హలాల్‌

“దీనెక్క! హలాల్‌ చేసే హజరత్తు లేని ఊరు ఒక ఊరేనాబ్బీ గంగన్నా?” ఉసూరుమని చెట్టుకింద రాయి మీద కూలబడ్డాడు ఉస్సేని.

నుదుట చెమట. ఉక్క పోత.

టైం పొద్దున్నే తొమ్మిది కూడా కాలేదు కానీ ఎండ మాత్రం దంచేస్తోంది. దానికి తోడు ఉదయం నుంచి తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్నాయి, నీళ్ళు దప్పికవుతున్నాయి.

చేతికి తలకిందులుగా వేలాడదీసి పట్టుకున్న బెల్లగాయ పక్షులను మెల్లగా నేల మీదికి దింపి చెమట చేతిని గాలికి ఆరబెట్టుకున్నాడు ఉస్సేని.

నేల మీద ఒక పక్కకు ఒరిగి పడున్న బెల్లగాయలు నోళ్ళు తెరిచి వగరుస్తున్నాయి. బరువుగా కళ్ళు మూస్తూ తెరుస్తున్నాయి. పొట్ట వెనక్కీ ముందుకు కొట్టుకుంటోంది. వాటి పొట్టలో ఏమీ లేదు. మూడూ మూడు పావుకిలోల మాంసం పడేలా ఉన్నాయి. వాటి కాళ్ళను ఒక చోట చేర్చి పురకోసతో కట్టేసి ఉన్నాయి.

వాటి వైపు చూసి “ఇట్టయితే ఇవి గుడక బతికేటట్టు లేవు గదా ఉసేనా?” అన్నాడు గంగన్న నవ్వుతూ వెనకే వచ్చి. అతనూ మరో రాయి చూసుకుని పక్కనే కూర్చున్నాడు.

ఎందుకనో గంగన్న నవ్వు ఉస్సేనికి నచ్చలేదు. “సచ్చే నీగ్గుడక మంచిదే గదుబ్బీ. మూడు గువ్వల్నీ నువ్వొక్కనివే కాల్సుకుని తినొచ్చు!” నిష్టూరమాడాడు.

గంగన్నకు బాధేసింది. “ఏంది అట్టంటావే ఉసేనా! యా పొద్దన్నా నిన్ను ఇడ్సిపెట్టి ఏందన్నా తిన్నానా సెప్పు? ఆకరికి ఎవురైనా ప్రసాదం పెట్టినా సరే. ముందు నీకు పెట్టే గదా నేను తినేది?”

ఉస్సేని అహం శాంతించింది. వెంటనే తేరుకుని “తింటే గుడక తప్పేముండాదిలేబ్బీ… ఊరికనే అంటాండా గానీ…” అని సర్దిచెప్పుకున్నాడు.

నిజానికి ఉస్సేనికి కూడా తన కట్టుబాటు కోసం గంగన్న నోరు కట్టేయడం ఇష్టం లేదు, పైగా అది న్యాయంగా కూడా అనిపించడం లేదు. ఇద్దరూ మంచి స్నేహితులే కానీ కట్టుబాట్లలోనే కొంత తేడా ఉంది. ఉస్సేని హలాల్‌ అయితే కానీ మాంసం ముట్టుకోడు. గంగన్నకు ఆ పట్టింపేమీ లేదు. అసలు సిసలు ఆదిపురుషుడు అతను. తినేది ఏదైనా దానికి వంక పెట్టడు. మందిలో ఉన్నప్పుడు మాత్రం మంది ధర్మం పాటిస్తాడు. అలా ఎందుకు పాటించాలని అతనికి చాలామంది చెప్పారు కానీ ఎందుకనో అతను మారలేదు.

పైగా అతనూ ఉస్సేని చాలా చిన్నప్పుడే జతయ్యారు. పక్క పక్క వీధుల్లోనే ఇళ్ళు. కూలి చేసుకుంటే కానీ పొట్టగడవని కుటుంబాలు. చెట్లమ్మట, తోట్లమ్మట కూలి కోసం కలిసే తిరిగారు. ఇప్పుడు కూడా వారు నిమ్మతోటలో కూలి పని కోసం వచ్చారు. ఉన్న ఊరికి నలభై కిలోమీటర్లు దూరంగా వచ్చారు. మామూలుగా అయితే ఊరి చుట్టుపక్కలే పనులు వెతుక్కునేవాళ్ళు. ఈసారి ఎందుకో మిట్టమింద పల్లె నుంచి తమను వెతుక్కుంటూ వచ్చిన ఆసామిని కాదనలేకపోయారు.

కొండల మధ్యలో మొత్తం ఐదు వందల చెట్లున్న తోట. పదిహేను రోజుల్లో కాయలు కోసి మాగపెట్టి ఎప్పటికప్పుడు పార్శిల్‌ చేసి టవునుకు పంపాలి. ఇంకొక్కర్ని ఎవరైనా కలుపుకుంటే కూలి తగ్గిపోతుందని ఇద్దరే ఒప్పుకుని ఇంత దూరం వచ్చారు. వచ్చి కూడా పది రోజులు దాటిపోయింది. ఇంటి మొకం చూడకుండా తోటలోనే ఉండి కారం, సంకటి వండుకుని తింటూ పనిలో రోజులు మరిచిపోయారు. కానీ నాలుక నీసు కోసం అల్లాడుతోంది.

షావుకారు ఇచ్చిన డబ్బుల్తో ఒకసారి టవున్లోకొచ్చి ఉప్పు, పప్పూ పట్టుకెళ్ళారు.

నిన్నటి వెన్నెల రాత్రి నిద్ర మానుకుని ఇద్దరూ తోట గట్లకు చెట్లమీదున్న పక్షుల మీద పడ్డారు. మొత్తం గట్లన్నీ తిరిగి ఒకరు చెట్లమీద గూట్లలో ఉన్న పక్షుల కళ్ళలోకి సూటిగా టార్చిలైటు వేస్తే మరొకరు కర్ర తీసుకుని కొట్టి వేటాడే ప్రయత్నం చేశారు. అంతకు ముందు అనుభవం లేదు కాబట్టి చాలా వరకు పక్షులు చీకట్లో కిందపడి భయంతో అటూ ఇటూ పారిపోయి ఏ కంపసెట్ల మధ్యో నక్కి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఈ మూడు బెల్లగాళ్ళు మాత్రమే నిస్సహాయంగా దొరికాయి.

ఇక వీళ్ళ ఆనందానికి అంతు లేదు. పైగా పిట్ట మాంసం ఆరోగ్యానికి మంచిది కూడా. వీలైనంత తొందరగా కాల్చుకుని తినాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తెల్లవారి రావడంతో పిట్టల్ని తీసుకుని హలాల్‌ చేసే హజరత్తును వెతుక్కుంటూ బయల్దేరారు.

అసలే కొత్త ప్రాంతం. హజరత్తు చుట్టుపక్కల ఏ పల్లెలో ఉన్నాడో వారికి తెలియదు. అడుగుతూ వెళ్తే తెలుస్తుందని నమ్మకంగా బయల్దేరి చుట్టుపక్కలున్న చిన్న చిన్న పల్లెలన్నీ వెతికి వెతికి అలిసిపోయారు. ఎక్కడా సాయిబూ లేడు, మసీదు లేదు కనీసం దర్గా చెట్టు కూడా లేదు.

ఎక్కడో ఒక సాయిబయ్య ఇల్లు అయితే దొరికింది కానీ అతనిది బట్టల వ్యాపారం. టీవీఎస్‌ మీద బట్టలేసుకుని బయల్దేరితే ఎప్పుడో కానీ ఇంటికి రాడు. ఈ పరిస్థితి నిరాశను కలిగించింది ఇద్దరికి.

అందుకే కాళ్ళు కొట్టుకుంటూ వస్తూ దారిలో వేపచెట్టు కనబడితే బడలిక తీర్చుకుందామని కాసేపు కూర్చున్నారు.

“మరెట్ట చేద్దాం?” అన్నాడు ఉస్సేనినే మళ్ళీ మాట కలుపుతూ.

“ఎట్టన్నా ఎట్ట సేసేదుంది? ముందు మట్టంగా తోట కాడికి పోయి ఎమ్మట్నే పనిలోకి దిగాల. ఈ హలాల్‌ చేసేయప్పను ఎతుక్కునే పనిలోనే బారెడు పొద్దెక్కిపోయిండాది. ఆయప్ప దొరికిందిల్యా. ముక్క నోట్లోకి దిగిందిల్యా. ఈ హలాల్‌ మన పానం మిందికి వొచ్చేటట్టు ఉండాది. దాని కత తర్వాత సూచ్చాం గానీ ముందు తోట కాడికి పోయి ఎబ్బుటి మాదిరే ఏదో ఒగటి వొండుకుని ఎంగిలిపడి పన్లోకి దిగుదాం పా.” తొందరపెట్టాడు గంగన్న.

ఉస్సేనికి బాధేసింది. దిగులు పడుతూనే చెట్టుకింది నుంచి లేచాడు. మళ్ళీ గువ్వల్ని చేతిలోకి తీసుకుని తోటవైపు గంగన్నతో కలసి అడుగులు వేశాడు. ఆలోచన మాత్రం కొనసాగుతోంది. తనకంటే ఏవో పట్టింపులున్నాయి. గంగన్నకు ఏం లేవుగా. అన్నీ తెలిసి అతన్ని ఇబ్బంది పెట్టడం కరెక్టుగా లేదు. అతన్నే కోసుకుని తినేయమని చెప్పడం మంచిది.

నిర్ణయించుకున్నాడు.

అయితే తనక్కూడా ముక్క మీద మనసు పీకుతోంది. పైగా కొండ పిట్టలు. కొంచెం తెల్లబాయ, సెనిగిత్తనాలు, నాలుగు ఒట్టి మిరపకాయలు, ఇంత ఉప్పు వేసి పొడి కొట్టి ఉడికించిన ముక్కల్లో కలిపి తింటే బాగా రుచిగా ఉంటుంది. నోరూరింది కానీ వేరే దారి లేదు. గుండె దిటవు చేసుకుని అన్నాడు.

“గంగన్నా, నేను మనసు పూర్తిగానే సెప్తాండా యిను. నాతో పెట్టుకుంటే నీకు కుదిరేటట్టు లేదు గాని, నువ్వు ముందు పోయి ఈ గువ్వల్ని కోసుకుని, బాగా కాల్చుకుని తినేసి రా. నేను ఈ లోపు సెద్దన్నం ఏదో తినేసి తోట్లో పనిలోకి వొంగుతా. నువ్వంతా అయిపోయినాకే వచ్చి పనిలో వొంగు. సరేనా?”

గంగన్న ఉడుక్కున్నాడు. “ఏం ఉస్సేని. నేనేమైనా సియ్యలకు మొకం వాసి ఉండానా? ఎబ్బుడూ తిన్లేదనుకుంటాండావా ఏంది? ఏదో ఇద్దరం కల్సి అట్టా ఆటకు ఎల్లినట్టు ఎల్లి తమాసగా గువ్వల్ని పట్టుకున్నాం. తింటే ఇద్దరమూ తిందాము, లేకపోతే ల్యా.”

“మరెట్టా. గువ్వల్ని వొదిలేద్దామా? నాతో పెట్టుకుంటే అంతా పంచేటే, ముందే సెప్తాండా సూస్కో.”

గంగన్న కాసేపు ఆగి గట్టిగా అన్నాడు. “సాయంత్రం పెందలకాడ్నే పనిమానేసి టవునుకే పోదాం. ఆడ మసీదు కాడ హజరత్తుతో హలాల్‌ చేయించుకుని వొచ్చి వొండుకుని తిందాం.”

“బాగ సెప్తాండావు కదుబ్బీ. టవును బస్సుకు పెట్టే చార్జి లెక్కకు అరకేజి కోడికూరే కొనుక్కుని తినొచ్చు.”

“చార్జికి అయితే అయిండాదిలే. నేనిచ్చా గానీ, పానం కన్నా లెక్క ఎక్కవ ఏందీ? నువ్వన్నట్టు లెక్కకు కోడికూర వొచ్చాది కానీ నచ్చిన పిట్ట కూర రాదు.”

ఉస్సేని ఇంకేం మాట్లాడలేదు.

ఇద్దరూ నిమ్మతోటలోకి వచ్చారు. హవేలి దగ్గర గబగబా గువ్వల్ని గంప కింద పెట్టి రాయి ఎత్తాడు ఉస్సేని. గంప కిందే ఒక కొబ్బరి చిప్పలో నీళ్ళు పోసి కొన్ని బియ్యపు నూకలు చల్లాడు. అవి తింటాయో లేదో అనిపించింది కానీ చేసేదేం లేక అక్కడ్నుంచి వచ్చేసి గంగన్నతో కలసి టక టకా వేప పుల్ల నోట్లో వేసుకుని నమిలి నీళ్ళు పుక్కిలించి రాత్రన్నంలో నీళ్ళు కలుపుకుని పిసికి ఉల్లిపాయ కొరికి మొత్తానికి తిన్నాననిపించాడు. ఇద్దరూ కలిసి దోటీలు తీసుకుని తోటలో నిమ్మకాయల కోతకు దిగారు.

ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పనిచేసి మొత్తానికి మధ్యాహ్నం తర్వాత అనుకున్న సమయానికి ముగించారు. కోసిన నిమ్మకాయలన్నింటినీ ఏరి హవేలికి చేర్చి అంతకుముందు రోజు కోసి మాగబెట్టిన నిమ్మకాయలను సైజులుగా వేరు పరిచి ఆటో బండి తోటలోకి ఎప్పుడొచ్చినా ఎత్తుకుపోవడానికి వీలుగా పార్శిల్‌ చేసి రెడీగా ఉంచారు. ఇక కాళ్ళూ ముఖం కడుక్కుని పొద్దు మునగడానికి ఇంకా గంట టైం ఉందనగా ఇద్దరూ కలసి హుశారుగా పాట పాడుకుంటూ గంప ఎత్తారు.

చూస్తే ఏముంది గంప కింద గువ్వలు మాయం.

తుస్సుమన్నాడు ఉస్సేని.

“ఓర్‌ దీనెక్క! పిల్లి ఎత్తకపోయినట్టుండాదే!” అన్నాడు గంగన్న ఆ పక్కనే అక్కడక్కడ ఊడిపడ్డ ఈకల్ని చూసి.

ఉస్సేని ముఖం దేబరించింది. ఇంచుమించు ఏడుపు మొహం పెట్టాడు.

వాతావరణం తేలిక చేద్దామని గంగన్న “ఎందుకట్ట ఉండావే. ఇప్పుడేమైండాదని?” అన్నాడు పెద్దగా నవ్వుతూ.

ఉస్సేనికి గంగన్న నవ్వు మళ్ళీ నచ్చలేదు. “ఒరే మెంటల్నా కొడకా. గంపకింద గువ్వలు మాయమైతే అట్ట నవ్వుతాండావేమిరా పిచ్చోని మాదిరి” కసురుకున్నాడు.

“నవ్వకండా, బాద పడ్తా ఉండాల్నా నీ మాదిరి, ఏప్పుడూ చూసినా ఊఁ, ఊఁ అనుకుంటా…”

ఎత్తిపొడిచి వెక్కిరించేసరికి ఉస్సేనికి పౌరుషం పుట్టుకొచ్చింది. ఇంకా గట్టిగా అరిచాడు. “అంతా నువ్వే చేసినావురా కర్రెనాకొడకా. నేను సెప్పినట్టు యినింటే కనీసం నువ్వయినా సీలు తినేటోనివి గదా, ఇబ్బుడు సూడు. ఇద్దరిలో ఎవురికీ లాకండా మద్దెలో ఆ పిల్లి ఎత్తక పోయిండాది.”

“ఎత్తకపోతే ఎత్తకపోయిండాదిలే, అది దాని బుద్ది, మల్ల మన బుద్దికి ఏమైండాది” అన్నాడు గంగన్న.

ఉస్సేని కొంచెం తగ్గాడు. “అట్టగాదురా. నా కోసరం నీ నోరు కొట్టినాను అని బాదగా ఉండాది.”

“యిందులో నీ తప్పేముండాది, నేను తింటాంటే నువ్వేమైనా వొద్దన్నావా? నా అంతకు నేను తినకండా ఉంటే దానికి నీవేం జేచ్చావ్‌, ఇందులో నీకెందుకు తప్పు అంటుకుంటాది?”

“అంతే అంటావా?”

“అంతే.”

“మల్ల మనకు రేతిరికి సంగటి కారమే దిక్కు అంటావ్‌.”

“ఇంగెంతలే వాయ్‌. ఐదు దినాలే గదా. పనైపోతానే ఊరికెళ్ళిపోతాం” అన్నాడు గంగన్న.

చొక్కా విప్పి పక్కన పెట్టి హవేలి ముందు గోనెసంచి పర్చుకుని నేలమీద పడుకున్నాడు. పడమట పూర్తిగా పొద్దు కుంగుతోంది. ఆకాశంలో అప్పుడే చంద్రుడి జాడ కనపడుతోంది. మోడాలన్నీ మెల్లగా కదులుతున్నాయి.

“ఊరికెళ్ళాక నీకు నా సేతల్తో దండిగా కోడి బిర్యానీ వొండి తినిపిస్తే గానీ నాకు మనసు నిండదురా గంగన్నా” అన్నాడు ఉస్సేని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

“ఒరేయ్‌ ఉసేనిగా! నువ్వు ఒకటి మర్సిపోతాండావ్‌, ఆ గువ్వలు హలాల్‌ కాకపోతే పాయ, ఆ దేవుని దగ్గర మన స్నేగితం మాత్రం హలాల్‌ అయిండాది, అది సాలు కదరా మనకు.”

ఉస్సేని మనసు ఆనందంతో పొంగిపోయింది ఆ మాటతో.

“అవున్రా. నిజెమే, శానా సల్లని మాట చెప్పినావ్‌. నాకు గుడక అట్టనే అనిపిచ్చాండాది” అంటూ పక్కనే మరో గోనె సంచి పర్చుకుని తృప్తిగా పడుకున్నాడు.