జనవరి 2019

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మెకాలే విధానాల వలన తెలుగు పరిపాలనా భాషగా కాకుండా పోవడంతో ఇంగ్లీషు భాష ప్రాచుర్యం పెరిగి తెలుగుకు ఆదరణ పోయింది. ఆపైన కొంత కాలానికి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషులో చదువుకుంటున్న వారివల్ల వారి వారి ప్రాంతీయ భాషలకు ఏ ఉపకారమూ జరగటం లేదని గమనించి స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు దగ్గరికి వచ్చేసరికి, లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పి సరిబాట పట్టలేదు. ఇప్పటికీ ఎడతెగని ఈ భాషావివాదపు మూలాలు ఏమిటి? అప్పుడున్న రాజకీయ సాంఘిక పరిస్థితులు ఏమిటి? ఇందులో చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి, జయంతి రామయ్య పంతులు, గురజాడ అప్పారావు వంటి పండితులు పోషించిన పాత్ర ఏమిటి? తెలుగు ఇప్పటికీ కూడా కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అలా కావాలంటే ఇకముందు మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సవివరంగా వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ రాస్తున్న విశ్లేషణాత్మక వ్యాసంలోని రెండవ భాగం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; ఈ సందర్భంగా రెండు అరుదైన పుస్తకాలు–టేకుమళ్ళ కామేశ్వరరావు రాసిన వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు, సామినేని ముద్దునరసింహం నాయుడు రాసిన హిత సూచని–గ్రంథాలయంలో చేరుస్తున్నాం. వీటిని శ్రమతో కూర్చి అందించిన ఆంధ్రభారతి సైట్ నిర్వాహకులు వాడపల్లి శేషతల్పశాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం; లియో తోల్‌స్తోయ్ బృహత్కథానిక డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యిచ్‌ను సమూలంగా తెలుగులోకి దంతుర్తి శర్మ చేసిన అనువాదం; భైరవభట్ల కామేశ్వరరావు తార్కికచింతనాత్మక వ్యాసం మూడవ భాగం; ఇతర వ్యాసాలు, కథలు ఈ సంచికలో మీకోసం.


ఈ సంచికలో:

  • కథలు: వంద వాట్‌ల బల్బు – పూర్ణిమ తమ్మిరెడ్డి (సాదత్ హసన్ మంటో); రెక్కలావు – చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వేంకటపతిరాజు; తలుపు-ఒక ముగింపు – నాగరాజు పప్పు; కొట్టివేత – పి. శివకుమార్; మరణ మృదంగం – ఆర్. శర్మ దంతుర్తి (లియో తోల్‌స్తోయ్); రహదారి రైలుదారి తలోదారి – వేగోకృప; బేతాళ కథలు: కథన కుతూహలం-8 – టి. చంద్రశేఖర రెడ్డి.
  • వ్యాసములు: నేనొక చిత్రమైన చిక్కుముడి:3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం – భైరవభట్ల కామేశ్వరరావు; త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టిచేసిన త్యాగయ్య గాన ప్రతిభ – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ; చిన్నయ సూరి-గిడుగు రామమూర్తి 2 – వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్; వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు (1938) – టేకుమళ్ళ కామేశ్వరరావు, గిడుగు రామమూర్తి పంతులు; హితసూచని: ప్రవేశిక – ఆరుద్ర, సామినేని ముద్దునరసింహ నాయుడు; వనమయూరము – జెజ్జాల కృష్ణమోహన రావు.
  • ఇతరములు: నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం – చీమలమర్రి బృందావనరావు; గడి నుడి 27 – త్రివిక్రమ్.