రాగరత్న మాలిక
ఆ కాలంలో అప్పటి వరకూ పరిచయం లేనీ, ఎవరికీ తెలియని కొన్ని కొత్త రాగాల్లో త్యాగరాజు కృతులు స్వరపరిచాడు. ఆయా రాగాల విస్తృతిని కృతుల్లో చూపించాడు. ఈ రాగాలు అంతకు పూర్వం వున్నట్లుగా సంగీత పరంగా లిఖిత పూర్వకమైన ఆధారాలు లేవు. బహుశా స్వరార్ణవంలో ఉన్న రాగాలననుసరించి ఈ కొత్త రాగాలు ఊహించుండవచ్చుననీ సంగీతకారుల అభిప్రాయం. ఎందుకంటే ఈ రాగాల వివరాలు స్వరార్ణవంలో లేవు. 82 కృతులకు పైగా ఉన్న ఈ రాగాలనే వింత రాగాలు లేదా విచిత్ర రాగాలని అంటారు. ప్రస్తుతమున్న ఈ రాగాలన్నీ శిష్యులు భధ్రపరిస్తేనే లభించాయి. రోజుకో కొత్త రాగంతో కృతులు స్వరపరిస్తే, శిష్యులు నేర్చుకొని పాడేవారు. కొత్తవి స్వరపరిస్తే పాతవి మరింత పాతబడిపోయేవి. అందరు శిష్యులూ ఒకేసారి త్యాగరాజు వద్ద లేరు. అందువల్ల కొన్ని కొంతమందికి తెలిసేవి. మరికొన్ని వేరేవారికి తెలిసాయి. ఇలా ఎందరో శిష్యులు తాళపత్రాలపై పొందుపరచినవే ఇప్పుడున్న కృతులు. ఇప్పుడున్న వాటికంటే ఖచ్చితంగా ఎక్కువ రాగాలనే ఉపయోగించుంటాడని సంగీతజ్ఞుల వాదన.
భార్య కమలాంబ మరణానంతరం త్యాగరాజు నలభై ఏళ్ళు పైగా కేవలం సంగీత సాధనలోనే గడిపాడు. ఆ నలభై ఏళ్ళ జీవితంలోనే ఎన్నో ఒడుదుడుకులు అనుభవించినా, మరిన్ని కృతులు స్వరపరిచుంటాడని, శిష్యుల అశ్రద్ధ వల్ల కూడా కొన్ని కృతులు కనుమరుగయ్యాయని సంగీతకారుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని వింత రాగాల పేర్లే చాలామందికి తెలీదు, మరి కొన్ని పేర్లకి సరైన అర్థమే తెలీదు. ఉదాహరణకి ‘జుజాహుళి’ ‘జింగాళ’ లాంటి రాగాల పేర్లు. మిగతా రాగాలు కొన్నింట్లో పేరుని బట్టి రాగం తెలుస్తుంది. అలాగే ఆందోళి, ఆందోళిక అనే రెండు వింత రాగాలున్నాయి. ఆందోళి అంటే స్త్రీ, హంస అనే అర్థం తెలుసు. ఆందోళిక అంటే స్త్రీ లేదా అందలం అనే అర్థముంది. ఇలా ఒక్క అక్షరం తేడాతో రెండు వేర్వేరు రాగాల పేర్లు పెట్టడంలో త్యాగరాజు వుద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలీదు. ఇలా ఎన్నో కొత్త కొత్త రాగాలకి త్యాగరాజు ద్వారా నామకరణం జరిగింది. అలాగే ఓ రాగానికి “కొలాహలం” అనే పేరుంది. ఇలాంటి విభిన్నమైన పేర్లు రాగాలకి వాడడం త్యాగరాజుతోనే మొదలయ్యింది.
ఖరహర ప్రియ రాగంలో ‘మిత్రి భాగ్యమే, సౌమిత్రి భాగ్యమే’ అనే కృతి చరణంలో ‘బాగుగ వింత రాగముల నాలాపము సేయగ మేను పులకరించగ’ అంటూ ఈ వింతరాగాల ప్రస్తావనుంది. ఈ వింతరాగాల్లో చాలావరకూ ఇతర వాగ్గేయకారుల రచనలు లేకపోవడం వల్లా, త్యాగరాజు కాలం ముందు తెలీకపోవడం వల్లా, ఇవన్నీ త్యాగరాజ సృష్టే నని సంగీతకారులు భావిస్తారు. ఉదాహరణకి, హరికాంభోజి జన్యమైన సుపోషిణి రాగమూ (రమించు వారెవరురా), జుజాహుళి రాగమూ (పరాకు జేసిన నీకేమి) వంటివి త్యాగరాజు కృతుల్లో తప్ప ఇంకే వాగ్గేయకారుల రచనల్లోనూ కనిపించవు. అలాగే కోకిల ధ్వనీ, గరుడ ధ్వనీ, విజయ వసంతం వంటి పెక్కు రాగాలు త్యాగరాజు సృజనేనని అందరూ విశ్వసిస్తారు.
ఈ వింత రాగాలన్నీ జన్య రాగాలే. సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో ఖచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు. వీటి సంఖ్య 72. ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి. అదంతా సంగీత శాస్త్రంలో చెబుతారు. త్యాగరాజు కృతులు వెలుగు చూసీ, వాటిపై సంగీతకారుల పరిశోధన చేసే వరకూ ఈ వింత రాగాల గురించెవరికీ తెలీదు. త్యాగరాజు శిష్యులక్కూడా ఈ రాగాల జనక రాగాలు తెలిసుండకపోవచ్చని అందరూ భావిస్తారు. త్యాగరాజు తదనంతరం ప్రతీ కృతినీ తీసుకొని వాటి స్వరస్థానాలు బట్టీ, కటపయాది చక్రం (మేళ కర్త రాగాల చట్రం) అనుసరించి వాటి జనకరాగాలు ఇవీ అని నిర్ధారించారు. ఒక్కో సారి ఒకే కృతి రెండు కటకాల్లో వచ్చిన ప్రమాదం కనిపించింది. ఉదాహరణకి ‘రాగ సుధారస పానము’ అనే కృతి ఆందోళిక రాగంలోనూ, మయూరధ్వని రాగం క్రిందా ఉన్న ప్రతులు, 1900 కాలంలో లభించాయి. ఇలా వేర్వేరు రాగాల పేరుతో ఒకే కృతి ఉండడంతో ఏది సరైనదో చెప్పడం కష్టమయ్యింది. ఏది ప్రామాణికంగా తీసుకోవాలా అని సంగీత కారులు చర్చించారు. చివరకి వాలాజపేట వెంకట రమణ భాగవతార్ భద్రపరచినదే సరైనదని నిర్ధారించారు. ఎందుకంటే ఇతనే ఎక్కువ కృతులు భద్రపరిచాడు. అంతే కాకుండా సుమారు 40 ఏళ్ళు పైగా వెంకట రమణ భాగవతార్ త్యాగరాజుతో గడిపాడు. అలా ‘రాగ సుధారస పానము’ కృతి ఆందోళిక రాగం క్రిందే లెక్క కట్టారు.
సంగీతంలో ధాతు, మాతులనే ప్రయోగముంది. ధాతువు అంటే స్వరం. మాతువు అంటే సాహిత్యం. స్వరాలను బట్టీ అవి ఎలా పాడాలో లిఖిత పూర్వకంగా చెప్పే విధానాన్ని ధాతువంటారు. ఉదాహరణకి రాగంలో గమకాలున్న చోట ఒంపుల గీతతో ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ పద్ధతినే ధాతు లిఖితాలంటారు. ఘనరాగ పంచరత్న కృతులే కాకుండా వేరే కృతుల్లో చరణాలు వేర్వేరు ధాతువులు కనిపిస్తాయి. శ్రీ రంజని రాగంలో ‘బ్రోచేవారెవరే’, కాంభోజి రాగంలో ‘శ్రీ రఘువర ప్రమేయ’, ఆరభిలో ‘నా మొరలను విని’, మరియు తోడి రాగంలో ‘నిను వినా సుఖము గన’ కృతులు కొన్ని ఉదాహరణలు. వీటిలో ప్రతీ చరణంలోనూ విశేష ధాతు ప్రయోగంతో రాగ విస్తారణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ. అందులో మొదటి రెండూ, అంటే దివ్యనామ సంకీర్తనలూ, ఉత్సవ సంప్రదాయ కీర్తనలూ త్యాగరాజు ముప్పై ఏళ్ళ లోపులోనే రాసుండచ్చనీ సంగీతకారుల భావన. దివ్యనామ సంకీర్తనల రచనా, సంగీతమూ సరళంగా ఉంటుంది. వాటిల్లో ఒకటీ లేదా రెండూ, మహా అయితే మూడు చరణాలు మించుండవు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఈ రచనలు కనిపిస్తాయి. దివ్య నామ స్వరూపుడిగా రాముణ్ణి భావిస్తూ స్వర పరిచిన కీర్తనలివి. శంకరాభరణ రాగంలో ‘పాహి రామచంద్ర’, ఆనంద భైరవి లో ‘రామ రామనీ’, బలహంస లో ‘రామ సీతా రామా’ కొన్ని ఉదాహరణలు. సుమారుగా 85 దివ్యనామ కీర్తనలు మనకున్నాయి. అలాగే దాదాపు ఓ పాతిక పైగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలున్నాయి. ఈ ఉత్సవ సంప్రదాయ కీర్తనల రచనకి హేతువు ఏటా శ్రీ రామ నవమి కళ్యాణం చేయడం. మధ్యమావతి రాగంలో ‘నగుమోమూ గలవానీ నా మనోహరునీ’, శంకరాభరణంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ వంటివి కొన్ని ఉత్సవ సంప్రదాయకీర్తనలుగా పరిగణిస్తారు.
ఘనరాగ పంచరత్న కీర్తనలు నలభై వయసు దాటిన తరువాతే త్యాగరాజు రచించాడని ఇంతకు ముందు తెలుసుకున్నాం. మధ్య వయస్సులో రాసిన వాటిలో ఎక్కువగా వింత రాగాలే ఉన్నాయి. వీటిల్లో సంగీత విస్తృతి ఎక్కువగా వుంది. సంగతుల ప్రయోగం, మంచి సాహిత్యం కూడా కనిపిస్తుంది. అంత్య దశలో అంటే వయసు అరవై పైబడిన తరువాత చేసిన రచనల్లో మేలైన సంగీతమూ, సున్నితమైన భావ ప్రకటనా కనిపిస్తాయి. బిలహరిలో ‘నా జీవనాధార’, కళ్యాణ వసంతంలో ‘నాద లోలుడై’, కాంభోజి లో ‘ఓ రంగ శాయీ’ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ వర్గీకరణలూ, విభజనలూ అన్నీ 1900 కాలం తరువాత సంగీత కారులు చేసినవి. ఏ కీర్తనెప్పుడు రచించాడన్నది చాలావరకూ ఇదమిథ్థంగా తెలీదు.