కావ్యదహనోత్సవం

నేను వేలూరి వెంకటేశ్వరరావుగారు రాసిన కావ్యదహనోత్సవం అనే పుస్తకాన్ని పరిచయం చెయ్యదలుచుకున్నాను. అయితే, ఈపుస్తకంలో ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అని చెప్పబోవటంలేదు. నేను ఎలా చదువుకున్నాను, నాకేం అనిపించింది, అని కొన్ని ఊహాగానాలు చేయబోతున్నాను. ఇది మీకు ఈ పుస్తకం చదవడానికి ఉత్సుకత కలిగించినా, లేక చదువుతున్నపుడు కొత్త ఆలోచనలు రేకెత్తించినా, నా ప్రయత్నం సఫలం అయినట్లే.

టూకీగా చెప్పాలంటే, పుస్తక రచయిత తన యవ్వనంలో, అంటే, పాతికేళ్ళలోపు వయసులో, 1960 ప్రాంతాల్లో ఒక సాహిత్య పరిక్రియ ఒకసారి ఏలూరులో మరొకసారి విశాఖపట్నంలో నడిపారు. పుస్తకాన్ని ఒక ప్రాణం ఉన్న యువతిలాగ, కృతికన్యగా భావించడం మన కవి సంప్రదాయంలో ఉన్నది. కృతిభర్త అని ఉన్నది. ఇంకా ప్రాణం ఉన్న జీవిలాగా భావించడం చాలా చోట్ల కనబడుతుంది. ప్రాణులు జీవించినంతకాలం సంబరాలుంటాయి. చనిపోగానే కర్మకాండలూ ఉంటాయి. అలాగే కావ్యాన్నీ కన్యగా భావించి అన్ని సంబరాలూ జరుపుతున్నప్పుడు, ఆ కావ్యం చనిపోయినప్పుడు (దానిని ఇక ఎవరూ చదవనప్పుడు కావ్యం చనిపోయిందనే కదా అర్థం.) కర్మ కూడా చేయాలి కదా. అలా, అగ్నిశంఖం అన్న కాల్పనిక పుస్తక దహనక్రియ ఒకటి ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రాంగణంలో ఒక ప్రహసనంగా వేదిక మీద నడిపారు. అప్పటి సాహితీ ప్రియులు, తర్వాత భవిష్యత్తులో పేరు మోసిన బంగోరె, మేడేపల్లి వంటి సాహితీకారులు ఎందరో ఆ దహనక్రియకు హాజరై ఉపన్యాసాలు చేశారు. ఆ ఉపన్యాసాలు చాలా వరకు రచయితే ముందుగా వారికి రాసి ఇచ్చారు. ఇన్నేళ్ళ తర్వాత, శిథిలాలలోంచి వెతికి తీసి యథాతథంగా చేతి రాతలోనూ, డిజిటల్ ప్రింట్‌లోనూ ఆ ఉపన్యాసాలు వేలూరిగారి ముందుమాటతో ప్రచురించారు.

ఈ పుస్తకం చదివితే ముందు మూడు విషయాలు కనబడతాయి. ఒకటి, బాగా కనబడే హాస్యం. మేము కాలేజీ రోజుల్లో స్కిట్స్ వేసేవాళ్ళం. అందులో వ్యంగ్యం ఎక్కువ మోతాదులో పడేది. అతిశయోక్తి ఇంకా ఎక్కువ. సైన్స్ చదువుకునేవారికి తెగేవరకు లాగదీయటం అలవాటు. ఆ విధంగా తర్కపు చివరలు చూపిస్తూ, విషయాన్ని పీకి పాకాన పెట్టటం ఈ స్కిట్‌లలో ఉండే విషయం. ఇందులో, ఆ (కాల్పనిక) పుస్తకంలోని కవిత్వం, స్టీరియోటైపు లాంటి మనుషుల ఉపన్యాసాలు, ఉన్న విషయాన్ని చాలా గంభీరంగా తీసుకొని కథనం నడపటం, ఇవన్నీ తప్పకుండా నవ్వు తెప్పిస్తాయి.

రెండు, ఆనాటి సాహిత్య చరిత్ర. మా రోజులు, అంటే 1980లు వచ్చేసరికి, సాహిత్యం సామాజిక ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది. చదువుకున్న వారంతా సాహిత్యం ముఖ్యంగా భావిస్తే, సాహిత్యానికి విలువ ఇస్తే, సాహిత్యం ద్వారా ప్రపంచానికి అర్థం ఇస్తే ఎటువంటి సాంఘిక వాతావరణం ఏర్పడుతుంది? అది ఈరోజుల్లో ఊహించ శక్యం కాదు. సాహిత్య విలువలను ప్రతివారూ గౌరవంగా చూసుకుంటున్న రోజుల్లో, ముఖ్యంగా హాస్యం, అందునా అవే సాహిత్య విలువల మీద హాస్యం, సాహితీ సంబంధాలను పరిపూర్ణం చేయడానికి అవసరం.

మూడు, అంత చిన్న వయసులో రచయిత చేసిన సాహసం. అంత పెద్దవారితో, యూనివర్సిటీ ఉపాధ్యాయులతో, సాహితీ ప్రముఖులతో తన ఉపన్యాసాలు స్టేజి మీద చదివించడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఆ ధైర్యం, చొరవ, ఆలోచన ఎలా వచ్చాయి అని అనిపిస్తుంది. ఇప్పటి తరాలకి ఆ ఉత్సాహం ఎలా ఉండాలో, ఎలా బయటపెట్టుకోవాలో ఆలోచించబుద్ధవుతుంది. ముఖ్యంగా, కవితలమీద రచయిత ఒక శాస్త్రవేత్త లాగా, ఒక విమర్శకుడి లాగా చేసిన వ్యాఖ్య ఇప్పటికీ సందర్భశుద్ధితోనే ఉంటుంది.

అయితే, ఇంతకన్నా మించి నాకు అనేక విషయాలు చూచాయగా కనబడుతున్నాయి. ముఖ్యంగా, ఒక రచన అంటే ఏమిటి? దానికి, రచయితకి ఉండే సంబంధం ఏమిటి? రచనలో పాఠకుడి పాత్ర ఏమిటి? ఈ విషయాలు ప్రాముఖ్యంలోకి రాకముందే, ఈ కావ్యదహనోత్సవం జరిగింది. డెత్ ఆ ది ఆథర్ అని 1967లో గానీ రోలాండ్ బార్తా రాయలేదు. దానికి ముందే, ఈ సమావేశంలో ఒక పాఠకుడు (చేరా రూపంలో మరొకరు. ఈ తికమక అర్థం చేసుకోవాలంటే మరి పుస్తకం చదవకతప్పదు!) ఈ ప్రశ్నలు రేకెత్తుతాడు. రచయితకి ఎంత హక్కు ఉన్నదో, పాఠకుడికి కూడా అర్థాన్ని ఆపాదించడంలో అంత హక్కు ఉన్నదని బలంగా చెబుతాడు. అది చాలా ముందుచూపుతో చెప్పిన మాట.

నాకు వేలూరిగారు 1990లలో తెలిసిన మొదటి రోజుల్లో, ఈ విషయాల మీద ప్రసక్తి వచ్చింది. నేను ఇంగ్లీషులో నూతన విమర్శనా విధానాలు చదివి తెలుసా మెయిలింగ్ లిస్ట్‌లో చర్చిద్దామని ఉత్సాహపడే రోజుల్లో, వేలూరిగారు, ఆశ్చర్యకరంగా డెత్ ఆఫ్ ది ఆథర్ గురించి ప్రస్తావించారు. చిన్నప్పుడే ఈ కావ్యాదహనోత్సవం రోజులకే ఆయనలో ఈ భావాల బీజాలు పడ్డాయి కామోసు!

మరొకటి నాకు బాగా కనబడుతున్న విషయం టెక్స్ట్‌కి కాంటెక్స్ట్‌‍కీ మధ్యన ఉన్న సంబంధం. ఇది ఈ పుస్తకం నిండా కనబడుతుంది. అసలు తగలబెడుతున్న కావ్యం కల్పన మాత్రమే. కానీ, ఆ ఉపన్యాసాలు, చుట్టూ జరుగుతున్న కథనం, ఆ పుస్తకానికి రూపం కలిగిస్తాయి. అంటే కాంటెక్స్ట్ అనేది టెక్స్ట్‌ని సృష్టించింది అన్నమాట. బోర్హేజ్ 1944 నాటికే ఇటువంటి ప్రక్రియ–కాల్పనిక రచన మీద పూర్తి విమర్శ–చేసినా, అది ఆ చిన్నవయసులో వేలూరిగారు చదివారనుకోను. అందుకే అగ్నిశంఖం అన్న పుస్తకం మనకి తెలియకపోయినా, ఆ పుస్తక ప్రభావం నలుగురి మూలాన తెలుస్తుంది. నిజానికి, ఇలాగే, ఫిజిక్స్‌లో కొన్ని కణాల్ని నిర్థారిస్తాము. గేలక్సీలు ఉన్నాయని చెబుతాం. పరోక్షంగా అవి గలిగించే ప్రభావాలు వాటి ఉనికిని ఋజువు చేస్తాయి. వృత్తి రీత్యా భౌతికశాస్త్రవేత్త అయినా వేలూరిగారికి ఈ పోలిక అప్పటికి తట్టకపోయి ఉండవచ్చు. కానీ, ఆయనలో చిన్నప్పటి ఆలోచనలకీ పెద్దయిన తర్వాత చెప్పే విషయాలకీ మధ్య ఆట్టే దూరం లేదు.

ఇంకా ఈ పుస్తకం అచ్చువెయ్యడంలో మరో కోణం ఉన్నది. ఈ కావ్యదహనోత్సవం గురించి కర్ణాకర్ణీగా చాలామంది విన్నప్పటికీ, పూర్తిగా తెలిసినవారు ఇద్దరే బ్రతికి ఉన్నారు. వేలూరిగారు, వెల్చేరుగారు మాత్రమే, దీనికి ప్రత్యక్ష సాక్షులు. మరి ఇది ఈ విధంగానే జరిగిందా అంటే, చెప్పలేం. మరి అదే సత్యం అంటే. అది చూసే వాడి కోణం నుంచి మారుతుంది. ఆనాటి ఉపన్యాసాలు చేతిరాతలో ప్రచురించినా, అర్థాలు ఎలా మారాయి? ఉన్న కాంటెక్స్ట్ అంతా వచ్చిందా? ఇది ఏ రచనలోనయినా ఉన్న లోపమే! ఏదీ సమస్తమైన అర్థాన్ని సూచించలేదు. అది కూడా, ముందుమాటలో చెప్పీ చెప్పకుండా చెబుతారు రచయిత. నిజానికి మొట్ట మొదటి పిట్ట కథ (చైనీస్ విస్పర్స్) ఇదే చెబుతుంది మనకి.

మరొక్క విషయం, ఈ పుస్తకాన్ని ఏమనవచ్చు? ఒక విధంగా, ముందుమాటతో కలిపి చూస్తే, ఒక చరిత్ర పుస్తకం అనుకోవచ్చు. లేదా, విషయం వరకు చూస్తే ఒక వ్యాసావళి అనుకోవచ్చు. లేదా, ఒక స్క్రీన్ ప్లే అనుకోవచ్చు. ఒక నాటకం అనుకోవచ్చు. గుర్తు చేసుకున్న ఒక జ్ఞాపకం అనుకోవచ్చు. ఆ విధంగా ఈ పుస్తకం ఒక మెటా లిటరేచర్ లాగ ఉంటుంది.

ఒక చివరి మాట: ఎంత సరదాగా రాసినా, నిజానికి ఈ కావ్యదహనోత్సవంలో ఏ పుస్తకమూ తగలబెట్టలేదు. దహనం కర్మకాండ లాగ, కేవలం సంకేతాత్మకంగా నిలిచింది. పుస్తకం అంటే అపారగౌరవం వ్యంగ్యం చాటునుంచి, అగ్నిశంఖం కవితలనుంచీ కనబడుతూనే ఉంటుంది!

ఈ పుస్తకం హాస్యం అంటే ఇష్టం ఉన్నవారికి, సాహిత్య విమర్శ లోతుగా తెలిసి ఉన్నవాళ్ళకి, సాహిత్య చరిత్ర తెలుసుకోవాలనుకున్న వారికి చదవడానికి సరిపోతుంది. ఈ పుస్తక ప్రతులు కినిగె లోనూ, ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర లోనూ, హైదరాబాద్ నవోదయ లోనూ, తెలంగాణలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ లోనూ దొరుకుతాయి. మీకు దొరకకపోతే రచయిత వేలూరి వెంకటేశ్వర రావుగారికి రాయవచ్చు.