“అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు”
(ఆకురాలుకాలం)
ఈ కవితావాక్యం తెలియనివారూ దీన్ని ఆస్వాదించీ ఆదరించని కవిత్వపాఠకులూ విమర్శకులూ తెలుగులో లేరు. మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. ఏ కవితలోనూ వాటిలోని ఏ వాక్యంలోనూ కవిత్వాంశ లోపించదు. ఈమె కవిత్వంలో వాక్యం చలువరాయి, కవిత ఒక చల్లని ఇల్లు. ఇక్కడ ఉంటూ ఎంతసేపైనా పాఠకులు సేదదీరవచ్చు.ఈ సృజనాత్మకశక్తి వెనుక ముఖ్యంగా కనిపించే ప్రధానమైన గుణం కవయిత్రి నిజాయితీ. తన అనుభవంలో ఎదురయే సంఘటనల్నే కవిత్వంగా మలిచారీమె. “నాకు ఆదర్శదాంపత్యం అనే నోబెల్ ప్రైజ్ అక్కర్లేదు” అన్న ఈమె, తనని తాను స్త్రీవాద కవి అనుకుంటారో లేదూ కవి అనే అనుకుంటారోగానీ పది నాళ్ళు నిలిచిపోయే కవిత్వం రాశారు. ఈ పది నాళ్ళు నిలిచే గుణం ఈమె స్త్రీవాది అవడం వల్ల మాత్రమే వచ్చినది కాదు. ఇప్పుడు స్త్రీవాదాన్ని దాటి అస్తిత్వవాదం ముందుకొచ్చింది. అయినా, ఈమె కవిత్వం నవనవోన్మేషంగానే ఉంది. శ్రీశ్రీని విప్లవకవి అనాలా మహాకవి అనాలా అంటే, మహాకవి అనే సమాధానం వింటాం. అలాగే, మహెజబీన్ మంచి కవయిత్రి. స్త్రీవాదం ఆనుషంగికమన్న నిజం నిలకడ మీద తెలుస్తుంది. “ఆకురాలుకాలం” కొత్త ఎడిషన్‌లో ఈమె పరిచయంలో ఈమెకు వచ్చిన అవార్డుల లిస్ట్ ఉంది. ఎన్ని అవార్డులో! ఈమె రాసిన ఒక్కో కవితకూ ఒక్కో అవార్డ్ వచ్చినట్టుంది!
1990వ దశకపు పూర్వార్ధంలో కవితారంగప్రవేశం చేశారీమె. అప్పట్లో వచనపద్యాలు రాసేవారు ప్రతి కవితలోనూ ఏవో ఒకట్రెండు లైన్లు బాగుంటే చాలులే, అవే మొత్తం కవితను మోస్తాయిలే అన్న మాదిరి రాస్తూండిన కాలంలో మహెజబీన్ వచనకవిత నిజాయితీగా, చిక్కగా ఉంటూ స్త్రీల పక్షాన నిలబడగలదనీ నిరూపించారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వీథిలోకి అడుగిడితే గోడల మీద విప్లవ నినాదాలు, వార్తాపత్రికలు తెరిస్తే ఉద్యమకారుల ఎన్‌కౌంటర్ వార్తలు దర్శనమిచ్చేవి. ఉద్యమంలో స్త్రీల పాత్ర అంటూ వేరే ఉండదు. ఉద్యమించిన స్త్రీపురుషులు ఆకాశంలో సమభాగాలు. అయితే, ఉద్యమ సానుభూతిపరుల పాత్ర ఏమిటి అనడిగినా, ఉద్యమకారుడి ప్రేమిక పాత్ర ఏమిటని అడిగినా పుట్టేది కవిత్వమే. ఉద్యమానికి ఆలంబననిస్తున్న ఒక ప్రేమిక, ఒక తెలుగింటి ఆడపడుచు, మార్పును అభిలషిస్తూన్న తల్లి – ఈ మూడు భూమికలూ పోషిస్తున్న కవయిత్రి మనసులోని మాటలే మహెజబీన్ ప్రధానంగా రాసిన కవిత్వం.
అసలు ఒక కవికీ కవి ఎగిరి అందుకోదలచే ఊహాప్రపంచపు ఆకాశానికీ మధ్య ఈ సమాజమూ దీని అనేకానేక సమస్యలూ ఎందుకడ్డొస్తున్నాయన్న ప్రశ్న అందర్నీ వేధించేదే, ఈ స్పృహ మహెజబీన్ కవిత్వంలోనూ కనిపిస్తుంది. “నైసర్గిక స్వరూపం”లో ఇలా ఉంది:
“చిన్నప్పటినుంచీ అంతే
నిషిద్ధం మీదే నా గురి
…
ఈ నిరంతరాన్వేషణలో
ఎప్పుడో ఓసారి ఆకాశాన్ని
సొంతం చేసుకొని
నా స్వప్నాలు చల్లుకుంటాను.”
నిషిద్ధం మీదే నా గురి! బెర్లిన్ వాల్ ఉండే రోజుల్లో దాన్ని అట్నించి ఇటూ ఇట్నించి అటూ దాటేవారుండేవారంటే వారిదీ ఇదే స్ఫూర్తి. గోడ కూలిన పిదపే వారికి ఆకాశంలో స్వప్నాలు చల్లుకునే అవకాశం దక్కింది. “నేనలా నడుస్తూ వుంటాను/నా కన్నా ముందు సౌందర్యం విస్తరిస్తుంది” (సన్నిహిత సంబంధం) అన్నప్పుడు ఈమె ఎంత అపూర్వమైన ఆశాదూతికగా వచ్చారో పాఠకులకు అర్థమవుతుంది. బాలకార్మికుల మీద ఈమెకున్న ప్రేమ వ్యక్తమయిన కవితల్లో “పనిపిల్ల” ఎన్నదగ్గది:
“నన్ను ఏ పనీ చేయనివ్వదు
నాకేమీ తెలియదంటూ
తన పసితనాన్ని నాకిచ్చి
నా పెద్దరికాన్ని మోస్తుంది
…
మా అమ్మ హఠాత్తుగా
చిన్నదైనట్టు అనిపిస్తుంది”.
ఈ వాక్యాల్లో తెలుస్తుంది పనిపిల్లలు ఆరిందాల్లా ఇళ్ళల్లో ఎలా ఊడిగం చేస్తారో. పనిపిల్ల మీద కవయిత్రికున్న ముద్దూ మార్దవమూ పాఠకులను దాటిపోవు. ఇంకా, ఈమె నమ్మిన మతాతీత మానవత్వ వాదానికి రుజువుగా:
“నేను మజీద్
తను మందిర్
మాకో యేసు ప్రభు(వు) పుట్టాడు”
అనడం అవసరపడింది. ఈ కాలం ఇటువంటిది. ఈ వాక్యాలు కొంతమందికి clichedగా కనిపించవచ్చుగానీ వీటి అవసరమైతే ఉంది.
అసలు కవిత్వంలో కవిత్వాంశ దాని బహుళార్థకతేనని చెప్పిన విమర్శకులున్నారు. మహెజబీన్ రాసిన “జ్ఞాపకం” అనే కవిత:
“తొలిపొద్దు చీకట్లో
వాల్ పోస్టర్లు అతికించి
నువ్వు తలుపు మీటిన జ్ఞాపకం”
అంటూ మొదలై, కనిపించకుండా పోయిన ఉద్యమకారుడైన ప్రియుడి గురించి వగపు చెందుతూ:
“తొలి సంధ్య కాంతిలో
నీ వర్తమానాన్ని మోస్తూ
నేను గడప దాటిన జ్ఞాపకం”
అని ముగుస్తుంది. ఈ కవితలో “వర్తమానాన్ని మోస్తూ” అన్న మాటలు ఎన్నో అర్థాలకు దారి తీసాయి. వర్తమానం అంటే వృత్తాంతం అనీ ఇప్పటి విషయం అనీ నిఘంటువు చెబుతోంది. ఇంతే కాక, “గడప దాటడం” అంటే వెనుదిరగని నిశ్చయంతో అన్వేషణకై పురోగమించడమే కనుక, ఈ ముగింపు ఎంతో కవితాత్మకంగా తోచి పద్యం మనసును ఆహ్లాదపరుస్తుంది.
కవిత్వంలో బహుళార్థకత ఊరికే ఉండదు. అదివ్వాల్సిన కిక్ అదిస్తుంది. కవయిత్రులు రాసిన ప్రేమ కవితల్లో స్పర్శకున్న ప్రాముఖ్యత ఇంక దేనికీ ఉండదు. మహెజబీన్, “స్పర్శ” అనే కవితలో:
“ఆకాశం అమృత(పు) గింజల్ని
రాల్చుతున్న ఆ చలిరాత్రి
నిన్ను కప్పుకొని పడుకున్నాను
ద్రవీభవిస్తున్న యవ్వనం
పరవశత్వాన్ని కానుకిచ్చింది”
అని మైమరపు కలిగించే వెన్నెల వానను, సెక్స్ సుఖాన్నీ చేసిన bold వర్ణన తెలుగులో నభూతో న భవిష్యతి! ప్రియుడి సాన్నిహిత్యంగూర్చీ అదిచ్చే స్వేచ్ఛాశక్తుల గూర్చీ ఇంగ్లిష్‌లో ఎమిలీ డికిన్‌సన్ (Emily Dickinson, 1830-1886) మొహమాటంతో కాస్త దాచిపెట్టినట్టుగా రాశారు. అప్పటికది సాహసమే. అడ్రియెన్ రిచ్ (Adrienne Rich, 1929-2012) ఇంకో రెండడుగులు ముందుకెళ్ళి తన ప్రేమ కవితల్లో పురుషసాన్నిహిత్యపు విలువని celebrate చేశారు. మహెజబీన్ కనబరిచిన ధైర్యసాహసాలు ఆధునికకాలానికి తగ్గట్టుగానే ఉన్నాయి.
మహెజబీన్ మరో కవితా సంపుటి తెస్తున్నారు. దానికోసం అర్రులు జాచి ఉంది తెలుగు పాఠకలోకం.
మంచి కవితలు మరీ అరుదేమీ కాదు. బాగా రాసే కవులున్నారు మనకు. రాసిన కవితలు రాశిలో తక్కువే ఉన్నా, వాసిలో విశిష్టమై ప్రతి వాక్యాన్ని ఆచి తూచి రాసి చదువరులకు గొప్ప అనుభూతి కలిగించే కవితల సంపుటి “ఆకురాలుకాలం”. “మకరంద స్రుతి ఝరులు” అన్న ఆదిశంకరుల వారి మాటలు తలపుకు తెచ్చే తీయని కవిత్వమీ “అకురాలుకాలం”. ఇది చదివిన వారికి మనసులో పాతబడి పండిన పాత కవిత్వపుటనుభూతుల ఆకులు రాలిపోయి, కొత్తగా గిలిగింతలను కలిగించే కవిత్వపు ఆకులు చిగురిస్తాయి. ఏ కవి మాత్రం ఇంతకన్నా ఎక్కువ సాధించగలడు? మహెజబీన్ మన నిజమైన స్త్రీవాద కవి. ఈ సంపుటిలో ఎంత కవిత్వముందో అంత ఆధునిక స్త్రీత్వమూ ఉంది.
For copies,
All the book stores in AP & Telangana
Published by The Anvikshiki Publishers

