మంటో కథలు: సియా హాషియే 1

విభజన మిగిల్చిన నెత్తుటి చారలు ఈ నల్లటి గీతలు.

అప్పుడు హత్యలూ జరిగాయి, మానభంగాలూ జరిగాయి. బలవంతపు మతమార్పిడిలూ జరిగాయి. మతమార్పిడికి ఒప్పుకోక బలవన్మరణాలూ జరిగాయి.

పంద్రాగష్టు అంటే స్వాత్రంత్య దినోత్సవం అని చెప్పుకొస్తారు. కానీ ఒక్క గీతతో, కొందరి సంతకాలతో తరతరాలుగా ఉన్న నేల పరాయిదవటమంటే ఏంటో ఎవరూ చెప్పరు. ఉన్నపళంగా, కట్టు బట్టలతో, ఇల్లూ-వాకిలీ, గొడ్డూ-గోదా అన్నీ వదులుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోవటం ఊసెత్తరు. దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న ఇరుగూ-పొరుగే ప్రమాదంగా మారటమంటే ఏంటో చెప్పరు. ముఖ్యంగా, ఎప్పుడూ ఏ ఆయుధమూ పట్టుకోని ఒక మామూలు మనిషిలో మరో మనిషిని చంపితే గానీ తాను సురక్షితం కాదన్న భయం ఎలా పుడుతుందో, అంతటి అభద్రతను ఎవరు ఎలా పెంచి పోషిస్తారో… హుష్… అది అసలే చెప్పరు.

అందుకే విభజనను గుర్తించే మ్యూజియం పెట్టుకోడానికి మనకు డెబ్భై ఏళ్ళు పట్టింది.

విభజనకు సంబంధించిన సాహిత్యం, సినిమాలు లేవని కాదు. ఆ తరంలో ఆ దారుణాన్ని భరించినవాళ్ళు బాగానే రాశారు దాని గురించి. సినిమాలూ వచ్చాయి. కానీ అదెప్పుడో, ఎక్కడెక్కడో, వాళ్ళెవరికో జరిగిందనట్టు… దూరంగా, విసిరేసినట్టు, కింద పడితే లేచి మట్టి దులుపుకొని పోయినట్టు…

‘కాదు, కాదు, అది ప్రకృతి విలయానికి తట్టుకోలేక ఓడిపోవడం కాదు. అది ఆధునిక ఆయుధాలకి బలి అవ్వడం కాదు. అది మనిషి మీదకు మనిషిని ఉసిగొల్పడం’ అని మనకి అర్థమైపోతే? ఇప్పుడు, ఇక్కడ, మనకే జరుగుతుందది అని మనకి తెలిసిపోతే? అందుకే అంతా గప్‌చుప్!

మంటో ‘సియా హాషియే’ అందుకే ప్రత్యేకం! ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులను నాలుగేసి వాక్యాల కథల్లో పట్టుకున్నది కేవలం ఆయనే.

ఇట్లాంటి కథలు రాసి మంటో ‘శవాల మీద చిల్లరేరుకున్నాడు’ అని ఎవరో అనే ఉంటారు. ‘నేను నల్లటి పలక మీద తెల్లటి బలపంతో రాస్తాను, ఎందుకంటే ఆ తెలుపు వల్ల నలుపు మరీ స్పష్టమవుతుంది.’ అని మంటోనే ఇంకో చోట చెప్పుకున్నాడు. కానీ, గతానికి మొత్తం సున్నం కొట్టి తెల్లగా మార్చేసి, విభజన గురించి మనం మర్చిపోయేలా చేశాక, మంటో కథలు ఆ సున్నాన్ని గీరి నల్లటి నిజాన్ని చూపించే గాట్లు! ఈ గాట్ల వల్లనే ఎంత సున్నం కొట్టారో, ఇంకా కొడుతున్నారో స్పష్టంగా తెలిసివస్తుంది.

అటు హిందూస్తాను గానీ, ఇటు పాకిస్తాను గానీ కాని నేలమీద టోబా టేక్ సింగ్ కుప్పకూలిపోతాడు గానీ, మంటో మాత్రం అక్కడే తచ్చాడుతూ ఉంటాడు. అటూ ఇటూ ఉన్న కంచెలు చేసిన ఘోరాలని మనకి వినిపిస్తూనే ఉంటాడు. మన చుట్టూ పుట్టుకొస్తున్న కంచెల గురించి ఆలోచించుకోమంటూ… – పూర్ణిమ.

తీయని ఫలం

కొత్త ఢిల్లీ, జనవరి 31 (ఎ.పి.): ఇప్పుడే అందిన సమాచారం: మహత్మా గాంధీ మరణంపై సంతోషం వ్యక్తం చేస్తూ అమృత్‌సర్, గ్వాలియర్, బొంబాయిలో పలుచోట్ల మిఠాయిలు పంచబడ్డాయి.

కూలి

లూటీలు, దొమ్మీలతో బజారు వేడెక్కిపోయింది. నాలుగువైపులా మంటలు చెలరేగాయి. ఉడుకు ఎక్కువయ్యింది.

ఒక మనిషి హార్మోనియం పెట్టె పట్టుకొని ఆనందంగా పాడుకుంటూ వెళ్ళిపోయాడు:

నువ్వే వెళ్ళిపోయాక పరదేశి
గాయాలు చేసి
ఓ ప్రియతమా
నాకంటూ ఎవరూ లేని లోకంలో

ఒక చిన్నపిల్లవాడు జోలెలో అప్పడాలు మూట కట్టుకొని పరిగెత్తాడు. ఏదో అడ్డు తగిలి పడబోయినప్పుడు అతడి మూటలో నుండి కొన్ని అప్పడాలు జారిపడ్డాయి. పిల్లవాడు వాటిని ఏరుకోడానికి వంగుతుంటే, కుట్టు మెషీనుని తలనెత్తుకున్న మరో బాటసారి అన్నాడు: “ఉండనీవయ్యా… వాటంతట అవే కాలిపోతాయి.”

బజారులో ఉన్నట్టుండి నిండుగావున్న బస్తా పడింది. ఒక మనిషి త్వరగా ముందుకొచ్చి దాని పొట్టని కత్తితో చీల్చాడు. పేగులకి బదులు చక్కెర, తెల్ల తెల్లని పలుకుల చక్కెర బయటకొచ్చింది. జనాలు పోగయ్యారు, మూటల్లో నింపుకొని పోవడానికి. ఒక మనిషి కుర్తా లేకుండా ఉన్నాడు. అతడు తన నాడా విప్పి గుప్పెట్లతో చక్కెర నింపుకొని అందులో వేసుకున్నాడు.

‘జరగండి… జరగండి…’ మిలమిలాడుతున్న అద్దాలున్న ఒక టాంగా అటువైపుగా వెళ్ళింది.

ఎత్తైన భవనపు కిటికి నుండి సన్నని బట్ట ఒకటి ఫెళఫెళలాడుతూ బయటకు వచ్చింది. నిప్పు రవ్వల నాలుక దానిని నాకింది. రోడ్డుపైన పడేసరికే అది బూడిద కుప్పయ్యింది.

“పౌపౌన్… పౌ… పౌన్…” మోటరు హారనుతో పాటు ఇద్దరు ఆడవాళ్ళ కేకలు కూడా కలిసిపోయాయి.

ఇనప్పెట్టెని ఒక పది పదిహేను మంది కలిసి బయటకు లాక్కొచ్చారు. లాఠీల సాయంతో దాన్ని తెరవడానికి ప్రయత్నించారు.

‘కౌ అండ్ గోట్’ అని రాసున్న టిన్నులని రెండు చేతులతో పట్టుకొని, తన_ _తో వాటికి ఆసరా ఇస్తూ ఒక మనిషి దుకాణం నుండి బయటకొచ్చాడు. మెల్లిగా బజారులోకి జారుకున్నాడు.

గట్టిగా ఒక గొంతు వినిపించింది: “వేసవికాలం… రండి, లెమనేడ్ తాగండి…” మెడకి మోటరు టైరు వేసుకున్న మనిషి ఒకడు ముందుకొచ్చి రెండు బాటిళ్ళు తీసుకొని ధన్యవాదాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.

ఇంకో గొంతూ వినిపించింది: “ఎవరైనా మంటలు ఆర్పేవారికి సమాచారాన్ని అందించండి… లేకపోతే సామానంతా బూడిదైపోతుంది.” ఎవరూ పనికొచ్చే ఈ సలహాను పట్టించుకోలేదు.

లూటీల, దొమ్మీల బజారు ఇలానే వేడెక్కుతూ పోయింది. నాలుగువైపులా అంటుకుంటున్న మంటలు ఆ వేడిని ఇంకా పెంచుతూనే పోయాయి.

ఆ తర్వాత కాసేపటికి థడ్-థడ్ అంటూ శబ్దాలు వినిపించాయి. తూటాలు పేలాయి. పోలీసులకి బజారు ఖాళీగా కనిపించింది. కానీ దూరంగా పొగ నిండిన మూలలో ఒక నీడ లాంటిది కనిపించింది.

సిపాయిలు ఈలలు వేసుకుంటూ ఆ వైపుకి ఉరికారు. నీడ తొందరగా పొగలోకి దూరిపోయింది. సిపాయిలు వెంటపడుతూనే ఉన్నారు. పొగ ఉన్న ప్రాంతం అయిపోగానే సిపాయిలకి ఒక కశ్మీరు కూలివాడు బరువైన బస్తాని వీవు మీదేసుకొని వెళ్తూ కనిపించాడు. ఈలల గొంతులు ఎండిపోయాయి గానీ ఆ కూలివాడు ఆగలేదు. అతడి వీపు మీద బరువుంది. మామూలు బరువు కాదు.

సిపాయిలకి ఆయాసం వచ్చింది. ఒకడికి విసుగొచ్చి పిస్తాలు తీసి కాల్చేశాడు. గుండు కశ్మీరు కూలోడి కాళ్ళకి తగిలింది. బస్తా అతడి వీపు మీద నుండి పడిపోయింది. భయపడుతూ తన వెంటపడుతున్న సిపాయిలని చూశాడు. కాలినుండి కారుతున్న రక్తం వైపు కూడా అతడి దృష్టి పోయింది. అంతలోనే ఒక్క ఉదుటున బస్తా ఎత్తి, వీపు మీద పెట్టుకొని కుంటుతూ పరిగెత్తడం మొదలుపెట్టాడు.

అలసిపోయిన సిపాయిలు అనుకున్నారు: “వాడి పాపానికి వాడే పోతాడు…”

అప్పుడే ఆ కశ్మీరు కూలోడు తూలి కిందపడిపోయాడు. అతడి మీద బస్తా పడింది. వదిలేసిన సిపాయిలు ఒక్కసారిగా అతడిని పట్టుకున్నారు. బస్తా అతడి మీదే వేసి స్టేషనుకి నడిపించుకొని వెళ్ళారు. దారిలో కశ్మీరు కూలోడు అన్నాడు: “సాహెబ్… నన్నెందుకు పట్టుకున్నారు? నేను పేదవాణ్ణి… బియ్యపు బస్తా తీసుకున్నానంతే… ఇంట్లో తినడానికి… మీరు ఉత్త పుణ్యానికి పేల్చారు…”

కానీ అతడి మాట ఒక్కరు కూడా వినలేదు. స్టేషనులో కూడా కూలివాడు తన తరఫున చెప్పుకున్నాడు: “సాహెబ్… వేరేవాళ్ళు పెద్దపెద్ద లూటీలు చేస్తున్నారు. నేను ఒక్క బియ్యపు బస్తా తీసుకున్నానంతే! సాహెబ్… నేను కటిక పేదవాణ్ణి… రోజూ గంజే తాగుతాం.”

ఎంత చెప్పినా వినకపోయేసరికి అతడు తన మాసిన టోపీతో నుదుటిని తుడుచుకొని, బియ్యపు బస్తా వైపు విరక్తిగా చూస్తూ, ఇన్స్‌పెక్టరుతో అన్నాడు: “సరే, సాహెబ్… మీరే బస్తా ఉంచుకోండి… నాకు నా కూలి ఇప్పించండి… నాలుగు అణాలు…”

పంపకం

ఒక మనిషి తనకోసమని ఒక పెద్ద చెక్కపెట్టె ఎన్నుకున్నాడు. దాన్ని ఎత్తబోతే పెట్టె ఉన్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు.

ఇంకో మనిషి, బహుశా అతడికి తనకి పనికొచ్చే వస్తువేదీ దొరకటం లేదనుకుంటా–పెట్టెనెత్తేవాడిని అడిగాడు: “నేను నీకు సాయం చేయనా?”

పెట్టెను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నవాడు సహాయం తీసుకోడానికి ఒప్పుకున్నాడు. తనక్కావల్సిన వస్తువు దొరకని మనిషి, తన బలమైన చేతులతో పెట్టెను కుదిపి, పెట్టెను తన వీపు మీదకి ఎత్తుకున్నాడు. పక్కన ఉన్నవాడు ఆసరా ఇచ్చాడు, ఇద్దరూ బయటకెళ్ళారు.

పెట్టె చాలా బరువుగా ఉంది. దాని బరువుకి ఎత్తుకున్నవాడి వీపు విరిగిపోతోంది, కాళ్ళు వణికిపోతున్నాయి. కానీ ఇనాము మీద ఆశతో శారీరక శ్రమను కొంచెం కూడా పట్టించుకోలేదు. పెట్టెను ఎత్తినవాడికంటే పెట్టెను పట్టుకున్నవాడు చాలా బలహీనంగా ఉన్నాడు. దారిపొడుగునా పెట్టె మీద ఒక చేయి మాత్రం వేసి ఉంచాడు. తన వాటా మీద హక్కు పోకుండా.

ఇద్దరూ సురక్షితమైన ప్రాంతానికి చేరుకోగానే పెట్టెను ఒక పక్కన పెట్టి, మొత్తం బరువును మోసిన అతను అన్నాడు: “చెప్పు… ఈ పెట్టెలో సామానులో నాకెంత వస్తుంది?”

పెట్టె మీద ముందు కన్నేసినవాడు అన్నాడు: “నాలుగోవంతు.”

“చాలా తక్కువ.”

“తక్కువేం కాదు. ఎక్కువే! ఎందుకంటే దీని మీద మొదట కన్నేసినవాడిని నేను.”

“అది సరే, కానీ వీపు విరిగిపోయేంత ఈ బరువుని ఇక్కడ వరకూ మోసుకొచ్చిందెవరు?”

“అఛ్ఛా, సగం సగం పంచుకోడానికి ఒప్పుకుందాం”

“సరే అయితే… పెట్టె తెరు”

పెట్టె తెరిచారు. అందులోంచి ఒక మనిషి బయటకొచ్చాడు. అతడి చేతిలో కత్తి ఉంది. అతడు ఇద్దరు వాటాదారులని నాలుగు భాగాలుగా పంచాడు.

సరైన వాడకం

పఠాను పది రౌండ్లు కాల్చి ముగ్గురికి గాయాలు చేశాడు.

గొడవ జరుగుతూ ఉంది. జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. లూటీలు జరుగుతున్నాయి. కొట్టుకోవడాలు కొనసాగుతున్నాయి. పఠాను తన తుపాకి తీసుకొని గుంపులోకి దూరాడు. ఒక గంట కుస్తీ పట్టాక ఒక థర్మసు చేజిక్కించుకోవడంలో సఫలమయ్యాడు.

పోలీసులు వచ్చాక అందరూ పారిపోయారు. పఠాను కూడా. ఒక గుండు అతడి ఎడమ చెవిని తాకుతూ పోయింది. పఠాను అదేం పట్టించుకోకుండా తెల్లరంగు థర్మసుని చేతిలో గట్టిగా పట్టుకుని పరిగెత్తాడు. తన దోస్తుల దగ్గరకి చేరుకున్నాక అతడు గర్వంగా ఆ థర్మసుని చూపించాడు.

ఒకతను నవ్వుతూ అన్నాడు: “ఖాన్ సాహెబ్… మీరేం ఎత్తుకొచ్చారు?”

పఠాను తళతళా మెరుస్తున్న థర్మసును ఇష్టంగా చూస్తూ అడిగాడు: “ఏం?”

“ఇది చల్లటి వస్తువులను చల్లగా, వేడి వస్తువులను వేడిగా ఉంచే బోటిలు”

పఠాను థర్మసుని తీవ్రంగా చూస్తూ అన్నాడు: “నేనిందులో ముక్కుపొడి పెట్టుకుంటాను… వేసవిలో వేడిగా ఉంటుంది. చలికాలంలో చల్లగా… ”

తెలియకపోవటం వల్ల లాభాలు

మీట లాగబడింది–పిస్తోలు నుండి దూసుకుంటూ గుండు బయటకొచ్చింది: కిటికి నుండి బయటకు తొంగిచూస్తున్న మనిషి అక్కడికక్కడే రెండు ముక్కలయ్యాడు!

మీట కాసేపటి తర్వాత మళ్ళీ లాగబడింది–రెండో గుండు వణుకుతూ బయటకొచ్చింది: రోడ్డు మీద తోలు సంచికి తగిలింది. అతడు బోర్లా పడ్డాడు. అతడి రక్తం సంచిలోని నీళ్ళతో కలిసి పారింది.

మీట మూడోసారి లాగబడింది–గురి తప్పింది: గుండు తడి గోడలో పాతుకుపోయింది.

నాలుగో గుండు ఒక ముసలామె వీపుకి తగిలింది: ఆమె అరవను కూడా అరవలేక అక్కడే కుప్పకూలిపోయింది.

ఐదూ ఆరూ గుళ్ళు ఊరికే పోయాయి: ఎవరికీ గాయాలు అవ్వలేదు, ఎవరూ చనిపోలేదు.

గుండ్లు పేల్చేవాడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే రోడ్డు మీద ఒక చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ రావటం చూశాడు.

గుండ్లు పేల్చుతున్నవాడు తుపాకి నోటిని అటువైపు తిప్పాడు.

అతడి తోటివాడు అన్నాడు: “ఏంటి చేస్తున్నావు?”

గుండ్లు పేల్చుతున్నవాడన్నాడు: “ఏం?”

“గుండ్లు అయిపోయాయిగా”

“నువ్వు గమ్మునుండు… ఇంత చిన్నపిల్లవాడికి ఆ సంగతెలా తెలుస్తుంది?”

సరైన చర్య

అల్లర్లలో బస్తీలోని అల్పసంఖ్యాకులలోని కొందరు చంపబడ్డారు.

మిగిలినవాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయారు. ఒకతను, అతడి భార్య వాళ్ళ వంటింట్లోనే దాక్కునుండిపోయారు.

రెండు రోజులూ రెండు రాత్రుళ్ళూ అలా దాక్కునేవుండి ఆ భార్యాభర్తలు అల్లరిమూకలు వస్తాయేమోనని ఎదురు చూశారు, కానీ ఎవరూ రాలేదు.

ఇంకో రెండు రోజులు గడిచాయి. చావంటే భయం తగ్గుతూ పోయింది. ఆకలి, దప్పికలు ఎక్కువ సతాయించడం మొదలెట్టాయి.

ఇంకో నాలుగు రోజులు గడిచాయి. భార్యాభర్తలకి చావన్నా, బతుకన్నా ఆశ మిగల్లేదు. ఇద్దరూ దాక్కున్న చోటునుండి బయటకి వచ్చారు.

అతడు చాలా మెల్లిగా మాట్లాడుతూ అక్కడున్నవారిని(?) తన వైపుకి తిప్పుకొని, అన్నాడు: “మేమిద్దరం మీకు లొంగిపోతున్నాం. మమ్మల్ని చంపేయండి.”

అక్కడున్నవారు ఆలోచనలో పడ్డారు: “మా మతంలో అయితే జీవహింస మహా పాపం.” వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని, భార్యాభర్తలపై సరైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వేరే బస్తీవారికి అప్పజెప్పారు.

అద్భుతం

లూటీ చేసిన సరుకులను తిరిగి వసూలు చేసుకోడానికి పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు.

జనాలు భయపడి దోచుకున్న సరుకునంతా రాత్రి చీకటిలో పారేశారు.

వారిలో కొందరు, తమ సొంత వస్తువులని కూడా పారేశారు, నేరం కింద అరెస్టు అయ్యే అవకాశాలు తప్పించుకోడానికి.

ఒక మనిషి చిక్కుల్లో పడ్డాడు. అతడి దగ్గర పచారీ దుకాణం నుండి దోచుకున్న రెండు చక్కెర సంచులున్నాయి. వాటిలో ఒకదాన్ని అతడు రాత్రి చీకట్లో దగ్గరలో ఉన్న బావిలో పడేసి వచ్చాడు. కానీ, రెండోది వేస్తున్నపుడు సంచితో పాటు అతడూ పడిపోయాడు.

శబ్దాలు విని జనం పోగయ్యారు. బావిలోకి తాళ్ళు దించారు.

యువకులు కిందకి దిగి ఆ మనిషిని పైకి తీసుకొచ్చారు.

కానీ అతడు కొన్ని గంటల తర్వాత మరణించాడు.

మర్నాడు జనాలు వాడుకోడానికని నీళ్ళు తోడితే, బావిలో నీళ్ళు తియ్యగా ఉన్నాయి.

అదే రాత్రి అతని సమాధిపై దీపాలు వెలిగాయి.

సవరణ

“ఎవర్నువ్వు?”

“నువ్వెవరు?”

“హర్‌హర్ మహదేవ్! హర్‌హర్ మహదేవ్?”

“హర్‌హర్ మహదేవ్!”

“రుజువేంటి?”

“రుజువా? నా పేరు ధరమ్‌చంద్.”

“ఇదేం రుజువు కాదు.”

“నాలుగు వేదాల్లోంచి ఏదైనా అడిగి చూడు నన్ను”

“మాకు వేదాలు తెలీవు… రుజువివ్వు.”

“ఏంటి?”

“పైజామా ఒదులు చేయి.”

పైజామా జార్చగానే గొడవ మొదలయ్యింది: “చంపేయండి… చంపేయండి.”

“ఆగండి… ఆగండి… నేను మీ సోదరుణ్ణి… దేవుని మీద ఒట్టు, నేను మీ సోదరుణ్ణి.”

“మరి ఇదంతా ఏంటి?”

“నేను వస్తున్న ఇలాఖా మన దుష్మన్లది. అందుకే గత్యంతరం లేక ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. కేవలం నా ప్రాణాలు కాపాడుకోడానికే… ఇదొక్కటే పొరపాటయిపోయింది. తక్కినవన్నీ సరిగ్గానే ఉన్నాయి…”

“లేపేయండి పొరపాటుని…”

పొరపాటుతో పాటు ధరమ్‌చంద్ కూడా పోయాడు.

జెల్లీ

పొద్దున్న ఆరింటికి పెట్రోలు పంపు దగ్గర తోపుడు బండిలో ఐసు అమ్ముకునేవాడిని చాకుతో పొడిచారు.

ఏడింటి వరకూ అతడి శవం రోడ్డు మీద పడుంది. ఐసు కరిగి నీరు బొటబొటా అతడి మీద కారింది.

ఏడుంబావుకి పొలీసులు వచ్చి శవాన్ని తీసుకొని వెళ్ళారు. కారిన రక్తం, ఐసు రోడ్డు మీద అలానే ఉండిపోయాయి.

ఒక టాంగా అటువైపు నుండి వెళ్ళింది.

పిల్లవాడు రోడ్డు మీద రక్తపు మడుగులో మెరుస్తున్న మాంసం ముక్కల వైపు చూశాడు. నోరూరుతూ వుంటే, వాళ్ళ అమ్మ కొంగు లాగి వేలుని అటువైపు చూపిస్తూ అన్నాడు: “చూడు మమ్మీ, జెల్లీ!”

దావత్-ఎ-అమల్

మంటల్లో మొత్తం బస్తీ తగలడిపోయింది… ఒక్క దుకాణం మాత్రం మిగిలింది.

దాని ముందువైపు ఒక పెద్ద బోర్డు మీద ఇలా రాసుంది: “ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.”


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...