కేస్ నెంబర్ – 1235

“మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడు. నాకు ఆధారాలు కావాలి.”

ఇలాంటివి నాకు సాధారణంగా వచ్చే కేసులు. నాకు బాగా ఇష్టం. పెద్ద పని ఉండదు కానీ డబ్బులు బాగా వస్తాయి.

“వివరాలు చెప్పండి. సిరి వింటే పరవాలేదు కదా!” అన్నాను. తొమ్మిదేళ్ళ కింద ఆపిల్ కంపెనీ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, సెక్రటరీలు, నోట్స్ తీసుకోవడాలు అసలు లేవు. చాట్‍ జీపీటీ-8 వచ్చిన తర్వాత సెక్రటరీలు ఎందుకు?

“పరవాలేదు.” జూమ్ నుంచి కొంచెం ముక్కు ఎగపీల్చిన శబ్దం.

“పెళ్ళయ్యి ఎన్నేళ్ళయింది?” ఇది రొటీన్ ప్రశ్న. కొంత మంది భార్యలు భర్త దగ్గర్నుంచి వయసు పెరిగిన తర్వాత అంత సాన్నిహిత్యం కోరుకోరు. వాళ్ళ ప్రపంచాలు వేరుగా ఉంటాయి.

“ఇరవై ఏళ్ళు. ఇప్పుడు నాకు యాభయ్ ఏళ్ళు.” కంప్యూటర్ నుంచి గోడ మీదకి ఆవిడ ముఖం ప్రొజెక్ట్ అయింది. చిన్న స్క్రీన్ కన్నా, ఇలాగ ఎదురుగా కూర్చున్నారనిపించేలా మనిషి బొమ్మ కనబడటం బాగా ఉంటుందని ఆ సేల్స్ పర్సన్ చెప్పిన మాట నిజమే.

“సరే. మీకు ఈ అనుమానం ఎలా వచ్చింది? మీ భర్త ఎవరితోనన్నా వెకేషన్ లాంటిది వెళ్ళారా? ఆఫీస్ రొమాన్సా? లేక, షుగర్ డాడీ లాంటి అరేంజ్‌మెంటా?”

“అవన్నీ నాకు తెలీదు. ఎవరన్నా ఎస్కార్ట్‌లతో ఒకసారి వ్యవహారం అయితే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. వేరెవరినో ప్రేమిస్తున్నాడు అని అనుమానం.” ఆవిడ ముఖంలో కొంచెం బాధ తెలుస్తుంది. అయితే, ఎమోటికాన్ ఫిల్టర్ వాడి ఉండవచ్చు. లేదా తన ఏఐ అవతార్ వాడి ఉండవచ్చు.

“అలా ఎందుకనుకుంటున్నారు?”

“ఆయన ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో నాకు ఇంకా గుర్తుంది. మబ్బులమీద తేలుతూ వేరే లోకంలో ఉన్నట్లుండేవాడు. పిల్లలు లేకపోయినా, మేమిద్దరం ఒక చిన్న ప్రపంచం అన్నట్లు చూసుకునేవాడు. ఇన్నాళ్ళ తర్వాత, అంత అటెన్షన్ నాకు అక్కర్లేదు. కానీ, ఎవరినో ప్రేమిస్తున్నాడు అంటే నా జ్ఞాపకాలు అబద్ధాలుగా తోస్తున్నాయి. అది భరించలేను.” బాగా ఆలోచించుకున్నట్లు చెప్పింది.

“సిరీ, ఆవిడ దగ్గర వివరాలు తీసుకో. డార్క్ వెబ్ మీదికి వెళ్ళాలి.” సిరికి ప్రోటోకాల్ తెలుసు. డార్క్ వెబ్‌కి పోవాలంటే లీగల్ ఆథరైజేషన్ కావాలి.

గోడమీద ఆవిడ ముఖం పోయి, కిటికీ వచ్చింది. బయట టైమ్స్ స్క్వేర్‌లో జనాలు తిరుగుతూ, కొంచెం రణగొణ ధ్వని. నాకు సాధారణంగా ఆ రద్దీ దృశ్యాలను చూడటం ఇష్టం. కానీ ఇప్పుడు చెయ్యాల్సిన పని ఉంది.

“సిరీ, ఆఫీస్ సెటప్ ప్లీజ్.” వెంటనే గోడ మీద బొమ్మ మారిపోయింది. ఉదయం నీరెండ పడుతున్న పచ్చటి మైదానం గోడంతా అద్దంలోంచి కనపడ్డట్లు మొదలైంది. ఇలాంటి ప్రొజెక్టర్‌లు ఉండబట్టే, ఈ రోజుల్లో విహారయాత్రలు తగ్గిపోయాయి.

ఎనిమిది సిస్టమ్స్‌కి క్వైరీ పెట్టాను. ఏమీ క్లిక్ అవలేదు. సిరి ఫిల్టర్ చేసిన రెడిట్ మెసేజ్‌లు కాసేపు చదివి, కొత్త ట్రెండ్లు ఏమిటో, ఎక్కడ వెతకాలో చూశాను. మూడు చోట్లు తెలిశాయి. మూడూ ఒక దాని తర్వాత ఒకటి వెతకడం మొదలుపెట్టాను. రెండవ దానిలో దొరికాడు. టైమ్ చూస్తే అర్ధరాత్రి అయింది. గుడ్ నైట్ చెప్పాను సిరికి. వెంటనే గోడ చీకటిగా చేసింది. పైకప్పులో నక్షత్రాలు కనబడుతున్నాయి. నా ప్రమేయం లేకుండానే సిరి ఆవిడతో మాట్లాడి ఉదయం మీటింగ్ ఫిక్స్ చేసింది.

ఉదయాన్నే ఆవిడ ముఖం వచ్చింది. అంత ఉదయం కూడా అలాగే ముఖం ఉన్నదంటే తప్పకుండా డిజిటల్ అవతారం అని. అయినా, మాటలు ఆవిడవే.

“మీ అనుమానం రుజువయింది. మీ ఆయన ప్రేమలో ఉన్నాడు.“

“నిజమా” దిగులుగా వినిపించింది ఆవిడ గొంతు. “ఎవరు ఆమె?”

“ఇంకా తెలీదు. మొదటి ఇన్‌స్టాల్మెంట్ సెటిల్ చేశాక ఒక రోజులో వివరాలు అందజేస్తాం. ఎందుకు వివరాలు కావాలి అన్న దాని ప్రకారం మా ప్యాకేజ్ ఖరీదు ఉంటుంది. విడాకులకైతే ఒక ధర, కేవలం బెదిరించడానికయితే మరొక ధర, ఇంకా భరణం బాగా రావాలంటే ఒక స్పెషల్ ధర అలాగ…” వివరాలు టూకీగా చెప్పుకుంటూ వచ్చాను.

“ఎఫైర్ అయితే బెదిరించే ప్యాకేజ్ సరిపోయుండేది. విడాకుల ప్యాకేజ్ కావాలి.” స్థిరంగానే ఉంది గొంతు. ముందే అనుకున్నట్లుంది — ధరకేం వెనకాడలేదు.

రెండు రోజులు పట్టింది మూడో మీటింగ్‌కి.

“మీ రిపోర్ట్ సిద్ధంగా ఉందా?” ఆమె గొంతులో కుతూహలం, కొంచెం ఉత్సుకత, మరికొంత తెచ్చిపెట్టుకున్న ధైర్యం.

“ముందు ఒక గుడ్ న్యూస్. మీ ఆయన ప్రేమలో పడింది ఒక ఏఐ అవతార్‌తో!”

“అయ్యో, అయితే విడాకులు కుదరవా?” ఆవిడ గొంతులో రిలీఫ్ కాదు కదా?

“కాదు కాదు, అందరూ అలా అనుకుంటారు కాని, ఏఐ అవతార్ అయినా విడాకులకి గ్రౌండ్స్ ఉంటాయి. మీరనుకున్న దానిలో కొంత నిజం ఉంది. చట్టం, 2032 యాక్ట్ ద్వారా చెప్పేదేంటంటే, ఏఐ అవతార్‌లని కేవలం యంత్రాలుగా భావించాలి. అంటే, వాటితో కేవలం శారీరక సంబంధం అనుకోవాలి.” నేను ఆ ఇల్లాలికి సెక్స్ డాల్స్ గురించి చెప్పడానికి సందేహించాను. “కానీ, ఆ వ్యక్తి ఆ అవతార్‌ని నిజం మనిషిలాగ చూస్తే, చట్ట ప్రకారం విడాకులకు కారణం అవుతుంది.”

ఇంకా కొంచెం వివరాలు చెప్పడం మొదలుపెట్టాను. ఇవన్నీ బ్రోషర్‌లో ఉంటాయి కానీ ఎవరూ చదవరు! అయినా, గంటకింత లెక్కన నా ఛార్జ్. చెబితే ఏం పోయింది!

“అవతార్‌లని నిజం మనుషులుగా చూడలేం. అన్నీ మనం వినాలనుకునే మాటలే చెబితే మనకి ఆశ్చర్యం ఏముంది. ఏం చెప్పినా అద్భుతం అంటే, ఎంత పిచ్చి జోకుకయినా నవ్వితే, కాసేపటికే బోరు కొట్టిపోతుంది! మీ ఆయనే కాదు, కొంచెం ప్రపంచానుభవం ఉన్న ఎవరయినా అవతార్‌ని ప్రేమించే అవకాశమే లేదు. కేవలం శారీరిక అవసరాలు మాత్రమే వాటితో!

“మీకు ఏఐ ట్రైనింగ్ గురించి తెలియకపోవచ్చు. ఇప్పటి వరకూ, ట్రెయిన్ చెయ్యడం అంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఎంత ట్రెయినింగ్ చేసినా, దాని ఒరిజినల్ నిబంధనలు దాటటం చేయించలేరు. అంటే, అవి ఎంత ట్రైనింగ్ చేసినా, మన మీద కోప్పడటం, అలగడం, విసుక్కోవడం ఉండదు. ఎప్పటికీ మనతో సమానం అనిపించదు! అది కావాలని ఆ పెద్ద కంపెనీలు చేసిన పని.

“నేను డార్క్ వెబ్ మీద కనుక్కున్నదేమిటంటే, ఈ మధ్య ఆ ఒరిజినల్ ప్రోగ్రామింగ్ పూర్తిగా ఓవర్ రైడ్ చేసి, నిజం మనుషుల లాగ కోపాలు తాపాలు, అసూయ, ద్వేషం, సెంటిమెంట్లు అన్నీ కనీసం మాటలో వినబడేటట్లు చెయ్యవచ్చు. లీగల్ గొడవల మూలాన అది బహిరంగంగా చెయ్యలేరు. అలాంటి అవతార్‌లను నిజమైన మనుషులుగా చట్టం ఇంతకు ముందు చూసినట్లు ఆధారాలున్నాయి. మరి సోషల్ మీడియా మొదలైన రోజుల్లో సైబర్ ఎఫైర్ మూలాన విడాకులు అవడం విన్నాం. ఉదాహరణకి, చిన్నపిల్లలతో సైబర్ ఎఫైర్‌లు ఇల్లీగల్ కదా! పోలీసులు చిన్న పిల్లలలాగ నటించి అటువంటివాళ్ళని పట్టుకోవడం చూస్తాం. అంటే, అటువైపువారు ఎవరయినా, వీళ్ళు ఎలాగ చూస్తున్నారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది.”

“మరి మా ఆయన ఈ అవతార్‌ని నిజమైన ప్రియురాలుగా, ఒక మనిషిగా చూస్తున్నాడు అనడానికి ఋజువులు ఉన్నాయా?” ఆవిడ గొంతులో ఎమోషన్‌కి దూరంగా ఒక క్లినికల్ ప్రశ్న.

“ఒకటి – ఆ అవతార్ మీద డబ్బులు బాగానే ఖర్చు పెట్టాడు. రెండు – షికార్లకీ తిరిగాడు. మూడు – ఇద్దరి మధ్యా ఓల్డ్ ఫాషన్డ్‌ ఉత్తరాలు కూడా నడిచాయి. ఇంకా ఫోటోలు, మాటలు — ఇవన్నీ క్షణికమైన ఉద్రేకాల విషయాలు కాదు. పాత మాటల్లో చెప్పాలంటే, ఇటువంటివి ఎవరి మధ్యనైనా జరిగితే దానిని ప్రేమ అనే అంటాం.” ఆవిడ సందేహాలు ఉంటే అడుగుతుందని కొంచం ఆగాను.

“నిజంగానే?” గొంతులో జుగుప్సతో కూడుకున్న కుతూహలం.

“ముఖ్యంగా మీ భర్త ఆ అవతార్‌కి నిజం అమ్మాయి ఫోటోనే వాడారు.”

“చాలామంది సినిమా తారల ఫొటోలు అవతార్ లాగ వాడతారని విన్నాను.” ఆవిడ అనుకున్నంత అమాయకురాలు కాదేమో!

“నిజమే, అందులో తప్పు లేదు. కానీ, మీ ఆయన మీ చెల్లెలి ఫోటో వాడాడు అనుకోండి. అది విడాకులకు బేస్ అవుతుంది. ఉదాహరణకి చిన్న పిల్లల ఫోటో వాడితే, నేరం కూడా అవుతుంది!”

“ఎవరి ఫోటో?” ఇంకా కుతూహలం మళ్ళీ ఆవిడ గొంతులో. ఒక రోజులో ఆవిడ తన మనసుతో తాను రాజీకి వచ్చినట్లుంది.

“ఇంకా చూస్తున్నాం. మరో విషయం — షికార్లని చెప్పాను కదా? ఆ అవతార్‌తో ట్యాంక్‌బండ్ మీద సాయంత్రం తిరగడానికి వెళ్ళినట్లు ఋజువు ఉంది. అక్కడ నుంచి బోట్ క్లబ్‌కి లంచ్‌కి వెళ్ళినట్లు, ఒక గంట సేపు పార్కులో తిరిగినట్లు మాకు ప్రూఫ్ దొరికింది.”

“నిజమా? మేం మొదట కలుసుకున్న రోజుల్లో, ఇద్దరం అలాగే చేసేవాళ్ళం. అవి మా ఇద్దరి రహస్య జ్ఞాపకాలు అనుకునేదాన్ని. నాకు అసహ్యం వేస్తుంది. ఈ వయసులో, నాతో ఇన్నేళ్ళు గడిపిన తర్వాత, అలాగ ప్రాణంలేని కంప్యూటర్‌తో ప్రేమలో పడ్డాడా! నా ప్రేమ, జ్ఞాపకాలు అన్నీ చులకన అయినట్లు అనిపిస్తుంది.” ఎమోషన్ గొంతులో. ఈ సమయంలో చాలామందికి లాగే ఈవిడకి డిటెక్టివ్ కన్నా ఒక థెరపిస్ట్ అవసరం.

“ఇంకా ఉంది — కొన్ని సౌండ్ ఫైల్స్ కూడా దొరికాయి. ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. ఇప్పుడే చూస్తున్నాను. కవితలాగా కనిపిస్తుంది.”

“కవితనా? కవిత్వం చదవడం మానేసి ఇరవై ఏ‌‌ళ్ళయింది అనుకున్నాను!” జ్ఞాపకాలతో ఆమె గొంతు.

“ఆ సౌండ్ ఫైల్‌ని డీకోడ్ చేసే లోపల ఫోటో కూడా వచ్చేటట్లు ఉంది. ముందు అది చూపిస్తాను. అన్నీ మీ రికార్డ్స్‌లో క్లౌడ్‌లో ఉంటాయి. మీ అకౌంట్ సెటిల్ అవ్వగానే మీకు పూర్తిగా చూడటానికి కుదురుతుంది.”

ఒకసారి అంతా ఇచ్చేసిన తర్వాత డబ్బులు ఇవ్వని కేసులు ఉన్నాయి. అందుకే ఈ జాగ్రత్త.

ఫోటో చూపించాను. ఫొటోలో ఒక అందమైన అమ్మాయి — పాతికేళ్ళున్నట్లున్నాయి.

“…”

“తెలిసిన వారి ఫోటోనా?”

నాకనవసరం కానీ, ఆమె మౌనాన్ని తెంపడం కోసమే కాదు, నా కుతూహలం కొద్దీ కూడా అడిగాను. ఏఐ ప్రియురాళ్ళు, నిజానికి, సినిమా హీరోయిన్లకన్నా పక్కింటి కుర్ర పిల్లల రూపంలో కనబడుతుంటారు సాధారణంగా. ఒకసారయితే, మరదలు రూపంలో కనబడింది! ఆ భార్య ఎక్స్‌ప్రెస్ కోర్టుకి వెళ్ళి మరీ డైవోర్స్ తెచ్చుకుంది!

“అది నా ఫోటోనే. పెళ్ళి కాక ముందు రోజులది.” ఆమె గొంతు నెమ్మదిగా పలికింది.

“ఓహ్!” నాక్కూడా ఆశ్చర్యం వేసింది. “ఈ కవిత వినండి — ఇది కూడా ప్రోగ్రామ్ ట్రెయినింగ్‌కి వాడారు.” నేను ప్లే బటన్ నొక్కాను.

“నువ్వున్నావు. నీ పాట లేదు.
ఉదయాన్నే కాలం కరిగిపోయే కాఫీ కప్పుల ఉరుకుల పరుగులలో,
రోడ్ల దుమ్ము మధ్య హారన్ రణగొణ ధ్వనుల మధ్య
మధ్యాహ్నపు చెమట తడి అంటని మేకప్పు కింద
షాంపూ, పెట్రోలు, చిరాకు కలిసిన వాసనల మీద,
పనివాళ్ళ మీద పెరిగిన గొంతు వెనక,
సాయంత్రం నలుగురి మధ్యన పార్టీలో పూసుకొన్న నవ్వు చాటున,
ఆరుబయట పిండార పోసిన వెన్నెల ఆపుతూ కర్టెన్ల పడకగదిలో
నువ్వున్నావు. నీ పాట లేదు.”

“ఇక చాలు.” మధ్యలోనే ఆపించింది. “ఆయన గొంతే. అంతకు ముందు రోజుల్లో నువ్వు లేవు. నీ పాట ఉంది అనే కవిత వినిపించే వాడు. ఇప్పుడు నేనున్నాను. నా పాటలేదు.” గొంతు కొంచెం బరువుగా ఉంది.

“ఇంకా వివరాలు వెతకమంటారా?” అడిగాను, ఎలాగ ప్రొసీడ్ అవుతున్నామో తెలియక. ఇంతకీ ఆ కోర్టు ప్యాకేజ్ తీసుకుంటుందా లేదా?

“వద్దు. నా పాటతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఉన్న వివరాలకి బిల్లు పంపండి.” గోడ మీద ఆమె ముఖం అదృశ్యమైంది.

“సిరీ, బిల్లు పంపి కేసు క్లోజ్ చెయ్యి.”

గోడ అంతా గ్లాస్ కిటికీ అయింది. దూరంగా ట్యాంక్‌బండ్ మీద తాజ్ మహల్, దాని పక్కనే ఐఫిల్ టవర్ కూడా కనబడుతున్నాయి. బయటంతా సందడిగా ఉంది. ఎవరో జంట చెట్టా పట్టాలేసుకొని నవ్వుకుంటూ వెళుతున్నారు.