మాస్కాట్!

చేసే ఉద్యోగం ఎవరినైనా అదృశ్యం చేస్తుందా? సునీల్‌ని చూస్తే ‘అవును’ అనిపిస్తుంది. ఎమ్యూజ్‌మెంట్ పార్క్ మూసి ఉండే సోమవారం నాడు తప్ప, వారంలో మిగతా ఏ రోజూ అతను ఎవరికీ కనపడడు. నగరంలోని అతి పెద్ద ఎమ్యూజ్‌మెంట్ పార్కులలో వండర్ వరల్డ్ ఒకటి. దాంట్లో ఎన్నో ఆటలు, రైడ్స్, మ్యాజిక్ షోస్, ఇంకా ఎన్నెన్నో వినోదాలు. వండర్ వరల్డ్‌‌లో అతను సింహం వేషం వేస్తాడు.

హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టుగా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు.

అయితే, ఆపాటి చదువుతో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 కారణంగా ఏర్పడిన మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. ఎక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు, పాత ఉద్యోగాలు పోగొట్టుకొని కొత్తగా మళ్ళీ వెతుకుతున్నవాళ్ళు ఎందరో చుట్టూ ఉన్నారు. సునీల్ ఎన్నో ఇంటర్‌వ్యూలకి వెళ్ళాడు కానీ ఫలితం లేకపోయింది. వండర్ వరల్డ్‌లో ఈ అవకాశం గురించి ఓ మిత్రుడు చెప్పినప్పుడు ఏం చేయాలో అతనికి తోచలేదు. ‘లూనా అనే సింహం వేషం ఉంది. సింహం కాస్ట్యూమ్ వేసుకుని రోజంతా పిల్లలకి, సందర్శకులకి వినోదం కలిగించాలి. రోజంతా ఆ కాస్ట్యూమ్ ధరించి ఉండడం చిరాకుని, కాస్త భయాన్ని కలిగిస్తుంది. పర్లేదు అనుకుంటే, ప్రయత్నించు’ అన్నాడా మిత్రుడు. అదే చేశాడు సునీల్. తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

ఇంటర్‌వ్యూ సమయంలో హెచ్. ఆర్. అధికారి కాస్త సందేహించాడు. ఎందుకంటే సునీల్ అంతకుముందెప్పుడూ మాస్కాట్‌ వేషం వేయలేదు. మరి రోజంతా ఆ కాస్ట్యూమ్‌లో ఉండగలడా? అయితే సునీల్ తనను నమ్మమని, ఆ ఉద్యోగం చేయగలనని చెప్పాడు. కావాలంటే ఒకరోజంతా ఆ కాస్ట్యూమ్ వేసుకుని పని చేస్తానని, తన పనితీరు నచ్చితేనే ఉద్యోగం ఇవ్వమని అన్నాడు. ఇంటర్‌వ్యూకి వచ్చినవాళ్ళలో సునీల్ ఒక్కడే కుర్రాడు కావడం, మిగతావాళ్ళు అతనికంటే వయసులో పెద్దవాళ్ళు కావడంతో – ఈ కఠినమైన పనిని వాళ్ళు సక్రమంగా చేయగలరా అని హెచ్. ఆర్. అధికారికి సంశయం కలగడంతో, సునీల్‌కి అవకాశం ఇచ్చాడు.

సునీల్ ఈ ఉద్యోగంలో చేరి పది నెలలు గడిచాయి. తన ఉద్యోగబాధ్యతలపై గట్టి పట్టు సాధించాడు. తమ స్టాఫ్‌కి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్ పార్కే ఏర్పాటు చేస్తుంది. సునీల్‌కి కాస్తయినా విరామం దొరికే వీలు తక్కువ. ఉదయం పది గంటలకల్లా వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు. తర్వాత సింహం కాస్ట్యూమ్ ధరించి ‘లూనా’గా మారిపోతాడు. 11 గంటలకు సందర్శకులను లోపలికి అనుమతించే సమయానికి సిద్ధంగా ఉంటాడు. పిల్లలకేసి, పెద్దలకేసి చేతులు ఊపుతూ, తమాషా సంజ్ఞలు చేస్తూ, నవ్విస్తాడు. తరువాత మధ్యాహ్నం భోజనం కోసం ఓ అరగంట, సాయంత్రం స్నాక్స్ కోసం మరో అరగంట విరామం తీసుకుంటాడు. పార్క్‌ని రాత్రి 8 గంటలకి మూసేస్తారు. అప్పటికి లూనా అవతరాన్ని ముగించి, మిగతా రాత్రి కోసం మామూలు సునీల్ అవుతాడు.

సునీల్ తన పనికి బాగా అలవాటు పడిపోయినా, ఒక్కోసారి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రోజుంతా అలా సింహం కాస్ట్యూమ్‌లో ఉండడం వల్ల ఊపిరాడనట్టుగా అనిపిస్తుంది. అయితే అతనికి సంతోషాన్నిచ్చే అంశం మరొకటుంది – తాను ఎవరికీ కనబడకపోవడం, కాస్ట్యూమ్ వెనుక ఉన్నది తనేనని ఎవరికీ తెలియకపోవడం, ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం లేకపోవడం! పిల్లల్ని నవ్వించేది, వాళ్ళతో చేతులు కలిపి ఆడేదీ లూనా.

ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వచ్చే చిన్నా పెద్దా అందరికీ అతనో ఆకర్షణ. వాలెంటైన్స్ డే రోజున పార్క్‌కి వచ్చే ప్రేమికుల వైపు హృదయాకారపు చాక్లెట్‌లను విసురుతాడు, మదర్స్ డే రోజున తమ పిల్లలతో పార్కుకి వచ్చే తల్లులకి బొకేలు ఇస్తాడు, పిల్లలని ఎత్తుకుని ఆడిస్తాడు. ఇవన్నీ సునీల్ ఉద్యోగ బాధ్యతలలో భాగమే అయినా, ఘనత మాత్రం మాస్కాట్ లూనాకి దక్కుతోంది. స్థూలంగా చెప్పాలంటే కాస్ట్యూమ్ ధరించిన ఓ యంత్రం అతను. ఒక్కోరోజు చాలా నిరాశగా ఉంటుంది. ఒక్కోరోజు సందర్శకులు రాక, అసలు పనే ఉండదు.

సునీల్‌ని పిల్లాడెవరైనా పార్కు బయట మామూలు బట్టల్లో చూస్తే అసలు గుర్తు పట్టలేడు. లూనా వేషంలో గత వారం పార్కులో తాను పలకరించిన దంపతులు బయట ఎదురయితే, వాళ్ళు సునీల్‌ని గుర్తించలేరు. ఓ అపరిచితుడుగా భావిస్తారు. అదే అతనికి బాధ కలిగించేది. పైగా కాస్ట్యూమ్‌లో ఉన్నప్పుడు – తన చేష్టలు నచ్చి ఎవరైనా చప్పట్లు కొట్టినప్పుడు గాని, లేదా తను షేక్‌హ్యాండ్ ఇవ్వడం నచ్చని వ్యక్తులు చేయి వెనక్కి తీసుకున్నప్పుడు గానీ అతని హావభావాలు ఎవరికీ కనిపించవు.

మరొక ప్రయోజనం ఏంటంటే అన్నిటినీ, అందరినీ గమనించడానికి సునీల్‌కి బోలెడు సమయం దొరుకుతోంది. సంతోషంగా వచ్చే కుటుంబాలు, ఉల్లాసంగా దిగే స్నేహితుల బృందాలు, ఆనందంగా వచ్చే జంటలని చూడడం సునీల్‌కి హాయినిస్తుంది. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు ఉన్న ఓ కుటుంబాన్ని చూసినప్పుడల్లా – నాన్న తమని వదిలి వెళ్ళిపోక ముందు తన కుటుంబం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటుంటాడు.


అప్పుడు సునీల్ వయసు పన్నెండు సంవత్సరాలు. ఒక రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఎప్పుడూ వంటిట్లో మామూలుగా వినబడే శబ్దాలు వినబడలేదు. అమ్మ ఏడుపు వినబడింది. హాల్లో మోకాళ్ళ మీద తలపెట్టుకుని గట్టిగా ఏడుస్తోంది. పక్కనే అయిదేళ్ళ వయసున్న చెల్లెలు రుచి కూర్చుని ఉంది. “అమ్మా, ఏడవకు” అని అంటోంది. కానీ అమ్మకి వినబడుతున్నట్లు లేదు.

అమ్మ అంతలా క్రుంగిపోవడం అంతకు ముందెప్పుడూ ఆ పిల్లలు చూడలేదు. ఆ సన్నివేశం కలవరపరిచేలా ఉంది. అన్నని చూసిన వెంటనే రుచి వచ్చి సునీల్ మోకాళ్ళని చుట్టుకుని, “అమ్మకి నువ్వైనా చెప్పు అన్నయ్యా, ఏడవవద్దని” అంది. సునీల్ పదే పదే అడగటంతో, టేబుల్ మీద వాళ్ళ నాన్న రాసి ఉంచిన ఉత్తరాన్ని చూపించింది. ఆ కాగితం గాలికి ఎగిరిపోకుండా దాని మీద ఓ ప్లవర్ వేజ్‌ని ఉంచాడు.

ఆయన మరొక స్త్రీతో ప్రేమలో పడ్డాడట… అది ఆకర్షణ కాదని, నిజమైన ప్రేమని ధ్రువీకరించుకున్నాడట. రెండు జీవితాలు గడపడం ఆయన వల్ల కావడం లేదట. తాను చేస్తున్న ఈ పనిని ఏదో ఒక రోజున భార్య, పిల్లలు అర్థం చేసుకుని తనని క్షమిస్తారని ఆశిస్తున్నాడట – ఇదీ ఆ ఉత్తరం సారాంశం. పదాలు పదునైన కత్తిలా సునీల్ హృదయాన్ని గాయపరిచాయి. లోలోపలే తిట్టుకుంటూ, అమ్మ భుజం మీద చేయి వేశాడు. ఏదో గ్రహించినట్టుగా రుచి కూడా వచ్చి అమ్మని చుట్టుకుంది. కాసేపటికి అమ్మ అలసిపోయి ఏడుపు ఆపేసింది.

నాన్న మొబైల్ ఫోన్ అన్‌రీచబుల్ అని వచ్చింది. ఆఫీసులో కూడా లేడు; కుటుంబానికి తెలియకుండా ఉద్యోగం ఎప్పుడో మానేశాడట. ఆయనకి బంధువులు అతి తక్కువ, ఉన్న ఆ కొద్దిమందీ కూడా ఎక్కడో వేరే ఊర్లలో ఉంటారు. ఎలాగైనా భర్తని కలిసి, పిల్లల సంరక్షణ కోసం డబ్బు అడగాలని అనుకుంది సునీల్ వాళ్ళమ్మ. అయినా అనవసరం అని కూడా భావించింది. విషయం తెలిస్తే జనాలు ఏమనుకుంటారు? వాళ్ళ మౌనంలోని ఉత్సుకతని తాను తట్టుకోలేదని అనుకుంది. ప్రతి క్షణం తనని నిలువునా ముంచేస్తున్న వేదనని తట్టుకోవడం ఎలా? ఒకవేళ బంధువులని సంప్రదిస్తే, వారికి ఆయన ఎక్కడున్నదీ తెలియకపోతే అది మరింత అవమానం కదా? తానేదో లోతుల్లో మునిగిపోయినట్లు అనిపించిదామెకు, ఆ మాటే తరువాత రోజుల్లో ఎప్పుడో పిల్లలకి చెప్పింది. ఆ పిల్లల తండ్రి తన జాడ ఎవరికీ తెలియకూడదనుకున్నాడు, అందుకని తల్లి ఇక ఆ విషయం పట్టించుకోలేదు. ఆమె పేరిట కొద్దిపాటి ఆస్తి ఉంది, కుటుంబాన్ని పోషించేందుకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం సంపాదించింది. ఆర్థికంగా వెలితి ఉన్నా, అదీ ఒక రకంగా తమకి మేలే చేసిందని సునీల్ అనుకుంటాడు.


ఆ రోజు ఆదివారం – ఎమ్యూజ్‌మెంట్ పార్క్ బాగా రద్దీగా ఉంది. వినోదం కోసం, సేద తీరడం కోసం ఎంతోమంది సందర్శకులు వచ్చారు. ఎప్పటిలానే సునీల్ లూనా వేషంలో పిల్లలని పలకరిస్తూ తిరుగుతున్నాడు. ఇంతలో ఓ పిల్లాడు తనవైపు పరిగెత్తుకు వస్తున్నట్టు గమనించాడు, ఎండకి ఆ పిల్లాడి బుగ్గలు ఎర్రబడి ఉన్నాయి. “తుహిన్, ఆగు! ఎక్కడికి వెళ్తున్నావ్?” అంటూ మాటలు వినవచ్చాయి. ఆ పిల్లాడి వెనుకగా అతని తల్లి గబగబా వస్తోంది. వారిద్దరి వెనుకగా ఆ అబ్బాయి తండ్రి కూడా వస్తున్నాడు. చక్కటి శరీర సౌష్టవం, ముఖంపై అలవాటైన నవ్వు. అతని ముఖం బాగా తెలిసిన ముఖంలా అనిపించింది సునీల్‌కి. కానీ వెంటనే గుర్తు రాలేదు. ఆ వ్యక్తిని గుర్తుపట్టేసరికి సునీల్ బిగుసుకుపోయాడు. ఆయన ఎవరో కాదు, సునీల్ వాళ్ళ నాన్నే! కాస్త బరువు పెరిగినట్టున్నాడు, ముఖంలో ముడుతలు. సందేహం లేదు. ఆయనే!

ఓ క్షణం పాటు మొద్దుబారిపోయాడు సునీల్, తన దగ్గరకి షేక్‌హ్యాండ్ కోసం వస్తున్న ఆ పిల్లాడు – తన తండ్రి కొడుకు – తన సవతి తమ్ముడు. తండ్రి మొహం చూస్తుంటే సునీల్ నరాల్లో ఉద్విగ్నత. కొద్ది క్షణాలపాటు కోపం, ఆపై దిగ్భ్రాంతి కలిగాయి. అసౌకర్యంగా అనిపించింది. తన తండ్రికి అతని మాజీ కుటుంబం గుర్తుంటుందా? ఇప్పుడు రెండో భార్యతోనూ, కొడుకుతోనూ ఎంత సంతోషంగా ఉన్నాడో. కొన్నేళ్ళ క్రితం జీవితంతో పోలిస్తే, అతని ప్రస్తుత జీవితం ఎంత భిన్నంగా ఉంది? అప్పట్లో అతని జాడలు తెలియకపోవడం వల్ల ఊరి శివార్లకో లేదా మరో ఊరికో వెళ్ళిపోయుంటాడని సునీల్ వాళ్ళు అనుకున్నారు. తండ్రి ఎక్కడో మరో చోట ఉంటున్నాడని భావించిన సునీల్ కూడా ఆయన ఎక్కడ ఉన్నదీ పెద్దగా పట్టించుకోలేదు. మరిప్పుడు తండ్రి ఈ ఊరికి తిరిగొచ్చేశాడా లేక, కేవలం టూరిస్టుల లాగా ఇక్కడికి వచ్చారా? అతనితో ఉన్న ఆమె – అతని రెండవ భార్య నిజంగా సంతోషంగా ఉందా లేక బలహీన క్షణాలలో తనది తప్పుడు ఎంపిక అని భావిస్తోందా? ఇలాంటి ఆలోచనలు మనసులో మెదిలి సునీల్‌కి కాస్త తల తిరిగినట్లయింది.

ఏదో మైకంలో ఆ చిన్నారితో కరచాలనం చేశాడు. ఆ పిల్లాడి తల్లి నవ్వుతూ తన కేసి చేయి ఊపుతుండడంతో, ఆమెకేసి చేయి ఊపాడు. ఆ పిల్లాడి తండ్రి ఇప్పుడు కొడుకు వీపు మీద మెల్లిగా చరుస్తూ, ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఆ పిల్లాడు గట్టిగా నవ్వసాగాడు. ఆయన ఏం చెప్పాడో సునీల్‌కి వినబడలేదు. పక్కనే ఉన్న ఓ రాతి శిల్పాన్ని ఆసరాగా చేసుకుని నిలదొక్కుకున్నాడు సునీల్.

కొడుకుని నడుము చుట్టూ చేతులు వేసి నడిపిస్తూ వెళ్ళిపోయాడు సునీల్ తండ్రి. చిన్నప్పుడు తనని కూడా అలాగే నడిపించిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ చిన్నారి ఏవో ముచ్చట్లు చెబుతున్నాడు, నాన్న అతన్ని నవ్విస్తున్నాడు. వాళ్ళిద్దరిని ప్రేమగా చూస్తూ ప్రక్కనే అమ్మ నడుస్తోంది. చక్కని కుటుంబం – పూర్తిగా ఆనందం నిండిన కుటుంబం. తన కుటుంబంలో లేనిది అదే అనుకున్నాడు సునీల్.

కాసేపటికి సునీల్ మనసులోని ఉద్విగ్నత తగ్గింది, కానీ పాత గాయమేదో మళ్ళీ రేగినట్టుగా ఉంది. అయినా ఏదో భారం దిగినట్టు భావించాడు. చాలా కాలం క్రితం తనని వదిలేసిన వ్యక్తి తనని గుర్తించే దురవస్థ నుంచి తప్పించుకున్నాడు సునీల్, అందుకు లూనాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మాటల తూటాలు పేలలేదు, ఘర్షణ లేదు, బహిరంగ హావభావాలు లేవు, అసలేమీ జరగలేదు. అంతే.

సునీల్ నవ్వుకున్నాడు. తన చేష్టలకి ఘనత లూనాకి దక్కుతుండవచ్చు, కానీ దాని ద్వారా, మనుషులు కల్పించలేని, అత్యంత అవసరమైన అభయం దక్కింది. లూనా అతనికి అదృశ్యత కల్పించింది. అయితే అదేమీ శాపం కాదు. అదొక వరం, నిజానికి అది సునీల్‌కి ఒక వెలకట్టలేని కానుక.

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...