ఒక అనాసక్త బహుమతి

నీకు స్నేహితులున్నారా లేదా అనేది
పెద్ద విషయం కాదు. ఉన్న వాళ్ళలో
ఎందరి వేళ్ళు గుబులు వేళలో
నీ భుజాల మీద వాలతాయో లెక్కపెట్టు ముందు.

ఒడిదుడుకుల జీవితంలో
ఎవడైనా దూరంగా జారినప్పుడు
వాడితో నువ్వెలా ఉన్నావో
లోలోపల ఒకసారి తొంగి చూడు.
ఎవడి చీదరింపు కూడా నీలో సంతోషాన్ని నింపుతుందో
వాడి అరుపు జీర కోసం ఎదురు చూడు.

నిజమైన జతగాడు తోడుంటే
ఎగిరిపోయిన వసంతాన్ని గాలం వేసి లాగినట్టుంటుందని
వాడి అలికిడితో మిగతా ప్రపంచం చిన్నదై ఒంగినట్టు
మెదడంతా సంతోషం కుక్కినట్టు ఉంటుందని
నూనూగు మీసాల రోజుల్లో ఎవడో అంటున్నప్పుడు
నేనూ నీలాగే ఫక్కున నవ్వేవాడ్ని.

ఇవాళ నంగిరి మాటల గుంపులతో
దూరంగా పోతున్న నిన్ను
లాంతరు వెలుగులో తోడేలు అడుగుల్ని పోల్చినట్టు
పోల్చాను. ఒక అనాసక్త స్నేహాన్ని
చివరి బహుమతి వంటి వచనంతో చిలికి తెచ్చాను.