అమూర్తం

నేను మధ్యాహ్నం క్లినిక్ నుండి ఇంటికి భోజనానికి వచ్చే వేళకి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ హాయిగా ఆడుకునే నా మనవరాలు కిసలయ ఆ రోజు ఎందుకో విచారంగా కూర్చుంది. అది కూర్చున్న తీరు చూస్తుంటే నాకు నవ్వొచ్చింది, జాలీ వేసింది. ఈ మధ్య అది చూస్తున్న వీడియోల్లోని పాత్రలు తమ ఆవేశాలని ప్రకటించే తీరు అనుకరించడం కారణం కావొచ్చు.

దగ్గరగా వెళ్ళి, “కిసలయా! ఏమయిందమ్మా?” అని అడిగాను అనునయంగా భుజం మీద చెయ్యి వేసి.

“హుఁ!” అంటూ ఒక కుదుపుతో నా చెయ్యి తన భుజంమీంచి విదుల్చుకుని, మరికొంచెం దూరంగా జరిగి కూర్చుంది.

నాకు తెలుసు, ఆ బెట్టంతా నేను తనని మరొకసారి దగ్గరగా తీసుకోవాలనే. ఎక్కువసేపు బెట్టుచేస్తూ కూచునే తత్త్వం కాదు కిసలయది. చూడబోతే, కురవడానికి సిద్ధంగా ఉన్న శ్రావణమేఘంలా ఉంది. కొంచెం దగ్గరగా జరిగి, భుజం మీద మరొకసారి చెయ్యి వేసి లాలనగా దగ్గరకి తీసుకుని, ముఖాన్ని నావైపు తిప్పుకుని “ఏమయిందమ్మా!” అని మళ్ళీ అడిగేను.

అంతే! ఒక్కసారి ఏడుపు లంకించుకుంది.

“ఏడవకు, ఏడవకు” అంటూ తనని నా భుజం మీదకు ఎత్తుకుని ఓదార్చడానికి ప్రయత్నించేను. ఏడుపు తగ్గిన తర్వాత, “తాతా! మరేమో అనన్య నేను క్రిందటిసారి ఎప్పుడో తన పుట్టినరోజుకి నేనిచ్చిన బహుమతిని నిన్న నా పుట్టినరోజుకి తిరిగి ఇచ్చేసింది. నేనంటే దానికి అస్సలు ఇష్టం లేదు. నేనంటే తనకి ఇష్టం అని మాత్రం చాలాసార్లు చెప్పింది కానీ, నిజంగా అస్సలు ఇష్టం లేదు” అంటూ మళ్ళీ ఆరున్నొక్క రాగం అందుకుంది.

అనన్య, కిసలయ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. మా అపార్ట్‌మెంటు కాంప్లెక్సులో మా ఫ్లాట్ 202 అయితే, వాళ్ళది 204. అనన్య వాళ్ళమ్మగారు ఏదో స్కూల్లో టీచరు. వాళ్ళ నాన్నగారు ఆర్‌టిసిలో కండక్టరు. మేలుకుని ఉన్నంతసేపూ ఇద్దరూ కలిసిమెలిసే తిరుగుతుంటారు.

భుజం మీద వేసుకుని ఓదారుస్తున్నాను గాని, కిసలయని నమ్మించగలిగేలా ఏ కారణం చెప్పడమా అని ఆలోచిస్తూనే ఉన్నాను.

“కిసలయా! అనన్యకి నువ్వంటే చాలా ఇష్టం. అందులో సందేహం లేదు. నువ్విచ్చినట్టే, ఆ పిల్లకి కూడా మంచి బహుమతి ఇవ్వాలనే ఉంటుంది. కానీ ఆ పిల్ల తనంత తాను ఏదీ కొనుక్కోలేదు కదా. వాళ్ళమ్మగారో నాన్నగారో కొనాలి. పని ఒత్తిడుల వల్ల బహుశా వాళ్ళకి తీరిక దొరక్కపోవచ్చు. నువ్వు ఇచ్చావు కాబట్టే, ఆ వస్తువుకి ఆమె అంత విలువ ఇచ్చింది. విలువలేకపోయి ఉంటే, ఇన్నాళ్ళు ఎందుకు దాచుకుంటుంది? నువ్వు ఆమెకు ఇచ్చేసిన తర్వాత ఆ వస్తువు తనదౌతుంది కదా! దానంత విలువైనది మరొకటి లేదనుకుంది కనుకనే, నీకు తిరిగి బహుమతిగా ఇచ్చింది. ఆ పిల్లకి నువ్వంటే చాలా ఇష్టం” అని ఏదో సర్ది చెప్పాను. కానీ, నా మట్టుకు నాకే అది అంత నమ్మశక్యంగా కనిపించలేదు. నేను చెప్పాననే నమ్మిందో, లేక తనకి కూడా అందులో నమ్మదగిన కారణం కనిపించిందో గాని, కిసలయ వెంటనే ఏడుపు ఆపి, ఆడుకుందికి బయటకి తుర్రుమంది.


గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్‌కి కొన్నాళ్ళ క్రిందట ఒక పరిశోధనా పత్రాన్ని పంపించాను. దానిని అంగీకరిస్తూ, అంతర్జాతీయ సమావేశంలో విపులంగా సమర్పించడానికి ఆహ్వానం అందడంతో, హ్యూస్టను బయలుదేరాను. దుబాయ్ దాకా మొదటి అంచె ప్రయాణం నిద్రలోనే గడిచిపోయింది. దుబాయ్‌లో విమానం మారడానికి ఎక్కువ వ్యవధి లేదు. రెండోసారి చెక్-ఇన్ చేసి కిటికీప్రక్క సీట్లో కూచుని, బెల్టు పెట్టుకుని, సానిటైజర్ రాసుకుని కుదురుకున్న కొద్దిసేపటిలోనే విమానం బయలుదేరింది. కిటికీ ప్రక్క సీట్లో ప్రయాణించేవారికి తక్కినవారితో పోల్చి చూసినపుడు అంటువ్యాధులు సోకే అవకాశం తక్కువ అన్న వైద్యశాఖ సూచనలు చదవడం కూడా కిటికీప్రక్క సీటు ఎంపిక చేసుకోడానికి కారణం. ఇక హ్యూస్టన్ చేరీదాకా పదహారు గంటలసేపు గాలిలో ప్రాణాలు వేలాడుతుంటాయి. లంచ్ సర్వ్ చేసేదాకా నాతో తెచ్చుకున్న పత్రిక తిరగేస్తూ, భోజనం అవగానే పుస్తకం చదువుతూ చదువుతూనే నిద్రలోకి జారుకున్నాను.

ఎంతసేపు అయిందో తెలీదు. “ఎక్స్‌క్యూజ్ మీ, డాక్టర్ మూర్తీ!” అన్న ఎయిర్ హోస్టెస్ పిలుపుతో తెలివొచ్చింది. నాకు నిద్రాభంగం చేసినందుకు ఎన్నో క్షమాపణలు చెబుతూ, అభ్యంతరంలేకపోతే ఒక ఎమర్జెన్సీ కేసు చూడవలసిందిగా కోరింది.

విమానప్రయాణాల్లో మెడికల్ ఎమర్జెన్సీలు అసాధారణం కాకపోయినా, అవి అత్యంత ప్రమాదకరమైనవీ కూడా కాదు. చాలా కేసులు ఊపిరితిత్తులకి, గాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలకి, వాతావరణ మార్పులకి, విమానం ఒడిదుడులకు గురయినపుడు తగిలిన గాయాలకీ సంబంధించినవి అయి ఉంటాయి. ఎడ్ గిలిగన్ లాంటి కేసులు (ఒకప్పటి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రెసిడెంట్ 2015లో విమాన ప్రయాణంలో హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు) ఒకటి, రెండు మినహాయిస్తే.

ఆమె ముఖంలోని గాభరా గమనించగానే అది మెడికల్ ఎమర్జెన్సీ అని అర్థం అయింది. అందుకని సాధారణంగా నాతోపాటు తీసుకుపోయే ఎమర్జెన్సీ కిట్ తీసుకుని ఆమెను అనుసరించాను. వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన గదిలో పడుకోబెట్టిన పేషంటు దగ్గరికి తీసుకుపోతూ, తనపేరు నీరజ అనీ ఆ పేషెంటు తన అమ్మమ్మేననీ దారిలో చెప్పింది.

విమాన సిబ్బందికి ఇటువంటి సందర్భాల్లో చెయ్యవలసిన ప్రథమ చికిత్స గురించి కొంత శిక్షణ ఇస్తారు. నేను వెళ్ళేసరికే పేషెంటు భుజానికి కఫ్ కట్టి, పల్సోమీటరు పెట్టి ఉంచారు. ఏవియేషన్ ప్రోటోకాల్ ప్రకారం ఉంచవలసిన మందులు కూడా ఉన్నాయి.

వెళ్ళి చూద్దును… ఆమె బుచ్చి రత్నం!

యాభై ఏళ్ళు దాటిపోయి ఉంటాయి ఆమెను చూసి. అయినా సందేహం లేదు. తక్కిన శరీరంలో వయసు తీసుకువచ్చిన మార్పు, ముఖంలో అంతగా తీసుకురాలేదు. ఎడమచేతి బొటకనవేలి క్రింద నల్లగా ఉబ్బెత్తుగా ఉన్న మచ్చ మరొక ఋజువు. అయినా, నాలో వచ్చినంత మార్పు ఆమెలో రాలేదు. ఆమె స్పృహలో లేదు. ఒంటిమీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తున్నాయి.

“వీళ్ళది విజయనగరమా?” అని అడిగేను సందేహం నివృత్తి చేసుకుందికి, ఒక వంక పల్స్ చూస్తూ, బి.పి. పరీక్షిస్తూ.

“యెస్, డాక్టర్.”

“ఈవిడ పేరు బుచ్చిరత్నం కదూ?”

“మీకెలా తెలుసు?”

“మాదీ విజయనగరమే. పక్క పక్క ఇళ్ళలో ఉండేవాళ్ళం. ఈవిడకి పీనట్ అలర్జీ ఉంది. ఒకసారి ఆ అలర్జీతో మా కజిన్ హాస్పిటల్‌కి ఈమెను ఎవరో తీసుకువస్తే చూశాను” అని చిన్న అబద్ధం చెప్పి, “వేరుశనగ ఈమెకి అత్యంత ప్రమాదకారి అని ఈమెకి తెలిసి ఉండాలే!” అన్నాను.

“తెలుసు డాక్టర్. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. తన దగ్గర ఎమర్జెన్సీ మందు ఉంటుందన్న విషయం కూడా ఇంట్లో అందరికీ తెలుసు. ఈ సారి ఎందుకో తన మందులపెట్టెలో ఎపిపెన్ కనిపించటంలేదు.”

అదృష్టవశాత్తూ నా మెడికల్ కిట్‌లో ఎపినెఫ్రిన్ ఉంది. ఇంజెక్షను ఇచ్చి, ఆమె పరిస్థితి నిలకడగా ఉండేవరకూ చాలాసేపు అక్కడే గడిపాను. పరిస్థితి నిలకడగా ఉందని, అవసరం వస్తే మళ్ళీ పిలవమనీ చెప్పి నా సీట్లోకి వచ్చి కాళ్ళు జాపుకుని అలసటతో చేరబడ్డాను.


శరీరమే కాదు, గత నాలుగు గంటలుగా స్పృహతప్పి పడి ఉన్న బుచ్చిరత్నాన్ని అలా చూస్తూ, ఆలోచనలని తిరగదోడుతూ… మనసు కూడా అలసిపోయింది.

ఎప్పటి మాట! కనీసం యాభై సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. మరిచిపోయేమనుకున్న మనుషుల్నీ అనుభూతుల్నీ మెదడు ఏ అంతరాంతరాల్లో దాచుకుంటుందో! సమయం వస్తే చాలు వరదప్రవాహంలా ఆ జ్ఞాపకాలతో మనని చుట్టు ముడుతుంది.

విజయనగరంలో మాది పదిళ్ళ చావడి. ప్రతి ఇంటికీ ఒక గది, వంటిల్లు, ఒక వసారా. స్నానాలకీ కాలకృత్యాలు తీర్చుకుందికీ రెండు పెద్ద నూతులు, అరడజను మరుగుదొడ్లూ. ఆ పదిళ్ళ చావడిని ఆనుకుని ఉన్న చిన్న ఇంట్లో బుచ్చిరత్నం వాళ్ళమ్మగారు ఉండేవారు. రూపాయికాసంత బొట్టుతో ఆమె ముఖం ఎప్పుడూ కళకళలాడుతుండేది. ఒక్కర్తీ ధైర్యంగా సంపన్నుల ఇళ్ళలో వంటలు చేసుకుంటూ సంసారాన్ని ఈదుతుండేది. బుచ్చిరత్నం నాన్న గురించి ఎవరికీ ఏమీ తెలీదు.

ఆ రోజుల్లో సంస్కృత కళాశాల, సంగీత కళాశాల విద్యార్థులందరికీ సింహాచలం దేవస్థానం సత్రంలో ఉచిత భోజన వసతి ఉండేది. తక్కిన పాఠశాలల్లో, కళాశాలల్లో, మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకి మాత్రమే పరిమితమై ఉండేది. వాళ్ళు పరీక్షలు తప్పకుండా ప్రతి ఏడూ పై తరగతులకి ఉత్తీర్ణులయి ఉండాలి అన్నది ఒక నిబంధన. మొదట్లో, మగపిల్లలకి అక్కడ భోజనాలు పెట్టి, ఆడపిల్లలని భోజనం క్యారేజీలో తీసుకుపోనిచ్చేవారు. తర్వాత అది మానేసి అందరూ అక్కడే భోజనం చెయ్యాలన్న నియమం పెట్టేరు. అలా బుచ్చిరత్నాన్ని చాలాసార్లు సత్రంలో మా అక్కయ్యతోపాటు చూసేను.

మా చావడిలోనే, మా ఇంటికి ఆనుకున్న వాటాలో వాసూవాళ్ళూ ఉండేవాళ్ళు. వాసు నాకు ఒక ఏడు సీనియర్. అయినా నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం తెలుగు, సైన్సు, లెక్కలు మాష్టార్లకి ప్రియశిష్యులం. వాసు మంచి మంచి కవితలూ పాటలూ రాస్తుండేవాడు. శ్రావ్యంగా పాడుతుండేవాడు కూడా. ఒకటి రెండు పాటలు ఆకాశవాణి లలిత గీతాలుగా ప్రసారమయ్యయి. వాడు రాసిన పాటలు, మిగతా చోట్ల మాట ఎలా ఉన్నా, విజయనగరంలో బాగానే జనరంజకం అయ్యాయి. కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడడంతో, ఏడో ఫారంతో చదువు ఆపేసి, మెడికల్ షాపులో చేరాడు.

ఆదివారం సాయంత్రాలు ఇద్దరం సాధారణంగా అయ్యకోనేటి గట్టుకో, వ్యాసనారాయణమెట్ట గుట్టలమీదకో పోయి కూచునేవాళ్ళం. అక్కడ వాడు తను రాసిన పాటలకి రాగాలు కూర్చుతూ, పాడుతూ, నాకు వినిపించేవాడు. వాటిలో ఒకపాట – నేను ఎన్నటికీ మరిచిపోలేని పాట – ఒకటి ఉంది.

అది రాధా-కృష్ణుల అన్యోన్య ప్రేమభావనలని వివరించే పాట. మా తెలుగు మాష్టారయితే ఆ పాటలోని మెళకువలకి వాసుని ఎంత మెచ్చుకున్నారో చెప్పలేను.

నీ మోము విరిసిన కల్హారమంటే;
చందమామవు నీవె నంటుంది రాధ,
నీ నడల కాళింది హొయలున్నదంటే;
సాగరుడ వీవె నంటుంది రాధ,
నీ యెడద ప్రణయమందిరమ్మంటే;
అందున్న మూర్తి నీ వంటుంది రాధ,
రాధ నే నౌదమని యున్నదంటే;
స్వామి! సర్వము నీవ యంటుంది రాధ.

తలుచుకుంటుంటే, ఇప్పటికీ వాసు గొంతులో ఆ పాట నా చెవిలో మారుమోగుతోంది.

ఇప్పుడంటే పాడుతా-తీయగా ధర్మమా అని పాటలు పాడి డబ్బు సంపాదించడం ఒక వృత్తి అయింది గాని, ఆ రోజుల్లో ఎంత బాగా పాడేవాళ్ళయినా దానిని వృత్తిగా చేసుకుని జీవించడం దుర్లభంగా ఉండేది. ఉన్న అవకాశాలల్లా, అయితే ఏ నాటకాలకో పాడుకోవటం. లేకుంటే శ్రీరామనవమి, వినాయక చవితి, దసరాలకి వీధి వీధికీ వెలిసే పందిళ్ళలో పాడుకుంటూ పాతికో పరకో సంపాదించుకోవడం. అంతే!

ఎలాగైనా ఆ ఏడు మెడిసిన్‌లో సీటు సంపాదించాలని నా పట్టుదల. పండగలకీ, షికార్లకీ స్వస్తి చెప్పేను. అందువల్ల మా వీధిలో, ఇంటికెదురుగా పందిరి వేసి, వారం రోజులబట్టీ దసరాకి కార్యక్రమాలు జరుగుతున్నా, పట్టించుకోకుండా ఇంటిపట్టునే కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్నాను.

ఇంతలో కమ్మని గొంతులో వాసు రాసిన నాకిష్టమైన పాట వినిపించింది. ముఖ్యంగా రెండవ చరణంలో సాగరుడ వీవె అన్న చోట సా-ని సాగదీస్తూ పలికిన గమకం, ‘సహస్రబాహువులతో కాళిందిని అక్కున జేర్చుకుంటున్న సముద్రుణ్ణి గుర్తుకు చేసిందని, కానుకుర్తివారి సత్రంలో త్యాగరాజ ఉత్సవాలకి ఒకసారి శ్రీరంగం గోపాలరత్నంగారు త్యాగరాజకృతి నగుమోము పాడుతూ ‘గగనానికి ఇలకూ బహు దూరంబనినాడో’ అన్నచోట దూ-ని సాగదీసి పాడినపుడు ఆకాశానికీ భూమికీ మధ్యనున్న అనంతమైన దూరాన్ని సూచించేట్టు పాడిన తీరు గుర్తు చేసిందని’ మా తెలుగు మాష్టారు వాసు పాటనీ రచననీ మెచ్చుకుంటూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మా వాసు పాడిన దానికంటే కూడా శ్రావ్యంగా ఉంది. పుస్తకాలు అక్కడే విడిచిపెట్టి వీధిలోకి పరిగెత్తి చూసేను ఎవరా అని.

బుచ్చిరత్నం! అరచేతి మందం ఎర్రని అంచు నీలం పరికిణీ, దానికి తగిన వోణీ జాకెట్టు వేసుకుని మైకు ముందు నిలబడి మైమరచి పాడుతోంది.

యవ్వనంలోకి అడుగుపెడుతున్న నా మనసూ, గుండే మొదటిసారి లయ తప్పాయి. అప్పటినుండీ వాసు దగ్గర, మా అక్కయ్య దగ్గరా వాళ్ళకి అనుమానం రాకుండా బుచ్చిరత్నం గురించి సమాచారం తెలుసుకోడానికి ప్రయత్నించేను. వాసుతో విహారాలు తగ్గిపోయాయి. బుచ్చిరత్నాన్ని చూడడానికి ఏదో నెపం వెతుక్కుని సంగీత కళాశాలకి వెళ్ళడమో, లేదా సత్రంలో ఆమె వచ్చినపుడో, వెళ్ళినపుడూ చూడడమో చేసేవాడిని. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే వాసు ఓ రోజు ఆమె గురించి ఏదో అడగబోతే, కళ్ళెగరేస్తూ “ఏమిటి కథ?” అని నన్ను అడిగేడు. “ఏమీ లేదు. ఊరికేనే” అని ముందు బుకాయించడానికి ప్రయత్నించేను. తర్వాత, ప్రాణమిత్రుడి దగ్గర దాపరికం ఎందుకని ఉన్న విషయం అంతా చెప్పాను. నా మనసులో మాట ఇంకా ఆ పిల్లకి చెప్పలేదని, తన అభిప్రాయం ఏమిటో తెలియదు కనుక స్నేహితుడిగా ఏదో సలహా చెప్పమనీ అడిగేను.

“ఏడిచినట్టు ఉంది. నువ్వు మెడిసిన్ చదువుదామనుకుంటున్నావు. వాళ్ళమ్మగారు పాపం ఇళ్ళలో వంటలు చేసుకుని కుటుంబం నెట్టుకొస్తోంది. రేపు నువ్వు నిజంగా డాక్టరువైతే, మీవాళ్ళు ఈ సంబంధానికి ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. అనవసరంగా ఆ పిల్లకి లేనిపోని ఆశలు కల్పించి వాటిని భగ్నం చెయ్యకు” అని హెచ్చరించాడు.

నా మనసులో మాట ఆ పిల్లకి తెలియజెయ్యడం పెద్ద సమస్య అయింది నాకు. మా అక్క కూడ బాగా పాడేది గాని బయట ఎక్కడా పాడేది కాదు. ఇద్దరూ మంచి స్నేహితులవడంతో అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూండేది. నేనూ కూనిరాగాలు తియ్యడం ప్రారంభించేను.

అప్పట్లో రాజేంద్ర కుమార్ హిందీ సినిమా సూరజ్ విడుదలైంది. ‘బహారోఁ ఫూల్ బర్సావో, మేరా మెహబూబ్ ఆయా హై’ అన్నపాట ఆ పిల్ల వచ్చినపుడల్లా పాడుతుండేవాడిని. ఎప్పటికైనా నా మనసు తెలుసుకోకపోతుందా అని.

ఒకరోజు కొత్తబట్టలు కట్టుకుని మా ఇంటికి వచ్చింది మా అక్కను కలవడానికి. ఆ రోజు ఏ పండగా కాకపోవడంతో ఆ రోజు తన పుట్టిన రోజని గ్రహించాను. మధ్యాహ్నమల్లా కూచుని మంచి ఆర్ట్ పేపరు మీద వాసు రాసిన పాటని పొందికగా రాసి, మూడో చరణంలో ‘మూర్తి’ అన్న పదాన్ని కోట్‌లలో పెట్టి వాళ్ళమ్మగారు లేని సమయం చూసి వాళ్ళింటికి వెళ్ళి ‘ఇది నీకు నా పుట్టినరోజు కానుక’ అని చెప్పి బుచ్చిరత్నానికి ఇచ్చేను. అది చదివి నమ్మలేనట్టు నావంక చూసింది.

ఆ రోజునుండీ తన కార్యక్రమం ఎక్కడున్నా నాకు వినిపించేలా మా ఇంటికి వచ్చి మా అక్కతో చెబుతుండేది. నన్ను చూసిన తర్వాతే ‘నీ మోము విరిసిన’ పాట పాడుతుండేది.

నా పరీక్షలు పూర్తయ్యాయి. ఆశించినట్టుగానే నాకు మెడిసిన్‌లో సీటు వచ్చి విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేరాను. నేనూ మరో ఇద్దరు మిత్రులూ కలిసి మహరాణిపేట రెండో వీధిలో రెండు గదులు అద్దెకు తీసుకుని చేరిపోయాం. దానివల్ల కలిసొచ్చిన విషయం ఏమిటంటే అప్పటి వరకు ప్రత్యక్షంగా కలవడానికి వీలు లేకపోయిన మాకు, నిర్భయంగా ఉత్తరాలు రాసుకునే స్వేచ్ఛ లభించింది.

చివరి సంవత్సరం పరిక్షలు ఇంకో రెండు నెలలున్నాయనగా బుచ్చిరత్నం దగ్గరనుండి ఉత్తరం వచ్చింది: వాళ్ళమ్మగారు తనకి సంబంధాలు చూస్తున్నారనీ, ఒకసారి ఆవిడతో మాటాడమనీ.

వెంటనే ఇంటికి వెళ్ళాను. “అకస్మాత్తుగా ఇలా ఊడిపడ్డావేమిటిరా?” అని నాన్నగారు అడిగేరు.

“మా మిత్రుడి ఇంట్లో ఒక చిన్న విషయం చెప్పిపోవడానికి వచ్చే” నని నిజమూ అబద్ధమూ కాని మాటలు చెప్పి తప్పించుకున్నాను. ఎవరూలేని సమయం చూసి మా అక్క మాత్రం, “బుచ్చిరత్నం నాకు మీ ఇద్దరి సంగతీ చెప్పిందిలే. కానీ ధైర్యంగా నాన్నగారికి చెప్పలేని వాడివి ఆ పిల్లని ప్రేమించడం ఎందుకురా?” అని నిలదీసింది.

“అది కాదే! చదువు పూర్తవకుండా ఆ అమ్మాయిని ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటాననీ ఎలా చెప్పనే? నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలా? నా చదువు పూర్తయ్యేదాకా వాళ్ళమ్మగారిని ఆగమని ఒప్పించడానికి వచ్చేను” అని నేను వచ్చిన అసలు కారణం చెప్పేను.

అనుకున్నట్టుగానే, వరాలమ్మగారిని సాయంత్రం వాళ్ళింట్లో కలిసేను. ఆవిడ నాకు హితబోధ చేసింది: రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాన్నీ, మా అమ్మానాన్నలు నా గురించి కనే కలల్నీ, కొడుకుగా నా బాధ్యతనీ గుర్తుచేసి, యవ్వనంలో ఉండే ప్రేమోద్రేకాలు ఎక్కువకాలం ఉండవనీ.

ఆమెకు ఒక విషయం చెప్పాను. “మా తల్లిదండ్రుల్ని ఒప్పించయినా, నొప్పించయినా బుచ్చిరత్నాన్ని పెళ్ళి చేసుకోగలనన్న నమ్మకం ఉంది. నా మనసు తెలుసుకుని వాళ్ళే త్రోవకి వస్తారు. కొడుకుగా నా బాధ్యతలని ఏనాడూ విస్మరించను. మీ అమ్మాయి వాటికి అభ్యంతరం చెబుతుందని అనుకోను. ఇక రెండు నెలల్లో ఆఖరి సంవత్సరం పరీక్షలు అయిపోతాయి. మావాళ్ళని ఒప్పించి చేసుకోవాలన్నా, జూన్ నెలాఖరుదాకా మీరు దయచేసి ఆగండి” అని అడిగేను.

“సరే! జూన్ నెలాఖరు వరకు చూస్తాను. కానీ, మీ అమ్మానాన్నలకి అంగీకారమైతేనే ఈ పెళ్ళి జరుగుతుంది. వాళ్ళకి అంగీకారం కానపుడు నేను అంగీకరించలేను. చేతికి అందొచ్చిన కొడుకుని ఎగరేసుకుపోయిందని నన్నూ, దాన్నీ లోకం ఆడిపోసుకుంటుంది. కేవలం మనుషుల మంచితనమే ఆసరాగా బ్రతుకుతున్న నాకు ఆ అయివేజు కూడా లేకుండాపోతుంది,” అందామె.

కానీ, నాకు మాటిచ్చినట్టు జూన్ నెలాఖరుదాకా ఆగలేదు.

మే 21న రాత్రి 7.30కి నా డైరీలో –

నీ చెలిమి నేడే కోరితిని. ఈ క్షణమే ఆశవీడితిని
పరుల సొమ్మైపోయినావని నలిగి నా మనసే…
అని రాసుకున్నాను.


హ్యూస్టన్ మరొక పది నిముషాలలో చేరబోతున్నాం అన్న కేప్టన్ ప్రకటనతో తెలివొచ్చింది.

“డాక్టర్ మూర్తీ! వన్ మినిట్” అంటూ లాండింగ్‌కి ప్రయాణీకుల్ని సిద్ధంచేస్తూ నీరజ నన్ను చూసి గ్రీట్ చేసింది.

“మిమ్మల్ని ఈ ప్రయాణంలో బాగా ఇబ్బందిపెట్టాను. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. దిగిన తర్వాత మీరు ఏమీ అనుకోకుండా పది నిమిషాలు కేటాయించగలిగితే ఒక కప్పు కాఫీ తాగుదాం” అని చాలా మర్యాదపూర్వకంగా అడిగింది. లాండ్ అయిన తర్వాత కేప్టను కూడా వచ్చి ధన్యవాదాలు చెప్పాడు.

ఆ పది నిమిషాలూ బుచ్చిరత్నం కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. మాటాడిన రెండు మాటలూ ధన్యవాదాలకీ, కృతజ్ఞతలకే పరిమితం అయ్యాయి. నన్ను గుర్తుపట్టినట్టు కనిపించలేదు. నీరజ వెళ్తూ వెళ్తూ, నా విజిటింగ్ కార్డ్ తీసుకుని మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి, “డాక్టర్ మూర్తీ! మీకు విమానప్రయాణంలో ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా, నేనున్నానని మరిచిపోవద్దు. నాకు ఒక్కసారి కాల్ చేస్తే చాలు. మా ఎయిర్‍లైన్స్ ద్వారా మీకు సాధ్యమైనంత వరకు సహాయం చెయ్యగలను” అని తన విజిటింగ్ కార్డు నా చేతిలో పెట్టి, హామీ ఇచ్చి శలవు తీసుకుంది వాళ్ళమ్మమ్మతో.


అంతర్జాతీయ సమావేశం, తర్వాత చెదురుమదురుగా ఉన్న మిత్రుల ఆతిథ్యం, ఎలాగూ వచ్చేను కదా అని ఇద్దరు ముగ్గురు దగ్గరి చుట్టాల పలకరింపులు, వాళ్ళతో కొన్ని ముఖ్య ప్రదేశాల సందర్శన – వీటన్నిటితో తిరిగి ఇల్లు చేరేటప్పటికి రెండు నెలలు పైనే పట్టింది.

కిసలయ రెండు రోజులపాటు నన్ను వదలలేదు.

మరో రెండు రోజులు పోయిన తర్వాత తీరికగా క్లినిక్‌కి వెళ్ళేను.

ఇన్నాళ్ళుగా పోగుబడిన ఉత్తరాలు చూస్తుంటే, అన్ని ప్రింటెడ్ ఉత్తరాల మధ్యా చేతి రాతతో ఉన్న ఒక కవరు నా కంటబడింది. ఎవరబ్బా అనుకుంటూ తీసి, తెరిచి ఆతృతగా చదవడం ప్రారంభించాను:

మూర్తీ!

ఈ సంబోధన నాకే ఆశ్చర్యంగా ఉంది. యాభై ఏళ్ళ క్రిందట ఇలా పిలవగలిగేదాన్ని కానేమో. వయసు ఆ స్వాతంత్య్రాన్నిచ్చింది. ఇన్నేళ్ళు గడిచినా నువ్వు నన్ను మరిచిపోలేదు. అందుకు ఒక విధంగా అదృష్టవంతురాల్నీ, మరొక విధంగా దురదృష్టవంతురాల్నీ. నాకు రెండుసార్లు ప్రాణం మీదకి వచ్చినపుడూ నువ్వు ప్రక్కనే ఉన్నావు. మొదటిసారి మీ కజిన్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి; రెండవసారి నువ్వే స్వయంగా నన్ను కాపాడీ.

ఏమిస్తే నా ఋణం తీరుతుంది? అందుకే, నా జీవితంలో ఇప్పటిదాకా అతి పదిలంగా దాచుకున్న, నీ చేతిరాతలో ఉన్న వాసు పాట -నా పుట్టినరోజుకి నువ్వు ప్రేమగా ఇచ్చినది- నీకు పంపుతున్నాను. దానిని మించి, నీకు ఇవ్వదగిన అమూల్యమైన వస్తువు ఏదీ నా దగ్గర లేదు.

అ’మూర్త’మైన నా జీవితంలో, ఇకనుంచి ఆ పాట కూడా ‘అమూర్తం’గానే మిగిలిపోతుంది.

ప్రేమతో,
బుచ్చిరత్నం.

[తన పాట ‘నీ మోము విరిసిన కల్హారమంటే’ ఈ కథలో వాడుకుందికి అనుమతి ఇచ్చిన ప్రియమిత్రులు శ్రీ యెరికలపూడి వాసుదేవరావుగారికి కృతజ్ఞతలు– రచయిత.]