స్నేహితుడా…
వేలూరిగారి నిష్క్రమణ నా వరకూ పెద్ద లోటే.
ఆయన పోయిన తరువాత వెల్లువెత్తిన నివాళి వ్యాసాలు చదివాక ఒక్క అక్షరం కూడా రాయాలనిపించలేదు. బాధ ఎలాగూ కోస్తూనే వుంటుంది.
నిన్ననే గంట సేపు మాట్లాడానని ఒకరూ, వారం క్రితం కథ గురించి మాట్లాడుకున్నాం అని ఇంకొకరూ, గత మూడు వారాలుగా సాహిత్య చర్చలు చేస్తున్నామని మరొకరూ, ఇలా ఆయనతో అనేకమందికున్న అతి దగ్గర స్నేహాలు చూసాక నేనొక అనామకుణ్ణి అన్న భావన కలిగింది.
గత మూడు, నాలుగేళ్ళుగా ఎవరూ ఆయన్ని పలకరించలేదు. ఆయన మాటల్లో చెప్పాలంటే — కన్నెత్తి చూడలేదు; పన్నెత్తి పలకరించలేదు. చచ్చినోడి కళ్ళు చారిడేసి అనేది ఇందుకేనేమో అనిపించింది.
వేలూరిని మొదటి సారి 2004 తానాలో కలిసాను. నా గురించి వివరం మాత్రం అడిగారు. అంతగా మాటల్లేవప్పుడు.
తరువాత ఈమాట ద్వారా పరిచయమయ్యాకా కాలక్రమేణా ఆయన మా కుటుంబానికి స్నేహితుడిగా మారడం వలనా, తరచూ మాట్లాడుకునే వాళ్ళం.
మాటలకంటే ఎక్కువ కొట్లాడుకునేవాళ్ళం. ఆ మాటల మధ్యలోనే తెలుగు సాహిత్యమూ, దాని వెనుకనున్న హిపోక్రసీ ఇవన్నీ సంభాషణల్లో భాగమయ్యేవి. ఈమాటకి రాయమని అంటే నాటకాల గురించీ, త్యాగరాజు మీద వ్యాసాలూ రాసాను. ఒకసారి మాటల్లో ఆయన ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అని తెలిసింది. నేనూ ఆంధ్రా యూనివర్సిటీ లోనే చదవడంతో మా కబుర్లకి మరింత మేత దొరికింది.
వేలూరికి కవిత్వం అంటే పిచ్చి. తిలక్ కవిత్వానికి వీరాభిమాని. వ్యక్తిగత పరిచయం కూడా వుండడం వలన, తిలక్‌తో ముచ్చట్లు చెప్పేవారు. తిలక్ పంచకట్టు దగ్గర్నుండి, పేకాట ప్రహసనం వరకూ ఎన్నో విషయాలు, ఆయన నోటే విని తీరాలి.
తిలక్ ఉండేది తణుకు. రోజూ ఏలూరు క్లబ్బుకి పేకాట ఆడ్డం కోసం మాంచి తెల్లటి బట్టలతో మిసమిసలాడుతూ పెళ్ళికొడుకులా తయారయ్యి వచ్చే తిలక్, పాపం ఏనాడూ పేకాటలో ఒక్క పైసా కూడా గెలవని విక్రమార్కుడని చెప్పుకొచ్చారు. ఆ ఏలూరు క్లబ్బు నేపథ్యంలో వేలూరి రాసిన కథే–క్లబ్బులో చెట్టు కథ.
“కవిత్వాన్నీ, వచనాన్నీ వేరు చేయలేని భాష తిలక్‌ది. తిలక్ కథల్లో ఎక్కడా కవిత్వపు ఛాయలు కనిపించవు. కవిత్వంలో వ్యర్థ పదజాలం కనిపించదు. కవిత్వాన్ని ఎలా చదవాలి? పద విన్యాసాన్ని ఎలా అవగతం చేసుకోవాలి? వంటి విషయాలమీద మనం శ్రద్ధ పెట్టలేదు. అందుకే మనకి సరైన కవిత్వ విమర్శ లేదు”– అన్నది వేలూరి వాదన.
ఎంతోమంది గొప్ప కవులూ, రచయితలతో ఆయనకి స్నేహాలు వుందేవి–తిలక్, జ్యేష్ట, పూసపాటి కృష్ణంరాజు, సి.ఆనందారామం…ఇలా కొల్లేటి చాంతాడంత లిస్టు ఉండేది. వారితో అనుభవాలూ, కబుర్లూ ఎంతో ఉత్సాహంగా చెప్పేవారు.
అతి చిన్న వయసులో ఏలూరులో ఒక పత్రిక నడిపి, అప్పట్లో జనసంఘ్ వారిని దుయ్యబడుతూ, వారికి ఊపిరి సలపనీయకుండా రాసి, చివరకి వారికే ఆ పత్రిక అమ్మడంవంటి చర్యలు చాలామందికి తెలీవు.
ఏలూరు సంగతులూ, వేల్చేరు గారితో పరిచయాలూ, అప్పట్లో సి.ఆనందారామం వెనుక కుర్రకారు ఎలా పడేవారు, ఇవన్నీ ఆయన నోటనే మనం వినాలి.
ఒరిస్సాలో కొంతకాలం ఉండడం వలన, సౌభాగ్య మిశ్రా స్నేహం ఉండేది. ‘మనకి తెలుగులో సౌభాగ్యలాంటి కవి లేడు,’ అనేవారు. సౌభాగ్య కవిత్వం మత్తులో పడి, “అవ్యయ” పేరున ఆయన తెలుగు, ఇంగ్లీష్ రెంటిలోనూ అనువాదాలు చేసారు. నేను దానికి బీటా రీడర్ని.
“అయ్యా, నాకు కవిత్వంలో అంత లోతైన అవగాహన లేదు…” అన్నా వినేవారు కాదు. దానికి తోడు ప్రతీ పద్యాన్నీ నాలుగైదుసార్లు రివ్యూలపై రివ్యూలు చేయడం అనే చాదస్తంలో మునిగిపోయేవారు.
మొత్తానికి అవ్యయ తెలుగు/ఇంగ్లీషు భాషల్లో కలిపి వచ్చింది.
ఆయన ఆశించినంత స్పందన రాలేదు.
అవ్యయ అయ్యాక, సౌభాగ్య రాసిన “ద్వాసుపర్ణ” అనువాదం చేస్తానంటే, నేను ఎంత వద్దని చెప్పినా వినలేదు. ‘నీ మొహం, నీకేం తెలీదు’ అని, ఓ ఆర్నెల్లు కష్టపడి పుస్తకం తెచ్చారు. అవ్యయ దారిలోనే అదీ వెళ్ళింది.
ఈ అనువాదాలకి బదులు ఆయన అనుభవాలూ, జ్ఞాపకాలూ రాసుంటే ఎంతో బాగుండేది. వేలూరి కొన్ని విషయాల్లో నా మాటలు సుతరామూ పట్టించుకోలేదు.
అవ్యయలో వేలూరి చేసిన కొన్ని ఇంగ్లీషు పద్యాలు Poetry Magazine లో వచ్చాయి.
వేలూరికి ఎంతోమంది ఆ తరం రచయితలతో పరిచయాలున్నాయి. అవన్నీ మెమాయిర్స్‌గా రాయమని చాలాసార్లు అడిగాను. అలాగేనంటూ జాప్యం చేసారు.
ఈలోగా వయసు మీదపడితే వచ్చే చిన్న చిన్న అలసటలూ ఇవన్నీ రాయనీయకుండా ఆపేసాయి.
వేలూరికి గాంధీ అంటే మహా ఇష్టం. నాకూ ఇష్టమే, అని నేనంటే–‘నీ మొహం నీకు గాంధీ గురించి ఏం తెలుసు?’ అని గదమాయించారు. నేనూ ఘర్షణపడ్డాను. ఆ తరువాత మెల్లగా ఒక విషయం చెబితే ఆశ్చర్యపోయాను. Hundred Volumes of Gandhi పుస్తకాల గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగారు. My Experiments with Truth, మరికొన్ని రచనలు తప్ప నేనెప్పుడూ వినలేదు.
అప్పుడేమీ చెప్పలేదు కానీ–అట్లాంటాలో వారింటికెళ్ళినపుడు మూడు బీరువాలనిండా ఉన్న ఆ వంద పుస్తకాలనీ చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ ఇండియానుండి షిప్పింగ్ చేయడానికి ఆర్నెల్లు పట్టిందని చెబుతూ, దాదాపు 1000 డాలర్లు ఖర్చుపెట్టానని చెబితే నోరెళ్ళబెట్టాను.
కొనడంవరకూ సరే, కనీసం ఒకటైనా చదివారా అంటే, దాదాపు అన్నీ చదివానని ఆయన చెబితే మతిపోయింది. “దటీజ్ వేలూరి!” — అని అర్థమయ్యింది.
వేలూరి దగ్గరున్న ఒక గొప్ప గుణం ఏవిటంటే, చేతికొచ్చిన ప్రతీ పుస్తకాన్ని భద్రంగా దాచడమే కాదు; చదువుతారు కూడా.
ఈమాట పత్రిక ద్వారా స్నేహం కలిసినా, మా ఇద్దరి మధ్యా విభేదాలూ, తగవులూ ఉన్నాయి. అంతకుమించి ఒకరిపట్ల మరొకరికి గౌరవం కూడా వుంది.
చిన్నప్పటినుండీ నాకు చిత్రలేఖనం అంటే ఆసక్తి. అప్పుడప్పుడు నేనూ రంగులూ, కుంచెలతో యుద్ధం చేస్తానని ఆయనకి లేటుగా తెలిసింది. మా వూరొచ్చినప్పుడు గోడ మీద పెయింటింగ్ చూసి–భలే వుంది ఎవరు వేసారని అడిగి, తాను తీసుకుపోతానన్నారు. నేనే వేసానంటే నిజంగా ఆయన నమ్మలేదు. వేళాకోళం అనుకున్నారు.
చిన్నప్పుడు నేను వేసిన పెయింటింగ్ చూపించాను. అట్లాంటా తిరిగి వెళ్ళాక ఆయన పికాసో పెయింటింగ్ పుస్తకాలు రెండు పంపించారు. తరువాత మాటల మధ్యలో తెలిసిందేవిటంటే–వేలూరి “చిత్రకళ” మీద కొన్ని కోర్సులు చేసానన్నారు. పెయింటింగ్స్ మీరూ వేసేవారా అనంటే, ‘వెయ్యను కానీ, ఏదైనా పెయింటింగ్ ఇస్తే–దాని గొప్పదనం ఏవిటీ, దాని విలువెంతో చెప్పగలను’ అన్నారు. Art Study, Art Evaluation మీద ఆయన కోర్సులు చేసారు.
ఆయన దగ్గరున్న పుస్తకాలు చూపించారు. నాకైతే మతిపోయింది–ఆయన ఆసక్తీ, అవగాహనా చూసి. ఆయన చెప్పిన వివరణలన్నీ వ్యాసంగా రాయచ్చు కదా అంటే, పికాసో పెయింటింగ్ గ్వెర్నికా మీద ఈమాటలో వ్యాసాలు రాసారు.
తెలుగువారు గర్వించదగ్గ చిత్రకారుడైన S.V.రామారావు భారతదేశం గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడని చెబుతూ, రామారావు పెయింటింగ్స్ న్యూయార్క్ మ్యూజియంలో ఉన్నాయని చెబితే ఆశ్చర్యపోయాను. చిత్రకళ ఎడల ఆయన ఆసక్తీ, అవగాహనా చాలామంది చిత్రకారులకే లేదు. నైరూప్య చిత్రకళ మీద వేలూరికున్న అవగాహన అపూర్వం.
ఒక పక్క, ఒరియా కవి సౌభాగ్య మిశ్రా కవిత్వాన్ని విశ్లేషించడమూ, మరొక పక్క యూరోపియన్ కాంటెంపరరీ ఆర్ట్ గురించి విశ్లేషణా ఇవన్నీ చూస్తే ఆయనకి సాహిత్యమూ, చిత్రకళలపట్ల ఎంత అభిమానముందో అర్థమయ్యింది.
ఇవొక్కటే కాదు — వేలూరికి ఫొటోగ్రఫీలో డిప్లమా వుంది. ఆయనొక గొప్ప ఫొటోగ్రఫర్. వేలూరి అనువాదం చేసిన సౌభాగ్య మిశ్రా కవిత్వం “అవ్యయ” కవర్ పేజీ మీదనున్న చిత్రం వేలూరి స్వయంగా తీసిందే.
ఆయన దగ్గర నాలుగైదు కెమేరాలున్నాయి. ఫొటో డెవలప్‌మెంట్ చేసే సామగ్రి అంతా ఉంది. ‘ఒకప్పుడు చేసేవాణ్ణి’ అని చెప్పారు.
అప్పుడే మాటల సందర్భంలో చెప్పారు–విశాఖపట్నంలో M.Sc చదువుతూండగా, తెలుగు సాహిత్యంలో తానొక విన్నూత్నమైన ప్రక్రీయ చేసానని. అది ఏవిటని ఆత్రంగా అడిగితే, “కావ్య దహనోత్సవం”. నాకేమీ అర్థం కాలేదు. వివరం అడిగితే–ఆంధ్రా యూనివర్శిటీలో M.Sc Nuclear Physics చదివే సమయంలో–ఆ ఆలోచన వచ్చిందనీ, అది విన్న బొమ్మకంటి శ్రీనివాసాచార్య, చేకూరి రామారావువంటి వారితో చెబితే, అందరూ ఆంధ్రా యూనివర్శిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసామనీ చెప్పారు.
ఈ విషయం మహాకవి శ్రీశ్రీకి ఉత్తరం రాస్తే తానూ వస్తాననీ, తన కవిత్వాన్నీ ఆ దహనోత్సవానికి అంకితం ఇస్తానని ఉత్తరం రాసారు.
కానీ–చివర్లో శ్రీశ్రీ ఆ దహనోత్సవానికి హాజరు కాలేక పోయి–Wish You the Cremation Success–అని టెలిగ్రాం పంపించారని చెప్పారు.
ఆ టెలిగ్రాం వేలూరి దాదాపు 40 ఏళ్ళు పైన శ్రద్ధగా దాచిపెట్టి ఉంచారు. అట్లాంటాలో వారింటికి వెళినపుడు నాకు ఆ ప్రహసనం అంతా చెప్పి, ఆ టెలిగ్రాం కూడా చూపించారు.
ఫొటో తీస్తానంటే, ససేమిరా ఒప్పుకోలేదు. నన్ను గట్టిగా తిట్టారు కూడా. నేనిక రెట్టించలేదు.
చివరకి కావ్యదహనోత్సవం పుస్తకం అచ్చుకు వెళ్ళబోయేముందు, ఆ టెలిగ్రాం ఫోటో తీసి పంపుతానని అన్నారు. ఫొటో పంపలేదు. తీరా చూస్తే, ఆ ఫొటో ఎక్కడో పోయిందట. ప్రతీసారీ ఆయన నా మీద ఎగిరితే, ఈసారి ఆయన మీద అరిచే అవకాశం నాకొచ్చింది. ఎత్తెత్తి కాలు ఎంగిలాకు మీద వేసినట్లు చేసారు–అని దెబ్బలాడాను నేను.
చివరకి పుస్తకం వచ్చింది — ఆ టెలిగ్రాం లేకుండా.
ఆ పుస్తకం చూసి చిన్నపిల్లాడిలా మురిసిపోయారు వేలూరి.
ఒక్కోసారి వేలూరికి చాదస్తం కూడా ఎక్కువ.
సుమారుగా 1975-80ల మధ్య అనుకుంటా, శ్రీశ్రీ అమెరికా వచ్చారు. అప్పుడు NPR Radio Station వారితో మాట్లాడి శ్రీశ్రీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసారు. అది రికార్డ్ అయ్యి, రేడియోలో ప్రసారం కూడా అయ్యింది. ఆ ఇంటర్వ్యూ క్యాసెట్ వేలూరికి ఇస్తే, ఊళ్ళు మారేటప్పుడు ఆ క్యాసెట్ పోగొట్టుకున్నారు. తరువాత రేడియో స్టేషన్ వారిని సంప్రదించినా లాభం లేకుండా పోయింది.
వేలూరి సాహిత్య ప్రయాణంలో వచ్చిన పుస్తకాలు—“ఆ నేల, ఆ నీరు, ఆ గాలి”, “అవ్యయ”, “ద్వాసుపర్ణా”, “కావ్యదహనోత్సవం”. వేలూరి సాహిత్య ప్రయాణంలో నాకూ చిన్న పాత్ర దక్కింది.
వేలూరి రాసిన వివిధ వ్యాసాలు పుస్తకం చెయ్యాలనుకున్నాం కానీ, అసంగతంగానే మిగిలిపోయింది.
పైన రాసిన అన్ని ప్రహసనాల్లోనూ మేమిద్దరం తిట్టుకున్నాం, కోప్పడ్డాం, విసుక్కున్నాం, మెచ్చుకున్నాం, నవ్వుకున్నాం– వెరశి కలిసి ప్రయాణం చేసాం.
తెలుగు సాహిత్య చరిత్రలో ఈమాట పత్రిక సంపాదకుడిగా వేలూరి పాత్ర వెలకట్టలేనిది.
అమెరికాలో నివసించే ఎంతోమంది తెలుగు రచయితలకి స్ఫూర్తి, అవగాహన, ప్రేరణ కల్పించి ఆయన చేసిన సాహిత్య ప్రతిపాదన–డయాస్పోరా సాహిత్యం.
కథాసాహిత్యంలో లోతైన అవగాహన వుంది. ఒక కథనెలా చూడాలి? మంచి కథని ఎప్పుడు చెప్పగలం? ఇలాంటి అంశాలు క్షుణ్ణంగా వివరించగలరు.
“మనమందరం డయాస్పోరా రచయితలం. మనం రాసే కథలూ, అనుభవాలూ ఇవన్నీ ఉత్తర అమెరికాలో డయాస్పోరా సాహిత్యం”–అన్న స్పూర్తీ, అవగాహనా కల్పించి, ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది నిస్సందేహంగా వేలూరి వారే!
Miss You, My Dearest Friend, Veluri!