స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం

అంతర్జాల ప్రపంచప్రభావాన్ని తట్టుకుందుకు గ్రీకు తత్త్వవేత్తల చిట్కా

“నిన్ను ప్రభావితం చేసి తోలుబొమ్మలా ఆడించే వాటికంటే బలీయమైన,
అద్భుతమైన శక్తి నీలో దాగుందని నువ్వు ఇప్పటికైనా గ్రహించడం మంచిది.”

– మార్కస్ ఆరీలీయస్, (సా.శ. 121-180)

చీకటి ఎలా మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుందో, ఎక్కువ వెలుగు కూడా మనల్ని అలాగే గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం ప్రస్తుతం సరిగ్గా అదే స్థితిలో ఉన్నాం. ఒకప్పటి సమాచారలేమికి బదులుగా, ఇప్పుడు అదుపులేని సమాచార ప్రవాహంతో బాధపడుతున్నాం. హిమపాతంలా కురుస్తున్న భావజాలాల మధ్య మనం దారి తప్పిపోతున్నాం. అయితే, ఈ గుడ్డితనానికి పరిష్కారం లేకపోలేదు. కాని, సహజంగానే, ఆ పరిష్కారం ఈ గందరగోళం మధ్య పుట్టినది కాదు. అది స్థితప్రజ్ఞతావాదం (Stoicism). మీరు ఇంతకు ముందు ఈ మాట విని ఉండొచ్చు. కానీ, ఈ సమాచారయుగంలో మనల్ని చుట్టుముట్టిన భావజాలాల గందరగోళం మధ్య ఈ పురాతన తత్త్వచింతన మన లక్ష్యాలను చేరుకుందుకు ఏ మేరకి మనకి మార్గదర్శి కాగలదో తెలిసి ఉండకపోవచ్చు.

క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో, ఓడ ప్రమాదానికి గురై బ్రతికి బయటపడ్ద సిటియమ్‍ నగరానికి చెందిన బేహారి జీనో (Zeno of Citium) ఈ స్థితప్రజ్ఞతావాదాన్ని మొదట ప్రతిపాదించాడు. ఆ తర్వాత మరిన్ని సంస్కరణలకు గురై, కొన్ని శతాబ్దాలపాటు గ్రీకో-రోమను సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసిన తత్త్వచింతన ఇది.

ఈ స్థితప్రజ్ఞతావాదానికి చెందిన ముగ్గురు తత్త్వవేత్తల రచనలు చాలవరకు యథాతథంగా ఇప్పుడు మనకి అంతర్జాలంలో లభ్యం అవుతున్నాయి. వారు: సెనెకా (Seneca), ఎపిక్టెటస్ (Epictetus), మార్కస్ అరీలీయస్ (Marcus Aurelius). ముగ్గురూ ఎవరిమట్టుకు వారు ప్రత్యేకమైన బాధలు, కష్టాలు అనుభవించిన వారే. సెనెకా రోమను నాటకకర్త. రాజనీతిజ్ఞుడు, చరిత్రలో శాశ్వతమైన అపఖ్యాతి గడించుకున్న నీరో చక్రవర్తికి గురువు; ఎపిక్టెటస్ ఒక గ్రీకు బానిస. అతను గురైన భౌతికమైన హింస కారణంగా శాశ్వతంగా కుంటివాడయ్యాడు; రోమను చరిత్రలో స్వర్ణయుగంగా పిలవబడే కాలంలో, మార్కస్ ఆరీలీయస్ (26 ఏప్రిల్ 121 – 17 మార్చి 180) రోమన్ చక్రవర్తి.

స్థితప్రజ్ఞతావాదులు, జీవితంలో భిన్న సామాజిక స్థాయిలకి చెందిన వారైనప్పటికి, ఈ ఆలోచనలలోని విలువని గుర్తించి, ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారు. దినచర్యగా తన ఆలోచనలు నమోదు చేసుకున్న పుస్తకంలో (Meditations) మార్కస్ ఆరీలీయస్ ఎపిక్టెటస్‍ని కూడా ప్రస్తావిస్తాడు. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన రోమను చక్రవర్తి ఆలోచనా విధానాన్ని ఒక బానిస ప్రభావితం చెయ్యడం అంటే సామాన్య విషయం కాదు! ఇద్దరూ పంచుకున్న ఆలోచనలు విశ్వవ్యాప్తమైనవి.

నిజానికి అవి ఎంత విశ్వవ్యాప్తమైనవంటే, శతాబ్దాలకాలం, దేశకాలాలకి అతీతంగా, విభిన్న భావజాలాలకి చెందిన ఆలోచనాపరులు ఈ చింతనని అనుసరించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి పునాది వేసిన థామస్ జెఫర్సన్, జార్జ్‌ వాషింగ్టన్ ఈ స్థితప్రజ్ఞతావాదానికి అనుయాయులు. నెల్సన్ మండేలా తన 27 ఏళ్ళ జైలు జీవితాన్ని గడపడానికి ఈ వాదాన్నే ఉపయోగించుకున్నాడు. వియత్నాం యుద్ధఖైదీగా పట్టుబడిన అమెరికన్‍ వైస్ అడ్మిరల్, జేమ్స్ బాండ్ స్టాక్‍డేల్ (1923-2005) హనోయ్ హిల్టన్‍లో 7 సంవత్సరాల కారాగార హింసని తట్టుకుందుకు ఈ వాదాన్నే ఆసరాగా చేసుకున్నాడు. అంతే కాదు, అనేక ప్రముఖ మానసిక చికిత్సా విధానాలు — నాజీ మారణహోమాన్నుండి బయటపడిన విక్టర్ ఫ్రాన్కల్ (Viktor Frankl) ప్రతిపాదించిన లోగోథెరపీ (Logotherapy); ఆల్బర్ట్ ఎలిస్ (Albert Ellis) ప్రతిపాదించిన బిహేవియర్ థెరపీ (Rational Emotive Behavior Therapy – REBT) వంటివి — ఈ స్థితప్రజ్ఞతావాదం మీద ఆధారపడినవే. ఈ రోజుల్లో, అంతులేని మానసిక ఒత్తిడికి నిలయాలైన వాల్ స్ట్రీట్, సిలికాన్ వేలీలలో ఈ స్థితప్రజ్ఞతావాదపు సాధన చూడవచ్చు.

చరిత్ర పొడవునా ఈ వాదానికి ఇంత విస్తారమైన ప్రాచుర్యాన్ని తీసుకురావడానికి ఇందులోని విషయం ఏమిటి? ఈ డిజిటల్ యుగంలోని సమస్యలకు ఇది శక్తిమంతమైన పరిష్కారాల్ని ఎలా ఇవ్వగలదు?

స్థితప్రజ్ఞతావాదం నీతిశాస్త్రం (ethics), తర్కశాస్త్రం (logic), జ్ఞానమీమాంస (epistemology) ఆధిభౌతికశాస్త్రం (metaphysics) మొదలైన అనేక శాస్త్రాల మిశ్రమం. కానీ, జీవిత లక్ష్యాలనుండి మనల్ని దారి తప్పించే ఆకర్షణలను గుర్తించడం లోను, వాటినుండి తప్పించుకోవడం లోనూ మార్గదర్శనం చెయ్యగల ఒక కళగా పేర్కొనవచ్చు. ఈ సమాచారవిప్లవయుగంలో, అనునిత్యమూ మనల్ని జీవితలక్ష్యాలనుండి దారి మళ్ళించే లెక్కలేనన్ని ప్రభావశీలమైన ఆకర్షణల తాకిడికి గురవుతూనే ఉన్నాము. ఈ స్థితప్రజ్ఞతావాదం ఈ ఆకర్షణల వర్షంలోంచి మనం మన లక్ష్యాలపై గురిని నిలబెట్టుకోగలగడంలో సహకరిస్తుంది.

స్థితప్రజ్ఞతావాదులు మనకున్న వనరుల్లో అన్నిటికన్నా అమూల్యమైనదిగా ‘కాలాన్ని’ గుర్తించారు. ఎందుకంటే, ఏ పని చెయ్యాలన్నా ముందు మనకు అది అవసరం. అదొక్కటే మనం తిరిగి ఉత్పత్తి చెయ్యలేనిది. అయినప్పటికీ, దాన్ని మనం ఏమాత్రం విలువలేనట్టు దుబారా చేస్తాము.

“మనుషులు తమ వ్యక్తిగతమైన ఆస్తుల్ని కాపాడుకోవడంలో
చాలా పొదుపు పాటిస్తారు; కానీ, కాలాన్ని ఖర్చుపెట్టే విషయానికి వస్తే మాత్రం,
పిసినారిగా ఉండవలసినచోట బాగా దుబారా చేస్తారు.”

– సెనెకా. (సా.శ. 4 – 65)

సెనెకా దృష్టిలో, మనం కాలాన్ని దుబారా చేస్తాం గనుకనే మనకి దేనికీ ఎప్పుడూ ‘తీరుబాటు’ ఉండదు: “మనం ఎప్పుడూ జీవితం మూడునాళ్ళ ముచ్చట అని అంటూనే ఉంటాం. కానీ, ఆచరణలో జీవితానికి అంతం లేదన్నట్టు ప్రవర్తిస్తాం.”

సెనెకా దృష్టిలో కాలాన్ని వృధా చేస్తున్నవారు ‘జీవిస్తున్న’ట్టు కాదు: “మీకు మృత్యువంటే భయం. ఒక విషయం చెప్పండి, మీరు జీవిస్తున్న జీవితం మరణం కంటే భిన్నంగా ఉందా?”

అయితే, కాలాన్ని వృధా చెయ్యకుండా తప్పించుకోవడం ఎలా? మనం నిజంగా ‘జీవించడం’ ఎలా ప్రారంభించాలి?

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, మనం ఆకర్షణలను తప్పించుకోవాలని స్థితప్రజ్ఞతావాదులు గుర్తించారు. మనల్ని ఎక్కువగా దారి మళ్ళించే ఆకర్షణలలో మనం నియంత్రించలేనివే అత్యధికం. మనం వాటిమీద ఎంత దృష్టి పెట్టినప్పటికీ అవి మారవు. కనుక, వాటిమీద మనం దృష్టి నిలపడం వృధా.

ఈ బాహ్యప్రపంచం, మనం నియంత్రించలేని అనేకానేకశక్తుల కారణంగా, నిత్యం అనేకమైన మార్పులకి లోనవుతూనే ఉంటుంది. అయినా, ఈ మార్పులు శాశ్వతమని భావించి మనం వాటిమీద ఆశలు పెట్టుకుంటాం. మనుషుల అభిప్రాయాలు గాలికంటే చంచలమైనవని తెలిసినప్పటికీ ఇతరులు మనగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందుకు ఆరాటపడతాం. మరుక్షణంలో వాడుకలోంచి పక్కకి తప్పుకునే దుస్తులను చూసి, అంతకంటే వేగంగా క్షీణించే అందాన్ని చూసీ గర్విస్తాం. మనం వాడే కార్లలోను, శిధిలమయే భవంతులలోను, వెలవెలపోయే నగల్లోనూ మన విలువ ఉన్నట్టు భ్రమిస్తాం. వాతావరణాన్ని బట్టి, స్టాక్ మార్కెట్‍ను బట్టి, మనకిష్టమైన ఫుట్‍బాల్/క్రికెట్ టీమ్‍ గెలుపు ఓటములను బట్టీ మన మానసికస్థితి కూడా మారుతుంటూంది. వాటిలో ఏ ఒక్కదాని ఫలితాన్నీ మనం ముందుగా అంచనా వెయ్యలేము. ఎందుకు జరుగుతోందో అవగాహన చేసుకోలేం. మనం ఈ క్షణం ఇచ్చే ఆనందానికి ఆరాటపడతాం. కనుకనే, మన ఆనందం కూడా క్షణికమే.

మనం ప్రభావితం చెయ్యలేని విషయాలమీద మన సుఖాన్ని/ఆనందాన్ని పణం పెట్టడం, విధి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేసి, మన సంక్షేమానికి మనం బాధ్యులం కాకుండా నిరోధిస్తుంది. మనం నియంత్రించలేని వాటి మీద దృష్టి పెట్టడం ద్వారా, మనం నియంత్రణని కోల్పోతున్నాము.

“మన నియంత్రణ పరిధిలో లేని వస్తువులకి విలువ ఇస్తున్న కొద్దీ,
మన నియంత్రణ మరింత బలహీనమౌతుంది.”

– ఎపిక్టెటస్ (సా.శ. 50 – 135)

అంచనాలకు లొంగని ఈ ప్రపంచంలో, మనకు శాశ్వతమైన ప్రశాంతత చిక్కాలంటే మనకున్నది ఒకటే మార్గం – మనం పూర్తిగా నియంత్రించగల ఒకే ఒక్క విషయం మీద మనసు లగ్నం చెయ్యడం: మన నడవడిక.

స్థితప్రజ్ఞతావాదులు ‘విడిచిపెట్టిన బాణాన్ని’ తరచూ ప్రతీకగా ఉపయోగిస్తారు: ఒక విలుకాడు తాను ఎంత ఏకాగ్రతతో లక్ష్యాన్ని చూడగలడో, ఎంత నైపుణ్యంతో బాణాన్ని విడిచిపెట్టగలడో అన్న విషయాలమీద మాత్రమే నియంత్రణ ఉంటుంది. వీచే గాలిని నియంత్రించలేడు. గాలి విసురు బాణాన్ని లక్ష్యం నుండి తప్పించవచ్చు. కనుక, విలుకాడు చెయ్యవలసిన పని – లక్ష్యాన్ని గురి చూసి, తన నైపుణ్యం మేరకు బాణాన్ని విడిచిపెట్టడం. బాణాన్ని విడిచిన తర్వాత ఏమి జరుగుతుందన్నది అతని పరిధిలో లేదు.

స్థితప్రజ్ఞతావాదుల ప్రకారం, మోక్షం మన నియంత్రణలో లేని బాహ్య ప్రపంచంలో లేదు. మనం నియంత్రించ గలిగిన, మన’లో’ ఉంది.

ఏమి జరిగిందన్నది కాదు,
దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావన్నది చాలా ముఖ్యం.

– ఎపిక్టెటస్

మనకి ప్రియమైన వాళ్ళ భవితవ్యాన్ని గాని, కృశించే మన శరీరాలని గాని, మనం నియంత్రించలేము. కానీ, మన ఆలోచనావిధానాన్ని మార్చుకోవడం ద్వారా వాటిని ఎలా అనుభవిస్తామన్న దానిని నియంత్రించగలం. మన ప్రతిస్పందనలలో సంయమనం (నిగ్రహం) పాటించడం ఈ వాదనలోని కీలకమైన భావన. ఎందుకంటే, మనం నియంత్రించగలిగిన వికల్పాలలో (distractions), ఎక్కువ భాగం స్వాగతించ యోగ్యం కాని ఆవేశాలు. స్థితప్రజ్ఞతావాదులు వాటిని ‘గుణాలు’ అంటారు. హాని కలిగించే వస్తువులకంటే, తరచు వాటిని గురించి మన భావనలే మరింత హాని కలిగిస్తాయని వారు గుర్తించారు. మనని భయపెట్టే వస్తువుకంటే, ‘భయపడడం’ మనల్ని ఎక్కువ అశక్తుల్ని చేస్తుంది. మనకి ఆగ్రహాన్ని కలిగించే వస్తువుకంటే ఆగ్రహించడం మనకి పిచ్చెక్కిస్తుంది. ద్వేషించే వస్తువుకంటే, ద్వేషం ఎక్కువ విషపూరితమైనది.

“జీవితంలో మనకి ఎదురైన సంఘటనలకి నష్టపోము;
వాటి గురించి మన నిర్ణయాల వల్లనే ఎక్కువ నష్టపోతాం.”

– ఎపిక్టెటస్

“వాస్తవం కంటే, ఆలోచనలలోనే మనం
ఎక్కువ దుఃఖం అనుభవిస్తాం.”

– సెనెకా

ముఖ్యంగా మూడు గుణాలు (ఆవేశాలు) మనలో ప్రవేశించి నిష్కారణంగా మన జీవితాలని ఒత్తిడికి గురి చేస్తాయి: కోరిక, కోపం, చింత (వ్యాకులత). ఇందులో ప్రతి ఒక్క ఆవేశమూ ఈ డిజిటల్ యుగంలో ఒక్కొక్క సమస్యని తెచ్చిపెడుతుంది. ప్రతి సమస్యకీ, స్థితప్రజ్ఞతావాదంలో పరిష్కారం దొరుకుతుంది.

కోరికతో ప్రారంభించి, ఈ మూడు ఆవేశాలనీ స్థితప్రజ్ఞతావాదం ఎలా ఎదుర్కుంటుందో చూద్దాం.

కోరిక (Desire)

క్రమక్రమంగా మానవ జీవితం ఆకలి నుండి తప్పించుకునే ఆరాటం నుండి వ్యసనాలను తప్పించుకునే ఆరాటం వైపు మళ్ళుతోంది. సరికొత్త సౌకర్యాలు, సాధనాలూ అందుబాటులో ఉండి మనల్ని రోజూ ఎంతగా అలరిస్తున్నాయంటే, మొదటిది పూర్తిగా అర్థం చేసుకుని అనుభవించేలోగా రెండవది మనముందు ప్రత్యక్షమౌతోంది.

అంతర్జాలం లోని పర్యావరణం మన మెదడులోని ఇంద్రియజనిత సంతృప్తివ్యవస్థని (Dopamine reward pathway) దారి మళ్ళించి మనల్ని లోబరచుకుని నియంత్రిస్తోంది. మౌలికంగా అది స్కినర్ బాక్స్ (Skinner Box) సూత్రాలమీద ఎక్కువగా ఆధారపడి నిర్మించబడింది. ఈ సూత్రాల ప్రకారం, ఒక ఎలుకకి ఒక మీటను లాగడం మప్పి, అలా కొన్నిసార్లు లాగిన తర్వాత దానికి ఇష్టమైన వస్తువు బహుమతిగా ఇవ్వడం అలవాటు చేస్తే, ఆ ఎలుక నిత్యం ఆ మీటను లాగుతూ జీవితమల్లా గడుపుతుంది.

అలాగే, అంతర్జాలం కూడా. ఊరించే కొన్ని బొమ్మల మీద నొక్కడానికి ఉసికొలిపి, అవి మనకు కావాలని నమ్మించి, వాటి వెంట మనం పరిగెత్తేలా చేస్తుంది. అంతర్జాలంలో సుమారుగా, ప్రతి పేజీ – ప్రకటనలతో, మన దృష్టిని ఆకర్షించే శీర్షికలు, బొమ్మలతో లేదా దొడ్డిదారిన, మన బలహీనతలకి/ఇష్టాలకి దగ్గరగా ఉన్న వస్తువుల సూచనలతో లేదా కొన్ని వీడియోలు చూపించి నోరూరిస్తూ, మధ్యలో ఆపి, తర్వాత ఏమవుతుందో చూడండి అని ప్రోత్సహిస్తూనో, లేదా కఠినమైన సమస్యలకి సులభమైన సమాధానాలు ప్రవచించే మాటకారులతోనో, కొన్ని మాటలు టైపు చేసి, ‘పంపు’ నొక్కగానే సామాజిక మధ్యమాల్లో తక్షణం ఆమోదం లభిస్తుందన్న వాగ్దానాలతోనో – మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.

మనం సుళువుగా ఈ ఆకర్షణలకి లొంగి అవి కావాలని దారి మళ్ళుతాం. ఎందుకంటే, మనకి కావలసింది కూడా అదే. అది జీవితంలోని బాధల్ని మరిచిపోయేలా చేస్తుంది. కానీ, అలా చేయడం ఆ బాధల్ని మనం సరిదిద్దలేకుండా నిరోధిస్తుంది కూడా. కుతూహలాన్ని రేకెత్తించే ప్రతి చిన్న విషయానికీ లక్ష్యం మీద మన ఏకాగ్రత సడలేలా లొంగుతుంటే, జీవితంలో మనం ఎన్ని అడ్దదారుల్లో ప్రయాణించవలసి వస్తుందంటే, మనం కోరుకున్న జీవితాన్ని మనం జీవించలేకపోతాము. ప్రతి దాని వెంటా పరిగెడుతుంటే, మనం ఏదీ సాధించలేము.

“అన్నిచోట్లా ఉండడం అంటే ఎక్కడా లేకపోవడం.”

– సెనెకా

ఈ రోజు మనల్ని బాధిస్తున్న అన్ని ఆవేశాల్లో ముఖ్యంగా మనం నియంత్రించుకోవలసింది ‘కోరిక’ని. మనం దేనిని సాధించదలుచుకున్నామో అది నిర్ణయిస్తుంది. దానితోపాటే జీవన గమనాన్ని కూడా నిర్దేశిస్తుంది. మన కోరికే మన భవితవ్యం.

మన ఆకాంక్షలు మన జీవితాల మీద స్వారీ చెయ్యకుండా ఉండే మార్గం ఏమిటి? ప్రతిదాన్నీ సాధించాలని ఆశిస్తూ చివరకి మనం ఏదీ సాధించకుండా మిగిలిపోయే పరిస్థితిని తప్పించుకునే మార్గం ఏమిటి? సమస్యకి సమాధానం ముందుగా మనకి అవసరం లేని, మనల్ని ఏమాత్రం సుఖంగా, ఆనందంగా ఉంచలేని లేదా మనకి ఏ రకంగానూ ఉపయోగం లేని వస్తువులని మనం ఆశించేలా చేస్తున్నారని గ్రహించడం.

మనం గాఢంగా కోరుకుంటున్న వస్తువుల్లో చాలావరకు కోరుకుంటున్నప్పటికంటే, వాటిని సాధించిన తర్వాత అవి మనకి ఇచ్చే సంతృప్తి చాలా తక్కువ. కోరుకుని సాధించిన వస్తువులు మనకి ఇచ్చే సంతృప్తికంటే, అవి సాధించలేకపోవడం వల్ల కలిగే అసంతృప్తి చాలా ఎక్కువ. అంతే కాదు, మనం ఎంత ఎక్కువగా వస్తువులను వాంఛిస్తామో, అంత ఎక్కువగా మనం బాహ్యశక్తుల దయాదాక్షిణ్యాలకి తల ఒగ్గవలసి వస్తుంది. అవి ఏ క్షణంలోనైనా ఆ వస్తువు మనకి దక్కకుండా చెయ్యవచ్చు. ఆ విధంగా కోరిక పెరుగుతున్న కొద్దీ, అంత ఎక్కువగా నిరాశా నిస్పృహలకి లోనయే అవకాశాన్నీ పెంచుకుంటున్నాం.

అస్థిరమైన ఈ బాహ్యప్రపంచంలో మన సంతృప్తికి మూలకారణమైనది ఏదీ లేదని, అది మనం చూసే దృష్టికోణంలో ఉందనీ స్థితప్రజ్ఞతావాదులు అర్థం చేసుకున్నారు. అప్పట్లో, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మార్కస్ ఆరీలీయస్ ఇలా రాసుకున్నాడు: “సుఖవంతమైన జీవితం గడపడానికి నిజానికి కావలసింది అతి స్వల్పం. అది నీలోనే ఉంది. నీ ఆలోచనా విధానంలో ఉంది.

సాటి స్థితప్రజ్ఞతావాదులు అతనితో ఏకీభవించారు.

“తన దగ్గర ఏమీ లేనీ వ్యక్తి కాదు, ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించే వ్యక్తే దరిద్రుడు.”

– సెనెకా

“సంపద అంటే సమస్తవస్తుసంచయాన్ని కలిగి ఉండటం కాదు;
అతి తక్కువ కోరికలు కలిగి ఉండడం.”

– ఎపిక్టెటస్

స్థితప్రజ్ఞతావాదంలోని నాలుగు ముఖ్యమైన లక్షణాలలో మితవర్తనం (Temperance – sophrosyne) మొదటిది. వ్యతిరేకవాదులైన ఎపిక్యూరియన్లలా కాకుండా, స్థితప్రజ్ఞతావాదులు తమ కోరికలకి కళ్ళాలను వేసి ఉంచారు. ఎందుకంటే, మనం కోరుకున్న వస్తువులకి దూరంగా ఉన్నప్పుడే వాటి అవసరం మనకు లేదన్న విషయం గుర్తిస్తామని వారు గ్రహించారు.

“కోరుకున్న వస్తువు లేకుండా బ్రతకడం ప్రారంభించేదాకా,
మనకి ఎన్ని వస్తువులు అవసరం లేదో మనం గుర్తించలేము.
చాల వస్తువుల్ని మనం ఉపయోగిస్తున్నామంటే, వాటి అవసరం ఉండి కాదు;
అవి లభ్యమౌతుండడం.”

– సెనెకా

ఈ అంతర్జాల యుగానికి చెందిన ప్రత్యేకసమస్య కూడా ఇదే. ఏ లక్ష్యం లేకుండా యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాం. లేదా ట్విటర్‍లో పోస్టులు చూసుకుంటూ పోతుంటాం. ఎందుకు చేస్తాం అంటే అవసరం ఉండి కాదు, అలా చెయ్యడానికి అలవాటు పడడం వల్ల. యాంత్రికంగా అటువంటి పనులు చేయగలిగిన శక్తి లేకపోయినంత మాత్రాన మన జీవితాల విలువ ఎంతమాత్రం తరిగిపోదు (నిజానికి పెరుగుతుంది).

ఈ సందర్భంలో స్థితప్రజ్ఞతావాదులు ఇచ్చే సలహ ఒకటే: మన దృష్టిని తమవైపు ఆకర్షించే వస్తువులని అంచనా వేసుకోమని. మనకి మనం నిజాయితీగా ఆ వస్తువులు అవసరమైనవా? లేక అవి మనకి అవసరమని ప్రలోభపెడుతున్నవా? అని అంచనా వేసుకోవాలి. ఈ సారి యూట్యూబ్‍లో ఒక పిల్లి వీడియో చూడాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: ఈ వీడియో మీకు నిజంగా ఆనందాన్ని కలిగిస్తోందా? మీ జీవితాన్ని మెరుగు పరుస్తోందా? కాదు అని సమాధానం వస్తే, నిశ్చయంగా దాన్ని చూడాలన్న కోరిక మీకు వికల్పమే. దాన్ని మీరు ఉపేక్షించవచ్చు. కొద్ది సేపట్లో మీరు దాన్ని మరిచిపోతారు. ఒకసారి మన జీవితం లోంచి మనకు అవసరం లేని వాటినన్నిటినీ పరిహరిస్తూ పోతే, మన దృష్టిని అవసరమైన వాటిమీద కేంద్రీకరించి, తద్వారా అత్యధికమైన సంతృప్తిని పొందగలం.

“అతి తక్కువ వస్తు సంచయంతో జీవించడం నేర్చుకుంటే,
మీకు నిజంగా కావలసిన వస్తువులకి చోటు లభిస్తుంది.”

– సెనెకా

ఆందోళన (Anxiety)

చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణ హెచ్చరిక ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దాన్ని చూపించడానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మన ఉనికిని సవాలు చేసే చెడు వార్తలపట్ల, మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు (నెగటివిటీ బయాస్) వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు. ఫలితంగా, అంతర్జాలంలో ఎక్కడపడితే అక్కడ విషాద వార్తలు, దుర్ఘటనలే కనిపిస్తూ ఉంటాయి. నిత్యమూ ఇటువంటి వార్తలు చదువుతూ, వీడియోలు చూడటం మనలో ఆందోళన రేపుతుంది. ఇదికూడా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మనకి ఉగ్రవాదం అంటే భయం ఉంటే, మనం దానికి చెందిన విషయాలమీదనే క్లిక్ చేసే అవకాశం ఎక్కువ. ఈ ప్రతిపుష్టి (feedback) ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. ఈ ప్రపంచం చాలా దుర్మార్గమైనదని అందరికీ తెలుసు. విషాద సంఘటనలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. స్థితప్రజ్ఞతావాదులు ఈ ప్రపంచంలోని దుఃఖాలు ఎంత ప్రబలమైనవో గుర్తించారు.

“జీవితం అంతా కన్నీళ్ళమయం అయినప్పుడు,
అందులో కొన్ని భాగాలకే వగచే అవసరమేమిటి?”

– సెనెకా

మన అభీష్టాలకి వ్యతిరేకంగా ఎప్పుడూ నడిచే ఈ ప్రపంచంలో, అనుకూలంగా జరగని విషయాలకి చింతించడం- జీవితం చివరి వరకూ, దుఃఖమయమై, కష్టాల కలనేతగా మారేందుకు దోహదం చేస్తుంది. స్థితప్రజ్ఞతావాదులు ఋణాత్మక ఆవేశాలు (negative emotions) ఆ ఆవేశానికి కారణమైన వస్తువులకన్నా ఎక్కువ హాని చేస్తాయని గుర్తించారు. అందులో ఆందోళన కూడా ఉంది. అవి ఏవీ మన సమస్యలకి పరిష్కారాన్నివ్వవు సరి కదా, వాటి ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తాయి.

“సమస్యలకి వగస్తూ వాటిని మరింత భారం చేసుకోవడం
మనకి ఏ రకంగా ఉపయోగిస్తుంది?”

– సెనెకా

సమస్యల గురించి చింతిస్తూ వాటిని మరింత భారం చేసుకోవడం వదిలించుకోవాలనుకుంటే, ఆ సమస్యలకి మన ప్రతిస్పందనలను నియంత్రించడం అలవరచుకోవాలి. మన నియంత్రణలో లేని విషయాలపై తీర్పులు ప్రకటించవలసిన బాధ్యత మనకు లేదన్న విషయం మొట్టమొదటిగా గ్రహించాలి. వాటిని మంచి చెడ్డలు నిర్ణయించడం గాని, లేదా ఎలా జరిగితే బాగుంటుందో సరిపోల్చడం గాని చెయ్యవలసిన పని లేదు.

“ఏ అభిప్రాయమూ కలిగి ఉండనవసరం లేని హక్కు మనకి ఎప్పుడూ ఉంది.
మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆవేశపడి, మనసు ఆందోళనకు
గురి కానక్కర లేదు. అవి మిమ్మల్ని తీర్పు చెప్పమని బ్రతిమాలడం లేదు.
వాటి మానాన వాటిని విడిచిపెట్టండి.”

– మార్కస్ ఆరీలియస్

స్థితప్రజ్ఞతావాదులు విధి వ్రాలుని ప్రేమించడం (amor fati, Love for fate) గురించి ప్రస్తావించేరు. దాని సారం, మన నియంత్రణలో లేని వాటి మంచి చెడ్డల గురించి నిర్ణయాలు వెలిబుచ్చడం కంటే, వాటిని ఆవశ్యకాలుగా గ్రహించి, వాటిని తిరుగులేని సత్యాలుగా స్వీకరించడం. అంత మాత్రం చేత మనం ఏమీ చెయ్యకుండా ఊరికే కూచోమని కాదు. మనం పరిష్కరించగలిగిన సమస్యలని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి. కాని వాటి గురించి విచారిస్తూ కూచోకుండా, వాటి ఉనికిని గుర్తించి, సిద్ధంగా ఉండటం ద్వారా, జీవితంలో ఆ సమస్యలు ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోగలం.

“భవిష్యత్తు గురించి మీరు ఎన్నడూ విచారించకండి.
ఆ జరిగేదేదో జరిగినపుడు, వర్తమాన సమస్యలని ఎదుర్కోడానికి ఏ తార్కిక సాధనాలు
ఉపయోగిస్తున్నారో, వాటితోనే రానున్నవీ ఎదుర్కోగలరు.”

– మార్కస్ ఆరీలియస్

భవిష్యత్తు గురించి విచారిస్తూ కూర్చునేకంటే, వర్తమానంలో మీరు ఏమి చెయ్యగలరో దానిమీద దృష్టి పెట్టండి. ఆందోళన మీ ఆలోచనలనుండి పుట్టినది. కనుక ఆందోళన తగ్గాలంటే, ఆలోచనా సరళి మార్చుకోవలసిందే!

“ప్రతీదీ మన ఆలోచనలమీద ఆధారపడినదే.
ఒక వ్యక్తి సంతోషంగా లేడంటే, అతను ఆ విషయాన్ని నమ్మబట్టే.”

– సెనెకా

ఈ సందర్భంలో, వాస్తవాన్నీ మన స్పందననీ స్పష్టంగా విడదీసి చూడగల ఒక సాధనం నేను కనిపెట్టాను. ప్రతి అభిప్రాయానికీ ముందు ‘నా అభిప్రాయంలో’ లేదా ‘నేను భావిస్తున్నాను’ అని తగిలించడం. ఉదాహరణకి ‘ఇవాళ చాలా ఘోరమైన రోజు’ అనడానికి బదులు, ‘ఇవాళ చాలా ఘోరమైన రోజని నాకు అనిపిస్తోంది’ అనుకోండి. అప్పుడు సమస్య రోజులో కాక, మీరు ఎలా అనుకుంటున్నారన్నదాని మీద ఉంటుంది. ప్రపంచాన్ని మార్చడం కంటే, మన ప్రతిస్పందనని మార్చుకోవటం చాలా తేలిక.

నిత్యం యుద్ధాలతో, కరువు, వరదలు, క్షామం, అంటువ్యాధులు, కుట్రలతో సతమతమయే రోమను చక్రవర్తి ఆరీలీయస్ ఇలా రాసుకున్నాడు: “ఇవాళ నేను ఆందోళన బారి నుండి తప్పించుకున్నాను. కాదు కాదు. నేను ఆందోళనని విడిచిపెట్టగలిగాను. ఎందుకంటే, అది నాలోనే ఉంది, నా ఆలోచనా సరళిలో ఉంది. బయట వేరే ఎక్కడా లేదు.”

ఆగ్రహం

స్థితప్రజ్ఞత కోరికకీ ఆందోళనకీ సమాధానం కావొచ్చు. కానీ, ఈ డిజిటల్ యుగంలో సామూహికంగా ఉత్పత్తి చెయ్యబడుతూ, మన ఏకాగ్రతను చెడగొట్టే, అన్ని గుణాల్లోనూ అణచ సాధ్యం కాని, మూడో గుణం – ఆగ్రహం – మాట ఏమిటి?

అంతర్జాలం మనల్ని తరచూ గురిచేసే ఆవేశాలలో ‘ఆగ్రహం’ ముందుంటుంది. మనల్ని నియంత్రించడానికి, ప్రయత్నపూర్వకంగా ఆగ్రహానికి గురిచేసే వ్యక్తుల్ని- అంటే, ఆందోళనలు, ప్రచారమూ (agitprop) లక్ష్యంగా ఉపన్యసించే వక్తలు; ఆవేశాన్ని, భయాన్నీ రగుల్కొలిపే విధంగా శీర్షికలుంచే (rage bait) పాత్రికేయులు; కొంటె వ్యాఖ్యలతో ఆటపట్టించే వ్యాఖ్యాతలు – ఎదుర్కోవడమే కాదు, అసంకల్పితంగా, అసత్య ప్రచారాల ద్వారా, అజ్ఞానం వల్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మనకి ఆగ్రహాన్ని తెప్పించే వందలమంది సాధారణ వ్యక్తుల్ని కూడా మనం ఎదుర్కోవలసి వస్తుంది.

తక్కిన ఆవేశాల్లాగే కోపం కూడా కోపకారణం కంటే ఎక్కువ చెడుపు చేస్తుందని స్థితప్రజ్ఞతావాదులు గుర్తించారు. అది నిల్వచేసిన పాత్రను హరించే ఆమ్లం లాంటిది. కోపం ఆనందాన్నిచ్చే అనుభూతి కాదు. కనుకనే మనల్ని బాధిస్తుంది. అది మన దృష్టిని మరలించటంతో పాటు కాలాన్నీ మనశ్శాంతినీ హరిస్తుంది. అంతే కాదు, కోపం మనం నిగ్రహం కోల్పోయేలా చేసి, పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. ఎవరో చేసిన కొంటె వ్యాఖ్యకి మీరు స్పందించి, ‘దెబ్బకిదెబ్బ’ తీద్దామనుకున్నారో, అప్పటి నుండి అనవసరంగా ఒకరిమీద ఒకరు వేసుకునే చెణుకుల యుద్ధానికి మీ సమయమూ మనశ్శాంతీ ఖర్చయిపోతాయి.

సెనెకా ఈ ‘దెబ్బకిదెబ్బ’ తియ్యడం అన్న భావనలోని అసంబద్ధత గురించి ఇలా అంటాడు: “ఒక గాడిద తన్నిందని దాన్ని తిరిగి తన్నడాన్ని, కుక్క కరిచిందని కుక్కని తిరిగి కరవడాన్నీ సాధారణమేనని ఎవరైనా ఊహించగలరా?”

మనల్ని అనవసరంగా బాధకి గురి చెయ్యడమే కాదు, ఇతరులు మనల్ని సులభంగా నియంత్రించేందుకు కోపం తోడ్పడుతుందని ఎపిక్టెటస్ గుర్తించాడు: “మీకు కోపం తెప్పించగలిగిన వ్యక్తి మీ మీద ఆధిపత్యం వహించగలడు.”

ఈ డిజిటల్ యుగంలో, సర్వవ్యాప్తమైన కోపకారణాలు మనల్ని రేపెట్టకుండా నిరోధించుకోవాలనుకుంటే, మన కాలాన్నీ మనశ్శాంతినీ కొల్లగొనేవారు మన అనుమతి లేకుండా అలా చెయ్యలేరని ముందుగా గుర్తించాలి. ఎన్ని చెప్పినా, చివరకి మన ఆవేశాలకి కాపలాదారులం మనమే!

“ఎవరైనా మిమ్మల్ని రేపెట్టడంలో సఫలీకృతుడవుతున్నాడంటే,
అందులో మీ మనసు కూడా భాగస్వామి అన్న విషయం మరచిపోవద్దు.”

– ఎపిక్టెటస్

ఇతర రక్తపిపాసుల్లాగే, కాల-రక్త పిపాసి మీ ఆహ్వానంతోనే మీలోకి చొరబడుతుంది. ఆ అనుమతి నిరాకరించడం ఎలా? మన అనుభూతితో నిమిత్తం లేకుండా, ఇతరులు మనల్ని ఎప్పుడూ ఆగ్రహానికి గురి చేసేలా ప్రవర్తిస్తారని ముందుగా అర్థం చేసుకోవాలి.

“ఎవరైనా సిగ్గుమాలిన వ్యక్తి మీకు తారసపడినప్పుడు మిమ్మల్ని మీరు
ఇలా ప్రశ్నించుకోండి: ప్రపంచంలో సిగ్గుమాలినవాళ్ళు లేకుండా చెయ్యడం సాధ్యపడుతుందా?
సాధ్యపడదు. అటువంటప్పుడు అసాధ్యమైన విషయాన్ని కోరుకోవద్దు.
ప్రపంచంలో సిగ్గుమాలిన వాళ్ళు ఉండక తప్పదు. వాళ్ళలో ఈ వ్యక్తి ఒకడు.”

– మార్కస్ ఆరీలియస్

స్థితప్రజ్ఞతావాదులకి – futurorum malorum præmeditatio – అన్న భావన ఉంది. దానినే ఇపుడు మానసిక చికిత్సలో negative visualization అని పిలుస్తున్నారు. దాని ప్రకారం, ప్రపంచం గురించి మన అంచనాలను కుదించుకుని, అంటే ఉండగలిగినంత సంస్కారహీనంగా ప్రపంచాన్ని ఊహించుకుని, దానికి తగినట్టుగా సిద్ధపడి ఉండడం.

ప్రతిరోజూ ఉదయాన్నే తనని ఆగ్రహం తెప్పించే విధంగా ప్రజలు ప్రవర్తించేట్టు ఊహించుకుని మార్కస్ ఆరీలీయస్ దానికి తగ్గట్టుగా సిద్ధమయేవాడట: “మీరు ఉదయాన్నే నిద్రలేవగానే, మీకు మీరు ఇలా చెప్పుకోండి: ఈ రోజు నేను కృతఘ్నులు, అహంకారులు, నిజాయితీ లేనివాళ్ళు, అసూయాపరులు, సభ్యతాహీనులు, అనవసరంగా జోక్యం చేసుకునే వాళ్ళతో వ్యవహరించవలసి ఉంది.”

మన సహనాన్ని పరీక్షించే వారితో వ్యవహరించవలసి వస్తుందని ముందుగా ఊహించినపుడు, మనం మరింత సహనంతో ఉండగలం. ఎందుకంటే, ఆగ్రహం తెప్పించే ప్రవర్తన అంటే ఏమిటో ఎదురుగా కళ్ళముందు కనిపిస్తుంటుంది. అది ప్రకృతిలో జరిగే అరుదైన సంఘటన కాదు – అనివార్యమైన సంఘటన. రాబోయే ఆవేశాన్ని ముందుగా ఊహించడం వల్ల, దాని ప్రభావం మనమీద పలచబడుతుంది. మీకు ఆగ్రహాన్ని తెప్పించే వాళ్ళని సరిదిద్దడం మీద శక్తినంతా పెట్టడానికి బదులు, అది ఎలాగూ అసాధ్యమే కనుక, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం మీద కేంద్రీకరించండి.

“మనని గాయపరచినవాడికి చెయ్యగలిగిన ఉత్తమోత్తమమైన ప్రతీకారం
ఆ వ్యక్తిలా ప్రవర్తించక పోవడమే.”

– మార్కస్ ఆరీలియస్

ఉత్తమోత్తమమైన ప్రతీకారం స్థితప్రజ్ఞుడిగా ఉండటమే. కాని, స్థితప్రజ్ఞుడిగా ఉండడం ఎలా?

స్థితప్రజ్ఞ జీవనం (The stoic life)

మనం స్థితప్రజ్ఞవాదులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకున్నాం. ఈ డిజిటల్ యుగంలో స్థితప్రజ్ఞుడు ఎలా ప్రవర్తించాలి?

స్థితప్రజ్ఞతావాదులు మన వ్యక్తిత్వంలో మార్పు ఒక్కపెట్టున రాదని, అది అంచెలంచెలుగా, నిలకడగా కొన్ని సంవత్సరాల కాలంలో కొద్ది కొద్ది మోతాదులలో వస్తుందనీ గ్రహించారు. అందుకని వాళ్ళు అర్థవంతమైన అలవాట్లు అలవరచుకోవడం ఆవశ్యకమని గ్రహించారు. స్థితప్రజ్ఞతావాదంలో మరొక మౌలికమైన భావన: మీరు దేనిని క్రమం తప్పకుండా ఆచరిస్తారో, మీరు ఆ విధంగా తయారౌతారు.

“ఏ ఆలోచనలను మీరు మనసులో నిత్యం నిలుపుకుంటారో,
మీ మనసు ఆ రూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే, మానవ చైతన్యం
ఆ ముద్రలతో రంగరించబడే విధంగా రూపుదిద్దబడింది.”

– మార్కస్ ఆరీలియస్

“మీరు దేనిమీద శ్రద్ధ నిలుపుతారో దానిలా తయారౌతారు.
మీరు ఏ భావనల మీద, ఏ రూపురేఖల మీద
మనసు లగ్నం చెయ్యాలో నిర్ణయించుకోలేనపుడు, ఆ పని మరొకరు చేస్తారు.
వారి ఆశయాలు ఉత్తమోత్తమమైనవి కాకపోవచ్చు.”

– ఎపిక్టెటస్

కాబట్టి, మీ మనసుకి రూపురేఖలు కల్పించడానికి, మీ ప్రతిస్పందనలకి ఒక ఆకారం ఇవ్వాలి.

“మీ మనసులో ఏ ఆలోచనలకు, ఆకారాలకు
స్థానం ఇవ్వాలన్న విషయంలో, విచక్షణ పాటించండి.”

– ఎపిక్టెటస్

ఆలోచనల, బొమ్మల వరదతో మనల్ని ముంచెత్తుతున్న సమకాలీన ప్రపంచంలో ఇది మరీ ముఖ్యం. ఎప్పటికన్నా ఇప్పుడు, మనం ఏవి చూడాలన్న నిర్ణయం మన చేతుల్లో ఉంచుకోవాలి. లేకపోతే, ఆ కెరటాల తాకిడికి లోబడి, అంతర్జాల పర్యావరణానికి బానిసలం అయిపోతాం. అయితే అదృష్టవశాత్తూ మనం స్పందించే విషయాలని ఎన్నుకుందుకు మునపటికన్నా ఇప్పుడు అనేక మార్గాలున్నాయి: మనకి కనిపించే/వినిపించే సమాచారాన్ని వడపొయ్యడం (Curating information feeds), మనం ఎవరి గురించి ఆలోచిస్తామన్నది నియంత్రించడం.

“మూలసూత్రం, మనల్ని ఎవరు ఉదాత్తులుగా చెయ్యగలరో,
మన అంతశ్శక్తిని బయటకి తీసుకురాగలరో అటువంటి వాళ్ళ సహచర్యాన్ని కోరుకోవడం.”

– ఎపిక్టెటస్

అయితే స్థితప్రజ్ఞత కేవలం విపర్యయాల నుండి/ ఆకర్షణల నుండి తప్పించుకోవడం ఒక్కటే కాదు; ముఖ్యమైన విషయాల మీద దృష్టి నిలపడం కూడా. స్థితప్రజ్ఞతావాదుల ప్రకారం అన్నిటిలోకీ ముఖ్యమైనది వ్యక్తిత్వం (శీలం).

మన నడవడిక మీద దృష్టి పెట్టడం ఎలా? స్థితప్రజ్ఞతావాదులు ఒక నియమం ప్రకారం ఆత్మ-విమర్శ చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టేవారు. ఇది ముఖ్యంగా ప్రతిరోజూ, కొన్ని నిముషాలపాటు, దినచర్యని అక్షరబద్ధం చెయ్యడం ద్వారా సాధించేవారు. ఆ సమయంలో తమ గురించి తాము కొన్ని ప్రశ్నలు వేసుకునేవారు.

“ప్రతి రాత్రీ నిద్రకి ఉపక్రమించే ముందు, మనని మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి:
ఈ రోజు నేను ఏ బలహీనతని విడిచిపెట్టగలిగాను?
ఈ రోజు ఏ సుగుణాన్ని అలవరచుకోగలిగాను?”

– సెనెకా

స్థితప్రజ్ఞతావాదులు వేసుకునే ఇతర ప్రశ్నలు ఇలా ఉంటాయి:

“రేపు నేను ఏమి చెయ్యబోతున్నాను?”

“నిన్నటి లక్ష్యాలని నేను ఎంత బాగా అందుకో గలిగాను?”

“నాకు ఏది ముఖ్యం?”

“నేను వేటికి కృతజ్ఞుడిగా ఉంటున్నాను?”

“ఈ సంవత్సరాంతానికి నేను సాధించదలుచుకున్నది ఏమిటి?”

“నేను దేనికి ఎక్కువ భయపడుతున్నాను?”

“ఈ రోజు ప్రవర్తించినట్టు ప్రతిరోజూ ప్రవర్తిస్తే, 10 సంవత్సరాల తర్వాత నేను చేరుకోగల లక్ష్యం ఏమిటి?”

ఇటువంటి ప్రశ్నలు ప్రతి రోజూ మనల్ని మనం వేసుకోవడం ద్వారా, మన ఆలోచనల మీద, ఆవేశాల మీద, ఆచరణల మీదా నియంత్రణ సాధించగలుగుతాం. ఏ గమ్యం లేకుండా నిర్లిప్తంగా గాలికి కొట్టుకు పోయే ఎండుటాకులా కాకుండా, మన రోజువారీ చర్యలని ముందుగా ఒక ప్రణాళిక వేసుకుందుకు అవకాశం ఉంటుంది.

మార్కస్ ఆరీలీయస్ ఉదయాన్నే ముందు దినచర్య రాసుకోవడాన్ని ఇష్టపడేవాడు. (అతని దినచర్య, Meditations అంతర్జాలంలో లభిస్తుంది.) తన దినచర్యని తన గురించి తాను తెలుసుకుందుకు, ఆ రోజు అందుకోవలసిన లక్ష్యాలను నిర్ణయించుకుందుకు, దానికి తీసుకోవలసిన చర్యలు ముందుగా నిశ్చయించుకుందుకూ వాడుకునేవాడు. అందరిలా, ఉదయాన్నే లేవగానే సామాజిక మాధ్యమాలని తెరవడం కాకుండా (అందులో మీ దినచర్యని ఇతరులు నిర్ణయిస్తారు), మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

క్రమం తప్పకుండా, ఏకాంతంలో మీ ఆలోచనలను అవలోకనం చేసుకోవడం మునపటికంటే ఇప్పుడు ఎక్కువ ఆవశ్యకం. ఎందుకంటే, రోజులో ఎక్కువ భాగం మన దృష్టి బయట విషయాల మీద, మిణుకు మిణుకుమనే తెర మీదా లగ్నమై ఉండి, మనం మన స్వంత ఆలోచనలకి దూరంగా గడుపుతాం. మన నుండే మనం దూరమైపోయినప్పుడు, తక్కిన ఆకర్షణల నుండి మనం తప్పించుకోలేము.

“ఏ తీరం చేరాలో నావికుడికి తెలియనపుడు,
ఏ పవనమూ అనుకూలం కాదు.”

– సెనెకా

దినచర్య రాసుకోవడం ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవడం మన ప్రగతి ఏ దిక్కుగా ప్రయాణిస్తోందో పరిశీలించి, అంచనా వేసుకుందుకు అనుకూలిస్తుంది. ప్రగతి మీదే మనం దృష్టి నిలపగలిగినపుడు, మనం ఎదుర్కొనే కష్టాలు అర్థం లేని విషాదాలుగా కనిపించడానికి బదులు, మనల్ని మనం పరీక్షించుకుందుకు, జీవిత లక్ష్యమైన ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని సాధించడానికీ, మనం సాధించిన ప్రగతిని అంచనా వేసుకుందుకూ ఉపయోగపడే అవకాశాలుగా మారుతాయి.

“ఒక్కొక్క కష్టమూ ఎదురైనప్పుడు మనకి మనం ఏమని చెప్పుకోవాలి?
‘నేను దీని కోసమే సాధన చేస్తున్నాను. దీనికోసమే శిక్షణ తీసుకుంటున్నాను.'”

– ఎపిక్టెటస్

“సానపెట్టకుండా ఏ రత్నానికీ మెరుగు రాదు.
విపత్తులు ఎదుర్కోకుండా ఏ మనిషీ పరిపూర్ణుడు కాలేడు.”

– సెనెకా

“భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవలసిన సూత్రం ఒకటి ఉంది.
ఏ సంఘటనైనా జరిగి, విచారగ్రస్తులమై ‘ఎంత పెద్ద కష్టం వచ్చిందో’ అని అనుకోడానికి బదులు,
‘ఇంత పెద్ద కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగడం నా అదృష్టం’ అనుకోవాలి.

– మార్కస్ ఆరీలియస్

స్థితప్రజ్ఞతావాదులు ఈనాటి ప్రపంచాన్ని కలలోకూడా ఊహించి ఉండరు. అయినప్పటికీ, రెండువేల సంవత్సరాల క్రిందట ప్రవచించిన వారి తత్త్వచింతన, ఆకర్షణల/ వికల్పాలకి నెలవైన ఈ యుగంలో, అప్పటికంటే ఇప్పుడు ప్రాసంగికత కలిగి ఉంది. అతిగా ప్రేరణలకు గురవుతున్న మన మనసులు, కోరికలతో, ఆందోళనలతో, ఆగ్రహంతో మన లక్ష్యాలనుండి దారి తప్పేలా చేసి, మన జీవితాలని కేవలం అసంకల్పిత ప్రతీకారచర్య స్థాయికి దిగజారుస్తున్నాయి. స్థితప్రజ్ఞత, మనం జీవితాలపై కోల్పోయిన కర్తృత్వాన్ని పునరుద్ధరించి, వికల్పాలని వడగట్టి, మనకి అవసరమైన వాటిమీద దృష్టి పెట్టగలిగేలా సహకరిస్తుంది. మనని మననుండి దూరం చేసి, ప్రక్కదారులు పట్టిస్తున్న ప్రపంచంలో, మనం ఎవరమో తెలుసుకుని, మనం ఏది కాదలుచుకున్నామో అటువైపు నడిపిస్తుంది. అందుకనే నేను స్థితప్రజ్ఞతావాదిని అయ్యాను; మీరు కూడా కావాలని కోరుకుంటున్నాను.

[మూలం : గుర్విందర్]