మునిమాపు వేళకు

మలుపులన్నీ తిరిగి తిరిగి
మన కథ కంచికెళ్ళిపోతుంది

నా నుంచి నీ వైపుకు వెళ్ళే దారి
ఒకే ఒక ఉత్తరం ముక్కకీ
ఓ సంక్షిప్త వాక్యానికీ మాత్రం తావుంచి
పూర్తిగా మూసివేయబడుతుంది

ఆఖరుగా నీతో ఏమన్నానో గుర్తురాదు
ప్రాణం కొట్టుకుంటుంది
దుఃఖం ముంచుకొస్తుంది
మీద పడ్డ వయసు మీదా
కోల్పోయిన జ్ఞాపకశక్తి మీదా
కోపమొస్తుంది!

నా చీకటి గది తలుపులన్నీ
తెరచినా కూడా ఊపిరాడదు
గుండెలో మాట్లాడుతున్న
గొంతొకటి కంటికి కనబడదు

ప్రపంచం నన్ను
ఏదైనా కోరుకోమన్నప్పుడు
నీకివ్వడానికి మొహమాటపడ్డ
నా మొదటి కవితను వెదికి
చేతిలో పట్టుకుంటాను

నీ ఆగమనమొక్కటే మిగులుతుంది
ఈ జీవన కావ్యానికి ఆ చేత్తో
వైభవ తిలకం దిద్దుకొనేందుకు!