ఇండియా ప్రయాణం అంటే నాకు మహా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా, ఓ నెల్లాళ్ళు ఆనందంగా గడిపేస్తాను.
నిన్ననే మా మేనేజరు, ఇండియాలో మా ఆఫీసు పనికి ఓ వారం రోజులు వెళ్ళాలన్నాడు. వెళ్ళడం ఇష్టమే కాని మరీ బొత్తిగా వారం అంటేనే నాకు నచ్చలేదు.. ఓ రెండు రోజులు ఎక్కువ ఉండడానికి మొత్తానికి ఎలాగో ఒప్పుకున్నాడు. ఈ విషయం నా భార్య కౌసల్య కి చెప్పాను !
ఇండియా వెళుతున్నానని కాస్త జెలసీ తో ఉడుక్కుంది. కొల్లేటి చాంతాడంత షాపింగు లిస్టు నా భుజాన తగిలించింది, మరీ ఎక్కడ సుఖ పడిపోతానో అన్నట్లుగా !
షాపింగు హడావిడిగా కానిచ్చి ముంబై ఫ్లైట్ ఎక్కాను ! ముందుగా, ఈ మధ్యనే క్రొత్తగా ఓపెన్ చేసిన హైదరాబాదు సెంటర్‌కి వెళ్ళాలి. తర్వాత బెంగుళూరులో ఓ రెండు రోజులు ఆఫీసు పని వుంది.
ఆ తరువాత మా చెల్లెలు దగ్గరకి వైజాగ్ వెళ్ళాలి. మధ్యలో కౌసల్య షాపింగ్ ఉండనే ఉంది. వృత్తిరీత్యా, దాదాపు పదిహేనేళ్ళక్రితం అమెరికా వచ్చి స్థిరపడ్డ నాకు, వెళ్ళిన ప్రతీసారి, ఇండియా మరింత వేగంగా మారిపోతోందనిపిస్తోంది.
మనుషుల అవసరాలేకాదు ప్రవర్తనలు, మనస్తత్వాలు మరింత వేగంగా మారాయనిపిస్తుంది నాకు. ఇంతకుముందున్నట్లుగా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు లేనే లేవనిపిస్తుంది.
హైద్రాబాదులో దిగేకా, ఓ క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. ఆఫీసు పనయ్యాక, ఎవరైనా స్నేహితుల్ని కలుద్దామనుకున్నా కుదరలేదు. ఇంకో రోజులో మరలా బెంగుళూరు ప్రయాణం. అనుకోకుండా, ఇవాళ కాస్త ముందుగానే పని పూర్తయ్యింది.
ఎవర్ని కలుద్దామా ఈ సాయంత్రం అనుకుంటుండగా, నా చిన్ననాటి స్నేహితుడు రాంబాబు గుర్తుకొచ్చాడు. అదివరకు ఇండియా వచ్చినప్పుడల్లా తప్పకుండా కలిసేవాణ్ణి. సాధారణంగా నేనెక్కడ ఉంటే అక్కడికే వచ్చేవాడు, నన్ను కలవడానికి. గత రెండు మూడు సార్లుగా కలవడమే కుదర్లేదు. ఆఫీసుపని ముందుగానే అవడంతో, రాంబాబు ఇంటికి ఫోన్ చేసాను.
రాంబాబు శ్రీమతి అనుకుంటా ఫోన్ తీసుకుంది. నా స్వపరిచయం అయ్యాక, రాంబాబు ఆఫీసు నంబరు తీసుకున్నాను. రాంబాబు నా గురించి చెప్పాడని, వాళ్ళ ఇంటికి రమ్మనమని రాంబాబు శ్రీమతి రాధ ఆహ్వానించింది. కుదిరితే వస్తానన్నాను.
నాకు రాంబాబు ని కలవాలని ఉంది ముందు. ఆఫీసుకి ఫోన్ చేసాను. ఓ అరగంటలో వచ్చాడు హోటలుకి. నన్ను చూడగనే ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. నాకు కూడా రాంబాబు ని చూస్తే ఎంతో ఆనందం కలిగింది. చిన్ననాటి కబుర్లు, ముచ్చట్లు ఇవన్నీ నెమరు వేసుకున్నాం. రాంబాబు లో వయసు మార్పు వచ్చింది అదే అంటే, నాలో కూడా మార్పుందన్నాడు. రాంబాబూ నేను పదోతరగతి వరకూ కలిసే చదువుకున్నాం. రాంబాబు కి చిన్నప్పుడే తండ్రి పోయాడు. రాంబాబు వాళ్ళు అంతగా ఉన్న కుటుంబం కాదు. రాంబాబు తల్లి చాలా కష్టపడి పెంచింది రాంబాబుని. తెలిసున్న వాళ్ళింట్లో వంటలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది.
” చాలా రోజులయ్యిందిరా నిన్ను చూసి… మా ఇంటికి వెళదాం ! నేను రాధ కి ఫోన్ చేసి ముందుగానే చెప్పా డిన్నర్ కి వస్తామని ” రాంబాబు అన్నాడు.
” ఒరే ఎందుకురా మీ ఆవిడకి శ్రమ. అందరం హోటలుకి వెళ్దాం పద ” మొహమాట పడ్డాను నేను.
“నువ్వు మా ఆవిడని, మా అమ్మాయి శ్రేయని చూడనే లేదుకదా ! అందర్నీ చూసినట్లు ఉంటుంది ” అన్నాడు.
“సరే వెళదాం ” అన్నాను. ఇద్దరం కార్లో బయల్దేరాం.
” ఒరే రాము… మీ అమ్మగారు ఎలావున్నారు రా ? ” మధ్యలో అడిగాను.
” బాగానే ఉందిరా. ప్రస్తుతం మా చెల్లి దగ్గర వైజాగ్లో వుంది. మా బావగారికి స్టీల్ ప్లాంటు లో ఉద్యోగం. మా చెల్లి కొడుక్కి మా అమ్మ దగ్గరే చనువు. ఈవిడా వాడ్నివిడిచి ఓ నిమిషం కూడా ఉండలేదు. ఎప్పుడు రమ్మన్నా రాదు రా ! నాకు చూడాలని ఉన్నప్పుడల్లా ఓ మారు వెళ్ళి చూసొస్తా !”
మా అమ్మ గురించి అడిగితే, పోయి ఆరేళ్ళయ్యిందని చెప్పా. రాంబాబు బాధ పడ్డాడు. మా ఇద్దర్నీ మా అమ్మ ఒకేలా చూసేది అన్నాడు.
” నువ్వు మా ఆవిడని ఇంకా చూడ లేదు కాని చాలా మంచిదిరా. మొత్తం అంతా తనే చూసుకుంటుంది. కరెంటు బిల్లు దగ్గర నుండి.. మా అమ్మాయి చదువు, నా పనులు అంతా ఆవిడే చేస్తుంది. నాకు ఆఫీసు పనితోనే సరిపోతుంది. రాధ లాంటి భార్య దొరకడం నా అదృష్టం రా ! ” రాంబాబు మురిసిపోతూ చెప్పాడు.
రాంబాబు చెప్పినట్లుగానే వాళ్ళ ఇల్లు నీటుగా ఉంది. మేం వెళ్ళేసరికి ఇంకా వంట కాలేదు. ఆవిడ వంటింట్లో కి వెళ్ళింది. రాంబాబు నాతో మాట్లాడుతుండగా వంటింట్లోంచి పిలుపువస్తే లోపలికెళ్ళాడు. రాంబాబు కూతురు నాతో మాట్లాడుతూ నాకు కంపెనీ ఇచ్చింది. రాంబాబు ఎంతకీ బయటకి రాలేదు. వాళ్ళ ఆవిడతో ఆఫీసు కబుర్లు చెపుతూ వంటలో సహాయం చేస్తున్నాడు. హాల్లో కూర్చున్న నాకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
” కాస్త పని ఉంటే, హెల్ప్ చేస్తున్నా. సారీ లేటయ్యింది !” నొచ్చుకోలుగా అన్నాడు. నాకు కోపం వచ్చింది. కాని బయటకి మాత్రం “ఫర్వాలేదు” అని ముక్తసరిగా అన్నాను.
రాధ వంట బాగా చేసింది.
భోజనం చేస్తున్నంత సేపూ ఆవిడ “పొగడ్తల దండకం” చదవడానికే రాంబాబుకి టైం చాల్లేదు.
* * * * *
ఆ మర్నాడే బెంగుళూరు వెళ్ళాను. అక్కడనుండి సరాసరి మా చెల్లిని చూద్దామని వైజాగ్ వెళ్ళాను. కౌసల్య ఇచ్చిన షాపింగ్ లిస్టు మా చెల్లెలుకి అప్పగించాను.
నేను మా చెల్లెలు జగదాంబా సెంటరులో షాపింగ్ కి వెళ్ళాం. పట్టుచీరల షాపులో మాకు అనుకోకుండా ఒకావిడ కనిపించింది.
“నువ్వు… మీ పేరు రాజా కదూ ! మీది అమలాపురం … ” అడిగింది.
ఆవిడెవరో చూడగానే గుర్తు రాలేదు. కొద్ది సేపటికి రాంబాబు చెల్లెలు సుమతి అని గుర్తించాను.
“ఎక్కడుంటున్నావు ? పెళ్ళయ్యిందా ? రాంబాబుని కలిసేవా ? ” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
నా గురించి చెప్పాను ! నన్ను చూసి చాలా సంతోషించింది సుమతి. వాళ్ళ ఆయనకి పరిచయం చేసింది. నేను రాంబాబుని కలిసినట్లు చెప్పాను.
” అవునూ .. మీ అమ్మగారెలా ఉన్నారు ? ”
” మా అమ్మ మా దగ్గరే ఉంటోంది. ఏదో ఉంది. ఆరోగ్యం అస్సలు బాగోలేదు. డాక్టరు ధథలధపష అని చెప్పాడు. అలాగే మంచాన పడి బాధ పడుతోంది ! “రాంబాబు నాకు ధథలధపష అన్న విషయం చెప్పలేదు. అదే నేను అన్నా సుమతితో.
” వాడలాగే చెపుతాడు. వాడొచ్చి అమ్మని చూసి నాలుగేళ్ళు దాటింది. ఎన్ని సార్లు రమ్మనమని ఉత్తరాలు రాసినా ఇంత వరకూ రాలేదు. ఫోన్ ఛేస్తే, ఊళ్ళో లేడు, వచ్చేక చెపుతానంటుంది మా వదిన… ” సుమతి చెప్తూనే వుంది …
నా మెదడు స్తబ్ధంగా అయ్యింది. ఏం చెప్పాలో నోట మాట రాలేదు.
” ఇవేమీ నాకు తెలీదు సుమతీ ! ” బాధగా అన్నాను.
వాళ్ళ ఎడ్రస్ తీసుకొని షాపు నుండి బయటకి వచ్చాం. నాకింక షాపింగ్ చేయాలనిపించలేదు.
ఆ రోజు సాయంత్రం రాంబాబు అమ్మగార్ని చూడ్డానికి గాజువాక వెళ్ళాను !
*****************************
ఇండియాలో ఉన్న ఒక వారమూ తెలీకుండా గడిచిపోయింది. అమెరికా వచ్చాక, జెట్ లాగ్ తో రెండు మూడు రోజులు గడిపాను.
నా ప్రయాణ విశేషాలన్నీ కౌసల్యకి చెప్పాను. రాంబాబు ప్రవర్తనని గురించి చెప్పి, అది నాకు నచ్చలేదని, అతనికి ఫోన్ చేసి కడిగేస్తానని అన్నాను. కౌసల్య వద్దని వారించింది.
ఓ రోజు రాత్రి నిద్ర పట్టకపోతే, రాంబాబుకి ఉత్తరం రాయడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి పెంచిందీ, రాత్రనక పగలనకా పిల్లలకోసం ఎలా హారతి కర్పూరంలా హరించింపోయిందీ రాశాను. రాంబాబు చేస్తున్నది సరికాదని, వాళ్ళమ్మని చూడాల్సిన బాధ్యత గురించి చెప్పాను.
ఉత్తరం ముగిస్తుండగా ఎక్కడనుంచివచ్చిందో తెలీదు, నా వెనుకనే ఉన్న కౌసల్య ఎవరికి ఉత్తరం అన్నట్లుగా చూసింది.
చేతికిచ్చాను.
మీకు చెప్పడం దండగ అన్నట్లు నాకేసి చూస్తూ వెటకారంగా అంది.
” ఈ పది పేజీల ఉత్తరం చదివి మీ ఫ్రెండు మారిపోతాడనే మీ నమ్మకం ? ”
” రాంబాబు ఈ ఉత్తరం చదివి మారిపోతాడని రాయలేదు. నా మనసులో ఉన్న బరువు తీర్చుకోడానికి రాసాను. వాడు వింటాడా వినడా అన్నది నాకనవసరం. తప్పని తెలిసి చెప్పకపోవడం నా తప్పవుతుంది! ”
*************
ఓ నెల్లాళ్ళ తరువాత ఇండియా నుండి నాకు ఊహించని ఒక ఉత్తరం ఒచ్చింది. చదివేకా నా కళ్ళు చెమర్చాయి.
మౌనంగా కౌసల్య చేతిలో ఉత్తరం పెట్టాను.
” ప్రియమైన రాజుకి,
నువ్వు వెళ్ళిన వారానికి మా అమ్మ పోయింది. మా అన్నయ్యకి కబురు పంపితే రాలేదు. ఫోను చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత తెలిసింది మా అన్నయ్య వాళ్ళ బావమరిది కొడుకు బారసాలకి వెళ్ళాడని.
మేం ఎంత ప్రయత్నించినా వాడు దొరకలేదు. చివరకి మావారే అన్నీ జరిపించారు. మా అన్నయ్య పదో రోజుకి కాని రాలేదు.
నువ్వు వచ్చి వెళ్ళాక, మా అమ్మ చాలా సంతోషించిది. అందుకే ఈ వార్త నీతొ పంచుకోవాలని రాస్తునాను….”
సుమతి.