బెంతోమార్మె

కాలం ఒకేలా గడవదు. అదే దాని గొప్పతనం. మునిగిపోయేవాడి గురించి ఎంతోకాలం ఆలోచిస్తాం కాని, ఒక వ్యక్తి తన సుదీర్ఘమైన ప్రేమకలాపాన్ని సింహావలోకనం చేసుకుందికి చేతితొడుగు విప్పుకునేంత సమయం కూడా పట్టదన్నది సత్యదూరం కాదు.

తన బ్రహ్మచారి గృహంలో, టేబులు ప్రక్క నిలబడి ట్రిస్‌డేల్ చేస్తున్నపని సరిగ్గా అదే! ఆ టేబులు మీద ఎర్రమట్టిగోలెంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక పచ్చని మొక్క ఉంది. అది బొమ్మజెముడు జాతికి చెందిన విశిష్టమైన మొక్క. తీగల్లా సన్నని పొడవైన ఆకులతో, ఎంతసన్నని గాలి వీచినా ‘రా, రమ్మ’ని పిలుస్తున్నట్టు నిరంతరం ఊగులాడడం దాని ప్రత్యేకత.

తోడు కూచోడానికి ట్రిస్‌డేల్ నిరాకరించడంతో, ఒంటరిగా తాగవలసి వచ్చినందుకు, గదిలో మరొక టేబులు వద్ద అయిష్టంగా అతని మిత్రుడూ, పెళ్ళికుమార్తె సోదరుడూ అయిన వ్యక్తి కూచుని నసుగుతున్నాడు. ఇద్దరూ సాయంకాలపు దుస్తులలో ఉన్నారు. ఉదాశీనత నిండిన ఆ గదిలో, వారు తొడుక్కున్న దుస్తులమీద సాయంత్రపు వివాహవేడుకలో జల్లిన తగరపు ముక్కలు చీకట్లో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.

చేతితొడుగు నెమ్మదిగా విప్పుతుంటే, ట్రిస్‌డేల్ మనసులో గత కొద్దిగంటలుగా జరిగిన విషయాలన్నీ అతివేగంతో కళ్ళకు కట్టసాగేయి. అతని ముక్కుపుటాలనుండి చర్చిలో పెళ్ళికి పోకపోసిన పువ్వుల సుగంధం ఇంకా వీడ లేదు; చెవులలో సంస్కారవంతమైన వేల గొంతుల గుసగుసలు, దుస్తుల రెపరెపలు, అన్నిటికన్నా ముఖ్యంగా, ఆమెను మరొకవ్యక్తికి శాశ్వతంగా కట్టబెడుతూ మతగురువు సాగదీస్తూ పలికించిన ప్రమాణవచనాలు పదేపదే మారుమ్రోగుతున్నాయి.

నిస్పృహకి గురిచేసిన ఈ పెళ్ళి విషయంలో, ఎప్పటిలాగే, ఆమెను తను ఎందుకు, ఎలా పోగొట్టుకున్నాడన్న దానికి కారణాలు అన్ని రకాలుగానూ ఊహించడానికి ప్రయత్నించాడు. రాజీపడలేని ఈ నిజం అతన్ని ఆమూలాగ్రం ఒక కుదుపు కుదిపి, అప్పటి వరకు అతను ఎదుర్కొని ఉండని సత్యాన్ని అకస్మాత్తుగా అతని కళ్ళముందుంచింది: అది ఏ తొడుగులూ లేకుండా, అంతరాంతరాల్లో అశాంతితో, శుష్కమై నిలిచిన అతని సిసలైన వ్యక్తిత్వం. అప్పటివరకూ తను చేసిన బుద్ధితక్కువ నటనలు, వేసుకున్న అహంకారపు ముసుగులూ చింకిపాతల్లా ఊడిపడ్డాయి. తన మనసుకు వేసుకున్న ముసుగులు అందరికీ ఇంతకు మునుపే చాలా స్పష్టంగా కనిపించి, జాలి కొలిపేయేమోనన్న ఆలోచన కలగగానే, ఒక్కసారి అతనికి వణుకు పుట్టింది. ఆడంబరమా? అహంకారమూ? ఆ రెండూ తన కవచానికి రెండు కీళ్ళు. ఈ రెండింటికీ అతీతంగా ఆమె ఎప్పుడూ ఎలా ఉండగలిగింది? కానీ… ఎందుకు?

ఆమె చర్చిలో అడుగులో అడుగు వేసుకుంటూ మంటపం మీదకు ఎక్కుతున్నప్పుడు, అప్పటివరకూ తనకి ఆసరాగా నిలచిన ఒక అనుచితమైన ఆలోచన తనకి ఆనందం కలిగించింది: ఆమె ముఖంలో వివర్ణతకి కారణం తనను అర్పించుకోబోతున్న వ్యక్తిగురించిన ఆలోచనలు కావని, మదిలో మరొక వ్యక్తి మెదలడమేననీ. కానీ, ఇప్పుడు ఆ రకమైన ఊరడింపు కూడా తనకి మృగ్యమై పోయింది. ఎందుకంటే, ఆమె తన చేతిని పరిగ్రహించిన వరుడి ముఖంలోకి కనులెత్తి, సూటిగా చూసిన స్వచ్ఛమైన చూపులు, తనని ఆమె ఇక మరిచిపోతుందని చెప్పకనే చెబుతున్నాయి. ఆ చూపులే ఒకప్పుడు తననూ చూశాయి. అందుకే ఆ చూపులని తను ఖచ్చితంగా అంచనా వెయ్యగలడు. దానితో తన గర్వం ఒక్కసారిగా అణగారిపోయింది. తనకున్న ఏకైన ఆధారం ఒరిగి పోయింది. తన అనుబంధం ఎందుకిలా ముగిసింది? తమిద్దరి మధ్యా ఏ రకమైన వివాదమూ లేదే? మచ్చుకికూడా…

కొద్దిరోజులుగా జరిగిన సంఘటనలన్నీ వెయ్యోసారి కలబోసుకున్నాడు, జీవితం ఇలా అనుకోని వంపు తిరగకముందు ఎలా ఉండేదో.

ఆమె ఎప్పుడూ తనని ఒక ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేది; ఆ గౌరవాన్ని తాను సముచితమైన రాజఠీవితో స్వీకరించేవాడు. ఎంతో వినమ్రంగా (చాలా సార్లు తనలో తను అనుకునేవాడు), పసిపాపలా (ఒకప్పుడు ఒట్టేసి మరీ చెప్పేవాడు) – ఎంతో నిజాయితీగా ఆమె ఆరాధనాసుగంధం అగరుబత్తి పరిమళంలా అతనిని చుట్టుముట్టేది. ఆమె తనకి ఎన్నో అపూర్వమైన గుణగణాలు, దైవాంశలు, తెలివితేటలు, నైపుణ్యాలూ అంటగట్టేది. ఒక పువ్వును గాని, పండును గాని ప్రతిగా కోరని వర్షాన్ని, ఎడారి ఎట్లా ఆస్వాదిస్తుందో, అలా ఆ నైవేద్యాన్ని తను ఆస్వాదించేవాడు.

చేతితొడుగు ఆఖరి ముడి విసుగ్గా విప్పుతున్న ట్రిస్‌డేల్ కళ్ళముందు అతని తెలివితక్కువకి పరాకాష్ఠయైన, అహమికతో తను మౌనంగా రోదించడానికీ కారణమైన సందర్భం మరొక్కసారి మెదిలింది. ఆ సందర్భం: తన ఉన్నతాసనం మీదకి ఆమెని అహ్వానించి తనతోపాటు తన గొప్పదనంలో పాలుపంచుకోమనడం. తను అలా ఆహ్వానించగానే, ఆమె నిర్లక్ష్యంగా గాలిలోకి స్వేచ్ఛగా విసిరిన ఆమె కురుల సౌందర్యం, ఆమె మాటల్లో, కళ్ళలో తొణికిసలాడిన లాలిత్యమూ ముగ్ధ సౌందర్యమూ గూర్చిన జ్ఞాపకాలపై ఇప్పుడు మనసు ఎక్కువసేపు నిలపలేడు, ఎందుకంటే, అవి మరొక్కసారి బాధని కెలుకుతాయి. కానీ అవి చాలు! తనని నేలకు దించి, మాటాడనిచ్చేయి. మాటల మధ్యలో ఆమె ఇలా అంది:

“కెప్టెన్ కెరూథర్స్ మీరు స్పానిష్ అచ్చం అక్కడ పుట్టినవాళ్ళలా మాటాడతారని చెప్పేరు. మీరు నా దగ్గర ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఎందుకు దాచేరు? అసలు మీకు ఈ ప్రపంచంలో తెలియని విషయం అంటూ ఉందా?”

కెరూథర్స్. వాడొక మూర్ఖుడు. తను (ట్రిస్‌డేల్) చేసింది తప్పే (ఎందుకో! అప్పుడప్పుడు తను అలాంటి తప్పులు చేస్తుంటాడు). ఒకసారి తను ఎప్పుడో నిఘంటువుల వెనక ఎక్కడో చూసిన పరిజ్ఞానంతో, ఒక పాత స్పానిష్ సామెత గురించి క్లబ్బులో వాగేడు. తన వీరాభిమానియైన ఈ కెరూథర్సే, సందేహాస్పదమైన తన గోరంతల పాండిత్యాన్ని కొండంతలు చేసి ప్రాచుర్యాన్ని కల్పించేడు.

కానీ, ఏమి చెప్పడం!? ఆహ్! ఆమె మెచ్చుకోలు యొక్క సుగంధం ఎంత చక్కగా, ఉల్లాసంగా ఉంది! దాన్ని ఖండించకుండా, తనకు అంటగట్టిన పాండిత్యం గురించి ఆమెకున్న ఊహని కొనసాగనిచ్చేడు. స్పానిష్‌లో తనకు లేని పాండిత్యప్రకర్షా కిరీటాన్ని ఆమె తన నుదుట అలంకరిస్తుంటే నిరాకరించలేదు. ఆ గౌరవానికి తల ఒగ్గి, ఆ గొప్పదనం అందించే మత్తులో, మైమరపులో, తరువాత తనని ముక్కలు చేసిన ముల్లు బాధ పట్టించుకోలేదు.

ఆమె ఎంత సంతోషించింది! ఎంత సిగ్గుపడింది! ఎంత పులకించింది! తనను ఆమె పాదాలచెంత ఉంచగానే, పంజరంలో చిలకలా తన రెక్కలు ఎంత టపటపా కొట్టుకుంది?! ఆమె కళ్ళలో ఏ సందేహానికి తావులేని అంగీకారం ఉందని అప్పుడే కాదు, ప్రమాణంచేసి తను ఇప్పుడూ చెప్పగలడు. కానీ, ఆమె ఎంతో లజ్జతో సూటిగా సమాధానం ఇవ్వలేకపోయింది. “నా సమాధానం మీకు రేపు పంపిస్తాను” అంది ఆమె; తను, విజయగర్వంతో, చిరునవ్వుతో ఆమె అభీష్టానికి సమ్మతిస్తూ వాయిదాకి అంగీకరించాడు.

మరుసటి రోజు అసహనంగా తనగదిలో ఆమె మాటకై ఎదురుచూశాడు. సరిగ్గా 12 గంటలకి ఆమె నౌకరు వచ్చి ఈ ఎర్రమట్టి కూజాలోని బొమ్మజెముడు మొక్కని తన గదిముందు ఉంచి వెళ్ళిపోయాడు. దానితోపాటు ఒక ఉత్తరం లేదు. పత్రం లేదు. సందేశం లేదు. మొక్కకి మాత్రం ఒక చీటీ కట్టి వేలాడుతూ ఉంది: ఏ అనాగరిక భాషలోనో దాని పేరో, లేక ఓషధీయ నామమో! తను రాత్రి వరకు ఎదురుచూశాడు. కానీ ఆమెనుండి సమాధానం లేదు. ఆమెని పలకరించడానికి గాని, కలవడానికిగాని అతని అహం అడ్దువచ్చింది. రెండు రోజులు గడిచిన తర్వాత ఒక సాయంత్రం డిన్నర్‌లో ఇద్దరూ కలిసేరు. వాళ్ళ మధ్య పలకరింపులు చాలా ముక్తసరిగా, మర్యాదగా నడిచేయి. ఆమె మాత్రం అతని వంక ఊపిరి బిగబట్టి, ఆశగా, ఆసక్తితో చూసింది. తను మాత్రం మర్యాదగా ఉంటూనే, మొండిగా, ఆమె సంజాయిషీ కోసం ఎదురుచూసేడు. స్త్రీ సహజమైన చురుకుదనంతో, తన ప్రవర్తన నుండి సంకేతాలని గ్రహించి ఒక్కసారిగా నిర్లిప్తమైపోయింది. ఆ క్షణం నుండి ఇద్దరూ ఒకరికొకరు దూరంగా జరిగిపోయారు. తప్పు ఎక్కడ ఉంది? ఎవరిని తప్పుపట్టాలి? ఓటమిపాలైన తను, తన అహంకారపు శిధిలాలలోంచి సమాధానం వెతుక్కుంటున్నాడు.

ఇంతలో…

ఆ గదిలోనున్న రెండో వ్యక్తి గొంతు అతని ఆలోచనలమీద ప్రశ్నలతో దాడి చెయ్యడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.

“నాకు తెలియక అడుగుతున్నాను, ట్రిస్‌డేల్! నీకేమయింది? పెళ్ళిపెద్దగా కాకుండా నీకే పెళ్ళయినంతగా ఎందుకు బాధపడిపోతున్నావు? నన్ను చూడు! దక్షిణ అమెరికా నుండి బొద్దింకలతో, వెల్లుల్లి వాసనకొడుతున్న పనికిమాలిన స్టీమరు మీద రెండువేల మైళ్ళు ప్రయాణం చేసి ఈ ‘బలి’పై అక్షింతలు చల్లడానికి వచ్చేను. చూడు నా పాపాన్ని నేను భుజాలమీద ఎంత తేలికగా మోస్తున్నానో! నాకున్నది ఒక్కతే ఒక్క చెల్లెలు. ఇప్పుడు అది కూడా లేదు. రా! అన్నీ మరిచిపోడానికి ఏదో ఒకటి తీసుకో!”

“నాకిప్పుడు తాగాలని లేదు. మరేం అనుకోకు. థాంక్యూ!” అన్నాడు ట్రిస్డేల్.

“నువ్వు తాగే ఈ బ్రాందీ ఎవరూ తాగలేరు. ఎప్పుడైనా మా ఊరు ఫుంతా రెదొందాకు రా. నాతో కొన్ని రోజులుండు. మా గార్సియా దొంగతనంగా తెచ్చే తెకీలా రుచేమిటో చూద్దువుగాని. అంతదూరం వచ్చినందుకు నువ్వు తప్పకుండా సంతోషిస్తావు. వావ్! ఇక్కడ నాకు బాగా పరిచయమైన మొక్క కనిపిస్తోందే. ఎక్కడనుండి తెచ్చేవు దీన్ని, ట్రిస్‌డేల్?”

“తేలేదు. ఎవరో తెలిసినవారు ఇచ్చిన బహుమతి. ఏ జాతిదో చెప్పగలవా?”

“చెప్పకేం? ఇది ఉష్ణమండలంలో పెరిగేది. ప్రతిరోజూ వందలు కనిపిస్తుంటాయి మా ప్రాంతంలో. ఇక్కడేదో చీటీ తగిలించి ఉందే! నీకు స్పానిష్ వచ్చా, ట్రిస్‌డేల్?”

“రాదు!” అన్నాడు విచారంగా పెదవి విరుస్తూ ట్రిస్డేల్. “అది స్పానిషా?”

“అవును. స్థానికులు ఈ ఆకులు తమవంక చూస్తూ రా రమ్మని పిలుస్తుంటాయని అనుకుంటారు. అందుకే దాన్ని బెంతోమార్మె అని పిలుస్తారు. దానర్థం, “రా నన్ను తీసుకుపో!” అని.