వాడు

మొదటిసారి
వాడిని చూశాను

పూలను సీతాకోకలను
వెన్నెలను నక్షత్రాలను
కళ్ళలోకి ఒంపుకుంటూ
కేరింతలు కొడుతున్నాడు

రెండవసారి
వాడిని చూశాను

అమ్మ కలిపిన ప్రేమముద్ద రుచిని
పక్కకు నెట్టి
కదిలే బొమ్మల నీడలలో
చూపులను మునకలేయిస్తూ
చలనరహితంగా ఉన్నాడు

మూడవసారి
వాడిని చూశాను

అరచేతిలో గాజుపలకను
ఇముడ్చుకుని
తనను తాను మరచి
ఏవో కొత్త లోకాలకు
ఆత్రంగా ఈదుతున్నాడు

నాలుగవసారి
వాడిని చూశాను

వాడు ఈ ప్రపంచంతో
తెగతెంపులు చేసుకున్నాడు
ఎడారిలా రూపాంతరం చెందాడు
ఇక వాడు నాకు కనబడలేదు

ఒక మరబొమ్మ
నిర్జీవంగా నిశ్శబ్దంగా ఆడుతోంది.