ఆటవిడుపురోజు ఆట

డెకామెరాన్ కథలో వచ్చే మహమ్మారివ్యాధి బారినుండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తప్పించుకున్న వారిలా తమ పని ఒత్తిడినుండి తప్పించుకున్న ధర్మపాలన్, అశోకన్, వినయన్, దాస్ – ఈ నలుగురు ఎప్పటిలానే ఆ ఆదివారం కూడా నందనవనం లాడ్జిలో రూమ్ నంబర్ డెబ్భైలో ఒక మందు బాటిల్ చుట్టూ గుమిగూడారు. మొదటి పెగ్ పూర్తయ్యేదాకా లోగొంతుకలతో గుప్తమైన మాటలతో చర్చిలో పాపక్షమాపణ బోనులా గుసగుసలాడుతుంటుంది ఆ గది. పెగ్గులు పెరిగేకొద్దీ అడ్డదిడ్డమైన అరుపులతో చప్పుళ్ళు కుదుపులతో అటూయిటూ ఊగిపోతూ హోరెత్తే వాషింగ్ మిషన్‌లా మారుతుంది. అంతా అయ్యి వాళ్ళు నలుగురు అక్కడినుండి బయటపడే సమయానికి ఆ గదంతా చిందరవందరగా, చెత్తతో నిండిపోయి, కంపుకొడుతూ పబ్లిక్ టాయిలెట్ కంటే ఘోరంగా తయారవుతుంది ఆ గది. మళ్ళీ ఆదివారం వచ్చేవరకు తెరచుకోడానికి నోచుకోకుండా పెద్ద గొళ్ళెపు కటకటాల వెనుక చెరసాలలా ఉంటుంది ఆ గది. ఎందుకనో మరి, ఈ రోజు ప్రభుత్వం గురించిన విమర్శో, భార్యతో పడ్డ గొడవ గురించో, బస్సులోనో, దారిలోనో చూసిన అమ్మాయి అంగాంగ వర్ణనలవంటివో మనం మాట్లాడుకోకూడదు అని అందరూ నిశ్చయించుకున్నారు. బదులుగా ఏదైనా కథ చెప్పుకుందాం అని నిర్ణయించుకున్నారు. అది కుదరకపోతే ఏదైనా ఆట ఆడుకోవచ్చు అనీ అనుకున్నారు.

అయితే మొదలయీ కాకుండానే ఏదైనా కథ చెప్పుకోవడంలో ఎదురయ్యే సమస్యేమిటో, వాళ్ళు వెంటనే పసిగట్టగలిగారు. చర్చో, పోచుకోలు కబుర్లో ఏవైనా కథ కావచ్చు. అది ఏదైనా సరే ఈ కథ అనే పోకడలో ఇమిడిపోయేదే. అంతెందుకు, డాక్టర్ మందుమాత్రలు రాసిచ్చే చీటీకి శీర్షిక పెట్టి రాస్తే అది కూడా ఒక కథ అయిపోతుంది. అయితే కొత్తగా ఒక కథను చెప్పడం మొదలుపెడితే మనచేతనే సృష్టించబడ్డ పాత్రధారులు పునఃసృష్టితో దేవుళ్ళుగా మారి ఎప్పుడు మళ్ళీ కథ లోపలికి ప్రవేశిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు మనల్ని చూసి నవ్వి, చేతులతో సైగ చేసి, మారీచుడిలా ఆశ చూపి కుట్ర చేసి ఎటో దూరంగా తీసుకెళ్ళిపోతారు. చిట్టచివరికి కుట్ర బయటపడేసరికి మనం సెలవు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతుంది. కాబట్టి ఆ కథ నుండి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం ఆట ఆడుకోవడం మాత్రమే. ఆ రకంగా వాళ్ళు కథను పక్కనపెట్టి, దొంగా పోలీస్ ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు.

చిన్నతనంలో ఎప్పుడో ఆడిన ఆట తాలూకు వివరాలేవీ గుర్తుకు రాలేదంటూ వాపోయిన వారికోసం ధర్మపాలన్ ఆట నియమాలు, ఆడే తీరును ఒకసారి గుర్తు చేశాడు: మనం నాలుగు చీటీల మీద రాజు, మంత్రి, పోలీస్, దొంగ అని పేర్లు రాసి వాటిని బాగా కలిపి నలుగురం తలో ఒక్క చీటీ తీసుకుంటాం. అందులో పోలీస్ పేరు వచ్చినవాడు, దొంగ ఎవరని కనిపెట్టాలి. పొరపాటున పోలీస్, రాజును దొంగ అంటే గనుక ఐదు దెబ్బలు శిక్ష పడుతుంది. మంత్రిని దొంగ అంటే మూడు దెబ్బలు. చివరిలో అసలు దొంగను విచారిస్తాం.

ఆటకు ముందు అందరూ తలా ఒక పెగ్గు వేసుకున్నారు. అశోకన్ కాగితం ముక్కలపై పేర్లు రాసి, వాటిని మడిచి, గుప్పిట్లో కుదిపి చీటీలు వేశాడు. నలుగురు తలా ఒక చీటీ తీసుకున్నారు. ఈలోపు ధర్మపాలన్ అందరికీ ఇంకో పెగ్గు మందు పోశాడు.

“నేనే పోలీస్” అన్నాడు అశోకన్.

“పర్వాలేదులే. చెప్పాలంటే పత్రికావిలేఖరి పని ఒక రకంగా పోలీస్‌వాడి పనిలాంటిదేగా!” కాస్త నవ్వుతూ, ఎద్దేవా చేశాడు వినయన్. “వాళ్ళు మలమూత్రాలు తినిపిస్తే, వీళ్ళేమో వాటి కంటే నీచమైన మాటలను మనతో తినిపిస్తారు.”

అశోకన్‌కి కోపం ముంచుకువచ్చి “ఆ వెధవ వెటకారాలే వద్దనేది” అన్నాడు.

“దయచేసి ఈ రోజు ఎటువంటి గొడవలు పడొద్దు” అని ధర్మపాలన్ ఆ ఇద్దరిని సద్దుపరిచాడు.

అశోకన్, వినయన్ ఇద్దరూ మాట్లాడలేదు. అశోకన్ ఇంకో పెగ్గు బిగించాడు.

దొంగను పట్టుకోవడం పోలీసు బాధ్యత. అశోకన్, ధర్మపాలన్ వైపు చూశాడు. ధర్మపాలన్ సిగరెట్టుతో పొగను వలయాలు, వలయాలుగా పైకి వదులుతున్నాడు. వినయన్ పళ్ళసందులో చిక్కుకున్న దేనినో చిటికెనవేలి గోరుతో గెలుకుతున్నాడు. దాస్ అశోకన్ ముఖం చూస్తూ నవ్వుతున్నాడు. వీళ్ళలో ఆర్.టి.ఓ. ఆఫీస్ ఉద్యోగి ధర్మపాలన్ కాని, రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే వినయన్ కానీ దొంగయ్యుండాలి. వీళ్ళిద్దరూ కాకుంటే ట్యూషన్ మాస్టర్ దాస్ దొంగయ్యుండాలి. తన ఎదురుగా గుండ్రంగా కూర్చున్న వీళ్ళు ముగ్గురిలో దొంగ ఎవరు అనుకుంటూ, వృత్తిపరంగా వచ్చిన విచారణా ఉత్సుకతతోను, రెండు పెగ్గులు ఇచ్చిన ధైర్యంతోను అశోకన్ అందరినీ గమనించసాగాడు.

“తప్పయితే దెబ్బలు పడతాయి” అని దాస్ అశోకన్‌కు గుర్తు చేశాడు.

శిక్షను తలుచుకోగానే, విచారించే తెగింపు మాట అటుంచితే, అశోకన్ అరచెయ్యి నొప్పిపెట్టసాగింది.

“కావాలంటే దెబ్బలు తినడమనే శిక్షను మరోలా మార్చుకోవచ్చు. ఐదు దెబ్బలకు రెండు వందలు. మూడు దెబ్బలకు బదులుగా వంద రూపాయలు జరిమానా” అన్నాడు అశోకన్.

ముగ్గురూ అందుకు సరేనన్నట్టు తలూపారు. ఆ ప్రశాంతతలోకి మళ్ళీ పోలీసుగా అశోకన్ పరకాయ ప్రవేశం చేశాడు. ధర్మపాలనే బహుశా దొంగ అయ్యుండొచ్చు. సి. పి. రామసామి అయ్యర్, జయరామ్ పడిక్కల్ వీడి ఆరాధ్యదైవాలు. ఎమర్జెన్సీ పీరియడులో ఇందిరాగాంధీ ఫొటోను జేబులో పెట్టుకు తిరిగేవాడు. పైగా రామభక్తుడు. మితభాషి. మింగే లంచం డబ్బుల్లో ఒక వంతు అందరి దేవుళ్ళకు వాటా ఇస్తాడు. బ్రాహ్మణుడికి మంగళహారతి ఇచ్చే కైంకర్యం వంశపారంపర్యంగా వచ్చింది కనుక నేను కూడా దానిని పాటిస్తున్నాననే నెపంతో చెయ్యాల్సిన చిలిపి (డొంక తిరుగుడు) పనులన్నీ చేసేవాడు. కనుక ఇతనే దొంగ అని అశోకన్ నిర్ధారించుకున్నాడు. ‘దేవుడా! నా అంచనా తప్పయితే రెండొందలు దండగ కదా’ అని అశోకన్ భయంతో మరో గ్లాసు తాగాడు.

ధర్మపాలన్, వినయన్ ఇద్దరి గ్లాసుల్లోనూ మందు ఖాళీ అయిపోయింది. దాస్ పల్లీలను నోట్లోవేసుకుని నములుతూ అశోకన్ కంట్లో కనబడే అప్రమత్తతను నవ్వుతూ పరికించి చూశాడు.

“దొంగ ఎవరన్నది కనిపెట్టేశాను” అన్నాడు అశోకన్.

ముగ్గురూ తలాడించారు.

“ఈ గుంపులో దొంగ ఎవరంటే, ఇదిగో ఈ ధర్మపాలనే” అన్నాడు అశోకన్.

వినయన్, దాసూ ఇద్దరూ ధర్మపాలన్‌ వైపు చూశారు. ధర్మపాలన్‌లో ఎటువంటి తడబాటూ కనిపించలేదు. మందు ఇంకో గుటక వేసి, పెదవంచున అంటుకున్న మందును తుడుచుకుని, తనది కాని గొంతుతో “నేను దొంగనని ఎవరన్నారు?” అని అడిగాడు.

అశోకన్, ఎర్రబడ్డ ధర్మపాలన్ కళ్ళలోకి చూసి ఒక నిముషం పాటు గాబరా పడిపోయాడు. ఆపైన తమాయించుకుని ధైర్యం చేసి “దొంగ నువ్వే, ధర్మపాలన్!” అన్నాడు.

ధర్మపాలన్ పగలబడి నవ్వాడు. ఒక పెద్దపక్షి రెక్కలల్లార్చినట్టు ఆ నవ్వు ఆ చిన్న గదంతా కర్ణకఠోరంగా వ్యాపించింది. ముగ్గురూ ధర్మపాలన్ వైపు చూశారు. కత్తిని ఒరలో తిరిగి పెడుతున్నట్టు, వెనువెంటనే నవ్వును కొండనాలిక లోతుల్లోకి వెనక్కిలాగి, తన దగ్గరున్న కాగితాన్ని వాళ్ళ ముందు విప్పి చూపించాడు. చీటీలో ‘రాజు’ అని వుంది.

అశోకన్ చిన్నపాటి సంశయంతో కాగితం నుంచి చూపు తిప్పుకున్నాడు.

“రెండు వందలు జరిమానా” అన్నాడు ధర్మపాలన్.

అశోకన్ డబ్బులు తీసి మధ్యలో పెట్టాడు.

“ఊఁ… ఇక ఇప్పుడు కనిపెట్టుకో దొంగెవరని!” ధర్మపాలన్ గొంతు హెచ్చింది.

అశోకన్ వినయన్‌, దాసుల వైపు చూశాడు. వినయన్ అశోకన్ వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు ఇందాక తనకు జరిగిన పరాభవం తాలూకు గేలి అని అశోకన్‌కి అవగతమయ్యింది.

నవ్వడం పూర్తవ్వగానే, తన పుచ్చుపళ్ళ సందుల్లో ఇరుక్కున్న పల్లీలను, ఆహారపదార్ధాల తునకలను గెలికేందుకు చీపురుపుల్ల అనే ఆయుధంతో వినయన్ చేతివేళ్ళు నోటిలోకి ప్రవేశించాయి. దాసు చేతిలోనున్న కాగితపు ముక్కను మధ్యమధ్యలో గుడి ఉత్సవాల నోటిసులా చీటికిమాటికి విప్పి చూస్తూ, గ్లాసులోని మందును తాగుతున్నాడు.

అశోకన్ వినయన్ వైపు చూశాడు. అతనేమో తన పళ్ళసందులు గెలుక్కుంటున్నాడు. ఇతడే దొంగ. ప్రపంచం మీద చిన్నచూపు. నేనే అంతా అనుకునే అహంభావి. వచ్చే జీతాన్నంతా వడ్డీలకు తిప్పుతూ, ఇల్లరికం అల్లుడిగా బ్రతుకును విలాసవంతంగా వెళ్ళదీస్తున్నాడు. ప్రపంచంలో ఏదేమైనా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయే రకం. అప్పుడప్పుడు మా నాన్న కూడా సద్బ్రాహ్మణుడే తెలుసా? అని కంటికి కనిపించని జంధ్యంతో ఈ ధర్మపాలన్ స్నేహాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ (బలపరచుకుంటూ) ఉంటాడు. అటువంటి ఇతను తప్ప ఇంకెవరు దొంగయ్యుంటారు!

“ఏయ్ పోలీస్, దొంగ ఎవరని చెప్పు!” ధర్మపాలన్ గట్టిగా అరిచాడు.

“ధర్మా, నాకు కాస్త వ్యవధి కావాలి” అన్నాడు అశోకన్.

“ధర్మన్ కాదు” అని ఆజ్ఞాపించే ధోరణిలో ధర్మపాలన్ “రాజు” అని సవరించాడు.

“క్షమించండి రాజావారు, నేను దొంగను కనిపెట్టేశాను” అన్నాడు అశోకన్.

ధర్మపాలన్ ముగ్గురిని మార్చి మార్చి పరికించి చూసి, తన గొంతులో నాటకీయతను జోడించి, అశోకన్ వైపు చెయ్యెత్తి చూపించి “పోలీస్‌గారూ, మీరు దొంగను కనిపెట్టేశారా? ఇంతకీ ఎవరతను?” అని అడిగాడు.

ధర్మపాలన్ నటనను చూసి వినయన్, దాసు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.

అశోకన్, ధర్మపాలన్‌కు చేతులెత్తి మొక్కి “రాజావారు, ఇదిగో కూర్చున్నటువంటి ఈ గడ్డాలోడే దొంగ” అని అన్నాడు.

ధర్మపాలన్ తనకు ఎడమవైపు కూర్చున్న వినయన్ వైపు చూశాడు. అతడు ఇంకా పళ్ళసందుల్లో చిక్కుకున్న ఎంగిలి తునకలను గెలుకుతూనే ఉన్నాడు.

“వీడా? ఈ నోరు వెళ్ళబెట్టినవాడా?” అని అనుమానాస్పదంగా అశోకన్‌ను అడిగాడు ధర్మపాలన్.

“అవును, రాజావారు!” అన్నాడు అశోకన్ వినయంగా.

“ఓయ్, గడ్డాలోడా, నువ్వే దొంగవి అని నా పోలీస్ అంటున్నాడు. నిజమేనా?” అని ధర్మపాలన్ వినయన్‌ని అడిగాడు.

వినయన్ నోట్లో నుండి చీపురుపుల్లని బైటకు తీసి ఒడిలో పెట్టుకుని, వేళ్ళు పంచకు తుడుచుకొని, జేబులో మడిచి పెట్టుకున్న కాగితాన్ని విప్పి ధర్మపాలన్‌కు చూపించాడు.

“అరేయ్ పోలీస్! తను ఎవరో తెలుసా?” ధర్మపాలన్ పగలబడి నవ్వాడు.

లేదని తలాడించాడు అశోకన్.

“తనే నా మంత్రి” అని “వంద రూపాయలు జరిమానా, మర్యాదగా చెల్లించు” అని ఆజ్ఞాపించాడు.

అశోకన్ జరిమానా సొమ్ము వంద రూపాయలను తీసి మధ్యలో పెట్టాడు.

ఎప్పటిలా మూడో పెగ్గుకే తల ఒక వైపుకు వాలిపోయి, కాస్త తూలుతున్న దాసును ధర్మపాలన్, వినయన్, అశోకన్ కలియచూశారు.

అశోకన్ దాసును వేలెత్తి చూపించి “రాజావారు, ఇతడే దొంగ” అన్నాడు.

దాస్ కాస్త తూలుతూ “దొంగ నేను కాదు” అన్నాడు.

అశోకన్ ఒకే గుటకలో ఇంకో పెగ్గు పూర్తి చేసి “రాజావారు, నేను ఇతడిని మీ అంతఃపురంలో చూశాను. నిర్బంధించబోయాను. ప్రతిఘటించాడు. ఇతనిని మట్టి కరిపించడానికి ఒక చిన్న మల్లయుద్ధం చేయవలసి వచ్చింది. ఆపైన నేను వీడిని కాళ్ళు చేతులు కలిపి కట్టి బంధించాను. ఎంత విచారించినప్పటికీ వీడి పేరు, ఊరు, చిరునామా వంటి వివరాలేవీ చెప్పలేదు. అయితే ఈ అంతఃపురాన్ని కొల్లగొడతాను అని, ఇక్కడ రాశులుగా పోసిన డబ్బును, ధాన్యాలను ప్రజలకు పంచి పెడతాను అని, లంచాలు తీసుకునేవారిని, స్త్రీలోలురను, దూతలను, రాజులను, మంత్రులను దేశబహిష్కరణ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఈ ప్రభుత్వ పరిపాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తక్కువ కులాలవారు ఈ దేశాన్ని పాలిస్తారు అని, పోలీసుగా బానిస బ్రతుకు వెళ్ళదీయకుండా అతని మాట విని, అతనితోపాటు చేతులు కలపాలని ప్రగల్భాల ప్రసంగాల మధ్య నాతో చెప్పాడు” అని అన్నాడు.

ధర్మపాలన్ ఇది వినగానే చివాలున తన కుర్చీ నుంచి లేచి, దాసును ఎగిరి ఒక తన్ను తన్నాడు. దాసు వెనుక వైపుగా దొర్లుకుంటూ కింద పడ్డాడు.

“ధర్మా నువ్వు ఏం చేస్తున్నావు?” అంటూ ధర్మపాలన్ చెయ్యి పట్టుకున్న వినయన్‌తో “నువ్వు మంత్రివి, ఇలా తన నోటికొచ్చింది వాగుతూ తిరిగేవాడిని దండించవలసిన బాధ్యత రాజుకుందని తెలీదా” అన్నాడు ధర్మపాలన్ కోపంగా. వినయన్ తలదించుకుని నిలబడ్డాడు.

నేల మీద పడ్డ దాసు లేచేలోపు అతడిని మళ్ళీ ఒక తన్ను తన్ని “ఏరా దొంగనాకొడకా, నువ్వు నా అంతఃపురాన్ని కొల్లగొడతానని, మమ్మల్ని దేశ బహిష్కరణ చేస్తానని అన్నావా?” అరిచాడు ధర్మపాలన్.

దాసు నేలపై నుండి ధర్మపాలన్‌ను చూశాడు. మూడు పెగ్గులు బుర్రకెక్కగానే చవిట్టు నాటకంలో లాగా కాళ్ళు పైకెత్తి, రాజులా వేషం కట్టిన ధర్మపాలన్‌ వైపు చూసి, దాసుకు నవ్వు ముంచుకొచ్చింది.

“నేనొక ట్యూషన్ మాస్టర్‌ని. పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే నా పని” అన్నాడు దాస్.

ధర్మపాలన్‌కు కోపమొచ్చింది. “మంత్రి, వీడేదో వాగుతున్నాడు చూడు!” అని అన్నాడు.

“రాజావారు! అతను మద్యం బాగా సేవించి ఉన్నాడు. అందుకే వాగుతున్నాడు” అన్నాడు అశోకన్.

వినయన్, అశోకన్ ఇద్దరూ లేచి దాసును గట్టిగా పట్టుకుని, మురికి పట్టుకుపోయిన గోడకు ఆనించి నిలబెట్టారు.

“రాజద్రోహం నేరం క్రింద వీడిని ఉరి తియ్యవలసిందిగా మేము ఆజ్ఞాపిస్తున్నాం” అని ధర్మపాలన్ పలికాడు.

అశోకన్, వినయన్, ధర్మపాలన్‌కు వంగి చేతులెత్తి మొక్కి ఇరువైపులా నిలబడ్డారు. మధ్యమధ్యలో దెబ్బలు తింటున్న దాసు తన శరీరం పడిపోకుండా గోడకు అనుకుని నిలబెట్టుకుంటున్నాడు.

“వీడిని, ఈ రాజద్రోహిని, ఉరికంబమెక్కించి చంపేందుకు సమయం ఆసన్నమయ్యింది. అన్నీ సిద్ధమే కదా?” అని వినయన్, అశోకన్ వైపు చూసి అడిగాడు ధర్మపాలన్. వాళ్ళు కూడా అందుకు తలాడించారు.

అశోకన్ తినుబండారాలు పొట్లాలు కట్టి తెచ్చిన పురికోస దారాలను ఉరితాడుగా పేని, దాసు మెడకు ఉరి బిగించాడు.

“ఛ! ఇదేంటి? పిల్లలాటగా ఉందా?” అని ధర్మపాలన్ ఆ తాడును విప్పి పక్కన పడేశాడు. “ఇంతకంటే గట్టి తాడు లేదా?” అని అడిగాడు.

గట్టి తాడు కోసం గది మొత్తం గాలించారు. ఆశాభంగం చెందిన మొఖాలతో అశోకన్, వినయన్ ఇద్దరూ “లేదు రాజావారు, ఇది మాత్రమే ఉంది” అని అన్నారు.

ధర్మపాలన్ దాస్ వైపు చూశాడు. మందు సీసాను అందుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ సీసాను గాల్లో పైకెత్తి బలంగా బల్లకేసి కొట్టాడు. అది పెద్ద శబ్దంతో భళ్ళున పగిలింది. పగిలిన సీసాతో వీరావేశంగా, ధర్మపాలన్ ముందుకు ఉరికాడు. పొట్టలోకి లోతుగా దిగిన బాటిల్‌తో కళ్ళు తేలేస్తూ నేలపై పాకుకుంటూ కిందకొరిగాడు దాసు. ఆ దొంగా పోలీస్ ఆట అయిపోగానే తరువాయి ఆటవిడుపురోజు వచ్చేంత వరకు నందనవనం లాడ్జిలోని డెబ్భైయవ నంబర్ గది మూసేవుంది.

(మలయాళ మూలం: ‘ఒళివుదివసత్తె కళి’ (సెలవురోజు ఆట) అన్న కథ, ‘బాదుషా ఎనుమ్ కాల్ నడయాళన్’ అనే కథా సంపుటంనుండి)


తన కలం పేరు ‘ఆర్. ఉణ్ణి’గా పెట్టుకున్న పి. జయచంద్రన్, 1971లో కేరళలోని కోట్టయంలో జన్మించారు. మలయాళ సమకాలీన రచయితలలో ఒకరైనటువంటి ఉణ్ణి ఒక వైపు సాహిత్యం, మరోవైపు సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఉణ్ణి 2020లో వాంఖ్ అనే కథకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. అలాగే తను కథనం అందించిన ‘చార్లీ’ సినిమాకుగాను 2015లో ఉత్తమ కథన రచయితగా కేరళ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఉణ్ణి రచనలు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి. అతని ‘ప్రతి పూవనకోళి’ నవలిక తెలుగులో ‘కుట్రదారు కోడి’గా తెలుగులోకి అనువదించబడింది. ఇప్పటివరకు మళయాళంలో పది కథా సంపుటాలు, రెండు వ్యాససంపుటాలు వెలువడ్డాయి.