‘ఏమంటివి ఏమంటివి’ అంటన్నాడండి మా ఎంటీవోడు. సటుక్కున లెగిసానండి. ఆ గొంతు ఇంటే బాబయ్యా నాకు పేనం లేచొస్తాదండి. ఎవురెన్ని సెప్పినా ఎంటీవోడు ఎంటీవోడేనండి. మా అయ్యకీ పేనవండి. నాకూ పేణవండి. ఓ చెణం ఏడున్నానో పోల్సుకోలే(క) పోయానండి. సుట్టూ సూసానండి. మా తోటోళ్ళు ముగ్గురూ గుర్రు గర్రు అంటనారండి. పోను మోగుతునే ఉందండి. గుండే గుబీమందండి. మావూళ్ళో మా వోళ్ళకి ఎవరికేటయిందో?! పోనెత్తానండయ్య! ఎవులో ఆడమనిషండి. ఏడుపు ఏడుపండి… ఠారెత్తిపోయాను. ఏటయిందే ఏటయిందే అంటాను. అట్నుంచి ఏడుపు పెరుగుద్ది! మాట లేదు. పేనం సాలొచ్చిందండి. గట్టిగా కసిరేసానండి. ఏవో మాటలండి. మన బాస కాదు. రాంగునంబరని ఎట్టేసానండి.
సిన్న కునుకండి.
మళ్ళీ ఎంటీవోడండి. అదే నంబరండి. అదే ఏడుపండి… జోసపన్నను లేపానండి. సేతిలో ఎట్టి మాటాడమన్నానండి. మాటాడేరండి… ‘నిద్దర్లేపిసినావు. రాంగ నంబరని…’ కసిరేసి పోను కట్టేసేరండి.
సెప్పొద్దండీ… మనసదోలా అయిపోయిందండి. ఎవులో ఆడకూతురు. అమ్మో, పెల్లావోఁ, కూతురో, ఎవులో మరి. ఏ కస్టమొచ్చిందో. ఏదో పెద్ద దెబ్బేననిపించిందండి. ఏ తల్లికేటయిందో. ఏ బిడ్డని ఎవరేంజేసారో.
నిద్దరట్టలేదండి. మా వూరంతా మతికొచ్చిందండయ్య. మావోల్లంతా ‘ఏరా సత్తీ ఏంజేత్తనావురా’ అంటనారండి. ‘ఎప్పుడొత్తావురా’ అంటనారండి. మా పుంతల్లో తోపుల్లో గేదెలెక్కి పద్దేలు పాడేవోళ్ళమయ్య, పొలాల్లో పని సేత్తావుంటే ఆ గాలేటండి బాబయ్యా ఏం సుకమండి బాబయ్యా… ఈడా సల్లగానే వుండేదంట బాబయ్యా… సెట్లయీ కొట్టేసారంటండి…
తిమ్మాపురమండయ్య మాది. అరె! తవఁరికి మావూరు తెల్దాండి! అయ్య! ఏలేరు లేదాండయ్యా… మాలచ్చిం తల్లి… ఎప్పుడూ పారతానే ఉండేదండి. ఈ మద్దినె ఎగువని రిజరాయరు కట్టేరండి. నీరు తగ్గిపోనాదండి. ఆ ఒడ్డునో వూరు ఈ వొడ్డునో వూరు… తల్లి మా లచ్మి… సెరో సంకనా సెరోబిడ్డనీ ఏసుకున్నట్టుండేదండి. ఎంత మంచిగుంటారయ్యా మాయేపోల్లు! ఏటన్నా ఏటప్పా అంటా మడిసి కాపడీసరికి పలకరింపులయ్య! ఏ టయానికి ఆ బగమంతుడు ఏటి రాసిపెడతాడో ఏటో! అయ్యన్నీ వొగ్గేసుకుని ఆడనుండి ఈ బెంగలూరు వట్టుకొచ్చాడయ్య! మా మునసబు గోరి సిన్నోడు లేరయ్య. ఆరు దేవుడండయ్య! నేనే ఆరెంట బడ్డానండి! ఆయన గోరికి సెక్కూరిటీ ఏపారమంటండి. ‘కాపలాలు కాయాలిరా సత్తీ కాస్తావా’ అన్నారండి. ‘పట్నాలంట బాగా వున్నావోళ్ళు వుంటార్రా! డబ్బుంటాది… నగానట్రా వుంటాది… కాపలా కావాల. పల్లెలంట ఏటుంటదిరా… కాపలా కాయటానికి సత్రెడ్డీ. పనీపాటా ఏటీ వుండదు. డబ్బే డబ్బు’ అన్నారండి. బాబ్బాబూ అంటూ దణ్ణాలెట్టేసానండి. మా వూర్లమ్మట మా తోటోళ్ళంతా సబ్బండ జాతులోల్లూ అయిదరాబాదు దారి పట్టేసారండి…. ఇడ్లీలంటండి… అమ్ముతారంటండి… అన్నేసి ఎవులు తింటారండయ్య? ఊళ్ళోవోళ్ళు ఎటకారం సేసీవోరండి. ఇడ్లీలు అంటనారు గాని అక్కడ పెల్లాల్ని… ఎవులు కాడో… సీ! సీ! నరుడి నాలిక్కి అడ్డేటుందండయ్య…! ఏటోనండి నానూ ఆ దోవే అనుకున్నాను గానండయ్య… ఏటో రాత… సిన్నదయినా పెద్దదైనా ఏపారం అంటే కాంతోకూంతో మదుపు ఉండాలండి… అప్పు సెయ్యాల… నావల్ల కాదనీసి వొగ్గీసీనండి. కాపలా పనంటే కాలుమీద కాలేసుకు కుర్సీలో కూకోడం అన్నారండి మా మునిసాబుగోరి సిన్నోడు. ఇలాగొచ్చేసానండి! ఆ బాబు నాకు సొక్కా పేంటూ బూట్లూ బెల్టూ ఏసి ‘ఈడ కాపలా ఉండు మావాఁ’ అన్నారండి. ఎంతన్నా మావోల్లే గందండి… ఆరి యబిమానం ఏరండి! అద్దంలో సూసుకుంటే దొరబిడ్డ లాగున్నానండి!
మా అపార్టెంటు మాంచి రద్దీ రోడ్డంట ఉందయ్య! అవట్రింగు రోడ్డంటారంటండి. ఈ పేటని మారతల్లి అంటారండి. అక్కడ పదేనంతస్తుల అపార్టుమెంట్లండి మాయి… దానికి కాపలా అండి! కాపలా వోళ్ళమే వుంటామండి ఓ ఏబై మందిమి. ‘ఒహప్పుడీ మారతల్లి మీ తిమ్మాపురం లాంటిదే’ అంటాడండి జోసఫన్న. ‘సఁ’ అన్నానండి. సానా మంచోరండి ఆయనగోరు. మిలట్రీలో పంజేసారంటండి! అన్ని బాసలూ ఆయన గోరికి వొచ్చండి. సానా సెప్పారండి. ఇయ్యన్నీ ఒహప్పుడు పొలాలంటండి. బెంగలూరు సుట్టూ వూళ్ళు, సెరువులు, పొలాలుండేయంటండి! అయ్యన్నీ పోయి పెదపేద్ద బిల్డింగులు లెగిసాయండి! బెంగలూరు ఎన్నూళ్ళో మింగేసిందంటాడండి మా జోసఫన్న. అసలీ జనాలేటండయ్య! లోకాన ఇంతమంది జనాలున్నారా అనిపిత్తాదయ్య. ఎన్ని కార్లండయ్యా! రింగ్రోడ్డులో పగలల్లా కార్లు ఒకదానెనక ఒకటి నెమ్మదిగా ఎల్తాంటే తస్సదియ్య మా ఏలేటికి వరద వచ్చినట్టుంటాదయ్య! సర్వీసు రోడ్డంటారంటండి! ఆడ మా గేటు కాడ డూటీ ఏస్తే కుర్సీ ఏసుకుని కూకుంటానండి… సూత్తానండయ్య! మా జోసఫన్న సెపుతాడండి దీన్ని… అదేటండి… సాప్టేరు హబ్బంటారంటండి.
మా రోడ్డెంబడే బిడ్జి కేసి చూస్తే సెపితే నమ్మరు బాబయ్యా అన్నీ కొట్లేనండి. మా వూల్లో నాను పుట్టక మునుపు కొట్టే లేదంటండి. కిర్లంపూడి సంతకి పోయి వారానికో పాలి సామాన్లు తెచ్చుకునీవోరంటండి. నాను పుట్టి బుద్దెరిగేనాటికి మూడు కొట్లుండేయండి. పొద్దుటేల కటార్రాజులు పెసరట్లేసి అమ్మేవోడండి. పొలాల్లోకి వట్టుకెల్లి తినీవోరంటండి బామ్మర్లు. బాబయ్యా ఈ సర్వీసు రోడ్డెంట బిడ్జీ వొరకూ కొట్లన్నీ మూడొంతులు తినేయేనండి. ఆటి పేర్లన్నీ నా నోరు తిరగదయ్య! ఆటిలో మా పెసరట్టు దుకాణం కూడా ఉండండి! పునుకులండి… యబ్బ… మా రాజులు కొట్లో పునుకులంటే… ఆటి ముందు తీసికట్టే గానండి… ఈ దుకాణం వోడు అయ్యీ అమ్ముతాడండోయ్. తెలుగోడేనంటండి. సర్లెండి… ఇంక మిగిలినయ్యి వోలు మొత్తం ఇండియాలో దొరికేయన్నీ ఇక్కడ అమ్ముతారండి. మా అన్న సెప్పాడండి ‘ఇది మినీ ఇండియా సత్తిరెడ్డీ రాజస్తానోల్లు, నేపాలోల్లు, బెంగాలోల్లు, బీహారోల్లు. ఒరియావోల్లు… యూపీవోల్లు… ఈడ మనీ వుంటే సాలు!… అన్నీ దొరుకుతాయి’ ఆయన గోరు ఇంకో మాట సెప్పారండి ‘సత్తిరెడ్డీ! ఈడ బీదాబిక్కీ తింటారు. పెద్దపెద్ద ఒటేళ్ళుంటాయి. ఆడ బాగా వున్నావోల్లు తింటారు. కాఫీ వంద రూపాయలో ఇంకా ఎక్కువో ఉంటాది’… సెప్పొద్దండీ… కాపీ సుక్కలకి వంద రూపాయలంటండి… నేను నోరెల్లబెట్టేసేనండి! కరీంనగరంటండి… అక్కడనుండి… మనోడే… తెలుగోడొకాయన… ఆయనగోరూ రెడ్డేనండి, నన్ను ఎస్సురెడ్డంటారండి ఆయనగోరిని కెరెడ్డి అంటారండి. ఆయనైతే జోసపన్న మాట నమ్మలేదండి. ఏమోనండి! ఎంత సెట్టుకి అంత గాలన్నారు గందండి! ఓ పాలి ఆ కాపీ తాగాలన్నాం జోసపన్నతో. ‘ఈడ దొరికేదే ఆడా దొరుకుద్ది పిచ్చోల్లారా!’
మా అపార్టుమెంటు ఎనకతట్టునండి… ఈతలు కొట్టేటందుకో సెరువుందండి… దాన్ని క్లీనింగులు సేసేపని నాకు నేర్పారండి. దాని పక్కనే నాటకాలూ అయ్యీ ఏత్తారంట… ఎప్పుడూ సూడలేదండయ్య… అంపీ దేయోటరో ఏదో అంటారండి… అదుందండి. ఆ కొసాన ఓ మేడ ఉందండి… పై దాంట్లో పార్టీలూ అయ్యీ సేసుకుంటారండి… సినిమాలూ సూత్తారండి… జిమ్మంటండి… బస్కీలు అయ్యీ తీత్తారు గాదండి అట్టాంటిదేనండి… ఆ మేడ కిందనండి మా కాపలా వోళ్ళకి సిన్న మండువా ఉందండి. దాన్లోనే బట్టలు మార్సుకోటం. అందరికీ తలో అరా బీరువాల్లో. నాతోబాటు ఓ నలుగురం రాత్రేళ అక్కడే తొంగోటానికి గది ఉండండి. అందులోనే వండుకుంటామండి. అన్నిసోట్లా ఉండదంటండి… మా మనసబుగోరి సిన్నోడు ఏర్పాటండి… మావోడు గందండి… ఉండదండీ నామీద? ఉంటాదండి… అక్కడే ఉంటానికి బానేవుంది గాని బాబయ్యా ఒక్కోపాలి పార్టీలుంటాయండి. కొందరైతే ఇంతంత డబ్బాలు… సౌండు బాక్సులంటండి… యెట్టి. అందులోంచి పాటలో ఏటో… ఆఁ మూజిక్కు… చెవులు హోరెత్తి పోతాదయ్య! అక్కడ డూటీ ఏత్తాడండి మా జోసపన్న.
అయ్యాల పారిటీ అండి. రాత్రేల ఉండే మా నలుగురం కాక జోసఫన్నా మరో ఇద్దరండి… ఆడోళ్ళు తాగటం మాయంట లేదండి. కెరెడ్డి ఆళ్ళేపు ఉందంటండి. ఏటోనండి… కొత్తలో అంతా యింతగా ఉండేదండి… ఇప్పుడిప్పుడు అలవాటయిందండి. మనం పని సేసేకాడ ఆడోల్లంటే తల్లులతో సమానమండి. తిన్నింటి వాసాలు లెక్కెట్టకూడదు కదండి! దానాదీనా పెద్దోళ్ళ గురించి తప్పుడు మాటలు నాకు నచ్చేయి కాదండి… ఆ తలంపే వచ్చేది కాదండి… ఇదేటి బాబయ్యా… ఇక్కడ? స! సెప్పటానికి సిగ్గేత్తాదండి! అందరూ కార్లూ గట్రా వున్నోళ్ళు పెద్దోరు… బట్టలు… సెప్పొద్దండి… సూసేతలికే కాంత తప్పుడు సూపు వొచ్చేత్తాదండి… నార్తోళ్ళు మనేపోళ్ళలాగ పద్దతిగా ఉండరంటండి… ఆరిలో ఆరు… అదేటండి… మాల్ మాల్ అంటా ఆడోరి గురించి మాటాడుకుంటారంటండి. జోసఫన్న సెప్పాడండి… ‘ఉరే సత్తిరెడ్డీ, అటేపెళ్తే నీలాటోళ్ళూ అట్టాగే ఆడోళ్ళ గురించి అనుకుంటార్రా’… ఏటోనండి నాకు నమ్మ బుద్ది కాలేదండి.
ఏటనుకోకండి బాబయ్యా నానూ ఇప్పుడు సెడిపోయానండి… మొదట్లో తప్పనీసి దూరంగా కూకుండీ వోడినండి… ఇప్పుడు పద్దతిగా లేనండి. పెళ్ళాలను వొగ్గేసుకు వొచ్చినాం కదండీ… అందరూ మాతాడుతుంటే నేనూ ఆరిలో సేరిపోయానండి… పారిటీలో ఆడోళ్ళు… ఆళ్ళ డాన్సులూ… స… ఈ మాట సెప్పకూడదండి…
అందరూ ఎల్లిపోయాక మాకోసం కొన్ని సీసాలూ, తిండీ వొగ్గేసారండి. అంతా సద్ది, క్లీను సేసి కూసున్నామండి. జోసఫన్న… ‘పంచ్’ అంటండి… ఓ బాల్చీలో అన్నీ కలిపేత్తాడండి… బ్రాందీ, రమ్ము ఇంకా ఏటోటో పేర్లు తెలవండి. మా పప్పలోళ్ళ తోపులో సారా కోసీవోరండి. అదే పరమాన్నం లాగుండేదండి. ఇప్పుడది లేదండి… వూళ్ళోకి ఆ కొట్టూ వచ్చేసిందండి… సీకులు నవల్తా ఒ కార్టరు ఏస్తే మా మజాగా ఉండేదండి. డబ్బులు తక్కవుంటే పొట్లాలండి.
జోసఫన్న మా పద్దతైనాడండి… డూటీలో ఉన్నోళ్ళకి ప్లేట్లో ఎట్టి గ్లాసుల్లో పోసి పంపాడండి. అప్పుడు మేం మొదలెట్టాం. పార్టీ ఆడాల్ల గురించి… వొద్దండి… తప్పండి. ముఖంలోకి సూసి ఆడోరితో మాట్టాడ కూడదనీసి జోసఫన్న సెప్పీవోడండి. అలాగే సేసీ వోళ్ళమండి… ఆ టయంలో ఎవులూ మమ్మల్ని పట్టించుకోరు కదండి… ఆల్లని సూసేవోల్లమండి… మాయందమ్మట వాలకాలు కట్టీవోళ్ళలో నాకు సానా పేరుందండి… నాకో జతగాడుండే వోడండి… ఆడు అడగటం నేను అందుకోటం… నాలుగు సుక్కలు పడితే తస్సాదియ్యా, ఇంక నా వాలకం మొదలండి… ఆయేల అందుకున్నానండి… నవ్వీనవ్వీ సచ్చారండి మా జట్టు. ఇందీ వోళ్ళు కూడా సేరారండి.
‘మర్నాడు పొద్దుటే లెగాల డూటీ… బుడ్డా లెగుస్తాడు పొద్దటే’ అనేసి జోసఫన్న లెగ్గొట్టేడండి… అందరికీ ఆ బుడ్డాగోరి పేరు సెపితే సాలు నిద్దరే నిద్దర! బుడ్డా అంటే ముసిలోరని తెలిసీ దాకా నాకు అదోలాగ ఉండేదండి.
ఈ పోను దెబ్బతో నాకు మాత్రం నిద్దరట్టనేదండి. అందరూ బుడ్డా అనేటాయన మా కాని మడిసండి.
బాగా ముసిలాడండి! తెల్లజుబ్బా షరాయీ ఏసుకుంటారండి. మాలాటోల్ల ముందు ఆయనగోరి పెతాపం సూడాలండయ్య! రేత్రంతా నిద్దరోతాడో లేదో… తెల్లారగట్ట లెగిసి పనోళ్ళనీ, మా కాపలా వోళ్ళనీ లేపేస్తాడండి. ఆకాడ మొక్కకి నీళ్ళు లేవు… ఈడ నీల్లొగ్గీసారు… ఏపుకు తింటాడండి. కచ్చలో కందులు ఏపిస్తాడండి. అందరం కలిసి కుల్లబొడిసెయ్యాలండి… అట్టాంటోడు… అవుతే మా జోసపన్న ఇంకోమాట సెప్పారండి.
‘సత్రెడ్డిగోరూ! బుడ్డా ఈడకొచ్చి ఏడేళ్ళు. ఆయనింటికి ఎవులూ ఎల్లరు. ఎల్లినా రానీడు. ఎవులింటికీ ఆయనగోరు ఎల్లరు. ఒక్కడే ఉంటాడు. ఆడోల్లని సూసినా కుర్రోళ్ళని సూసినా మండిపోతాడు. పళ్ళు పటపట కొరుకుతాడు. కొత్తలో సానామంది మాటాడించారు. అబ్బే… ఏదో సెప్పేసి ఎల్లిపోయీవోడు. ఎవులికీ ఆయన గురించి ఏటీ తెల్దు. ఇంక మనలాటి పనోళ్ళతోటే మాటామంతీ. అందరినీ ఏదో ఒకటి పట్టుకుని తిడతాడు. పాపం ఏటో మరాయనగోరి కత… సెప్తానండి’.
అవుతే నైటు డూటీవోల్లు ఇంకో మాట సెప్పేరండి. రేత్తిల్లు తిరుగతాడంటండి. ఈత సెరువుకాడ కూసుని ఏడ్డం సూసామంటారండి. ఏయో పాటలయీ పాడతారంటండి. ఆ మాటన్నాక నేనూ నైడ్డూటీలో ఆరిని పరకాయించి కనిపెట్టానండి. ‘నమ్మకురా ఇల్లాలు పిల్లలూ బొమ్మలురా జీవా తోలూ బొమ్మలురా జీవా’ అంటా పాడతన్నారండి. అంతే బాబయ్యా నాకు గొప్ప ఉసారొచ్చేసిందయ్య! మన ఎంటీవోడి పాట గదండి. మా అయ్య పాడేవోడండి… ఆయనెనకే నానూ పాడేవోడినండి. దగ్గరకెల్లానండి… ఆరి కల్లమ్మట నీళ్ళండి. జాలేసిందండి. ఎంటనే ఎల్లి ‘బాబయ్యా తవఁరు తెలుగోరా’ అని అడిగేనండి. టకాల్న లెగిసి అందుకున్నాడు బాబయ్యా ఏటేటో ఇంగిలీసులో తిట్టాడయ్య! ఉసూరు మన్నాదండి. ఎంతన్నా పెద్దోల్లు పెద్దోల్లే గందండయ్య. తొలీత మనోడే గందా అనిపిత్తాది గదండి. ఇంకోపాలి ఇంకోపాలి మన బాసలో మాటాడేనయ్య. నామీద కంప్లీంటు సేసారంట. జోసపన్న సెప్పాడండి. ఆయన గోరితో మాటాడమోకు అన్నారండి. అదేం మడిసో బాబయ్యా!
ఆయనగోరు తలపుకొచ్చీసరికి దెబ్బకి నిద్దరట్టేసిందండి.
తెల్లారి లెగిసానండి. అందర్నీ నిలబెట్టి డిల్లు జేయించారండయ్య! మా జోసపన్నే. డూటీలేసారండయ్య. అన్ని సోట్లా కెమేరాలండయ్య. అయ్యి దొంగలకోసం అంటారండయ్యా! అవుతే మా కాపలావోళ్ళం ఏదో మూల కూకుని కునికిపాట్లు పడితే ఆటిలో తెలిసిపోద్దండి. పట్టేత్తారండి. బాత్రూంలో ఎంత సేపున్నామో లెక్కేత్తారంటండయ్య. ముసిలాయనగోరికి మూలసెంకంటండి. అది లెగిత్తే నంటండి… ఇంకేటుంది… ఆ కెమేరాలకాడే దొబ్బించుకుంటారండయ్య! ఈ లెక్కలన్నీ ఏసి మామీద పడిపోతాడండి…సఁ! మాట తిన్నగా రాదయ్యా!
అయ్యేల బుడ్డా గోరు కిందకి దిగలేదండి. మేమంతా అమ్మయ్య అనుకున్నామండి.
నాకు ఆరోజు గేటు కాడ డూటీ ఏసారండి. వచ్చీ కారుకీ, పోయీ కారుకీ గేటుగుమ్మం తెరాలి గదండయ్య! నా పని అది. ఇంకోడు సదుంకున్నాడు కాంత. పోనట్టుకుని ఎల్తాడండయ్య. కార్లోవోళ్ళు ఏదో నంబరు సెపుతారండయ్… అది ఆడు పోనులో సూసుకుంటాడండి. నన్ను గేటు లేపమంటాడండి.
పదయింది. లోపలున్న కార్లన్నీ ఎల్లిపోయాయయ్య!
పోనాన్జేసేనండి. మల్లీ ఎంటీవోడండి! ఏడుపండి. అడిగితే ఆడకూతురు. ఏదో బాస. జోసఫన్న అన్నీ సూసుకుని వచ్చారండయ్య! ఆయన్తో కెరెడ్డి వొచ్చాడు. ఏటి జోసఫన్నా సూడూ అన్నానండి. ఇన్నారండి. కెరెడ్డీ ఇన్నారండి.
‘సత్తిరెడ్డీ ఇది రాంగునెంబరేగాని ఎవులికో ఏదో పెద్ద కస్టమే వచ్చినట్టుండాది’.
కెరెడ్డి అన్నాదానికి జోసపన్నా ‘అవునన్నా’ అన్నారయ్య. ‘ఎస్రెడ్డీ మావూరు యాదొస్తాంది’ అన్నాడాయన. కెరెడ్డి గోరు సానా మంచోరు. పిల్లలకి సదివించాలంటండి. ఇట్టాంటి పేద్ద బిల్డింగుల్లో ఆళ్ళు ఉండాలంటండి. అలా ఏదో సెపతానే ఉంటారండి. ట్రాఫిక్కోళ్ళు కూడా మద్దిమద్దిన వొచ్చి మాతో కూకుంటారయ్య! మాతో ఏదో మాతాడతానే ఉంటారండి. ఆరి సేతికి పోను ఇచ్చానండి.
పోను జేసేరండి. అదే ఏడుపండి. మా సెక్కూరిటీ వోల్లందరికీ ఇచ్చేనండి. ఒక్కరికీ ఆ బాస తెల్లేదండి. ఒకరు అన్నారండి… ‘ఏటి ఇన్నేసి బాసలు గోలా’… అవుతే బాబయ్యా ఆ ఏడుపూ ఆ బాసా ఇన్నావోరందరికీ అదేటోగాని ఆళ్ళ ఊరు మతికొచ్చిందండి… ఎక్కడెక్కడోళ్ళమో అందరం మాం వొగ్గేసి వొచ్చిన వూళ్ళూ అమ్మలూ అయ్యలూ… పెల్లాలూ పిల్లలూ… జట్టుగాల్లూ… ఆ గాలీ… అందరం ఆ కబుర్లేనండి. ఒక్కోరిది ఒక్కో కతండి… జోసపన్న అన్నాడండి… ‘ఎక్కడ పుట్టిన సెట్టు అక్కడ పెరుగుద్ది… ఇంకోకాడికి తీసుకెల్లినా దాన్ని వేర్లతో సహా అట్టుకెళ్ళాలి… నేకపోతే ఇదుగో మీలాగే పెళ్ళాం బిడ్డల్నొగ్గేసి… ఏ సుకమూ సంతోసమూ లేకుండా… ఏటో ఈ రోజులు…’
సాయంకాలం దాకా వాకబు సేస్తానే ఉన్నామండి. తిండి దుకానాల కాడ జనాలకి ఇనిపించామండి… సిత్రంగా పోంజేత్తే ఎత్తీదండి… ఏడుపు… ఏదోబాస… సాయంకాలం నాలుగ్గంటలనుండి పోను ఎత్తటంలేదండి… పోను ఆగిపోయిందంట! ఎన్నో తూర్లు సేసామండి… అబ్బే ఎత్తలేదు. డూటీ దిగినోల్లం అందరం ఓ కాడ కూకున్నాం. అందరికీ ఏటయుంటాది… ఎవులయుంటారు అన్నదే యావ. సివరాకరికి ఎవులో అన్నారు. ‘ఏడిసేడిసి సచ్చిపోయిందో ఏటో!’
ఎక్కడో వున్న మడిసి… ఏటయిందో తెల్దు. సచ్చిపోయిందనుకోటానికి కట్టంగా తోసిందండి.
సాయంకాలం అయిపోయిందండి.
బుడ్డా సచ్చిపోయాడని గోల గోల. పోలీసులు వచ్చేరయ్య! తలుపులు తెరిసారండి. శవం కాపడ్డదంటండి. మంచంమీదనే పడుకున్నోడు పడుకున్నట్టే పోయాడండి. అందరం ఎల్లి సూసామయ్య! ఇల్లంతా పోలీసోల్లు మా అపార్టుమెంటోల్లు ఎతికారండయ్య! ఆయన సుట్టాలూ పక్కాలూ ఎవులి ఆచూకీ లేదంటండి. నేను సస్తే ఆస్పత్రికి ఇచ్చీమని రాసేరంటండి. ఆ కాయితమేదో కనపడ్డాదంటండి.
పోస్టుమార్టం సేసారంటండి. పోలీసులు శవాన్ని ఆస్పత్రికి ఇచ్చారంటండి మర్నాడు.
ఆడ పోంజేసినావిడ సచ్చిందో బతికుందో తెల్దు. ఎవులికోసం ఏడిసిందో తెల్దు. ఆయమ్మ కళ్ళకి కాపడలేదు.
ఈడ ఈ ముసిలాయన్ని అందరూ సూత్తానే వున్నామండి. ఆరూ తిడుతూనే వుండీవోరండి. మేవూఁ తిట్టుకుంటానే ఉండీవోరిమండి. అవుతే మాత్రం… మడిసి పోతే మడుసులం గదండి… బుడ్డాకి ఏ కస్టం వచ్చిందో ఏటో! పెళ్ళాం బిడ్డల్ని ఒగ్గేసుకున్నాడని పెద్దోళ్ళు సెప్పుకున్నారు. మావూఁ అదే సెప్పుకున్నామయ్య!
అయ్యేలంతా మతోయిందయ్య నాకు ! మా తిమ్మాపరం పోదారనిపించిందయ్య! మా మనసబుగోరి సిన్నోడికి పోను సేసానండి. నసుగుతానే సెప్పానండి.
అయ్య! మీరు నమ్మరయ్య! ‘పిచ్చోడా’ అంటూ ఆ సిన్నోడు నవ్వే నవ్వు! నవ్వే నవ్వు! ఎందుకో నాకు తెల్లేదండయ్య! మీకైనా తెలిసిందాండయ్యా!
(మా అపార్టుమెంట్లలో కాపలా కాసే రైతన్నలకి)
