కాగితపు అద్దం

నీతో నువ్వు ఎంతసేపు మాట్లాడుకున్నా,
మనసు చిక్కబడదు.
ఒక మంచు దీపపు కాగితం కోసం అన్వేషిస్తావు.
కాపిరాగపు పాట విని తేలికపడి,
దిగులునంతా
తేలికగా ఆ కాగితంపై పరచాలనీ,
మళ్ళీ మళ్ళీ చదువుకునేలా
కొన్ని మాటలు రాయాలనీ,
అక్షరాల నీలి ఆకుల చుట్టూ
మెత్తని పాటలు కడతావు.
అక్షరాలను పేరుస్తూ, నీ కళ్ళ తడి నీడలను వింటావు.
పాటలు కడుతూ, నీ పగిలిన గొంతును సవరించుకుంటావు,
చాలాసార్లు.
చివుక్కుమన్న మనసు పొరల్లోని మాటలు కొన్ని
ఆ గొంతులో దాచుకుంటావు.

తడి పచ్చిక పలకలపై,
మాటలు విసురుగా కదులుతాయి.
వెచ్చని దీపపు మెరుపులో
నీటి తంబూరా
దూరంగా వినపడుతుంది.

సీతాఫలపు తియ్యని గాలి ఎంత పలకరించినా,
పువ్వులు ఎంత నటించినా,
పాటల్లోని చేదు ఇంద్రజాలం తెలిసిన నువ్వు
గవ్వ పదాల చుట్టూ ఇసుక తీగల
చీకటి గిజిగాడి గూడల్లుతావు.
నిన్ను నువ్వు పాటల్లో చూసుకుంటూ
నువ్వే ఒక తడిసిన కాగితంలా కనిపిస్తావు.