నాక్కొంచెం నమ్మకమివ్వు

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి రెండు నిమిషాలయ్యుంటుంది.కానీ ఈ రెండు నిమిషాల్లో ఈ ప్లాట్‌ఫాం మీద పది రెట్లు జనాలు పెరిగారు. బహుశా మరో నిమిషంలో ట్రైన్‌వస్తుంది. సెల్‌ ఫోన్‌పైకి తీసి టైం చూశాను, కరెక్ట్‌ మరొక్క నిమిషం.

పేపర్‌ముడుస్తూ తెలిసిన మొహాలకోసం చూశాను. ప్రశాంత్‌, రామారావు మెట్లెక్కి వస్తూ కనపడ్డారు. వాళ్ళు నేరుగా నేనున్న దగ్గరికే వస్తారని తెలుసు నాకు.

కొంచెం దూరంలో మా సర్దార్జీ ఫ్రెండ్స్‌కనపడ్డారు. అప్రయత్నంగా గాలిలో చెయ్యి ఊపాను. వెంటనే వాళ్ళనించి జవాబు. నాకు కొంచెం దూరంలో తెల్లమ్మాయి ట్రేసీ.
“హాయ్‌ట్రేసీ” అన్నాను. ఆమె పుస్తకంలోంచి తలెత్తి “హాయ్‌సత్యా” అనేసి, ఓ ప్రశాంతమైన నవ్వు పడేసి తిరిగి పుస్తకంలోకి వెళ్ళిపోయింది. ఈ ట్రేసీ లాంటి ఫ్రెండ్స్‌నాకు ఈ ప్లాట్‌ఫాం మీద ఓ పాతికమంది దాకా ఉంటారు. ఒకే కంపార్మ్టెంట్లో ఒకే చోట కూర్చున్నప్పుడు, లేదా నుంచున్నప్పుడు మాత్రం మాట్లాడుకుంటాం. ఆ స్నేహం అంతకు మించదు. కానీ ఓ రోజు ప్లాట్ఫాం మీద కనపడకపోతే వెంటనే తెలిసిపోతుంది, ఆలోచించకుండా ఉండలేం. అమెరికాలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది ఇదే. పెద్దగా పరిచయం లేకున్నా హాయిగా ఓ నవ్వు, ఆప్యాయంగా ఓ “హాయ్‌”, ఎంతో హాయిగా ఉంటుంది. మధు మాత్రం ఇవ్వన్నీ దొంగ వేషాలు, నువ్వు మాత్రమే పడేది వీటికి అంటాడు. నాకు రుచించదు. ఇంతవరకూ దీనివల్ల నే కోల్పోయిందేమిటోతను మిగుల్చుకున్నదేమిటో నాకు తెలీదు.

సుమారు రెండు గంటల ప్రయాణం. మెటుచెన్‌నించి NJ Transit లో నువార్క్‌ దాకా వెళ్ళి, అక్కణ్ణించి PATH ట్రెయిన్లోకి మారి WTC (World Trade Center) న్యూ యార్క్‌దాకా వెళ్ళాలి. ఈ రెండు గంటల తర్వాత ఓ ఎనిమిది గంటలు ఏ ప్రశాంతతా దొరకని ఉద్యోగం. మళ్ళీ తిరిగి మరో రెండుగంటల తిరుగు ప్రయాణం. ఈ పరుగో పరుగో బతుకులో ఈ ప్లాట్ఫారాలమీదా రైల్లోనూ మాత్రమే గుర్తొచ్చేది, ఇంకా చుట్టూ ప్రపంచం ఉందనీ, అందరూ ఇలాగే పరిగెడుతున్నారనీను. అందరూ అలా హాయ్‌చెప్పడంతో నా అస్థిత్వాన్ని అందరూ గుర్తించినట్టు, ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అదికూడా లేకపోతే బతుకు మరింత యాంత్రికమవుతుందనిపిస్తుంది.

అలా ఆలోచిస్తూనే అన్ని “హాయిల్నీ” నవ్వుల్నీ ఏరుకుని లెక్కపెట్టుకునే లోగానే ట్రెయిన్‌వస్తూ కనపడింది. ఆ ట్రెయిన్‌రావడం, ఆగడం, డోర్లు తెరుచుకోవడం, దిగాల్సిన వాళ్ళు దిగడం అంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది. నా ముందున్న వాళ్ళు ట్రెయిన్‌ఎక్కడం మొదలు పెట్టారు. నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది నా హాయిల లెక్కలో ఓ ముఖ్యమైన హాయి తక్కువయిందని. అక్రమ్‌ ఇంతవరకూ కనపళ్ళేదు. ట్రెయిన్‌మిస్సవుతున్నాడా? ఆలోచిస్తూ ఎక్కాను. ఇంకా కొన్ని ఖాళీ సీట్లు ఉన్నాయి. సాధారణంగా ట్రెయిన్‌ఇక్కడే ఫుల్‌అవుతుంది. నే వెళ్ళి కిటికీ పక్కనే కూర్చున్నాను. ఓ అరనిమిషం తర్వాత ప్రశాంత్‌, రామారావు వచ్చి ముందర కూర్చున్నారు.

ట్రెయిన్‌బయలు దేరింది. ప్లాట్‌ఫాం మీదకి వచ్చే మెట్లమీద వేగంగా ఎక్కి వస్తూ, కదిలిపోతున్న ట్రెయిన్ని చూస్తూ ఒక్కసారిగా సడెన్‌బ్రేక్‌వేసి, దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. అదో సరదాగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ మొహాల్లో ఓ నిరాశ, ఓ చిరాకు ఓ కెరటంలా వచ్చి, అర సెకనులో మళ్ళీ అంతా నెమ్మదిస్తుంది. ఆ భావాలకి రంగు, వయసు, లింగ భేదాలుండవు. ప్రతిరోజూ ఉండే తంతే ఇది. కనీసం పది మందిని చూస్తాను ఈ మెట్లమీద రోజూ, కదిలిపోతున్న రైల్లోంచి. తర్వాతి ట్రెయిన్‌ మరో 12 నిమిషాలకి గాని రాదు. ఆ మొహాల్లో కూడా అక్రమ్‌ కనపళ్ళేదు. కొంచెమాగి ఇతగాడికి ఫోన్‌చెయ్యాలి. పదిగంటాలకల్లా నా ఆఫీస్‌కి వచ్చి కలుస్తానన్నాడు. ఇప్పటిదాకా బయల్దేరకపోతే … రాడేమో, వచ్చి కలవడేమో?

అక్రమ్‌ పని చేసేది WTC టవర్‌లో. తనో మానేజ్మెంట్‌కన్సల్టింగ్‌ కంపెనీలో పనిచేస్తాడు. బోల్డెన్ని కంపెనీలలో పరిచయాలుండటంతో కాంట్త్ల్రాకూ గట్రా చూపించగల సమర్థుడు. నామట్టుకు నాకైతే అక్రంతో కూర్చుని సాయంత్రాలు మాట్లాడ్డం ఇష్టం. అక్రమ్‌ నాకెప్పుడూ మిస్టరీయే. ఎంతో ఖచ్చితమైన అభిప్రాయాలున్నా, ఏ మాత్రం ఆవేశపడకుండా, రాజీ పడకుండా మాట్లాడగల్గటం ఎలానో నాకెప్పుడూ అర్థం కాదు.

ఇక్కడి పాకిస్తానీ గాంగ్‌కీ దేశీ గాంగ్‌కీ మధ్య మే మిద్దరం లింకు లాంటి వాళ్ళం. మా స్నేహం పెరిగిన కొద్దీ మ రెండు గ్రూపులూ కలవటం ఎక్కువయింది. స్నేహాలు కూడా ఎక్కువయ్యాయి. క్రికెట్‌మ్యాచ్లున్నప్పుడయితే మొత్తం మిత్రబృందమంతా అక్రమ్‌ పేరే జపిస్తుంటుంది. అపార్మ్టెంటుల్లో బతికే మాకెవ్వరికీ శాటిలైట్‌ డిష్లు పెట్టుకునే అవకాశం లేదు. అదుంటేతప్పా అమెరికాలో క్రికెట్‌చూసే భాగ్యం ఉండదు. పాపం, అక్రమ్‌ ఇంటిమీద క్రికెట్‌చూడ్డం కోసం ఎంతమంది పడ్డా విసుక్కోడు. కానీ నిజం చెప్పాలి. ఇండియా, పాకిస్తాన్‌మాచ్‌ఉన్నప్పుడయితే నాకూ అక్రం కీ కూడా పరీక్షే! మా ఒళ్ళూ, మా బుర్రే అదుపు తప్పుతుంటుంది, ఇంక అక్రమ్‌ స్నేహితులవంకా, నా స్నేహితులవంకా భయం భయంగా చూస్తుంటాం. నా అనుమానం, ఎవరికివారే మిగతా వాళ్ళందర్నీ అలాగే చూస్తుంటారేమోనని! అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఏమీ జరగలేదు. నాతో పాటే వస్తాడనుకున్నాను ఇవ్వాళ. ఇంతవరకూ కనపడని వాడు పదింటికల్లా నా ఆఫీస్‌కి రాగలడా అనేది అనుమానమే. మొత్తానికి రైలు WTC కి మామూలు సమయానికే చేరింది. అక్రమ్‌ ఆఫీస్‌ WTC లోనే 83వ అంతస్తులో. నా ఆఫీసుకి జచఈ లోంచి బయటి వెళ్ళి, ఓ రెండు బ్లాకులు నడవాల్సి వుంటుంది. బ్రీఫ్కేస్‌చేత్తో పట్టుకుని ఎస్కలేటర్ల మీదుగా ఎక్కి బయటకు నడిచాను.

ఆఫీస్‌చేరి కొంచెం సేపు మెయిల్‌చెక్‌చేసి, తర్వాత సగం రాసిన డాక్యుమెంట్‌ తీసి ఎడిట్‌చెయ్యడం మొదలు పెట్టాను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. రాబర్ట్‌ నా అఫీస్‌తలుపు తెరిచి… రొప్పుకుంటూ అన్నాడు… WTC మీద ఏక్సిడెంట్‌ అయ్యింది తెలుసా అని. ఏదో పెద్ద జెట్‌వచ్చి టవర్ని గుద్దిందిట అన్నాడు. నాకు అర్థం అవడానికి టైం పట్టింది.

వెంటనే ఫోన్‌అందుకుని అక్రమ్‌ ఆఫీస్‌నంబర్‌కి చేశాను. లైన్‌ దొరకలేదు. ఎందుకయినా మంచిదని ఇంటికి ఫోన్‌చేశాను. లక్ష్మి… WTC మీద ఏదో ఏక్సిడెంట్‌ అయ్యిందిట, భయపడద్దు, నేను రైలు దిగి క్షేమంగానే బయట పడ్డానని చెప్పాను. అక్రమ్‌ సంగతే తెలియట్లేదు, ఫోన్‌చేసి కనుక్కుంటానని చెప్పాను. ఫోన్‌పెట్టేసి, మళ్ళీ అక్రమ్‌ సెల్‌కి చేశాను. ఆన్సరింగ్‌సిస్టంకి వెళ్ళింది. సీట్లోంచి లేచి బయటికి నడిచాను. WTC వైపు చూడగానే గుండె గుభేలు మంది. కాళ్ళు వణికాయి. అంత పెద్ద ఏక్సిడెంట్‌అనుకోలేదు నేను. రెండు టవర్లూ భగ్గున మంటల్లో మండి పోతున్నాయి. అసలట్లా ఎట్లా ఏక్సిడెంట్‌అవగలదు? ఓ మనిషి జారిపోతున్న జాకెట్‌లాక్కుంటూ పరిగెడుతున్నాడు… మొహంలో భయం, ఆతురత, దుఖం…
“ఏమిటది, ఏం జరిగింది” అన్నాను. నా గొంతెలా పలికిందో నాకు తెలీదు.
“టెర్రరిస్టులు… ఇక్కడా, వాషింగ్టన్లోనూ విమానాలతో విరుచుకుపడ్డారు” అన్నాడు. అంటూనే పరిగెట్టాడు. సాధ్యమయినంత త్వరగా సిటీ నించి బయటపడమని కూడా అరిచాడు… పరిగెడుతూనే!

నా నోట మాట లేదు. అర్థమయీ కానట్టుగా వుంది నాకు. ఇంతలో అక్రమ్‌ గుర్తొచ్చాడు. వెంటనే సెల్‌ఫోన్‌తీసి కాల్‌చేశాను. ఆఫీస్‌కి, తర్వాత తన సెల్‌కి. రెండూ దొరకట్లేదు. కనుచూపు మేరలో అందరి చేతుల్లోనూ ఫోన్లు… అందరూ డయల్‌చేస్తూనే ఉన్నారు. ఇప్పట్లో ఏ లైనూ దొరకదని అర్థమయింది నాకు. ముందుగానే ఇంటికి ఫోన్‌చేసి మంచిపని చేశాననుకున్నాను. వడివడిగా అడుగులు వేస్తూ WTC వైపు నడిచాను. ఇంకో బ్లాక్‌వుందనగా ఓ ఇద్దరు పోలీసులు నిలబడి అటువైపు వెళ్ళద్దన్నారు. మా ఫ్రెండ్‌లోపల వున్నాడన్నాన్నేను. అయినాసరే ఇక్కడే వెయిట్‌చెయ్యండి అన్నారు. అని, వాళ్ళు మాత్రం టవర్ల వైపు వెళ్ళి పోయారు. నాలాగే చాలామంది అక్కడే తచ్చట్లాడుతున్నారు. కొందరప్పటికే ఏడుస్తున్నారు. వాళ్ళ వాళ్ళెవరో లోపల వుండివుంటారు. చాలామంది అప్పటికే టవర్ల లోంచి బయటపడ్డారని చెప్పారు. చుట్టు పక్కల చూశాను. ఎక్కడా కనపడ్డు అక్రమ్‌ అసలీ రోజు రానే లేదేమో? అలా వెతుకుతూనే వున్నాను. ఇంతలో అకస్మాత్తుగా ఓ పెద్ద నల్లటి మేఘం కమ్ముకు వస్తూ కనపడ్డది.

ఏమిటది? నిజమే? ఆ టవర్‌.. ఆ టవర్‌.. కూలిపోతోంది…. పరిగెట్టండి.. పరిగెట్టండి… అదెంత దూరం దాకా పడుతుందో తెలీదు… పరిగెట్టండి…. అయ్యో ఇప్పటిదాకా ఎంతోమంది అటువైపుగా వెళ్ళారు నా కళ్ళముందే…. ఆ పోలీసులు… ఆ అంబులెన్సులూ, ఫైర్‌ డిపార్మ్టెంట్‌ వాళ్ళూ… అయ్యో అందర్నీ వదిలి పరిగెట్టాల్సిందేనా…. ఏవిటది… పరిగెట్టండి పరిగెట్టండి… ఈ భూతాన్నించి పారిపోండి… ఇదో కమ్ముకు వస్తున్న ప్రళయం… ఇదో విలయం…. ఇదో ఛండాలం… విరిగి బద్దలయి పేలిపోతున్న మానవత్వం…. మనిషిని మనిషే బలిచ్చే క్షుద్ర పూజ.. నిలువెత్తున కూల్తున్న నాగరికత… పరిగెట్టండి.. పరిగెట్టండి… మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడుతూ, మనుషుల్లో, సమాజంలో బతకాల్సొచ్చినందుకు భయపడుతూ, బాధ పడుతూ, ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని పరిగెట్టండి… ఏడవకండి… కన్నీళ్ళని వృథాచేయకండి… ఇది మనిషిని చేసుకుంటున్న ఆత్మహత్య…. వాడి ఖర్మకి వాణ్ణి వదిలేసి అడవుల్లోకి పోయి హాయిగా మృగాల్లా బతుకుదాం పదండి…. పరిగెట్టండి.

……………………………

అబ్బా… ఎవరిదో కాలడ్డం పడ్డట్టుంది. స్పృహలేకుండా పరిగెడుతున్న నేను వెల్లకిలా రోడ్డు మీద పడ్డాను. ఈ లోకంలోకి వచ్చాను. నుదురు రోడ్డుకు కొట్టుకుంది. లేచి వళ్ళుదులుపుకున్నాను. ఒక టవర్‌పూర్తిగా కూలిపోయింది. వళ్ళు జలదరించింది, అందులోనే అక్రమ్‌ పని చేసేది. అయినా ఇంతసేపు అందులో వుండడేమోలే అనిపించింది.

అంతా యుద్ధరంగంలా ఉంది. టవర్‌కూలినప్పుడు లేచిన దుమ్ము, మేఘంలా అంతా పరుచుకుని వుంది. అంతా గందర గోళంగా వుంది. దుమ్ము కొట్టుకు పోయిన వాళ్ళు, దెబ్బలు తగిలినవాళ్ళు…. దిక్కు తోచక పరిగెట్టే వాళ్ళు… వీళ్ళకి సహాయం చెయ్యాలని తాపత్రయ పడేవాళ్ళూ… అంతా అయోమయంగా వుంది. నేను నా మనసుని కూడ గట్టుకుని అనుకున్నాను… అక్రమ్‌ కోసం ఇంకాసేపు చూసిగానీ ఇంటికి వెళ్ళేది లేదని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్రమ్‌ ఫోన్‌ కలవట్లేదు. అలాగే ప్రయత్నం చేయగా చేయగా ఇంటికి కలిసింది…. లక్ష్మి భయపడుతోంది. త్వరగా వచ్చెయ్యండి అంది. అక్రమ్‌ వాళ్ళింటికి ఫోన్‌ చేశావా అని అడిగాను. ముంతాజే చేసింది అంది. అక్రమ్‌ చాలా పొద్దున్నే వెళ్ళిపోయాట్ట, ఇప్పుడెక్కడున్నాడో తెలీట్లేదుట అంది. నేను చూసొస్తాను, భయం లేదు… వాళ్ళింటికి ఫోన్‌చేసి చెప్పు అన్నాను. ఫోన్‌ పెట్టేశాను. అన్నానేగానీ… నిజానికి అక్రమ్‌ అసలు రానేలేదేమోలే అన్న నా ఆశ అడుగంటిపోయింది.
అక్రమ్‌ కిందికి రాగలిగాడో లేదో అనేదే ప్రస్తుతం తెలియాల్సింది.
అమ్మో… అదేంటి… రెండో టవర్‌.. అదీ కూలిపోతోంది…. భగవంతుడా…. ఏమిటీ దారుణం… ఈ ఘోరం ఇంకా ఎంత దూరం పోబోతోంది? పక్కనే ఉన్న పెద్ద హోటల్‌లోపలికి పరిగెట్టాను. పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ విసుక్కోకుండా రానిస్తున్నారు. మంచినీళ్ళూ అవీ కుడా అందిస్తున్నారు… ఒరే మనిషీ.. నీకెన్ని రూపాలురా అనుకున్నాను!
అక్కడే ఓ అరగంటో, ఇంకా ఎక్కువో కూర్చుని బయట పడ్డాను. ఎన్ని చోట్ల వీలయితే అన్ని చోట్ల వెతికాను. అలా ఓ రెండు మూడు గంటలయుంటుంది. నా సెల్‌ ఫోన్‌మోగింది… లక్ష్మి!
“ఎప్పట్నించి, ఎన్నిసార్లు చేశానో లెక్కలేదు… మీ ఫోన్‌లైన్‌దొరకట్లేదు. ఇంక మీరు ఎవరికోసం వెతక్కుండా ఇంటికి వచ్చేయండి” అంది. గొంతులో దుఖం. పిల్లలేడుస్తున్నారు అంది. నాక్కూడా చెయ్యగల్గింది పెద్దగా కనపళ్ళేదు. “ఇప్పుడింటికెలా రావాలో తెలీదు…. ఎలాగోలా బయల్దేరి వచ్చేస్తాను… వెంటనే బయల్దేరుతున్నాను” అని చెప్పి పెట్టేశాను.

* * *

అతికష్టం మీద సిటీ బయట పడగల్గాను. ఇంటికి చేరేటప్పటికి దాదాపు సాయంత్రం అయింది. లక్ష్మి చిన్నపిల్లలా కావులించుకుని బావురుమంది. పిల్లలు సరేసరి. నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మాకెవ్వరికీ సరిగ్గా తెలీదు… మేమెందుకు ఏడుస్తున్నామో.
ఇంట్లో అప్పటికే ప్రశాంత్‌, రామారావు, మధులు కుటుంబాలతో సహా వచ్చి వున్నారని అర్థమయింది.
“హమ్మయ్య మీరంతా క్షేమంగా వచ్చారు గదా” అన్నాన్నేను. వాళ్ళు రెండో టవర్‌మీద ఎటాక్‌చూడగానే బయల్దేరి వచ్చేశార్ట.
“నాకు చాలాసేపటిదాకా ఆ సంగతే తెలీదు, ఆ తర్వాత అక్రమ్‌ కోసం చూస్తూ ఇంతసేపూ తిరుగుతున్నాను” అని చెప్పాను.
ప్రశాంత్‌, రామారావులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“ఏం జరిగింది” అన్నాన్నేను
“ఆ అక్రమ్‌ సంగతి మర్చే పోలేవా?” అన్నాడు మధు కొంచెం చిరాకుగా.
“ఏంటీ ?” అన్నాన్నేను అంతే చిరాకుగా, అసహనంగా.
“ఆ పాకీ గాళ్ళందరి మీదా కన్నేసి వుంచారు పోలీసులు. ఎవడో ఒకడి మీద అనుమానంట. మధ్యాహ్నం నించీ అందర్తోటీ, అక్రమ్‌ ఫ్రెండ్స్‌అందరితోటీ మాట్లాడుతున్నారు పోలీసులు. పెద్దగా ఏమీ మర్యాదగా సాగట్లేదుట ఆ సంభాషణ”
ఆఖరి వాక్యం చెప్పడంలో కాస్త వెటకారం ధ్వనించింది.
” ఆ వరల్డ్‌ట్రేడ్‌సెంటర్‌మీద జరిగిన దాడి కీ, మన చుట్టూ వుండే ఈ అర్భకులకీ ఏమిటిట సంబంధం” అన్నాన్నేను.
“అదే వాళ్ళు తేల్చుకుంటార్ట. నువ్వు పొద్దుణ్ణించీ టీ.వీ చూడట్లేదుకదా. వాతావరణమేమంత బాగాలేదు. పోలీసులూ మామూలు వాళ్ళు కూడా మన బోటి సౌత్‌ ఏషియా మొహాలు కనపడితే చాలు అనుమానంగా చూస్తున్నార్ట” అన్నాడు ప్రశాంత్‌
“అవునా ?” అన్నాన్నేను ఆశ్చర్యంగా.
“అందుకే చెప్పేది. ఆ అక్రమ్‌ గిక్రం అని వాళ్ళింటి చుట్టూ తిరక్కు.” మళ్ళీ మధు
నాకు తిక్కరేగింది. “మిగతావాళ్ళ సంగతి సరే, మనకి అక్రమ్‌ సంగతి తెలీదా? మనిషేమయిపోయాడో తెలీకుండా వుంటే పట్టించుకోకుండా వదిలేస్తామా?” అన్నాన్నేను, నాకు తెలీకుండానే నా గొంతు లేచింది.
“అందుకే వద్దంటున్నాను. అక్రమ్‌ రిజ్వి ఇద్దరూ లెక్క తేలలేదుట. పైగా ముంతాజ్‌నడిగితే, ప్రతిరోజులా కాకుండా ఈ రోజు ఇంకా ముందే వెళ్ళిపోయాడు అనిచెప్పిందిట. పొద్దుట్నించీ అక్రమ్‌ సెల్‌ఫోన్‌కి ట్రై చేసినా దొరకట్లేదుట. వాళ్ళ ఆఫీసు వాళ్ళు కూడా మేం చూశాం అని చెప్పిన వాళ్ళు లేరుట ఇంతవరకూ” అన్నాడు మధు.
“నన్ను పదింటికి కలుస్తానన్నాడు నా ఆఫీసులో. ఏవో ఇమ్మిగ్రేషన్‌ఫామ్స్‌ కావాలంటే ఇస్తానన్నాను. ఆ పని వుంది కదాని ముందుగా ఆఫీస్‌కి వెళ్ళుంటాడు. సెల్‌ఫోన్‌ తియ్యట్లేదంటే ఏమయ్యిందోనని భయపడాల్సింది పోయి అనుమానిస్తారా?” అన్నాన్నేను

“అదే వద్దనేది. నీ దగ్గరికి వస్తానన్నాడని చెప్పి పోలీసులకి చెప్తావా? పిచ్చెక్కిందా… అయినా ఆ పాకీ గాళ్ళు ఎంత రక్తం మరిగారో చూస్తూనే వున్నాంగా… అసలు నిజంగా అక్రమ్‌ ఎక్కడున్నాడో నాకయితే అనుమానమే… ఆ గుద్దిన విమానాల్లో లేకపోవచ్చు… వాళ్ళ నెట్వర్క్‌ఎంతపెద్దదో… ఇతగాడందులో ఎక్కడ ఏంచేస్తున్నాడో?” అన్నాడు.

నేను అవాక్కయి పోయాను. అక్రమ్‌ చూపించిన ఉద్యోగం చేస్తున్న మనిషి. అతని కుటుంబం గురించీ, ఉద్యోగం గురించీ దాదాపు పూర్తిగా తెలిసిన మనిషి. ఇన్నాళ్ళూ సుబ్భరంగా కలిసి తిరిగిన మనిషి. మనిషిలో ఇంత హఠాత్తుగా ఇంత మార్పు నాకు ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తానీ వాడూ, తురకాడూ అవటం చాలా అంతగా అనుమానించబడటానికి? అంతగా అవమానించబడటానికి? నాకు కోపం కన్నా బాధగా వుంది.
గట్టిగా కళ్ళు మూసుకుని ఓ క్షణం కూర్చున్నాను. మెల్లిగా కళ్ళు తెరిచి నచ్చచెప్తున్నట్టుగా అన్నాను.
“మధూ! ఆలోచించు. అక్రమ్‌ ద్వారా ఒక్క అపకారమన్నా జరిగిందా మనకింతవరకూ? మనకి అవసరమయినప్పుడల్లా సహాయమేగా చేశాడూ…. ఇది అన్యాయం మధూ… తోటి మనిషిని ఇంతలా అవమానించకూడదు”
“సత్యా! నువ్వు బాధ పడ్తావని తెలుసు. కానీ పై పై రూపాలు వేరుగా వుంటాయి. అయినా అడిగావు కాబట్టి చెపుతున్నాను. కాశ్మీర్‌ని మనం అన్యాయంగా ఆక్రమించుకున్నామని అన్నాడు గుర్తులేదా?” అన్నాడు మధు.
“అందుకని, కాశ్మీర్లో పేలిన ప్రతి బాంబుకీ, పోయిన ప్రతి ప్రాణానికీ అక్రమ్‌ బాధ్యుడా? ఇప్పుడీ దారుణానికి కూడా? మనకి నచ్చని విషయం నమ్మినందుకు నిర్దోషి అనితెలిసినా మనం సహాయం చెయ్యకూడదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నేనామాటనలేదు. ఏ పుట్టలో ఏ పాముందో మన జాగ్రత్తలో మనం వుందామంటున్నాను” అన్నాడు

నేను అందరి మొహాలూ చూశాను. ఇంట్లో సుమారు 10 మంది మనుషులున్నారు. మాట్లాడుతున్నది మాత్రం ఇద్దరమే. అందరి మొహాల్లోనూ అదో బాధ, దుఖం… ఈ సంభాషణ వినాల్సొచ్చినందుకు. ఎటూ మాట్లాడాలని లేదు ఎవరికీ. కళ్ళు కూడా ఎవరితోనూ కలిపే ధైర్యం లేదు, అందరూ తలా ఓ దిక్కూ చూస్తున్నారు.

ఓ రెండు నిమిషాలలాగే కూర్చున్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు కూడా,ఇంతమంది పెద్దవాళ్ళు ఇలా నిశ్శబ్దంగా వుండటం ఎప్పుడూ చూసి వుండలేదేమో, ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేను మెల్లిగా దీర్ఘంగా నిట్టూర్చి, కుర్చీలోంచి లేచాను. లేస్తూ ఇలా అన్నాను…

“నాకు తెలుసు. ఇక్కడెవరూ చెడ్డవాళ్ళు లేరని. అక్రం కీ చెడు జరగాలని కూడా ఎవరూ కోరుకోవట్లేదు. నిజానికి ఇక్కడ చాలామందికి అక్రమ్‌ ని నమ్మాలని కూడా ఉందని నా అనుమానం. మనకి ధైర్యం సరిపోవట్లేదంతే. నేను దగ్గర్నించి చూశాను. మనిషిమీద మనిషికి నమ్మకం పోతే ఏం జరగ్గలదో. ఇప్పుడు నేను అక్రమ్‌ ని నమ్మటం మానేస్తే… అమ్మో నాకు భయమేస్తోంది. నా పిల్లలు చూస్తున్నారు. అంత సాహసం చెయ్యలేను. అక్రమ్‌ ని నేను నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్ముతున్న నా నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్మక పోవడం అంటే నన్ను నేనే నమ్మకపోవటం. FBI, CNN లకి నా కన్నా ఎక్కువగా అక్రమ్ల గురించి తెలిసే అవకాశం లేదు.వాళ్ళనించి నేను వినను… నేనే వాళ్ళకి చెప్తాను. మీలో ఇష్టం ఉన్నవాళ్ళు నాతో రండి. లక్ష్మీ నువ్వుకూడా… నీ ఇష్టమయితేనే” అన్నాను… ఖచ్చితంగా, ఆవేశంగా.

అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. లక్ష్మి మాత్రం నోరు విప్పి అంది ” అక్రమ్‌ మీద వున్న నమ్మకం నా మీద లేక పోయింది. నేనెప్పుడో చెప్పేశాను ముంతాజ్‌కి… ధైర్యంగా వుండమనీ, మీర్రాంగానే అందరం వాళ్ళింటికి వచ్చేస్తామనీను. వాళ్ళక్కూడా వంట చేసి పాక్‌చేసేసి వుంచాను. పదండి చూద్దాం ఏమయిందో అక్రమ్‌ భాయ్‌కి” అంది లక్ష్మి.

అందరూ లేచారు…. వాళ్ళ సహాయం నా కవసరం లేకపోయినా… కనీసం కొందరయినా నాతో నడిస్తే బావుండుననే ఆశని చంపుకోలేక పోతున్నాను… ఆశగా వాళ్ళవైపు చూస్తూ “పద” అన్నాను లక్ష్మితో.


అక్కిరాజు భట్టిప్రోలు

రచయిత అక్కిరాజు భట్టిప్రోలు గురించి: జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదు లో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతారు. ...