ముక్కుపై కోపాలు
ఎక్కువ మనిద్దరికి
అక్కసుల వాదాల
చిక్కితిమి ఆనాడు
వానలో రాత్రిలో
వద్దన్న వినక ను-
వ్విక నన్ను జూడనని
చకచకా వెళ్ళేవు
ఉత్తరము వచ్చునని
తత్తరముతో తరచు
నే జూడ ప్రతి రోజు
నీ జాబు కనబడదు
తుదకు వచ్చినది నే-
డిది స్వర్ణ దినమేమొ
నేడొక్క ఈ-మెయిలు
నాపేర పంపావు
నేనెన్ని మారులో
ఆ నాల్గు పంక్తులను
చదివేను కన్నీళ్ళ
తడబడెడు హృదయాన
మరచి పోదామన్న
మరువలే నే నెపుడు
మరల నను జూతువో
గరళమును ఇత్తువో
మరచి పోదామన్న
మరువలే నిన్నెపుడు
మరల నిను జూచెదను
మరల అమృతము నిత్తు
చాలు నా కీ వార్త
పాలు త్రాగెను మనసు
నను జూడకుండినను
నీ కుశలమే చాలు
పున్నెముల ఫలములా
పున్నముల వెలుగులా
పూల నెత్తావిలా
పొంగించ రావేల
హారములు నా కేలు
హారతులు నా మేను
పీయూష మీ మోవి
పొంద రా అంద రా
ప్రియముగా పాడుతా
ప్రీతితో ఆడుతా
ప్రేమతో నింపుతా
మరలి రా తరలి రా
జరిగినది పీడకల
జరుగు నిక మంచి యిల
కోపాలు ఈ విరహ
తాపాలు వద్దింక
ఈ-మెయిలు చూచి యిక
ఆలసించక రమ్ము
నిదుర పోవక నేను
ఎదురుచూతును నిన్ను
మరచి పోదామన్న
మరువలే నిన్నెపుడు
మరల నిను జూచెదను
మరలి రా తరలి రా