సీతాకోకచిలుకలమ్మేవాడు

ఒకవారం మార్కెట్ వీధి
ఇంకోరోజు పూలకొట్టు అని
ఒక చోట నుండి ఇంకో చోటికి
నిలకడ లేకుండా నిరంతరం
సాగే అతగాడి జీవనం.

బహుశా
పదమూడేళ్ళ వయసుంటుందేమో
వంతెన పక్కన
నేనా అబ్బాయిని చూసినప్పుడు.

గొడుగును వెల్లకిలా పరిచి
తన సరుకును అందులో
వరుసలుగా పేర్చి పెట్టాడు.

వాటి పొట్టపైన
మైనపు పూత పూసివుండి
రెక్కలు విదల్చలేని స్థితిలో
సీతాకోకచిలుకలు.

సీతాకోకచిలుకలు, సీతాకోకచిలుకలు!
అని అరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ
సీతాకోకచిలుకలమ్ముతున్నాడు.

తీసేవారి మునివేళ్ళలో
రంగులు వసివాడని
సీతాకోకచిలుకలు.

బాల్యంలో చేతికి చిక్కకుండా
తప్పించుకున్నవేవో
ఇప్పుడు తమకు చిక్కినట్టు
అందరి కళ్ళలోను విజయగర్వం.

అలమరవైపుకో, గోడవైపుకో
ఆశగా పాకుతూ వెళ్ళే
ఇంటి గోడలమీది బల్లులకు ఇకపై
ఎదురుకానుంది ఒక భంగపాటు.

(మూలం: పట్టాంబూచ్చి విఱ్పవన్ అనే తమిళ కవితాసంకలనంలో అదే పేరున్న కవిత.)


నా. ముత్తుకుమార్

రచయిత నా. ముత్తుకుమార్ గురించి:

నాగరాజన్ ముత్తుకుమార్ (1975 – 2016) భారతీయ కవి, గేయ రచయిత & రచయిత. ప్రధానంగా తమిళ భాషా చిత్రాలకు పాటలు రాశారు. స్వరకర్తలు యువన్ శంకర్ రాజా & జివి ప్రకాష్ కుమార్‌లతో తరచుగా కలిసి పనిచేసినందుకు ప్రసిద్ది చెందారు. తమిళంలో ఉత్తమ గీత రచయితగా అత్యధిక ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. తంగా మీన్కల్ (2013), శైవం (2014) సినిమాలకు ఉత్తమ గీత రచయితగా రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు & నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.

 ...