ఉద్యమ కవితా శివసాగరం

ప్రపంచ సాహిత్యమంతా అయితే ప్రేమ లేదంటే యుద్ధం అత్యధిక స్థాయిలో సాహిత్యాన్ని ఆక్రమించిన, సాహితీకారులను ఆకర్షించిన రెండు అంశాలు. తెలుగు సాహిత్యంలో చాలావరకూ విప్లవ కవిత్వానికి పర్యాయపదంగా నిలబడ్డది శ్రీశ్రీ మాత్రమే. ఈ గండభేరుండ రెక్కల ధ్వనిని దాటి నిజమైన విప్లవ సాహిత్యం జనంలోకి రావటానికి చాలాకాలమే పట్టింది. బహుశా అప్పటి కాలానికి శ్రీశ్రీ చేసింది సాహసమే అయినా ఏ సంప్రదాయ కవిత్వపు గోడలనైతే ఆయన బద్దలు కొట్టారో ఆ స్థానాన్ని మరో పర్వతం ఆక్రమించేసింది; దాని పేరు కూడా శ్రీశ్రీనే. దిగంబర కవిత్వం వరకూ శ్రీశ్రీ వేసిన ముద్ర బద్దలు కాలేదు. దిగంబర కవిత్వం కూడా జనసామాన్యానికి కాస్త దూరంగా ఉన్న మాటనూ ఇక్కడ కొంతవరకూ అంగీకరించాలి. ప్రజా విప్లవ పంథాలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారికి ‘కవిత్వం’ కాస్త దూరంగానే ఉండిపోయింది. (ఇక్కడ శ్రీశ్రీనో, దిగంబర కవులనో తక్కువ చేయటంలేదు.) బర్రెంక సెట్టుకింద నరుడో! భాస్కరుడా!/ బందూకు పడ్తివయ్య నరుడో! భాస్కరుడా! తెలంగాణా జనసామాన్యం నోళ్ళలో నానిన ‘ధూలా’ పాట, విప్లవ గీతమయ్యింది. చదువుకోని, చదువురాని నాలుకల మీద నాట్యం చేసింది. కవిత్వం అట్టడుగు వర్గాలకూ దగ్గరయ్యింది, వాళ్ళ సొంతమయ్యింది. శివసాగర్ పేరుతో పాడే పాటా, కవిత్వమూ ఇప్పపూల వాసనలని, నెత్తుటి ఉద్విగ్నతలనీ అద్దుకుంది. శివసాగర్ నిజానికి ఇండియన్ హోచిమిన్, భారతదేశపు పాబ్లో నెరుడా… నీ బాటనే మేము నరుడో! భాస్కరుడా!/ బందూకు పడ్తాము నరుడో! భాస్కరుడా!

కంభం ఙ్ఞాన సత్యమూర్తి (కె.జి. సత్యమూర్తి), శివసాగర్‌గా మారిన సత్యమూర్తి పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమ కవితని సృష్టించాడు. తూర్పు పవనం వీచెనోయ్/తూర్పు దిక్కెరుపెక్కెనోయ్! అంటూ వాడిన ప్రతీ పదం, చెప్పిన ప్రతీ మాట జనాన్ని చేరుకున్నదంటే కారణం ఒక్కటే- ‘ప్రజలనుంచి నేర్చుకున్నది మళ్ళీ ప్రజలకు అందేలా చేయాల’న్న ఆలోచన. శివసాగర్ దృష్టిలో ప్రజలు ఏ ఉద్యమకారుడికన్నా, మరే కవికన్నా తక్కువ కాదు. సాహిత్యం ప్రజల్లోంచే పుడుతుంది, దాన్ని మళ్ళీ ప్రజలకే చేర్చాలి. అందుకే శబ్ద సౌందర్యం కన్నా చెప్పాలనుకున్న విషయం కవిత అయ్యింది, పాట అయ్యింది.

ప్రజల పాట, ప్రజల బాధ, ప్రజా ఉద్యమానికి ఇంతకన్నా పెద్ద కవిత్వం ఇంకేం ఉంటుంది? ఉమ్మడి పార్టీ కార్యాచరణలో భాగంగా ఉన్నంతకాలం శివసాగర్ జనంతో కలిసే బతికాడు. గిరిజనుల, పల్లె పనుల పాటని విన్నాడు, దాన్ని ఉద్యమ సాహిత్యంగా మలిచాడు. కవిత్వంకన్నా పాట అవసరాన్ని గుర్తించినవాడు శివసాగర్. (ఇదే పద్దతిలో గద్దర్ కూడా కొనసాగిన విషయం మర్చిపోరాదు. ఉద్యమ వ్యతిరేకులు కూడా ఆ పాటలకు అభిమానులుగా ఉన్నారు.)

శివసాగర్ ప్రతీ కవిత వెనుకా ఒక నేపథ్యం ఉంది, ఒక వీరుడి మరణమో విజయమో ఉంది, ఒక ఆకలి బాధ ఉంది. ఏ పలుకూ ఊహామాత్రం కాదు, మరే పోలికా సత్యదూరం కాదు. ఒక్క కవిత కూడా జనసామాన్యపు నాల్కలమీద ఆడటానికి ఇబ్బందిపడిందీ లేదు. కన్నీళ్ళింకిపోయిన కనులతో/ ఇక మీకోసం విలపించలేను/రండర్రా! /ఏ జామునైనా రండి/ నా కుటీరం తలుపులు/ అన్ని జాములా మీకోసం తెరచి ఉంచాను. ఎన్నాళ్ళ వేదన ఈ మాతృఘోష! ఎంతటి తపన ఈ మాతృఘోష! 1971లో జైలునుంచి తప్పించుకున్న కామ్రేడ్స్ కోసం రాసుకున్న ఈ కవితలో ఇప్పటికీ వారి రాకకోసం నిరీక్షించాలనే అనిపించేటంత ఆర్ద్రత! నిజమైన ప్రేమికుడు కాలేనివాడు నిజమైన విప్లవకారుడు కాలేడన్న చే గువేరా మాటలు ఇక్కడ మళ్ళీ నిరూపించబడ్డాయి. ధిక్కార గొంతుక సైతం మరింత బలంగా పలకాలనుకున్న వాక్యాలు అలలపై నిఘా/ అలలుకనే కలలపైన నిఘా!/ అలలపై అనురాగం చూపించే/ చిరుగాలి సితారా సంగీతంపై నిఘా! ‘ప్రజలను సాయుధులను చేస్తున్న రెవెల్యూషనరీ నేటి కవి!’ అని ప్రకటించి మరీ రాసిన ప్రజావిప్లవ కవి శివసాగర్.

వియత్నాం కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు హోచిమిన్‌ని విపరీతంగా ప్రేమించిన శివసాగర్ ప్రతీ పోలికా, జనంలో ఉండే ప్రతీ వస్తువునీ కవిత్వంలో వాడటాన్ని మొదలుపెట్టాడట. (ఇది కవిత్వాన్ని జనానికి మరింత దగ్గర చేస్తుందని ఆయన రాసుకున్నాడు కూడా.) మావో కవిత్వాన్ని అదే స్థాయిలో ప్రేమించిన శివసాగర్, నా మల్లియ రాలెను! నీ మొగలి కూడా రాలెను/నా మల్లియ నీ మొగలి ఆకాశం చేరెను! అంటూ మావో రాసిన ఒక ఓదార్పు గీతాన్ని తెలుగులో రాసుకున్నాడు. ఎంతగా అంటే తెలుగులోనే మొదటిసారి రాసినంత సహజంగా.

అప్పటివరకూ విప్లవసాహిత్య ఉద్యమం కవిత్వం దగ్గర ఆగిపోయి తర్వాత అడుగు ఎటు అన్న చిన్న స్తబ్ద కాలంలో ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోయే సరళ భాషతో, అప్పటికే జన జీవితాల్లో భాగమైన పాటతో విప్లవ సాహిత్యాన్ని అడవి తుమ్మపూలతో, గుమ్మెత్తే ఇప్పపూల వాసనతో నింపేశాడు. కులాలుగా విడివిడిగా ఉన్న జనాన్ని, గొల్లోళ్ళా సిన్నమ్మా చనుబాలు తాపిందంట/ కురుమోడూ, గొండోడూ గటక తెచ్చారంట/ పరథాను పరమేశు పసరు పోసిండంట/ మన్నెపూ మామయ్య కట్టు కట్టిండంట/ తోటరాముడూ కళ్ళు తెరిచి నవ్విండంట, అంటూ రాసిన ఓ! విలుకాడ అన్న గీతం ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. కవిత్వం జనకవనమైంది, శివసాగరుడు జనం గొంతుకయ్యాడు… 1931లో పుట్టినవాడు 1940ల నుంచే ఉమ్మడి పార్టీ కార్యాచరణలో భాగమయ్యాడు. ఓ! విలుకాడ, గీతమే కాదు, ఆ గీతం ప్రాణం పోసుకున్న వైనాన్ని 1979 జనవరి 14న వరంగల్ విరసం సాహిత్య పాఠశాలలో చెప్పిన తీరూ ఆకట్టుకుంది.

ఒకానొక దశలో ఉద్యమం నెలబాలుడు యువకుల చేతుల్లో, ఆ కవితలు ఆనాటి యువత పెదాలమీదా ఉండటానికి కారణం కూడా అవి ప్రజల భాషలోంచి వచ్చిన పదాలు కావటం వల్లనే అన్న విషయాన్ని గమనించాలి. ఎర్ర జెండా మనకు/ అండగా ఉన్నాది/ సంఘ బలమే మనకు/ బాసటగా ఉన్నాది/ పోరాటమొక్కటే చెల్లెమ్మ/ మన బతుకు బాటనే చెల్లెమ్మ, అంటూ రాసిన వాక్యాలు కావొచ్చు, విర్రవీగే వియత్నమోడా అని కంపూచియా మీద వియత్నాం దాడి చేసినప్పుడు రాసిన గీతం లోనూ రివిజనిస్టు రష్యాని ఎండగట్టిన తీరు కావొచ్చు… లేదూ తెలంగాణా ప్రాంతపు పాట శైలిలో రాయటం వల్ల కావొచ్చు– ఉద్యమం నెలబాలుడు ఆనాటి జనం పెదాలమీద ఆడుకున్నాడు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా పోరాట సాహిత్యాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తీకరణ, దాన్ని ప్రజల్లోకి వదిలిన తీరూ శివసాగర్ సొంతం. సుదీర్ఘ ప్రజాపోరాట జీవితం వల్ల వచ్చిన విప్లవ సాహిత్య సాంస్కృతిక అవగాహన కూడా ఇప్పటికీ, రాబోయే కాలానికీ ఆయన కవిత్వాన్ని నిలబెడుతూనే ఉంటుంది.

విప్లవ కవిత్వంలో ‘చందమామ’ లాంటి పదాలు ఉండకూడదని చర్చ నడుస్తున్న కాలంలో హోచిమిన్ కవిత్వం వల్ల ఆ అభిప్రాయం మార్చుకున్నాడట. బహుశా అందుకేనేమో 1972లో మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు రాత్రే, శత్రువు చేజిక్కితినని/ వెక్కిరించకు నన్ను/ మిత్ర ద్రోహము చేత/ శత్రు చేజిక్కితిని/ చందమామా! చందమామా! అని ‘ఖైదీ గీతం’లో రాసుకున్నాడు. తనకాలపు విప్లవ పోరాటాన్ని, దాని అడుగులనీ జాగ్రత్తగా రిజిస్టర్ చేసిపెట్టాడు. 1984 నుంచి 1986 వరకూ పీపుల్స్ వార్ పార్టీలో జరిగిన పోరాటం గురించి కామ్రేడ్! నిజం/ ఇది లాంగ్ మార్చ్!(కడలి జాగ్రత్తలో) అని రాసుకున్న తీరు అత్యద్బుతం.

వ్యక్తిగత జీవితం ఒక పోరాటం. ఆయన మరణించిన నాడు ఉన్న పరిస్థితి ఒక విప్లవ స్వాప్నికుని జీవితానికి నిదర్శనం. అదేమీ త్యాగం కాదు ఇది నా బాధ్యత అన్నట్టు బతికిన జీవితం ఒక ఆదర్శం… విప్లవ కవిత్వ ఐకాన్ అనిపించుకున్న శివసాగర్ మాటల్లోనే:

ఉరితీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి
వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు…

అన్న వాక్యాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎక్కడో, ఏ మనిషి నుంచో, ఏ విప్లవ నినాదం నుంచో పుట్టుకువచ్చే శివసాగర్ కోసం ఎదురుచూసేలా చేస్తాయి. విప్లవం కుట్ర కాదు, విప్లవకారుడు కుట్రదారుడు కాదు. శివసాగర్ ఎన్నటికీ మరణించేవాడూ కాదు. కవిత్వమంటే ఆల్కెమీ కాదు, అది రైతు దున్నే మట్టి పరిమళం! అని చెప్పినవాడు కదా! మోదుగ పూలలోనో, ఈదురు గాలిలోనో కనిపిస్తాడు. పొలం దున్నే నాగేటి చాళ్ళలోనో, గ్రీన్ హంట్ శకటం పేలిన చప్పుడు లోనో వినిపిస్తాడు. నిఘాలని దాటుకుని వినవచ్చే ఏదో ఒక అడవి పిల్లడి గొంతులోనో మళ్ళీ పుట్టే తీరతాడు. ఎదురు చూద్దాం…