కొత్త కథకుల కష్టాలు

బోర్ కొట్టడం అంటే ఏమిటి అని చిన్నప్పుడు ఓ వ్యాసం చదివిన గుర్తు. అంతా గుర్తులేదు గానీ ఓ ముఖ్య సూత్రం మాత్రం గుర్తుంది. నీ గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ బోరుకొట్టే అవకాశం ఉంది అని. సూత్రాలు చెప్పడం వాళ్ళ పని కాబట్టి ఫలితాన్నాశించకుండా సూత్రకారులు అలా చెప్పేస్తుంటారు, మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే పంథాలో నేను “కొత్త కథకులు” అని పేరు పెట్టి నా అనుభవాల్ని మొహమాటం లేకుండా జెనరలైజ్ చేసేసి, నా సూత్రాలు నేను చెప్తాను .. విని ఆచరించి తరించండి.

మొన్నీ మధ్య కొద్దో గొప్పో పేరున్న ఓ రచయితని కలిస్తే అన్నాడు “నేనెక్కువగా చదవను… నా సొంత ఆలోచనలు ఎక్కడ కల్తీ అయిపోయి, నా సృజనాత్మకత ఎక్కడ తగ్గిపోతుందోనని భయం” అని. ఇదేదో మన బద్ధకాన్ని బానే సూత్రీకరించింది కదా అని నేను కూడా “శభాష్ నేనూ అంతే” అనేశాను. అంచేత నా మాటల్ని అనవసరంగా నిజంగా సాహిత్యాన్ని చర్చించే పుస్తకాల్లోనూ, సిధ్ధాంత రాద్ధాంతాల్లోనూ వెతక్కండి. ఇవి పూర్తిగా నికార్సయిన మా ఇంటి పెరట్లో మొలిచిన సిధ్ధాంతాలు.

ఆదిలోనే హంస పాదు. మొదలు పెట్టడమే సొంతకథలు చెపితే ఒప్పించలేరు అని మొదలు పెట్టాం. మరి ఎవరి కథలు చెప్పాల్టా? మా ఆవిడ నాకు చారు కాచడం ఎలా నేర్పిందో, నేను EAMCET కోసం ఎంత కష్ట పడ్డానో, మా అమ్మాయికి పింక్ కలర్ అంటే ఎంత ఇష్టమో లాంటి విషయాల్ని ఎడా పెడా రాసి కథలనేయవచ్చు. నిజానికి బోర్ కొట్టకుండా కూడా ఇలాంటి కథలు రాయచ్చు అంటానిక్కూడా కొన్ని దాఖలాలు కనపడతాయి. కానీ అవి ఒక పరిధిని దాటి, ఓ పది రోజుల తర్వాత కూడా పాఠకుడు గుర్తుంచుకోవాలంటే మాత్రం, అవి రచయిత ని దాటి ఎంతో కొంత ప్రపంచాన్ని స్పృశించాలి.

కథలు నిస్సందేహంగా రచయిత జీవితంలోనించీ, అనుభవాల్లోంచీ, అవగాహనల్లోంచే వస్తాయి. కానీ అవి రచయిత జీవితాన్ని దాటి అతగాడి (ఆవిడ) కథగా కాకుండా ‘ప్రపంచం’ కథ కాగలిగి నప్పుడే రచయితకి మెచ్యూరిటీ వచ్చినట్టు. ఇది నా మొట్ట మొదటి పరీక్ష కొత్త కథకులకి. “నేను నన్ను దాటి కథ చెప్తున్నానా లేదా” అన్నది తనకి తాను నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న.

అట్లా రచయితని దాటి ముందుకు రాలేక పోయిన కథల మీద నాకు గౌరవం లేదు. ఏ సీరియస్ పాఠకుడికీ ఉంటుందని నేననుకోను. అయితే పడగ్గది కథలకున్న పాపులారిటీ మనని తికమక పెట్టొచ్చు. అవి ఎందుకలా “exception” అనే దాన్ని మనం సమరం గారి నడిగి తెలుసుకోవాలి గానీ సాహిత్య పరంగా సమాధానం తెలుసు కోలేమనుకుంటా. పడగ్గదుల్లోంచి కూడా ప్రపంచానికి అవసరమైన కథలు రావచ్చనే విషయాన్ని కూడా గుర్తించి ముందుకు కదుల్దాం.

రచయితని కేంద్రంగా తీసుకుంటే తనచుట్టూ ఒక గీత, తనూ తన కుటుంబం చుట్టూ ఒక గీతా, తన వీథినంతా కలుపుకుని ఒక గీతా… ఇలా దాటుకుంటూ పోయి సర్వమానవాళినీ కలుపుకునే దాకా అనేక వృత్తాల్ని ఊహించుకుంటే … రచయిత తన దగ్గర్నించి ఎన్ని గీతలు దాట గలిగాడూ అన్నదాన్ని బట్టి అతణ్ణి అంచనా వేయవచ్చు.

మరో రకం గీతలు కూడా ఉంటాయి. సైద్ధాంతిక పరమైనవి. అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండాల్సినవి ఇవ్వే. సైద్ధాంతిక నిబద్ధత దృఢంగా ఉండి వాచ్యంగా చెప్పుకున్న, రచనల్లో ప్రస్ఫుటంగా చొప్పించి రాసిన రచయితల గురించి అది వారి బలంగా కొందరూ, బలహీనతగా కొందరూ వాదించడం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ వ్యాసాన్ని వాడను గానీ, ఓ సిద్ధాంతం చుట్టూ అల్లే కథల్లో ఉండే కత్తిమీద సాము గురించి మాత్రం ముచ్చటిస్తాను.

సిద్ధాంతాలతో ఓ పెద్ద చిక్కుంది.. జీవితాల్లో ఉండేంత “Flexibility” కానీ “Dynamism” కానీ సిద్ధాంతాలలో ఉండదు. సాధారణంగా ఇలాంటి కథలు సామాన్య పాఠకులనీ, సిద్ధాంతాన్ని మోసే పండితులనీ ఎవరినీ తృప్తి పరచ లేవు. రెంటికీ చెడ్డ రేవడు అవటం అంటే ఇదే. సిద్ద్దాంతాన్ని (అదెలాంటిదయినా సరే) పాఠంలా చదివేసి కథలు రాస్తే అవి రక్తి కట్టవు. బాగా తలపండిన వాళ్ళూ, సాహిత్యాన్నీ, ఫిలాసఫీనీ, సమాజాన్నీ అన్నింటినీ అవుపోసన పట్టిన వాళ్ళూ తప్ప ఓ ఖచ్చితమయిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే కథని అందర్నీ ఒప్పిస్తూ రాయలేరని నా అభిప్రాయం. ఇలాటి సందర్భాల్లో నా ఉద్దేశ్య ప్రకారం, మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నాం, ఎలాంటి సమాజంలో ఉన్నాం అనే తర్కాన్ని ముందే వేసేసుకుని కథ మొదలు పెట్టడం మంచిది. కథ ఎప్పుడూ మనం ప్రస్తుతం ఉన్న సమాజాన్నే చూపెట్టాలి. పాత్రలు ఆదర్శాలు మాట్లాడినా ప్రవర్తనలో నిజ ప్రపంచాన్ని చూపెట్టడం మంచిది. మొత్తం కథంతా అయ్యేటప్పటికి, మనం ఏ సంస్కారాన్ని ప్రతిపాదించాం అన్నది ముఖ్యం.

ఇలాంటి కథల్లో జరిగే పెద్ద పొరబాటు సిద్ధాంతాలని నమ్ముకున్న గొప్ప ఆదర్శ పాత్రల్ని సృష్టించడం. ఆ పాత్రలు చేసే ప్రతి పనిని జాగ్రత్త గా బేరీజు వేసుకుంటూ సిధ్దాంత ప్రకారం నడుస్తున్నాయా లేదా అంటూ తెగ తాపత్ర య పడిపోవడం. ఒక వేళ నిజంగానే అంత నిక్కచ్చి పాత్రని తయారు చేసినా…. చివరికి అది పూర్తి అసహజంగా తయారయి ఎవరూ నమ్మరు. నిజ జీవితంలో ఎంత గొప్ప ఆదర్శ మూర్తులయినా, ఎన్ని గొప్ప సిద్ధాంతాలు ప్రచారం చేసిన వాళ్ళయినా, ఎక్కడో ఒక చోట తేలిపోతారు. అది మహా మహుల సంగతే. గాంధీ, సుందరయ్య, మదర్ థెరెసా లు మనకి ప్రతి సందులోనూ కనపడరు. పాత్రల్ని వాటి బలాలతో పాటు బలహీనతలతో సహా సృష్టించాలి. అలా చేస్తే “పాత్రకి హిపోక్రసీ లేదా” అనచ్చు. హిపోక్రసీ ఎంత చెడ్డదయినా… అదీ విశ్వవ్యాప్త మయినది… సహజమయినది… నా దృష్టిలో, పాత్రకి కొంత హిపోక్రసీ పని కట్టుకుని జత చేయడం ద్వారా నిజానికి దానికి ప్రాణం పోయవచ్చు. ఇది అతి సులువయిన టెక్నిక్.

ఉదాహరణకి, ఓ పరమ నాస్తికుడి కథ చెప్తున్నామను కుందాం. ఏదో ఓ సీన్ లో తొంభై ఏళ్ళ వాళ్ళమ్మ వాడికి ప్రసాదం పెడితే వాడు కళ్ళకద్దుకుని తిన్నట్టు రాసామనుకోండి. అప్పుడా పాత్ర చెడిపోయినట్టా? నా దృష్టిలో మాత్రం అలా చేయడం ద్వారా ఆ పాత్ర విలువ పెరుగుతుందే గాని తగ్గదు. జీవితపు చరమాంకంలో ఉన్న వాళ్ళమ్మకి అర్జంటుగా నాస్తికత్వాన్ని బోధిస్తే కథ సర్వ నాశనమయిపోతుంది. సైద్ధాంతిక నిబద్ధత కథకి నిర్దేశించి, పాత్రల్ని క్షమించేయటం తెలివయిన పని.

ఇలాంటిదే ఇంకో ప్రమాదం, సామాజిక సమస్యల గురించి రాయడం. ఆ మధ్యలో వరకట్నం, నిరుద్యోగం లాంటి సామాజిక సమస్యల మీద ‘సామాజిక స్పృహ’ ఉన్న సినిమాలు వరస పెట్టి వచ్చేవి. కొన్ని బానే ఉండేవి కూడా. కాపోతే, తలనెప్పి ఏమిటంటే, వర కట్నం మీద తీసిన సినిమాలో, అందరికీ ఈ సమస్యే ఉంటుంది. అన్ని పాత్రలూ, అన్ని వేళలా దీని గురించే మాట్లాడు కుంటూ ఉంటాయి. ప్రధాన పాత్ర ఇంట్లో, ఇంటి పక్క,, ఇంటి కిందా, ఇంటి పైనా… అందరూ ఇదే సమస్యతో బాధ పడుతుంటారు. ఆ తర్వాత నిరుద్యోగం సినిమా తీస్తే మళ్ళీ అదే వరస, ప్రపంచం అంతా ఆ సమస్య తోటే బాధ పడుతుంటుంది. ఇలా రాసే కథలు కూడా రక్తి కట్టవు. నిజ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా నిరుద్యోగులూ, కట్నంలేక పెళ్ళి కాని ఆడ పిల్లలూ కూడా చిరంజీవి సినిమా వస్తే వదలకుండా చూస్తారు.

బాలన్స్ లేని సామాజిక సమస్యల కథలు, కథగానూ చెడతాయీ, ఆ సమస్య పట్ల సానుభూతినీ, ఆలోచననీ రగిలించటం అటుంచి, దాన్ని పెద్ద జోక్ లా తయారు చేస్తాయి. అది ఏ కథయినా సరే, నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఓ వాతావరణాన్ని సృష్టించి, అందులోంచే దేన్నయినా చర్చించాలి. (స్పెషల్ టెక్నిక్స్… ఏదో ఊహా ప్రపంచాన్ని సృష్టించి రాసే కథలు కూడా ఉంటాయి, వాటి గురించి కన్వీనియెంట్ గా మర్చేపోతున్నాను ఈ వ్యాసంలో).

ఉదాహరణకి, నిరుద్యోగి కథని సినిమా హాల్లోనే మొదలెట్టొచ్చు. అక్కడో చిన్న విషయానికే ఎవరితోనో గొడవ పడ్డట్టు చూపించొచ్చు. అంతే, ఇంత తిక్క వెధవేమిట్రా వీడు అని పాఠకుడు బుర్ర గోక్కునే లోపు, వాడికి ఉద్యోగం లేదనీ… పాపం మంచోడే గానీ, ఆ కోపం ఇలా తయారయిందనీ చెపితే పాత్ర మీద సానుభూతి పెరుగుతుంది. పాపం చిరంజీవి సినిమా కూడా ఎంజాయ్ చెయ్య లేక పోతున్నాడే అని. ఆ సానుభూతి మీద మిగతా కథంతా కూడా చెప్పేసి హమ్మయ్య అనుకో వచ్చు. ఆలా కాకుండా వాడు ఎంతసేపూ, ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ చుట్టూ, ఇంటర్వ్యూల చుట్టూ, చిరిగి పోయిన చెప్పులతో తిరుగుతున్నట్టూ, సంపాయించట్లేదని వాళ్ళ నాన్న, వదినా సూటి పోటి మాటలంటున్నట్టూ… కథ మొదలెడితే, రెండో పేరా తర్వాత ముందుకు చదవరు. ఇవ్వన్నీ చాల రౌటీన్ సినిమా కష్టాల్లే అని పెదవి విరిచేస్తారు.

కొత్తరచయితలకి ఉండే ఇంకో భయం… పొలిటికల్ కరక్ట్ నెస్. ఇలా రాయొచ్చో లేదో నని. ఉదా హరణలు… భారత స్వాతంత్ర్య సమరం గురించిన ఏ చిన్న సీన్ లో నయినా సరే, ఓ హిందువూ, ఓ ముస్లిం ఉండి తీరాలి. ఉండ్అటమే కాదు, హిందువు చక్కగా నేను హిందువుని అని తెలిసేలాగా కాషాయం కట్టో, బొట్టు పెట్టుకునో ఉండాలి. ముస్లిం పిల్లి గడ్డం పెంచి, లుంగీ కట్టి నేను ముస్లిం నోచ్ అని చాటింపు వేస్తూ ‘షర్మా భాయ్ ఆ జెండా జర అందుకో’ అన్నాక ఇద్దరూ కలిసి సదరు పోరాటానికి వెళ్ళాలి. అమెరికన్ సినిమాలో ఏ క్రయిసిస్ విషయమయినా సరే, ఓ తెల్ల హీరో ఉంటే ఓ నల్ల వాడు సహాయం చేయాల్సిందే. లేదా అందుకు రివర్స్. ఇవి పొలిటికల్ కంపల్షన్స్ తో వచ్చే సమస్యలు. అలాగే, మన నిజ జీవితంలో చౌదరీ, రెడ్డీ, శర్మా, గౌడ్ అంతా ఉంటారు. కథల్లో కి వచ్చేసరికి “శ్రీకాంత్”, “మాధవ్”, “సుధాకర్” మాత్రమే కనపడతారు ఎందుకని? భయం! పొరపాటున హీరో చౌదరీ, విలన్ రెడ్డీ అయ్యారా చచ్చామే! ఆ తర్వాత రచయిత “అక్కడ మీరే రెండు కులాల పేర్లు పెట్టుకున్నా పర్లేదు” అని ఎంత మొత్తు కున్నా వినే నాథుడుండడు.

ఇది పాపులర్ భయమే కానీ, రచయిత అనే వాడు, ఈ పొలిటికల్ కరక్ట్ నెస్ నించి ఎంత త్వరగా బయట పడగలిగితే అంత మంచిది. కథంతా చదివే టప్పటికి రచయిత ప్రతిపాదించే సంస్కారం గనక ఎలాంటి కల్మషం లేనిదయితే, ఈ పొలిటికల్ కరక్ట్ నెస్ అనేది పూర్తిగా అసంబద్ధమయినది అవుతుంది. ఈ విషయం మీద నమ్మకం లేనప్పుడే ఆ పొలిటికల్ కరక్ట్ నెస్ గురించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

సొంత జీవితంలో కనపడే వ్యక్తుల గురించీ, సంఘటనల గురించీ రాసే టప్పుడు వచ్చే మరో ప్రమాదం, ఆ వ్యక్తులు ఈ కథలు చదివి నొచ్చుకుంటారేమో నని. ఉదాహరణకి, మా క్లాస్ మేట్ అమ్మాయి ఏదో ఫ్రెండ్ ని కదా అని వాళ్ళ ఆయన పెట్టిన కష్టాల గురించి నాతో ఓ సాయంత్రం చెప్పుకుందనుకోండి. నేను ఆ మర్నాడు మక్కికి మక్కీ దాన్ని కథ చేశానను కోండి. అప్పుడెలా ఉంటుంది? మళ్ళీ వాళ్ళకి నా మొహం చూపించాలా?

కథలంటే మనది కానీ, ఎదురుకుండా వాళ్ళది కానీ డైరీ కాదు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనల్ని కదిలించే విషయం కనిపించినప్పుడు దానికి ఓ సార్వ జనీనమయిన మూల సూత్రం ఒక టుంటుంది, దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోవటం మళ్ళీ మన సంస్కారం మీదా, అవగాహనల మీదా, సైద్ధాంతిక నిబద్ధతల మీదా ఆధార పడి ఉంటుంది… తప్పు లేదు. ముందు అంత దూరం వెళ్ళాలి. అక్కణ్ణించి కథ అల్లాలి. అక్కడిదాకా వెళితే, అప్పుడు అది స్పెసిఫిక్ గా నా గురించే రాశాడు అని ఆ ఫ్రెండ్ వాళ్ళాయన గుర్తుపట్టలేడు… అదీ మాయ!

ఉదాహరణకి. కట్నం గురించిన కథలూ, సినిమాలూ ఇన్ని వస్తున్నాయి కదా, జెనరల్ గా వరకట్నం గురించే ఇంకో కథ రాసినా, మన చుట్టూ ఉన్న మిత్రుల్లో కట్నం తీసుకున్న వాళ్ళు కూడా తన గురించి రాశా మేమో అని అనుకోరు. అలాగని, “ఫలానా సోనీ హోం థియేటర్ ఇస్తానన్నాడు మీ నాన్న, చివరికి ఈ పానసోనిక్ టు ఇన్ వన్ ఇచ్చాడు” అని రాశా మను కోండి… కొంచెం కష్టం.

ఇంకో పెద్ద కష్టం ఉంది కొత్త కథకులకి. డైలాగ్స్ రాసే టప్పుడు. ఓ పెద్ద వాదమో, తర్క మో జరుగుతోందనుకోండి.

“……” అంది సుధ

“…..” అన్నాడు రాఘవ్

“……” అంది సుధ

“…..” అన్నాడు రాఘవ్

“……” అంది సుధ

“…..” అన్నాడు రాఘవ్

“……” అంది సుధ

“…..” అన్నాడు రాఘవ్

..

ఇలా రాసుకుంటూ పోతే చదివే వాడికి పిచ్చెక్కుతుంది. చిన్న విషయంలా తోస్తుంది గానీ, అనుభవంలో గానీ తెలీదు ఇలాంటి సీన్ రాయాలంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. చలం కథల్లో చాలా సంభాషణలు ఉంటాయి. కొన్ని పేజీ లకి పేజీలు. కానీ ఎక్కడా ఇలా ఎవరు మాట్లాడుతున్నారో చెప్పే అవసరం రాదు. పక్క గదిలో ఇద్దరు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి డైలాగ్ ముందో చివరో “నేను సుధని మాట్లాడు తున్నా” అంటూ చేర్చక పోయినా ఎవరు మాట్లాడుతున్నారో తెలిసి పోతుంది… వాళ్ళ గొంతులు మనకి ముందే తెలుసు కాబట్టి. చలం లాంటి రచయిత చేతిలో పాత్రల గొంతు కూడా మనకి వినపడుతుంది. అదీ సాధించాల్సింది, ఈ సమస్యనించి బయట పడ్డానికి.

“ఏవిరా రంగా పనికిరాలా”

“చలిజెరం దొరా”

“నీకు వారానికో జబ్బొస్తుందేరా? నిజమే చెప్తున్నావా?”

“నిజమే చెప్తుండు దొరా… రాత్రి నేనే జెరం మాత్ర కొని తెచ్చి యేసిన ”

“నువ్వూ చేరావ్ వాడి వంత పాడ డానికి. తాగి ఇంటిక్కూడా రావట్లేదని ఏడుస్తున్నావని అడిగా…. ఇప్పుడు వాణ్ణి వెనకేసు కొస్తావేమే?”

“రాత్రి నిజ్జంగనే బుఖారొచ్చి ఇంట్ల పండిండు దొరా. క్రితం వారం చేతిల పైసలున్నప్పుడు మస్తు జల్సా జేసిండు, ఇప్పుడు మంచంల పడిండు”

“ఛల్ తీయ్! వారం నాటి ముచ్చట తీస్తవ్? గా మల్లేస్ గాడు కల్లు తాపిచ్చినడు తాగిన… సొంత పైసలు దొబ్బ పెట్టినానా… దీని మాటలు నమ్మొద్దు దొరా”

“ఇగ జాల్లే నా ముందరే కొట్లాటలా?… పని జూడండి”

ఈ సంభాషణలో ఎక్కడా ఎవరు మాట్లాడుతున్నారో వాచ్యంగా చెప్పలేదు. మూడూ మూడు రకాల గొంతులు. వాటి మాండలికంలో తేడా ఉంది. ఒకళ్ళ నొకళ్ళు సంబోధించడంలో తేడా ఉంది. ఇంకా ఓ గొంతును గుర్తు పట్టడానికి చాలా మార్గాలు ఉంటాయి. పాత్రని సృష్టించే టప్పుడే ఆ గొంతుని కూడా పరిచయం చేస్తే, హాయిగా కథంతా ఇలాంటి సంభాషణలు రాయటం సులువయి పోతుంది.

ఏతా వాతా తేలేది ఏమిటంటే…. కథలు వ్యక్తులనీ, సంఘటనల్నీ, సిద్ధాంతాలనీ దాటి… ఉమ్మడిగా ఓ సూత్రాన్ని, ఓ సంస్కారాన్ని, ఓ ఆలోచనని రేపాలి. అప్పుడే సమస్యా ఉండదు. జాగ్రత్తగా గమనిస్తే అన్ని సమస్యలకీ ఇదే విరుగుడు.

(ఈ వ్యాసంలో ప్రతి పాదించినవి అన్నీ నా స్వానుభవంలో నాకు ఎదురయిన అవుతున్న సమస్యలు, వాటికి నాకు నేను చెప్పుకుంటున్న జవాబులు. నాలుగు కథలు రాసి ప్రపంచానికి కథలెలా రాయాలో చెప్పే ప్రయత్నం అని అనుకోకండి…. నాకంత సీన్ లేదు)

అక్కిరాజు భట్టిప్రోలు

రచయిత అక్కిరాజు భట్టిప్రోలు గురించి: జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదు లో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతారు. ...