రచయితల బృందాలే మనకు మిగిలిన పాఠక బృందాలు కూడానా అన్న అనుమానం కలిగించే సంధికాలంలో నిలదొక్కుకోవడానికి తెలుగు సాహిత్యం ప్రస్తుతం అవస్థపడుతోంది. బహుశా అందుకే రచయితలు కూడా పాఠక బృందాల కోసం, రచయితలుగా తామే గుంపులో చేరాలో కూడా ముందుగానే నిశ్చయించుకుంటున్నారు. ఈ సాంఘిక సాహిత్య సంప్రదాయాలని ఎంత వంటబట్టించుకున్నా, రచన మనగలిగేది దాని నాణ్యత వల్ల మాత్రమే. పుస్తక ప్రచురణ అరచేతిలో ఉసిరికాయలా మారిపోయాక, అచ్చులో పేరు చూసుకోవడమనేది ఈనాడు ఆర్థికంగా పుష్టిగా ఉన్న అందరికీ తీరగల్గిన కలే అయింది. వేరే పత్రికవారు ప్రచురించకుంటే తామే పత్రిక పెట్టుకొని ప్రచురించుకోవడమూ ఒక పంథాగా మారింది. అందువల్లనేనా అచ్చులో తమ పేరు చూసుకోగలిగిన వారంతా తాము ‘రచయితల’మని భ్రమపడుతున్నారు? ఆ వెంటనే తెలుగునాట సంప్రదాయం ప్రకారం ఆ భుజకీర్తి ధరించి సమాజోద్ధరణ తమ బాధ్యతన్న అహాన్ని శిలువలా మోస్తున్నారు? రచయితకు సమాజం పట్ల ఎలాంటి బాధ్యతా ఉండనవసరం లేదన్నది అటుంచుదాం. నిజానికి, సమాజంలో మార్పు తేవాలంటే రచన అన్నిటికన్నా బలహీనమైన ఆయుధం అన్న నిజాన్నీ పక్కనపెడదాం. దానికంటే ముందు, రచయితలు అని ఎవరికి వారు అనుకోవడమేనా? లేదా ఏదైనా ప్రామాణికత ఉందా? చిత్రమైన విషయమేమంటే, సాహిత్యం ఇతర కళలలాగా మన లోటుపాటులు మనకు చెప్పదు. మన పాట, మన ఆట మన స్థాయేదో వెంటనే చెప్తాయి. కానీ వ్రాత అలా కాదు. మనది అనుకున్న రచనలో ఏం ఉందో, ఏం లేదో అర్థం చేసుకోవడం కూడా దానికదే ఒక అభ్యాసం. దురదృష్టవశాత్తూ తెలుగులో ఆ అభ్యాసానికి చోటు లేదు. ఇది మాతృభాష కాబట్టి, తమకు బాగా వచ్చని, ఇందులో తమ భావాలను తాము అనుకున్న విధంగానే వ్యక్తపరుచుకుంటున్నామనీ అపోహలో వ్రాసుకుపోయేవారు ఎందరో లెక్కలేదు. పైగా, రచన సహజంగా అంతరాంతరాల్లో నుండి సజీవ అనుభవంగా కాగితం మీదకి రావాలన్న ఊకదంపుడు ఉండనే ఉంది. ఆ సజీవ స్పందన ఒక మనిషి నిజంగా అనుభవించినదే అయితే, అందులోని ఉద్వేగాలు అంతే బలంగా, అంతే నిర్మలంగా అక్షరాల్లోకి తర్జుమా కాకపోతే అది ఆ అనుభవానికే అవమానం అన్న ఎరుక, రచయితల్లో కొరవడిందని ఇటీవల వస్తున్న ఎన్నో స్వగతాలు, సొంత కథలు, అదే ధోరణిలో సాగుతున్న కవితలు చెబుతూనే ఉన్నాయి. నిజానికి ప్రపంచంలో కథకు పనికిరాని వస్తువు లేదు. ఏదయినా కథగా మారుతుంది, అది ఒక మంచి కథగా చెప్పగలగాలి, కథనంలో పదును, ఒడుపు ఉండాలి. పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి. ఆ ప్రతిభ ఇప్పుడున్న రచయితలలో నూటికో కోటికో ఒకరిద్దరిలో ఉంది. సహజ ప్రతిభ చాలా కొద్దిమందికే దక్కిన వరం. మిగతా అందరికీ రచయిత కావాలి అంటే వాక్యంతో ఎంతో పరిశ్రమ అవసరం. వాక్యంతో వస్తువుతో మమేకమవ్వడం అవసరం. ఎవరికి వారే రచయిత అనుకోవడంలో అర్థం లేదు. రచనావ్యాసంగం మిగతా కళలకంటే కష్టతరమని, దానికి ఎంతో సాధన, అధ్యయనం కావాలని గమనించనంత కాలం ఎవరూ రచయితలు కాలేరు. పాఠకలోకం మీద విమర్శలు గుప్పించి తమ అసహనాన్ని చాటుకోవడం నుండి ఈ తరహా రచయితలు ఎన్నటికీ విముక్తులు కాలేరు. తమ పుస్తకపు, రచనల విలువను ఎవరూ గుర్తించడం లేదని, తెలుగునాట ఆ స్థాయి గల పాఠకులు లేరని, తమ పుస్తకాలకు అమ్మకాలు లేవని, ఇక్కడ కుట్రలూ మోసాలు జరుగుతున్నాయనీ సామాజిక మాధ్యమాలు వేదికగా గొంతెత్తి చెబుతున్న రచయితలకు కొదువేం లేదు. అయితే వీటిలో నిజమెంత? అమ్మకాలు సమీక్షలు ఎంత మేరకు రచన విలువను పట్టివ్వగలవు? అన్న ప్రశ్నల కన్నా ముందు రచయితల లోపల సుళ్ళు తిరగాల్సిన ప్రశ్న: నేను నిజంగా రచయితనేనా?
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
ఫిబ్రవరి 2023 సంచికలో ...
- Diapers and Memories
- అపురూపం
- అమూర్తం
- అమ్మ చెప్పిన అబద్ధం
- ఆక్సిజన్ మాస్క్
- ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 16
- ఊహల ఊట 21
- గడినుడి – 76
- తరగతి గది కథలు
- ది వేస్ట్ లాండ్: 2. బరియల్ – మొదటి దృశ్యం
- నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు
- పరిచయం: డాక్టర్ కథ
- పాదరసపు కలలు
- ఫిబ్రవరి 2023
- యూట్యూబ్లో ఈమాట: గతనెలలో
- వాడి కథ
- సోల్జర్ చెప్పిన కథలు: రెండు గంటల కోర్స్