కొళాయిలో నీళ్ళు వచ్చినవి

[ఎల్. ఎన్. శేషగిరిరావుగారి సంపాదకత్వంలో, శ్రీ గడియారం రామకృష్ణ శర్మ అనువాదం చేసిన కన్నడ కథానికలు (సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, 1979) అన్న పుస్తకంలోనిది ఈ ‘కొళాయిలో నీళ్ళు వచ్చినవి’ అనే కథ.ఈ సంకలనంలో అన్ని కథలు అచ్చమైన కథలే, గొప్ప కథలే, చిన్న చిన్న మాటల తేనెపట్లే. ఈ ‘కొళాయిలో నీళ్ళు వచ్చినవి’ అనే కథను చదివిన కొత్తలో తమకం చెంది కథని స్కాన్ చేసి ఎంతమంది చదువరులకు పంచానో నేను! అయినా పుస్తకాల గూళ్ళో ఈ పుస్తకం చూసినప్పుడల్లా దీనిని మెషిన్ కడుపున పెట్టి స్కాన్ కాదు కదా తియ్యవలసినది అని నొప్పి చెందేది మనసు. అందుకని ఎనిమిది పేజీల కథను మునివ్రేళ్ళారా అక్షరమక్షరం టైప్ చేస్తే కదా కాసింత తృప్తి కలిగింది నాకు. గొప్ప కథ పైని గౌరవంతో చేసిన పని ఇది. సదాశివ తమ ఇరవైలలో వ్రాసిన కథ ఇది. ఏడేడు సముద్రాలు దాటి వెళ్ళి తెచ్చినది కాదు కథావస్తువు. కొండలు ఎక్కీ దిగీ కస్తూరి పరిమళం తెచ్చి అందులో ముంచి గుబాళింపజేసి తేల్చినది కాదు శైలి. ఇది కథ. అంతే! – అన్వర్.]


కొళాయిలో నీరు నిలిచి పోగానే రంగమ్మకు కోపము మితిమీరెను. ఇంకా రెండు బిందెలు కావలసి ఉండగానే ఆగిపోవడము అంతలోనే సీతమ్మ అరవడము ఒళ్ళు మండించినది. ‘ఓర్వలేనిది, ఇప్పుడు చావనీ’ అనుకుని నింపిన హండాకు, పాత్రలకు మూత పెట్టి గుటికెడు నీళ్ళు త్రాగి దీపమార్చి వసారాకు వచ్చెను. అప్పటికే భర్త గురక పెడుతున్నాడు. పిల్లలు నిద్ర పోతున్నారు. దీపము చేతికి తీసుకుని గదిలోకి పోయి టైముకు చూచెను. పదకొండున్నర అయినది. మళ్ళీ వసారాలోకి వచ్చి పరుపు పరచెను అప్పుడనిపించెను. ‘ఆమె నీళ్ళు లేవని కొట్టుకున్నది. చెంబెడు నీళ్ళు అడిగితే ఇవ్వనా, ఏమిలేకపోయినా జంబము మాత్రం ఉంది. హు! ఎవరు వింటారు ఇవన్నీ. కోపపడి కూచుంటే కూర్చోనీలే ఎవరికి నష్టం. నీళ్ళు నిలిచిపోతే నా తప్పా.’ పరుపు పరిచి దుమ్ము దులిపెను. అంతలో పాలు మూసి పెట్టలేదని గుర్తుకు వచ్చి వంటింటి లోపలికి పోయెను.

సీతమ్మ చేసుకున్న కషాయము త్రాగి బయటికి వచ్చి పరుపు ఝాడించెను.

“నేనింకా నాలుగు రోజులు ఊర్లో ఉండనమ్మా. దయచేసి సీతను చూసుకునే భారం మీదే. రాత్రి మా ఇంట్లోనే పడుకుంటే…

“అయ్యో దానికేమి నాయనా, నేను మనిషిని కానా, తప్పకుండా పడుకుంటాను. నీవు నిరాటంకముగా నీ పనికి పోవచ్చు. మా పిల్లల్లో సీతమ్మ ఒకటి.”

క్యాంపు పోయే ముందు తన భర్త రంగమ్మను పిలిచి చెప్పి తనకు ధైర్యము కలిగించి వెళ్ళడము తలుచుకొనెను. పాపం. వారు దూరములో ఉన్నా ఆయన మనస్సు ఇంటి విషయమే ఆలోచిస్తుండవచ్చు అనుకొనెను. చీకట్లో తానొక్కతే ఉందవలసిన పరిస్థితిని తలుచుకుంటే గుండెల్లో భయము నిండెను. ఆమెను తోడుగా పిలుస్తామా అనిపించి మళ్ళీ, ఊహూ చూస్తాం ఆమే రావచ్చు. ప్రొద్దున తన భర్తకు ధైర్యమిచ్చింది కదా. అది జ్ణాపకము రాకపోతుందా అనుకొనెను. భయమూ నడుమ వచ్చిన బిగుమానమూ భూతమైనది. కావాలనే మళ్ళీ రగ్గును ఒకసారి ఝాడించెను. ఆమెకు వినపడాలని, శబ్దము విని రావాలని.

ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకునిపోయెను. దీపము సన్నగా చేసి పరుపు మీద శరీరము వాల్చి మసక వెలుగుతో నెత్తురు గుడ్డును ఊహించుకుంటూ రంగమ్మ రాకనే కాచుకుని ఉండెను. రగ్గు ఝాడించడము రంగమ్మ కూడా విన్నది.

“ఏమండి వింటున్నారా?”

“ఏమి?”

“రాత్రి సీత ఇంట్లో పండుకుంటాను”.

“ఏమి?”

“అతను ఊళ్ళో లేడు, చెప్పి పోయినాడు పాపం నెలలు నిండిన మనిషి.”

“సరే! కానీ! దానికేం.”

పగలు భోజన సమయములోనే ఆమె భర్తతో అనుమతి పొందినది. సీతమ్మ రగ్గు ఝాడించినపుడు అది గుర్తుకు వచ్చెను. అయినా ఊరకుండెను. ఆమెకు కోపము వస్తే నేనేమి చేసేది. ఇంత చిన్న విషయాలకు కోపగించుకుంటే ఎవరైనా నవ్వుతారు. రేగి కూచుంటే కూచోని. నాకేమవసరము. ప్రాధేయపడి మాట్లాడడానికి. వ్రేలెడంత మనిషికి పదిమందిని కన్న తాను బెదరటమా?

దీపము పెద్దగానే వెలుగుతున్నది. దినమంతా పనిచేసి అలిసిన దేహము పరుపు కోసము త్వరపడుతున్నది. పరుపు మీద నిద్రపోతున్న బిడ్డను ప్రక్కకు జరిపి దీపము దూరముగా పెట్టి వళ్ళు వాల్చెను. హాయి అనిపించినది.

దీపము పెద్దగా మండుతున్నది. నిద్ర ముంచుకుని వస్తున్నా మహా ప్రయత్నముతో ఆపుకొని ఆమె పిలుస్తుందేమో అని కాచుకొన్నది- నిద్ర పట్టినది.

“అయ్యో! చస్తిని.”

బిడ్డని ఆడిస్తుండిన రంగమ్మ చెవి యొగ్గి వినెను.

“అయ్యో! అయ్యో!”

ఇంటి చూరు వణికెను. భూమి కంపించెను, గదిలో పొగనిండి ఊపిరి ఆడనీయలేదు. చుట్టూ పిల్లలు నవ్వుతున్నారు. హ్హ హ్హ హ్హ హ్హ. గడియ కాలేదు. సీతమ్మ భర్త ఎదురు నిలిచి కండ్లలో నిప్పులు రాలుస్తున్నాడు.

నర్స్ తీక్షణముగా చూస్తున్నది.

తన మొగుడు మింగేట్లు చూస్తున్నాడు.

“ఏమండి, గాడిద వలె ఉన్నారే. కొంచెం చూసుకోలేక పోయినారా?”

“అంతమందిని ఎందుకు కన్నారు. తగలెట్టండి.”

“అయ్యో రాక్షసి!” రంగమ్మ చెయ్యి విసిరి వాళ్ళను కొట్టడానికి యత్నించెను… చెయ్యి పైకి లేవలేదు.

సీతమ్మ పడి ఉన్నది. రక్తపు మడుగులో రంగమ్మ ఈదుతున్నది. పుట్టిన శిశువు కండ్లు మిటకరిస్తూ ఏడుస్తున్నది. పైకప్పు కంపిస్తున్నది.

తటాలున రంగమ్మకు మెలకువ వచ్చెను. కండ్లు తెరుస్తూనే పెద్దగా మండుతున్న దీపము భయంకరముగా కనపడింది. పక్కనున్న బిడ్డ ఏడుస్తున్నది. బిడ్డను తొడ మీద ఉంచుకుని జో కొడుతున్నది. నిద్ర మైకము జారి యథాస్థితికి వచ్చిన తరువాత ధైర్యము వచ్చెను. బిడ్డ నిద్రపోయినది. రూములోకి పోయి టైము చూసి తన కన్నులు తానే నమ్మలేకపోయినది. నాలుగున్నర అయి ఉంది. బయట కాకి కూతలు వినవస్తున్నవి. అప్పుడు రాత్రి జరిగినది జ్ణాపకము వచ్చి గుండెలదిరెను.

‘ఇంతకూ అమ్మాయి భలే మొండిది. నాకు వయసు వచ్చీ దండగ. ఆడవాళ్ళకు అంత హఠము ఉండకూడదు’ అనిపించెను. మెల్లగా లేచి హండా క్రింద నిప్పు వేసెను.

నీళ్ళు కాగేవరకు ఇంటి పనులు చేసుకొనెను. మాటి మాటికి సీతమ్మ ఇంటి వాకిలిని చూస్తుండెను. భర్త స్నానము చేసి బచ్చలినుండి వచ్చిరి. తడిపిన టవల్ ఉతకడానికి కంపౌండ్లో సమిష్టిగా ఉండిన కొళాయి దగ్గరకు పోయెను. ఇంకా నీళ్ళు రాలేదు. లోపలి నుంచి తపేలతో నీళ్ళు తెచ్చుకొనెను.

బట్ట ఉతికిన చప్పుడుకు సీతమ్మకు మెలకువ వచ్చినది. కనులు తెరచి చూస్తే దీపము చిన్నగా వెలుగుతున్నది. ఏదో గుర్తుకు వచ్చి వళ్ళు ’జుమ్’ అనెను. సధ్య నొప్పులు తగ్గినవి. మెల్లగా లేచి తలుపు తెరచి బచ్చలికి పోయెను. పోయేటప్పుడు తిరిగి చూడగా రంగమ్మ కనపడెను, రాత్రి జరిగినది గుర్తుకు వచ్చి గుండె బరువయ్యెను. మౌనముతో లోపలికి పోయి హండాలో తొంగి చూచెను. అడుగు పట్టిన నీళ్ళల్లో తన మొహము సగమే కనపడెను. వట్టి బిందెను నడుమున పెట్టుకుని మూడిండ్ల ఆవల ఉన్న బావినుంచి నీళ్ళు తేవడానికి కదిలెను. బయటకి వచ్చిన రంగమ్మ ముందునుంచి మౌనముగా తలవంచుకుని పోయెను.

“బిందె ఇక్కడియ్యి సీతమ్మా” రంగమ్మ అనెను.

చెవిటిదానివలె ఆమె అడుగు ముందుకు వేయగానే రంగమ్మ లేచి వచ్చి ఆమె చంకలోని బిందెను లాక్కొనెను.

ఎదురుగా ఉన్న కొళాయి ’కొర్’ అని కూసెను. నీళ్ళు రభసముగా కొళాయి నుండి చిమ్మినట్లు పడుచుండెను. చిమ్మిన నీరు ఇద్దరి ముఖాలను తడిపెను. సీతమ్మ రంగమ్మ ముఖమును చూసెను. రంగమ్మ కళ్ళలో కనపడీ కనపడకుండా నీళ్ళు వచ్చి దృష్టి మందగించెను. ముఖమును ప్రక్కకు తిప్పుకొనెను.

(మూలం: నల్లియల్లి నీరు బందితు, 1958)