అటు ఇటు తిరగలేక ఛస్తున్నా. ఒక్కడూ జవాబు చెప్పడు. చూసి చూడనట్లు, విని విననట్లు-పట్టించుకోకుండా-బిజీ బిజీగా నటిస్తున్నారందరూ. వీళ్ళ వల్లనే లోకం నడుస్తోందనుకుంటున్నారేమో! ఇవ్వాళ విషయం తేలిపోవాలి… అనుకుంటూ వీధి మలుపు తిరిగి, ప్రభాకరం ఇంటి ప్రహరీ గోడ తలుపు చప్పుడవ్వకుండా తీశాను. ఎక్కడనుంచి పసిగట్టిందో, కుక్క అరిచింది. కట్టేసుంది కాబట్టి సరిపోయింది. లేకుంటే మీదపడి పీకేదే. ఎప్పుడు కనిపించినా కాళ్ళు నాకుతూ, వెనకాలే తోకాడించుకుంటూ వెనకాతలే తిరిగిన దీనికిప్పుడేమైందో! ఇదనేముంది. తెలిసిన వాళ్ళు, స్నేహితులనుకున్న వాళ్ళు… శత్రువులు- అందరూ అంతే! కళ్ళ ముందు తిరుగుతున్నా పట్టించుకోరు. ప్రేమగా పిలిచినా వినిపించుకోరు. వాళ్ళతో పోలిస్తే ఈ కుక్కే నయం… నా రాకను గుర్తించినట్లు, అరవనైనా అరుస్తోంది.
పక్కింటి వాళ్ళబ్బాయి కుక్క వైపు నా వైపు మార్చి మార్చి చూసి, కుక్కకు కాస్త దూరంగా జరిగి – టామీ్… సైలెన్స్, సైలెన్స్, అన్నాడు. నేను కూడా కుక్క వైపు మొహం చిట్లించి చూసి, అరవొద్దన్నట్లు ఇష్షని శబ్దం చేసి, పక్కింటి వాళ్ళబ్బాయిని ప్రభాకరం ఉన్నాడా అనడిగాను. అదే పనిగా మోరెత్తి అరుస్తున్న కుక్క వైపు భయంగా చూస్తున్న పక్కింటి వాళ్ళబ్బాయికి, నా మాటలు వినిపించలేదులా వుంది. టామీ! టామీ! అని పెద్దగా అరచి కుడి కాలుతో నేలను తన్ని, వాళ్ళింట్లోకి వెళ్ళాడు.
మెడకు కట్టిన ఇనప గొలుసు తెగెలా బలంగా లాగుతూ, కాళ్ళ తో నేలను వెనక్కి తంతూ, కర్ణ భేరి బద్దలయ్యేలా అరుస్తోంది కుక్క. దాన్ని పట్టించుకోకుండా గుమ్మం దగ్గరకెళ్ళి తలుపు తడుతూ, చెప్పులు విడవడానికి కాళ్ళు విదిలిస్తూ పాదాల వైపు చూసుకున్నాను.
లోపలనుంచీ ఎవ్వరూ పలకలేదు. మళ్ళీ తలుపు తట్టాను. కిటికీ కర్టెను కాస్త కదిలింది. తలుపును చిన్నగా తోసి, మెల్లిగా లోపలకు వెళ్ళి కూర్చున్నాను.
సావిత్రి వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. పలకరింపుగా నవ్వింది. ఇంట్లో అలికిడి లేదు. ఉంది మేమిద్దరమే. సావిత్రి వాళ్ళ ఇంట్లో ఇలాంటి సందర్భాలు అరుదు.
చాలా రోజుల తర్వాత కలవడం. కాసేపు మౌనం. తర్వాత పొడిగా పలకరింపులు.
నేనూహించుకున్న సన్నివేశం వేరు. సావిత్రి నన్ను చూడగానే ఆనందంతో గంతులు వేస్తుందని, ఆమె మొహంలో పున్నమి వెలుగు కనిపిస్తుందని, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే గల గలా మాట్లాడుతుందని ఊహించుకుంటూ వస్తే ఇంట్లో ఎవరికోసమో వచ్చిన అతిథిని మొక్కుబడిగా ఆహ్వానించినట్లు, పరిచయస్తుడిని మొహమాటానికి పలకరించినట్లు పలకరిస్తోంది.
గుమ్మం దగ్గర అడుగుల శబ్దానికి తల తిప్పి చూస్తే సావిత్రి అన్న గోపిచంద్, టామీతో లోపలికొస్తున్నాడు. గోపి నాకు స్నేహితుడు. కాలేజీ వరకు ఇద్దరం ఒకే క్లాసులో చదువుకున్నాం. ఎదురెదురుగా కూర్చున్న మా ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తున్న గోపీని దాటుకుని, నేను కూర్చున్న కుర్చీ కానుకుని కూర్చుని, నా కాలును నాకుతోంది టామి.
గోపీచంద్ ఆశ్చర్యం అసహనంగా మారడానికి అట్టే సమయం పట్టలేదు. ఎందుకొచ్చావన్నట్లు నావైపొక చూపు విసిరి, లోపలికి వెళ్ళమని సావిత్రికి, కళ్ళతోనే సైగ చేశాడు.సావిత్రి కుర్చీలో తలొంచుకుని ఇబ్బందిగా కదిలింది. సంజాయిషీగా నేనేదో చెప్పబోతుంటే- నా కాలు నాకుతున్న కుక్కను పళ్ళుకొరుకుతూ బలంగా డొక్కలో తన్నాడు. ఎంత బలంగా తన్నాడంటే నేను కూర్చున్న కుర్చీ పక్కకు వంగేంత బలంగా!
కుక్క కుయ్యో మొర్రో మంటూ నేలమీద దొర్లుతోంది.
నేను చప్పున కుర్చీ లోంచి లేచాను. సావిత్రి తలొంచుకుని తన గదిలోకి వెళ్ళి పోయింది. వొంట్లోని నెత్తురంతా మొహంలోకి తెచ్చుకుని, నన్ను మసి చేసేలా చూస్తున్న సావిత్రి అమ్మ నాన్నల్ని చూసి నా నోట మాట రాలేదు. సావిత్రి మేనమామ అక్కడకు ఎప్పుడొచ్చాడో తెలియదు. అందరిలో హటాత్తుగా ఎందుకింత మార్పు వచ్చిందో నాకర్థం కాలేదు. సావిత్రి మేనమామ దగ్గరగా వచ్చి, నా రెక్క పుచ్చుకుని గుమ్మంలోంచీ బయటకు నెట్టాడు. నెడుతున్నప్పుడు అతని కళ్ళలో కనిపించిన కోపానికి నాకు చాలా భయమేసింది.
బయటంతా చిక్కటి చీకటి. ఇవ్వాళ అమావాస్య అనుకుంటా. మధ్య మధ్యలో మూసిన తలుపుల వైపు చూసుకుంటూ వస్తుంటే, కుక్క వగరుస్తూ మళ్ళీ అరవడం మొదలెట్టింది. కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను.
రోడ్డు మీద పెద్దగా రద్దీ లేదు. తెలిసిన మొహాలు ఒకట్రెండు కనిపించినా పలకరించాలనిపించలేదు. వాళ్ళూ అంతే! నన్ను చూడనట్లే, పక్కనుంచీ దాటుకెళ్ళారు.
యాదగిరి కిళ్ళీ బంకు దగ్గర శంకర్రెడ్డి ఎవరితోనో జీవితం గురించీ, చావు గురించి అనుబంధాల గురించీ మాట్లాడుతున్నాడు. నమ్ముకున్నోళ్ళను నట్టేట ముంచితే పొయ్యేది నరకానికే! నామాటిని పాలసీ తీసుకో. మొదటి మూడునెలల ప్రీమియం నేనే కడతానని చెబుతున్నాడు.
శంకర్రెడ్డికి చిక్కిన మనిషిపైన జాలి కలిగింది. స్వర్గానికి టికెట్టిస్తానంటున్న శంకర్రెడ్డిని చూసి నవ్వొచ్చింది. దాదాపు రెండేళ్ళ క్రితం నాక్కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. స్వర్గ నరకాలుంటాయా?! ఉంటే అక్కడకు మనుషులెలా వెళతారు? ఎక్కడికి ఎవరిని పంపించాలనేది, ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు?
సావిత్రికి నాకూ మధ్యనున్న స్నేహం ప్రేమగా మారడం నాకు ఒప్పుగా కనిపించింది, సావిత్రి ఇంట్లో వాళ్ళకు తప్పుగా తోచింది. నేనూ, గోపీ చనిపోయాక ఎవరిని నరకంలోకి తోస్తారు? ఎవరిని స్వర్గంలో కూర్చోబెడతారు? శంకర్రెడ్డి గానీ, నన్ను చూస్తే ఆపి ఎదుటి వాడికి నన్ను ‘స్పెసిమెన్’గా చూపించి విసిగిస్తాడని, కిల్లీ బంకు పక్కన చీకట్ల లోంచీ మెల్లగా ప్రక్కకొచ్చి నాయర్ హోటల్‌లోకి వెళ్ళాను.
జనార్థన్ విష్ చేశాడు. ఎలా వొచ్చావురా అనడిగాడు. ఇక తిరిగి రాడనుకున్నవాడు హటాత్తుగా కనిపిస్తే, ఆశ్చర్యంగా అడిగినట్లు!
“దున్నపోతెక్కి వచ్చాన”ని చెప్పి, నవ్వాను. “చెప్పిన టైముకు బండివ్వకపోతే ఎలా? ఇంకోసారి అడుగు చెబుతా” అన్నాన్నేను. వీడెప్పుడూ ఇంతే. గంటలో తెచ్చిస్తానని బండి తీసుకోవడం, పత్తాలేకుండా పోవడం.
“బండి బ్రేకులు సరిగ్గా పడ్డం లేదు. క్లచ్ వైర్ కూడా తెగిపొయ్యేలాగుంది. మార్పిద్దామని హుస్సేను షాపుకెళ్ళా. షాపు తెరవలా. వాళ్ళ ముసలమ్మ పోయిందట,” చెప్పాడు జనార్థన్.
“ఎక్కడికి పోయిందంట? సిన్మాకా?”
“కాదు. వైకుంఠ యాత్రకు,”అంటూ చెయ్యెత్తి వేళితో పైకి చూపించాడు.
“విమానంలో వెళ్ళిందా? అయినా మక్కాకు కదా పోవాలి,” నవ్వాను.
“నీయబ్బా! నువ్విట్లాగే జోకులెయ్యి. ఆ ముసల్ది కొరివి దయ్యమై వొచ్చి నీచేత డాన్సులు చేయిస్తది,” అన్నాడు జనార్ధన్.
“దయ్యాలెలా ఉంటయ్?” అడిగాన్నేను.
“నేనెప్పుడూ చూళ్ళేదు?” అన్నాడు వాడు.
“అలా వెళ్ళి ఆ అద్దంలో ఒకసారి చూసుకో దయ్యం కనిపిస్తుంది,” అన్నాను వాడికి దూరంగా జరుగుతూ.
చేతులో వున్న బండి కీస్‌ను నా మొహమ్మీదకు విసిరేశాడు. వాటిని అందుకుని టీ త్రాగి బయల్దేరాను.
ఇంటికి వెళ్ళి స్నానం చేసి, సావిత్రి వాళ్ళింటికి వెళ్ళాలి. ఈ రోజైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, కన్విన్స్ చెయ్యాలి. విషయాన్ని ఒక కొలిక్కి తేవాలి.
అమ్మ దిగులుగా దుఃఖంగా కూర్చుని వుంది. పక్కింటి ఆంటీ అమ్మ ప్రక్కనే కూర్చుని చిన్నగా ఏదో చెబుతోంది. అయిదారుగురు బంధువులు అటుఇటు తిరుగుతున్నారు.
అమ్మను పలకరించాను. అంత దుఃఖంలో నా మాట విన్నదో లేదో – బదులు పలకలేదు.
నెమ్మదిగా నా గదిలోకి వెళ్ళాను. నన్నెక్కడకో సాగనంపడానికన్నట్లు వస్తువులన్నీ సర్దిపెట్టి వున్నాయి. ప్రక్క గదిలో నాన్న ఫోనులో ఎవరితోనో కోపంగా దెబ్బలాడుతున్నాడు. ఆయన మాటల్లో గోపీ పేరు, నా ప్రస్తావన వచ్చేసరికి… నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
గోపీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇన్నాళ్ళూ స్నేహితుడు కదాని ఓపిక పట్టాను. సావిత్రీ నేనూ చనువుగా వుంటే వాడికేమైంది. ఎలాగూ ఆమెను పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకుంది. సావిత్రికీ ఇష్టమే. మధ్యలో వీడు కలుగజేసుంటే జరిగేది జరక్కుండా ఆగుతుందా?!
దూరంగా డప్పు మోత వినిపిస్తోంది. కట్టెల మోపుతో ఎదురొచ్చిన రిక్షావాణ్ణి తప్పించుకోవడానికి వేసిన బ్రేకు పడలేదు. వాణ్ణి నాలుగు బూతులు తిట్టుకుంటూ పక్కకి కోసి ఎదురుగా వస్తున్న లారీ హెడ్‌లైట్లు డైరెక్టుగా కళ్ళలో పడి… అంతా చీకటై… పెద్ద వెలుతురొచ్చి… శబ్దం నిశ్శబ్దంలో ఐక్యమై … మళ్ళీ చీకటైంది.
ఊర్వశి బార్‌లో ఆరు బయట వెన్నెల బూడిద రంగులో మెరుస్తోంది.
గోపీ మేనమామ, ఎదురుగా ఉన్న మందు గ్లాసు వైపు మత్తుగా చూస్తూ, ప్రక్క కుర్చీలో కూర్చుని వాడితో గుసగుసగా ఏదో మాట్లాడుతున్నాడు. ఖాకీ నిక్కరు, చొక్కా… లారీ డ్రైవర్ లాగున్నాడు.
అక్క కూతురు పెళ్ళిని సెలబ్రేట్ చేసుకోవడానికి బారు కొచ్చాడనుకుంటా. ఎదురుగా వెళ్ళి కూర్చున్నాను. అప్పటికే సీసాలో మందు అడుగంటింది.
“మరో బుడ్డి తెమ్మందామా?”అన్నాడు డ్రైవర్. నాలిక మొద్దుబారి, మాటలు ముద్దగా వొస్తున్నాయి.
“ఇప్పుడే ఇంకెవర్నీ గుద్దక్కర్లా” నవ్వి, “నేను లాయర్‌తో అంతా మాట్లాడా… ఖర్చులనీ నేనే పెట్టుకుంటా. నీకేమీ భయం లే” అంటూ గ్లాసును వణికే చేతులతో పైకెత్తి గడగడా తాగేసి, ప్లేటులోని ముడుచుకున్న రొయ్యను నోట్లో వేసుకుని నమిలాడు గోపీ మేనమామ.
“అంకుల్” పిలిచాను నేను.
“అంకుల్…” ఈసారి గట్టిగా పిలిచాను. ఉలిక్కి పడి చుట్టూ చూశారిద్దరూ.
“ఇదిగో ఇక్కడే వున్నాన్నేను!” అన్నాను చేత్తో చిటికె వేస్తూ.
నా వైపు మొహం చిట్లించి, కళ్ళు నులుముకుని చూశారు.
కుర్చీలోంచి లేచి తూలుకుంటూ నా దగ్గరకు వచ్చాడు గోపీ మామ. నా మొహంలోకి తేరిపార చూసి, మళ్ళీ కళ్ళు నులుముకుని, నా కుర్చీ మీదుగా వొంగి, సెల్ ఫోనందుకుని, “హలో… నువ్వూ…” అంటూనే దబ్బుమని మొదలు విరిగిన చెట్టులా క్రింద పడిపోయాడు.
డ్రైవర్ మొహంలో ఎక్కడలేని భయం!