సముద్రాన్నవ్వాలంటే
ముందు నది,
నదికంటే ముందు కొండజాలు,
జాలుకంటే ముందు నీటిచెమ్మనవ్వాలి.
చెమ్మ పుట్టుక కోసం
చిట్టడవులు వెదికాను.
కొండరాళ్ళెక్కి పద్యాలు పాడాను.
అలికిడెరగని అడవి పొత్తిళ్ళలో
అలసి తెల్లగన్నేరుకింద కూర్చుంటే
నా పక్కనే అప్పుడే పూసిన అత్తిపత్తివై పలకరించావు.
ముట్టుకోమన్నావు.
ముడుచుకున్నావు.
ముట్టుకున్నా ముడుచుకోనంత
ప్రేమించినప్పుడు తిరిగి కనపడమన్నావు.
ఆ తర్వాత
అడవుల్ని వదిలి ఆకాశాల్ని ప్రేమించి చూశాను.
ఎడారులతో కలిసి ఎండిపోయి చూశాను.
ప్రేమ బరువును
గుండెల మీంచి భుజాల మీదికి
భుజాల మీంచి చేతుల్లోకి
చేతుల్లోంచి కనురెప్పల మీదికి
మార్చుకున్నాక
తిరుగుదారి పట్టాను.
ఇప్పుడు
సముద్రాన్ని
పూర్తిగా మరిచిపోయాను.
కళ్ళని దాటలేని చెమ్మనయ్యాను.
కొండజాలునై నాలోనే పారాను.
నదినై నన్ను నేనే కోసుకున్నాక
ఒరోజు
నాలో నేనే చిమ్మన గ్రోవి నయ్యాను.
నాణాన్నెగరేసి
నాలోకి విసిరే ముందు
కళ్ళు మూసుకో,
సముద్రపు సవ్వడి వినిపిస్తోందా?!