పాదరసపు కలలు

నిద్రలో కలలకి
షరతులుండవు
నిబంధనలు వర్తించవు.

చీకటి ఆకాశం
పగటి గాయాలకు
మబ్బుల మలామ్ రుద్దుకుంటోంది.

నీలిరంగు ధ్వనిని
మోసుకుంటూ మిణుగురులు.

లోయ అంచున
నిద్రపూల నది.

పట్టుచిక్కని
చిక్కని పట్టు కలలు.

రేయి చేపకంటిని
వేలితో పొడిచిన వేకువ జాలరి.

మఖమల్ సమయం
మెత్తగా వ్యాప్తమవుతూ…

మెలకువలో స్వప్నాలకి
కొలతలుంటాయి, హద్దులుంటాయి
ఆంక్షలుంటాయి, అవధులుంటాయి.