గత పదిహేనుఏళ్ళల్లో (యల్లపు) ముకుంద రామారావు ఐదు స్వీయ కవితా సంకలనాలు ప్రచురించారు. నాలుగు తెలుగులోను, తన మొదటి రెండు తెలుగు సంకలనాలనూ కలిపి ఒక కన్నడ అనువాదంగానూ. ప్రస్తుత సంకలనం ఆ రకంగా చూస్తే ఐదవది. 2008 లో ‘నాకు తెలియని నే నెవరో’ అనే కవితాసంకలనం వచ్చింది. 2004 నవంబర్ ‘ఎవరున్నా లేకున్నా’ అనే సంకలనం వచ్చింది. ముకుంద రామారావు గారి మొట్టమొదటి కవితాసంకలనం, ‘వలస పోయిన మందహాసం.’ ఈ పుస్తకం ఈమాటలో ఈ-పుస్తకంగా ఉంది. దీనికి చేకూరి రామారావు (చేరా) పరిచయవాక్యాలు రాసారు.
నిశ్శబ్దం నీడల్లో (2009)
ముకుంద రామారావు
రూ.50.00, $5.00
చేరా ఇలా అన్నారు: “తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు. కవిలా వ్యక్తీకరిస్తారు. ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది. పారదర్శకత్వం ఉండదు. పదౌచిత్యం ఉంటుంది. పదాడంబరత ఉండదు. భావగాంభీర్యం ఉంటుంది. భాష క్లిష్టత ఉండదు. పురోగమన శీలత ఉంటుంది. సిద్ధాంత వలయం ఉండదు. అనుభవం వైయక్తికమే. దృక్పథం విశ్వజనీనం.”
ఈ కొత్త సంకలనంలో 52 పేజీల్లో 40 కవితలున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ఈ సంకలనం ముద్రించారు. ఈ కారణం మూలంగానేనేమో, పుస్తకం అచ్చొత్తించడంలో హడావుడి లేదు. (19 వ శతాబ్దపు మలార్మె (Stephane Mallarme) అనే ప్రముఖ ఫ్రెంచ్ సింబలిస్ట్ కవికి, కవితలు అచ్చు వెయ్యడం గురించి కొన్ని దృఢమైన అభిప్రాయలున్నాయి. వాటిలో ముఖ్యమైన ఒక అభిప్రాయం: పద్యంలో అచ్చైన మాటలు ఎంత ముఖ్యమో, పేజీలో తెల్లజాగాలుకూడా అంతే ముఖ్యం, అని! అంటే, అచ్చైన పద్యం పేజీలో కనిపించే పద్ధతి పద్యానికి చాలాముఖ్యం. మలార్మే ప్రేరణో, ఐశ్వర్యమో తెలియదు కాని, ఈ మధ్యకాలంలో తెలుగు కవితా సంకలనాలు అత్యంత సుందరంగా అచ్చయి వస్తున్నాయి.)
ఇక ఈ సంకలనంలో కవితల గురించి:
ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు: “కవిత్వ తలుపులు తెరిచి, నేను చూసే విశాలవిశ్వాన్ని, అనంతాకాశాన్ని, అద్భుతమైన ప్రకృతిని, అర్థం కాని ప్రపంచాన్ని, అందరితో పంచుకోవాలన్న తపన నాచేత రాయిస్తూనే ఉంది. నాలోని అసంతృప్తికి కారణాల్ని నా లోపలి ప్రపంచంలో వెదుకుతూనే ఉన్నాను. నన్ను తెలిపే పదాలేవో నిశ్శబ్దంలోనే కలిసిపోతున్నాయేమో.”
‘కవిత్వమంటే’ అన్న కవితలో కవిత్వమంటే ఏమిటో:
దోసిట్లో సముద్రం
ఆటుపోట్ల అల
సూర్యకాంతిలో తడిసి మెరిసే
మేఘాల పగుళ్ళలోంచి
చీల్చుకొస్తున్న వెలుగు
ఆకాశానికి వేలాడుతున్న చెట్టు
ఏరుకున్న ఫలక్షణం
తనలో తానే మాటాడుకుంటూ
వీచి విస్తరించే గాలి స్పర్శ
పూలగుండెల్లో ప్రశ్నల మంట
ప్రకృతి కిటికీ
ప్రపంచ గురువు
కళ్ళు కడిగే కన్నీరు
అశరీర ఆత్మ నిశ్శబ్ద నాట్యం
ఇదీ అదని ఎన్ని చెప్పినా
జీవితాన్ని మరణాన్ని
పూర్తిగా విప్పి చెప్పలేనట్లు
కవిత్వం.
అని రాసారు. ఈ కవితలో స్పస్టాస్పష్టతలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి.
‘కూతురు’ అన్న కవిత చూడండి:
ఉదయమెప్పుడూ
కూతురులానే
అందంగా ఆప్యాయంగా వస్తుంది
ఉన్నంతసేపూ ఉత్సాహమే
చీకటిలో కూరుకుపోకుండా
చంద్రుణ్ణి వెలిగించి
లోనున్న నక్షత్రాల్ని బయటకు లాగి
కనుమరుగవుతున్న సూర్యుడిలా
తనింటికి అమ్మాయి
గుర్తు చేసే ఎన్నెన్నో
జాడల్ని వదిలి.
చిన్నచిన్న మాటలు, అందమైన భావన. మొదటి చరణంలో పదాల పొందిక మరీ వాచ్యంగా ఉన్నది.
నిశ్శబ్దం నీడల్లో (2009)
ముకుందరామారావు
నిశిత ప్రచురణలు
ఈయన చాలా కవితల్లో కొన్ని కొన్ని చరణాలు గద్యంలా ఉంటాయి. కానీ, చటుక్కున కవిత మధ్యలోనో, ఆఖర్నో ఒకే ఒక్క చరణం పాఠకుణ్ణి కట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఒక్క చరణం కోసమే మిగిలిన పదాలన్నీ దానిచుట్టూ అల్లుతున్నారా అన్న అనుమానం రాక మానదు. ఇస్మాయిల్ గారి కవితా పద్ధతిని అనుకరించే చాలామందిలో ఈ లోపం కనిపిస్తుంది. అయితే, వచ్చిన చిక్కల్లా, ఇస్మాయిల్ గారు చిన్న చిన్న మాటలు వాడినా ఆయన భావుకత పరిధి చాలా విస్తృతమైనది. దానితోడు, ఆయన కవితల్లో ఒకరకమైన సంగీత ధ్వని ఉంది.
తెరిపి, నిద్రాట, సున్నితం అన్న కవితల్లో ముఖ్య పాత్రలు పాప, అమ్మ, నాన్న. అలాగని వాచ్యంగా కవి చెప్పడు, అది పాఠకుడికి తట్టే భావన. తెరిపి అన్న కవితలో రైల్లో తల్లి, తల్లి ఒడిలో నిద్రపోతున్న పాప. ఎదురుగుండా కవి. తల్లి ఒడిలో పాప నిద్రపోవడం; రైలు కుదుపుకి తల్లి కూడా కునుకు తీయడం – ఈ దృశ్యం రైల్లో అందరం సాధారణంగా చూసేదే! కాని, ముకుందరామారావుగారికి వచ్చిన అనుభవం, కవి అనుభవం.
నీటిలో మెరుస్తున్న చంద్రుడిలా
పాప నవ్వు
మబ్బులతో ఆడుతున్న సూర్యుడిలా
విప్పీవిప్పని గుండ్రటి కళ్ళు.
పిల్లడు ఎప్పుడు నిద్రలేచినా అది ఆనందమే, అమ్మకి!
రాత్రి వాడు నిద్రలేస్తే
ఉదయంలా ఉంటుందామెకి
ఒక్కోమారు భళ్ళున తెల్లవారేలోగా
ఎన్ని ఉదయాలో
సర్వసాధారణమయిన అనుభవాలకి ముకుందరామారావు తళుకు పెట్టడం చేస్తారు. ఆఖరిగా ఏకాంత సమూహం అన్న కవిత చూడండి.
సూర్యోదయం
సమూహం వేపు తోస్తే
సూర్యస్తమయం
ఏకాంతం వేపు
ఏకాంతం
ఆకాశాన్ని హత్తుకుంటున్న వంతెన
అద్దంలో కనబడని రూపం
సమూహం
దేనికీ బెదరని నది
చూసీ చూదని అద్దం
అలవాటయిన దారిలో
కాళ్ళకీ కళ్ళే.
ఈ సంకలనంలో ఈ కవిత పాఠకుణ్ణి ఆలోచింప జేసే కవిత. భావగాంభీర్యత ఉన్నకవిత.
ఈ మధ్య ఒక హైదరాబాద్ పుస్తక ప్రచురణ సంస్థలో పని చేసే పెద్దమనిషి ఒకాయన అన్నారు – ఈ సంవత్సరంలో (2010 ఇంకా సగం మిగిలే ఉన్నది!) తెలుగులో దాదాపు రెండువందలయాభై కవితా సంకలనాలు వచ్చాయట! ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆయన అతిశయోక్తిగా అన్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే, అసలు తెలుగు చదవడమే అంతంత మాత్రంగా వున్నదని గోల పెడుతున్న ఈ రోజుల్లో, ఈ కవితా సంకలనాలు ఎందుకోసం ఎవరికోసం అన్న ప్రశ్న వేధించక మానదు. వచన కవితలు చదివే జనం పెరిగారా? వచన కవితలు రాసే జనం పెరిగారా?
నాకు తెలిసిన ఒక వామ పక్షమేధావి ఒకసారి ఇలా అన్నాడు. వచన కవిత్వం రావడం మూలంగా కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది అని. కవిత్వం డెమాక్రటైజ్ అవడం అంటే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
(నిశ్శబ్దం నీడల్లో (కవిత్వం) – ముకుంద రామారావు (డిసెంబర్ 2009). నిశిత ప్రచురణలు, హైదరాబాద్. 64 పేజీలు, వెల 50 రూపాయలు / 5 డాలర్లు
దొరికేచోటు: Nishita Publications, 1-7-23/1 Street No. 8, Near ISI, Habsiguda, Hyderabad 500 007.)