఒక అనుభవజ్ఞులైన విశ్వవిద్యాలయాచార్యులు.

  3. ఈ నాటకంలో, దుర్యోధనుడి సభలో భీష్మాది సభాసదులు కనబడరు. దుర్యోధనుడు వారిని ప్రశ్నిస్తూ, వాళ్ళ మాటలను వింటున్నట్లు నటిస్తూ తన మాటల్లో అప్పజెబుతూ ఉంటాడు. ఈ సంభాషణాప్రక్రియను ఆకాశభాషితం అంటారు.
  4. ద్రౌపదీపరాభవపు చిత్రపటం ఆధారంగా వెనకటి కథను గుర్తుకు చేయడం భాసుడి ఊహావైచిత్రికి తార్కాణం. ఈ ఫ్లాష్‌బాక్, వేగంగా సాగే కథకు లోతును సమకూరుస్తుంది, ప్రేక్షకుల ఆసక్తిని చెదరకుండా కాపాడుతుంది, దుర్యోధనుడి స్వభావంలోని వికృతులను నొక్కి చెబుతుంది కూడా.
  5. కాలికేస్తే మెడకేసి మాట్లాడడంలో దిట్ట అయిన దుర్యోధనుడు ఒకచోట “తృణాన్తరాభిభాష్యో భవాన్” (తమరు గడిపరక కన్నా హీనం అనే అర్థంలో) అని నిరసిస్తాడు కృష్ణుడిని. ఆ మాట చదివినప్పుడు, రావణుడితో మాట్లాడేప్పుడు సీత గడ్డిపోచను నడుమన ఉంచుకొని మాట్లాడిన వైనం గుర్తుకు వచ్చింది.
  6. “సముద్రందాకా విస్తరించినదీ, హిమాలయాలూ, వింధ్యపర్వతమూ కుండలాలుగా కలదీ అయిన భూమిని రాజసింహుడు పరిపాలించుగాక” అనే భరతవాక్యంతో ఈ నాటకం ముగుస్తుంది. భాసనాటకచక్రంలోని ఏడు నాటకాల భరతవాక్యాలలో రాజసింహుడి పేరు వస్తుంది. మూడింట రాజసింహుడి పేరూ, హిమవద్వింధ్యకుండల అనే ఉత్ప్రేక్షా కనబడతాయి. “ఎవరీ రాజసింహుడు?” “హిమవద్వింధ్యకుండల, సాగరపర్యంత అనే మాటలు అతడి రాజ్యపు విస్తృతిని సూచిస్తాయా?” వంటి ప్రశ్నలు “భాససమస్య”లో భాగాలే.

పాత్రలు

  1. కంచుకి – బాదరాయణుడని పేరు
  2. దుర్యోధనుడు
  3. వాసుదేవుడు
  4. ధృతరాష్ట్రుడు
  5. సుదర్శనము – వాసుదేవుడి చక్రము



(నాన్ద్యన్తే తతః ప్రవిశతి సూత్రధారః ।)

సూత్రధారః:
పాదః పాయాదుపేన్ద్రస్య సర్వలోకోత్సవః స వః ।
వ్యావిద్ధో నముచిర్యేన తనుతామ్రనఖేన ఖే ।। 1 ।।
ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి । అయే కిం ను ఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే? అఙ్గ, పశ్యామి ।

(నాంది ముగిశాక, సూత్రధారుడు ప్రవేశిస్తాడు.)

సూత్రధారుడు:
చిన్నగా, ఎఱ్ఱగా ఉన్న ఏ కాలిగోటితోనైతే నముచి అనే అసురుడు ఆకాశంలోనికి విసిరివేయబడ్డాడో, అన్ని లోకాలకు ఆనందాన్ని కలిగించే ఆ వామనుడి పాదము మిమ్ములను కాపాడుగాక.

పూజ్యులైన మీకు మనవి చేసుకుంటున్నాను… అరె, ఇదేమిటి? ప్రేక్షకులకు నా మనవి వినిపించబోతుండగా, ఏదో శబ్దం వినబడుతున్నది? చూస్తాను.

(నేపథ్యే)
భో భోః ప్రతిహారాధికృతాః! మహారాజో దుర్యోధనః సమాజ్ఞాపయతి ।

(నేపథ్యంలో)
ఓ ద్వారపాలకులారా, దుర్యోధనమహారాజు ఆజ్ఞాపిస్తున్నాడు.

సూత్రధారః:
భవతు, విజ్ఞాతమ్ ।
ఉత్పన్నే ధార్తరాష్ట్రాణాం విరోధే పాణ్డవైః సహ ।
మన్త్రశాలాం రచయతి భృత్యో దుర్యోధనాజ్ఞయా ।। 2 ।।
(నిష్క్రాన్తః ।)
స్థాపనా ।
సూత్రధారుడు:
ఓహో, తెలిసిపోయింది.
పాండవులతో వైరం కలిగింది. ఆ విషయమై సమాలోచనం చేసేందుకు, దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు, సేవకుడు సభను సిద్ధం చేస్తున్నాడు.
(వెళ్ళిపోతాడు)
(స్థాపన)
(తతః ప్రవిశతి కాఞ్చుకీయః ।)
కాఞ్చుకీయః:
భో భోః ప్రతిహారాధికృతాః! మహారాజో దుర్యోధనః సమాజ్ఞాపయతి–అద్య సర్వపార్థివైః సహ మన్త్రయితుమిచ్ఛామి । తదాహూయన్తాం సర్వే రాజాన ఇతి । (పరిక్రమ్యావలోక్య)
అయే అయం మహారాజో దుర్యోధన ఇత ఏవాభివర్తతే । య ఏషః,

శ్యామో యువా సితదుకూలకృతోత్తరీయః
సచ్ఛత్రచామరవరో రచితాఙ్గరాగః ।
శ్రీమాన్ విభూషణమణిద్యుతిరఞ్చితాఙ్గో
నక్షత్రమధ్య ఇవ పర్వగతః శశాఙ్కః ।। 3 ।।

కంచుకి:
ఓ ద్వారపాలకులారా, దుర్యోధనమహారాజు ఆజ్ఞాపిస్తున్నాడు – “నేడు రాజులందరితో కలిసి సమాలోచన చేయాలనుకుంటున్నాను. అందుచేత, రాజులందరినీ ఆహ్వానించండి,” అని. అరె! ఈ దుర్యోధనమహారాజు ఇటే వస్తున్నాడు. ఈయన…

నల్లనివాడు. యువకుడు. తెల్లని పట్టు ఉత్తరీయాన్ని ధరించి, మహారాజోచితమైన ఛత్రచామరాలతో, చందనపు మైపూతతో, నగలలోని మణుల వెలుగులో మెరుస్తున్న దేహంతో ఉన్నవాడు. శ్రీమంతుడు. చుక్కల నడుమన పున్నమి చంద్రుడిలా ఉన్నవాడు.

(తతః ప్రవిశతి యథానిర్దిష్టో దుర్యోధనః ।)
దుర్యోధనః:
ఉద్ధూతరోషమివ మే హృదయం సహర్షం
ప్రాప్తం రణోత్సవమిమం సహసా విచిన్త్య ।
ఇచ్ఛామి పాణ్డవబలే వరవారణానా–
ముత్కృత్తదన్తముసలాని ముఖాని కర్తుమ్ ।। 4 ।।
(కంచుకి దారి చూపించగా, దుర్యోధనుడు ప్రవేశిస్తాడు.)
దుర్యోధనుడు:
యుద్ధపు సంబరం సమీపిస్తున్నదన్న తలపుతో నా కోపమంతా ఎగురగొట్టబడింది. హృదయం సంతోషభరితమయ్యింది. పాండవసైన్యంలోని శ్రేష్ఠమైన ఏనుగుల ముఖాలనుంచి రోకళ్ళవలె ఉన్న వాటి దంతాలను పెకలించాలని నా కోరిక.
కాఞ్చుకీయః:
యదాజ్ఞాపయతి మహారాజః । (నిష్క్రాన్తః ।)
కంచుకి:
చిత్తం ప్రభూ! (వెళ్ళిపోతాడు)
దుర్యోధనః:
ఆర్యౌ వైకర్ణవర్షదేవౌ! ఉచ్యతామ్ – అస్తి మమైకాదశాక్షౌహిణీబలసముదయః । అస్య కః సేనాపతిర్భవితుమర్హతి । కిం కిమాహతుర్భవన్తౌ–మహాన్ ఖల్వయమర్థః । మన్త్రయిత్వా వక్తవ్యమితి । సదృశమేతత్ । తదాగమ్యతాం మన్త్రశాలామేవ ప్రవిశామః । ఆచార్య అభివాదయే । ప్రవిశతు భవాన్ మన్త్రశాలామ్ । మాతుల! అభివాదయే । ప్రవిశతు భవాన్ మన్త్రశాలామ్ । ఆర్యౌ వైకర్ణవర్షదేవౌ! ప్రవిశతాం భవన్తౌ । భో భోః సర్వక్షత్రియాః! స్వైరం ప్రవిశన్తు భవన్తః । వయస్య! కర్ణ! ప్రవిశామస్తావత్ ।
దుర్యోధనుడు:
ఆర్యులైన వైకర్ణ వర్షదేవులారా! చెప్పండి – నా పదకొండు అక్షౌహిణుల సేనకు అధిపతి అయ్యే అర్హత ఉన్నవారెవరు?

ఏమీ, ఏమంటున్నారు మీరిద్దరూ? ఇది చాలా పెద్ద విషయం కదా. సంప్రదింపుల తరువాత చెప్పడం ఉచితమని అంటున్నారా. మంచి మాటే. రండి మరి, సభామందిరంలోనికి ప్రవేశిద్దాము.

ద్రోణాచార్యా! నమస్కరిస్తున్నాను. సభలోనికి రండి. శకుని మామా! మీకు నమస్కరిస్తున్నాను, సభలోనికి రండి. వైకర్ణా! వర్షదేవా! మీరూ రండి. అందరు రాజులారా, నిస్సంకోచంగా ప్రవేశించండి. మిత్రమా కర్ణా! మనమూ ప్రవేశిద్దాము.

(ప్రవిశ్య) ఆచార్య! ఏతత్ కూర్మాసనమ్, ఆస్యతామ్ । పితామహ! ఏతత్ సింహాసనమ్, ఆస్యతామ్ । మాతుల! ఏతచ్చర్మాసనమ్, ఆస్యతామ్ । ఆర్యౌ వైకర్ణవర్షదేవౌ! ఆసాతాం భవన్తౌ । భో భోః సర్వక్షత్రియాః! స్వైరమాసతాం భవన్తః । కిమితి కిమితి మహారాజో నాస్త ఇతి । అహో సేవాధర్మః । నన్వయమహమాసే । వయస్య కర్ణ! త్వమప్యాస్స్వ ।
ఆచార్యా! ఇదిగో కూర్మాసనం. ఆసీనులు కండి. పితామహా! ఈ సింహాసనాన్ని అధిష్ఠించండి. మామా! ఈ చర్మాసనంపై కూర్చోండి. వైకర్ణవర్షదేవులారా! మీరూ కూర్చోవచ్చును. రాజపురుషులారా, మీరూ నిస్సంకోచంగా కూర్చోండి. ఏమేమి, మహారాజు ఇంకా కూర్చోలేదు కదా అని అంటున్నారా? ఆహా! ఎంతటి సేవాధర్మము! ఇదిగో, నేనూ కూర్చుంటున్నాను. మిత్రమా కర్ణా, నీవూ కూర్చో.
(ఉపవిశ్య) ఆర్యౌ వైకర్ణవర్షదేవౌ! ఉచ్యతామ్ – అస్తి మమైకాదశాక్షౌహిణీబలసముదాయః । అస్య కః సేనాపతిర్భవితుమర్హతీతి । కిమాహతుర్భవన్తౌఅత్రభవాన్ గాన్ధారరాజో వక్ష్యతీతి ।
(కూర్చొని) ఆర్య వైకర్ణా! ఆర్య వాసుదేవా! చెప్పండి – నావద్ద పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉన్నది. దానికి సేనాపతి అయ్యే అర్హత ఎవరికి ఉన్నది? ఏమంటున్నారు? గౌరవనీయులైన గాంధారరాజు ఈ విషయమై మాట్లాడనున్నాడని అంటున్నారా?
భవతు, మాతులేనాభిధీయతామ్ । కిమాహ మాతులః? అత్రభవతి గాఙ్గేయే స్థితే కోఽన్యః సేనాపతిర్భవితుమర్హతీతి । సమ్యగాహ మాతులః । భవతు భవతు, పితామహ ఏవ భవతు । వయమప్యేతదభిలషామః ।

సేనానినాదపటహస్వనశఙ్ఖనాదై–
శ్చణ్డానిలాహతమహోదధినాదకల్పైః ।
గాఙ్గేయమూర్ధ్ని పతితైరభిషేకతోయైః
సార్ధం పతన్తు హృదయాని నరాధిపానామ్ ।। 5 ।।

అలాగే, మా మేనమామనే చెప్పనిద్దాము. ఏమంటున్నారు, మామా? పూజ్యుడైన భీష్ముడుండగా ఇంకెవ్వరు సేనానిగా ఉండేందుకు అర్హులని అంటున్నారా? బాగా చెప్పారు మామా! అలాగే, అలాగే. తాతగారే సేనాపతి కావాలి. మేమూ అదే కోరుకుంటున్నాము.

తీవ్రమైన గాలిచేత కొట్టబడిన సముద్రపు హోరును తలపింపజేస్తూ సైనికుల జయధ్వానాలు, భేరీధ్వనులు, శంఖనాదాలు మోగుతూ ఉండగా భీష్ముడి తలపై పడుతున్న అభిషేకజలాలలాగా శత్రురాజుల గుండెలు నేలఁ జారి పడిపోవుగాక!

కాఞ్చుకీయః:
(ప్రవిశ్య) జయతు మహారాజః । ఏష ఖలు పాణ్డవస్కన్ధావారాద్ దౌత్యేనాగతః పురుషోత్తమో నారాయణః ।
కంచుకి:
(లోనికి వచ్చి) మహారాజుకు జయమగుగాక. పాండవుల శిబిరంనుంచి దౌత్యం కోసం పురుషోత్తముడైన నారాయణుడు వచ్చాడు.
దుర్యోధనః:
మా తావద్ భో బాదరాయణ । కిం కిం కంసభృత్యో దామోదరస్తవ పురుషోత్తమః । స గోపాలకస్తవ పురుషోత్తమః । బార్హద్రథాపహృతవిషయకీర్తిభోగస్తవ పురుషోత్తమః । అహో పార్థివాసన్నమాశ్రితస్య భృత్యజనస్య సముదాచారః । సగర్వం ఖల్వస్య వచనమ్ । ఆ అపధ్వంస ।
దుర్యోధనుడు:
అలా అనవద్దు, బాదరాయణా! కంసుడి భృత్యుడైన దామోదరుడు పురుషోత్తముడా? ఆ గొల్లవాడా నీకు పురుషోత్తముడు? జరాసంధుడిచేత రాజ్యమూ, కీర్తీ, భోగమూ అపహరించబడినవాడు పురుషోత్తముడా? అహో! రాజుగారిని ఆశ్రయించి ఉన్న భృత్యుడి మర్యాద ఇలా ఉంటుందా? వీడి మాటల్లో ఎంత పొగరు ఉన్నది! ఆహ్, ఫో ఇక్కణ్ణుంచి.
కాఞ్చుకీయః:
ప్రసీదతు మహారాజః । సంభ్రమేణ సముదాచారో విస్మృతః । (పాదయోః పతతి ।)
కంచుకి:
మన్నించాలి మహారాజా! తడబాటు కారణంగా మర్యాదను మరిచిపోయాను (కాళ్ళపైబడతాడు)
దుర్యోధనః:
సంభ్రమ ఇతి । ఆ మనుష్యాణామస్త్యేవ సంభ్రమః । ఉత్తిష్ఠోత్తిష్ఠ ।
దుర్యోధనుడు:
తడబాటు! అవును, మనుషులన్నాక తడబాటు ఉండే తీరుతుంది. లే, లే!
కాఞ్చుకీయః:
అనుగృహీతోఽస్మి ।
కంచుకి:
అనుగ్రహించబడ్డాను.
దుర్యోధనః:
ఇదానీం ప్రసన్నోఽస్మి । క ఏష దూతః ప్రాప్తః ।
దుర్యోధనుడు:
ఇప్పుడు ప్రసన్నుడనయ్యాను. ఆ వచ్చిన దూత ఎవరు?
కాఞ్చుకీయః:
దూతః ప్రాప్తః కేశవః ।
కంచుకి:
కేశవుడు.
దుర్యోధనః:
కేశవ ఇతి । ఏవమేష్టవ్యమ్ । అయమేవ సముదాచారః । భో భో రాజానః! దౌత్యేనాగతస్య కేశవస్య కిం యుక్తమ్ । కిమాహుర్భవన్తః? అర్ఘ్యప్రదానేన పూజయితవ్యః కేశవ ఇతి । న మే రోచతే ।

గ్రహణమస్యాత్ర హితం పశ్యామి ।
గ్రహణముపగతే తు వాసుభద్రే
హృతనయనా ఇవ పాణ్డవా భవేయుః ।
గతిమతిరహితేషు పాణ్డవేషు
క్షితిరఖిలాపి భవేన్మమాసపత్నా ।। 6 ।।

అపి చ యోఽత్ర కేశవస్య ప్రత్యుత్థాస్యతి స మయా ద్వాదశసువర్ణభారేణ దణ్డ్యః । తదప్రమత్తం భవన్తు భవన్తః ।

దుర్యోధనుడు:
కేశవుడు! ఇదీ పిలవాల్సిన తీరు! ఇదీ వ్యవహరించాల్సిన తీరు! ఓ రాజులారా! దూతగా వచ్చిన కేశవుడితో ఎలా వ్యవహరించాలి? ఏమంటున్నారు? కేశవుడు అర్ఘ్యమిచ్చి పూజించదగ్గవాడనా? నాకా మాట నచ్చలేదు. బంధించడమే మంచిదని నా అభిప్రాయం.

వాసుదేవుణ్ణి బంధించితే, పాండవులు కళ్ళు పోగొట్టుకున్నవాళ్ళవుతారు. గతీ మతీ లేని ఆ పరిస్థితిలో పాండవులుండగా, ఏ పోటీ లేకుండా, భూమి యావత్తూ నాదే అవుతుంది.

ఇంకో మాట – కృష్ణుడు సభలోకి ప్రవేశిస్తుండగా లేచి నిలబడి లేదా ఎదురేగి స్వాగతించినవారు పన్నెండు కావళ్ళ బంగారాన్ని అపరాధశుల్కంగా చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరంతా హెచ్చరికగా ఉండండి.

(ఆత్మగతమ్) కో ను ఖలు మమాప్రత్యుత్థానస్యోపాయః । హన్త దృష్ట ఉపాయః । (ప్రకాశమ్) బాదరాయణ! ఆనీయతాం స చిత్రపటో నను, యత్ర ద్రౌపదీకేశామ్బరాకర్షణమాలిఖితమ్ । (ఆత్మగతమ్) తస్మిన్ దృష్టివిన్యాసం కుర్వన్ నోత్థాస్యామి కేశవస్య ।
(తనలో) స్వాగతార్థం లేచి నిలబడకుండా ఉండేందుకు నాకు పనికొచ్చే ఉపాయం ఏమిటి? భలే! తట్టింది. (బయటకు వినబడేలా) బాదరాయణా, ద్రౌపది జుట్టును, బట్టలను లాగుతున్న దృశ్యం ఉన్న ఆ చిత్రపటాన్ని తీసుకొని రా. (తనలో) నా చూపును ఆ బొమ్మపై నిలిపి, కృష్ణుడు వచ్చినప్పుడు లేవకుండా పరాకు నటిస్తాను.
కాఞ్చుకీయః:
యదాజ్ఞాపయతి మహారాజః । (నిష్క్రామ్య ప్రవిశ్య) జయతు మహారాజః । అయం స చిత్రపటః ।
కంచుకి:
అలాగే, మహారాజా! (నిష్క్రమించి, తిరిగి ప్రవేశించి) మహారాజుకు జయమగుగాక. ఇదిగో, ఆ చిత్రపటం.
దుర్యోధనః:
మమాగ్రతః ప్రసారయ ।
దుర్యోధనుడు:
నా ముందు దాన్ని పరువు.
కాఞ్చుకీయః:
యదాజ్ఞాపయతి మహారాజః । (ప్రసారయతి ।)
కంచుకి:
చిత్తం, మహారాజా! (పరుస్తాడు.)
దుర్యోధనః:
అహో దర్శనీయోఽయం చిత్రపటః। ఏష దుఃశాసనో ద్రౌపదీం కేశహస్తే గృహీతవాన్। ఏషా ఖలు ద్రౌపదీ,

దుఃశాసనపరామృష్టా సంభ్రమోత్ఫుల్లలోచనా ।
రాహువక్త్రాన్తరగతా చన్ద్రలేఖేవ శోభతే ।। 7 ।।

దుర్యోధనుడు:
ఆహాహా! చూడదగ్గదీ చిత్రపటం. ఇదిగో, ఈ దుశ్శాసనుడు ద్రౌపది జుత్తును చేతితో పట్టుకొని ఉన్నాడు. ఈమె కదా ద్రౌపది —

దుశ్శాసనుడి చేత చిక్కి తత్తరపాటుతో విప్పారిన కళ్ళతో రాహువు నోటబడ్డ నెలవంకలా ప్రకాశిస్తున్నది.

ఏష దురాత్మా భీమః సర్వరాజసమక్షమవమానితాం ద్రౌపదీం దృష్ట్వా ప్రవృద్ధామర్షః సభాస్తమ్భం తులయతి ।
దురాత్ముడైన ఈ భీముడు రాజులందరి ఎదుట అవమానించబడ్డ ద్రౌపదిని చూసి, కోపం పెచ్చరిల్లుతుండగా, సభాస్తంభాన్ని (తనకు ఆయుధంగా పనికొస్తుందా అని), కళ్ళతో కొలత వేస్తున్నాడు.
ఏష యుధిష్ఠిరః,

సత్యధర్మఘృణాయుక్తో ద్యూతవిభ్రష్టచేతనః ।
కరోత్యపాఙ్గవిక్షేపైః శాన్తామర్షం వృకోదరమ్ ।। 8 ।।

ఇతడు యుధిష్ఠిరుడు…

సత్యమూ, ధర్మమూ, కరుణా ఉన్నవాడే. జూదం కారణంగా బుద్ధి భ్రష్టమైనవాడు. కృద్ధవృకోదరుడిని తన కడగంటి చూపులతో శాంతింపజేస్తున్నాడు.

ఏష ఇదానీమర్జునః —

రోషాకులాక్షః స్ఫురితాధరోష్ఠ–
స్తృణాయ మత్వా రిపుమణ్డలం తత్ ।
ఉత్సాదయిష్యన్నివ సర్వరాజ్ఞః
శనైః సమాకర్షతి గాణ్డివజ్యామ్ ।। 9 ।।

ఏష యుధిష్ఠిరోఽర్జునం నివారయతి ।

ఇక ఈ అర్జునుడు…

కోపంతో కలవరపడిన కన్నుల వాడు. క్రింది పెదవి వణుకుతున్నవాడు. శత్రుసమూహాన్ని గడ్డిపరకలా పరిగణించి, రాజులందరినీ నశింపజేసేందుకా అన్నట్లు నెమ్మదిగా గాండీవపు నారిని లాగుతున్నాడు.
యుధిష్ఠిరుడు అతణ్ణి నిలువరిస్తున్నాడు.

ఏతౌ నకులసహదేవౌ —

కృతపరికరబన్ధౌ చర్మనిస్త్రింశహస్తౌ
పరుషితముఖరాగౌ స్పష్టదష్టాధరోష్ఠౌ ।
విగతమరణశఙ్కౌ సత్వరం భ్రాతరం మే
హరిమివ మృగపోతౌ తేజసాభిప్రయాతౌ ।। 10 ।।

ఈ ఇద్దరు నకులసహదేవులు.

నడుమును బిగించి కట్టుకొని, కత్తినీ డాలునూ చేత పూని ఉన్నారు. కర్కశత్వంతో వీరిద్దరి ముఖాలు ఎఱ్ఱబడ్డాయి. క్రింది పెదవిని గట్టిగా పంటితో అదిమిపెట్టారు. మరణశంకను విడిచిపెట్టారు. సింహం పైకి ఉరుకుతున్న లేడి పిల్లలలా దుశ్శాసనుడి వైపుకు వేగంగా కదులుతున్నారు.

ఏష యుధిష్ఠిరః కుమారవుపేత్య నివారయతి —

నీచోఽహమేవ విపరీతమతిః కథం వా
రోషం పరిత్యజతమద్య నయానయజ్ఞౌ ।
ద్యూతాధికారమవమానమమృష్యమాణాః
సత్త్వాధికేషు వచనీయపరాక్రమాః స్యుః ।। 11 ।।[
ఇతి ।

యుధిష్ఠిరుడు ఆ పిల్లలనిద్దరినీ సమీపించి నివారిస్తున్నాడు –-

“యుక్తాయుక్తవిచక్షణ నశించిన వాడిని, ఎంతటి నీచుడను నేను! ధర్మాధర్మాలు తెలిసినవారు మీరు. కోపాన్ని వదిలిపెట్టండి నేడు, జూదంలో ఓడిపోవడంవల్ల కలిగిన అవమానాన్ని సహించక గెలిచినవారిపై తమ పరాక్రమాన్ని చూపేవారు వీరుల నిందకు పాత్రులవుతారు.” అని అంటూ.

ఏష గాన్ధారరాజః —

అక్షాన్ క్షిపన్ సకితవం ప్రహసన్ సగర్వం
సఙ్కోచయన్నివ ముదం ద్విషతాం స్వకీర్త్యా ।
స్వైరాసనో ద్రుపదారాజసుతాం రుదన్తీం
కాక్షేణ పశ్యతి లిఖత్యపి గాం నయజ్ఞః ।। 12 ।।

ఇతడు గాంధారరాజైన శకుని –-

ఈ ద్యూతనిపుణుడు తన అక్షవిద్యాప్రావీణ్యపు కీర్తితో శత్రువుల సంతోషాన్ని కుంచింపజేస్తున్నట్లుగా పాచికలను విసురుతూ, సగర్వంగా కుటిలపు నవ్వు నవ్వుతూ, ఎవ్వరినీ లక్ష్యపెట్టకుండా కూర్చొని, ఏడుస్తూ ఉన్న ద్రౌపదిని క్రీగంట చూస్తూ, నేల మీద ఏదో వ్రాస్తున్నాడు.

ఏతావాచార్యపితామహౌ తాం దృష్ట్వా లజ్జాయమానౌ పటాన్తాన్తర్హితముఖౌ స్థితౌ ।
ఈ భీష్మద్రోణులు ఆమెను చూస్తూ సిగ్గుపడుతూ ఉత్తరీయపుటంచులతో తమ ముఖాలను కప్పుకొని ఉన్నారు.
అహో అస్య వర్ణాఢ్యతా । అహో భావోపపన్నతా । అహో యుక్తలేఖతా । సువ్యక్తమాలిఖితోఽయం చిత్రపటః। ప్రీతోఽస్మి । కోఽత్ర ।
ఆహా! ఏమి ఈ చిత్రపటపు వర్ణసంపద! ఎంత చక్కటి అభివ్యక్తి! సందర్భోచితమైన చిత్రరచన! అద్భుతంగా ఉన్నది. సంతుష్టుడినయ్యాను. ఎవరక్కడ?
కాఞ్చుకీయః:
జయతు మహారాజః ।
కంచుకి:
జయము మహారాజా!
దుర్యోధనః:
బాదరాయణ! ఆనీయతాం స విహగవాహనమాత్రవిస్మితో దూతః ।
దుర్యోధనుడు:
బాదరాయణా! పక్షివాహనుడనన్న ఒకే ఒక్క కారణంతో మిడిసిపడుతూ ఉన్న ఆ దూతను తీసుకొని రా.
కాఞ్చుకీయః:
యదాజ్ఞాపయతి మహారాజః । (నిష్క్రాన్తః ।)
కంచుకి:
మీ ఆజ్ఞ, ప్రభూ! (వెళ్ళిపోతాడు)
దుర్యోధనః:
వయస్య కర్ణ!

ప్రాప్తః కిలాద్య వచనాదిహ పాణ్డవానాం
దౌత్యేన భృత్య ఇవ కృష్ణమతిః స కృష్ణః ।
శ్రోతుం సఖే! త్వమపి సజ్జయ కర్ణ! కర్ణౌ
నారీమృదూని వచనాని యుధిష్ఠిరస్య ।। 13 ।।

దుర్యోధనుడు:
మిత్రమా కర్ణా!

మలినబుద్ధి అయిన కృష్ణుడు పాండవుల మాటమేరకు సేవకుడిలా వచ్చాడీనాడు… సఖా, కర్ణా! ఆడవాళ్ళ మాటల్లా కోమలంగా ఉండే యుధిష్ఠిరుడి మాటలను వినేందుకు నీ చెవులను సిద్ధంగా ఉంచుకో.

(తతః ప్రవిశతి వాసుదేవః కాఞ్చుకీయశ్చ ।)
వాసుదేవః:
అద్య ఖలు ధర్మరాజవచనాద్ ధనఞ్జయాకృత్రిమమిత్రతయా చాహవదర్పమనుక్తగ్రాహిణం సుయోధనం ప్రతి మయాప్యనుచితదౌత్యసమయోఽనుష్ఠితః । అథ చ,

కృష్ణాపరాభవభువా రిపువాహినీభ–
కుమ్భస్థలీదలనతీక్ష్ణగదాధరస్య ।
భీమస్య కోపశిఖినా యుధి పార్థపత్త్రి–
చణ్డానిలైశ్చ కురువంశవనం వినష్టమ్ ।। 14 ।।

(కృష్ణుడు, కంచుకి ప్రవేశిస్తారు)
వాసుదేవుడు:
నేడు, ధర్మరాజు అడిగినందునా, అర్జునుడి నిష్కపటమైన స్నేహం కారణంగానూ, యుద్ధాహంకారమూ, మాటల్లో చెప్పని అర్థాలనూ గ్రహించే గుణమూ ఉన్న దుర్యోధనుడి వద్దకు దూతగా రావడమనే ఈ అనుచితకార్యాన్ని తలకెత్తుకున్నాను. అయితే –-

శత్రుసేనల ఏనుగుల కుంభస్థలాలను బద్దలుచేసే నిర్దాక్షిణ్యమైన గదను ధరించిన భీముడి క్రోధాగ్ని ద్రౌపదీపరాభవం కారణంగా రగులుకొన్నది. ఆ దావాగ్నివలనా, అర్జునుడి బాణాలనే ప్రచండపవనాలవలనా కురువంశమనే అడవి నశింపనున్నది.

ఇదం సుయోధనశిబిరమ్ । ఇహ హి,

ఆవాసాః పార్థివానాం సురపురసదృశాః స్వచ్ఛన్దవిహితా
విస్తీర్ణాః శస్త్రశాలా బహువిధకరణైః శస్త్రైరుపచితాః ।
హేషన్తే మన్దురాస్థాస్తురగవరఘటా బృంహన్తి కరిణ
ఐశ్వర్యం స్ఫీతమేతత్ స్వజనపరిభవాదాసన్నవిలయమ్ ।। 15 ।।

భోః!

ఇది సుయోధనుడి శిబిరము. ఇక్కడ –-

తమ తమ ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న రాజభవనాలు అమరావతీనగరపు భవనాలను పోలి ఉన్నాయి. ఆయుధాగారాలు విశాలంగా, రకరకాల పనిముట్లతో, ఆయుధాలతో నిండి ఉన్నాయి. అశ్వశాలలలో ఉన్న శ్రేష్ఠమైన గుఱ్ఱాల గుంపులు సకిలిస్తున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. స్వజనపరాభవం కారణంగా ఈ సంపద అంతా త్వరలోనే నశించనున్నది. అయ్యో!

దుష్టవాదీ గుణద్వేషీ శఠః స్వజననిర్దయః ।
సుయోధనో హి మాం దృష్ట్వా నైవ కార్యం కరిష్యతి ।। 16 ।।
చెడుగా మాట్లాడేవాడు, సుగుణాలను ద్వేషించేవాడు, దుష్టుడు, తనవారిపట్ల కనికరం లేనివాడు అయిన సుయోధనుడు నన్ను చూశాక తన కర్తవ్యాన్ని నిర్వర్తించడన్నది నిశ్చయం!
భో బాదరాయణ! కిం ప్రవేష్టవ్యమ్ ।
ఓ బాదరాయణా, ప్రవేశించవచ్చునా?
కాఞ్చుకీయః:
అథ కిమథ కిమ్ । ప్రవేష్టుమర్హతి పద్మనాభః ।
కంచుకి:
తప్పకుండా. పద్మనాభుడు ప్రవేశించవచ్చును.
వాసుదేవః:
(ప్రవిశ్య) కథం కథం మాం దృష్ట్వా సంభ్రాన్తాః సర్వక్షత్రియాః । అలమలం సంభ్రమేణ । స్వైరమాసతాం భవన్తః ।
వాసుదేవుడు:
(ప్రవేశించి) ఇదేమిటి నన్ను చూసి రాజపురుషులందరూ తత్తరపడుతున్నారు? చాలు, చాలునీ తత్తరపాటు. హాయిగా కూర్చోండి.
దుర్యోధనః:
కథం కథం కేశవం దృష్ట్వా సంభ్రాన్తాః సర్వక్షత్రియాః । అలమలం సంభ్రమేణ । స్మరణీయః పూర్వమాశ్రావితో దణ్డః । నన్వహమాజ్ఞప్తా ।
దుర్యోధనుడు:
ఇదేమిటి, కృష్ణుణ్ణి చూసి రాజులంతా కలవరపడుతున్నారు? చాలించండి ఈ కలవరపాటును. ఇంతకు మునుపు నేను ప్రకటించిన అపరాధశుల్కాన్ని జ్ఞాపకం పెట్టుకొండి. నేను కదా ఆజ్ఞాపించేవాడిని.
వాసుదేవః:
భోః సుయోధన! కిమాస్సే ।
వాసుదేవుడు:
ఓ సుయోధనా! కూర్చొని ఉన్నావా?
దుర్యోధనః:
(ఆసనాత్ పతిత్వా ఆత్మగతమ్) సువ్యక్తం ప్రాప్త ఏవ కేశవః ।

ఉత్సాహేన మతిం కృత్వాఽప్యాసీనోఽస్మి సమాహితః ।
కేశవస్య ప్రభావేన చలితోఽస్మ్యాసనాదహమ్ ।। 17 ।।

అహో బహుమాయోఽయం దూతః । (ప్రకాశమ్) భో దూత! ఏతదాసనమాస్యతామ్ ।

దుర్యోధనుడు:
(ఆసనంనుండి క్రిందికి పడిపోయి, తనలో) కేశవుడే వచ్చాడని స్పష్టంగా తెలిసిపోయింది.

సందేహాలకు అతీతంగా బుద్ధిని స్థిరం చేసుకొని అప్రమత్తంగా కూర్చొని ఉన్న నేను కేశవుడి ప్రభావం కారణంగా ఆసనంనుంచి జారిపడ్డాను.

అహో! పలు మాయలవాడు ఈ దూత. (ప్రకాశంగా) ఓయీ దూతా, ఇదిగో ఆసనం, కూర్చోవచ్చును.

వాసుదేవః:
ఆచార్య! ఆస్యతామ్ । గాఙ్గేయప్రముఖా రాజానః స్వైరమాసాం భవన్తః । వయమప్యుపవిశామః । (ఉపవిశ్య) అహో దర్శనీయోఽయం చిత్రపటః । మా తావత్ । ద్రౌపదీకేశధర్షణమత్రాలిఖితమ్ । అహో ను ఖలు,

సుయోధనోఽయం స్వజనావమానం
పరాక్రమం పశ్యతి బాలిశత్వాత్।
కో నామ లోకే స్వయమాత్మదోష–
ముద్ఘాటయేన్నష్టఘృణః సభాసు ।। 18 ।।

ఆః అపనీయతామేష చిత్రపటః ।

వాసుదేవుడు:
ఆచార్యా! కూర్చోండి. భీష్మాది రాజముఖ్యులారా! మీరూ నిస్సంకోచంగా కూర్చోవచ్చును. మేమూ కూర్చుంటాము. (కూర్చొని) ఆహా, ఈ చిత్రపటం చూడచక్కగా ఉన్నది. కాదు, కాదు. ద్రౌపదిని జుట్టుపట్టి ఈడుస్తున్న దృశ్యం చిత్రితమయ్యింది ఇందులో. అయ్యయ్యో!

ఈ సుయోధనుడు మూర్ఖత్వం కొద్దీ తనవారి అవమానాన్ని తన పరాక్రమమన్నట్లుగా భావిస్తున్నాడు. ఏవగింపు లేకుండా, తన దోషాలను తానే సభలో ప్రకటించుకుంటారా ఎవరైనా?

ఛ, ఛ. ఈ చిత్రపటాన్ని ఇక్కణ్ణుంచి తొలగించండి.

దుర్యోధనః:
బాదరాయణ! అపనీయతాం కిల చిత్రపటః ।
దుర్యోధనుడు:
బాదరాయణా! ఈ చిత్రపటాన్ని ఇక్కణ్ణుంచి తీసుకెళ్ళు.
కాఞ్చుకీయః:
యదాజ్ఞాపయతి మహారాజః । (అపనయతి ।)
కంచుకి:
చిత్తం, మహారాజా! (తీసుకెళతాడు)
దుర్యోధనః:
భో దూత!

ధర్మాత్మజో వాయుసుతశ్చ భీమో
భ్రాతార్జునో మే త్రిదశేన్ద్రసూనుః ।
యమౌ చ తావశ్విసుతౌ వినీతౌ
సర్వే సభృత్యాః కుశలోపపన్నాః ।। 19 ।।

దుర్యోధనుడు:
ఓ దూతా!

ధర్మజుడు, వాయునందనుడైన భీముడు, నా తమ్ముడూ దేవేంద్రతనయుడూ అయిన అర్జునుడు, అణకువతో మెలగే ఆ కవలలు –- అశ్వినీసుతులు –- వీరందరూ, వారి భృత్యులతో సహా కుశలంగా ఉన్నారు కదా?

వాసుదేవః:
సదృశమేతద్ గాన్ధారీపుత్రస్య । అథ కిమథ కిమ్ । కుశలినః సర్వే । భవతో రాజ్యే శరీరే బాహ్యభ్యన్తరే చ కుశలమనామయం చ పృష్ట్వా విజ్ఞాపయన్తి యుధిష్ఠిరాదయః పాణ్డవాః –-

అనుభూతం మహద్దుఃఖం సమ్పూర్ణః సమయః స చ ।
అస్మాకమపి ధర్మ్యం యద్ దాయాద్యం తద్ విభజ్యతామ్ ।। 20 ।।

ఇతి ।

వాసుదేవుడు:
గాంధారీనందనుడి ఈ మాటలు సముచితంగా ఉన్నాయి. ఆఁ, కుశలంగా ఉన్నారు, అందరూ. తమ రాజ్యంలో, దేహంలో, బయటా, లోపలా – క్షేమంగురించీ, ఆరోగ్యంగురించీ పరామర్శించి, యుధిష్ఠిరుడు మొదలైన పాండవులు –-

“ఎంతో దుఃఖాన్ని అనుభవించాము. ద్యూతసందర్భపు ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడ్డాము. ధర్మం ప్రకారం దాయాదులుగా మాకు రావలసినదానిని పంచి ఈయగలవు,”

అని మనవి చేస్తున్నారు.

దుర్యోధనః:
కథం కథం దాయాద్యమితి ।

వనే పితృవ్యో మృగయాప్రసఙ్గతః
కృతాపరాధో మునిశాపమాప్తవాన్ ।
తదా ప్రభృత్యేవ స దారనిఃస్పృహః
పరాత్మజానాం పితృతాం కథం వ్రజేత్ ।। 21 ।।

దుర్యోధనుడు:
ఎట్లా? ఏ విధమైన దాయాదితనం ఇది?

అడవిలో మా చిన్నాన్న వేట సందర్భంలో తప్పు చేసి ముని శాపాన్ని పొందాడు. అప్పటినుంచి తను భార్యాసాంగత్యకాంక్షను విడిచిపెట్టాడు. ఇతరులవలన కలిగిన సంతానాన్ని ఆయన సంతానమని ఎలా అంటాము?

వాసుదేవః:
పురావిదం భవన్తం పృచ్ఛామి ।

విచిత్రవీర్యో విషయీ విపత్తిం
క్షయేణ యాతః పునరమ్బికాయామ్ ।
వ్యాసేన జాతో ధృతరాష్ట్ర ఏష
లభేత రాజ్యం జనకః కథం తే ।। 22 ।।

మా మా భవాన్ ।

ఏవం పరస్పరవిరోధవివర్ధనేన
శీఘ్రం భవేత్ కురుకులం నృప! నామశేషమ్ ।
తత్ కర్తుమర్హతి భవానపకృష్య రోషం
యత్ త్వాం యుధిష్ఠిరముఖాః ప్రణయాద్ బ్రువన్తి ।। 23 ।।

వాసుదేవుడు:
వెనుకటి సంగతులు తెలిసినవాడివైన నిన్ను అడుగుతున్నాను.
మరి, విపరీతకామాసక్తుడైన విచిత్రవీర్యుడు క్షయగ్రస్తుడై నశించిపోయినప్పుడు, అంబికకు వ్యాసుడివల్ల జన్మించిన నీ తండ్రి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఎలా పొందాడు?

వద్దు, నీవలా అనవద్దు.

ఈ విధంగా పరస్పరం శత్రుత్వం పెరగడంవల్ల కురువంశం పేరుకు మాత్రమే మిగులుతుంది. అందుచేత నీవు నీ కోపాన్ని అదుపులో పెట్టుకొని, యుధిష్ఠిరాదుల స్నేహపూర్వకమైన మాటలకు అనుగుణంగా నడుచుకో.

దుర్యోధనః:
భో దూత! న జానాతి భవాన్ రాజ్యవ్యవహారమ్ ।

రాజ్యం నామ నృపాత్మజైః సహృదయైర్జిత్వా రిపూన్ భుజ్యతే
తల్లోకే న తు యాచ్యతే న తు పునర్దీనాయ వా దీయతే।
కాఙ్క్షా చేన్నృపతిత్వమాప్తుమచిరాత్ కుర్వన్తు తే సాహసం
స్వైరం వా ప్రవిశన్తు శాన్తమతిభిర్జుష్టం శమాయాశ్రమమ్ ।। 24 ।।

దుర్యోధనుడు:
ఓ రాయబారీ! నీకు రాజ్యవ్యవహారం తెలియదు.

గుండెబలం ఉన్న రాజకుమారులు శత్రువులను గెలిచి రాజ్యాన్ని సాధించుకుంటారు. అది యాచించదగ్గది కాదు, దీనుడికి ఇచ్చేదీ కాదు. అనతికాలంలోనే రాజవ్వాలనే కోరిక ఉంటే, వాళ్ళు యుద్ధం చేయాలి. లేదా తమంతకు తామే – మత్సరభావాన్ని వదిలి – శాంతి కోసం మునివాటికలకు వెళ్ళిపోవాలి.

వాసుదేవః:
భో సుయోధన! అలమలం బన్ధుజనే పరుషమభిధాతుమ్ ।

పుణ్యసంచయసంప్రాప్తామధిగమ్య నృపశ్రియమ్ ।
వఞ్చయేద్ యః సుహృద్బన్ధూన్ స భవేద్ విఫలశ్రమః ।। 25 ।।

వాసుదేవుడు:
ఓ సుయోధనా! బంధువుల గురించి పరుషంగా మాట్లాడడం చాలించు.

పుణ్యాన్ని పోగుచేసుకోవడంవల్ల లభించే రాజ్యసంపదను పొందినవాడు, బంధుమిత్రులను మోసగించితే, అతడి శ్రమ అంతా విఫలమవుతుంది.

దుర్యోధనః:
స్యాలం తవ గురోర్భూపం కంసం ప్రతి న తే దయా ।
కథమస్మాకమేవం స్యాత్ తేషు నిత్యాపకారిషు ।। 26 ।।
దుర్యోధనుడు:
నీ మేనమామా, రాజూ అయిన కంసుడిపట్ల నీవు దయ చూపలేదు. మాపట్ల నిత్యం అపకారభావనతో ఉండే ఆ పాండవులపట్ల మాకు అలాంటి దయాభావం ఎట్లా ఉంటుంది?
వాసుదేవః:
అలం తన్మద్దోషతో జ్ఞాతుమ్ ।

కృత్వా పుత్రవియోగార్తాం బహుశో జననీం మమ ।
వృద్ధం స్వపితరం బద్ధ్వా హతోఽయం మృత్యునా స్వయమ్ ।। 27 ।।

వాసుదేవుడు:
కంసవధ నా దోషమని భావించడం నీకు తగదు.

అనేకపర్యాయాలు నా తల్లికి పుత్రవియోగదుఃఖాన్ని కలిగించి, వృద్ధుడైన తన తండ్రిని బంధించి అతడు తనంతకు తానే మృత్యువుకు లోనయ్యాడు.

దుర్యోధనః:
సర్వథా వఞ్చితస్త్వయా కంసః । అలమాత్మస్తవేన । న శౌర్యమేతత్ । పశ్య,

జామాతృనాశవ్యసనాభితప్తే
రోషాభిభూతే మగధేశ్వరేఽథ ।
పలాయమానస్య భయాతురస్య
శౌర్యం తదేతత్ క్వ గతం తవాసీత్ ।। 28 ।।

దుర్యోధనుడు:
అన్ని విధాలుగా కంసుడు నీచేత మోసగించబడ్డాడు. నిన్ను నీవు పొగడుకోవడం చాలించు. అది శౌర్యం కాదు. చూడు,

అల్లుడి మరణంవల్ల కలిగిన దుఃఖంతో తపించిన జరాసంధుడు కోపపరవశుడైనప్పుడు భయపడి పారిపోయావే, అప్పుడు నీ శౌర్యం ఎక్కడికి పోయింది?

వాసుదేవః:
భో సుయోధన! దేశకాలావస్థాపేక్షితం ఖలు శౌర్యం నయానుగామినామ్ । ఇహ తిష్ఠతు తావదస్మద్గతః పరిహాసః । స్వకార్యమనుష్ఠీయతామ్ ।

కర్తవ్యో భ్రాతృషు స్నేహో విస్మర్తవ్యా గుణేతరాః ।
సమ్బన్ధో బన్ధుభిః శ్రేయాన్ లోకయోరుభయోరపి ।। 29 ।।

వాసుదేవుడు:
సుయోధనా! నీతిని అనుసరించేవారి శౌర్యం దేశకాలాలను బట్టి మారుతూ ఉంటుంది కదా. ఇక నన్ను గేలి చేయడం కట్టిపెట్టు. నీ కర్తవ్యాన్ని నెరవేర్చు.

అన్నదమ్ములతో స్నేహంతో వ్యవహరించాలి. దోషాలను మరిచిపోవాలి. చుట్టాలతో మంచి సంబంధం ఇహపరాలలో శ్రేయోదాయకమవుతుంది.

దుర్యోధనః:
దేవాత్మజైర్మనుష్యాణాం కథం వా బన్ధుతా భవేత్।
పిష్టపేషణమేతావత్ పర్యాప్తం ఛిద్యతాం కథా ।। 30 ।।
దుర్యోధనుడు:
దేవతలకు పుత్రులైన వారితో మనుష్యులకు బంధుత్వం ఎలా ఏర్పడుతుంది? అప్పట్నుంచి పిండి పిసుకుతూనే ఉన్నావు. చాలులే, ఇంక ఈ కథను ముగించు.
వాసుదేవః:
(ఆత్మగతమ్)

ప్రసాద్యమానః సామ్నాయం న స్వభావం విముఞ్చతి ।
హన్త సంక్షోభయామ్యేనం వచోభిః పరుషాక్షరైః ।। 31 ।।

(ప్రకాశమ్) భో సుయోధన! కిం న జానీషేఽర్జునస్య బలపరాక్రమమ్ ।

వాసుదేవుడు:
(తనలో) మంచిమాటలతో బ్రతిమాలితే తన స్వభావాన్ని విడిచిపెట్టడు కదా, ఈ సుయోధనుడు! పరుషమైన మాటలతో కలవరపెడతాను వీడిని.

(పైకి) ఓ సుయోధనా! అర్జునుడి బలపరాక్రమం గురించి నీకు తెలియదా?

దుర్యోధనః:
న జానే ।
దుర్యోధనుడు:
తెలియదు.
వాసుదేవః:
భోః! శ్రూయతాం,

కైరాతం వపురాస్థితః పశుపతిర్యుద్ధేన సన్తోషితో
వహ్నేః ఖాణ్డవమశ్నతః సుమహతీ వృష్టిః శరైశ్ఛాదితా।
దేవేన్ద్రార్తికరా నివాతకవచా నీతాః క్షయం లీలయా
నన్వేకేన తదా విరాటనగరే భీష్మాదయో నిర్జితాః ।। 32 ।।

వాసుదేవుడు:
వినవోయీ.

యుద్ధం చేసి, కిరాతుడి రూపంలో ఉన్న పశుపతిని సంతోషపరిచాడు. అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహిస్తూ ఉన్నప్పుడు కురిసిన పెనువానను బాణాల కప్పుతో నిలువరించాడు. లీలామాత్రంగా, దేవేంద్రుడిని బాధిస్తున్న నివాతకవచులను నశింపజేశాడు. ఒక్కడే కదా, ఆనాడు విరాటనగరంలో భీష్మాదులను ఎదిర్చి గెలిచాడు!

అపి చ, తవాపి ప్రత్యక్షమపరం కథయామి।

నను త్వం చిత్రసేనేన నీయమానో నభస్తలమ్।
విక్రోశన్ ఘోషయాత్రాయాం ఫల్గునేనైవ మోక్షితః ।। 33 ।।

అంతే కాదు. నీ యెఱుకలోని విషయం మరొకటి చెబుతాను —

ఘోషయాత్ర సందర్భంలో, చిత్రసేనుడి చేత ఆకాశమార్గాన తీసుకుపోబడుతున్నప్పడు కేకలు పెడుతూ ఉండిన నిన్ను విడిపించిందీ అర్జునుడే కద?

కిం బహునా,

దాతుమర్హసి మద్వాక్యాద్ రాజ్యార్ధం ధృతరాష్ట్రజ ।
అన్యథా సాగరాన్తాం గాం హరిష్యన్తి హి పాణ్డవాః ।। 34 ।।

ఇన్ని మాటలెందుకు?

ధృతరాష్ట్రనందనా, నా మాట విని రాజ్యంలో అర్ధభాగాన్ని ఇవ్వు. లేదా సముద్రందాకా విస్తరించి ఉన్న యావద్భూమినీ పాండవులు లాగేసుకుంటారు.

దుర్యోధనః:
కథం కథమ్ । హరిష్యన్తి హి పాణ్డవాః ।

ప్రహరతి యది యుద్ధే మారుతో భీమరూపీ
ప్రహరతి యది సాక్షాత్ పార్థరూపేణ శక్రః ।
పరుషవచనదక్ష! త్వద్వచోభిర్న దాస్యే
తృణమపి పితృభుక్తే వీర్యగుప్తే స్వరాజ్యే ।। 35 ।।

దుర్యోధనుడు:
ఎట్లెట్లా? పాండవులు లాగేసుకుంటారా?

కటువుగా మాట్లాడడం నేర్చినవాడా! భీమరూపియైన వాయుదేవుడు నన్ను యుద్ధాన దెబ్బతీసినా, స్వయానా ఆ ఇంద్రుడే అర్జునరూపం దాల్చి నాపై దాడి చేసినా, నీ మాట విని, నా తండ్రి చేత అనుభవించబడినదీ, నా పరాక్రమంతో కాపాడబడినదీ అయిన నా రాజ్యంలోని గడ్డిపరకను కూడా ఇవ్వను.

వాసుదేవః:
భోః కురుకులకలఙ్కభూత! అయశోలుబ్ధ! వయం కిల తృణాన్తరాభిభాషకాః ।
వాసుదేవుడు:
ఓరి కురువంశకళంకమా! అపకీర్తి ఆశపోతా! గడ్డిపరకలగురించి మాట్లాడడం లేదు కదా నేను?
దుర్యోధనః:
భో గోపాలక! తృణాన్తరాభిభాష్యో భవాన్ ।

అవధ్యాం ప్రమదాం హత్వా హయం గోవృషమేవ చ ।
మల్లానపి సునిర్లజ్జో వక్తుమిచ్ఛసి సాధుభిః ।। 36 ।।

దుర్యోధనుడు:
ఓ ఆలకాపరీ! గడ్డిపరకను నడుమన ఉంచుకొని మాట్లాడాలి నీతో.

చంపదగని స్త్రీని, గుఱ్ఱాన్ని, ఎద్దును, మల్లయోధులను సైతం చంపి, సాధుపురుషులతో నిర్లజ్జగా మాట్లాడగోరుతున్నావు.

వాసుదేవః:
భోః సుయోధన! నను క్షిపసి మామ్ ।
వాసుదేవుడు:
ఓ సుయోధనా! నన్ను తూలనాడుతున్నావా?
దుర్యోధనః:
నను సత్యమేవైతత్ ।
దుర్యోధనుడు:
ఆ మాట నిజమే కదా.
వాసుదేవః:
గచ్ఛామి తావత్ ।
వాసుదేవుడు:
వెళతానిక.
దుర్యోధనః:
గచ్ఛ గచ్ఛ పశుఖురోద్ధతరేణురూషితాఙ్గో వ్రజమేవ । విఫలీకృతః కాలః ।
దుర్యోధనుడు:
వెళ్ళు, వెళ్ళు. పశువుల గిట్టలనుంచి రేగిన దుమ్ముతో మలినమైన దేహం ఉన్నవాడవు, గొల్లపల్లెకే వెళ్ళు. కాలం వృథా అయ్యింది.
వాసుదేవః:
ఏవమేవాస్తు । న వయమేవానుక్తసందేశా గన్తుమిచ్ఛామః । తదాకర్ణ్యతాం యుధిష్ఠిరస్య సన్దేశః ।
వాసుదేవుడు:
అలాగే కానీ. సందేశాన్ని అందించకుండా పోవడానికి నేను ఇచ్చగించను. కనుక యుధిష్ఠిరుడి సందేశాన్ని వినిపిస్తాను.
దుర్యోధనః:
ఆః, అభాష్యస్త్వమ్।

అహమవధృతపాణ్డరాతపత్రో
ద్విజవరహస్తధృతామ్బుసిక్తమూర్ధా ।
అవనతనృపమణ్డలానుయాత్రైః
సహ కథయామి భవద్విధైర్న భాషే ।। 37 ।।

దుర్యోధనుడు:
ఆఁ! మాట్లాడడానికే అర్హత లేనివాడవు నీవు.

నేను రాజోచితమైన శ్వేతఛత్రాన్ని ధరించినవాడిని, బ్రాహ్మణశ్రేష్ఠులచే అభిషిక్తమైన శిరస్సు నాది. నా సామంతులకు భృత్యుడివైన నీతో మాట్లాడనని అంటున్నాను.

వాసుదేవః:
న వ్యాహరతి కిల మాం సుయోధనః । భోః!

శఠ! బాన్ధవనిఃస్నేహ! కాక! కేకర! పిఙ్గల! ।
త్వదర్థాత్ కురువంశోఽయమచిరాన్నాశమేష్యతి ।। 38 ।।

భో భో రాజానః! గచ్ఛామస్తావత్ ।

వాసుదేవుడు:
నాతో మాట్లాడడట సుయోధనుడు! ఓరీ…

మొండివాడా! బంధువులపట్ల స్నేహభావం లేనివాడా! పరుషంగా మాట్లాడే కాకీ! మెల్లకన్నూ! కోతీ! నీవల్ల ఈ కురువంశం తొందరలోనే నాశనాన్ని పొందనున్నది.

దుర్యోధనః:
కథం యాస్యతి కిల కేశవః । దుఃశాసన! దుర్మర్షణ! దుర్ముఖ! దుర్బుద్ధే! దుష్టేశ్వర! దూతసముదాచారమతిక్రాన్తః కేశవో బధ్యతామ్। కథమశక్తాః ।

దుఃశాసన! న సమర్థః ఖల్వసి ।

కరితురగనిహన్తా కంసహన్తా స కృష్ణః
పశుపకులనివాసాదానుజీవ్యానభిజ్ఞః ।
హతభుజబలవీర్యః పార్థివానాం సమక్షం
స్వవచనకృతదోషో బధ్యతామేష శీఘ్రమ్ ।। 39 ।।

అయమశక్తః । మాతుల! బధ్యతామయం కేశవః । కథం పరాఙ్ముఖః పతతి । భవతు, అహమేవ పాశైర్బధ్నామి । (ఉపసర్పతి ।)

దుర్యోధనుడు:
ఎట్లా వెళతాడు కృష్ణుడు? దుశ్శాసనా! దుర్మర్షణా! దుర్ముఖా! దుర్బుద్ధీ! దుష్టేశ్వరా! దూత మర్యాదను అతిక్రమించిన ఈ కేశవుడిని బంధించండి! బంధించలేకపోతున్నారా?

దుశ్శాసనా! నీవూ అందుకు సమర్థుడవు కావా?

ఏనుగును, గుఱ్ఱాన్ని చంపినవాడు, కంసుణ్ణి చంపినవాడూ, పశుపాలకుల ఇంటిలో పెరిగినందున సేవకుడు మెలగాల్సిన విధం తెలియనివాడు, భుజబలపరాక్రమం నశించినవాడు, రాజసమక్షంలో తప్పుగా మాట్లాడినవాడు అయిన ఇతడిని వెంటనే బంధించండి.

ఈ దుశ్శాసనుడివల్లా కావడం లేదు. మామా! ఈ కృష్ణుడిని బంధించు. ఇదేమిటి, పెడమొగంతో పడిపోతున్నాడు? సరే, నేనే తాళ్ళతో కట్టేస్తాను (కృష్ణుడిని సమీపిస్తాడు.)

వాసుదేవః:
కథం బద్ధుకామో మాం కిల సుయోధనః । భవతు, సుయోధనస్య సామర్థ్యం పశ్యామి। (విశ్వరూపమాస్థితః ।)
వాసుదేవుడు:
నన్ను బంధించదలచుకున్నాడా సుయోధనుడు? సరే, సుయోధనుడి సామర్థ్యం ఏపాటిదో చూస్తాను. (విశ్వరూపాన్ని ధరిస్తాడు.)
దుర్యోధనః:
భో దూత!

సృజసి యది సమన్తాద్ దేవమాయాః స్వమాయాః
ప్రహరసి యది వా త్వం దుర్నివారైః సురాస్త్రైః ।
హయగజవృషభాణాం పాతనాజ్జాతదర్పో
నరపతిగణమధ్యే బధ్యసే త్వం మయాద్య ।। 40 ।।

దుర్యోధనుడు:
ఓయీ రాయబారీ!

దేవమాయలను, నీ సొంత మాయలను అంతటా సృష్టించినా సరే, ఎదిరింపజాలని దివ్యాస్త్రాలతో బాధించినా సరే – అశ్వాన్ని, గజాన్ని, వృషభాన్ని నేలకూల్చానని విర్రవీగుతున్న నిన్ను ఈ రాజులందరి నడుమన కట్టివేస్తాను ఇవాళ.

ఆః తిష్ఠేదానీమ్ । కథం న దృష్టః కేశవః । అయం కేశవః । అహో హ్రస్వత్వం కేశవస్య । ఆః తిష్ఠేదానీమ్ । కథం న దృష్టః కేశవః । అయం కేశవః । అహో దీర్ఘత్వం కేశవస్య । కథం న దృష్టః కేశవః । అయం కేశవః । సర్వత్ర మన్త్రశాలాయాం కేశవా భవన్తి । కిమిదానీం కరిష్యే । భవతు, దృష్టమ్ । భో భో రాజానః! ఏకేనైకః కేశవో బధ్యతామ్ । కథం స్వయమేవ పాశైర్బద్ధాః పతన్తి రాజానః । సాధు భో జమ్భక! సాధు!
అరె, ఆగక్కడ. కనబడడేమి కృష్ణుడు? ఇదిగో, ఇక్కడున్నాడు. ఇదేమి, ఇంత పొట్టిగా ఉన్నాడు? ఏయ్, ఆగు. కనబడడం లేదేమి? ఇక్కడున్నాడు. ఎంత పొడవుగా ఉన్నాడు? మళ్ళీ మాయమయ్యాడు. ఇక్కడున్నాడు కృష్ణుడు. ఈ మంత్రశాలలో అంతటా కృష్ణులే ఉన్నారు. ఇప్పుడేం చేయాలి? సరే, తెలిసింది. ఓ రాజులారా, మీలో ఒక్కొక్కరు తలా ఒక కృష్ణుణ్ణి కట్టివేయండి. ఇదేమి, ఈ రాజులందరూ తాళ్ళతో కట్టివేయబడి కిందపడిపోయారు? భళిరా మాయావీ! భళీ!
మత్కార్ముకోదరవినిఃసృతబాణజాలై–-
ర్విద్ధక్షరత్క్షతజరఞ్జితసర్వగాత్రమ్।
పశ్యన్తు పాణ్డుతనయాః శిబిరోపనీతం
త్వాం బాష్పరుద్ధనయనాః పరినిఃశ్వసన్తః ।। 41 ।।

(నిష్క్రాన్తః ।)

నా వింటినుంచి వెలువడిన బాణజాలంచేత చీల్చివేయబడి నెత్తురోడుతూ ఎరుపెక్కి ఉన్న దేహంతో తమ శిబిరానికి చేర్చబడ్డ నిన్ను ఆ పాండవులు నిట్టూరుస్తూ, కన్నీళ్ళతో మసకబారిన కన్నులతో చూసెదరుగాక!
(వెళ్ళిపోతాడు)
వాసుదేవః:
భవతు, పాణ్డవానాం కార్యమహమేవ సాధయామి । భోః సుదర్శన! ఇతస్తావత్ ।
వాసుదేవుడు:
సరే, పాండవులు చేయాల్సిన పనిని నేనే పూర్తిచేస్తాను. ఓ సుదర్శనచక్రమా! ఇక్కడికి రా.
(తతః ప్రవిశతి సుదర్శనః ।)
సుదర్శనః:
ఏష భోః ।

శ్రుత్వా గిరం భగవతో విపులప్రసాదా–
న్నిర్ధావితోఽస్మి పరివారితతోయదౌఘః ।
కస్మిన్ ఖలు ప్రకుపితః కమలాయతాక్షః
కస్యాద్య మూర్ధని మయా ప్రవిజృమ్భితవ్యమ్ ।। 42 ।।

(సుదర్శనచక్రం ప్రవేశిస్తుంది)
సుదర్శనము:
ఇదిగో ప్రభూ!

భగవంతుడి పలుకును విని, మిక్కుటమైన ఆయన ప్రసన్నత తోడ్పడగా మబ్బుల దొంతరను పక్కకు నెట్టుకుంటూ పరుగు పరుగున వచ్చాను. ఎవ్వరిపై కినుక పూనాడీ తమ్మికన్నుల దేవర? ఎవరి తలను త్రుంచేందుకు చెలరేగాలి నేడు నేను?

క్వ ను ఖలు భగవాన్ నారాయణః ।

అవ్యక్తాదిరచిన్త్యాత్మా లోకసంరక్షణోద్యతః।
ఏకోఽనేకవపుః శ్రీమాన్ ద్విషద్బలనిషూదనః ।। 43 ।।

భగవంతుడైన నారాయణుడు ఎక్కడున్నాడు?

మొదలెక్కడో తెలియనివాడు, ఆలోచనకు అందని ఆత్మస్వరూపుడు, లోకాలను కాపాడేందుకు పూనుకున్నవాడు, ఒకే ఒక్కడు, అనేకరూపాలను ధరించినవాడు, లక్ష్మీయుతుడు, శత్రుసైన్యసంహారకుడు —

(విలోక్య) అయే అయం భగవాన్ హస్తినపురద్వారే దూతసముదాచారేణోపస్థితః । కుతః ఖల్వాపః, కుతః ఖల్వాపః । భగవతి ఆకాశగఙ్గే! ఆపస్తావత్ । హన్త స్రవతి । (ఆచమ్యోపసృత్య) జయతు భగవాన్ నారాయణః । (ప్రణమతి ।)
(చూసి) అరె, ఈ భగవంతుడు దౌత్యకార్యం నిర్వహిస్తూ హస్తినాపురద్వారం వద్ద ఉన్నాడు. నీళ్ళెక్కడ, నీళ్ళెక్కడ? భగవతీ ఆకాశగంగా! నీటిని ఇవ్వు.
ఇదిగో, జలస్రావం. (ఆచమనం చేసి, కృష్ణుడిని సమీపించి) భగవంతుడైన నారాయణుడికి జయమగుగాక! (నమస్కరిస్తాడు)
వాసుదేవః:
సుదర్శన! అప్రతిహతపరాక్రమో భవ ।
వాసుదేవుడు:
సుదర్శనా! ఎదురులేని పరాక్రమము కలిగినవాడవు కమ్ము.
సుదర్శనః:
అనుగృహీతోఽస్మి।
సుదర్శనము:
అనుగ్రహించబడ్డాను.
వాసుదేవః:
దిష్ట్యా భవాన్ కర్మకాలే ప్రాప్తః ।
వాసుదేవుడు:
అదృష్టవశాత్తు, నీతో పనిబడ్డ వేళకు వచ్చావు.
సుదర్శనః:
కథం కథం కర్మకాల ఇతి । ఆజ్ఞాపయతు భగవానాజ్ఞాపయతు ।

కిం మేరుమన్దరకులం పరివర్తయామి
సంక్షోభయామి సకలం మకరాలయం వా ।
నక్షత్రవంశమఖిలం భువి పాతయామి
నాశక్యమస్తి మమ దేవ! తవ ప్రసాదాత్ ।। 44 ।।

సుదర్శనము:
ఏమీ, పనిబడినదా నాతో? ఆజ్ఞాపించండి భగవన్, ఆజ్ఞాపించండి.

మేరుపర్వతాన్ని, మందరపర్వతాన్ని అటుదిటు చేయాలా? మొసళ్ళకు నెలవైన సముద్రాన్ని అతలాకుతలం చేయాలా? నక్షత్రాలనన్నింటిని నేల రాల్చాలా? దేవా! మీ అనుగ్రహంవల్ల నాకు అసాధ్యమనేది లేదు.

వాసుదేవః:
భోః సుదర్శన! ఇతస్తావత్। భోః సుయోధన!

యది లవణజలం వా కన్దరం వా గిరీణాం
గ్రహగణచరితం వా వాయుమార్గం ప్రయాసి ।
మమ భుజబలయోగప్రాప్తసంజాతవేగం
భవతు చపల! చక్రం కాలచక్రం తవాద్య ।। 45 ।।

వాసుదేవుడు:
ఓ సుదర్శనమా! ఇటు చూడు. ఓ సుయోధనా!

చపలచిత్తుడా! సముద్రంలోనికి, కొండగుహలోకి, గ్రహపథాలలోకి, వాయుమార్గంలోకి – నీవు ఎక్కడి వెళ్ళినా సరే, నా భుజబలం కారణంగా సంక్రమించిన వేగంతో ఉన్న ఈ చక్రం నేడు నీ పాలిట కాలచక్రమే అగుగాక.

సుదర్శనః:
భోః సుయోధనహతక! (ఇతి పునర్విచార్య) ప్రసీదతు ప్రసీదతు భగవాన్ నారాయణః ।

మహీభారాపనయనం కర్తుం జాతస్య భూతలే।
అస్మిన్నేవ గతే దేవ! నను స్యాద్ విఫలః శ్రమః ।। 46 ।।

సుదర్శనము:
ఓరీ సుయోధనాధమా! (అని, మళ్ళీ ఆలోచించి) భగవంతుడైన నారాయణుడు ప్రసన్నుడగుగాక, ప్రసన్నుడగుగాక.

ఈ దుర్యోధనుడిని ఒక్కడినే ఈవిధంగా అంతమొందిస్తే భూభారాన్ని తగ్గించేందుకు అవతరించిన మీ శ్రమ విఫలమవుతుంది కదా.

వాసుదేవః:
సుదర్శన! రోషాత్ సముదాచారో నావేక్షితః । గమ్యతాం స్వనిలయమేవ ।
వాసుదేవుడు:
సుదర్శనా! కోపం కారణంగా, తటస్థంగా ఉండడం అనే దౌత్యమర్యాదను విస్మరించాను. నీవు నీ స్వస్థానానికి వెళ్ళు.
సుదర్శనః:
యదాజ్ఞాపయతి భగవాన్ నారాయణః । కథం కథం గోపాలక ఇతి । త్రిచరణాతిక్రాన్తత్రిలోకో నారాయణః ఖల్వత్రభవాన్ । శరణం వ్రజన్తు భవన్తః । యావద్గచ్ఛామి ।
సుదర్శనము:
భగవంతుడైన నారాయణుడు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. గోపాలకుడని అన్నాడా, ఎట్లెట్లా? మూడు అడుగులలో ముల్లోకాలాను ఆక్రమించిన పూజ్యుడు కదా నారాయణుడు. మీరంతా శరణు వేడండి. ఇక వెళతాను.
అయే ఏతద్ భగవదాయుధవరం శార్ఙ్గం ప్రాప్తమ్ ।

తనుమృదులలితాఙ్గం స్త్రీస్వభావోపపన్నం
హరికరధృతమధ్యం శత్రుసఙ్గైకకాలః ।
కనకఖచితపృష్ఠం భాతి కృష్ణస్య పార్శ్వే
నవసలిలదపార్శ్వే చారువిద్యుల్లతేవ ।। 47 ।।

భో భోః! ప్రశాన్తరోషో భగవాన్ నారాయణః । గమ్యతాం స్వనిలయమేవ । హన్త నివృతః యావద్గచ్ఛామి ।

అరె! భగవంతుడి ఆయుధాలలో శ్రేష్ఠమైన శార్ఙ్గధనుస్సు ఇక్కడకు వచ్చింది.

స్త్రీసహజమైన సన్నని మృదువైన ఆకారంతో ఉన్నదీ, విష్ణువుచే పట్టుకోబడిన మధ్యభాగం కలదీ, శత్రుసమూహానికి మృత్యుసమానమైనది, వెనకవైపున బంగారం పొదగబడినదీ అయిన ఈ విల్లు కృష్ణుడి సమీపాన, కొత్త వానమబ్బు పక్కన మెరుపువలె ఉన్నది.

శార్ఙ్గమా! నారాయణుడు శాంతించాడు. నీవు స్వస్థానానికి వెళ్ళు. సరే, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.

అయే ఇయం కౌమోదకీ ప్రాప్తా।

మణికనకవిచిత్రా చిత్రమాలోత్తరీయా
సురరిపుగణగాత్రధ్వంసనే జాతతృష్ణా।
గిరివరతటరూపా దుర్నివారాతివీర్యా
వ్రజతి నభసి శీఘ్రం మేఘవృన్దానుయాత్రా ।। 48 ।।[

హే కౌమోదకి! ప్రశాన్తరోషో భగవాన్ నారాయణః। హన్త నివృత్తా ।

అరె, కౌమోదకి గద వస్తున్నది!

బంగారంతో, మణులతో రంగులీనుతూ ఉన్నదీ, రంగురంగుల పూలదండ తనకు ఉత్తరీయంవలె అమరినదీ, దేవతల శత్రుసమూహాల దేహాలను ధ్వంసం చేయాలనే కోరిక కలిగినదీ, కొండ చరియ ఆకారంవలె ఉన్నదీ, ఎదురింపలేనిదీ, శక్తిమంతమైనదీ అయిన కౌమోదకి ఆకాశంలో మేఘాలు వెంబడిస్తుండగా వేగంగా వస్తున్నది.

హే కౌమోదకీ! నారాయణుడు శాంతించాడు. నీవు స్వస్థానానికి వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.

అయే అయం పాఞ్చజన్యః ప్రాప్తః ।

పూర్ణేన్దుకున్దకుముదోదరహారగౌరో
నారాయణననసరోజకృతప్రసాదః ।
యస్య స్వనం ప్రలయసాగరఘోషతుల్యం
గర్భా నిశమ్య నిపతన్త్యసురాఙ్గనానామ్ ।। 49 ।।

హే పాఞ్చజన్య! ప్రశాన్తరోషో భగవాన్। గమ్యతామ్ । హన్త నివృత్తః ।

అరె, పాంచజన్యశంఖమూ ఇక్కడికి వచ్చింది!

నిండు చంద్రుడిలా, మల్లెపూవులా, కలువపూవు అంతర్భాగంలా, ముత్యాలహారంలా తెల్లగా, నారాయణుడి ముఖపద్మపు ప్రసన్నతవలె ఉన్నది ఈ పాంచజన్యం. ఈ శంఖపు ధ్వని ప్రళయకాలసముద్రఘోషకు సమానమై, అసురస్త్రీలకు గర్భవిచ్ఛిత్తి కలుగజేస్తుంది.

ఓ పాంచజన్యమా! భగవానుడు శాంతించాడు. నీవు వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది.

అయే నన్దకాసిః ప్రాప్తః ।

వనితావిగ్రహో యుద్ధే మహాసురభయఙ్కరః ।
ప్రయాతి గగనే శీఘ్రం మహోల్కేవ విభాత్యయమ్ ।। 50 ।।

హే నన్దక! ప్రశాన్తరోషో భగవాన్ । గమ్యతామ్ । హన్త నివృత్తః । యావద్ గచ్ఛామి ।।

అరె! నందకఖడ్గం ఇటే వస్తున్నది.

స్త్రీరూపాన్ని తలపించేదీ, యుద్ధంలో మహాసురులకు భయం కలిగించేదీ, ఆకాశమార్గంలో వేగంగా వస్తున్నది. పెద్ద ఉల్కలాగా ప్రకాశిస్తున్నది ఈ నందకం.

ఓ నందకమా, భగవానుడు శాంతించాడు. వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయింది. ఇక నేనూ వెళతాను.

అయే ఏతాని భగవదాయుధవరాణి ।

సోఽయం ఖడ్గ ఖరాంశోరపహసితతనుః స్వైః కరైర్నన్దకాఖ్యః
సేయం కౌమోదకీ యా సురరిపుకఠినోరః స్థలక్షోదదక్షా ।
సైషా శార్ఙ్గాభిధానా ప్రలయఘనరవజ్యారవా చాపయష్టిః
సోఽయం గమ్భీరఘోషః శశికరవిశదః శఙ్ఖరాట్ పాఞ్చజన్యః ।। 51 ।।

ఆహాహా! ఇవన్నీ భగవంతుడి శ్రేష్ఠమైన ఆయుధాలు.

తన తళతళలతో సూర్యబింబాన్ని అపహసిస్తుంది నందకమనే పేరుగల ఈ ఖడ్గం. కౌమోదకి అనే ఈ గద, దైత్యుల కఠినమైన వక్షస్థలాలను ఛేదించగలిగినది. శార్ఙ్గమనే ఈ సన్నని వింటియొక్క నారి టంకారధ్వని ప్రళయమేఘరవాన్ని పోలి ఉంటుంది. చంద్రకిరణాల తెలుపుతో ఉండి గంభీరంగా ఘోషిస్తుంది శంఖాలకు రాజైన ఈ పాంచజన్యం.

శార్ఙ్గ! కౌమోదకి! పాఞ్చజన్య!
దైత్యాన్తకృన్నన్దక! శత్రువహ్నే! ।
ప్రశాన్తరోషో భగవాన్ మురారిః
స్వస్థానమేవాత్ర హి గచ్ఛ తావత్ ।। 52 ।।

హన్త నివృత్తాః । యావద్గచ్ఛామి ।

ఓ శార్ఙ్గమా! కౌమోదకీ! పాంచజన్యమా! దైత్యసంహారివీ, శత్రువులను దహించివేసే అగ్నివీ అయిన ఓ నందకమా! భగవంతుడైన మురారి శాంతించాడు. కనుక, మీరింక మీ మీ నెలవులకు వెళ్ళండి.

హమ్మయ్య! వెళ్ళిపోయారు. ఇంక నేనూ వెళతాను.

అయే – అత్యుద్ధూతో వాయుః । అతితపత్యాదిత్యః । చలితాః పర్వతాః । క్షుబ్ధాః సాగరాః । పతితాః వృక్షాః । భ్రాన్తా మేఘాః । ప్రలీనా వాసుకిప్రభృతయో భుజఙ్గేశ్వరాః । కిన్ను ఖల్విదమ్ ।

అయే అయం భగవతో వాహనో గరుడః ప్రాప్తః ।

సురాసురాణాం పరిఖేదలబ్ధం
యేనామృతం మాతృవిమోక్షణార్థమ్ ।
ఆచ్ఛిన్నమాసీద్ ద్విషతో మురారే
స్త్వాముద్వహామీతి వరోఽపి దత్తః ।। 53 ।।

హే కాశ్యపప్రియసుత! గరుడ! ప్రశాన్తరోషో భగవాన్ దేవదేవేశః । గమ్యతాం స్వనిలయమేవ । హన్త నివృత్తః । యావద్ గచ్ఛామి ।

అరె, పెనుగాలి వీస్తున్నది. సూర్యుడు ఎంతో వేడిని కలుగజేస్తున్నాడు. పర్వతాలు కదులుతున్నాయి. సముద్రాలు కల్లోలితాలయ్యాయి. చెట్లు పడిపోయాయి. మేఘాలు చలిస్తూ ఉన్నాయి. వాసుకి మొదలైన సర్పరాజులూ చేష్టలుడిగిపోయారు. ఎందుకో?

అరె, భగవానుడి వాహనమైన గరుత్మంతుడు ఇటే వస్తున్నాడు.

తన తల్లి దాస్యవిమోచనం కోసం, సురాసురులు ఎంతో శ్రమించి సాధించిన అమృతాన్ని తన శత్రువైన ఇంద్రుడి దగ్గరనుంచి ఎత్తుకొని వచ్చినవాడు ఈ గరుడుడు. వాహనమై నిన్ను మోస్తానని విష్ణువుకు వరమిచ్చినవాడు.

కాశ్యపప్రియకుమారుడా! గరుడా! దేవదేవేశుడైన భగవంతుడి కోపం శాంతించింది. నీ నెలవుకు నీవు వెళ్ళు. ఆఁ, వెళ్ళిపోయాడు. నేనూ వెళతాను.

ఏతే స్థితా వియతి కిన్నరయక్షసిద్ధాః
దేవాశ్చ సంభ్రమచలన్మకుటోత్తమాఙ్గాః ।
రుష్టేఽచ్యుతే విగతకాన్తిగుణాః ప్రశాన్తం
శ్రుత్వా శ్రయన్తి సదనాని నివృత్తతాపాః ।। 54 ।।

యావదహమపి కాన్తాం మేరుగుహామేవ యాస్యామి । (నిష్క్రాన్తః ।)

అచ్యుతుడు కోపగించి ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న కిన్నరులు, యక్షులు, సిద్ధులు, వెలవెలబోయారు, కిరీటాలు కదిలిపోయేలా సంభ్రమంతో తలలూపుతూ ఉండిపోయారు. ఆయన శాంతించాడని విని చల్లబడి తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.

ఇంక నేనూ అందమైన మేరుపర్వతగుహకు వెళ్ళిపోతాను. (వెళ్ళిపోతాడు)

వాసుదేవః:
యావదహమపి పాణ్డవశిబిరమేవ యాస్యామి ।
వాసుదేవుడు:
ఇంక నేనూ పాండవశిబిరానికి వెళ్ళిపోతాను.
(నేపథ్యే)
న ఖలు న ఖలు గన్తవ్యమ్ ।
(తెర వెనకనుండి)
వద్దు, వద్దు. వెళ్ళవద్దు.
వాసుదేవః:
అయే వృద్ధరాజస్వర ఇవ । భో రాజన్! ఏష స్థితోఽస్మి ।
వాసుదేవుడు:
అరె, వృద్ధరాజు అయిన ధృతరాష్ట్రుడి గొంతులా ఉన్నది. మహారాజా! ఇక్కడే ఉన్నాను.
(తతః ప్రవిశతి ధృతరాష్ట్రః।)
ధృతరాష్ట్రః:
క్వ ను ఖలు భగవాన్ నారాయణః । క్వ ను ఖలు భగవాన్ పాణ్డవశ్రేయస్కరః । క్వ ను ఖలు భగవాన్ విప్రప్రియః । క్వ ను ఖలు భగవాన్ దేవకీనన్దనః ।

మమ పుత్రాపరాధాత్ తు శార్ఙ్గపాణే! తవాధునా ।
ఏతన్మే త్రిదశాధ్యక్ష! పాదయోః పతితం శిరః ।। 55 ।।

(ధృతరాష్ట్రుడు ప్రవేశిస్తాడు)
ధృతరాష్ట్రుడు:
భగవన్నారాయణుడెక్కడ? పాండవులకు మేలు చేసే భగవానుడెక్కడ? బ్రాహ్మణప్రియుడైన భగవంతుడెక్కడ? దేవకీనందనుడెక్కడ?

ఓ శార్ఙ్గపాణీ! దేవతలకు అధినాథుడా! నా కుమారుడి అపరాధం కారణంగా నేను ఇప్పుడు నా తలను నీ పాదాల చెంత వాలుస్తున్నాను.

వాసుదేవః:
హా ధిక్ పతితోఽత్రభవాన్ । ఉత్తిష్ఠోత్తిష్ఠ ।
వాసుదేవుడు:
అయ్యయ్యో, ఈ గౌరవనీయుడు నా పాదాలపై పడ్డాడు. లేవండి, లేవండి.
ధృతరాష్ట్రః:
అనుగృహీతోఽస్మి । భగవన్! ఇదమర్ఘ్యం పాద్యం చ ప్రతిగృహ్యతామ్ ।
ధృతరాష్ట్రుడు:
అనుగ్రహించబడ్డాను. భగవన్! ఈ అర్ఘ్యపాద్యాలను స్వీకరించండి.
వాసుదేవః:
సర్వం గృహ్ణామి । కిం తే భూయః ప్రియముపహరామి ।
వాసుదేవుడు:
అన్నింటినీ స్వీకరిస్తాను. మీకు ప్రియమైన ఏ ఇతర కానుకను ఇవ్వగలను?
ధృతరాష్ట్రః:
యది మే భగవాన్ ప్రసన్నః కిమతఃపరమిచ్ఛామి ।
ధృతరాష్ట్రుడు:
నాయందు స్వామి ప్రసన్నుడై ఉంటే, అంతకన్నా ఏమి కోరగలను?
వాసుదేవః:
గచ్ఛతు భవాన్ పునర్దర్శనాయ ।
వాసుదేవుడు:
వెళ్ళండి, మళ్ళీ కలుద్దాము.
ధృతరాష్ట్రః:
యదాజ్ఞాపయతి భగవాన్ నారాయణః ।। (నిష్క్రాన్తః ।)
ధృతరాష్ట్రుడు:
భగవాన్ నారాయణుల ఆజ్ఞ! (వెళ్ళిపోతాడు)
(భరతవాక్యమ్)
ఇమాం సాగరపర్యన్తాం హిమవద్విన్ధ్యకుణ్డలామ్।
మహీమేకాతపత్రాఙ్కాం రాజసింహః ప్రశాస్తు నః ।। 56 ।।
(నిష్క్రాన్తాః సర్వే)
దూతవాక్యం సమాప్తమ్।।

(భరతవాక్యము)
సముద్రందాకా విస్తరించినదీ, హిమవత్పర్వతాన్ని, వింధ్యపర్వతాన్ని కుండలాలుగా ధరించినదీ, ఒకే గొడుగు క్రిందన ఉన్నదిగా గుర్తింపబడ్డదీ అయిన ఈ భూమిని మా రాజసింహుడు పాలించుగాక!
(అందరూ నిష్క్రమిస్తారు)
‘దూతవాక్యము’ ముగిసింది.