వానగీతం

వానొచ్చిన ప్రతిసారి
భూమికి సంబరంగా ఉంటుంది

వానవీణను మీటుతూ కరిమబ్బు
చినుకుగజ్జెలతో ఆడుతుంది

తడిచీరతో మెరుపుతీగలా మట్టి
పరిమళాల పాట ఎత్తుకుంటుంది

చల్లని స్పర్శకు విత్తనం చనుబాలకై
ఆకుపచ్చని పెదవులు చాచుతుంది

మొగ్గ కొత్తరంగులద్దుకుని
సమ్మోహనంగా నవ్వుతుంది

వాన కౌగిలింతకు తోట
సిగ్గుబరువెత్తుకుని
తల వాల్చుకుంటుంది

వాన మాత్రం తడికళ్ళను
మంచుగదుల అద్దాలకు అతికించి
చెమ్మగిల్లని మనుషులను
దిగులుతో చూస్తోంది.