మరుజన్మ లో దేవా!
మహానుభావా!
నన్ను ద్రోణుడిలా కుండలోనే
పుట్టనీ, అమ్మా నాన్న లొద్దు.
తిన్నడిలా అడవుల్లో ఉండనీ
ఇల్లొద్దు, వాకిలొద్దు.
అంజనీ పుత్రుడిలా సూర్యుడితో
తిరిగి చదువుకోనివ్వు. మేష్టారొద్దు.
ఆ సూత పుత్రుడిలా -ఆ రాధేయుడిలా
ఏకాకిగా పెరగనియ్యి దేవరా!
సోదర సోదరీ మణులొద్దు.
స్వామీ, వద్దు, వద్దు
పెళ్ళొద్దు, పెటాకులొద్దు
భీష్మునిలా ఉండనియ్యి , పరమాత్మా!
నిస్సంతుగా నన్నుండనియ్యి,
నీ రుణముంచుకోను.
అన్ని సంబంధాలూ బెడిసి కొట్టినవి
అంతర్యామీ అలసితి, సొలసితి.
జై పరమాత్మా, జై పరంధామా!
మత్స్య, కూర్మ, వరాహావతారా
నరసింహా, వామనా,
పరశురామా, రామా!
కృష్ణా, బలరామా, కల్క్యావతారా!
కనిపించావా తండ్రీ!
ఇంతకాడికి నువ్వు మళ్ళీ పుట్టకపోతేనేం
అంటున్నావా? హే దేవ దేవ! హే జగన్నాధ!
అలాగే కానీ దేవా, అంతకన్నా మహా భాగ్యం లేదు.