నభూతో నభవిష్యతి

“ఏవండీ! ఓ మాటిలా వస్తారూ!”

వస్తాను. రాకేం చేస్తాను! నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా పద్మావతి పిలవంగానే ఆవిడ సమక్షానికి హుటాహుటిన పోకేం చేస్తాను? అసంకల్పిత ప్రతీకార చర్య! ముప్ఫై అయిదేళ్ళ నుంచి అదే తంతు. ఎదురుగుండా ఉన్నంతవరకూ పెద్దగా ఏమాటా ఉండదు. నామటుకు నేను ఏదో కాలక్షేపం కల్పించుకుని కొంచెం ప్రశాంతంగా సెటిలయ్యానని ఆవిడకనిపించి, కూతవేటు దూరంలో నేనుంటే చాలు – ఏవండీ ఓమాటిలా వస్తారూ?

ఏమివాయ్ మైడియర్ సత్యమూర్తీ, సృష్టిలో ఏమేమి కలవు? పెళ్ళాలు కలవు. సృష్టి ప్రక్రియకి పెళ్ళాలు అవసరమా? ఎంతమాత్రం కాదు. పెళ్ళాలనే స్పీడ్‌బ్రేకర్స్‌ని సృష్టించిన భగవంతుడు పప్పులో కాలేశాడని అనిపించుట లేదూ? పరమ జిడ్డు పప్పులో కాలేశాడని అనిపించుచున్నది. పెళ్ళి అనే మాయాజాలం చేసి స్త్రీలో సహజసిద్దంగా ఉన్న లలితలావణ్య సుకుమారాలని ఒక్కపెట్టున భగవంతుడు ఆమెనుంచి లాగేసుకుంటాడు కాబోలు. పెళ్ళి తొడిగిన కళ్ళజోడు తియ్యలేను, మార్చలేను, కళ్ళజోడు మీద రోజురోజుకీ పేరుకుపోతున్న మకిలి తుడవలేను, ప్రపంచం ప్రతిక్షణం మకిలితో ప్రవర్ధమానమవుతున్నప్పటికీ దృశ్యంలోని కళావిహీనత్వాన్ని కమ్మేయకుండా ఆపలేను.

వయస్సు మీదపడేకొద్దీ ఇంకా ఊబిలో దిగబడిపోతున్నానని తెలుస్తున్నప్పటికీ బయటపడటానికి ఏమీ చెయ్యలేని నిర్వీర్య పరిస్థితి. ఏదో చేద్దామనే ఆరాటంతో జీవితపు కొంతభాగం గడిచిపోయింది. ఇంకెన్ని చేయాలో కదా అన్న ఉబలాటంతో ఇంకొంతభాగం ఇంకిపోయింది‌. ఆరాట ఉబలాటాల పేరుతో విధి నీతో ఫుట్‌బాల్ ఆడుకుంటోందన్న ఎఱుక నిన్ను నవ్వాలో ఏడవాలో తెలియని దిగ్బంధంలో పడేస్తుంది. అవతలి టీములో హేమాహేమీలు పదిమంది, ఇవతల బక్కపీచు నువ్వొక్కడివి; హాఫ్‌టైమ్‌కి నీకు నలభైఏళ్ళు నిండాయి. స్కోరు 40-0. సెకండ్ హాఫ్‌లో కూడా హాఫ్‌ అయిపోయింది. ఎందుకొచ్చిన ఏకపక్షపు ఆట? ఆట ఆగిందో, నీ ఉనికి గోవిందా.

సుధామయిని కనడం, పెంచడం, బట్వాడా చెయ్యడంలో పాతికేళ్ళ జీవితం రాసుకోవడానికి ఏమీ లేకుండానే ఎటో వెళ్ళిపోయింది. సకలనిర్ణయాధికారాలు, మెహర్బానీలు తల్లీకూతుళ్ళవి. వాళ్ళు అడిగినప్పుడు అడిగినంత జేబులోంచి డబ్బు తీయడం, ఎక్కడ తేడా వచ్చినా తప్పు నాదేనని ఒప్పుకోవడం నావాటాకి రాశారు. ఎవరికీ చెప్పుకోలేని, నన్ను నేను తిప్పుకోలేని చక్రవ్యూహం.

‘ఎంత సేపటికీ వాళ్ళూ వీళ్ళూ, నీవాళ్ళతో సహా, నీకేదో అన్యాయం చేసినట్లు మాట్లాడతావెందుకు! నీబుద్ధేం పుచ్చిపోయింది?’

ఇది చాలా బావుంది! నాలోనేను నస పెట్టుకోవడం కూడా తప్పే? అదొకటే కదా నాకు మిగిలిన అల్పసంతోషం! నా బుఱ్ఱలో ఇటువంటి అఘాయిత్యపు సినిమాలు నిత్యకృత్యంగా ఆడుతూ ఉంటాయని ఇంకో నరమానవుడికి తెలిస్తే నా దరిదాపుల్లోకి మళ్ళీ రాడు. మౌనో రక్షతి రక్షితః.

సుధామయి అధ్యాయం ఒక కొలిక్కి వచ్చింది, ఎనిమిదేళ్ళ నుంచీ దాని మానాన అది పంజాబులో పొందికగా కాపురం చేసుకొంటోంది. దాని కొడుక్కీ అయిదేళ్ళొచ్చాయి. ధైర్యం చేసి, నేను నమ్మని దేవుడి మీద భారం వేసి, అనుగ్రహ భాషణం ఒకటి రిహార్సల్ వేసుకుని మరీ సిద్ధం చేసి, ఒక శుభముహూర్తాన పద్మావతితో చెప్పేశాను.

“పుట్టుకొచ్చే మనవసంతానాన్ని సాకడం, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆ పిమ్మట సుధామయి తాలూకు అల్లుళ్ళు, కోడళ్ళతో ఇహిహీ అంటూ పూసుకోవడం… ఈ లంపటానికి ముగింపు ఉందా? ఇప్పటికే నా జీవితం ఒక నాటకమయిపోయింది. పాస్ మార్కుల నటన కూడా నావల్ల కావటం లేదు. ఇహ నటించటం నావల్ల కాదు. లేటుగా వచ్చినా నా బుఱ్ఱకి వెలుగు నీటుగా వచ్చింది. మీ బతుకులు మీకు కావలసినట్లు మీరు బతుక్కోండి. నాకిక బాధ్యతలు వద్దు, హక్కులూ వద్దు. డబ్బూదస్కం ఉన్నదంతా మీరు పుచ్చుకోండి. పాక్షికసన్యాసం నేను పుచ్చుకుంటున్నాను.”

పాక్షికసన్యాసం అన్నపదం మొదటిసారి వింటున్నానంది పద్మావతి. పదాన్ని పుట్టించటం, పుచ్చుకోవడం, ఒకేసారి జరగవచ్చు, ఇప్పుడు అదే జరిగిందన్నాను నేను.

షష్టి పూర్తయితే పునర్జన్మ వచ్చినట్లట. ఆ లెక్కన నేను మూడేళ్ళ బాలసన్యాసిని.

తుంపర పసే కాని, మంత్రం పస లేదన్నట్లు ఈ బాలసన్నాసికి వాగుడొకటే మిగిలింది. లోపలంతా డొల్లే. పేరు గొప్ప. సత్యమూర్తి! ప్రభుత్వం వారి రిసర్చ్ లాబ్‌లో సైంటిస్ట్‌. ఏమి రిసర్చ్ చేశానో, ఎంత సైంటిస్టునో నాకు తెలుసుగా, బయట హంగులు ఎన్నుంటే మాత్రమేమి? మెషిన్‌లో లింకుది నాకంటే ఎక్కువ గౌరవప్రదమైన జీవితం. ఏ ఒక్క లింకు సరిగా పని చేయకపోయినా మెషిన్‌ ఆగిపోతుంది. నాలాటి బోడి జంగాలు నలుగురు నాలుగురోజులు నాగాలు పెట్టినా కూడా వ్యవస్థలో గుర్తించే నాథుడు ఉండడు. ఎదురు చూడగా చూడగా ‘విశ్రాంత ఉద్యోగి’ అనిపించుకునే రోజు రానే వచ్చింది. వచ్చి అయిదేళ్ళపైనే అయింది. గడిచిపోయిన రోజులే గుడ్డిలో మెల్ల అనే నిశ్చయం రోజురోజుకీ బలపడుతోంది.

ఫలానా దినచర్య, ఉప్పో చప్పో, సాయంత్రం ఆరు దాకా ఏదో ఒకటి ఉండి ఏడిసేది కద. ఇంకో నాలుగు గంటలు ఇంతోటి పెళ్ళాం ఎదురుగుండా ఉంటే ఉంది, ముళ్ళమీద గడిపినట్లు గడిపేస్తే రోజు ముగుస్తుంది, నిద్రాసౌఖ్యం దక్కుతుంది. పునరపి జాగరణం, పునరపి శయనం. ఇప్పుడు రిటైరయినాక పొద్దున లేవంగానే పెద్ద సమస్య. రోజెలా గడవాలి? అధమ పక్షం పదిహేను గంటలు!

నాదే పొరపాటు. చిట్టెంలా ఉన్న చిక్కడపల్లి ఇంటిని, హాయిగా ఉన్న హైదరాబాదునీ రిటైరవగానే వదిలేసి, బెజవాడ కుమ్మరిపాలెం కొంపకి రావడమేమిటి రిటైర్డు జీవితం గడపటానికి? ఏం బావుకుందామని? ఏం పూసుకుందామని, ఎవరిని చూసుకుందామని?

‘లోపలికి వెతుక్కో, నీకే తెలుస్తుంది. ప్రశాంతజీవనం వెతుక్కోవడం కాదు, పాడూ కాదు. పద్మావతిని అకస్మాత్తుగా స్థానభ్రంశం చేయిస్తే ఉక్కిరిబిక్కిరై మార్గాంతరం లేక ఇకమీదన్నా నిన్ను కొంచెం మర్యాదగా చూసుకుంటుందని వ్యూహం వేశావు. లెక్క తప్పింది. ఆవిడ వ్యాపకాలు ఆవిడ నిక్షేపంగా ఏర్పరుచుకుంది. నీ స్టేటస్‌ ఏమీ పెరగలేదు సరికదా నీ వ్యవహారమే తాడూబొంగరం లేకుండా అయిపోయింది.’

నేనొప్పను. టీవీ చెత్త చూడటం, పోచికోలు కబుర్లు చెప్పడం ఆలోచించేవాడి లక్షణాలు కావు. నా ఆత్మానందం కోసం నేనెవ్వరిమీదా ఆధారపడను, పెళ్ళాంతో సహా. చరిత్రలో ఎంతోమంది మేధావులు, ఎన్నో సాధించిన మేధావులు జీవితంతో విసిగి ఆత్మహత్య తలపెట్టారు, కొంతమంది చేసుకున్నారు కూడా. నేను మేధావిని కాదు, కానీ జీవించటానికి తగిన కారణం వెతుక్కోలేని మూర్ఖుణ్ణి కూడా కాను. అందినన్ని కోణాలలో ప్రపంచ సుఖాలని, విషయాలని చవిచూసి విసిగి, ఈ ముదిమి వయసులో ఏ వస్తువులోనూ పిప్పి తప్ప రుచి లేదని చూడగలిగేంత జీవితానుభవం వచ్చినవాడిని. మిగతా జనాభా ఈగల్లా శ్లేష్మంలో కొట్టుమిట్టాడడమే జీవితపరమావధి అని భ్రమిస్తే వాళ్ళ కర్మానుసారిణి. నేను మాత్రం అందులో చిక్కుకోకుండా జాగ్రత్త పడతాను.

ఈ జీవితం నాకొద్దు. ఇంటా బయటా గాలి పీల్చుకోలేని ఈ వాతావరణం నాకొద్దు.

‘వద్దంటే ఏం చేస్తావ్? పద్మావతి ఒక లంపటం, నీ ముఖం నీకు కంపరం, మూడో మనిషి అవాంతరం. ఈ మూడు ముక్కలే నీకున్న వాతావరణం.’

ఏమైనా చేస్తాను. ఇప్పటి వరకూ విశ్వంలో మూడో అక్షం కూడా ఉందని‌, ఉండవచ్చనీ ఊహించలేని చీమలాగా రెండక్షాలలోనే ముందుకీ వెనక్కీ మార్చింగ్‌ చేస్తున్నాను. అలిసిపోయాను, తెలిసివచ్చింది. గొంగళిపురుగు సీతాకోకచిలుక అవుతోంది. రెక్కలు తొడుక్కుని ఎగురుతా. బ్రహ్మసృష్టి 3-డికి పరిమితం కాదు. మూడు తరువాత నాలుగు.

సరే; పిచ్చో వెర్రో, సత్యనారాయణపురంలో తత్వబోధానంద స్వామిని కలుద్దాం.

ఈయనో వెరైటీ స్వామి. క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో పి‌ఎచ్.డీ. ఆపైన సన్యాసం. ఏం చెపుతాడో చూద్దాం. అయినా ఆ పేరేమిటి? తత్వబోధానంద. తత్వం నీకుంటే ఉంచుకో. తత్వాన్ని అయినవాడికి, కానివాడికి బోధించమని నీకెవరు చెప్పారు? బోధిస్తేనే వచ్చే ఆనందం ఏమానందం? నీ ఆనందం నీకుండాలి గాని!

ముందే ఆయనకి ‘షరతులు వర్తిస్తాయి’ అని స్పష్టంగా చెప్ఫాలి.

‘నువ్వో సినిక్‌‌గా తయారయ్యావు, ఉన్నతమైన హాబీలు సృష్టించుకో, ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకో, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో విను, తత్వం అర్ధం చేసుకో’ లాటి ఊకదంపుడు చాలా విన్నాం. సూటిగా సుత్తి సమ్మెట లేకుండా మాట్లాడితే అప్పటి సంగతి అప్పుడు.

తమరు ఎన్ని పుస్తకాలు రాస్తేనేమి, తమరికి ఎంతమంది శిష్యులు ఉంటేనేమి, ఇప్పుడు నాకేమిటి? నాకేంటి?


“నీకు జీవితంలో పాయింటాఫ్‌నోరిటర్న్ వచ్చింది, ఎన్ని కష్టనష్టాలకైనా సిద్ధమే, ఎన్ని సాహసాలకైనా తయారే కాబట్టి అర్జంటుగా నువ్వున్న స్థితిని వదిలేసి సరికొత్త స్థితి పొందే అవకాశం ఉందా అని అడుగుతున్నావు.”

గొంగళిపురుగు సీతాకోకచిలుక అయినా సిద్ధమే, సీతాకోకచిలుక గొంగళిపురుగు అయినా సిద్ధమే.

“అంతవరకూ నీ ఆలోచన సమర్థనీయంగానే ఉంది. ముందు వెనుకలు స్థూలదృష్టికేకాని బృహత్‌దృష్టికి ఉండవు.” గుండుకి బిగుతుగా వేసుకున్న కాషాయరంగు బామ్మగారి ముసుగు ఆయన కళ్ళజోడుని కణతలకి నొక్కుతోందేమో, నిదానంగా రెండు చేతులతో సులోచనాలని తీస్తూ నాకళ్ళలోకి చూస్తూ అన్నాడు తత్వబోధానంద స్వామి.

“టైమ్ ట్రావెల్ మీద మీ అభిప్రాయం ఏమిటి?”

“నేను అభిప్రాయాలు చెప్పను. సత్యం మాత్రమే చెప్తాను సత్యమూర్తీ. నేను చెప్పే నిజం మీద అభిప్రాయం ఏర్పరుచుకోవలసింది నువ్వు. ఈరోజు వరకూ భూతభవిష్యత్తుల్లోకి ప్రయాణం సాధ్యం అని ప్రచురించబడ్డ సకల శాస్త్రీయ వ్యాసాలు ఫిలాసఫర్సు, క్వాంటమ్ ఫిజిసిస్టుల అభిప్రాయాలతో సహా–అన్నీ చందమామ కథలు. ఫాంటసీలో ఆనందం ఉందనుకునే అమాయక ప్రజలు టైమ్ ట్రావెల్ కథాంశంగా వచ్చిన ఎన్ని నవలలైనా చదువుతారు, ఎన్ని సినిమాలైనా చూస్తారు.”

“నా సమస్యకి ఇక పరిష్కారం లేదా? ఆత్మహత్యాసదృశం అయినా ఫరవాలేదు; ఆత్మహత్య అవకపోతే చాలు. గట్టెక్కే ఉపాయం ఏమయినా చెప్పండి.”

“శ్రద్ధగా విను. నీకు టైమ్‌ ట్రావెల్ చెయ్యాలన్న కోరిక ప్రబలంగా ఉంది. ఆ కోరిక నిహిలిజమ్ లోంచి పుట్టుకొచ్చింది. చాలామంది వస్తుసేకరణతో విసిగి నిహిలిస్టులవుతారు. పుస్తక జ్ఞానం అతిగా నింపుకుని నువ్వు నిహిలిస్టువయావు. నీకు సంబధించినంతవరకూ సాధ్యాసాధ్యాలు చూద్దాం. భరించలేనన్ని కష్టాలకి గురయినవారికి, సర్వసుఖాలు అనుభవించి జీవితం మీద రోతపుట్టినవారికీ ఆత్మసాక్షాత్కారానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు పెద్దలు. సైన్‌ వేవ్‌లో క్రెస్ట్ సమీపించినా, ట్రఫ్ సమీపించినా దిశమారి తీరాలి. తరంగధర్మంలో సృష్టి ధర్మం దాగి ఉంది. నీ ప్రస్తుత మానసిక స్థితి పెనుమార్పుకి కావలిసిన చోదక శక్తి కూడగట్టుకుని ఉంది. నీ ఆత్మసాక్షాత్కారానికి మార్గం టైమ్ ట్రావెల్‌ రూపేణా సంభవమవచ్చు.”

“అనగా గతం లోకి కాని, భవిష్యత్తు లోకి కాని ప్రయాణం చేయటానికి నేను అర్హత ఉన్న వ్యక్తినేనంటారా?”

“నూటికి ఒకశాతం గతం లోకి ప్రయాణం చెయ్యటానికి అవకాశం నీకు ఉందని చెప్పవచ్చు. భవిష్యత్తు లోకి అసాధ్యం. నువ్వు ఒక అనుభవం ఉన్న శాస్త్రజ్ఞుడివి. నీకు వివరించి చెప్పనక్కరలేదు. భవిష్యత్తు అనే వస్తువు లేదు. రాదు. ఉన్నది, ఉండేది వర్తమానమే. మరణం కూడా వర్తమానం లోనే సంభవిస్తుంది.”

“మీరు చెప్పండి‌, నేను అల్లుకుపోతాను. మీకు అష్టసిద్ధి సాధనామార్గం తెలుసని విన్నాను. భారతీయ తంత్రశాస్త్రం, రాజయోగంతో పాటుగా టిబెటన్ తంత్రం మీద కూడా మీరు పరిశోధనలు చేశారు కదా. సెల్ఫ్‌ హిప్నాసిస్‌ విషయంమీద వ్యాసాలు రాశారు. నమ్మకం, అవసరం, పట్టుదల పుష్కలంగా ఉన్న నేను టైమ్ ట్రావెల్‌కి సరయిన అభ్యర్థినని మీరు ఒప్పుకున్నారు. నాకు గమ్యం చేరే మార్గం చూపగలిగే ఏకైక వ్యక్తి మీరని నేను నమ్ముతున్నాను. ఆత్మశక్తి, చేతస్సు, బాడీ, మైండ్‌లని యోగింపచేస్తే టైమ్ ట్రావెల్ సంభవమైతే అవచ్చు. స్పేస్‌ రాకెట్లతో కాదు. నన్ను లాంచ్ చేయండి‌. ప్లీజ్!”

“ఉన్న స్థితి వద్దు. ముమ్మూర్తులా మార్పు కావాలి అంటున్నావు. ప్రస్తుతం కంటే అప్రస్తుతాన్ని ప్రాణం కంటే ఎక్కువగా కోరుకుంటున్నావు. వర్తమానం వద్దు మార్పు కావాలి అనే నీ ప్రగాఢ వాంఛలో మార్పు వర్తమానం కంటే ఉన్నతం అన్న ఆశావహభావన దాగి ఉన్నదేమో చూసుకున్నావా?”

“ముసుగులో నొక్కులాటలు వద్దు. నా ఉనికి నాకుంచి ఇంకో కాలం చూపించండి తక్షణం!”

మొండితనం విచక్షణాజ్ఞానాన్ని నశింపచేస్తుంది. విచక్షణ చరమదశలో ఉదయించే నిర్మోహత్వం కూడా మొండితనమే. నాది ఏరకమైన మొండితనం? కాలమే నిర్ణయించాలి.


దట్టమైన నల్లమేఘం నలువైపులా ఆవరించుకొని ఉంది. తల దిమ్ముగా ఉంది. పగలో రాత్రో తెలియదు. ఈమాత్రం స్ఫురణ మిగిలి ఉండటం కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆహ్లాదంగా కూడా ఉంది. విచారించి చూస్తే నేనూ మేఘమే. అయినా నన్ను దిగ్బంధం చేసిన మేఘం పరాయి, శతృపక్షం. మేఘం మేఘం వాస్తవాధీనరేఖలు వ్రాసుకోపోతే ఈ మేఘం ఉండదు, ఆ మేఘం ఉండదు.

క్రమేణా కమ్ముకున్న మేఘం పలచబడుతోంది. వాయురూపం, ద్రవరూపం, ఘనరూపం నిర్దిష్టత సంతరించుకుంటున్నాయి. మసకవీడి దృశ్యం గోచరిస్తోంది. శబ్దాలు వినబడుతున్నాయి. కాళ్ళు నేలమీద ఆనుతున్నాయి. ఇంతకు ముందు, ఇప్పుడు, తరువాత అనే ప్రమాణాలు పీటముడులు వేసుకుంటున్నాయి. ఈ అనుభూతి ఇప్పటిదో, వెనుకటిదో, వెనుకకు వెనుకటిదో!

క్రమేపీ నాకు నేనే కనబడుతున్నాను. కాళ్ళూ చేతులూ ఉదరం ఛాతీ వివరం తెలుస్తోంది. శరీరాన్ని శ్వేతవస్త్రం వంటి వస్తువేదే ఆపాదకంఠం కప్పేసి ఉంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సత్యనిర్ధారణకి ఉపక్రమించాను. వెనుకనుంచి ఎండ పడుతోంది. నా నీడ నాకు లీలగా కనబడుతోంది. తూర్పు వైపుకి నడుస్తున్నానని తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకి సరితూగే తీరుతెన్నులు. మణికట్టు మీద వాచీ లేదు, పాదాలకి కాషాయరంగు తొడుగులు.

ఇంకా నయం, భూమి మీదే ఉన్నాను. మానవశరీరం మిగిలే ఉంది. తెలిసిన తెలుగులోనే ఆలోచనలు ప్రవహిస్తున్నాయి. ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నట్టే. నిముషాలక్రితం కనిపించిన లీలలు, ఛాయలు మెదడుకిగల గతానుభవం వాడుకుంటూ నామరూపాలు సంతరించుకుంటున్నాయి. నడిచే మనుషులు, మొరిగే కుక్కలు, ఎగిరే దుమ్ము, మిరపబజ్జీ ఘుమఘుమలు, అంగడిలో ఆకుకూరలమ్మి కేకలు. ప్రపంచం సజావుగా ఉంది. హఠాత్తుగా సంభవించబోయే మరణభయమేదీ లేదు.

అయితే నేనెవరు, ఏం చెయ్యాలి? ఎక్కడికెళ్ళాలి? ఎలా బతకాలి? తరువాతి నిముషంలో ఏం జరగబోతోంది? ఆశ్చర్యం. బతకడం అవసరమా అన్న నకారాత్మక నిత్యఘోష ఆగిపోయింది.

‘ఉన్న జీవితాన్ని పణంగా పెట్టి కొత్త జీవితాన్ని కొనితెచ్చుకున్నావుగా! ఆటుపోటులకి సిద్ధంగా ఉండు.’ అమ్మయ్య. వాదులాడే ఆత్మకాకి తోడుగానే ఉంది. సృష్టిలో నేను ఏకాకిని కాను. తోడొకరుండిన అదే భాగ్యము.

ఇంకో ఆశ్చర్యం! అతి సుపరిచితమైన వీధి. అశోక్ నగర్ రోడ్‌ నంబరు 12! నేను హైదరాబాద్‌‌లో వచ్చి పడ్డాను! అంతా మన మంచికే. ఆత్మావలోకనం చేసుకోవలసిన అత్యవసర పరిస్థితి. నా శాల్తీ ఒడ్డూ పొడుగూ మారలేదు కానీ బరువు సగానికి తగ్గి నలభై కిలోలైపోయినట్లుంది. పాదాలు పూర్తిగా నేలమీద మోపకపోతే గాలిలోకి కొన్ని అంగుళాలు ఎగిరే ప్రమాదం ఉంది. కిలోలు ఇటూ అటూ అయితేనేమి; భూచరమయితేనేమి, ఆకాశచరమయితేనేమి, జలచరమైతేనేమి; నా ఇదమిత్థం తెలిస్తే అదే పదివేలు.

ఎన్ని వేల సాయంత్రాలు ఈ రోడ్డు మీద నడుస్తూ గడిపాను! అదుగో, అల్లదుగో సిటీ సెంట్రల్ లైబ్రరీ! జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. అమ్మ‌ ఒడి అనిపించేంత అందమైన భాగం. ఆనందం అర్ణవం అవటమంటే ఇదే కాబోలు.

అంజయ్య పాన్‌షాపు కోసం కలయజూశాను. పట్టలేని ఆనందం వచ్చినప్పుడు కుళ్ళుమోతు మనస్సు మనిషికి అసందర్భమైన తాయిలాలు ఇచ్చి కిందికి చూడమంటుంది. ఒప్పగలిగినంత తప్పుడు పనేదైనా చేయమంటుంది. ఇప్పుడు ఉన్నపళంగా అంజయ్య షాపులో సిగరెట్ తాగమంటోంది‌. చిన్నపాటి దొంగతనం చేస్తేనే వస్తుందనుకునే ఊహాజనితమైన మజా తప్పితే సిగరెట్ పొగ పీల్చటంలో మనకి ఎప్పుడూ మజా రాలేదని స్పష్టంగా తెలిసీ.

ఒక విల్స్ నేవీ సిగిరెట్ వెలిగించాలి. వెలిగించి పీల్చాలి. పీల్చి పారేయాలి. పీల్చి పారేయగలిగిన వస్తువునే కదా జీవితం అంటారు?

అంజయ్య షాపు కనిపించలేదు. అసలు ఇన్నాళ్ళు అంజయ్య బ్రతికున్నాడో లేదో! అంజయ్య ఉన్నా, నాకు కనిపించినా, డబ్బులేని నాకు పొగ ఎందుకిస్తాడు? ఒకసందులో బదులు ఒకసందులో వెతుకుతున్నానేమో!

కొంచెం నిదానించి, కళ్ళని కళ్ళతో చూస్తే, నిక్షేపంలా అంజయ్య పాన్‌డబ్బా యథాస్థానంలోనే ఉంది. అంజయ్య కొడుకు కాబోలు కిళ్ళీలు కడుతున్నాడు, తను అంత చాకచక్యంగా కిళ్ళీలు కట్టటం వల్లనే ప్రపంచం ప్రపంచంగా ఉంటోందని బ్రహ్మదేవుడు తనకి హామీ ఇచ్చాడనిపించేంత ఆత్మ విశ్వాసంతో.

నా కళ్ళు షాపు ముందు తాడుకి వేళ్ళాడదీసిన ఈనాడు పేపరు మీద పడ్డాయి. ఈనాడు పత్రిక ప్రాభవం ఈనాడు తగ్గిపోయింది. సాయంత్రం నాలుగయినా అమ్ముడుపోని పేపర్లున్నాయి. ముఖం వాచిపోయేంతగా తెలుస్తోంది. ఈనాటి తారీఖు ఆగస్టు 3, గురువారం 2017. నా దేశకాలాలు జ్ఞప్తికి తెచ్చుకోవటానికి కొంచెం ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

విజయవాడలో కృష్ణా తీరే, స్వగృహే, సమస్త దేవతాః బ్రాహ్మణహరిహరగురుచరణసన్నిధౌ ఉపస్థిత బొందియే కదా ఇది. కళ్ళు మూసుకుని తత్వబోధానంద మాటలు నెమరువేసుకుంటూ, ‘ఇంకో పదినిముషాల్లో పన్నెండవుతుంది, నాకు అరవైమూడు కూడా నిండుతాయి, నా సంకల్పంలో చిత్తశుద్ధి ఉండెనేమి, నేను ఇంకొక పుట్టినరోజు చూడకనే గతము లోనికి ప్రయాణింతునుగాక’ అని స్తంభించినవాడినే కదా!

అక్షరాలా ఆరు సంవత్సరాలు దిగపెరిగానన్నమాట, నెల, తేదీ, వారంతో సహా. ఓ పదహారు గంటలు తరుగు కూడానూ, భూగోళంలో తూర్పుకి మనోవేగంతో ప్రయాణం చేసినట్లు! సరే ఇదీ చూదాం. మానభంగం అవనే అవుతోంది. తప్పించుకునే మార్గంలేదు. వెల్లకిలా పడుకొని కానీ, బానేవుంది అనుకోడమే ప్రాప్తకాలజ్ఞత! యాభైఏడో పుట్టినరోజు మళ్ళీ వచ్చింది కాబోసు. సత్యమూర్తి మళ్ళీ పుట్టాడు. పద్మావతిని కుమ్మరిపాలెంలో వదిలేసి!

సిగరెట్ కావాలి, అంజయ్య పోతే పోయాడు, అంజయ్య కొడుకున్నాడుగా.

‘సత్యమూర్తీ, నీకు భగవంతుడిచ్చిన బుఱ్ఱే అంతంత మాత్రం. ఉన్నకాస్తా సరిగా వాడుకో. అంజయ్య బతికుండకపోవటమేమిటి? నీ ఇప్పటికంటే అప్పటికంటే ఎక్కువే బతికున్నాడు.’

పుట్టినరోజున, పుట్టి ఏదో ఘనకార్యం చేసినట్లు, అందరిచేత అభినందనలు చెప్పించుకుని, చెప్పినవారి చేతులు పట్టి, అదే విధాయకమని నమ్మి, చెడతాగి గంతులెయ్యటం కాదు; విజ్ఞుడయిన మనిషి తనకి, తనని నమ్మిన సమాజానికీ బతికున్న ఇన్నేళ్ళుగా తను చేసిన కృత్యాకృత్యాలు తలుచుకుని సంతాపం పాటించాల్సిన అవలోకనాదినం అని, ఆనాటికి ఉన్న అంతంత మాత్రపు అంతఃకరణ ఉపయోగించి తీర్మానం చెయ్యలేదూ? ఆ ఆలోచన తీవ్రతరం అవగానే, మనసుమాట విని అంజయ్య కొట్టులో, పీల్చటమే సిసలైన ఆనందం అని తీర్మానించుకుని, సిగరెట్‌ సిద్ధాంతం రూపకల్పన చేయలేదూ? తిరిగిన చిక్కడపల్లి సందులే మళ్ళీ తిరిగి నేవీ విల్స్ సిగరెట్ కొని, వెలిగించి రెండు దమ్ములు అరకొరగా పీల్చి ఆర్పేయలేదూ? ఎంత పీల్చావనే నంబర్లు కాదు, ఎటుకేసి నడుస్తున్నావ్ అని నిన్ను నీవే ప్రశ్నించుకోలేదూ? వెంటనే సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎప్పటివలెనే మౌనంగా చదివేసిన హైఫండా పుస్తకాలు భుజాన వేసుకుని నడవసాగలేదూ?

రాజా, నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెపుతా విను. ఆపైన తల గింగిరాలెత్తించే ప్రశ్న, అటు పిమ్మట సమస్యాపూరణం. నీకు సమాధానం తెలిసీ చెప్పకపోయావో…

నాతల వేయి వ్రక్కలవుతుంది. వ్రక్కలౌతుంది. రెండవుతేనేం, రెండు వేలయితేనేం.


సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి కాళ్ళు దారి తీశాయి. చూసిన సినిమా మళ్ళీ చూసినా బానే ఉంటుంది, చూసే చూపులో చూసే ప్రతిసారీ కొంత కొత్తదనం ఉదయిస్తే చాలు.

సిటీ సెంట్రల్ లైబ్రరీ, 12 నంబరు రోడ్డు, అంజయ్య కొట్టు ఎక్కడివక్కడ ఉన్నప్పుడు పూర్వాశ్రమపు చిక్కడపల్లి ఇల్లు, ఇంట్లో ఇల్లాలు పద్మావతి కూడా చెక్కు చెదరకుండా ఉండాలిగా? పద్మావతి అంటే హైదరాబాదు పద్మావతి. విజయవాడ పద్మావతి ఈపాటికి వీధివాకిట్లో ముగ్గు పెడుతూ ఉండి ఉంటుంది. నేను ఉన్నానో లేనో కూడా గమనించి ఉండదు.

బుఱ్ఱ ఇంకో చుట్టు పనిచేసింది‌. హైదరాబాద్‌లో సత్యమూర్తి ఈ సమయానికి లైబ్రరీలోనే ఉండాలి! ఉన్నాడు. ముఖాముఖీ అవుతుందేమో కూడా!

జరగవలసిందో జరగకూడనిదో జరగనే జరిగింది.

లైబ్రరీ లాన్‌లో సిమెంట్‌ బెంచి మీద కూర్చుని సత్యమూర్తి పుస్తకం తిరగేస్తున్నాడు, పొగవాసన వేసుకుంటూ! ధర్మసంకటం ఎదురయింది. సృష్టికర్త పొట్టలో ఇమడలేనంత ధర్మసంకటం. ఇక్కడినుంచి దూరంగా ఎటైనా పారిపోవడం ధర్మసమ్మతం అనిపించుకుంటుందా?

సత్యమూర్తి సత్యమూర్తిని వేరుగా చూడటమేమిటి? ఒక వ్యక్తి రెండుగా చీలటమేమిటి? ఒకరినొకరు చూసుకుని సంభాషించుకోవటమేమిటి? మాట్లాడే నేనెవరు, వినే నేనెవరు? ఒకే ఆత్మకి రెండు శరీరాలుండటమేమిటి? మార్పుకోసం టైమ్‌ ట్రావెల్ కోరాను కాని, నా నెత్తిన నేనే పెట్టుకు తీరవలసిన భస్మాసుర హస్తం కోరుకోలేదు కదా!

‘ఆ గట్టు వెనుకనించి పారిపోయి ఈ గట్టు ముందుకొచ్చావ్. మళ్ళీ పారిపోతానంటున్నావ్. సిగ్గు లేదా? పలాయనవాదీ!’

నువ్వు నోరుముయ్యి అంతర్వేదీ! సభామర్యాద అంటే అందరికీ ప్రియవాక్యాలు వడ్డించటమే అనే భ్రమతో నోరు నొక్కుకుని పిరికివాడిలా ఇంత జీవితం గడిపాను. అయినదేమో అయినది. నాకూ ఒక వ్యక్తిత్వం ఉంది. దానిపట్ల నాకు గౌరవం ఉంది. అంతర్ముఖం సిగకొయ్య. అధాతో బాహ్య జిజ్ఞాస.

నేను నేనుగా, సత్యమూర్తిని సత్యమూర్తిగా ఎదుర్కొంటాను.


“మాన్‌ అండ్ సూపర్‌మాన్ పుస్తకం రిటర్న్ చెయ్యడానికి వచ్చావా? చివరిసారిగా నీకు నచ్చిన భాగాలు మళ్ళీ చదువుతున్నావూ!”

“ఏకవచనంలో సంబోధిస్తున్నారు. మిమ్మల్నెప్పుడయినా కలిశానా?”

“నువ్వు నన్ను కలవలేదు. కాని నేను నిన్ను కలిశాను.”

“అసంభవం. మీరేమైనా నా పితృదేవతలా?”

“కాదు. నువ్వే నా పితృసమానుడివి. నీనుంచే నేను పుట్టాను.”

“రూపం, స్వరం పోల్చుకోగలిగినట్లే ఉన్నాయి.”

“స్వరం ఒకటే. రూపంలోనే స్వల్పభేదం.”

“నేను మాన్‌ని, మీరు సూపర్‌మాన్ అంటారా?”

“అనను. నువ్వు సూపర్‌‌మాన్‌వి, నేను మాన్‌ని అనుకుంటే సత్యానికి మన ఉభయులం కొంచెం దగ్గరౌతాము.”

“మీకు తెలిసే ఉండచ్చు, అయినా ఒక విషయం‌. మీ శైలిలో ఏదో ఒకనాటికి ‘నా’ అనుకునే వారితో వ్యక్తీకరించుకుని హృదయం పంచుకోవాలనే కోరిక నాకు ప్రగాఢంగా ఉంది. అయిదారేళ్ళు నిరంతరం మేధోమథనం భరించి అయినా సరే… ఆశ్చర్యంగా ఉంది. నా స్వగతం మీతో ఎందుకు చెప్పుకుంటున్నానో ఊహకందటం లేదు.”

“నీ కోరిక సంగతి నాకూ తెలుసు. ఈ విషయంలో నాకే ఆశ్చర్యమూ లేదు. నా ఆశ్చర్యమల్లా నువ్వాశ్చర్యపడటం నేనెందుకు రాసుకోలేదని.”

“నా జీవిత చరిత్ర అంతా అనుక్షణం రాసుకుంటూ భద్రపరుచుకుంటున్న చిత్రగుప్తులవారా మీరు?”

“అంతకన్నా ఎక్కువే. చిత్రగుప్తుడివంటి చిత్రవిచిత్ర అభూతవ్యక్తులని మన సంవాదంలోకి జొప్పించి నీ స్థాయి, నా స్థాయి దిగజార్చకు‌. భావప్రకటనకి అన్ని మార్గాలు మూసుకుపోయిన అసమర్థులు ఉపయోగించే ఆఖరి అస్త్రం వ్యంగ్యం. ప్రాణంకన్నా మిన్ననైనది ఆత్మ వివేచన. ఈ సత్యం నీకు తెలుసని నీకంటే ఎక్కువగా నాకు తెలుసు.”

“మీ రూపురేఖలు చూస్తుంటే, మీ స్వరం వింటుంటే, నాతో నేనే మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తోంది‌.”

“అనిపించటమేమిటి? అదే సత్యం.”

“మీరెవరు? నేనెవరు?”

“కథ ఇంకా చాలా ఉంది. ఆనందిస్తూ అనుభవించు‌. కథలో మున్ముందు చాలా మలుపులున్నాయి. నీ ప్రశ్నకి సమాధానం చెప్పి కథ ముగింపు ఇప్పడే చెప్పేసి, తొందరపడి ‘శుభం’ కార్డు ముందే కూసేస్తే నువ్వూ మిగలవు, నేనూ మిగలను‌.”

“నా ప్రవర్తన ఇంకెంతో కాలం ఈ బొంది మిగలాలి అనే కోణంలో కేంద్రీకృతమవాలా, ఎందుకు ఇంకా మిగలాలి అనే దృక్కోణంలో పయనించాలా?”

“నీ ప్రవర్తనని నీకు నువ్వే శాసించుకుని, అనుసంధానించి, నీ సంకల్పానుసారంగా మలిచే సామర్థ్యం, హక్కు నీకున్నాయని నీకనిపిస్తోందా?”

“ఉండచ్చు, లేకపోవచ్చు, నేనున్నానుగా?”

“నువ్వొక్కడివే లేవు. భగవంతుడు నీతో సమానంగా నన్నూ సృష్టించాడు‌.”

“సృష్టిలో ఏ రెండు పరమాణువులూ సర్వసమానం కావు. సమానమయితే అది సృష్టే కాదు‌.”

“నువ్వు చెప్పింది సత్యమవచ్చు, అసత్యమవచ్చు, అర్ధసత్యమవచ్చు. మనం ఉభయులం మనకున్న పరిమిత సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ఏదిసత్యం, ఏదసత్యం నిర్ధారించుకోవటానికి కలుసుకున్నామేమో?”

“ఇంతకీ నువ్వెవరు?”

“ఆ ప్రశ్నకి సమాధానం తెలియకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.”

“ఇంతవరకూ నీ వాచకం, వాలకం చూసి అజ్ఞానినైన నాకు జ్ఞానం చూపటానికి శూన్యం లోంచి అవధరించిన సూపర్‌మాన్‌వని భ్రమించానే! నేనే నీప్రశ్నలకి సమాధానం చెప్పాలీ!”

“పది సంవత్సరాల క్రితం లైబ్రరీలోంచి అరువు తెచ్చుకుని మిల్సాయన్‌ చదివావు. ఏడాదికోసారి చదువుతూనే ఉన్నావు. నీకెంత అర్థమయింది?”

“చదివిన ప్రతిసారీ ఎక్కువ మమేకం అవుతూ ఇప్పటికి మిల్సాయన్‌ని డెబ్భై శాతం జీర్ణించుకున్నాను. ‘తత్వమసి’ ఎన్ని వేలమాట్లు వింటేనేమి? తత్ అంటే ఏమిటో తెలియలేదు, తత్ సూత్రంలోని తత్వం తెలియలేదు, మసి మిగిలింది. ఇప్పుడు మిల్సాయన్‌ ఊసెందుకు! మిల్సాయన్ అసలు నీకెంత బోధపడింది?”

“ఇంచుమించుగా నేనూ నీ దారిలోనే ప్రయాణం చేశాను. కానీ వజ్రపు తునకలనబడే ప్రపంచం లోని సకల ఉద్గ్రంథాలనుంచి నా రసాస్వాదన స్వీకరణాసామర్థ్యం గరిష్టంగా డెబ్భైశాతం చేరాక, తిరోగమనరేఖలతో లీనమవుతోంది. నేను ఉన్న పరిస్థితుల్లో, సృష్టిలో అడుగులేసిన ఏ వ్యక్తి ఊదిన వాక్యాలైనా, వాటిలో కాలాతీతమైన పస ఒకవేళ ఉందనుకుంటే, నాకది యాభైశాతం మించి అందటం లేదు‌. పైగా అదే చాలా ఎక్కువ అని రూఢి అవుతోంది‌.

“కాలం గడిచేకొద్దీ వస్తువులో రసం క్షీణిస్తోందంటే లోపం వస్తువుది కాదు, కాలానిదీ కాదు. భోక్త చేజేతులా కోల్పోతున్న తృష్ణ, రసికత్వం, జీవేచ్ఛ. ఈ నిజం గుర్తించని వ్యక్తి కొద్దికాలానికే క్యాబేజీ అవుతాడు.”

ఏనాడో తెగిపోయిన నా వీణతంత్రులని ఒకటొకటిగా సంధించి, శ్రుతిచేసి, ఎవరో అదృశ్యవ్యక్తి నేను మునుపెరుగని మధురరాగాన్ని ఆలాపిస్తున్నారు.


అసలు సంధ్యవేళ. చేతనాత్మలో పెనుభాగమైన చిక్కడపల్లి సుధా హోటల్. సత్యమూర్తికి ఎదురుగా సత్యమూర్తి. అధిమంద్రం నుంచి అతితారాస్థాయి వరకూ మానవకర్ణం స్పందించగలిగిన అనేక పౌనఃపున్యాల శబ్దవిశేషాలు ఒక్కుమ్మడిగా సుధాహోటల్ ఉత్పత్తి చేస్తోంది.

వలచిన వనిత తోడుగ ఉంటే రణము సైతము రమ్యమే కద. యజమాని ఆనందం కోసమే పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. సకలశబ్దాలు చెవులకు వాయులీనంగా భాసిస్తున్నాయి. ఆఘ్రాణించే ధూళిలో సుగంధం స్ఫురిస్తోంది. మానవస్వేదాన్ని మించిన మధురిమని మాధవుడు సృష్టించగలడా? ఏ దిక్కు చూసినా రవివర్మే. కళ్ళు మూసినా కనబడే కుంచె ఆడిస్తున్న రవివర్మ. తాగుతున్న కాఫీలో ప్రతి గుక్కా అమృతమే. తాగితే అయిపోతుందేమో అని కలవరపరిచే అమృతం. తాగుతున్న ఈ గుక్క జీవితానికి ఇకచాలు అని పరవశింపచేసే అమృతం.

“ఈ ఉత్పాతాన్ని తట్టుకోటానికి ఇంకొంచెం సమయం, మరింత సందర్భం కావాలి సీనియర్ సత్యమూర్తీ! నువ్వు నేను అన్న పదాలకి అర్థం లేదని నువ్వైన నేను నేనైన నువ్వుకి కొన్ని క్షణాల క్రితం చెప్పాడు; చెప్పావు; చెప్పాను. అయినా మనకెందుకు తత్త్వవేత్వల గోల! నేలమీదకి దిగి మాట్లాడుకుందాం. నేనైన నువ్వు ఇంకో ఆరేళ్ళు ఎక్స్‌ట్రా బ్రతికి, ఆపైన ఇంకా ఎందుకు బ్రతకాలో తెలియక, నీకంటే ఆరేళ్ళు వయస్సులో చిన్నయిన నన్ను, అనగా నిన్ను నువ్వే, అంటే మాట్లాడుతున్న నన్ను వెతుక్కుంటూ వచ్చి 2017వ సంవత్సరంలో ఈ అవతారం దాల్చావు!”

“అసలు సంగతి విను. వర్తమానమనే ఉత్పాతాన్ని తట్టుకోలేక భూతకాలం లోకి ప్రయాణించింది నేను. బ్రతకలేక కాకపోవచ్చు. ఈ తిరుగుటపా ప్రయాణం బతుకుని పునర్నిర్మించుకుందామనే ప్రగాఢ జీవన్మరణ సమస్య అనే ఇంధనంతో సంభవమయి ఉండవచ్చు. ఇంకా ముఖ్యమైన ఇంకో సంగతి విను, నాతో పాటుగా‌, నాతోటి ప్రయాణికుడుగా. 17లో నా మెదడులో పేరుకున్న సమాచారపు కొండ 23కి రెట్టింపయింది, ఆత్మని పీక పిసికేసేంత భారం నామీద మోపుతూ. విలోమానుపాతంలో మానసిక పరిణతి తగ్గుకుంటూ వచ్చి సగమయింది…”

“ప్రపంచం నీ పీక పిసికేయటం లేదు. ప్రపంచం నిక్షేపంలా ఉంది. ఎప్పటికీ ఉంటుంది. నీ పీకని నీచేతులతో నువ్వే నొక్కుకుంటున్నావు‌.”

“ముమ్మాటికీ. పరిహారార్థమే కదా నాలోని నిన్ను విశదంగా చూసుకుంటున్నాను! పరిష్కారాలు శోధిస్తున్నాను!”

“పరిష్కారాల సంగతి అట్లా ఉంచు 23! నీ సంగతేమో కానీ నాకు అనేక సంకటాలు తెచ్చిపెట్టావు. నిన్ను నేనెంతకాలం భరించాలి? అసలెందుకు భరించాలి? నువ్వు తాగుతున్న కాఫీకి నేనెందుకు బిల్లు కట్టాలి? నా ఇంటికి నిన్నెందుకు తీసికెళ్ళాలి! పద్మావతికి నువ్వెవరో ఎలా పరిచయం చేయాలి? ఆరు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఉండేవాడట అని బొంకనా, లేక ఇప్పుడిలా అయాడు గానీ మేమిద్దరం ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నవాళ్ళమేనని అశ్వత్థామ అబద్ధం చెప్పనా? లేదా, ఈ శాల్తీ ఎవరోగాని నేనే పద్మావతికి మొదటి మొగుణ్ణంటున్నాడు, ఏమిటి సంగతి అని ఆవిణ్ణి నిలదీయనా?”

“పాపము శమించుగాక 17! ఈ క్లిష్ట పరిస్థితుల్లో నువ్వూ నేనూ సంధి చేసుకుంటేనే విధి సహకరిస్తుంది. విభేదించుకుంటే సృష్టికి ప్రథమ ప్రాతిపదికయిన కార్యకారణసూత్రం ఛిన్నాభిన్నం అవుతుంది. నువ్వు ఈనాటికి ముప్ఫై ఏళ్ళక్రితం, నేను నా ముప్ఫై ఆరేళ్ళ క్రితం చదివి ఎంతో ప్రభావితమైన ఎచ్. జి. వెల్స్ టైమ్ మెషీన్, తదనుగుణంగా ఉద్భవించిన గ్రంథాలు, చిత్రాలు మానసిక కోశాగారాన్నుంచి ఒక్క లిప్తకాలం డిలీట్ చెయ్యి. నీకు నాకంటే రెట్టింపు మానసిక పరిణతి, జీవకళ, జీవించేకళ ఉండి ఉండవచ్చు. అయితే నాకున్న తార్కిక శక్తిలో సగం కూడా నీలో లేదు‌. ఈపాటికి నీకు అవగతమయ్యే ఉంటుంది. నీ సంకటాలన్నీ ఊహాజనితాలు. నీ ఊహా‌సామర్థ్యం పరిమితం. నేను కూడా సిగ్గుపడవలిసినంత పరిమితం.

“ఉదాహరణకి ఉన్నపళంగా నువ్వు నా పీక పిసికేస్తే నేనుండను. నువ్వే ఉంటావు‌. చట్టం నిన్నేమీ చెయ్యలేదు‌. కాబోయే అభూతనిన్నును నువ్వే చంపుకుంటే నిన్ను శిక్షించమనే శిక్షాస్మృతిని ఏ నాగరికతా సృష్టించలేదు‌. నీ అంతరాత్మ సైతం నీ శీలాన్ని శంకించలేదు. శిక్షించలేదు. కారణం? అంతరాత్మ ఉన్నది నీలోని అరివర్గాన్ని అంతమొందించటానికి, నిన్ను అనుక్షణం ప్రోత్సహించటానికే కాబట్టి. అందుచేత నన్ను చంపెయ్యి. పీడా విరగడైపోతుంది‌. బ్రతికినన్నాళ్ళు బ్రతికి ఫలానా రోజున ఈ రూపేణా చస్తాననే స్పష్టతన్నా నీకు మిగులుతుంది. బ్రతికే ప్రతిక్షణం స్వర్గతుల్యంగా బ్రతుకు.”

“ఇంకో ఉన్నతమైన మార్గం కూడా ఉందేమే చూడు 23! భూతం లోకి ప్రయాణించే విద్య నీకు కరతలామలకం. నీ అంత సమర్థవంతంగా భూతకాలం లోకి నీతోపాటు నేనూ ప్రయాణించగలనని చెప్పావు‌. ఉభయులం కలిసి ఒక శతాబ్దం గతం లోకి వెళదాం. అమ్మని కన్న అమ్మమ్మనో, నాన్నని కన్న తాతయ్యనో ఒకళ్ళని పెళ్ళవని వయసులో వెతికి పట్టుకుందాం. ఏ కృష్ణలో స్నానం చేస్తున్నప్పుడో సమయం చూసుకుని, మునిగిన మనిషి మునిగినట్లే మళ్ళీ లేవకుండా తల నొక్కి పట్టేద్దాం. కృష్ణార్పణం. కేసు ఉండదు, మనకి ఏ పాపం అంటదు, అంతకంటే ముఖ్యంగా నువ్వూ నేనూ ఇప్పుడు ఉండం, అప్పుడూ ఉండం‌. భవసాగరం ఈదనక్కరలేకుండానే మనిద్దరికి జమిలిగా జీవన్ముక్తి అయిపోతుంది.”

“బాడ్ అయిడియా. నువ్వే పుట్టకపోతే సుధామయికి వచ్చే సంవత్సరం కొడుకెట్లా పుడతాడు?”

“ఎంత పసందైన వార్త చెప్పావు? రాబోయే ఆరు సంవత్సరాలలో ఇంటా బయటా జరగబోయే సంఘటనలన్నీ నీకు తెలుసు కదూ? అమరావతి మహానగరం అయిందా? మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయాడా? దేశంలో మతవిద్వేషాలు కులవిద్వేషాలు మోదీ రూపు మాపగలిగాడా? దేశప్రజలు సామాజిక మాధ్యమాల బానిసత్వం నించి కొంతైనా విముక్తులయారా? వెలుగు చూపే నిప్పుకు, వంటచేసే నిప్పుకు, వొళ్ళు కాల్చే నిప్పుకూ తారతమ్యం గ్రహించేంత విజ్జత నీ చుట్టూ ఉన్న అంతర్జాల సమాజానికి సంప్రాప్తించిందా? ఆవేశంలో పెద్దపదాలు వదుల్తున్నానా? రిటైరయిన తర్వాత నేను, పద్మావతి దేశవిదేశ పర్యటనలు చేస్తామా? కాగితం మీద కలం పెట్టి నాలుగు వాక్యాలు రాస్తానా? నలుగురితో కలిసి నడవగలిగే సంస్కారం కృష్ణపక్షంలోనైనా నాకు అలవడుతుందా? బుఱ్ఱలో రణగొణ ధ్వని రోజుకి రెండు నిముషాలయినా పూర్తిగా ఆగిపోగలిగే నిశ్చలతత్వం ఉంటుందా? మెదిలే ఆలోచనల్లో ’నేను’ సంబంధితమైనవాటి శాతం కొంతైనా తగ్గుతుందా?”

“సమాధానం చెప్పను. తెలిసి కూడా చెప్పను. నన్నేమీ అడగకు 17! నీకింకా వోటు హక్కు రాలేదు. మనవడి సంగతి చెప్పి ఇప్పటికే పొరపాటు చేశాను. అనుబంధంగా ఇంకో ఉపపొరపాటు చేస్తాను. మనవడిపేరు సత్యప్రసాద్. భవిష్యత్తు ఇలానే ఉండాలని రంగుల కలలలో విహరించే వ్యక్తియొక్క వ్యక్తిత్వం క్షీణిస్తుంది. ఇలానే ఉంటుందని ముందే తెలిస్తే సంపూర్తిగా సమసిపోతుంది.”

“పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ భవిష్యత్తు గురించి ఒక చురకత్తి ఆలోచన వస్తోంది. మరో నిముషంలో మన ఇద్దరితో పాటుగా 2029 సత్యమూర్తి కూడా దిగి మనతో కలిసి అడుగులేస్తే? నీ భవిష్యత్తు గురించి ముసలాణ్ణి అడిగి నిలదీయవు కద?”

“గుర్రాన్ని కట్టెయ్యి. ఇంకో పుష్కరంపాటు బతికే ఉందామని ప్రణాళిక వేస్తున్నావా? నువ్వు ముసలివాడివయ్యావనే కదా నిన్ను ప్రభుత్వం వారు నీ పని ఇకచాలు అంటున్నారు?”

“ఇందాకటినుంచీ ఒక సంగతి గమనిస్తున్నాను 23! నన్ను నువ్వు చూసిన క్షణం నుంచీ నీ ఆలోచనాధోరణి లోనేకాదు, నీ భౌతికరూపంలో కూడా మార్పులొస్తున్నాయి. మనమధ్య దూరం తగ్గిపోతోంది. ఇప్పుడు అద్దంలో చూసుకుంటే రెండు ఏకరూపాలు కనబడేట్లున్నాయి‌. దర్పణానికి ఒకవైపే రెండు రూపాలా; ఇటువైపో రూపం, అటువైపో రూపమా తెలుసుకోలేనంతగా. మనిద్దరం కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామా?”

“లేదు. నేనొక్కడినే వెళ్తున్నాను. నువ్వు ఇదే హోటల్లో నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఇంకో కాఫీ తాగుతున్నావు. పద్మావతి తనదైన ఆప్యాయతతో పుట్టినరోజు పండగేననే నిజం నీతో గడపాలని ఎదురు చూస్తోందని నీకు నిర్మొహమాటంగా తెలుసు. నువ్వు పొగలు పీలుస్తూ, అరమేధోగ్రంథాలు నెమరువేసుకుంటూ, కాఫీలు చప్పరిస్తూ సూర్యాస్తమయాన్ని గమనించడం లేదు. స్వారస్యం కొండ ఎక్కడంలోకంటే ఎక్కిన కొండ దిగడంలో ఎక్కువ ఉంటుంది.”

“నాలుగు రూపాయలివ్వనా? దారిలో పనికొస్తాయేమో?”

“అవసరం లేదు‌.”

“పోనీ ఫోన్ తీసుకెళ్తావా?”

“ఎంతమాత్రం అవసరం లేదు‌.”

“ఇంటికి దారి గుర్తుందా?”

“వెతుక్కుంటాను.”

“గుడ్ బై!”

“గుడ్ బై. వన్స్‌ అండ్‌ ఫరాల్‌.”


ఇంటిముందు గుల్‌మొహర్‌ చెట్టుకొమ్మలు కథాకళి చేస్తున్నాయి. నన్ను గోముగా పలకరిస్తోన్న నిత్యసంతోషి పూలు అంత ఎర్రదనం ఎట్లా ఎక్కడినించి తోడిపోసుకున్నాయి? అంతగా తోడిపోసుకున్నాక సృష్టిలో లాలిమ ఇంకా మిగిలి ఉందా?

సుధామయి పెళ్ళి నిశ్చయమయిన రోజు.

ఇంటిముందు సందు ఇరుకుదైనప్పటికీ ఇటూ అటూ నాటేందుకు కార్పొరేషన్‌వారు గుల్‌మొహర్‌ మొక్కలు తెచ్చి, వాళ్ళు నిర్ధారించిన చోట్ల గుంటలు తవ్వుతున్నారు. ఇక్కడ చోటు లేదని వాళ్ళు మొత్తుకున్నా దబాయించి, గేటుముందు ఇంటికి నైరుతంలో గుంట తీయించి, ఎంపిక చేసిన ఒకమొక్కని నేనే స్వయంగా నాటి నీరు పోశాను. ప్రతిరోజూ కొత్తచిగుళ్ళు వేసుకుంటూ పెరగసాగింది. పక్క కొమ్మలు మేకలు తుంచినా పైకి పెరగడం ఆగలేదు. నన్నొకరు చూసుకుంటున్నారు, చూసుకుని పలకరిస్తున్నారు అనే అతిశయంతో కాబోలు సంవత్సరం గడవకుండానే ఎనిమిదడుగుల అందంతో హొయలొలకబోస్తూ వీధిలో మిగిలిన నాలుగైదు నాలుగడుగుల తోటి గుల్‌మొహర్లకి తను తన సొగసు చూపించుకునేది.

వేరే గూటికి వెళ్ళేరోజున సుధామయి దిగులుపడింది. సుధామయికంటే నిత్య‌సంతోషి (మేము మా గుల్‌మొహర్‌కి పెట్టుకున్న పేరు) ఎక్కువ దిగులు పడింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే తమాయించుకుంది.

2019లో ఇంటిని ఎవరికో అద్దెకివ్వటానికి చైత్రమాసంలో ఒకరోజున ఒప్పందం రాసుకున్నాము. ఆ రోజు ఆకాశం నిర్మలంగా ఉంది. మచ్చుకైనా మేఘాలు లేవు. ఉరుములు మెరుపులు లేవు. అయినా నిత్యసంతోషి మీద ఏదో అశనిఘాతం పడినట్లయింది. నాలుగు రోజుల్లో ఆకులన్నీ ఎండి రాలిపోయాయి. ఆత్మ ఎగిరిపోయి ఆకాశంలో లీనమయిపోయింది. మేము ఇల్లు వదిలి వెళ్ళటానికి ఇంకా రెండురోజులుండగానే నిత్యసంతోషి నిలువెల్లా మోడైపోయింది.

నేడు నిత్యసంతోషి నాకోసం మళ్ళీ పుట్టింది. నువ్వూ కావాలి అంటూ నవ్వుతోంది. పద్మావతి ఎప్పుడూ బయటికి నవ్వదు. దిగివచ్చినవాడు చూడగలగాలే గాని ఎప్పటికీ చెరగని నవ్వు ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. షరతులు లేని నవ్వు.

“పుట్టినరోజున మీకో శుభవార్త. మీరు తాతయ్యవబోతున్నారు. మీరు ఎంతసేపటికీ ఫోనెత్తలేదట. సుధ ముందుగా మీకే చెపుదామనుకుంది.”

నేను మాట్లాడలేదు. రెప్పవేయకుండా చూస్తున్నాను.

“రస్‌మలాయి నాకు చేతనయినట్లు చేశాను. బాలాజీ బజ్‌రంగ్‌వాడి రుచి రాకపోవచ్చు.”

నా రెండు చేతులూ నన్నడగకుండానే పద్మావతి రెండు చేతుల్నీ పట్టుకున్నాయి.

ఆవిడ నిర్ఘాంతపోలేదు. చేతులు విడిపించుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కళ్ళలో నవ్వుకి ఇంకొంచెం సంయమనం తోడయింది.

నా కళ్ళు రెప్పవేశాయి. ధూళి కడిగిన కన్నీటి బొట్లు రెండు బయటకొచ్చాయి.

“కాళ్ళూ చేతులూ కడుక్కురండి.” నుదుట దిద్దుకున్న కుంకుమ బొట్టు మాట్లాడుతోంది.

చెవులకి తాకేంత బిగ్గరగా నాలో శబ్దాలు నాకే వినబడ్డాయి. గుడ్‌బై. వన్స్ అండ్‌ ఫరాల్.

పృథ్విలో నేనూ నిత్యసంతోషీ మాత్రమే మిగిలాము. ప్రాణం పోయేంత గట్టిగా హత్తుకున్నాను.

కాలం ఆగిపోయింది. జాగ్రత, స్వప్నం, సుషుప్తి సరిహద్దులు చెరిపేసుకుని ఏకమయినాయి.


ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం… మగత నిద్రలో ఉన్న నాకు దూరం నించి సుబ్బులక్ష్మి గొంతు శ్రావ్యంగా వినిపిస్తోంది.

వినిపిస్తున్నది దూరానున్న సుబ్బులక్ష్మి గొంతు కాదు. పక్కనున్న పద్మావతి లయబద్దమైన గురక!

సమయం నాలుగున్నర. తొలి సంధ్య తలుపు తట్టడానికి తయారవుతోంది. కృష్ణాతరంగ రాగాలు లీలగా వినబడుతున్నాయి‌. అలికిడి లేకపోతే ఆవిడ ఇంకో పావుగంట పడుకుంటుంది.

పద్మావతి ముఖం మీద పడిన వెంట్రుకలని సడి చేయకుండా చూపుడు వేలితో చెవి వెనకకి సర్దాను.

పక్క దిగకుండానే నాకోసం ఫ్లాస్కులో పోసి ఉంచిన తులసి కలిపిన గోరువెచ్చని మంచినీటిని ఆర్తితో తాగాను.