సెలయేటి ఒడ్డున

1. ఒక సెలయేటికి..

అల్లిబిల్లిగా నన్ను తాకిన
చల్లని ఈ సెలయేటి స్పర్శలో
కళ్ళన్నీ తెరుచుకోగా
ఒళ్ళు మరిచి మాయమై

సెలయేటి అడుగున
మిల మిలా మెరుస్తూ
ఏటి పాటకి శ్రుతి కలుపుతున్న
తోటి గులకరాళ్ళ మధ్య
తేటగా నా హృదయం!

(నిసర్గధామ లో కావేరీ నదికి..)

2.ఏటి ఒడ్డున

కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున

ఎక్కడనుంచి వస్తోంది?
ఎక్కడకి వెళుతోంది?
వెనక్కెందుకు ప్రవహించదు?

దట్టమౌతున్న చీకట్లలో
అన్వేషణ పూర్తవకుండానే
నిష్క్రమణ

సెలయేరు ఇంకా
ప్రవహిస్తూనే ఉంది!

3.ఎగుడు దిగుళ్ళు

పెదాల గులకరాళ్ళపై
గల గలా పారుతున్న
చిరునవ్వుల వాగులు

కాస్తమీదకెళ్ళి చూస్తే
కళ్ళల్లోంచి జారుతున్న
కన్నీటి జలపాతాలు

దారిపొడుగునా
ఎగుడు దిగుళ్ళే!

4.తల కావేరీ

ముందు ముందు
ఎన్ని కల్మషాల్ని
కలుపుకుంటుందో
తెలీదు గానీ

ఇక్కడ మాత్రం
ఈ నది
పురిటి బిడ్డలా
ఎంత స్వచ్ఛం!

(తల కావేరీ : కావేరీ జన్మ స్థలం)


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...