ఇట్టి ప్రేమలు…

ఎవరెవరినో ప్రేమిస్తావు
ఎవరెవరినో మోహిస్తావు
కనీసం కామిస్తావు
కారునల్లని మేఘమై కౌగలిస్తావు

నిజానికి ఎదుట ఉన్నది ఎవరో
నీకూ తెలియదు, వారికే తెలియనట్లే

తొలిసారి నీకు నువ్వు
దేహంగా తెలిశావు చూశావా
అప్పుడు విప్పుకొంది ఒక దుఃఖపు వానతెర
కాలం ఇన్నాళ్ళుగా తడుపుతోంది నిన్ను

పూవులా కనులు విప్పి లోకాన్ని కన్నవాడివి
మొక్కలా చెట్టులా ఎదిగి
చివరికి శిలాజంలా మిగులుతావు

ప్రేమలూ మోహాలూ వాంఛలూ
నీపై కుదురులేకుండా రంగుల్ని చల్లి వెళ్ళాక
చలించని రాయివై కూర్చుంటావు

ఏమీ ఫరవాలేదు
రాతిపై తేలుతున్న ఆకాశమే
రాయి లోపల కూడా తేలుతుందని
ఊరికే తెలిస్తే చాలు

ఆకాశమే ఆకాశాన్ని
ప్రేమించిందని, మోహించిందని, కామించిందని
కనుగొంటే చాలు

ఊహ ముగిసినట్టు
కల ముగిసినట్టు
కథ కూడా ముగుస్తుంది


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...