కుమ్నో ఫిలాంగ్*, షిల్లాంగ్

1.

ఆకాశాన్ని తాకే
ఆకు పచ్చని కొండలా
నిలుచున్న నీవు
చల్లని మేఘంలా
స్పృశిస్తాను నేను
తెల్లని పూవులతో
పులకరించే మేను

ఆకుల మీదుగా
రాలిపడే వానచినుకులు
లోయలో మృదువుగా
వినిపించే అలౌకిక ధ్వనులు



2

తెల్లని మేఘంలా లేచి వస్తాను
లోయలో పుష్పించిన నీ కోసం
చిన్ని పక్షులను వెంటబెట్టుకొని
సున్నితంగా వానచినుకులతో
నీ నుదుట ముద్దాడుతాను

3.



మేఘమై లేచిపోనా
నీడనై వెంటరానా

చేపనై తేలిపోనా
పూవునై ఊగిపోనా

ఎదురు చూడని మోహమై
వెదురు పొదల గానమై

చినుకునై రాలిపడనా

అడుగుజాడలు లేని
అడవిలో లీనమై –

మేఘమై లేచిపోనా
నీడనై వెంటరానా

(*ఫిలాంగ్ = ఎలా ఉన్నావు / How are you — స్థానిక ఖాసీ భాషలో )


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...