ఓడిస్సీ – నాలుగవ భాగం: మరులు గొలిపే మహిళ

4.1 బ్రతికున్నవారి లోకం

“అదిగో, అల్లదిగో నేల కనిపిస్తోంది” ఓడ స్తంభం మీదున్న కళాసువాడు అరిచేడు.

ఓడ పైకప్పు మీద నిద్రిస్తున్న ఒడిస్సియస్ పీడకలనుండి గభాల్న లేచేడు. హేడీస్, పర్సెఫొనీల అజమాయిషీలో ఉన్న ప్రేతాత్మల లోకం కలలో కనిపించినట్లుంది.

నుదుటికి అడ్డుగా చెయ్యి పెట్టుకుని దిక్చక్రంవైపు చూసేడు. “అదిగో, అల్లదిగో! అది మంత్రకత్తె, జగన్మోహిని అయిన సర్సీ ద్వీపమే.

“… మరణించిన వారి లోకంలో నేను చూసినవన్నీ సర్సీకి పూసగుచ్చినట్లు చెబుతాను. అప్పుడు ఆమె తప్పకుండా ఇథకా క్షేమంగా వెళ్ళడానికి ఉపాయం చెబుతుంది.”

ఇథకాను వదలి పెట్టి పన్నెండు సంవత్సరాలు పైబడే అయుంటుంది. ఒడిస్సియస్ ఇంటి కోసం, ఇల్లాలి కోసం విపరీతంగా బెంగపెట్టుకుంటున్నాడు. గడచిన సంవత్సరాలలో పదేళ్ళపాటు ట్రోయ్ యుద్ధంతోటే సరిపోయింది. తరువాత ఒంటికన్ను రాక్షసుడు సైక్లాప్స్‌తో పోరాటం. తరువాత నరమాంస భక్షకులతో జరిగిన యుద్ధంలో ఒక్క పడవ మినహా మిగిలిన పడవలను, వాటితోపాటు నావికులను పోగొట్టుకున్నాడు. తరువాత జిత్తులమారి మంత్రకత్తె సర్సీ వలలో పడకుండా తప్పించుకోవడమే కాకుండా ఆమె అనుగ్రహం పొందగలిగేరు కూడా. తరువాత అధోలోకంలో ఉన్న ప్రేతాత్మల స్థావరానికి వెళ్ళి, అక్కడనుండి మొదటిసారిగా తిరిగి వచ్చిన మానవమాత్రుడయ్యాడు తాను. ఇదంతా అనూహ్యము, అచింత్యమూను.

పడవ నెమ్మదిగా పచ్చని ఒడ్డుకు చేరుకుంటోంది. చెట్లమీది పక్షులు కూజితాలతో గ్రీకు వీరులను ఆహ్వానిస్తున్నాయి. ఉదయం నుండీ ఉజ్జ్వలంగా ప్రకాశించి అలిసిపోయిన సూర్యుడు సేద తీర్చుకుందికా అన్నట్లు ఎర్రగా కందిన తన ముఖాన్ని నీటిలో ముంచుతున్నాడు. ప్రేతాత్మల లోకంలో చూసిన ఉదంతాల కారణంగా భయభ్రాంతులైన నావికులు పరిచితమైన ఒడ్డు చేరుకోగానే ఒక్కుమ్మడిగా ఆ ఇసుక దిబ్బల మీద సొమ్మసిల్లి పడిపోయేరు.

సముద్రపుటొడ్డున వీచే పిల్ల తెమ్మెరల తాకిడికి స్వస్థుడైన ఒడిస్సియస్ ఆకాశంలో చంద్రుడిని, నక్షత్రాలను చూస్తూ, “మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. ఆమె వెంట ఉన్న చెలికత్తెలు ఆహార పానీయాలతో సిద్ధంగా ఉన్నారు.

ఒక్క ఉదుటున ఒడిస్సియస్ లేచి నిలబడ్డాడు. తన సహచరులందరిని నిద్ర లేపేడు.

“శుభోదయం!” అన్నాడు ఒడిస్సియస్. అందరూ ఏకకంఠంతో ఆమెకు స్వాగతం పలికేరు.

“స్వాగతం. వీరాధివీరులకు సుస్వాగతం. మానవమాత్రులకు సాధ్యం కాని కార్యాన్ని సాధించుకు వచ్చేరు,” అన్నది సర్సీ. “మీరు ప్రేతాత్మల స్థావరానికి వెళ్ళి తిరిగి వచ్చేరు. మీరు మరణించిన తరువాత ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళు రెండు సార్లు మరణించారు అనుకుంటారు.”

“అవును, నిజమే ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవుళ్ళ చల్లను చూపు మాపై లేకపోతే మేము ఆ మాయదారి మృత్యులోకంనుండి బ్రతికి బయటపడేవాళ్ళం కాదు” అన్నాడు ఒడిస్సియస్. “ఇప్పుడు, తల్లీ నువ్వు మరొక్క సహాయం చేసి మమ్మల్ని మా దేశంలో పడేస్తే నీకు ఋణపడి ఉంటాము.”

“అదెంత మాట! తప్పకుండా.” అన్నది సర్సీ. “ప్రస్తుతానికి నువ్వు చెయ్యవలసినదల్లా తగినంత విశ్రాంతి తీసుకుని, కడుపు నిండా మా విందు భోజనం చేసి, మా మదిరను సేవించి, శారీరకంగా, మానసికంగా బలం సంతరించుకోవడమే. రేపు తెల్లవారగానే ఇథకాకు ప్రయాణం!”

ఉదయంనుండి సాయంత్రంవరకు ఒడిస్సియస్ అనుచరబృందం సర్సీ ఆతిథ్యంలో ఉర్రూతలూగుతూ ఆనందించేరు. చీకటి పడగానే నిద్రకు ఉపక్రమించారు. ఒడిస్సియస్ మాత్రం నిద్రపోలేదు. సర్సీ అతనిని నిద్రపోనీయలేదు. అతని చేతులను తన చేతిలోకి తీసుకుని, ఉల్లాసంగా కబుర్లు చెబుతూ, వెన్నెల్లో నడుచుకుంటూ, తోటలోకి తీసుకువెళ్ళింది. ఇద్దరూ ఒక చెట్టు కింద రాతి మీద కూర్చున్నారు.

“ఇప్పుడు సావకాశంగా చెప్పు, ఒడిస్సియస్! ప్రేతాత్మల స్థావరంలో ఏమిటి చూసేవు? అక్కడ ఏమి నేర్చుకున్నావు?” సర్సీ అడిగింది.

సర్సీ అడిగిన ప్రశ్నకు అధోలోకంలో ఉన్న హేడీస్-పర్సెఫొనీల రాజ్యం గురించి ఒడిస్సియస్ ఓపికతో సమాధానం చెప్పేడు. అక్కడ ఆకలితో ఉన్న ప్రేతాత్మలు గొర్రె రక్తం తాగడానికి బారులు కట్టి ఎలా వచ్చేరో చెప్పుకువచ్చాడు.

“అక్కడ చూసిన ప్రేతాత్మలలో మా అమ్మ ప్రేతాత్మ కూడా ఉంది” ఉబికి వస్తూన్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పేడు. “ఆమె నా రాక కోసం ఎదురు చూస్తూ, నా కోసం బెంగ పెట్టుకుని ప్రాణాలు విడిచింది. ‘నా భార్య, పిల్లవాడు, తండ్రి నా రాక కోసం నిత్యం నిమిషాలు లెక్కపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నారు’ అని కూడా చెప్పింది నా తల్లి ప్రేతాత్మ.”

“ఇంకెవరితో మాట్లాడేవు?”

“నా స్నేహితుడు అకిల్లీస్‌తో కూడా మాట్లాడేను. యుద్ధంలో అకిల్లీస్‌ని ట్రోయ్ రాకుమారుడు పేరిస్ చంపేడు. మహారాజు అగమేమ్నాన్ ప్రేతాత్మతో కూడా మాట్లాడేను. అన్నట్లు మరిచిపోయేను. గుడ్డి భవిష్య ద్రష్ట టైరీసియస్‌తో కూడా మాట్లాడేను.”

“భవిష్య ద్రష్ట టైరీసియస్ ఏమనిచెప్పేడు?”

“ఆయన హితోపదేశాలు చేసేడు. రాబోయే అపాయాలను సూచిస్తూ హెచ్చరికలు కూడా చేసేడు,” అన్నాడు ఒడిస్సియస్. “టైరీసియస్ ఏమన్నాడంటే, ‘నీ తిరుగు ప్రయాణంలో నీకు సూర్యదేవుడి ద్వీపం తగులుతుంది. ఆ ద్వీపం మీద పశువులూ, గొర్రెలూ చాలా ఉంటాయి. అవి సూర్యదేవుడివి. వాటికి మీరెవ్వరూ ఏ విధమైన అపకారము చెయ్యకూడదు. వాటిని చంపడానికి ప్రయత్నిస్తే మీకు చేటు కలుగుతుంది. నీవారందరికీ మరీ మరీ చెప్పు. ఆ పశువుల మీద, గొర్రెల మీద చెయ్యి వెయ్యడానికి కూడా వీలు లేదు. నా యీ మాటను అతిక్రమించేరో, మీకు ముప్పు తప్పదు.'”

“ఆ సలహాలు శిరోధార్యాలు,” సర్సీ నిట్టూర్చింది. “మరొక్క మాట చెబుతున్నాను. ఆ సూర్యదేవుడి ద్వీపం చేరుకునే లోగా నీకు ఇంకొన్ని ఇడుములు ఎదురవుతాయి. జాగ్రత్తగా విను, ఒడిస్సియస్! నేను ఇప్పుడు మరికొన్ని భయంకరమైన పచ్చి నిజాలు చెబుతాను. కానీ నేను చెప్పినట్లు తు.చ. తప్పకుండా నడుచుకుంటే ప్రమాదాలనుండి బయటపడి మీ ఇళ్ళకు చేరుకుంటారు.”

4.2 సర్సీ హెచ్చరిక

“ఒడిస్సియస్, నేను చెప్పే నగ్నసత్యాలు విని తట్టుకోగలిగే మనఃస్థైర్యం నీకు ఉందా?” సర్సీ సూటిగా అడిగింది. “రాబోయే నీ ప్రయాణంలో నీకు ఎదురయ్యే భయంకర సన్నివేశాలు ఏమిటో ఊహించగలవా?”

ఒడిస్సియస్ తల పంకించేడు.

ఒడిస్సియస్ స్వగతంగా అనుకున్నాడు: “సైక్లాప్స్‌తో జరిగిన భయంకర సంఘర్షణ కంటే భయంకరమైనది మరేమి ఉంటుంది? నరమాంస భక్షకులతో జరిగిన అనుభవాలతో పోల్చదగినది మరేదైనా ఉంటుందా? అంతవరకూ ఎందుకు? సర్సీ మాయాజాలంలో ఇరుక్కున్న తన సైనికుల అనుభవాలతో పోల్చితే భయంకరమైనది మరేది?”

సర్సీ చెప్పడం మొదలు పెట్టింది. “మీరు నా దీవిని వదలి వెళ్ళగానే మీకు మొదటగా సైరన్లు (Sirens) నివసించే దీవి తగులుతుంది. సైరన్లు అంటే ఎవరో తెలుసా? అందమైన అమ్మాయిలు. అద్భుతంగా పాటలు పాడగల అమ్మాయిలు. వాళ్ళు ఉద్యానవనాల్లో తిరుగుతూ, పాటలు పాడుతూ దారినపోయే పడవలలో ఉన్న సరంగులను ఒడ్డుకు రమ్మని ఆకర్షించి, వశపరచుకుంటారు.”

ఈ విడ్డూరం విని ఒడిస్సియస్ నవ్వుకున్నాడు. “ఈ అమ్మాయిలు, ఈ అబలలు, నాకు కానీ నా సైనికులకు కానీ ఏ విధంగా అపకారం చెయ్యగలరు?”

“నావికులు ఎవరైనా ఈ అమ్మాయిలు పాడిన పాటలు వింటే పరవశించిపోయి సర్వం – భార్యలను, పిల్లలను, పుట్టి పెరిగిన ప్రదేశాలను, అన్నింటిని – మరిచిపోతారు. ఈ సైరన్ల పాటలకు ఆకర్షితులైనవారు బుద్ధిపూర్వకంగా – పిచ్చెక్కినవారివలె – వారి పడవలని ఒడ్డున ఉన్న కొండరాళ్ళకి ఢీకొట్టించి జలసమాధులలోకి వెళ్ళిపోతారు..”

నమ్మశక్యం కానీ ఈ విశేషాన్ని మింగలేకపోయాడు ఒడిస్సియస్. “ఒక అమ్మాయి పాడిన పాటకు ఇంత శక్తి ఉంటుందా?”

“నా హెచ్చరికకు కాసింత విలువనియ్యి, ఒడిస్సియస్! ఈ సైరన్లు నివసించే దీవి నిండా వారి పాటలకు బలి అయిన నావికుల ఎముకలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. నీ నావికులు వారి బారినుండి బ్రతికి బయటపడాలంటే ఆ పాటలు వినబడనీయకుండా అందరూ చెవులలో మడ్డి మైనపు బిరడాలు పెట్టుకోవాలి. అలా చెవులకు బిరడాలు పెట్టుకోకపోతే, పాట వినపడగానే ప్రాణాలు పోతాయి జాగ్రత్త.”

“అలాగే చెబుతాను, నా నావికులతో. కానీ నేను మాత్రం ఆ పాటలు విని తీరతాను. పాట విన్నంత మాత్రాన నా ఇంటిని, నా సంసారాన్ని మరచిపోయేటంత బేలను కాను.”

“అలాగే అయితే ఆ పాటలను నువ్వొక్కడివే విను. ఆ పాట నీ చెవిన పడగానే నువ్వు సముద్రంలోకి దూకి జలసమాధి అయే ప్రమాదం ఉంది. అందుకని నీ కాళ్ళు, చేతులు ఓడ స్తంభానికి మోకులతో కట్టివేయమని నీ నావికులకు చెప్పు. లేకపొతే సముద్రంలోకి దూకేస్తావు. కట్లు విప్పమని నువ్వు ప్రాధేయపడ్డా, నువ్వు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినా – ఈ సందర్భంలో – వాళ్ళు నీ మాట వినకూడదు. అలాగే చేస్తానని ఒట్టు వేసి చెప్పగలవా?”

అలాగే అని అంగీకారం చెప్పడానికి ఒడిస్సియస్ తల పంకించేడు.

“ఈ సైరన్ల బెడదనుండి తప్పించుకుని బయటపడ్డ తరువాత సముద్రంలో నీకు రెండు పాయలు కనబడతాయి. ఒక పాయ వెంట వెళితే నీకు ‘తిరుగుడు శిలలు’ కనబడతాయి. ఇవి బ్రహ్మాండమైన గండశిలలు. ఇవి గిర్రున తిరిగే కొండలు. తిరుగుతూ అప్పుడప్పుడు ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటాయి. వీటి మధ్యనుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తే తిరగలిలో పడ్డ బియ్యపు గింజలా నలిగి, నుగ్గు నుగ్గు అయిపోవడమే.
“కుండలో మజ్జిగను చిలికినట్లు ఈ తిరుగుడు శిలలు గిర్రున తిరుగుతూ సముద్రాన్ని మథిస్తూ ఉంటే పుట్టిన నురుగులో శిథిలమైన పడవలూ, మానవశరీరాలూ కనబడతాయి. దేవదేవుడైన జూస్ రక్షణ లేకుండా ఈ శిలలను అధిగమించడం దుస్సాధ్యం.”

“నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోను. ఆ రెండవ మార్గం గురించి చెప్పు.”

“ఆ రెండవ మార్గం రెండు కొండ శిఖరాల మధ్యనుండి వెళుతుంది,” అంటూ కొనసాగించింది సర్సీ. “వాటిల్లో పొట్టిగా ఉన్న శిఖరం మీద ఒక అత్తి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక వికృతాకారంతో ఖరీబ్డిస్ (Charybdis; Kah-RIB-dis) అనే భయంకర సుడిగుండపు రాక్షసి ఉంది. సముద్రంలో ఏ పడవైనా ఖరీబ్డిస్ దరిదాపులకు వస్తే అది సుడిగుండంలో చిక్కుకుని సముద్రగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఖరీబ్డిస్ సుడులలో ఎవ్వరైనా చిక్కుకుంటే వారిని రక్షించడం ఆ సముద్రదేవుడు పొసైడన్ తరం కూడా కాదు.”

“మరైతే ఎత్తుగా ఉండే రెండవ శిఖరం సంగతేమిటి? అక్కడేమి ప్రమాదం నక్కి ఉంది?”

“ఎత్తయిన ఆ రెండవ శిఖరం మీద ఒక చీకటి గుహ ఉంది. ఆ గుహలో సిల్లా (Scylla; SIL-ah) అనే వికృతాకారమైన రాక్షసి ఉంది. అది వేటకుక్కలా ఊళ వేసినట్లు మొరుగుతుంది. కానీ నిజానికి అది ఆరు తలలున్న భయంకరజీవి. ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవుళ్ళే దాన్ని చూసి అసహ్యించుకుంటారు.”
“దాని ఉగ్రరూపం ఎలా ఉంటుంది?”

“సిల్లాకి పాములవంటి పొడుగాటి ఆరు మెడలు, ఒక్కో మెడ చివరన భయంకరమైన కుక్క ముట్టెవంటి తల, ఒక్కొక్క తలలో మూడు వరుసలలో కత్తులలాంటి పళ్ళు ఉంటాయి. ఒక్క ఊపులో ఈ రాక్షసి తన ఆరు నోళ్ళతో ఆరుగురు మనుష్యుల్ని అమాంతం మింగేయ కలదు. ప్రతి దినమూ ఆ గుహలో కూర్చుని తన పన్నెండు కళ్ళతో ఆబగా కాపలా కాస్తూ ఉంటుంది. అటువైపు ఏదైనా పడవ వెళితే అమాంతం తన పొడుగాటి మెడలను విసిరి, తడవకొక ఆరుగురిని పట్టి, వారిని ఛిన్నాభిన్నం చేసి కబళిస్తుంది.”

“ముందు నుయ్యి, వెనక గొయ్యిలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నానన్నమాట.” అన్నాడు ఒడిస్సియస్. “సుడిగుండంలో పడి చావడమా? లేక ఆరు తలల రాక్షసికి ఆహారం కావడమా?”

“నీ ఎంపికను సులభతరం చేస్తాను” అన్నది సర్సీ. “ఖరీబ్డిస్ సుడులలో చిక్కుకుంటే అందరూ హతమవుతారు. ఆరు తలల రాక్షసి సిల్లా బారిన పడితే కేవలం ఆరుగురు నావికులను మాత్రమే పోగొట్టుకుంటావు.” ఆర్ద్రత లేని అభిప్రాయాన్ని వెల్లడించింది సర్సీ.

ఒడిస్సియస్‌కి పెద్ద ధర్మసంకటం ఎదురైంది. ఇప్పటికే తన వాళ్ళు ఎంతోమంది విషాదమైన చావులు చచ్చేరు. కొంతమందిని సైక్లాప్స్ సజీవంగా కబళించేడు. నరమాంసభక్షకులైన రాక్షసులు కొందరిని ఈటెలతో పొడిచి చంపేరు. ఇంకా ఎంతమంది చిత్రవధను చూడాలి?

“నన్నడిగితే నేను సిల్లావైపు మొగ్గుతాను.” అంది సర్సీ. “సిల్లాతో పోరాడకు. నీకు వచ్చే నష్టం కేవలం ఆరుగురు నావికులు. నువ్వు పడవలను జోరుగా నడుపుకుని వెళ్ళగలిగితే నీకు వాటిల్లే నష్టం కేవలం ఈ ఆరుగురు నావికులు మాత్రమే. మిగిలినవారంతా క్షేమంగా బయటపడే అవకాశాలు మెండు.”

“జరగబోయేది తెలిసుండీ నా వాళ్ళను, ఆరుగురిని, ఆ ఆరు తలల దుష్టజీవికి ఎలా సమర్పించుకుంటాను? ఏ ఆరుగురిని ఎన్నుకుంటాను?”

“ఆ ఎంపిక నీ చేతుల్లో లేదు. ఆరు తలల రాక్షసి సిల్లా ఆ ఎంపిక చేసి పెడుతుంది. ఆ ఆరుగురిలో నువ్వే ఉండొచ్చు.”

“వీల్లేదు. మాలో ఎవరి మీద చెయ్యి వేసినా దానిని కడతేర్చి తీరతాను.”

“అంత ఆత్మాభిమానం, పౌరుషం తగదు. నువ్వు కేవలం మానవమాత్రుడవు. మానవులెవ్వరూ – నిన్ను మినహాయించడం లేదు సుమా – సిల్లాను ఓడించలేరు. నువ్వు సిల్లాను కత్తితో కాని, శూలంతో కానీ చంపడానికి ప్రయత్నిస్తే ఆ కృత్యానికి పరిహారంగా సిల్లా మరో ఆరుగురిని కబళిస్తుంది.

“ఈ ఆపదనుండి రక్షణ పొందాలంటే పడవను జోరుగా నడుపుతూ, సిల్లా తల్లిని ఉద్దేశించి, బిగ్గరగా ప్రార్థన చెయ్యాలి. సిల్లా తల్లి ఒక్కతే సిల్లా దౌర్జన్యాన్ని ఆపగలదు.”

ఈ ఉపాయానికి ఒడిస్సియస్ అభ్యంతరం చెప్పేలోగా సర్సీ తన హితోపదేశాన్ని కొనసాగించింది.

“ఈ ఆరు తలల రక్కసి దంష్ట్రలనుండి నువ్వు తప్పించుకోగలిగితే, అప్పుడు టైరీసియస్ హితోపదేశాన్ని అమలులో పెట్టాలి. ఎందుకంటే సత్వరం నీకు సూర్యదేవుడి, హీలియోస్ ద్వీపం ఎదురౌతుంది. అక్కడ నీకు ఏడు పశువుల మందలు, ఏడు గొర్రెల మందలు కనబడతాయి. ఆ మందలను తోలడానికి ఇద్దరు వనకన్యలు ఉంటారు. వారు సూర్యదేవుడి కుమార్తెలు. ప్రతి మందలోను ఏభై జంతువులు ఉంటాయి. వాటిని సరదాకైనా ముట్టుకోకూడదని నీ దండులో ఉన్న మనుష్యులతో చెప్పు. వాటిని ముట్టుకుంటే నువ్వు కూడా ఎనలేని ఇబ్బందులకు లోనవుతావు. నీ భార్యా, కొడుకు కూడా బాగా నష్టపోతారు. జాగ్రత్త.”

తన సంసారం ప్రస్తావన రాగానే ఒడిస్సియస్ మనస్సు ఇంటివైపు మరలింది. ఇంటికి ఎప్పుడు వెళతామా అన్న ఆత్రుత పెల్లుబికింది. ఒడిస్సియస్ లేచి నిలబడ్డాడు. “సర్సీ, నువ్వు ఇంతవరకు చేసిన ఉపకారం మరువరానిది. నీ సలహాలను పాటిస్తాను.”

“మంచిది. నీకు చెప్పవలసిన సంగతులన్నీ దాపరికం లేకుండా చెప్పేను. నీ మార్గం సుగమం అయినది కాదు. కానీ నేను చెప్పినట్లు నడుచుకుంటే ఎప్పటికైనా ఇల్లు చేరుకోగలవు. తెల్లవారుతోంది. బయలుదేరు. శుభస్య శీఘ్రం.”

ఒడిస్సియస్ ఆ అడవిలో చుట్టూ చూసేడు. బాలభానుని ఎర్రని కిరణాలు చెట్ల సందులనుండి లోపలికి పొడుచుకుని వస్తున్నాయి. పిల్ల తెమ్మెరలతో ఆకులు గలగలారావాలు చేస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో గూళ్ళను వదలి ఎగురుతున్నాయి.

ఒడిస్సియస్ మరొకసారి మాంత్రికురాలివైపు చూసేడు. ఆమె అక్కడ లేదు!

“సర్సీ! సర్సీ!” అని గట్టిగా పిలచేడు.

ఆమె మారు పలకలేదు. ఆమె ఉషోదయపు కాంతిలో కలిసిపోయింది.

4.3 సైరన్ల పాటలు

ఒడిస్సియస్ పడవ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్రపు ఒడ్డుకు త్వరగా అడుగులు వేసుకుంటూ వచ్చేడు. సర్సీ చెప్పిన మాటలు అతని చెవులలో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి: “నీ మార్గం సుగమం అయినది కాదు. కానీ నేను చెప్పినట్లు నడుచుకుంటే ఎప్పటికైనా ఇల్లు చేరుకోగలవు. తెల్లవారుతోంది. బయలుదేరు. శుభస్య శీఘ్రం.”

ఒడిస్సియస్ పడవలోకి ఎక్కేడు. పడవను ప్రయాణానికి సిద్ధం చెయ్యమని పనివారికి చెప్పేడు.

ఇంకా నిద్రమత్తులోనే ఉన్న సరంగులు గభీమని లేచి, పడవను ప్రయాణానికి సంసిద్ధం చేస్తున్నారు. లంగర్లు ఎత్తడానికి ఉద్యుక్తులవుతూ ఉండగా సర్సీ పరివారంలో కొందరు నీటి ఒడ్డుకు పరిగెత్తుకు వచ్చారు. ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని, మదిరను పడవలోకి ఎక్కించేరు.

అనుకోకుండా వచ్చిన ఈ ఆదరణకు అందరూ ఆనందభరితులై సర్సీ పరివారంలో ఉన్న వనకన్యలకు ధన్యవాదాలు చెప్పి పడవను నీటిలోకి తోసేరు.

పడవ నెమ్మదిగా సముద్రంలోకి వెళుతూ ఉంటే ఒడిస్సియస్ ఆపేక్షతో మాంత్రికురాలిని తలుచుకున్నాడు. గత పన్నెండు నెలలు సర్సీ తన గతిని, అదృష్టాన్ని నిర్ణయించింది, నిర్దేశించింది. తన నావికులను పందులుగా మార్చింది. తిరిగి మనుష్యులుగా మార్చింది. తనను మరణించినవారి చీకటి లోకంలోకి పంపింది. తనకి ఇకపై ఎదురు కాబోయే ఇబ్బందులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించడం ఎలాగో చెప్పింది. ఆమెను ఆ గట్టుమీద ఆ ద్వీపంలో వదిలేసి తను సముద్రం మధ్యన ఈ పడవలో ఉన్నా ఆమె తన పక్కనే ఉన్నట్లు అనుభూతి కలుగుతోంది.

వారు ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి సర్సీ తానొక్కడికే చెప్పింది. ఈ మంచిచెడ్డల్ని తన సిబ్బందితో కూడా పంచుకోవడం మంచిదని ఒడిస్సియస్‌కి అనిపించింది. ఒడిస్సియస్ లేచి, నిలబడి, సర్వసభ్యసమావేశానికి అందరినీ ఆహ్వానించేడు.

“మిత్రులారా! నేను చెప్పేది సావధానంగా వినండి. ఈ ప్రయాణంలో మనకు ఎదురయే కష్టాలగురించి, వాటిని అధిగమించే మార్గాల గురించీ సర్సీ నాకు చెప్పింది. ఆ విషయాలు మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మనం సైరన్లు ఉండే ద్వీపం చేరుకోబోతున్నాం. సైరన్లు అందమైన అమ్మాయిలు. వారు అద్భుతంగా పాడగలరుట.”

“అద్భుతంగా పాడే అందమైన అమ్మాయిలతో కష్టాలు ఏముంటాయి?” ఎగతాళి చేస్తూ నవ్వేరు నావికులు.

“చెప్పే మాట పూర్తిగా వినండి. సైరన్లు పాడే పాట విన్నవాళ్ళు తన్మయత్వం చెంది, ఆ ఉన్మాదంలో సముద్రంలో దూకి చచ్చిపోతారు. కనుక ఆ దీవి చేరుకునే లోగా మీరంతా మీ చెవులలో మైనం పోసుకుని తాత్కాలికంగా బధిరులు అయిపోవాలి. ఆ పాటలను నేనొక్కడినే వినవచ్చు. అలా ఆ పాటలు నా చెవిన పడ్డప్పుడు నేను సముద్రంలో దూకి చచ్చిపోయే ప్రమాదం ఉంది కదా. అందుకని మీరు నన్ను తాళ్ళతో ఒక రాటకు గట్టిగా కట్టెయ్యాలి. కట్లు విప్పమని నేను ప్రాధేయపడి, యాచించినా మీరు ఆ కట్లు విప్పకూడదు.”

ఒడిస్సియస్ ఇలా మాట్లాడుతూ ఉండగా గాలి ఊపు అందుకుంది. తెరచాపలు రెపరెపలాడేయి. కెరటాలపై పడవ జోరుగా పరుగు తీస్తోంది. ఇంతలో మంత్రం వేసినట్లు గాలి అకస్మాత్తుగా ఆగిపోయింది. అరిష్టసూచకంగా నిశ్చలమైన నీటిలో పడవ ఆగిపోయింది.

సరంగులు భయభ్రాంతులయేరు. ఒకళ్ళ ముఖాలు మరొకరు చూసుకున్నారు.

“సైరన్లు ఉండే దీవి దగ్గరపడినట్లు ఉంది” అన్నాడు ఒడిస్సియస్. “త్వరగా తెరచాపలు దించండి. సామానులు భద్రపరచండి. నిశ్శబ్దంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి.”

అందరూ ఒడిస్సియస్ చెప్పినట్లే చేసేరు. అప్పుడు నిశ్చలంగా ఉన్న ఆ నీటిలో తెడ్లు వేసి మెరుగుమాసిన పడవను నెమ్మదిగా నడపడం మొదలుపెట్టేరు.

సరంగులు ఆ పనిలో ఉండగా ఒడిస్సియస్ మైనం డబ్బాను బైటకు తీసి దానిని ఎండలో కాసేపు పెట్టేసరికి అది మెత్తబడింది. అప్పుడు దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి, రెండేసి ఉండలు చొప్పున నావికులందరికీ పంచిపెట్టేడు.

“ఈ మైనపు ముద్దలను మీ చెవులలో పెట్టుకోండి. తరువాత మెత్తని మోకులు పట్టుకొచ్చి నన్ను ఆ రాటకు గట్టిగా కట్టివేయండి.”

ఒడిస్సియస్ ఆజ్ఞలను అందరూ శిరసావహించేరు.

ఆ మెరుగుమాసిన పడవ సైరన్లు ఉండే దీవి దగ్గరికి వచ్చేసరికి పిల్ల తెమ్మెరల మీద తేలిపోతూ ఒడిస్సియస్ చెవిలో ఒక పాట వినబడింది. ఆ రాగం అతి శ్రావ్యంగా, కర్ణపేయంగా ఉంది.

పడవ ఒడ్డుకు దగ్గర పడేసరికి అక్కడ ఒక పూలవనంలో ఇద్దరు అందమైన అమ్మాయిలు కనిపించేరు. ఆశ్చర్యం ఏమిటంటే వారికి పల్చటి, మునిమసక రెక్కలు ఉన్నాయి.

అదేమి ఆశ్చర్యమో కానీ వారిని చూసిన దగ్గరనుండి ఒడిస్సియస్ మనస్సు చలించిపోయింది. వాళ్ళను మరీ మరీ చూడాలనుపించింది. వారితో కలిసి ఉండాలనుపించింది. తన శేషజీవితం వారితో గడపాలనుపించింది.
ఆ అమ్మాయిల పాట వింటూన్నకొద్దీ ఒడిస్సియస్‌కి పిచ్చెత్తిపోతూంది. రాటకు కట్టిన మోకులను తెంపుకుని వారి దగ్గరికి పోవాలను విశ్వప్రయత్నం చేసేడు.

కొందరు సరంగులు తెడ్లు జోరుగా వేసి పడవను దూరంగా తోలుకు పోతూ ఉంటే, మరికొందరు సరంగులు ఒడిస్సియస్‌కి కట్టిన మోకులు ఊడిపోకుండా బిగిస్తున్నారు.

ఈ హడావుడి ఇలా జరుగుతూ ఉండగా, క్రమేపీ వారి పడవ సైరన్ల దీవినుండి దూరం కాసాగింది. అక్కడనుండి వచ్చే పాట వినికిడి సన్నగిల్లుతోంది. ఒడిస్సియస్ మనస్సు విచారంతో నిండిపోతోంది. కొంతసేపటికి పాట అస్సలు వినబడకుండా పోయింది.

అనుకోకుండా పడవ జోరందుకుంది. ఒడిస్సియస్ మనస్సు తేలిక పడింది. అతని ముఖంలో చిరునవ్వు చిందింది. అందరూ సైరన్ల బారినుండి తప్పించుకున్నారు.

4.4 సుడిగుండపు భయంకర స్వరూపం

ఒడిస్సియస్ ముఖంలో చిరునవ్వు చూడగానే నావికులు ధైర్యంగా తమ చెవులలో పెట్టుకున్న మైనపు ముద్దలను పీకేశారు.

“నా కట్లు విప్పేయండి” ఒడిస్సియస్ ఆజ్ఞాపించేడు. నావికులు వినయవిధేయతలతో వారి నాయకుడిని బంధవిముక్తుడిని చేసేరు.

“నేను ఆజన్మాంతము మీ అందరికి ఋణపడి ఉంటాను. మీ సహకారంతో నేను సైరన్ల పాట విని కూడా ప్రాణాలతో బయటపడ్డాను.”

“అంత శ్రావ్యమైన పాట వినే అదృష్టం మాకు కలగలేదు. ఆ పాట గురించి మాకు కొంచెం చెబుతారా?”

ఒడిస్సియస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలోగా మరొక ఉపద్రవం వచ్చి పడింది.

దూరంనుండి ఉరుములు ఉరిమినట్లు గర్జన వినిపిస్తోంది.

అందరూ ఆ శబ్దంవైపు చూస్తున్నారు.

సముద్రం అంతా భయంకరంగా, నల్లగా మారుతోంది. పెద్ద పెద్ద కెరటాలు పడవను రెండు పక్కలనుండి బాదుతున్నాయి.

క్రమేపీ ఉరుముల గర్జన వికృతంగా మారుతోంది. చెవులు చిల్లులు పడేలా ఉందా శబ్దం. కెరటాలు ఉప్పొంగి పడవ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ రభసకు కారణం ఏమిటో కళాసులకు అర్థం కావడం లేదు.
ఒడిస్సియస్ ఒక్కడికే పరిస్థితి అర్థం అయింది. అతని పడవ, పడవలో ఉన్న నావికులు, ఒక శక్తివంతమైన సుడిగుండపు ఆకర్షణ ప్రభావంలో ఉన్నారు. ఇదే సర్సీ చెప్పిన ఖరీబ్డిస్ సుడిగుండం.

“తెడ్లు జోరుగా వెయ్యండి.”

“మేము ఎంత జోరుగా తెడ్లు వేసినా పడవ మా మాట వినడం లేదు. గిర్రున తిరుగుతోంది తప్ప ముందుకు కదలడం లేదు.”

ఒడిస్సియస్‌కి తెలుసు. సుడిగుండంలో చిక్కుకోకుండా ముందుకు వెళ్ళాలంటే నిదానంగా ఆరు తలల సిల్లా రాక్షసి ఉండే గుహవైపు పడవను అతి జోరుగా తెడ్లు వేసి నడపాలి. కానీ ఆ గుహ దరిదాపులలోకి వెళ్ళిన తరువాత జరగబోయే దారుణమైన సంఘటనను వాళ్ళకు ఏ ముఖం పెట్టుకుని చెబుతాడు?

అందుకని పడవ అంతటా తిరుగుతూ, కళాసులందరిని పేరు పేరున పలకరించి, భయపడవద్దని ధైర్యం చెప్పి, అందరిని ఉద్దేశించి ఇంకా ఇలా చెప్పుకొచ్చేడు:

“సహచరులారా! మనం అంతా కలిసికట్టుగా ఎన్నో ఇడుములు అనుభవించేం అని నేను వేరే చెప్పనక్కర లేదు. సైక్లాప్స్ పిడికిలినుండి తప్పించుకుని బయటపడ్డాం. సర్సీ మంత్రశక్తులను అధిగమించగలిగేం. ప్రేతాత్మల చీకటి ప్రపంచాన్ని చూసి, ప్రాణాలతో తిరిగి వచ్చేం. కష్టాలు చెప్పి రావు. అవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కునే మనోధైర్యం మనకు ఉండాలి. జయం మనదే అనే దృఢనమ్మకం మనలో పాతుకుపోయి ఉండాలి. ఇప్పుడు మన తక్షణకర్తవ్యం మన పడవను అతి జోరుగా నడపడం.”

ఇలా మాట్లాడుతూ ఉంటే ఒడిస్సియస్ గుండె బరువెక్కి పోయింది. నిజం తనొక్కడికే తెలుసు. తమ జట్టులో కనీసం ఆరుగురిని ఆరు తలల సిల్లా రాక్షసి పొట్టన బెట్టుకోబోతోంది. ఎవరు మృత్యువాతన పడబోతున్నారో ఎవ్వరికీ తెలియదు.

పడవను నిలకడగా ఉంచడానికి చుక్కాని తిప్పేవాడు నానా ఇబ్బందులూ పడుతున్నాడు. భయంకరమైన కెరటాలు పడవను ముంచెత్తున్నాయి.

ఈ ఘర్షణ ఇలా జరుగుతూ ఉండగా, కొద్ది సేపట్లో ఎదురుగా ఒక పెద్ద పర్వతశిఖరం కనిపించింది. అది ఆకాశంలో ఉన్న మేఘాలతో దోబూచులాడుతోంది. నిట్టనిలువుగా, నున్నగా పాలరాతిలా ఉన్న ఆ కొండచరియలను ఆసరాగా చేసుకుని మానవుడెవ్వడూ ఆ శిఖరాగ్రానికి ఎగబాకలేడు.

“ఆ శిఖరాగ్రంలో ఉన్న గుహలో ఆరు తలల రాక్షసి సిల్లా ఉందన్న మాట” అనుకున్నాడు ఒడిస్సియస్, భయకంపితుడవుతూ. తనకు తెలిసిన రహస్యం తన సిబ్బందికి చెప్పడమా? మానడమా? చెబితే ధైర్యం కోల్పోయి పడవను దైవాధీనం చేస్తారేమో? అప్పుడు సిల్లాకు అవకాశం రాకుండానే ఎదురుగా ఉన్న సుడిగుండం అందరినీ మింగేస్తుందేమో.

అందరూ సుడిగుండంలో పడి చచ్చిపోయేకంటే ఆరుగురు మాత్రమే సిల్లా వాతపడి చచ్చిపోవడం మెరుగు కాదూ?

“నా మాట వినండి. నేను చెప్పినట్లు చెయ్యండి. సర్వోన్నతుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మన దేవుడు జూస్ మీద నమ్మకం ఉంచి, పడవను సుడిగుండానికి దూరంగానూ, అంబరాన్ని చుంబిస్తూన్న ఆ పర్వతశిఖరానికి దగ్గరగానూ నడపండి.”

పైకి ఇలా ప్రశాంతంగా చెబుతున్నాడు కానీ, కొద్దీ సేపట్లో వారిలో ఆరుగురు సిల్లా ఆకలికి ఆహారం అవబోతున్నారన్న నిజం తెలుసు కనుక లోలోపల ఉక్రోషంతో క్రుంగి పోతున్నాడు. కానున్నది కాక మానదు అని తెలిసున్నా, మానవప్రయత్నం మానుకోలేము కదా. ఒక్క ఉదుటున ఒక కఠోరనిర్ణయానికి వచ్చేడు. సర్సీ ఇచ్చిన హితోపదేశాన్ని ఉల్లంఘించి సిల్లా రాక్షసిని కడతేర్చడానికి నిర్ణయించుకున్నాడు.

ఒడిస్సియస్ కవచాన్ని, శిరస్త్రాణాన్ని ధరించేడు. ఈ చేత, ఆ చేత ఒకొక్క శూలాన్ని పట్టుకుని, నిప్పులు కక్కుతూన్న కళ్ళతో శిఖరాగ్రాన్ని చూస్తున్నాడు.

శిఖరాగ్రంలో ఉన్న గుహ ద్వారం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. పైగా ఆ గుహ ఎంతో ఎత్తులో ఉంది. వీరాధివీరులు కూడా అంత దూరంలో మేఘావృతమై ఉన్న లక్ష్యాన్ని బాణాలతో కానీ, ఈటెలతో కానీ ఛేదించలేరు. ఆ రాక్షసి బయటకు వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

నావికులు పడవను సుడిగుండంనుండి తప్పించి, జోరుగా నడుపుతున్నారు. ఒడిస్సియస్ చెవులకు సిల్లా రాక్షసి చేస్తూన్న జాగిలపు మొరుగువంటి శబ్దం వినిపిస్తోంది. ఆ రాక్షసి ఆరు తలలు స్ఫుటంగా కనిపించేవరకు సావధానచిత్తుడై ఎదురు చూస్తున్నాడు.

4.5 సిల్లా: ఆరు తలల రాక్షసి

గ్రీకు నావికులు సిల్లా గుహ ఉన్న కొండ శిఖరం దరిదాపుల్లోకి వస్తున్నారు. ఉగ్రరూపుడైన ఒడిస్సియస్ పొగమంచుతో కప్పబడ్డ ఆ గుహ ద్వారంవైపు ఏకాగ్రతతో చూస్తున్నాడు.

అకస్మాత్తుగా ఒడిస్సియస్ దృష్టి సిల్లానుండి హోరెత్తుతూన్న సముద్రంవైపుకు మళ్ళింది. పడవ ముందు భాగంలో సుడిగుండం రాక్షసి ఖరీబ్డిస్ సముద్రపు నీటిని తాగి, దానిని తిరిగి ఝరీపాతంలా పడవ మీదకు ఊసేస్తున్నది. అందువల్ల పడవ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. బయట సముద్రం సలసల మరుగుతూన్న కొప్పెరలా కనబడుతోంది.

ఒడిస్సియస్ ఆ సుడిగుండం మధ్యలోనికి చూసేడు. గిర్రున తిరుగుతూన్న ఆ సుడి సముద్రగర్భంలో ఉన్న మట్టిని, రాళ్ళను పైకి ఎగదోస్తూంది. పడవ ఒక్క రవ్వ అటు జరిగిందంటే, పెను ప్రమాదం. జలసమాధి ఖాయం.

ఒడిస్సియస్ చేతుల్లో ఉన్న ఈటెలను కింద పడేసి, తక్షణం పడవకు ఎదురైన ప్రమాదంనుండి రక్షించే పనిలో పడ్డాడు.

“తెడ్లు జోరుగా వెయ్యండి. కొండ శిఖరంవైపుకు కదలండి” ఒడిస్సియస్ బిగ్గరగా అరిచేడు.

అదే సమయంలో సిల్లా వికృతమైన తన ఆరు తలలనీ గుహ లోపలనుండి బయటకు జాచింది. నావికులు కెవ్వున కేకలు వేసేరు. కనురెప్పలు మూసి తెరిచేలోగా సిల్లా తన పొడుగైన మెడలను కిందికి జాచి, ఒక్క క్షణంలో ఆరు నోళ్ళతో ఆరుగురు నావికులను కరిచిపెట్టి ఎత్తుకుపోయింది!

గిలగిలా కొట్టుకుంటూన్న గ్రీకు నావికులు ఒడిస్సియస్‌ని పేరుపెట్టి పిలిచి రక్షించమని వేడుకున్నారు. కానీ ఏం లాభం? ఒడిస్సియస్ కళ్ళ ఎదుటే సిల్లా ఆ ఆరుగురిని కబళించేసింది.

మాంత్రికురాలు సర్సీ చెప్పినది అక్షరాలా నిజం అయింది. ఇహ మిగిలిన వారు బ్రతికి బట్టకట్టాలంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పారిపోవడమే మార్గం.

ప్రాణభీతితో పడవను పరుగులు పెట్టించేరు.

4.6 సూర్యదేవుడి ద్వీపం

ఒడిస్సియస్ పడవ చుక్కాని దగ్గర నిలబడి నురుగులు కక్కుతూన్న సముద్రంవైపు చూస్తున్నాడు. తన సిబ్బందిలో ఆరుగురు అమాయకులు ఎలా చిత్రవధకు గురి అయ్యారో తలుచుకుంటేనే కోపంతో శరీరం వణికిపోతోంది. తమను రక్షించమని వారు చేసిన హాహాకారాలు ఇంకా తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

గడిచిపోయిన కర్మకు ఇప్పుడు వగచి లాభం లేదు. ప్రాణాలతో మిగిలినవారికి ప్రాణం ఎంత తీపిదో తెలిసొచ్చింది. వారినైనా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన బాధ్యత తన మీద ఉంది.

“తెడ్లు వేసి పడవను ముందుకు నడపండి. వెనక్కి తిరిగి చూడకండి. గడచిన దానికి వగచి ప్రయోజనం లేదు. ముందుచూపుతో మనం ఇంటికి చేరే వెసులుబాటు కోసం వెతుకుదాం.” ఒడిస్సియస్ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు.

జరిగిన సంఘటనలకు మ్రాన్పడిపోయిన నావికులు ప్రశ్నించగలిగే మనఃస్థితిలో లేరు. కర్తవ్యమూఢులై, స్తబ్దంగా, తెడ్లు వేస్తున్నారు. పడవ జోరందుకుంది.

కొంతకాలం తరువాత, ఎదురుగా ఎండతో నిండిన ద్వీపంనుండి ఆవుల అంబాలు, గొర్రెల బాబాలు వినబడ్డాయి.

పడవలో కళాసీలు ఆనందభరితులయేరు. గట్టు చేరగానే ఆవు మాంసం, గొర్రె మాంసంతో విందు భోజనం కోసం తహతహలాడడం మొదలుపెట్టేరు.

ఒడిస్సియస్ ఉత్సాహం చూపలేదు. అతనికి భయంగా ఉంది. అతని మనస్సు కీడు శంకిస్తోంది. ఎదురుగా ఉన్నది సూర్యదేవుడి ద్వీపం. అక్కడ ఎలా మసులుకోవాలో టైరీసియస్ చెప్పేడు. అతని సలహా తు.చ. తప్పకుండా పాటించమని సర్సీ మరీ మరీ చెప్పింది.

“నేను మరొక పర్యాయం హెచ్చరిస్తున్నాను. ఇది సూర్యదేవుడి నెలవు. ఇక్కడ ఉన్న ఆవులను, జంతువులను ముట్టనైనా ముట్టకూడదు.” ఒడిస్సియస్‌కి తెలుసు. తనవారు మిక్కిలి అలసిపోయి ఉన్నారు. మంచి భోజనం, మంచి పానీయం కొరకు మొహం వాచిపోయి ఉన్నారు. ఆ పరిస్థితిలో సూర్యదేవుడి పశువులకు ఏ విధమైన అపచారం జరిగినా కొంపలు ములిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ హెచ్చరిక.

“అలాగైతే తిండి, తాగుడు లేక ఇక్కడే చచ్చిపోమా?”

“నేను చెప్పిన మాట వినండి. నన్ను పదే పదే ప్రశ్నించకండి. మీరందరూ ఆకలితో అలమటిస్తున్నారని నాకు తెలుసు. అలసటతో అనాసక్తితో ఉన్నారని తెలుసు. కానీ ఎదురుగా కనిపిస్తూన్నది సూర్యదేవుడు హీలియోస్ ద్వీపం. అక్కడ భోజనసామగ్రి, కిరాణా సరకులు మనకు లభ్యం కావు. అక్కడ కనబడే గొర్రెలను, పశువుల్ని తాకనైనా తాకవద్దని భవిష్యద్వాచకుడు టైరీసియస్ చెప్పేడు కదా. మాంత్రికురాలు సర్సీ కూడా అదే విధంగా హెచ్చరించింది. పైపెచ్చు ఆమె మన అవసరాల మేరకు భోజనసామగ్రి, మదిర పడవలోకి ఎక్కించి జాగ్రత్త చేసింది కదా. కనుక సూర్యదేవుడి పశుసంపదకు హాని తలపెట్టి కొరకంచుతో తల గోక్కోవద్దని చెబుతున్నాను.”

“అలాగైతే మమ్మల్ని ఇక్కడే ఆకలితో చచ్చిపోనీ.”

“నా మాట వినండి. ఇంతవరకు మనం కష్టాలను, సుఖాలను, విజయాల్ని, పరాజయాల్ని కలిసి పంచుకున్నాం. ఈ చివరి క్షణంలో ఒక్క తప్పు చేస్తే మనం ఇన్నాళ్ళూ పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లే కదా మనం ముందుకు కదలాలి.”

ఒడిస్సియస్ తమ విన్నపాలను వినకుండా “పదండి ముందుకు” అని ఎగదోస్తూ ఉంటే, వారి ఉపనాయకుడైన యూరిలోకస్ కోపోద్రిక్తుడై ఇలా అన్నాడు:

“ఒడిస్సియస్! నువ్వు ఉక్కు మనిషివి. మేము నీలా ధీరోదాత్తులం కాదు. మేము సాధారణమైన మానవులం. ఈ నావికులు విశ్రాంతి లేకుండా, జబ్బలు పడిపోయేలా పని చేస్తున్నారు. వారికి కొంత ఊరట కావాలి కదా. చీకటి పడుతోంది. ఇక్కడ ఆగుదాం. మనతో తెచ్చుకున్న దినుసులతో వండుకుని, భోజనం చేసి, పడుకుందాం. తెల్లారగానే ప్రయాణం కొనసాగిద్దాం. సూర్యదేవుడి పశువుల్ని కన్నెత్తయినా చూడనవసరం లేదు.”

యూరిలోకస్ ప్రతిపాదనను అందరూ ఏకకంఠంతో సమర్ధించేరు – ఒక్క ఒడిస్సియస్ తప్ప. అతని మనస్సులో ఏదో భయం. యూరిలోకస్ ప్రతిపాదనలో లోపం కనబడలేదు కానీ ఈ ప్రతిపాదన వెనక దేవుళ్ళు చేస్తూన్న కుట్ర ఏదో ఉన్నదేమోనని అతని అంతరాత్మ ఘోషిస్తోంది. కానీ యూరిలోకస్ ప్రతిపాదనను ఆమోదించక తప్పలేదు.

“మీరందరూ ఒకటై చెబుతూ ఉంటే మీతో పోరాడే ఓపిక నాకు లేదు. యూరిలోకస్ చెప్పినట్లు మనం అంతా ఇక్కడ విడిది చేసే పక్షంలో మీరంతా, దేవుడి సాక్షిగా, నాకొక వాగ్దానం చెయ్యాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా మీరు సూర్యదేవుడి పశువులకు ఏ రకమైన హాని చెయ్యకూడదు, వాటిని తాకనైనా తాక కూడదు. సర్సీ మనకు ఇచ్చిన ఆహారపదార్థాలతో మాత్రమే మీ క్షుద్భాధ తీర్చుకోవాలి. సమ్మతమేనా?”

“సమ్మతమే” అని నావికులందరూ ఎవరికివారుగా ఒక సారి, ఏకగ్రీవంగా మరోసారి ప్రమాణం చేసేరు.

అప్పుడు పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి, లంగరు వేసి, సూర్యదేవుడి ద్వీపం మీద కాలు మోపేరు.

అదృష్టవశాత్తూ అక్కడ వారికి తియ్యటి నీటితో ప్రహించే ఒక సెలయేరు కనబడింది. దాని ఒడ్డున ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని, సర్సీ ఇచ్చిన ఆహారపదార్థాలతో సుష్టుగా భోజనం చేసేసరికి ఒక్కుమ్మడిగా సిల్లా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆరుగురు సహచరులు గుర్తుకు రాగా, వారి తలపులతో అర్ధరాత్రి దాకా విలపించి, అలసి సొలసిన శరీరాలతో నిద్రాదేవత ఆవహించగా సుషుప్తావస్థలోకి జారుకున్నారు.

4.7 పెను తుపాను

అర్ధరాత్రి దాటింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. చిమ్మచీకటిగా ఉంది. దేవతల రాజు జూస్ ఉగ్రుడై ఒక భయంకరమైన తుపానుని సూర్యదేవుడి దీవికి పంపేడు. పెనుగాలి చెట్లను కూకటి వేళ్ళతో కదిలిస్తోంది. చల్లటి వర్షం, ఆకాశానికి చిల్లుపడ్డట్లు కుండపోతగా కురుస్తోంది.

గ్రీకు నావికులు తల దాచుకోడానికి చెంతనున్న ఒక గుహలోకి పరుగులు తీశారు. తుపాను తీవ్రతకు తట్టుకోలేక గజగజ వణుకుతూ గుమిగూడేరు. తెలతెలవారే సమయానికి తక్షణ కర్తవ్యంగా పడవను సురక్షిత స్థావరంలో దాచమని నావికులకు పురమాయించేడు ఒడిస్సియస్. నావికులు ఒడ్డున ఉన్న పడవను రక్షణకొరకు ఒక గుహలోకి చేర్చేరు.

అప్పుడు ఒడిస్సియస్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, “సహచరులారా! ఈ వాతావరణం తెరిపి ఇచ్చేవరకు మనం ఇక్కడనుండి కదలడానికి అవకాశాలు కనబడడం లేదు. ఈ సందర్భంలో మరొకసారి నొక్కి వక్కాణిస్తున్నాను. ఇక్కడ సూర్యదేవుడి పశువుల్ని ముట్టడానికి వీలు లేదు. సూర్యదేవుడు సమస్తం చూడగలడు, సమస్తం వినగలడు. మనకు కావలసినంత ఆహారం మన పడవలో ఉంది. ఈ తుపాను తెరిపి ఇవ్వగానే మనం కదులుదాం.”

గ్రీకు నావికులు తమ నాయకుడి ఆజ్ఞను జవదాటమని మరోసారి వాగ్దానం చేసేరు. దినాలు గడుస్తున్నాయి. దినాలు వారాలయాయి. మేఘావృతమైన ఆకాశంలో సూర్యకిరణాలు కరువైపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇలా ఆ ద్వీపం మీద నట్టడిపోయి నెల దాటుతోంది. నెమ్మదిగా సర్సీ ఇచ్చిన ఆహార పదార్థాలు ఒకటీ ఒకటీ నిండుకుంటున్నాయి. ఇహ గత్యంతరం లేక నావికులు కందమూలాల కొరకు ఆ ద్వీపాన్ని గాలించడం మొదలుపెట్టేరు. కొందరు సముద్రంలో చేపలు దొరుకుతాయేమోనని వేట మొదలుపెట్టేరు. మరికొందరు ఎగిరే పక్షుల కొరకు చెట్లని పట్టుకుని ఎగబాకడం మొదలుపెట్టేరు.

తుపాను ఉద్ధృతి తగ్గలేదు. కడుపునిండా తినడానికి ఆహారం దొరకడం లేదు. ఆకలి ఎక్కువవుతోంది. నీరసం పెరుగుతోంది. సహనం తరుగుతోంది.

ఆకలి కడుపులతో ఏం అఘాయిత్యానికి తలపడతారో అని ఒడిస్సియస్ భయపడుతున్నాడు. ఆకలి కడుపులతో వారెవరైనా తాను విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే మొదటికే మోసం. మానవప్రయత్నం చేసేడు. ఇప్పుడు దైవసహాయం కావాలి.

ఎవ్వరి కంటా పడకుండా గుహనుండి బయటకు వచ్చాడు ఒడిస్సియస్. బయట వర్షం ధాటి అలాగే ఉంది. ఒక్క ఉదుటున దూరంగా ఉన్న కొండ వాలులోని మరుగు ప్రదేశంలోకి పరిగెత్తుకుని వెళ్ళేడు. అక్కడ చేతులు జోడించి ఒలింపస్ పర్వతం మీద ఉన్న జూస్ దేవుడిని ఉద్దేశించి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టేడు. “దేవదేవుడా! ఈ ఆకలిని ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదించు. ఈ తుపానుకు తెరిపి ఇవ్వు.”

ఇలా ప్రార్థిస్తూ ఆకలివల్ల కలిగిన నీరసంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయేడు.

4.8 దేవుళ్ళిచ్చిన శిక్షలు

ఒడిస్సియస్ ఒక్క పెట్టున త్రుళ్ళిపడి లేచేడు. ఆ మరుగు ప్రదేశంలో ఎంతసేపు నిద్రపోయాడో అతనికి తెలియదు. బారెడు పొద్దెక్కి పోయింది. భయంతో తన సిబ్బంది ఉన్న గుహ దగ్గరకి పరుగున వెళ్ళేడు.

గుహ ముఖద్వారం దగ్గరికి వెళ్ళేసరికి అతని ఒళ్ళు జలదరించింది. కాలుతూన్న మాంసం వాసన అతని నాసాపుటాలకు తటాలున తగిలింది.

ఒడిస్సియస్ హృదయస్పందన లయ తప్పింది. కోపోద్రేకంతో శరీరం అంతా స్వేదావృతం అయింది. మొట్టమొదట ఎట్టఎదుట కనబడిన నావికుడి జబ్బ పట్టుకుని, “ఏమిటి మీరు చేసింది? నేను కూడదన్న పని చేసేసేరా? దేవుళ్ళకు కోపం వచ్చే నికృష్టపు పని చేసేసేరా?”

“మేము యూరిలోకస్ చెప్పినట్లే చేసేము. ఆకలిని మించిన శత్రువు లేదని చెప్పేడు. సూర్యదేవుడి పశువుల్ని చంపి తినమని అతడే ప్రోత్సహించేడు. సూర్యదేవుడికి కోపం వస్తే అతనిని శాంతపరచడానికి మనం ఇథకా చేరుకున్న తరువాత అతనికి పెద్ద దేవాలయం కడతామని మొక్కుకుందాం అని చెప్పేడు.”

ఒడిస్సియస్ నిరుత్సాహంతో భోరున ఏడ్చేడు.

“మాకు వెర్రి ఆకలి వేసింది. మేము చేస్తూన్న పనిలో మంచిచెడ్డల్ని విచారించగలిగే శక్తి మాలో నశించింది.”

ఒడిస్సియస్ మోకరిల్లి, “జూస్! అజరామరమైన దేవతలారా! నాకు నిద్ర వచ్చేటట్లు ఎందుకు చేసేరు? నా సిబ్బందికి ధైర్యం ఇమ్మని మిమ్మల్ని పదే పదే వేడుకున్నానే. నా మొర ఆలకించలేదా? సూర్యదేవుని పశువులను తాకవద్దని నేను ఎన్ని సార్లు చెప్పినా వారు వినలేదు. మామీద మీ కరుణావీక్షణాలు ప్రసరింపజెయ్యండి.”

ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవతలకు ఒడిస్సియస్ మొర వినిపించిందో లేదో? కానీ సూర్యదేవుడు హీలియాస్ మాత్రం తప్పకుండా కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ కోపంతో రేపు పొద్దుట ఉదయించనని మొరాయిస్తే? “అంత పని చెయ్యవద్దు. జరిగిన అపచారానికి ప్రతీకారమార్గం మేము వెతుకుతాము” అని దేవతలు అంటారేమో.

ఒడిస్సియస్ లేచి నిలుచున్నాడు. గుహ లోపల చుట్టూ చూసేడు అంతా దారుణంగా ఉంది. అసహజంగా ఉంది. చంపబడ్డ జంతువుల చర్మాలు నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి.

ఇహ ఒడిస్సియస్ చేయగలిగేది ఏమీ లేదు. ఏమి చేసినా ప్రయోజనం ఉండబోదు.. కానున్నది కాక మానదు. సూర్యదేవుని పశువుల్ని చంపినందుకు ఫలితం అనుభవించి తీరాలి. శిక్ష? కన్నుకు కన్ను? ప్రాణానికి ప్రాణం?


మరొక ఆరు రోజులవరకూ తుపాను గాలులు ఉపశమించలేదు. ఈ ఆరు రోజులు నావికులు వారు చంపిన పశువుల మాంసాన్ని తిని ప్రాణం నిలుపుకున్నారు.

ఏడవ రోజున తుపాను తెరపినిచ్చింది. సూర్యకిరణాలు మబ్బుతెరలను తొలగించుకుని తొంగి చూస్తున్నాయి.

ఒడిస్సియస్ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం నావికులు పడవను ప్రయాణానికి సిద్ధం చేసేరు. లంగరు ఎత్తి, పడవను నీళ్ళలోకి తోసి, తెరచాపలు వేసేరు. పడమటినుండి వీచే మందమారుతం సహాయంతో పడవ ఉరకలు వేస్తూ ఇథకావైపు పరుగులు తీస్తోంది.

అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే, “మూడొంతులు దేవుళ్ళు మనను క్షమించి వదిలేసినట్లు ఉన్నారు.” అనుకుంటూ సరంగులు సంతోష సముద్రంలో ములిగి తేలుతున్నారు.

పడవ సముద్రం మధ్యకు వచ్చింది. మిన్ను విరిగి మీద పడింది. సూర్యదేవుడు మిగిలిన దేవుళ్ళతో సంప్రదించి పగ తీర్చుకుందుకు ప్రయత్నం చేస్తూన్నట్లు ఉన్నాడు. మొదట జూస్ నల్లటి మేఘాలను పంపినట్లున్నాడు. ఆకాశం నల్లబడిపోయింది. పగలు రాత్రిలా మారిపోయింది. తరువాత సముద్రాల అధిపతి అయిన పొసైడన్ కొండెత్తు కెరటాలను లేపి, పడవ మీద విరుచుకు పడేటట్లు చేసినట్లున్నాడు. తరువాత వాయుదేవుడు ఈయోలస్ భీకరమైన చక్రవాతాన్ని వదలినట్లున్నాడు. అది వచ్చి తెరచాప కొయ్యను విరగ్గొట్టి తెరచాపను గాలిపటంలా ఎగరేసుకుపోయింది. అది పోతూ పోతూ తన దారిన తాను పోకుండా చుక్కాని తిప్పేవాడి తలను వెయ్యి ముక్కలు చేస్తూ పోయింది.

జూస్ ఉరుములను, పిడుగులను విచ్చలవిడిగా వదిలేడు. ఒక పిడుగు వచ్చి పడవ స్థూలభాగాన్ని కొట్టగానే అది నీటిలో గిర్రున తిరిగింది. ఆ దెబ్బతో నావికబృందం అంతా నీటిపాలయిపోయింది.

పడవ స్థూలభాగాన్ని పట్టుకుని ప్రాణాలతో వెళ్ళాడుతూన్న ఒడిస్సియస్ తన సిబ్బంది అంతా సముద్రగర్భంలో కలిసిపోతూ ఉంటే అసహాయంగా చూడడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు.

ఒడిస్సియస్ ఏకాంతంగా ఆ సముద్రం మధ్యన మిగిలిపోయాడు.

4.9 ఒడిస్సియస్ ఒక్కడూ

ఒడిస్సియస్ ఏకాంతంగా ఆ సముద్రం మధ్యన విరిగి ముక్కలవుతూన్న పడవను పట్టుకుని నీళ్ళల్లో మునుగుతూ, తేలుతూ కొన ఊపిరితో ఉన్నాడు.

మరొక పెద్ద కెరటం వచ్చి మిగిలిన పడవను ముక్కలు చేసింది. ఓడ వెన్నుపలకను గట్టిగా వాటేసి పట్టుకుని, దానిని ఒక తెప్పలా వాడుకుని, ఒడిస్సియస్ ప్రాణాలను కాపాడుకున్నాడు.

చీకటి తెరలు కమ్ముకొస్తున్నాయి. గాలీ, వానా నిమ్మళించేయి. సముద్రం శాంతించింది. చుక్కాని లేని ఈ తెప్ప మళ్ళా సిల్లా రాక్షసివైపు కాని, ఖరీబ్డిస్ సుడిగుండంవైపు కానీ తనను ఈడ్చుకు వెళితే తన పని సరి. ఈ రెండు గండాలనుండి తనను రక్షించమని ఆ రాత్రల్లా వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాడు ఒడిస్సియస్.

తెల్లవారింది. ఎదురుగా సిల్లా రాక్షసి నివసించే కొండ శిఖరం కనిపించింది. ఆ పక్కనే హోరెత్తుతూన్న ఖరీబ్డిస్ సుడిగుండం కనిపించింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి తనని కబళించేస్తుంది. సందేహం లేదు. ఒలింపస్ కొండ మీద ఉన్న దేవుళ్ళకు చెవుడు కాబోలు.

ఖరీబ్డిస్ సుడిగుండంలోకి పడబోయే క్షణంలో కొండంత కెరటం వచ్చి ఒడిస్సియస్ తెప్పను దూరంగా నెట్టేసింది. తన చేతులను తెడ్లుగా వాడుతూ ఒడిస్సియస్ సురక్షితమైన దూరం కొట్టుకొచ్చాడు.


తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా తొమ్మిది దినాలు – రాత్రి, పగలు – ఒడిస్సియస్ ఆ తెప్పను పట్టుకుని వేళ్ళాడేడు. అతను ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదు. ఎక్కడకి కొట్టుకుపోతున్నాడో అతనికి తెలియదు.

పదవ దినం తెల్లవారింది. సముద్రం ఒడిస్సియస్ తెప్పను తీసుకొచ్చి ఒక ఒడ్డున పడేసింది.

4.10 కలిప్సో

నరనరాలకూ పాకిన అలసటతో ఒడిస్సియస్ ఆ ఒడ్డున ఇసుక తిన్నెల మీద, అపస్మారకస్థితిలో పడుకుని ఉన్నాడు. పది రోజులనుండి తిండి లేదు, తాగేందుకు నీళ్ళు లేవు. నోరు పిడచకట్టుకుపోయి ఉంది. అతని మనఃఫలకం మీద జరిగిపోయిన సంఘటనలు పదే పదే – తెర మీద కదిలే బొమ్మలలా – కదలాడుతూ ఉన్నాయి. తన నావికులు సిల్లా దంష్ట్రలలో చిక్కుకుని హృదయవిదారకమైన కేకలతో తనని పిలుస్తూ ఉంటే, తాను ఏమీ చెయ్యలేకపోయాడు. తన అనుయాయులు తన కళ్ళ ఎదుట సముద్రంలో ములిగిపోతూ ఉంటే ఏ సహాయం అందించలేకపోయాడు. తన తోటి యోధులు యుద్ధంలో మరణిస్తూ ఉంటే ఏమీ చెయ్యలేకపోయాడు. తాను నిమిత్తమాత్రుడు.

ఆ అంధ ద్రష్ట టైరీసియస్ ఏమన్నాడు? “నువ్వొక్కడివే తప్పించుకోగలవు. నువ్వు తప్పించుకోవడం జరిగితే మాత్రం నువ్వు అన్ని విధాలా చితికిపోయినవాడివి అవుతావు. నీకు సుఖశాంతులు ఉండవు.” అన్నాడు కదా.

అనగా తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్ ఇథకాలో క్షేమంగా లేరా? ఎన్ని కష్టాలు పడయినా సరే ఇంటికి వెళ్ళి వాళ్ళని సుఖపెట్టాలి.

అలసట, దుఃఖం, ఆకలి, దాహంతోపాటు గత పది దినాల అనుభవంవల్ల దాదాపు గుడ్డివాడయిపోయాడు ఒడిస్సియస్. ఎలాగో శక్తిని పుంజుకుని లేచి నిలబడ్డాడు. సహాయం చేసే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభిచేడు.

ఎంతో దూరం వెళ్ళకుండానే, ఎంతో శ్రమ పడకుండానే, పచ్చని మైదానం, దానిలో చల్లటి మంచినీటి ప్రవాహం కనిపించాయి. ఆ సెలయేటికి అవతల పక్క పెద్ద గుహ కనిపించింది. ఆ గుహకు వెళ్ళే దారిలో, బాటకు ఇరుపక్కలా, అందమైన చెట్లు బారులు తీరి ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలలో రకరకాల పక్షుల గూళ్ళు కనిపించాయి. ఆ గుహ ద్వారంపై రకరకాల తీగలు అల్లుకొని ఉన్నాయి. మాలతీలతలకు పూసిన పూలు ఆ ద్వారాగ్రాన్ని కప్పివేస్తున్నాయి. ద్రాక్షలతలనుండి ద్రాక్షపండ్లు గుత్తులుగా వేలాడుతున్నాయి. దేవదారు, మంచి గంధం చెక్కలు కాలుతూన్న పరిమళాలు ఆ ద్వారం దగ్గర వ్యాపించి ఉన్నాయి.

ఇదేదో కలలా ఉంది. ఆ గుహ ద్వారం దగ్గరగా వెళ్ళి లోపలికి తొంగి చూసేడు. లోపల పొయ్యిలో మండుతూ పెద్ద మంట కనిపించింది. ఆ మంట దాపున ఒక అందమైన అమ్మాయి కూర్చుని, పాట పాడుతూ, మగ్గం మీద ఏదో నేత నేస్తూంది. చూడడానికి దేవతాస్త్రీలా ఉంది.

పాట పూర్తి ఆవగానే ఆమె గుహ ద్వారం దగ్గర ఉన్న ఒడిస్సియస్‌ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది.

“ఒడిస్సియస్! నువ్వా? స్వాగతం. నా పేరు కలిప్సో (Calypso; KAH-lip-soh). నేను ఏట్లస్ (Atlas) కుమార్తెను. నువ్వు ఇటు వచ్చే అవకాశం ఉందని హర్మీజ్ చెప్పేడు.”

ఆ దేవత తనను పేరు పెట్టి పిలిచేసరికి ఒడిస్సియస్ అశ్చర్యపోయేడు. కానీ అలసటవల్ల ఏ విధంగానూ స్పందించలేదు.

కలిప్సో చాలాసేపు ఒడిస్సియస్ వైపు కన్నార్పకుండా చూసింది. తరువాత తనదైన తియ్యని స్వరంతో, “నీకు ఏమయిందో నాకు తెలుసు. నీవాళ్ళు సూర్యదేవుడి పశువుల్ని చంపి తినేశారు కదూ? కోపోద్రిక్తుడైన సూర్యదేవుడు ఇటుపైన ఉదయించనని ప్రతిజ్ఞ చేస్తే దేవదేవుడైన జూస్, ఒలింపస్ పర్వతం మీద ఉన్న ఇతర దేవుళ్ళూ కలుగజేసుకుని అలా వద్దనిన్నీ నీ మీద తాము ప్రతీకారం తీర్చుకుంటామనిన్నీ ప్రతిన చేసేరు. అందుకనే జూస్ నీ పడవను తుపానులో ముక్కలు చేసేడు. నీ సరంగులను నీ కళ్ళ ముందే నీటిలో సమాధి చేసేడు.”

ఒడిస్సియస్ అంగీకారం తెలుపుతూ తల పంకించేడు.

“నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, ఒడిస్సియస్! రా, లోపలికి రా. నా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ విశ్రాంతి తీసుకుని కోలుకో.”

మారు మాట్లాడకుండా ఒడిస్సియస్ గుహలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళేడు.

వెళుతూనే పొయ్యి సెగ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఒడిస్సియస్ అన్ని విధాలా హతాశుడైన వ్యక్తి. అతను శారీరకంగానూ, మానసికంగానూ చితికిపోయిన వ్యక్తి.

ఒడిస్సియస్ పొయ్యిలో వెలుగుతూన్న మంటను చూస్తూ సేద తీర్చుకుంటున్న తరుణంలో కలిప్సో తన పాటను మళ్ళా పాడడం మొదలుపెట్టింది. ఆహ్లాదకరమైన ఆ పాట వింటూ ఒడిస్సియస్ పడ్డ కష్టాలన్నింటినీ క్రమంగా మరచిపోయేడు. కొన్నేళ్ళుగా దొరకని మనశ్శాంతి ఇప్పుడు దొరికింది. పాట వింటూ ఒడిస్సియస్ కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడు పట్టిందో గాఢంగా నిద్ర పట్టేసింది.

కలిప్సో ప్రేమతో అతనివైపు చూసి, అతని నిద్రకు భంగం కలగకుండా మెత్తని కంబళి పట్టుకొచ్చి కప్పింది.

(సశేషం)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...