వాడి కథ

సత్యాన్ని తెలుసుకోవడమే కాదు బాబాయ్, చాలాసార్లు దాన్ని తెలుసుకోకపోవడం కూడా జ్ఞానమే.

ఇలాంటి మాటలతో నాకుండే ఏకీభావం కంటే అవసరాలే ఎక్కువ. ఇలా వాడి మాటలతో నేను కథ మొదలుపెట్టడం వాడు చూసి ఉంటే ఎప్పటిలాగే ఈ కథ కూడా డస్ట్‌బిన్‌లోనే చేరి ఉండేది.

కథ కలలో కనిపించి, కళ్ళు తెరిచేటప్పటికి కనుమరుగైపోయినట్లుండాలి. మీలాంటివారు పుంఖానుపుంఖాలుగా రాసిపారేసేదంతా మీ మూర్ఖత్వమే తప్ప మరేం కాదు.

ఇలాంటి స్టేట్‌మెంట్స్ అప్పుడప్పుడు వాడి నుంచి వినడం మామూలే. డస్ట్‌బిన్‌లో వాడేసిన కథలు, కవితలు మళ్ళీ ఏదో పేపర్‌కి పంపేవాడిని. వాటికి మంచి స్పందనే ఉండేది సాహితీ లోకంలో. ‘రాయడం ఆపడం తెలిసిన తరువాతే అసలైన రచయిత జన్మిస్తాడు బాబాయ్!’ అన్నాడోసారి. రాయడం ఆపాక రచయిత జన్మించడం ఏంటో నాకర్థం కాకపోయినా మళ్ళీ వాడిని అడిగి దాన్ని అర్థం చేసుకోవాలన్న కోరికేం కలగలేదు.


మేం ఇక్కడ ఇల్లు కట్టిన మరుసటి సంవత్సరం, వాళ్ళ నాన్న మా ఇంటి పక్కనే మా స్థలానికి ఐదు రెట్ల స్థలం తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాడు. చూడటానికి హిందీ సినిమా హీరోలా ఉండేవాడు. ‘తమ్ముడూ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ఏవో వ్యాపారాలు చేసి బానే సంపాదించినట్లున్నాడు. వచ్చిన డబ్బును ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టేవాడు. ఆ రోజుల్లో అలా చేసినవాళ్ళు తక్కువ. వాళ్ళది ప్రేమ వివాహం. అందరిని ఎదిరించి పారిపోయి వచ్చి, క్రమంగా స్థిరపడ్డారు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. వాడప్పుడు రెండో తరగతి, పాప వాడికంటే నాలుగేళ్ళు చిన్నది. అనేక కారణాల వల్ల ఆ కుటుంబం పట్ల నాకు అభిమానం కంటే కూడా అసూయే ఎక్కువ ఉండేది.

నాది చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. నా అనాకారితనం పైన నాకు ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పిల్లలు లేకపోవడం, భార్యను సరిగా ప్రేమించలేని మనస్తత్వం, చాలీచాలని జీతం, నా చేతకానితనం ఇవన్నీ వాళ్ళ కుటుంబం పైన తెలియకుండానే చాలా కడుపుమంటను పెంచాయి. దాన్నెప్పుడూ పైకి రానిచ్చేంత తెలివితక్కువతనం లేకపోవడం నన్ను ఈ కథలో ప్రధాన పాత్రధారిని చేసిందనుకుంటా. ఏదైనా రాసి పత్రికలకు పంపడం ఆ రోజుల్లోనే నాకు అలవాటయ్యింది. కవితలు కథలు రాస్తూ సమాజంలో ఓ ఉదాత్తమైన మంచి మనిషిగా, అభ్యుయదయవాదిగా పేరు తెచ్చుకోవడం కోసం తపించేవాడిని. దానికోసం మనుషులను పరిశీలిస్తుండేవాడిని, రకరకాల పుస్తకాలు చదువుతుండేవాడిని. ఓ రకంగా నా సాహిత్యం వాడు చెప్పినట్లు సజ్జలు తిని సజ్జలు వదలడంలానే ఉండేది. కాని ఏదో పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం నన్ను రాతలో కొనసాగించేది. వాళ్ళ నాన్నకి సాహిత్యంపై మంచి అభిరుచి ఉండటం వల్ల ఎప్పుడన్నా వాటి విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి. కొన్ని ఇచ్చి చదవమనేవాడు. నా కవితలు, కథలపైన ఎలాంటి అభిప్రాయాలు చెప్పేవాడు కాదు. ‘రాయడం మంచిదే. రాస్తూ ఉండండి తమ్ముడూ’ అని ప్రోత్సాహంగా మాట్లాడేవాడు.

నాది పిల్లలను పెద్దగా ప్రేమించే మనస్తత్వం కాదు. పిల్లలనే కాదు ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించడం నాకు తెలిసిందా అనేది నన్ను ఎప్పుడూ వేధించే సందేహం. వాడు నాకు అప్పుడప్పుడు తారసపడ్డా మాట్లాడిన సందర్భాలేమి లేవు. వాళ్ళ అమ్మ, చెల్లి కూడా అంతే. పేరుకు పక్కయిల్లే కాని మా మధ్య దూరం ఎక్కువే. మా ఇంట్లో ఉండే పొట్టుపొయ్యిలో కూరడానికి కావలసిన రంపపు పొట్టు కోసం ఓ సారి సా మిల్ దగ్గరకు వెళ్ళాను. అది ఊరికి కొంచెం దూరంలో ఉండేది. అక్కడ పక్కన కొన్ని పాడుబడ్డ గుడిసెలు ఉండేవి. వాటిల్లోంచి ఏవో శబ్దాలు రావడంతో ఆ గుడిసెలోకి వెళ్ళాను. ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు అందరూ చిన్నచిన్న పిల్లలే. పదేళ్ళలోపువాళ్ళు. ఎవరి ఒంటి మీద గుడ్డలు లేవు. నన్ను చూడగానే అందరూ బట్టలు పట్టుకొని అలాగే బయటకు పరిగెత్తారు. క్రింద పడుకొని ఉన్న వీడు మాత్రం తాపీగా లేచి బట్టలు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. పిల్లల్లో ప్రీ-సెక్సువల్ ఆక్టివిటీస్ గురించి విని ఉన్నా కాని, చూడటం అదే మొదటిసారి. అక్కడి దృశ్యాలకంటే వెళ్తూ చూసిన వాడి చూపు మాత్రం నన్ను చాలా రోజులు వెంటాడింది. ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకే కాదు బయటకూడా ఎవరికీ చెప్పలేదు. అలాంటి ప్రాక్టీసెస్ పిల్లల్లో మామూలే అనే ఏదో భావం నాలో ఉండేదనుకుంటా. ఆ తరువాత రోజుల్లో వాడు నా పక్క ప్రశాంతంగా ఒక యోగిలాగా చూసేవాడు. వాడి మనసులో ఏముండేదో అర్థమయ్యేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుండేవాడు. రెండు పిల్లిపిల్లల్ని, ఓ ఖరీదైన కుక్కని ఇష్టంగా సాకుతుండేవాడు.

పదో తరగతిలో వాడు జిల్లా ఫస్ట్ తెచ్చుకున్న రోజు ఆ ఇల్లంతా కళకళలాడిపోయింది. ఎప్పటిలాగే నా మనసు కుతకుతలాడిపోయింది. రిజల్ట్ వచ్చిన ఇరవై రోజుల్లోనే వాడు ఇంటినుంచి పారిపోయాడు. వాడి చేతుల్లోని పుస్తకాన్ని వాడి చెల్లెలు లాక్కోవడం, ఆ జరిగిన గొడవలో వాళ్ళ నాన్న కొట్టడంతో వాడు పారిపోయాడని చెప్పుకున్నారు. వాడు పారిపోయిన ఆరునెల్లకే వాళ్ళ అమ్మ రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంది. బహుశా ఇవన్నీ నా మనసుకి ఏదో అర్థంకాని ప్రశాంతతను ఇచ్చాయనుకుంటా. ఆ తరువాత వాళ్ళింటికి తరచుగానే వెళ్ళి ఓదార్పుగా సాయంగా ఉండేవాడిని. అబ్బాయి వస్తాడు అని నమ్మకంగా చెప్పేవాడ్ని. అతను ఈ పరిణామాలతో బాగా కుంగిపోయాడు. కేవలం కూతురు కోసం మాత్రమే బతుకుతున్నట్లు ఉండేవాడు. నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆయన చూపించే ప్రేమకు సరిసమానమైన ప్రేమను కడుపులో అంత అసూయ పెట్టుకున్న నేను కూడా చూపించడం నాకు కూడా ఆశ్చర్యంగా ఉండేది. నేను చేసేది నటన కాదు అని తెలియడం మరింత అయోమయంగా అనిపించేది.

కొంతకాలానికి క్రమంగా సర్దుకున్నారు. ఆ అమ్మాయిని బాగా చదివించాలని, మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని మళ్ళీ సంపాదనపైన దృష్టి పెట్టాడు అతను. అతని చేతిలో ఏముందో కాని రూపాయి వందరూపాయలుగా మారడం నేనే చాలాసార్లు చూశా. అతనితో కలిసి పెట్టుబడి పెట్టి ఏమైనా కొనాలనిపించేది. అదెప్పుడూ కుదరలేదు.

ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమించిన అబ్బాయితో లేచిపోవడం అతన్ని కోలుకోలేని దెబ్బతీసింది. సరిగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ బయట వరండాలో మెట్ల దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఓ రెండు నెలల కాలంలో అతనిలో అనేక మార్పులు సంభవించాయి. నేను ఎప్పుడన్నా అన్నానికి పిలిచినా ఇంటిలోకి వచ్చేవాడు కాదు. ‘ఆకలిగా లేదు తమ్ముడూ’ అనే వాడు.

ఓ రోజు ఉదయాన్నే మా ఇంటి తలుపు తట్టాడు. వెళ్ళి తలుపు తీశాను. లోపలికి వచ్చి కూర్చున్నాడు. చేతిలోని సంచిలోనుంచి దస్తావేజులు తీసి నా చేతిలో పెట్టాడు. “నా ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మారుద్దామనుకుంటున్నా తమ్ముడూ. నా బ్యాంక్ లాకర్లు కూడా. నీ అకౌంట్లో పదిలక్షల డబ్బులు వేస్తాను. ఒక వేళ నా కూతురో, కొడుకో వస్తే వాళ్ళకు వీటిని అప్పగించు. నీ కంటే ఆప్తుడు నాకెవ్వరున్నారు?” అంటూ నవ్వాడు. నాకు అదంతా ఆశ్చర్యంగాను, లోపల కొంత ఆనందంగా కూడా ఉండింది. పైకి మాత్రం కాస్తంత విషాదంగా అన్నాను, “ఇదంతా ఎందుకన్నా ఇప్పుడు, నువ్వు ఉంటావ్‍గా!” అని. “బయట నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, వెళ్తున్నా” అన్నాడు. నా భార్య మౌనంగా మా ఇద్దరిని చూస్తుంది. “ఇంటిని అప్పుడప్పుడు శుభ్రం చేయించిపెట్టు. వాటికి ఈ డబ్బులు వాడుకో” అన్నాడు. రెండు రోజుల్లోనే అన్నీ పనులు పూర్తి చేశాడు. తాళాలు నా చేతిలో పెట్టి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రే అతను ఊరి బయట చెరువులో శవంగా తేలాడు. అతనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నా చేతిపైన జరిగిపోయాయి.

దాదాపు పదహారు చోట్ల పెద్దపెద్ద స్థలాలు, ఆ ఇల్లు, పదెకరాల పొలం, నాలుగైదు కేజీల బంగారం, పదిలక్షల డబ్బు ఇవన్నీ నాపేరు పైకి మారకపోయింటే బహుశా నేను ఆ చివరి కార్యక్రమాలు చేసేవాడినో కాదో తెలియదు.

దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత వచ్చి తలుపు తట్టింది వాళ్ళ కూతురు. ఐదు నెలల కడుపుతో. మనిషి బాగా నలిగిపోయినట్లు కనిపిస్తుంది. “బాబాయ్! ఇంటి తాళాలు ఇస్తారా?” అని అడిగింది. అన్నం తిని వెళ్ళమన్నా “వద్దు బాబాయ్, ఆకలిగా లేదు” అని తాళాలు తీసుకెళ్ళింది.

నేను ఆస్తి కాగితాలన్నీ తీసుకొని ఆ రోజు సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాను. అలా పట్టుకెళ్ళడంలోని ఉదాత్తతను నాకు నేనుగా అనుభవించడంలోని గొప్పతనం నాకు తెలుస్తోంది. ఆ అమ్మాయి హాలు సర్దుతోంది. నన్ను చూసి “కూర్చోండి బాబాయ్” అంది అలసటతో కూడిన నవ్వుతో. “ఇవన్నీ మీ నాన్న సంపాదించినవమ్మా. రేపు వీటిని నీ పేరుపైకి మారుస్తా” అని చెప్పాను. “నాకెందుకు బాబాయ్, ప్రస్తుతానికి వీటిని మీ దగ్గరే ఉంచండి” అంది. “సరే, ఒక్కదానివి ఉండగలవా పిన్నిని తోడు పంపించేదా?” అని అడిగాను. “వద్దు బాబాయ్, నాకిది అలవాటే” అనింది. వచ్చేటప్పుడు ఓ చిన్నపిల్లలా నన్ను హత్తుకొని “బాబాయ్! ఎప్పుడన్నా అన్న వస్తే నన్ను క్షమించమని అడుగు” అని చెప్పింది. “వస్తాడులేమ్మా. నువ్వే చెప్పచ్చు” అన్నా ఎప్పటిలానే నమ్మకంగా. పక్కరోజు హాల్లో ఫ్యానుకు ఉరేసుకొని కనిపించింది. ఆ బాధ్యత కూడా నేను తీసుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేశాను. నా మనుసులో కలిగిన అనేక రకాల భావాలు ఏంటో నాకే సరిగా అర్థం కాలేదు.

నా రాత కార్యక్రమం మాత్రం నేనెప్పుడు వదులుకోలేదు. నా కవితలకు, కథలకు ఎలా పేరు తెచ్చుకోవాలో క్రమంగా తెలుసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూనే ఉన్నా. నా భార్య గొడ్రాలితనంపైన కథ రాసి నా అభ్యుదయాన్ని పండించినట్లుగానే, వాళ్ళింట్లో జరిగిన విషాదాల నేపథ్యంలో కూడా కొన్ని కథలు రాసి పాఠకులను బాగానే ఏడిపించి శభాష్ అనిపించుకున్నా.

తరువాత పన్నెండేళ్ళకు మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు. దాదాపు ముప్పై ఐదేళ్ళ వయస్సు. గుర్తుపట్టలేనంతగా వాడేమీ మారలేదు. మాసిపోయిన కోరా చొక్కా, కోరా లుంగీ చుట్టుకొని ఉన్నాడు. వాడి అందానికి అవేమి అడ్డుపడలేదు. అందంగా, బలంగా, ప్రశాంతంగా ఉన్నాడు.

“బాబాయ్! గుర్తుపట్టారా?” వాడిది అదే చూపు.

తాళం తీసుకొని వాడితో పాటు వెళ్ళాను. ప్రతినెలా శుభ్రం చేయిస్తూనే ఉంటాను కాబట్టి ఇల్లంతా బానే ఉంది. లోపలికెళ్ళి వాళ్ళ నాన్న పాత నులకమంచం తెచ్చుకొని బయట వరండాలో వేసుకున్నాడు. అన్నానికి ఇంటికి రమ్మనమని పిలిచాను. “లేదు బాబాయ్, నేను వండుకుంటాను” అన్నాడు. “డబ్బులు ఏమన్నా కావాలా?” అంటే “అవసరం లేదు బాబాయ్” అన్నాడు. వాళ్ళ నాన్న, అమ్మ, చెల్లి విషయాలు చెప్పాను. నిశ్శబ్దంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న చెత్తతో పాటు, వాళ్ళ నాన్న సేకరించిన పుస్తకాలన్నీ తెచ్చి పక్కన ఖాళీస్థలంలో పడేసి మంటపెట్టాడు. నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నా కాని దగ్గరకు వెళ్ళలేదు.

పక్కరోజు వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తుల కాగితాలన్నీ తీసుకెళ్ళి ఇచ్చాను. విపరీతంగా పెరుగుతున్న భూముల విలువ వల్ల వాటి విలువ ఇరవై కోట్ల పైనే ఉండచ్చని చెప్పాను. నా గొప్పతనాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి సంకోచించాల్సిందేమీ నాకు కనిపించలేదు. వాడు దానిని పసిగట్టాడా!? ఏమో తెలియదు. “నాకు కావలసినప్పుడు తీసుకుంటానులే బాబాయ్, నీ దగ్గరే ఉంచు” అన్నాడు అదే ప్రశాంతమైన యోగి చూపుతో.

ఆ రోజు నుంచి నాలుగు సంవత్సరాలు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం నేను వాడిని కలుస్తూనే ఉండేవాడిని. వాడెందుకు నాతో ప్రేమగా ఉండేవాడో నాకు తెలీదు. నాకు క్రమంగా వాడో వ్యసనంగా మారిపోయాడు. పెద్దగా స్నేహితులు లేని నేను వాడితో మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడ్ని. వాడు కూడా ఎప్పుడన్నా జీవితం గురించో, సాహిత్యం గురించో మాట్లాడేవాడు. ఒక ఆటో అద్దెకు తీసుకొని దాన్ని నడుపుకునేవాడు. నేను చాలాసార్లు కొత్త ఆటో కొనుక్కోవచ్చు కదా అంటే నవ్వేవాడు. వారం వారం వాడి దగ్గర మిగిలిన డబ్బులన్నీ నా దగ్గరే ఇచ్చి రెండు మూడు నెలలకోసారి తీసుకొని ఎక్కడికో మనీయార్డరు చేసేవాడు. వాడు నిద్రపోవడం వరండాలో నులకమంచంపైనే. ఇంట్లోపల ఎప్పుడూ పడుకునే వాడు కాదు.

వాడు వచ్చాక నా సాహిత్యజీవితంలో బలమైన మార్పులే వచ్చాయ్. నేను రాసిన పుస్తకాలకు మంచి అవార్డులే వచ్చాయ్. వెళ్ళి వాటిని అందుకొని వచ్చేవాడిని. అవార్డు అందుకున్న రెండు మూడు రోజులు ఓ రకంగా ఓ ట్రాన్స్‌లో ఉన్నట్లు ఉండేవాడిని. ఎప్పటికైనా సాహిత్యపీఠం అవార్డు అందుకోవాలనే నా కోరిక వాడికి చెప్పుకోకుండా ఉండలేకపోయేవాడ్ని. దాన్ని వాడెప్పుడూ తక్కువగా ఏం చూడలేదు. “ప్రయత్నించు బాబాయ్, సాహిత్యపీఠం ఏముంది! జ్ఞాన పథ్ కూడా రావచ్చేమో ఏదో ఒక రోజుకి. నువ్వు ఇక్కడ ఉండటం కంటే, ఆ సర్కిల్స్‌లోకి వెళ్ళి ప్రయత్నిస్తే అవి రావడం పెద్ద కష్టమేమీ కాదు బాబాయ్” అని సీరియస్‌గానే అనేవాడు.

ఆ ఇరవయ్యేళ్ళు ఎక్కడెక్కడ తిరగాడో కాని, సాహిత్యం గురించి సెటైర్లు బానే వేసేవాడు.

‘అనేక లొసుగులతో సంపాయించుకొనే అవార్డులను ప్రోగ్రసివ్ రచయితలుగా చెప్పుకునే మీలాంటివాళ్ళు కూడా ఓ గొప్పలా అనుకోవడం ఏంటో అర్థం కాదు. అవార్డులు కిరీటాలు కాదు బాబాయ్, రాజుగారి దేవతావస్త్రాలు.’

‘ఇక విమర్శకులు! వాళ్ళు జ్ఞానాన్ని కళ్ళల్లో, గుడ్డితనాన్ని మస్తిష్కంలో, పక్షపాతాన్ని హృదయాల్లో మోస్తూ ఉంటారు. ఓ రెండు గ్లాసుల మందు, నాలుగు బూతు జోకులతో సాహిత్యాన్ని ఏలేవాళ్ళ గురించి నీకు తెలియనిదేముంది!’

‘సీనియర్ ముసలి సాహితీవేత్తలు! వీళ్ళు చేతిలో బంగారు కంకణం పట్టుకొని ఆకర్షించే ముసలి పులి కంటే ఏం తీసిపోరు. కొన్ని తెలివైన జిత్తులమారి నక్కల్లాంటి యువ రచయితలు మాత్రమే వారిని తటాలున బోల్తా కొట్టించి, బంగారు కంకణం లాంటి కొన్ని అవార్డులు సొంతం చేసుకుంటారు. మిగతావారు ఆ బురదలో ఇరుక్కొని వాళ్ళని, వీళ్ళని తిట్టుకుంటూ జీవితంలో ఎప్పటికీ రాని పేరును తలుచుకొంటూ నిట్టూరుస్తుంటారు.’

‘గురువు, పుస్తకం జ్ఞానానికి ఊతకర్రల్లాంటివి. నీ నడకకు అవి కొంతకాలమే ఆపుగా ఉండాలి. ఎంత త్వరగా వాటిని వదిలించుకుంటే అంత త్వరగా మన కాళ్ళపైన మనం నడవగలుగుతాం. లేకుంటే మనమెప్పటికీ వికలాంగులమే.’

‘సాహిత్యం ఓ వెర్రివాడు మోసుకెళ్ళే మేకలాంటింది, పదిమంది మేక అంటేనే అది మేక, కుక్క అంటే కుక్కనే. అందుకే ఎదుటివాడి మెప్పు కోసం రచయితలు ఎదురుచూస్తూనే ఉంటారు. బతకనేర్చిన రచయితలు కుక్కను కూడా మేకగా భ్రమింపచేస్తుంటారు.’

ఇలాంటి మాటలు రావడం మొదలుపెట్టిన కొత్తల్లో విన్నట్లైతే ఈ పాటికి ఎప్పుడో రాయడం మానేసేవాడినేమో. ఎప్పుడైనా అవార్డు వచ్చినప్పుడు వాడి దగ్గర కూర్చొని తాగేవాడిని. అప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళతో పాటు, నా రచనలను పొగిడినవాళ్ళను కూడా హేళనగా తిడుతుండేవాడ్ని. అది ఎందుకో సరదాగా ఉండేది. ఒకసారెప్పుడో నన్ను ఎంతగానో కదిలించేసి ఏడిపించిన ఓ కథను చూపించి చదవమన్నా. “బాబాయ్, పాఠకులంటే ఎంతో చిన్నచూపు ఉంటే కాని ఓ రచయిత ఇలాంటి కథ రాయలేడు. మనుషులను సెన్సిటైజ్ చేయడం ఓ కుట్ర. రాజకీయాలకంటే సాహిత్యమే ఆ పని ఎక్కువ చేస్తుంది. దాన్ని రాజకీయం వాడుకుంటుంది. వీటి మధ్య మతం, కులం, ధనం వగైరాల్లాంటివి ఎవరి అవసరాల నిమిత్తం వాళ్ళతో వాడబడుతుంటాయి. ఈ కథలో పేదరికం, వివక్ష, వెర్రి ప్రేమ ఇలాంటి వాటిని సెంటిమెంటల్‌గా ఓవర్ రొమాంటిసైజ్ చేయడం ద్వారా పాఠకుడి ఆలోచనలతో కాకుండా ఎమోషన్‌తో ఆడుకోవాలనే ఎత్తుగడ ఈ కథనే కాదు, రచయితను కూడా అధమ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లుంది” అన్నాడు.

వాడు చెప్పిన మాటలు నాకైతే నచ్చలేదు. ఉద్వేగాలతో ఆడుకుంటేనే కదా అది అసలైన కథ అనిపించింది.

ఈ నాలుగేళ్ళలో వాడు నాకే కాదు నా భార్యకు కూడా ఎంతో దగ్గరైపోయాడు. నాతో రెండు మాటలు మాట్లాడటానికి ఇబ్బంది పడే ఆమె, వాడితో మాత్రం నాకంటే ఎక్కువ మాట్లాడేది. ఆమెకు బాగలేకపోయినా, ఏమన్నా కావాలన్నా వాడినే తీసుకెళ్ళేది.

ఎప్పుడన్నా వాళ్ళ నాన్న గురించి రెండు మాటలు మాత్రం చెప్పేవాడు. “బాబాయ్, మా నాన్నకు చాలా కలలు ఉండేవి. జీవితం ఒక పాత్రలోనుంచి మరొక పాత్రలోకి నిరంతరం వంపబడుతుంటుంది అనేవాడు. ఒక పెద్ద పాత్రలాంటి జీవితాన్ని మాకోసం తయారుచేసి పెట్టాలనుకునేవాడు. ఇప్పుడు పాత్రే పగిలిపోయింది. దీన్ని ఆయనెప్పుడూ ఊహించి కూడా ఉండడు.”

అంతే. ఇక ఎవరి గురించి కాని, కనీసం వాడి గురించి కూడా ఎప్పుడూ ఏమీ చెప్పుకునేవాడు కాదు.

ఓ రోజు హఠాత్తుగా వచ్చి తాళాలు చేతికి ఇచ్చి, “బాబాయ్, రైల్వే స్టేషన్ దాకా వస్తావా?” అన్నాడు. ఏదైనా ఊరికి వెళ్తున్నాడేమోనని “సరే, పద” అని బయలుదేరాను. ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. ట్రైన్ ఎక్కేముందు హత్తుకొని చెప్పాడు, “బాబాయ్ వెళ్తున్నాను. బహుశా మళ్ళీ తిరిగిరాకపోవచ్చు” అంటూ జేబులోంచి ఓ ఫోటోను తీసి “వీడి అడ్రెస్ వెనక పక్క ఉంది. ఎప్పుడైనా నీ ఆస్తిలో ఏదైనా ఇవ్వాలనిపిస్తే వీడికి కొంచెం ఇవ్వు” అని చెప్పి వెళ్ళి జనంతో కిక్కిరిసి ఉన్న జనరల్ కంపార్ట్‌మెంట్ తలుపు దగ్గర నిలబడ్డాడు. నాకేం అర్థం కాలేదు. వాడి దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అన్న ఆలోచన కూడా రాలేదు. వాడి వైపే చూస్తుండిపోయాను. వాళ్ళ నాన్న నన్ను హత్తుకున్నప్పుడో, వాళ్ళ చెల్లి హత్తుకున్నప్పుడు కలిగిన అనుభూతి కంటే భిన్నమైనదేదో కలిగింది. జీవితంలో ఎప్పుడూ ఏడవని నేను వెళ్తున్న ట్రైన్ వైపు చూసి అక్కడే కూలబడి ఓ చిన్నపిల్లవాడిలాగా ఏడ్చాను. వాడు వెళ్ళిపోవడం కంటే వాడు నన్ను చదివేశాడన్న నిజం నన్ను మరంత బాధపెట్టినట్లుంది. ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. వాడు నన్ను పరీక్షించడానికేమైనా వచ్చాడా, నన్ను మార్చడానికా, లేదా వాడు ఆ ఇంటిలో కొంతకాలం గడపడానికా? ఇలాంటి ఆలోచనలేవి వాడు ఉన్నన్ని రోజులు కనీసం నా జోలికి కూడా రాలేదు.

ఆస్తి మొత్తం నీదే అని వాడు చెప్పేశాక, నాకు ఇక ఎలాంటి సంకోచం కలగలేదు. అన్నింటిని అమ్మేసి సాహిత్య రాజధాని వైపు పయనం కావాలనుకున్నాను. వాడు వెళ్ళిపోవడం నా భార్యను చాలా బాధపెట్టినట్లుంది. ‘ఆపాల్సింది వాడిని’ అనేది. వాడి ఆస్తిని అమ్ముకోవడం మంచిది కాదని పదేపదే చెప్పేది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఊరు వదిలేస్తాం అనే సమయంలో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం నాకు కలిగించిన దుఃఖం కాని, చూపిన ప్రభావం కాని ఏమీ లేవు.

ఇక్కడ ఆస్తులు అమ్మి, నగరానికి కొంచెం దూరంగా ఇరవై ఎకరాలు తీసుకొని అన్ని సౌకర్యాలతో నా భార్య పేరుతో ఒక అనాథశరణాలయాన్ని కట్టించాను. వాడిచ్చిన ఫోటోలోని పిల్లవాడుండే శరణాలయం మొత్తాన్ని నేను కట్టించిన చోట నడపమని చెప్పి దాని నిర్వాహకులను ఒప్పించాను.

క్రమంగా సాహిత్యంపై దృష్టి పెట్టాను. పరిచయాలు విస్తృతమైయ్యాయి. నేను కొన్న పెద్ద ఇంట్లో ప్రతివారం, సాహితీ సమావేశాలు, వాడివేడి చర్చలు నడిచేవి. మందు కోసమే వచ్చే యువ, వృద్ధ సాహితీ వేత్తలతో, ప్రచురణకర్తలతో, సాహిత్యపేజీలు చూసేవాళ్ళతో అవి కళకళలాడుతుండేవి. నా పుస్తకాలకు ప్రసిద్ధ పత్రికల సాహితీ పేజీలలో రివ్యూలు రెగ్యులర్‌గా వచ్చేవి. సాహిత్యపీఠం అవార్డు నా చేతికి అందడానికి పెద్ద సమయం ఏం పట్టలేదు. తరువాత జ్ఞానపథ్ అందుకోవడం పైన దృష్టి పెట్టాను. దేశంలోని ఎనిమిది భాషల్లో సాహితీ అవార్డులు ప్రకటించాను. ప్రైజ్ మని ఒక్కో భాషకి ఐదు లక్షల చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. అలా ఐదేళ్ళపాటు ఆ అవార్డులు ఇవ్వడంతో దేశంలోని సాహిత్య సర్కిల్ మొత్తం నా వైపు చూడటం మొదలుపెట్టింది.

నా రచనలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. గొప్పగొప్పవారితో కీర్తించబడ్డాయి. సాహిత్య రాజకీయ పరిచయాలు దేశస్థాయికి మారాయి.

జ్ఞానపథ్‍కి మార్గం సుగమమయ్యింది.


వాడు మాత్రం ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉండేవాడు. లక్ష్యాలు పూర్తయ్యాక అసంతృప్తులు ఎక్కువవుతాయేమో. క్రమంగా ఒంటరిగా ఉండటమే కొంచెం సాంత్వనగా ఉండేది.

ఇక్కడికి వచ్చిన పదేళ్ళలో నేను సంపాదనపైన ఏ దృష్టి పెట్టకపోయినా వాడి డబ్బులు డబ్బులను సంపాదిస్తూనే ఉన్నాయ్. వందల కోట్ల ఆస్తులు కూడబడ్డాయి. ఆస్తులన్నీ అనాథశరణాలయం ట్రస్ట్‌కి రాశాను. సాహితీ పీఠానికి ఓ ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి యాభై కోట్లు డిపాజిట్ చేసి దాని వడ్డితో నడిచేట్లు చేశాను. నేను సంపాదించుకున్నవి కూడా వాటిలోనే కలిపేశాను. ఫోటోలో పిల్లవాడు బాగా చదువుకొని అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అతను ఆశ్రమం పైన ప్రేమతో డబ్బులు పంపుతూ ఉండేవాడు. అతని డబ్బు మాత్రం మళ్ళీ అతని అకౌంట్లోనే వేసేశాను. అన్ని అకౌంట్లు సెటిల్ అయినట్లనిపించింది.

వాడు ఎక్కడున్నాడన్నది తెలుసుకోవాలని నేనెప్పుడు ప్రయత్నించలేదు. వాడిలాగా ఉండాలని కూడా. ఇప్పుడు మాత్రం వాడిలాగా ఈ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో కిక్కిరిసిన జనం మధ్య క్రింద కూర్చొని ప్రయాణిస్తున్నాను. ఎక్కడికో తెలియదు. చేతిలో ఉన్న కొంచెం డబ్బులు కూడా నాలుగైదు రోజులకు మించి రావు.

డెబ్బై రెండేళ్ళ వయసు.

చూడాలి ఎలా బతుకుతానో! అనామకంగా ఎక్కడో మరణిస్తానేమో!

బహుశా కొన్ని రోజులు చూసి అనాథ శరణాలయం ముందు నా పెద్ద విగ్రహం పెడతారేమో!

నువ్వు మారవు బాబాయ్, దేవుడు కావాలంటే అన్నీ వదిలేయాలేయాలనుకున్నావా, ఏంటి!’ ఎక్కడనుంచో వాడు నవ్వుతున్నట్లనిపించింది.