తమిళ సంగ సాహిత్యంలోని ఆంతరంగిక జీవితాన్ని వర్ణించే అగం వర్గానికి చెందిన సంకలనాలలో విశిష్టమైనది కుఱుందొగై. తెలుగులో లాగానే తమిళంలో కూడా కుఱు- అంటే చిన్నది, లఘువు అని అర్థం. కుఱచ, కుఱ్ఱ, బహుశా చిఱు, చిట్టి మొదలైన శబ్దాలు ఈ శబ్దానికి సోదరపదాలే (cognates). కుఱుందొగై అంటే తెలుగులో చిఱుకూర్పు, సంస్కృతంలో లఘుసంకలనం అని చెప్పుకోవచ్చు. ఈ సంకలనం ప్రధానంగా నాలుగు నుండి ఎనిమిది పాదాల పరిమితి కలిగిన నాలుగు వందల చిన్న పద్యాల కూర్పు. తక్కువ పాదాల్లోనే లోతైన భావాలను, ప్రకృతి ప్రతీకల ద్వారా మానవ హృదయ సంవేదనలను అద్భుతంగా ఆవిష్కరించడం ఈ కవితల ప్రత్యేకత. క్లుప్తతను పాటిస్తూనే గాఢమైన అనుభూతిని మిగిల్చే ఈ లఘు కవితా విభాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుఱుందొగైతో మొదలు పెట్టి సంగ సాహిత్యాన్ని పరిచయం చేయాలని నా సంకల్పమే అయినా, ఏకసూత్రత లేని ఈ కవితా సంకలనాన్ని అలాగే చెబితే తెలుగు పాఠకులకు అంతగా రుచించక పోవచ్చని ఒక అనుమానం. కనుక కుఱుందొగైని పరిచయం చేస్తూనే భావవిస్తరణకోసం, తులనాత్మకంగా ఇతర సంగ సంకలనాలను కూడా మధ్య మధ్య పరామర్శిస్తూ వ్రాస్తాను. ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.
కుఱుందొగైని సంకలనం చేసినతని పేరు పూరిక్కో, పేరు తప్ప ఆయన గురించి మనకు ఏమీ తెలియదు. టి. ఎస్. రంగసామి అయ్యంగార్ 1915లో మొదటిసారిగా కుఱుందొగైని ప్రచురించారు. ఉ. వే. స్వామినాథ అయ్యర్ 1937లో వివరణాత్మక వ్యాఖ్యానంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
ప్రతి సంగ కవిత్వ సంకలనమూ దైవప్రార్థనతో ప్రారంభమౌతుంది. కుఱుందొగై కూడా అంతే. ఈ తొలి పద్యాన్ని వ్రాసిన కవి పెరుందేవనార్. దేశంలోనే తొలి మహాభారత అనువాదకర్త. భారతం పాడియ పెరుందేవనార్ తొలిపద్యానికి నా అనువాదం:
పద్మముల బోలు ఎర్రని పాద యుగము
పగడముల మించు కెంజాయ మేని కాంతి
అరయ ధరియించు వలువయు గురిజ ఎఱుపు
క్రౌంచగిరి రెండు గాగ భేదించినట్టి
గొప్ప ఈటెను తనచేతఁ గొన్నవాడు
కుక్కుటధ్వజుడీ భువిని కాచు, నతని
యండనే గాదె క్షేమమై యుండు జగము
తమిళమూలం తెలుగులిపిలో
తామరైప్పురైయుం కామర్ సేవడి
పవఴత్తన్న మేనిత్తిగఴొళి
కుండ్రి యేయ్కుం ఉడుక్కైక్కుండ్రిన్
నెంజుబగ ఎఱింద అంజుడర్ నెడువేల్
సేవలంగొడియోన్ కాప్ప
ఏమ వైగల్ ఎయ్దిండ్రాల్ ఉలగే.
తమిళలిపిలో
பாரதம் பாடிய பெரும்தேவனார்
தாமரைப் புரையும் காமர் சேவடி
பவழத் தன்ன மேனித் திகழொளிக்
குன்றி யேய்க்கும் உடுக்கைக் குன்றின்
நெஞ்சுபக எறிந்த அஞ்சுடர் நெடுவேல்
சேவலங் கொடியோன் காப்ப
ஏம வைகல் எய்தின்றால் உலகே.
ఈ ప్రార్థన కార్తికేయుని ఉద్దేశించినది. అతని పాదాలు పద్మాలలా ఎర్రగా ఉన్నాయి. అతనిది పగడాలను మించే ఎర్రని మేని చాయ. అతను ధరించే వస్త్రాలు కూడా గురివింద గింజలవంటి ఎరుపు రంగులో ఉన్నాయి. అతను చేతిలో గొప్ప వేలాయుధం ఉంది. అది క్రౌంచ పర్వతాన్ని రెండుగా చీల్చినట్టిది. అతను పతాకంపై కోడిపుంజును చిహ్నంగా ధరించిన వాడు. అట్టి మురుగన్ (కార్తికేయుడు) ఈ భూమిని రక్షించు గాక. అతని రక్షలో ఉంది కనుకనే ఈ భూమి క్షేమంగా ఉంది.
కుఱుందొగైలోని రెండవ పద్యం, నాయకుడు నాయకితో తన ప్రథమ పరిచయంలో తుమ్మెదతో మాట్లాడుతూ చెప్పినది.
కుఱుందొగై – 2, కవి పేరు ఇఱైయనార్, కుఱింజి తిణై – నాయకుడు తుమ్మెదతో చెప్పినది:
తేనె కొరకై పూలనన్నియు వెదకుచుండెడి తుమ్మెదా!
నాకు ప్రియమౌ మాటఁ జెప్పకు నిక్కమేదియొ పల్కుమా
జన్మ జన్మల స్నేహబంధము నెమలివంటి వయారమున్
చక్కనౌ పల్వరుస గలిగిన నాదు ప్రేయసి కురులతో
సాటియైన సుగంధమున్నదొ నీవెరింగిన విరులలో
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై – 2, ఇఱైయనార్, కుఱింజి తిణై – తలైవన్ తుంబియిడం సొన్నదు
కొంగుదేర్ వాఴ్కై అంజిఱై తుంబి!
కామం సెప్పాదు, కండదు మొఴిమో!
పయిలియదు కెఴీఇయ నట్పిన్, మయిలియల్
చెఱి ఎయిట్రు అరివై కూందలిన్,
నఱియవుం ఉళవో నీ అఱియుం పూవే?
తమిళలిపిలో
குறுந்தொகை 2, இறையனார், குறிஞ்சித் திணை – தலைவன் தும்பியிடம் சொன்னது
கொங்கு தேர் வாழ்க்கை அஞ்சிறைத் தும்பி!
காமம் செப்பாது, கண்டது மொழிமோ!
பயி்லியது கெழீஇய நட்பின், மயில் இயல்
செறி எயிற்று அரிவை கூந்தலின்,
நறியவும் உளவோ நீ அறியும் பூவே?
నాయిక కురులనుండి ఒక సహజ సుగంధం వస్తున్నదని నాయకుని భావన. దానిని నేరుగా చెప్పకుండా చమత్కారంగా పూలతోటలోని తుమ్మెదను అడుగుతున్నాడు. ఓ తుమ్మెదా! నీ జీవితమంతా తేనెకోసం శ్రేష్ఠమైన పూలను వెదుకుతూనే గడుపుతావు. కనుక నీకు తెలిసే ఉంటుంది. నాకు సంతోషం కలిగించడం కోసం అబద్ధం చెప్పకు. నిజమేదో అదే చెప్పు. నాతో జన్మ జన్మల అనుబంధం కలిగినదీ, నెమలివంటి వయ్యారం కలిగినదీ, చక్కని పల్వరుస కలిగినదీ ఐన ఈ నా ప్రేయసి కురులనుండి వస్తున్న సుగంధానికి సాటి రాగల సువాసన, నీవెరిగిన ఏ పూవులోనైనా ఉన్నదా? (ఉండదని నాయకుని భావం).
ఈ చమత్కారభరితమైన పద్యం ‘తిరువిళైయాడల్ పురాణం‘ అనే శైవ పురాణంలో కూడా వాడుకున్నారు. అందులో ఈ పద్యం శివుడు చెప్పినదిగా ఉంది. ఆ కథ కావాలంటే నా బ్లాగులో చదవవచ్చు.
ఇక మూడవ పద్యం; నాయకుడు వ్యాపారం కోసం, ధన సంపాదన కోసం దూరదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. ఆ విషయం చెప్పడానికి నాయిక ఉన్న ఊరికి వచ్చాడు. నాయిక కొరకై ఇంటి బయట కంచెకావల నిరీక్షిస్తున్నాడు. అతను వెళ్ళడం నాయికకు ఇష్టం లేదు. ఆమెకు కావలసింది అతని సాన్నిహిత్యమే తప్ప సంపదలు కాదు. ఆమె ప్రేమ అపారం, అది అతని ఆర్థిక స్థితితో ముడిపడింది కాదు. ఆ విషయం అతనితో నేరుగా చెప్పదు. పక్కనే ఉన్న తన చెలితో చెబుతోంది, అతను కంచెకవతలే ఉన్న విషయం ఎరుగనట్టు, అతనికి వినిపించేలా నాయిక తన చెలితో చెప్పినది:
భూమికన్న విశాలమైనది, ఆకసమ్మున కన్న ఎత్తై
సాగరమ్ముల కంటె లోతై యున్నదేదో తెలియవే
కొండవాలున నల్ల కొమ్మల విరగబూయు కుఱింజి పూవుల
శ్రేష్ఠమగు తేనియలు దొరకు ఆ దేశవాసిపై నాదు ప్రేమయే
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 3, దేవ కులత్తార్, కుఱింజి తిణై – తలైవి తోఴియిడం సొన్నదు, సిఱైప్పుఱత్తానాగ ఇరుంద తలైవన్ కేట్కుంబడి
నిలత్తినుం పెరిదే, వానినుం ఉయర్న్దండ్రు,
నీరినుం ఆరళవిండ్రే, సారల్
కరుంగోల్ కుఱింజిపూ కొండు
పెరుందేన్ ఇఴైక్కుం నాడనొడు నట్పే
తమిళలిపిలో
குறுந்தொகை 3, தேவகுலத்தார், குறிஞ்சித் திணை – தலைவி தோழியிடம் சொன்னது, சிறைப்புறத்தானாக இருந்த தலைவன் கேட்கும்படி
நிலத்தினும் பெரிதே, வானினும் உயர்ந்தன்று,
நீரினும் ஆரளவின்றே, சாரல்
கருங்கோல் குறிஞ்சிப் பூக் கொண்டு
பெருந்தேன் இழைக்கும் நாடனொடு நட்பே
ఓ చెలీ! నల్లని కొమ్మలపై పూచిన కుఱింజి పూలనుండి సేకరించిన శ్రేష్ఠమైన తేనె దొరికే ఆ కొండచరియల దేశపు వానిపై నాకున్న ప్రేమ ఈ భూమి కన్న పెద్దది, గగనానికన్న ఎత్తైనది, అగాధ జలాలకన్న లోతైనది, తెలుసుకో అని చెబుతున్నది. నిజానికి తెలుసుకోవలసిన వాడు కంచె అవతల ఉన్నాడు.
ఇలా నాయకుడు మొండిగా విదేశాలకు ధన సంపాదన కోసమై వెళ్ళడం, నాయిక విచారించడం ‘పాలై తిణై’లో సాధారణ దృశ్యాలు. అలా పయనమౌతున్న ఒక నాయకుడితో నాయిక నెచ్చెలి మాట్లాడిన మాటలు – ‘కలిత్తొగై’ సంకలనంలోనిది ఈ కింది కవిత. ఈ పాలై కవిత పెరుంగడుంగో రచన (పాలై తిణై). నాయకునితో నాయిక చెలికత్తె చెప్పినది:
నువ్వు వెతుకబోతున్న సంపదకంటే
ఆమె సాన్నిహిత్యం గొప్పదని నీకు అర్థం అవుతున్నా,
దానిని మీరి కఠినమైన బంజరు భూములలో,
విశాలమైన చెవులు, పెద్ద పెద్ద కాళ్లతో తిరిగే ఏనుగుల గుంపులు
పొదలను తొక్కి నాశనం చేయగా ఏర్పడ్డ దారులలో,
భయంకరులైన యోధులు అటకాయించే ప్రమాదకర మార్గాల్లోనే
నువ్వు వెళ్లాలనుకుంటే, ఓ ప్రభూ
విశాలమైన భీకరమైన సముద్రంలో పెనుగాలుల దాడికి గురైన ఓడలతో
వ్యాపారమంతా నాశనమైన వారిలా తల్లడిల్లుతున్న మేము,
నీతో ఇంకా ఏమి చెప్పగలం? ఏమి చెప్పి ఆపగలం?
ఇక ఆ గ్రహాలు మాత్రమే నిన్ను ఆపగలవు!
నీ దారిన నువ్వు వెళ్ళిపోతే,
నా స్నేహితురాలు పండుగ కోలాహలం ముగిసిన పిదప
జనసంచారం లేక బోసిపోయిన ఊరి మైదానంలా విచారంగా ఉంటుందా?
దుర్మార్గుడైన పాలకుడివలన అల్లకల్లోలమైన దేశంలా ఆమె బాధపడుతుందా?
రాత్రిపూట హఠాత్తుగా నీరు ఎండిపోయిన చెరువులో
తెల్లవారుజామున వికసించిన కమలంవంటి ఆమె
నీ ఎడబాటునుండి కోలుకొంటుందా?
ఓ మహాప్రభూ, నువ్వు గొప్పగా ప్రేమ నటించావు!
ఆమెను రక్షించుకోవాలన్న సంకల్పాన్ని నువ్వు విడిచిపెట్టిన రోజున,
ఆమె తన విలువైన జీవితాన్ని కోల్పోతుందని తెలుసుకో!
తమిళమూలం తెలుగులిపిలో
(కలిత్తొగై-5 పాలై పాడియ పెరుంగడుంగో, పాలై, తోళి తలైవనిడం సొన్నదు)
పాఅల్ అం సెవిప్పణైత్తాళ్ మా నిరై
మాఅల్ యానైయొడు మఱవర్ మయంగి
తూఱు అదర్బట్ట ఆఱు మయంగు అరుంజురం
ఇఱందు నీర్ సెయ్యుం పొరుళినుం, యాం నుమక్కు
చిఱందనం ఆదల్ అఱిందనిర్ ఆయిన్,
నీళ్ ఇరు మున్నీర్ వళి కలన్ వౌవలిన్
ఆళ్వినైక్కు అఴిందోర్ పోఱల్ అల్లదై,
కేళ్ పెరుందగైయోడు ఎవన్ పల మొఴిగువం?
నాళుం కోళ్మీన్ తగైత్తలుం తగైమే;
కల్లెనక్కవిన్ పెట్ర విఴవు ఆట్రుప్పడుత్త పిన్,
పుల్లెండ్ర కళం పోల పులంబు కొండు అమైవాళో?
ఆళ్బవర్ కలక్కుఱ అలై పెట్ర నాడు పోల్,
పాఴ్బట్ట ముగత్తోడు పైదల్ కొండు అమైవాళో?
ఓర్ ఇరా వైగలుళ్ తామరై పొయ్గైయుళ్
నీర్ నీత్త మలర్ పోల, నీ నీప్పిన్ వాఴ్వాళో?
ఎన ఆంగు,
పొయ్ నల్గల్ పురిందనై పుఱందరల్ కైవిట్టు,
ఎన్నాళో నెడుందగాయ్! నీ సెల్వదు,
అన్నాళ్ కొండు ఇఱక్కుం, ఇవళ్ అరుంబెఱల్ ఉయిరే.
తమిళలిపిలో
கலித்தொகை 5
பாலை பாடிய பெருங்கடுங்கோ, பாலை, தோழி தலைவனிடம் சொன்னது
பாஅல் அம் செவிப் பணைத் தாள் மா நிரை
மாஅல் யானையொடு மறவர் மயங்கித்
தூறு அதர்பட்ட ஆறு மயங்கு அருஞ்சுரம்
இறந்து நீர் செய்யும் பொருளினும், யாம் நுமக்குச்
சிறந்தனம் ஆதல் அறிந்தனிர் ஆயின்,
நீள் இரு முந்நீர் வளி கலன் வௌவலின்
ஆள்வினைக்கு அழிந்தோர் போறல் அல்லதைக்,
கேள் பெருந்தகையோடு எவன் பல மொழிகுவம்?
நாளும் கோள்மீன் தகைத்தலும் தகைமே;
கல்லெனக் கவின் பெற்ற விழவு ஆற்றுப்படுத்த பின்,
புல்லென்ற களம் போலப் புலம்பு கொண்டு அமைவாளோ?
ஆள்பவர் கலக்குற அலை பெற்ற நாடு போல்,
பாழ்பட்ட முகத்தோடு பைதல் கொண்டு அமைவாளோ?
ஓர் இரா வைகலுள் தாமரைப் பொய்கையுள்
நீர் நீத்த மலர் போல, நீ நீப்பின் வாழ்வாளோ?
என ஆங்கு,
பொய் நல்கல் புரிந்தனை புறந்தரல் கைவிட்டு,
எந்நாளோ நெடுந்தகாய்! நீ செல்வது,
அந்நாள் கொண்டு இறக்கும், இவள் அரும்பெறல் உயிரே.
ఇంత చెప్పినా వినక ధనార్జనకోసం కష్టాల దారుల్లో ప్రయాణానికి సిద్ధపడుతున్న నాయకుడితో తనను విడిచి వెళ్ళవద్దని, తనను కూడా వెంట తీసుకొని వెళ్ళమని నాయిక ప్రాధేయపడడం కలిత్తొగై లోని తరువాతి పద్యం. పాలై కవిత పెరుంగడుంగో రచన, పాలై తిణై, నాయిక నాయకునితో చెప్పినది:
నువ్వు ఒక భయంకరమైన మార్గంలో వెళ్లబోతున్నానని చెబుతున్నావు —
ఎత్తైన పర్వత ప్రాంతాలలో, వానలు లేక ఎండిపోయిన నేలల్లో,
కఠినమైన నిర్జనారణ్యాలలోకి.
అక్కడ అడవి గోవులు గడ్డి దొరక్క గంజాయి ఆకులు మేస్తూ తిరుగుతుంటాయి;
బాటసారులపై పదునైన బాణాలతో దాడి చేసే బందిపోట్లు పొంచి ఉంటారు.
గాయపడినవారికి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు;
ఎండిపోయిన వారి పెదవులను తడిపేది బాధతో జాలువారిన వారి కన్నీళ్లే.
ఇంతా చెబుతున్నావు, ఐనా
నా పరిస్థితి ఏమిటో నీకు తెలియనట్టుగా మాట్లాడుతున్నావు.
నీ ఉన్నత స్వభావానికి ఇది సరిపోదు.
నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లాలనుకోవద్దు.
నీతో కలిసి ఆ దారిలోని కష్టాలను పంచుకోవడానికి
దయతో నన్ను కూడా తీసుకెళ్లు.
నీతో కలిసి నడవడంకంటే నాకు మరే ఆనందం కావాలి?
తమిళమూలం తెలుగులిపిలో
(కలిత్తొగై-6 పాలై పాడియ పెరుంగడుంగో, పాలై, తలైవి తలైవనిడం సొన్నదు)
మరైయా మరల్ కవర మారి వఱప్ప,
వరై ఓంగు అరుంజురత్తు ఆర్ ఇడైచ్చెల్వోర్,
చురై అంబు మూఴ్గిచ్చురుంగి పురైయోర్ తమ్
ఉళ్ నీర్ వఱప్ప పులర్ వాడు నావిఱ్కు,
తణ్ణీర్ పెఱా అత్తడుమాట్రు అరుందుయరం
కణ్ణీర్ ననైక్కుం కడుమైయ కాడు ఎన్ఱాల్,
ఎన్ నీర్ అఱియాదీర్ పోల ఇవై కూఱల్?
నిన్ నీర అల్ల నెడుందకాయ్! ఎమ్మైయుం
అన్పు అఱచ్చూఴాదే, ఆఱ్ఱు ఇడై నుమ్మొడు
తున్బం తుణై ఆగ నాడిన్, అదు అల్లదు
ఇన్బముం ఉండో ఎమక్కు?
తమిళలిపిలో
கலித்தொகை 6
பாலை பாடிய பெருங்கடுங்கோ, பாலை, தலைவி தலைவனிடம் சொன்னது
மரையா மரல் கவர மாரி வறப்ப,
வரை ஓங்கு அருஞ் சுரத்து ஆர் இடைச் செல்வோர்,
சுரை அம்பு மூழ்கச் சுருங்கிப் புரையோர் தம்
உள் நீர் வறப்பப் புலர் வாடு நாவிற்குத்,
தண்ணீர் பெறாஅத் தடுமாற்று அருந்துயரம்
கண்ணீர் நனைக்கும் கடுமைய காடு என்றால்,
என் நீர் அறியாதீர் போல இவை கூறல்?
நின் நீர அல்ல நெடுந்தகாய்! எம்மையும்
அன்பு அறச் சூழாதே, ஆற்று இடை நும்மொடு
துன்பம் துணை ஆக நாடின், அது அல்லது
இன்பமும் உண்டோ எமக்கு?
ఇంతగా ప్రాధేయపడిన తరువాతనైనా నాయకుడు ఆమెను తీసుకువెళతాడా లేదా, ఆమె స్పందన ఏమిటి? ఇతరుల స్పందన ఏమిటి? తఱువాయి భాగంలో చూద్దాం.
