జ్ఞానానికీ, ప్రేమకూ ఉన్న ఒక సాపత్యమేమిటంటే, రెండూ అనుభవైకవేద్యమైనవి. ఈ విశ్వం పుట్టినప్పటినుండీ ఉన్నవి కనుక, అంత పాతదనంలోనూ నవనవోన్మేషశాలిత్వాన్ని కలిగి ఉన్నవి కనుకా ఎన్నో రూపాలకూ మరెన్నో రూపాంతరాలకూ లోనై ఉంటూనే, చిన్ని చిన్ని వ్యవధులుగానూ అనంతాగాధాలుగానూ సాక్షాత్కరించగల శక్తి కలిగినవి రెండూ. స్వతహాగా ఏ నిర్వచనంలోనూ ఇమడవు. అన్నమయ్య అన్నట్లు చూస్తున్న వ్యక్తి ఎంత మాత్రంగా అనుకుంటే అంతమాత్రంగానే దర్శనమిస్తాయి. దృశ్యం తనకు చిక్కిందని ద్రష్ట అహంకరిస్తాడు కానీ నిజానికి అతనే తన దృక్పరిధికి చిక్కిపోతూ ఉంటాడు. సాధన చేసి పోగుచేసుకున్న విశాలమైన దృష్టితో “అహో జ్ఞాన మహో జ్ఞానం” అని మనసారా అనగలిగేది ఏ ఒక్కరో మాత్రమే.
ఆధునికకాలంలో కళను చూసే విధానంలో మార్పు వచ్చింది. ‘ఒక చిత్రం వేయి వాక్యాలకు పెట్టు’ అని శ్రవ్యకావ్యాలనుండి దృశ్యకావ్యాల వైపుకు దౌడు తీశాం. నియమాలను తెంచుకున్నాం. అక్కడనుండి ఏ కట్టడీ లేని ఫాంటసీ మాయలలో పడ్డాం. ఉత్సాహంగా వ్యసనలోకాలకు బలాన్నిచ్చి ఆదమరచి ఈదులాడాం. మనసును చెరచుకున్నాం. ఇప్పుడు మత్తును పుట్టిస్తూ వచ్చిన ప్రతీ దృశ్యమూ అలవాటై అలవాటై తెలియకుండానే తేలికైంది. ప్రతీ వీక్షణా క్షణికమైంది. శ్రద్ధ అరిగిపోయి, ఆవగింజలలాంటి అనుభూతులలోకి జారిపోయాం. నిరామయచేతనాస్వరూపంగా కన్నుల ముందు మనం నిలుపుకున్న భాషాసరస్వతి గడ్డిబొమ్మగా మారి, నిశ్చేతనమైన కమ్యూనికేషన్ టూల్‌గా పరిణమించింది. దరిమిలా ప్రస్తుతకాలంలో తామరతంపరగా కృత్రిమమేధ విస్తరిల్లుతోంది. మానవమేధా కార్యకలాపాలను అత్యల్పకాలంలో నిర్వహిస్తూ మెల్లిమెల్లిగా పనికిరానితనంలోకి పనులను కుక్కుతోంది. బౌద్ధికాన్ని భౌతికం చేయడంలో మనిషి చూపగలిగే శ్రమగణితాన్ని ఏఐ ఏజెంట్లు పదులరెట్లు తగ్గిస్తున్నాయి. కవితానిర్మాణసమయం ఇప్పుడు సెకను కంటే తక్కువ. అడిగిన వెంటనే ఎదుట స్క్రీన్‌పై చంద్రోదయాన్ని వర్ణిస్తూ పద్యం ప్రత్యక్షమౌతోంది. చెణుకులు, చాటూక్తులూ పుడుతున్నాయి. వాటిని చూస్తూ మనం వేసుకోవలసిన ప్రశ్నలు “మానవులు కళను సృజించవలసిన అవసరం ఇంక లేదా? కళాకారులు అంతరిస్తారా?” అని కాదు. కళ అనే వస్తువు మానవులలానే జీవవంతమైనది. ఒక పోతనవంటి జాతీయమహాకవి భాగవతమనే బృహద్రచనను చేశాడంటే ఆయన కృషి ఏదో మూలగ్రంథాన్ని అవగతం చేసుకొని గద్యపద్యాలుగా గణాలలో, వాక్యాలలో పెట్టడంతోనే అయిపోలేదు. దానికి వెనుక ఆయన కొన్ని ఆదర్శాలకు కట్టుబడ్డాడు. ఎన్నో ఔచిత్యాలకు ప్రాణం పోశాడు. ఎన్నో పదబంధాలను కన్నాడు. సాహిత్యారాధకుడిగా బ్రతికాడు. తన జీవంలోని అణువణువునూ రాజేసి రసానందానికి వాహిక అయ్యాడు. రూపుగట్టిన ఆంధ్రభాగవతమనే మహాసంచయపు కాంతి ఆయన హృదయమూలధనానిది. ఆ ప్రాణస్పందన ఒక స్వచ్ఛమైన ఉనికిది. ఆ అభివ్యక్తి ఒక ఉపాసనది. పోతనే కాదు, ఏదైనా ఒక కమనీయ మహనీయ రచన చేసిన కవిలోనూ, ఆ రచనను చదివి అప్రయత్నంగా పుట్టిన ఆనందంలో కొద్దిసేపు కనులను మూసుకున్న ప్రతీ పాఠకుడిలోనూ ప్రకాశించే ఆ భూమికలను ఎలా అందుకోవాలి? దానికి కావలసిన దృష్టి ఏమిటి? వంటి ప్రశ్నలు ఒక ఆంతరగవేషణకు దారితీసినపుడు కళ తాలూకు భౌతికాభౌతిక రూపాలకున్న విలువ మారిపోతుంది. అది ఒక కేవలశబ్దార్థవిపర్యయంగా కాక, జీవానుభూతిరహస్యంగా తెలిసివస్తుంది.
ఈ దృష్టితో చూసినపుడు ఆచార్య ఏల్చూరి మురళీధరరావుగారి ‘వాఙ్మయచరిత్రలో వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు’ అనే వ్యాససంపుటి సాహిత్యంపై ప్రసరించిన కొత్తవెలుగు. ఒక అవతీర్ణపరిమళం. అమృతలోకంవైపుగా తీరిన బాట. కవిత్వమే కాదు, సాహిత్యపరిశోధనమూ రసానందకారకమే అని నిరూపిస్తున్న కృషి ఇది. ఈ రచనకు వారు పెట్టిన పేరూ, దీనిని ఉంచిన తరగతీ రెండూ విలక్షణమైనవే. మహాభారతరచనకు పూనుకున్న వ్యాసభగవానునికి రాయసకాడైన గణపతి తాను లిఖించడం మొదలుపెట్టాక తన లేఖిని ఆగకుండా సాగాలనీ, అందుకు తగిన వాగ్ధారతో వ్యాసుడు భరతాన్ని చెప్పాలనీ నియమం పెట్టాడట. అందుకు అంగీకరించిన వ్యాసుడు ప్రతినియమంగా వ్రాస్తున్నదాన్ని అర్థం చేసుకున్న తరువాత మాత్రమే వ్రాయాలని అన్నాడట. ఒప్పందం కుదిరింది. రచన ప్రారంభమైంది. మనసులో శ్లోకాలను అల్లుతున్న వ్యాసునికి వేగం నెమ్మదించినప్పుడల్లా అన్వయకఠినమైన శ్లోకాన్ని చెప్పేవాడనీ, దాన్ని అన్వయించుకుని గణపతి వ్రాసే లోపు వేగాన్ని పుంజుకునేవాడనీ కథ. అలా వ్యాసుడు మహాభారతంలో చేర్చిన గ్రంథగ్రంథులకే వ్యాసఘట్టాలని పేరు. ఇవి భారతం మొత్తమ్మీద 8800 ఉన్నాయట! తరువాత వీటికి సాహిత్యజగత్తులో అనేక నామాంతరా లేర్పడ్డాయి. రాజశేఖరుడు తన ప్రచండపాండవంలో వీటిని కావ్యకష్టాలని అన్నాడు. భోజుడు వీటిని వ్యాసకష్టాలన్నాడు[1]”నను చ ఆశ్వాసకబన్ధేషు తత్సమాప్తావపి న చ్ఛందోభేద ఉపలభ్యన్తే. తథా హి రావణవిజయ-హరివిజయ-సేతుబన్ధేషు ఆదితః సమాప్తిపర్యన్తం ఏకమేవచ్ఛన్దో భవతి. గలితకాని తు వ్యాసకష్టవత్ కైరపి విదగ్ధమానిభిః ఉపక్షిప్తానీతి తద్విదో భాషన్తే. — చూ. శృంగారప్రకాశ, VOL II.. వ్యాసకూటాలని వీటికి మరొక పేరు. సీతావియోగంలో దుఃఖపడుతూ మాల్యవంత పర్వతంపై ఉన్న రాముడికి మనోమోదాన్ని కూర్చడానికి ఆయనకు చెప్పబడిన కొన్ని కూటశ్లోకాలకు కూడా వ్యాసకూటాలని పేరట! ఇట్లా ఇంకా అనేక నామాంతరాలున్నాయి. తెలుగులో వీటికి “ఏసకట్ట”ములని పేరుంది. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వీటిని సొగసుగా “ఉక్కుశెనగలు” అని పిలిచారు. తతిమ్మా వివరాలన్నింటినీ ఆచార్య మురళీధరరావుగారు తమ సంపుటిలో చాలా అందంగా వివరించారు. అలా ఈ పదానికి ‘భారతంలో కఠినమైన అన్వయం కలిగిన శ్లోకాలు’ అన్న అర్థం విస్తరించి ఏదేని కృతిలో కఠినభాగాలనీ, ఒక వ్యాసంలోని అంతర్విభాగాలనీ నానార్థాలు ఏర్పడ్డాయి. వాఙ్మయచరిత్రలో వివాదాస్పదాలైన విషయాలను, పరిశోధిస్తేనే కానీ అవగతం కాని సంగతులనూ వివరించిన వ్యాసాలు కనుక వీటికి ప్రస్తుత రచనలోని వ్యాసాలకు వ్యాసఘట్టాలన్నది సార్థకనామధేయమైంది. ఇవి కాక, ఇందులో చోటుచేసుకున్న మరికొన్ని విశేషాంశాలైన వ్యాసాలూ ఉన్నాయి.
అరవై వరకూ వ్యాసాలున్న ఈ సంపుటి మురళీధరరావుగారి సారస్వతప్రేమ, పరిశోధన, పాండిత్యం అనే మూడు నదులు సంగమించిన ప్రయాగ. ఆయన 15 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ, సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లముల సాహిత్యాలతో పాటు History of American Literature, History of Sanskrit Literature, History of Greek Literature, History of World Literature లను కూలంకషంగా, తపస్సువంటి అధ్యయనం చేశారు. ఆ సుదీర్ఘనిర్ణిద్రపరిశ్రమ ఫలితమే ఇలా కొలువుదీరిన ఈ వ్యాససంపుటి. తెలుగు సాహిత్యచరిత్రకు ఆధారకల్పాలు కాదగిన ఎన్నో విషయాలు ఈ వ్యాసాలలో ఉన్నాయి. సుదీర్ఘాధ్యయనం తరువాత 2010లో సాక్షిపత్రికలో కృష్ణశాస్త్రిగారి కాలాతీత కవితా కాసారం అనే వ్యాసంతో రచనకు శ్రీకారం చుట్టారు. తరువాత ఈమాట మొదలైన అనేకాలైన అంతర్జాల పత్రికలలో వ్యాసాలను ఒక్కొక్కటిగా ప్రచురిస్తూ వచ్చారు. 2012లో సిలికానాంధ్ర వారి సుజనరంజని అంతర్జాల పత్రికలో ఒక శ్రేణిగా వీరి వ్యాసాలు వస్తూ ఉండేవి. ఆ శ్రేణికి వీరు ‘వాఙ్మయచరిత్రలో వ్యాసఘట్టాలు’ అని పేరుపెట్టారు. ఆ వ్యాసాలలో ‘విశ్వ-విశ్వప్రకాశాల ఐక్యవాదం: కొన్ని చర్చనీయాంశాలు’; ‘రావిపాటి త్రిపురాంతకుని కృతులు: కొన్ని కొత్త వెలుగులు’ అన్న రెండు వ్యాసాలు తప్ప మిగిలినవన్నీ ప్రస్తుత వ్యాససంపుటిలో ఉన్నాయి. అనేక అంతర్జాలపత్రికలలో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆ శీర్షిక పేరునే తమ సంకలనానికి ఉంచారు. ఈ సంపుటిలో చేర్చబడని వారి వ్యాసాలను గురించి తరువాత చెబుతాను.
ఆచార్య శ్రీ మురళీధరరావుగారి సారస్వతప్రేమ వారి వ్యాసాలన్నింటిలోనూ తేటతెల్లంగా కనిపిస్తుంది. వారు పరిశోధనలో భాగంగా ముద్రితగ్రంథాలను, అముద్రితగ్రంథాలను, లిఖితప్రతులను, తాళపత్రాలనూ మాన్యుస్క్రిప్ట్స్ జాబితాలనూ వెతుకుతూ ఎన్నో వ్యక్తిగత ప్రభుత్వ ప్రైవేటు గ్రంథాలయాలనూ సందర్శించారు. ఎన్నో ఊర్లకు సంచరించారు. రచనల తాలూకు అనేక సంచికలను- మొట్టమొదటి దానినుండీ ఇటీవలి సంచికవరకూ వెతికిపట్టుకుని, అన్నింటినీ పక్కన ఉంచుకొని భేదాలనూ సామ్యాలనూ తైపారు వేసారు. ప్రస్తుతం లభ్యంకాని ఒక రచన వేరే ఏయే గ్రంథాలలో ఉట్టంకింపబడిందో తెలుసుకోవడంకోసం లెక్కలేనన్ని గ్రంథాలను చూసారు. అనేక పాఠభేదాలను పరిశీలించారు. వారి వ్యాసాలలోని రిఫరెన్సుల జాబితాను తయారుచేద్దామని మొదలుపెట్టిన నాకు ఈ సంపుటి ముందుమాట వ్యాసంలోనే కనీవినీ ఎరుగని రిఫరెన్సులు 84 వరకూ లభించాయి. ఉదాహరణకు, వారు పరిశీలించి, ఈ గ్రంథంలో ఉట్టంకించిన వ్యాసభారత వ్యాఖ్యలివి: అర్జునమిశ్రుడి మహాభారతార్థప్రదీపిక, చతుర్భుజమిశ్రుడి మహాభారతవాక్యదీపిక, దేవబోధుడి మహాభారతతాత్పర్యదీపిక (లేదా) జ్ఞానదీపిక, నందకిశోరుడి మహాభారతగూఢార్థప్రకాశిక, నీలకంఠచతుర్ధరుడి భారతభావదీపము, మధ్వాచార్యుని మహాభారతతాత్పర్యనిర్ణయము, మహానందపూర్ణవిద్యాసాగరుడి మహాభారతవ్యాఖ్యారత్నావళి, యజ్ఞనారాయణుడి భారతార్థప్రకాశము, రామకృష్ణుడి మహాభారతవిరోధభంజని, రామానుజుడి భారతతాత్పర్యము అనే విషమశ్లోకటీక, లక్ష్మణభట్టు మహాభారతవిషమోద్ధారిణి, వరదరాజు మందసుబోధిని, విద్యాసాగరుడి మహాభారతజయకౌముది, విమలబోధుడి దుర్బోధపదభంజని (లేదా) దుర్ఘటార్థప్రదర్శిని, సదానందుడి మహాభారతతాత్పర్యప్రకాశము, సర్వజ్ఞనారాయణుడి భారతార్థప్రకాశిక. ఇవి కాక, ఈ రచనలో పేర్కొనబడిన మహాభారతవ్యాఖ్యాకారులు — ఆనందుడు, గదానందుడు, జగదీశచక్రవర్తి, జ్ఞానానందభట్టు, దేవస్వామి, నందనాచార్యుడు, నందికేశ్వరుడు, పరమానందభట్టాచార్యుడు, ముని, రత్నగర్భుడు, రామకింకరుడు, వాదిరాజు, విట్ఠలాచార్యుడు, వైశంపాయనుడు, వ్యాసతీర్ధుడు, శంకరాచార్యుడు, శాండిల్యమాధవుడు, శ్రీధరాచార్యుడు (మహాభారతభట్టాచార్యుడు), శ్రీనివాసుడు, సృష్టిధరుడు.
ఈ గ్రంథంలో చెప్పబడిన భాషాకోశాలు — మధురేశుడి శబ్దరత్నావళి, అమరసింహుడి అమరకోశము, ధరణిదాసుడి ధరణికోశము, మేదినీకారుడి మేదినీకోశము, హైమకోశము, మంఖుడి మంఖకోశము, హర్షకీర్తి శారదీయనామమాల, దండనాథుడి నానార్థరత్నమాల, భోజుడి నామమాల (నామమాలిక), మహేశ్వరసూరి విశ్వప్రకాశం, హలాయుధకోశం, శబ్దకల్పద్రుమము, నర్మమాల, వీరరాఘవీయం, హేమచంద్రుడి అనేకార్థసంగ్రహం మొదలైనవి.
ఉదాహరణలుగా ఒక రెండు తరగతులను పైన చూపాను కానీ ప్రబంధసారశిరోమణి, పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరము, మడికి సింగన సకలనీతిసమ్మతము, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి చాటుపద్య రత్నాకరము, మానవల్లి రామకృష్ణకవి ప్రబంధమణిభూషణము, వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రబంధరత్నావళి, చాటుపద్యమణిమంజరి వంటి అనేక తెలుగు కవితాసంకలనాలు; శ్రీధరదాసు సదుక్తికర్ణామృతము, జల్హణుడి సూక్తిముక్తావళి, విద్యాకరుడి సుభాషితరత్నకోశము, సుభాషితరత్నభాండాగారము ఇత్యాది సంస్కృత కవితా సంకలనాలు; గాథాసప్తశతి, గాహారయణకోసో, వజ్జలగ్గ వంటి అనేక ప్రాకృత కవితా సంకలనాలు; నేమిచంద్రుడి లీలావతీ ప్రబంధము వంటి అనేక కన్నడ కృతులు, ఇతర భాషాకృతులు; అనేక తెలుగు కావ్యాలు-వాటిపై వచ్చిన అనేక వ్యాఖ్యానాలు; అనేక సంస్కృతకావ్యాలు-వాటిపై వచ్చిన అనేక వ్యాఖ్యానాలు; అనేకానువాదాలు; చాగంటి శేషయ్యగారి ఆంధ్రకవితరంగిణి, గురజాడ శ్రీరామమూర్తిగారి కవిజీవితములు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి ఆంధ్రరచయితలు వంటి అనేక కవిచరిత్రలు; మమ్మటుడి కావ్యప్రకాశము, రుయ్యకుడి అలంకారసర్వస్వము, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకము, మహిమభట్టు వ్యక్తివివేకము, కుంతకుడి వక్రోక్తిజీవితము, అంబాప్రసాదుడి కల్పలత, విద్యాధరుడి ఏకావలి, చిరంజీవుడి కావ్యవిలాసము, అప్పయదీక్షితుల కువలయానందము, జయదేవుని చంద్రాలోకము, నరసింహపండితుని నంజరాజయశోభూషణము, విద్యానాథుని ప్రతాపరుద్రీయము, మల్లాది లక్ష్మణసూరి సాహిత్యరత్నాకరము, సంఘరక్షితుని సుబోధాలంకారము వంటి అనేక లాక్షణిక గ్రంథాలు- వాటిపై వచ్చిన అనేక వ్యాఖ్యానాలు; అనేక శాస్త్రీయగ్రంథాలు-వాటి వ్యాఖ్యలు; వివిధ ప్రాంతాలకు చెందిన మాన్యుస్క్రిప్ట్ సంకలనాలు, తాళపత్రాలు; కలకత్తా మొదలుకొని కాకినాడ వరకూ అనేక రాష్ట్రాలనుండి వివిధ భాషలలో వెలువడిన సాహిత్య విద్యా పత్రికలు, భారతీయులే కాక పాశ్చాత్యులు ప్రకటించిన క్యాటలాగులు ఇత్యాదులు ఎన్నో ఎన్నో మురళీధరరావుగారి వ్యాసాలలో మనలను పలకరిస్తాయి. వీటిల్లో ప్రస్తుతం లభ్యమవుతున్న రచనలుకన్నా లభ్యం కానివి ఎక్కువ ఉన్నాయి. ప్రసిద్ధమైనవి ఎన్ని ఉన్నాయో, అప్రసిద్ధాలై పాఠక చారిత్రక దృష్టికి నోచుకోని కృతులు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఏదైనా కృతిని గురించి మాట్లాడేటప్పుడు అవసరాన్ని బట్టి ఆ కృతి ఏ సంవత్సరం ముద్రింపబడింది, దాని ముద్రణకర్త ఎవరు, రచయిత ఎవరు, ప్రస్తుత వ్యాఖ్యాత ఎవరు, ఇతరవ్యాఖ్యాత లెవరు, బైటకు వచ్చిన సంచికలు ఎన్ని, ప్రస్తుత విషయాంశం ఏ సంవత్సరం ఏ ముద్రణశాలనుండి ఏ భాషలో వెలికివచ్చిన ఏ సంచికలో ఏ పుటలో ఉందో లేదా ఏ సాహిత్యపత్రిక ఏ సంపుటి ఏ సంచిక ఏ వ్యాసం ఏ పేజీలో ఉందో ఇత్యాది విషయాలను సుస్పష్టంగా చెబుతారు. ఒకే పద్యానికి లేదా శ్లోకానికి అవసరాన్నిబట్టి వీరు చూపిన భేదాలు అనేకాలు. తెలుగువారు పట్టించుకోని ఎందరో తెలుగు కవులనూ తెలుగు కృతులనూ వీరు పరిచయం చేస్తారు. ఇటువంటి రచనలు తెలుగులో, భారతీయ భాషలలో వెలికివచ్చాయన్న సంగతే తెలియని కృతులు ఈ సంపుటిలో అడుగడుగునా అగుపిస్తాయి. వ్యాసవిస్తారభీతితో అన్నింటినీ ఏకరువు పెట్టడం లేదు. సందర్భానుసారంగా ముందు ముందు కొన్నింటిని మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాను.
ప్రసిద్ధరచనలు సరే, పైన చెప్పుకున్నట్టు ఇన్ని అలభ్యకృతుల సమాచారం వీరికి ఎలా లభించింది అన్నది పెద్ద ఆశ్చర్యం. వీరు తంజావూరు సరస్వతీ మహల్ మొదలుకొని సాహిత్య అకాడమీలు; చెన్నపురి, పుణే, తిరుపతి ఇత్యాది ప్రాంతాలలో ఉన్న ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాలు, పరిశోధనాలయాలు, అనేక ప్రభుత్వ-వ్యక్తిగత గ్రంథాలయాలు, గ్రంథభాండాగారాలను స్వయంగా సందర్శించారనీ అనేక వ్రాతప్రతులను గంటల తరబడి పరిశీలించారనీ, వివరాలను మనసులో ఉంచుకున్నారనీ, శ్రద్ధగా టిప్పణులను వ్రాసుకున్నారనీ తేలికగానే ఊహించవచ్చు.
వ్రాతప్రతులకోసం దేశసంచారం చేస్తున్న మానవల్లి రామకృష్ణకవిగారు ఏదైనా అపూర్వమైన కృతి ఎక్కడైనా కనబడితే, దానిని ఇవ్వడానికి యజమాని నిరాకరిస్తే, “ఒక్కసారివ్వండి, చదువుకుని ఇస్తాను” అని కృతి మొత్తాన్నీ మస్తిష్కంలో నిలుపుకునేవారట. అంతటి ప్రజ్ఞ ఆచార్య మురళీధరరావుగారిలో మళ్లీ మనకు కనులకు కడుతుంది. ఏదైనా వ్రాతప్రతి గురించి చెప్పేటప్పుడు అది అముద్రితమైతే ప్రస్తుతం ఆ ప్రతి ఏ గ్రంథాలయంలో ఏ సంఖ్యతో అనుసంధానింపబడి ఉంది అన్నది కూడా చెబుతారు. అలాగే, ఒక విషయాంశం లేదా వివాదాంశం గురించి మాట్లాడేటప్పుడు దానిని మొట్టమొదట ప్రతిపాదించినది ఎవరు, ఆ ప్రతిపాదనకు ఆధారమేది, ఏ కృతిలో ఏ సమయంలో ఆ ప్రతిపాదన వెలువడింది, దానిని ఆధారం చేసుకొని విస్తరించిన రచయిత లెవరు, ఆ విస్తరణలు ఎన్నిరకాలుగా జరిగాయి ఇత్యాది విషయాల వివరం సంపూర్ణంగా ఉంటుంది. ఇన్ని గ్రంథాల గురించి, ఇన్ని రిఫరెన్స్‌ల గురించీ ఇంత సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించడం, స్మృతిలో ఉంచుకోవడం ఒక ప్రేమతపస్సు. ఈ తపస్సు అనిదంపూర్వమైనది, నాన్యతోదర్శనీయమైనది కూడా.
సాహిత్యవ్యాససంపుటిగా ఈ కృతి వర్గీకరింపబడిందే కానీ ఇందులోని వ్యాసాలు, ముఖ్యంగా ఆంధ్రసాహిత్యాన్ని అధికరించినవి, ఒక్కొక్కటి ఒక్కొక్క పరిశోధన పత్రం. ఒక్కొక్క వ్యాసానికీ రూపు తీసుకొని రావడానికి రచయిత ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపి ఉంటారో అనిపించక మానదు. “పరి” శబ్దానికి సర్వతోభావమన్న అర్థం ఆచార్య శ్రీ మురళీధరరావుగారు ఎన్నుకున్న అంశాలలోనూ, వాటిని సాధించిన తీరులోనూ పూర్తిగా తెలిసివస్తుంది. ఆయా అంశాలను ప్రతిపాదించడంలో, పరిష్కారాలు చూపించడంలో, అందుకు తగిన సాక్ష్యాలను ప్రకటించడంలో వారి ప్రతిభ బహుముఖీనం. ఈ వ్యాసాలలో దృఢమైన సాక్ష్యం లేకుండా చేసిన ప్రతిపాదన ఒక్కటీ లేదు. అంతే కాదు, ఒక సమస్యను సాధించడంలో వీరెన్నుకున్న శైలి సకలాధారప్రదర్శిని మాత్రమే కాదు, విద్యార్థిలోకానికి మహోపకారి కూడా. సాహిత్యపరిశోధన చేయాలనుకునేవారికి అనుసరణీయాలు కాదగిన ఎన్నో మౌలికసూత్రాలను ఈ సంపుటిలో గమనించవచ్చు.
ఏదేని పరిష్కారానికి కావలసిన సమాధానం దొరికి ముందుకు వెళ్లడానికి అవకాశం దొరికినా కూడా, సమస్యాంశాన్ని అధికరించిన వివరాలను మరిన్నింటిని వీలున్నంత మేర చూపుతూనే ఉండడం ఈ కృతిలో చూస్తాం. ఉదాహరణకు, సంస్కృతంలో ‘వాసవదత్తా’ అనే కమనీయమైన గద్యకావ్యాన్ని మహాకవి సుబంధుడు వ్రాసాడు. ఆ కావ్యస్వరూపాన్ని పరిపూర్ణంగా చర్చించిన సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు అన్న వ్యాసం ఈ సంపుటిలో ఉన్నది. ఆ కావ్యం తాలూకు గద్యశైలి ఉదాత్తసుమనోహరమైనది అని నిరూపణ చేస్తూ, అందుకు ఆధారభూతాలుగా క్రీ.శ 150 నాటి రుద్రదాముడనే శాసనకారుడు గుజరాత్‌లోని జునాఘడ్ పర్వతశ్రేణిలోని తన గిర్నార్ శాసనంలో వ్రాసిన గద్యశైలి నిర్వచనాన్ని చూపిస్తారు. ఆ నిర్వచనంలోని ప్రతీ పదాన్నీ వివరిస్తారు. క్రీ.శ. 1150 నాటి పృథ్వీధరాచర్యుడనే పండితుడు తన వస్తువిజ్ఞానరత్నకోశంలోని 73వ సూత్రంలో వ్రాసిన వాక్యలక్షణాన్ని చూపించి, అది ఏ విధంగా సుబంధుడి గద్యరచనా పటిమను వివరిస్తోందో ప్రతీ పదాన్నీ విడమరచి వ్రాస్తారు. ఆ శాసనమూ, ఈ రచనా అనేవి ఉన్నాయనీ, వాటిలో గద్యశైలీనిర్వచనాత్మకమైన వాక్యాలున్నాయనీ తెలియడమే గొప్ప గవేషణతాలూకు ఫలితం కాగా, ఆ నిర్వచనాలు సుబంధుడి శైలిని చక్కగా పట్టిస్తున్నాయని గుర్తుపట్టడం గొప్ప దృష్టి.
సుబంధుని ‘వాసవదత్తా’ ఆఖ్యాయిక అనే గద్యరచన తరగతికి చెందిందా లేదా కథా అని ప్రశ్న వేసుకుని, ఈ రచన దేశం మొత్తమ్మీద తాళపత్రరూపంలో, కాగితపు ప్రతుల రూపంలో, వ్రాతప్రతుల రూపంలో, ముద్రితప్రతుల రూపంలో ఎక్కడెక్కడ ఊపిరి తీసుకుంటోందో అన్ని వివరాలనూ ఇచ్చారు. పుణే లోని భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో 463-1987-91 సంఖ్యగల తాళపత్ర ప్రతి లేఖకుడు ఈ రచనను ‘ఆఖ్యాయిక’ అన్నాడట. జైసల్మేరు జినభద్రసూరి జైన జ్ఞానభండార లిఖిత గ్రంథ సంచయంలో 348 సంఖ్యగల ప్రతి చివరన ఈ రచనను ‘కథ’ అని వ్రాసారట. గుజరాత్ భావనగర్ ప్రజా గ్రంథాలయం వారి వర్ణనాత్మక సూచికలలో ‘ఆఖ్యాయిక’ అని ఉన్నదట. అహ్మదాబాద్ జైన గ్రంథభాండాగారంలోని 10698, 13020 సంఖ్యలుగల వివిధ వ్రాతిప్రతుల తుదలలో ఈ రచనను ‘కథ’ అన్నారట. తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో ఉన్న 4012 వ్రాతప్రతి చివరన ఈ రచనను ‘ఆఖ్యాయికా’ అన్నారట. ఇలా అనేక ప్రతుల వివరాలను చెప్పారు. ఈ కావ్యంపై వెలువడిన 22 వ్యాఖ్యల వివరాలను వరుసగా గుప్పించారు.
మామూలు ప్రయత్నంతో లభ్యంకాని ఇన్నిన్ని ప్రతుల వెనుక పడడమే వృథా అని అనుకునేందుకు వీలుంది. లేదూ, కష్టించి వెతకగా ఒక ప్రతిలో ఆఖ్యాయిక అన్న వాక్యం కనబడి, వేరొక ప్రతిలో కథ అన్న వాక్యం కనబడితే, ఈ రచనను రెండు రకాలుగానూ పూర్వులు పిలిచారని అక్కడే నిర్ధారణకు రావచ్చు. ఒక్కక్క వ్రాతప్రతీ ఒక్కొక్కలా చెబుతుంటే, అన్నింటినీ పరిశీలించవలసి వచ్చిందని చెప్పవచ్చు. అలానూ లేదు. పైగా, తాళపత్రాల వివరాలు సంఖ్యలతో సహా చెప్పమని ఎవరూ అడగరు. అలానే, సుబంధుడి గద్యశైలి ఉదాత్తమైనదని చెప్పటానికి ఎక్కడిదో ఒక శాసనాన్నీ, కనీ వినీ ఎరగని ఒక విజ్ఞానకోశాన్నీ తోడు తెచ్చుకోవలసిన అవసరం లేనే లేదు. మామూలుగానే ఆ పని చేయవచ్చు. అంటే, ఈ రచయిత ఉద్దేశం ఏవో కొన్ని సాహిత్యసమస్యల పరిష్కారం కాదు. ఏవో కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకోవడం కాదు. నిర్ధారణకు సరిపోయే ఆధారం ఒకటి దొరకగానే దాన్ని చూపించి ముందుకుపోవడం కాదు. అందుకు ఇంత కృషి అవసరం లేదు. ఎవరి వద్దనుండో లేదా ఏ సంస్థనుండో గ్రాంట్లను పొంది చేసిన ప్రయత్నం కాదిది. అలా అని ఇది పాండితీప్రదర్శన కూడా కాదు. సుబంధుడి వాసవదత్తా కథ భారతదేశమంతా ఒక విరాడ్రూపంతో వ్యాపించిన తీరును మనకు దర్శింపచేయడం ఈ ప్రత్యేకవ్యాసలక్ష్యాలలో ఒకటన్నమాట. ఈ వ్యాసంలోనే కాదు, ప్రతీ వ్యాసంలోనూ సాహిత్యపరిశోధకులు ఔదల దాల్చదగిన ముద్రితాముద్రితాలైన ఆకరాలు ఇలానే అనేకం వరుసకడతాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం గురించి మాట్లాడేటప్పుడు దానిపై వెలువడిన వ్యాఖ్యానాలన్నింటి గురించీ చెబుతారు. ఒక అలంకారాన్ని నిర్వచించేటప్పుడు అనేక లాక్షణిక కృతులలోని నిర్వచనాలనూ ఇస్తారు. ఇదంతా ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోక మరుగునపడిపోయిన మన జాతి సంపదను వీలైనంత వెలికితీయడం, దానిని దోసిళ్లతో పాఠకులకు పంచిపెట్టడం. అలానే, ఇన్ని వేల యేళ్లుగా ఈ దేశంలో అనేక ముడులతో కొలువుదీరి ఉన్న సంప్రదాయసాహిత్యపు తీరుతెన్నులను, పైపై భిన్నత్వం వెనుక ప్రకాశించే ఏకత్వాన్ని చదువరులకు చూపించడం కూడా. ఒక సాహిత్యకారుడు నిర్మమగా చేయవలసిన ఉత్కృష్టమైన పని ఇదే.
ఒక ప్రతిపాదనకు ప్రమాణాలను చూపించేటప్పుడు ఆ ప్రమాణం వాఙ్మయంలో ఏ మూల ఉందీ, దానిని వెతికి పట్టుకోవడం ఎంత క్లేశంతో కూడుకున్న పనీ అన్న ఆలోచనలు ఈ రచయితకు రావు. అది ఎంత బలీయమైనదీ ఎంత ఉచితమైనదీ అనే కారణాలకు కట్టుబడి మాత్రమే దానిని సంగ్రహించడం, ప్రకటించడం ఉంటాయి. అందుకోసం ఆసేతుసీతాచలాన్ని జల్లెడ పట్టవలసి వచ్చినా వెనుకాడడం ఉండదు. ‘అన్నమయ్య భక్తి శృంగారమంజరి’ అనే వ్యాసంలో శృంగారమంజరి కావ్యం మాధుర్యమయమైనది అని వివరిస్తూ, ఆ కావ్యగుణప్రమాణంగా ఏ ప్రసిద్ధిచెందిన లాక్షణికగ్రంథాన్నో కాక, ఎవ్వరికీ పెద్దగా తెలియని సోమేశ్వరుడి అభిలషితార్థచింతామణిని ఎన్నుకున్నారు. కారణం, ఆ నిర్వచనం ఈ కావ్యానికి ఉచితతరమైనది కనుక. ప్రమాణాలను విషయాంశాలకు నప్పించి పట్టించడం ఆచార్యుల పరిశోధనలో హృదయంగమంగా గమనిస్తాం.
ఈ వ్యాసాలలో కనిపించే మరొక్క గుణం, పరిశోధనకు కట్టుబడి అది ఎటువైపు మరల్చుతుందో ఆ వైపుకు నిజాయితీగా ప్రయాణం చేసి ప్రతిపాదనలు చేయడం. ఉదాహరణకు, ‘నన్నెచోడుని కుమారసంభవములో “అలిధమ్మిల్ల” పద్యవివాదం: స్థితిస్థాపన’ అనే వ్యాసం తాలూకు పరిశోధన పరిగతిని గమనించండి – [ఈ వ్యాసం నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అనే పేరుతో నవంబర్ 2013 ఈమాటలో ప్రచురింపబడింది – సం.]
వివాదాంశం:
1909వ సంవత్సరంలో మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని పేర ప్రకటించిన కుమారసంభవంలోని 106వ పేజీలో షష్ఠాశ్వాసంలోని 824వ పద్యం “అలిధమ్మిల్ల మృణాలహస్తఁ గమనీయావర్తనాభిన్”ను తెనాలి రామకృష్ణకవి దొంగిలించి, తన కందర్పకేతువిలాసకావ్యంలో “లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు” అనే పద్యంగా మార్చాడని ఆ పద్యం అధోజ్ఞాపికలో వ్రాసిన ఒక వివాదాస్పదమైన విశేషం → ఇదే విషయాన్ని మా. రా. కవి ఇరవై ఎనిమిదేళ్ల తరువాత “భారతి”పత్రికలో పునః ప్రకటించడం.
పరిష్కారం రూపుదిద్దుకున్న విధానం:
“లలితాస్యాంబురుహంబు” పద్యం పెదపాటి జగన్నాథకవి రచించిన ప్రబంధరత్నాకరంలో 189వ వ్రాతప్రతిలో మాత్రమే తప్ప, తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసంలో మరెక్కడా లేదు అని పరిశీలకులు గుర్తించిన సంగతి ప్రస్తావన → 1918లో ప్రభాకరశాస్త్రిగారు సంకలనించిన ప్రబంధరత్నావళిలో కందర్పకేతువిలాసంలోనివిగా వారు చూపించిన పద్యాలలో “లలితాస్యాంబురుహంబు” పద్యం లేకుండటం→ కుమారసంభవ-కందర్పకేతువిలాసాలలో కథాసందర్భానుసారంగా ఈ రెండు పద్యాలనూ తాత్పర్యాలతో వివరించడం → కందర్పకేతువిలాసంలోని పద్యమే సందర్భవిదర్భమనీ, కుమారసంభవంలోని పద్యం సందర్భానికి అన్వయం పొందుపడని కారణంగా శిల్పాఘాతకారకమనీ నిర్ణయించడం → ఈ రెండుపద్యాలకూ మానవల్లి వారూహింపని రీతిగా ఒక సంస్కృతశ్లోకం మూలమనే విషయాన్ని ఆవిష్కరించడం → అది కాళిదాసు పేరిట ఉన్న శృంగారతిలకంలోని మొదటి శ్లోకమైన “బాహూ ద్వౌ చ మృణాల మాస్యకమలం…”గా గుర్తించటం → 30 నుండి 36 శ్లోకాలుగా పాఠభేధాలతో లభ్యమౌతున్న ఈ శృంగారతిలకం కాళిదాసు కాలానికి చెందినది కాదనీ, కనుక శృంగారతిలక కర్త కాళిదాసు కాడనీ తీర్పు → కాళిదాసుదే అయితే, 10-13 శతాబ్దులనాటి వాడిగా భావింపబడే నన్నెచోడుడు అసమర్థానువాదం చేయవచ్చు కదా, రాయల కాలంనాటి రామలింగకవి సమర్థానువాదం చేయవచ్చు కదా అనే ప్రతిపాదనను ప్రతిజ్ఞీకరించడం → నిరూపణ కోసం శృంగారతిలకంపై మరిన్ని వివరాల ప్రకటన; లభ్యమైన ముద్రిత ప్రతులు, పాఠాల వివరాలు → శృంగారతిలకం అన్న పేరుతో సంస్కృతంలో ఉన్న మిగిలిన రచనల వివరాలు → శృంగారతిలకంలోని శ్లోకాలు సాహిత్యంలో ఎక్కడా కాళిదాసుపేరిట ప్రకటింపబడలేదనీ, అవన్నీ 1205వ సం.లో వచ్చిన శ్రీధరదాసు సదుక్తికర్ణామృతం, 1450 సం.రం నాటి వల్లభదేవుడి సుభాషితావలి, 11వ శతాబ్దినాటి విద్యాధరుడి సుభాషితరత్నకోశం ఇత్యాది సంగ్రహాలల్లో వేరే వేరే కవుల పేరిట ఉన్నాయన్న గుర్తింపు → శృంగారతిలకంలోనిదిగా ఉన్న ఒక శ్లోకం అమరుకశతకంలో కూడా ఉన్నదనీ, అది ఆంధ్రదేశంలో ప్రసిద్ధిగా కూడా ఉన్నదనీ చూపడం → శృంగారతిలకంలో “కస్తూరీవరపత్రభంగనికరో” అన్న శ్లోకవివృతి, దానిని శ్రీనాథుడు “సరసుడు కాడొ? జాణ, రతిసంపదలేదొ?” అన్న చాటువుగా వ్రాసాడని మొట్టమొదటిసారి చెప్పడం → ఇంకా అనేక శ్లోకాలను వివిధ గ్రంథాలలో చూపడం → శృంగారతిలకంలోనూ భోజ కాళిదాస కథల్లోనూ కనిపిస్తున్న “కుసుమే కుసుమోత్పత్తిః” అన్న శ్లోకాధారంగా ఈ రచన కాళిదాసకృతంగా మారి ఉండవచ్చనే ఊహ → తెనాలి రామకృష్ణకవి శృంగారతిలకంలోని పదాలను ఉద్భటారాధ్యచరిత్రలోనూ, కందర్పకేతువిలాసంలో మిగిలిన చోటులలో వాడుకున్నాడన్న నిరూపణ → కనుక తెనాలి కవికి కందర్పకేతువిలాస రచనకు మునుపే శృంగారతిలకం పరిచితమే నన్న తీర్పు → నన్నెచోడుని కుమారసంభవంలోనే, “అలిధమ్మిల్ల..”గా సందర్భవిఘాతకమైన అదే మూలభావం మరొకచోట (10-29లో) “లలితకుంతలశైవలము ముఖైందవ బింబ..” మనే సీసపద్యంగా ఉచితమనోహరంగా ఉన్నదని వివరించడం → తెనాలి కవి పద్యానుసరణగా ఆ మూలకల్పనను కూచిమంచి తిమ్మకవి తన రసికజనమనోభిరామములో రెండుసన్నివేశాలలో కల్పించాడని చూపడం → నేమిచంద్రుడి కన్నడ ప్రబంధం లీలావతిలో ఇటువంటి కల్పనే ఉండడం → లీలావతినీ, శృంగారతిలకాన్నీ చదువుకున్న తెనాలి రామకృష్ణుడు సందర్భానుషక్తంగా ఆ కల్పనను సమర్థవంతంగా తీర్చిదిద్దాడని నిరూపణ → కల్పన నచ్చిన కారణంగా అదే ఊహతో రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యం (5-270) లోనూ వేరే పద్యం కూర్చాడని చూపడం → కనుక తెనాలి రామకృష్ణుడి “లలితాస్యాంబురుహంబు” అనే పద్యం సంస్కృత శృంగారతిలక శ్లోకానికే దగ్గరగా, విధేయంగా ఉన్నది కాని, నన్నెచోడుని కుమారసంభవ పద్యానికి కాదు అని స్పష్టీకరించడం → మానవల్లి రామకృష్ణకవి పొరపడినట్లు గ్రంథచౌర్యం చేసినది మహాకవి తెనాలి రామకృష్ణుడు కాదనీ, మూలసంస్కృతశ్లోకోహను తన ప్రతిభతో ఉన్నతీకరించి సందర్భోచితంగా వాడుకున్నాడనీ, అర్థాపహారదోషం వర్తించవలసివస్తే నన్నెచోడునికే వర్తిస్తుందనీ చివరగా తేల్చటం.
ఈ వ్యాసమే కాదు, ఈ సంపుటిలోని ప్రతీ సశిల్పమూ ఎన్నో ఆప్తబోధలను చేస్తుంది. పరిశోధన పేరుతో స్వంతబుద్ధులనూ దురభిమాన-దుర్భ్రమ-పక్షపాతాలనూ వెలిపెట్టుకోకూడదని చేయకనే చేసిన హెచ్చరిక వంటివి ఈ వ్యాసాలన్నీ. పై వ్యాసంలో కొలువైన ప్రతీ సోపానమూ, పరిశోధన నిక్కచ్చిగా ఏ విధంగా సాగాలో, మార్గమధ్యంలో ఏయే ప్రశ్నలు ఉదయిస్తాయో, వాటన్నింటికీ ఏ విధంగా సమాధానం చెప్పవలసిన అవసరం పరిశోధకునికి ఉంటుందో నిర్దేశిస్తాయి.
ఆచార్య మురళీధరరావుగారు ఈ వ్యాసాల ద్వారా ప్రసరింపజేసిన మరికొన్ని వెలుగులున్నాయి. శాస్త్రీయంగా ఒక కావ్యం ఏ కవిదో ఎలా నిర్ధారించాలి? (ఉదా. ‘నన్నెచోడుని కుమారసంభవంలోని “అలిధమ్మిల్ల” పద్యవివాదం’ వ్యాసంలో శృంగారతిలక కవి నిర్ణయం), ఒక పద్యం ఒక కవిది అవునా కాదా అని ఎలా నిర్ణయించాలి? (ఉదా. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన వ్యాసంలో “వారణసేయఁ దావిఁ గొనవా?” అనే పద్యం శ్రీనాథునిదా కాదా అని చేసిన నిర్ణయం), ఒక కవి ఏ కాలంవాడో ఎలా కనిపెట్టాలి?(ఉదా. ‘సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు’ వ్యాసంలో చేసిన సుబంధుని కాల, ప్రాంత నిర్ణయాలు), ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఉటంకింపబడిన వ్యక్తి ఎవరు అన్న సమస్యను ఎలా పరిష్కరించాలి? (ఉదా. ‘పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యాలు: సాహిత్య చారిత్రిక విశేషాలు’ వ్యాసంలో శృంగార శాకుంతలము ఆశ్వాసాంత గద్యలలో పినవీరన ప్రస్తుతించిన శ్రీ భారతీతీర్థ యతీంద్రులు ఎవరు అని చేసిన నిర్ణయం), ఒక రచన ఏ కాలం నాటిదో ఊహించడమెలా? (అనేక ఉదాహరణలు;) ఒక పద్యానికి అపపాఠాలు అనేకం లభ్యములుగా ప్రచారంలో ఉన్నప్పుడు చక్కని సరైన పాఠాన్ని ప్రతిపాదించడం ఎలా? (అనేక ఉదాహరణలు), ఒక పద్యంలోని అలంకారవిమర్శను చేయడమెలా? (ఉదా. పోతనగారి కల్పనానల్పశిల్పం అనే వ్యాసం), ఒక తెలుగు పద్యంలో వక్రోక్తి ఉన్నదా, ధ్వని ఉన్నదా, ఏ కవితాగుణం ఉన్నది అనే వివేచన చేయడమెలా?(అనేక ఉదాహరణలు), ఒక మహాకవి వ్రాసిన పద్యంలో పైపైని అర్థం కాకుండా ద్యోతకమయ్యే అంతరార్థాలను కనుక్కోవడమెలా? (ఉదా. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ అనే వ్యాసంలో ప్రసిద్ధమైన తెనాలికవి యొక్క “స్తుతమతియైన యాంధ్రకవి” పద్యపూరణకు ఉపలభ్యంగా ఉన్న పాఠాంతరాలకు అర్థాలను చెప్పడంతోపాటుగా, కాళహస్తీశ్వరమాహాత్మ్యంలోని మాణిక్యవల్లి కథనూ ఆ పూరణ స్ఫురింపచేస్తుందని తేల్చడం) వంటి అనేక ప్రశ్నలకు ఇదివరకు లేని అనుసరణీయాలైన సాధనాపరిష్కారపద్ధతులను, ఆలోచనలు చేయవలసిన మార్గాలనూ ఈ సంపుటి ద్వారా ఆచార్య మురళీధరరావుగారు తెలుగు సాహిత్యజగత్తులో ప్రవేశపెట్టారు.
పైవి కాక, తులనాత్మకపరిశీలనలో ఆచార్య మురళీధరరావుగారు తమ వ్యాసాలలో చూపించిన కొత్త దారులు ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి. ఈ సంపుటిలో కొన్ని వ్యాసాలు, కొన్ని వ్యాసాంశాలూ కనులు జిగేలుమనే ఆచార్యుల సాదృశ్యశోధనపటిమను నిరూపిస్తాయి. (ఉదా. వృత్తిమౌక్తికమనే సంస్కృతకవిలాక్షణికుడైన అయిన చంద్రశేఖరభట్టు నన్నయ్య భారతాన్ని పాణ్డవచరితమ్ అన్న పేరుతో సంస్కృతానువాదం చేశాడని కనిపెట్టడం.) ఒకే భావంతో ఒకే కల్పనను ఆధారం చేసుకొని రెండు పద్యాలను ఇద్దరు కవులు తమ వేరువేరు కృతులలో వ్రాస్తే, వాటిని సరిపోల్చడం ఎలాగ? రెండు పద్యాలు ఒకేలాగున అగుపిస్తుంటే, ఏది ఔచితీమంతమైన రచనో గుర్తుపట్టడమెలా? ఒక తెలుగు పద్యాన్ని వ్రాసేటప్పుడు ఆ కవి మనసులో ఉండినటువంటి తత్పూర్వకృతులేవో, కవితలేవో ఊహించడం ఎలా? శైలిని బట్టి ఏ పద్యం ఏ కవితో గుర్తుపట్టడం ఎలా? వంటి అనేక ప్రహేళికలకు సమాధానాలు ఈ వ్యాసాలలో ఉన్నాయి. తులనాత్మకపరిశీలనలో ఆచార్యులు అనేక స్థాయులలో తమ విద్వత్తును ప్రదర్శించారు. రెండు పద్యాలను, లేదా ఒక పద్యాన్నీ ఒక శ్లోకాన్నీ పోల్చేటప్పుడు వాటికి సంబంధం ఉన్నదని చెప్పడం అన్నిసార్లూ తేలిక కాదు. ఉదాహరణకు, ‘శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన’ వ్యాసంలో శ్రీనాథుని శాలివాహనసప్తశతిలోనివిగా ఉన్న పద్యాలకు మాతృకలైన గాథలను మన ముందు ఉంచి, ఆ పద్యాలు శ్రీనాథునివి ఔనో కానో నిర్ణయించడం ఉంటుంది.
ఉ.
సారపు రత్నముల్, కొడుకు చంద్రుఁడు, కూఁతురు లక్ష్మి, యాలు భా
గీరథి — తా సముద్రుఁడని కీర్తన సేయుదు రెల్లవారు నా
క్షీరపయోధి; నన్యులకుఁ జెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్.
అనే పద్యానికి ఈ గాథ (పాఠభేదాలున్నాయి) మూలం.
లచ్ఛీ దుహిదా జామాఉఓ హరీ తస్స ఘరిణిఆ గంగా
అమిఅ-మిఅంకా అ సుఆ అహో కుడుంబం మహోఅహిణో.
(ఛాయ: లక్ష్మీర్దుహితా జామాతృకో (=జామాతా) హరిస్తస్య గృహిణీ గంగా
అమృతమృగాఙ్కౌ చ సుతౌ అహో కుటుంబం మహోదధేః.)
ఇటువంటి గాథ ఒకటి ఉన్నదని తెలిస్తే, పై పద్యానికి దానికీ ఉన్న సంబంధాన్ని కనుక్కోవడం తేలికే.
‘తెలుగు కవుల రచనలపై సుబంధుని వాసవదత్తా కథ ప్రభావం’ అన్న వ్యాసంలో, నన్నయ్య భారతంలో అల్లిన
చ.
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్, మృదులమృణాళములన్, ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్, సలిలధారలఁ, జందనచారుచర్చలన్.
అనే మనోహరమైన పద్యానికి, సుబంధుని వాసవదత్త కథలోని ఈ పంక్తి మూలమట.
“అనంతరం పరిజనప్రయత్నోచ్ఛ్వసితజీవితా చ, క్షణ మతిశిశిర ఘనసార రజోనిమ్నగాకూలపులినే, క్షణ మతితుహిన జడ మలయజరసః సరిత్పరిసరే, క్షణ మరవిందకానన పరివాహిత సరస్తటవిటపిచ్ఛాయాసు, క్షణ మనిలోల్లాసితదలేషు, కదలీ కాననేషు, క్షణం కుసుమ(ప్రవాల)శయ్యాసు, క్షణం నలినీదలప్రస్తరేషు, క్షణం తుషారసఙ్ఘాతశిశిరిత శిలాతలేషు పరిజనేన నీయమానా”, “ముగ్ధే! మదనమఞ్జరి! సిఞ్చ చన్దనోదకేన.”
పై గద్యలో “నలినీదలప్రస్తరేషు” అన్న పదబంధమే పద్యంలో “నలినదళంబులన్” అని ఉన్నదనీ, “అరవిందకదంబ” అన్న పదబంధం పద్యంలో “మృదుమృణాళములన్” అనీ; “కుసుమ(ప్రవాల)శయ్యాసు” అన్న పదబంధమే పద్యంలో “తలిరుల శయ్యలన్” అనీ, “సిఞ్చ చన్దనోదకేన” అన్న పదబంధం పద్యంలో “చందనచారుచర్చలన్”గా మారి కొలువుతీరిందనీ నిర్ధారించడానికి పైపై చూపు సరిపోదు. సునిశితమైన పరిశీలన కావాలి. ఈ గద్యం చదవగానే నన్నయ్య పద్యం మనసులో స్ఫురించడం ఎన్నో సంవత్సరాల పరిశ్రమకూ, గొప్ప బుద్ధిశక్తికి మాత్రమే సాధ్యమవుతుంది.
మరొక్క ఉదాహరణ చూద్దాం. సుబంధుడి వాసవదత్తలోని ఈ గద్యను చూడండి.
“… (కథమపి స్మరప్రహారపరవశః పరిమితాక్షర మువాచ)
వయస్య! దితి రివ శతమన్యుసమాకులా భవతి సజ్జనచిత్తవృత్తిః. నాయ ముపదేశకాలః పచ్యన్త ఇవాంగాని. క్వథ్యన్త ఇవేన్ద్రియాణి. భిద్యన్త ఇవ మర్మాణి. నిస్సరన్తీవ ప్రాణాః. ఉన్మూల్యన్త ఇవ వివేకాః. నష్టేవ స్మృతిః.#త దధునా యది#త్వం సహపాంసుక్రీడిత సమదుఃఖసుఖోఽపి తదా మా మనుగచ్ఛ..”
ఈ కల్పనకు రామలింగకవి చేసిన ప్రసన్నపదబంధానువాదం ఇదట:
ఉ.
కెక్కడఁ జూచినన్ మదనుఁ, డెక్కడఁ జూచిన రోహిణీవిభుం,
డెక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు, లిం
కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.
ఈ రెంటినీ చూస్తే ఎక్కడా పొంతన ఉన్నట్లు కనిపించదు. కానీ, నిస్సరన్తీవ ప్రాణాః(ప్రాణాలు పోతున్నట్లుగా ఉన్నది) అన్నదే ఎక్కడఁ జూచినఁ గమ్మగాడ్పులుగా, క్వథ్యన్త ఇవ ఇన్ద్రియాణి (ఇంద్రియాలు ఆర్చుకుపోతున్నట్లుగా ఉన్నది) వాక్యమే ఎక్కడఁ జూచిన రోహిణీవిభుండు గా, భిద్యన్త ఇవ మర్మాణి (లోలోపల చీల్చివేస్తున్నట్లుగా ఉన్నది) వాక్యమే ఎక్కడఁ జూచినం జిలుకలుగా అనువదింపబడ్డాయి. కమ్మని గాడ్పులు ప్రాణాలను తీసేవిగానూ, చల్లని జాబిల్లి ఇంద్రియాలను ఆర్చుకునేలా చేసేవాడుగానూ, చిలుకల పలుకులు వినలేనివిగా పరిణమించడమూ విరహంలో సహజమే కనుక, రామలింగడు పదబంధాలను ఉన్నవి ఉన్నట్లుగా కాక, ఆ గుణాలకు కారణాలైన ప్రాకృతిక దృశ్యాలుగా అనువదించాడన్నమాట. కఠినతలో ఇది మూడవస్థాయి. ఈ ఆలోచన రావడానికి అత్యంతసునిశితమైన చూపుకావాలి. ఇటువంటి పద్యతులనలు ఈ సంపుటిలో భిన్నభిన్న స్థాయిలలో ఉన్నాయి.
ఈ వ్యాససంపుటి అంతా కూడా ఆచార్య మురళీధరరావుగారి అశేషప్రజ్ఞకు నిలువుటద్దమే అయినప్పటికీ, వారి పాండిత్యానికి ఉన్న అద్వితీయమైన స్థాయిని మూదలించిన వ్యాసం ‘సాహిత్యచరిత్రలో కనివినీ యెరుగని పర్యాయపదకావ్యం’ అనేది. గణపవరపు వేంకటకవి వ్రాసిన మహార్ఘమైన కావ్యం ‘ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము’ లోని సాహిత్యవిశేషాలను ఆమూలాగ్రం వివరిస్తుందీ వ్యాసం. వేంకటకవి 800 వరకూ సంస్కృతాంధ్రకావ్యాలను దగ్గరుంచుకొని, ఆ కావ్యాలలో తనకు నచ్చిన పద్యాలనూ, వచనాలనూ మార్చి కొత్తపద్యాలుగా మలచి ఈ కావ్యం వ్రాసాడు. పద్యరచన కుపక్రమించే విద్యార్థులకోసం అభ్యాసప్రదమైన శిక్షణాగ్రంథంగా తీర్చిదిద్దాడు. ఈ కావ్యం చిత్రకావ్యం కూడా. ఉన్న పద్యాలనే కొత్త పద్యాలుగా మార్చి వ్రాయడంలో వేంకటకవి అనేకవిధానాలను చూపించాడు. మూలపద్యం తాలూకు ఛందస్సును మార్చి వ్రాయడం, మూలరచనలోని వచనాన్ని పద్యంగా మలచడం, మూలరచనలోని కొన్ని భాగాలను మాత్రమే మార్చడం, మూలపద్యంలోని పదాలకు పర్యాయపదాలతో కొత్తపద్యం వ్రాయడం, భిన్నపద్యాలను సమవేశపరచడం, కేవలం శిల్పాన్ని అనుసరించి వ్రాయడం, యథాతథానుసరణం వంటి అనేకవిధాలుగా ఈ కావ్యరచన సాగింది. తాను ఈ విధంగా పర్యాయపదకావ్యాన్ని నిర్మిస్తున్నానని కావ్యప్రారంభంలోని ఒక వచనంలో స్పష్టంగా చెప్పాడు. దానిని గుర్తింపని సాహిత్యవిమర్శకులందరూ వేంకటకవి ఇతరకవుల పద్యాలను దొంగిలించాడని వ్రాసారు. ఆచార్య మురళీధరరావుగారు ఈ కావ్యోద్దేశాన్ని మొట్టమొదటిసారిగా వెలికితీయడంతోపాటు, ఈ కావ్యంలోని అనేకాలైన ఔచిత్యాలను ప్రదర్శించారు. కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామంనుండి, అయ్యలరాజు రామభద్రుడి హంసవింశతినుండి, కట్టా వరదరాజు శ్రీరంగమాహాత్మ్యము వేంకటకవి చేసిన అనుకరణలను ఆచార్య శ్రీ మురళీధరరావుగారు గుర్తించారు. 230కి పైగా కావ్యాలలో మూలాలను గుర్తించారు. ఇది ఒక వ్యక్తి చేయగలిగిన కృషి కాదనిపిస్తుంది. వారొక్కరే ఇంతటి మహత్కారాన్ని ఎట్లా చేసి ఉంటారు అనేది తలచుకున్నపుడు అద్భుతమనిపించక మానదు. 230 పైచిలుకు తెలుగు-సంస్కృత కావ్యాలు మనసులో ఉండటం, ఆ కావ్యాలలోని గద్యపద్యాలు వేంకటకవి కావ్యాన్ని చదువుతున్నపుడు తదనుగుణంగా స్ఫురణలోకి రావడం అసామాన్యమైన ధారణాశక్తి. పాండిత్యమన్న శబ్దం “పండా” అనే శబ్దంనుంచి పుట్టింది. పండా అంటే, “సదసద్వివేకినీ బుద్ధిః” అని ఒక నిర్వచనం. “పండితాః సమదర్శినః” అని మరొక్క నిర్వచనం. సమదర్శనమూ, సమస్తదర్శనమూ చేయగలిగిన బుద్ధిశక్తితో కూడిన విశిష్టపాండిత్యమిది.
ఐతరేయోపనిషత్తునుండి చైనీయ మహాకవి ఛు యువాన్ వరకూ, నైమిశారణ్యంనుండీ అన్నమయ్యవరకూ, ఆరుద్ర అపురూపమైన నవలలనుండీ ఆచంట జానకిరాంవరకూ, ప్రస్తుత శృంగేరీ పీఠ మహాసన్నిధానం వారైన భారతీతీర్థులనుండీ, కోరాడ రామచంద్రశాస్త్రివరకూ; కూచి నరసింహం, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పీబీ శ్రీనివాస్, బోయి భీమన్న, బైరాగి, ముళ్లపూడి వెంకటరమణ, కుందుర్తి, శ్రీశ్రీ, అబ్బూరి రామకృష్ణారావు, జూలూరి అప్పయ్యవంటి అనేక మహనీయుల తాలూకు రచనలలోని అనిదంపూర్వమైన విశేషాలతో, వారి జీవితాలలోని విశేషాలతో నిండిన వ్యాసాలు ఈ సంపుటిలో అంతే అందంగా నెలకొని ఉన్నాయి.
ఆచార్య శ్రీ మురళీధరరావుగారి భాష అమృతతుల్యమైనది. అర్థగౌరవం, సౌందర్యాతిశయం ప్రతీ పదంలోనూ నిండి నిబిడీకృతమై ఉంటాయి. వారు బహుకృతపరిశ్రములు కనుక పదాలన్నీ నేనంటే నేనన్నట్లుగా వాక్యాలుగా వచ్చి కూర్చుంటాయి. వ్యర్థశబ్దమన్న ప్రసక్తి ఉండదు. మనసులో చెప్పాలని అనుకున్నది ఎంత లోతైన శాస్త్రీయాంశమైనా, ఎంత ఎత్తైన రసాంశమైనా వైఖరిగా గుర్రం కదను తొక్కినట్లు వెలివడతాయి. భాషాదేవి వారి పక్కనే నిలుచుని, ఆ వాగ్ధారకు ముచ్చటపడి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందా అన్నట్లుగా హృదయావర్జకంగా ప్రయాణించే ధోరణి. వీరి పదనిష్పాదనకళ నిరుపమానమైనది. ఈ సంపుటిలో వాడబడిన పదాలకు అర్థాలు గానీ సరిగ్గా అవగతమైతే, ఆ పదాలే ఆయా చోటుల్లో ఎందుకు ఉన్నాయో అవగతమవుతుంది.
ఆంధ్రసరస్వతికి కంఠాభరణంగా వెలికివచ్చిన వాఙ్మయచరిత్రలో వ్యాసఘట్టాలు, మరికొన్ని విశేషాంశాలు అనే ఈ రచన తెలుగువాడిలోని స్వంతసాంస్కృతికవ్యక్తిత్వానికీ, విశాలవిశ్వవ్యాపకత్వానికీ నిదర్శనం.
అంతర్జాల పత్రికలలో ప్రచురింపబడి, ఈ సంపుటిలో చేర్చబడని వ్యాసాలివి:
- తెలుగులో మొట్టమొదటి తారావళి
- చంద్రరాజకవి మదన తిలకము — నన్నెచోడుని కుమారసంభవము: సాదృశ్యసమీక్ష
- ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!
- ధర్మవిజయ విధాత శ్రీ ధనికొండ
- మహాభారత ప్రమదావలోకనం
- సాహిత్యచరిత్రలో వాదవివాదాల సమగ్రమైన సమీక్ష
- తొలి తెలుగు డిటెక్టివు నవల ఏది?
- A forgotten legend: Ravi Sita Devi (1931-1945)
- విశ్వ -– విశ్వప్రకాశాల ఐక్యవాదం: కొన్ని చర్చనీయాంశాలు
- రావిపాటి త్రిపురాంతకుని కృతులు: కొన్ని కొత్త వెలుగులు
- రేడియో చమత్కారాలు
- తెలుగులో అత్యంత సుదీర్ఘమైన సమాసం ఏది?
- మఱికొన్ని జ్ఞాపకాలు
- మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు (౪ భాగాలు)
- కవన కుతూహలం: అబ్బూరి వరదరాజేశ్వరరావుగారు
- త్రికాండశేషము అమరకోశమునకు శేషగ్రంథమా?
- The tenth rasa: an anthology of Indian nonsense (Many English Translations present)
- దిగంబర కవిత: ఒక పరిశీలన
ఇవికాక ఆచార్య శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారి రచనలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ముద్రణకు నోచుకొని, తెలుగు సాహిత్యప్రపంచానికి కొత్త ఊపిరులూదాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. వారికి అనేక మనఃపూర్వక నమఃపూర్వక శుభాభినందనలను విన్నవిస్తున్నాను. ఈ వ్యాససంపుటిని సర్వాంగసుందరంగా ముద్రించి, ఆంధ్రులకు మహోపకారం చేసిన అజో-విభొ కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు#శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణగారికి ప్రత్యేకధన్యవాదపూర్వక నమస్కారాలు.
అధస్సూచికలు
| ↩1 | ”నను చ ఆశ్వాసకబన్ధేషు తత్సమాప్తావపి న చ్ఛందోభేద ఉపలభ్యన్తే. తథా హి రావణవిజయ-హరివిజయ-సేతుబన్ధేషు ఆదితః సమాప్తిపర్యన్తం ఏకమేవచ్ఛన్దో భవతి. గలితకాని తు వ్యాసకష్టవత్ కైరపి విదగ్ధమానిభిః ఉపక్షిప్తానీతి తద్విదో భాషన్తే. — చూ. శృంగారప్రకాశ, VOL II. |
|---|

