బోడి పద్యం

కృతకమయిన పద్యం రాసిన రాత్రి
కంటి రెప్పల్ని ఇనప తాళ్ళతో లాగుతారు, ఎవరో, దేనికో!
నిద్రాశిల్పం పగిలి పగిలి
పది ముక్కలవుతుంది
ప్రతీ శకలం వొక వికృతమయిన నవ్వు.
పద్యానికీ నిద్రపట్టదు
నాకు మల్లెనే!

బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
గుక్కపట్టి ఏడుస్తోంది
నా గంగానమ్మ మురికి వొడిలో.
సూర్యుడి పొద్దుటి నీరెండ చాదర్ కింద
సూఫీ ఫకీరు చేతుల్లోంచి
గజ్జెల దండ రాలిపోయి
దేవుడి నామాలు ఆరున్నొక మూగ రాగాలు.

భజ గోవిందం భజ గోవిందం
నేనెప్పుడూ మూఢమతినే!
పునరపి ఖననం పునరపి దహనం
నేనెప్పుడూ అష్టా వక్ర పద్య పాదాన్నే!

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
సంస్కార్ విచ్చిన్నం సంసార స్వప్నక్రీడితం
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
నా పద్యంలానే!

సగానికి కూలిన మసీదు గోడల మీద
పడీ పడీ ఏడుస్తున్నాను ఇవాళ్టికీ!
బ్రోచే వారెవరురా, రా…రామా…రామా!
నేను తిరిగిన వూళ్ళలో
నువ్వింకా సుంతీ చేయించుకోనే లేదురా!!
నా రహస్యాంగాన్ని పబ్లిగ్గా చూసిన చిన్నప్పటి నించీ
నువ్వింకా ఏడిపిస్తూనే వున్నావు కదరా!
ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా!
ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే
నా ఇప్పటి పద్యం కదరా!

కృతకమయిన పద్యం రాసిన రాత్రి
మనసంతా అశ్లీలం!
వొళ్ళంతా నెత్తుటిబుగ్గ
ఆ కుండ మీద కూర్చోబెట్టి కోసినట్టే
కుదిమట్టంగా!